April 26, 2024

తెలుగు పలుకలేక మౌనయోగి నైతిని!

రచన: వేణుగోపాల్ యెల్లేపెద్ది

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవమని తెలిసి నిన్నరాత్రి నిద్రకు ఉపక్రమించే ముందే ఒక చిన్న సంకల్పము చేసితిని!
పొద్దున్న లేచినది మొదలు, కార్యాలయమునకు వెళ్లు వరకూ ఒక్క ఆంగ్ల పదమూ నా నోటి వెంట రాకూడదు!
(కార్యాలయమునకు పోయినాక ఎటూ తప్పదు)
ఒక వేళ అటుల పలుకలేకుంటే మౌనముగా ఉందామని నిర్ణయించుకున్నా!
క్లుప్తముగా అదీ నా సంకల్పము!
మరి తెలవారకుండా ఉంటుందా! అయ్యింది ఇక వినండి నా పాట్లు!
రాత్రి గడియారములో పొద్దున్నే లేద్దామని alarm పెట్టుట వరకే నా వంతు. పొద్దున్న అది మ్రోగుతూనే ఉంటుంది ఒక్క కసురు కసిరితే లేచి దానిని ఆపి తాను లేచి దినచర్యలు మొదలు పెట్టుకోవటము శ్రీమతి వంతు!
యధావిధిగా అది మ్రోగినది!
ALARM ఆపవే!! అన్న అరుపు నోటి దాకా వచ్చినంతపని అయినప్పటికీ నా సంకల్పము గుర్తొచ్చి తమాయించుకుని నేనే లేచి బుద్ధిగా దానిని ఆపి దేవుడా నా సంకల్పము నెరవేర్చు అని ప్రార్ధించుకుని మంచము దిగా!
ఇది చూసి నా శ్రీమతికి తొలిఝామునే ఆశ్చర్యము!
ఇక దంతధావనముకు పోతే అక్కడ tooth paste అయిపోయింది!
మళ్లా అరుపు నోటి దాకా వచ్చింది ఏమేవ్ tooth paste ఎక్కడ ?? .
మళ్లా నాకు నేనే సర్ది చెప్పుకుని నిశ్శబ్దముగా అలమారలోని సరుకుల పెట్టెలో tooth paste ఎక్కడుందో నిదానముగా వెతుక్కుని ప్రశాంతముగా పని ముగించుకుని వచ్చా!
ఇది చూసిన మా శ్రీమతికి రెండవ ఆశ్చర్యము!
(కొంచము తేడాగానే నా ప్రవర్తన ఉన్నప్పటికీ తాను coffee పెట్టి తేవటానికి వెళ్లినది)
ఇక నాకు పనేమిటి పెద్ద పండితుడిలాగా English News Paper తిరగేయటమే!
ఎప్పటిలానే paper చేతిలోకి తీసుకున్నాను! ఒక్క సారి పిడుగు పడినంత అలజడి!
అమ్మో ఈ paper చదివితే ఇక నాకు ఆ వచ్చే రెండు తెలుగు మాటలు కూడా రావని!
పక్కన పడేసి మౌనముగా coffee కోసము ఎదురు చూస్తూ
కళ్లు మూసుకుని శ్రీ రామా శ్రీ రామా అనుకుంటూ కూర్చున్నా!
ఏమండీ కాఫీ! అన్నది భుజము మీద చేయి వేసి!
నేను కళ్లు తెరిచి ఏమనాలో తెలియక!
శ్రీ రామ! శుభోదయం అన్నా!!
(Coffee పట్టుకు వచ్చే లోపే చిందులు తొక్కే నన్ను అలా ధ్యానము లో చూసి మా ఆవిడకు అది మూడో వింత)
మామూలుగా అయితే నేను ప్రశాంతముగా coffee తాగుతూ మా శ్రీమతిని ప్రశాంతముగా ఎదురకుండా coffee త్రాగనీయకుండా ఈ రోజు breakfast ఏంటి geyser వేసావా office ki late చెయ్యకు ఈ రోజు
ఇలా ఎన్నో ప్రశ్నల వర్షము కురిపిస్తా!
నాలోని ఆ husband గాడే ఎప్పటిలా పైకి వచ్చాడు కానీ అవన్నీ అడగటానికి నాకు సరైన తెలుగు మాటలు పైకి రాలేదు!
ఇక ఏమి చెయ్యను మూసుకుని నా పనులు నేనే చేసుకుందామని నిశ్చలముగా పనులు మొదలుపెట్టాను!

నెమ్మదిగా నేనే geyser వేసుకున్నా నా తుండుగుడ్డ నేనే తీసుకున్నా నెమ్మదిగా తయారయ్యి వచ్చి hallలో కూర్చున్నా!
(ఈ విధముగా కార్యాలయమునకు తయారవుట మా శ్రీమతి మా పెళ్లి నాటి నుంచీ ఒక్కరోజూ చూడలేదు!
(ఇది ఆమెకు నేను చూపించిన నాలుగో వింత)
ఒక ప్రక్క ఈ వింతలన్నీ గమనిస్తూనే ఏమోలే అనుకున్నదో ఏమో ఏమీ అడగకుండా నెమ్మదిగా అల్పాహారము తెచ్చి చేతికి అందించింది!
మామూలుగా అయితే నా దిన చర్య ఆ అల్పాహరము తింటూ చరవాణిని చేతపట్టుకుని అవసరమున్నవీ లేనివీ సందేశములు చూస్తూ అందరినీ నేటి కార్యాలయములోని పనులు అడుగుతూ ముందుగానే తాపత్రయపడిపోతూ ఉంటాను!
ఎప్పటిలాగానే నా చెయ్యి చరవాణిపైకి పోయినది! అమ్మో వద్దులే అని ఊరుకున్నా!
నేను వద్దనుకున్నా అవతలి వారు ఊరుకుంటారా ? ఫోన్లు వస్తూనే ఉన్నాయి! ఇప్పుడు నేను ఏమి స్పందించి ఆంగ్లములో ఏమి పేలుతానో అని భయపడి చరవాణిని దూరముగా ఉంచి ప్రశాంతముగా అల్పాహారము తిన్నా!
జీడిపప్పులు వేసిన ఉప్మా! ఎంతో బాగుంది అనిపించింది!
ఉండబట్టలేక!” భలే ఉందోయ్ ఇంకాస్త ఉంటే పెట్టు “అన్నా!
అంతే మా శ్రీమతి ఆశ్చర్యమంతా ఆమె ముఖముపైనే ఉన్నదా అన్నట్లు ముఖకవళిక పెట్టినది!
(ఇది ఆమెకు ఉదయాన్నే ఐదవ వింత)
నిజమే బొబ్బట్లు చేసి ఇచ్చినా నోట్లో కుక్కుకుని చరవాణిలో మాట్లాడుకుంటూ వెళ్లిపోవటమే గాని బాగుంది అన్న చిన్న మాట కూడా పెగలదు మననోట్లోంచి!
అటువంటిది ఉప్మాకే మురిసిపోయి కితాబు ఇచ్చాను కదా! అదీ ఆమె ఆశ్చర్యము!
ఇక మా driver సెల్వం గాడు వస్తే కారులో కూర్చుని కార్యాలయానికి తుర్రుమని హమ్మయ్య నా నోము ఫలించినది అని ఊపిరి తీసుకోవటమొక్కటే తరువాయి !
సెల్వంకు తమిళమూ అంట్ల మంగలపు ఆంగ్ల ముక్కలు తప్ప రావు!
రోజు వాడు వచ్చేలోపే వాడి భాషలోనే ( butler english ) లో పది సార్లు call చేస్తా! Where man ? Come soon man? అంటూ సతాయించేస్తాను!
ఇప్పుడు వాడిని అదిరించే వీలు కూడా లేకపోయింది!
ఏమి చెయ్యను ప్రశాంతముగా వాడు వచ్చే వరకూ నిర్మలముగా కూర్చున్నా!!
(అలా నిశ్చలుముగా ఉన్న నన్ను చూచుట శ్రీమతికి ఆరవ వింత)
ఏమో ఎందుకులే అడగటము అనుకుందో ఏమో ఏమీ మాట్లాడకుండా నన్నే అదేదో విధమైన సంతోషపు చిరునవ్వుతో చూస్తూ ఉంది)
నాకైతే నిముషమొక్క యుగముగా ఉన్నది!
ఇంతలోనే సెల్వంగాడు వచ్చి నా office bag తీసుకుని వాంగ సార్! అన్నాడు!
నాకు వచ్చిన తమిళం ముక్క అదొక్కటే అని వాడి నమ్మకము!
హమ్మయ్య సమయము అయిపోయింది.
I DID IT I HAVE WON TODAY!! అని అరుస్తూ పిచ్చి గెంతులెయ్యాలనిపించి మళ్లా తమాయించుకున్నా!
నా వైనాన్ని పొద్దుటి నుంచీ చూస్తున్నా ఏమీ అనని నా శ్రీమతికి ధన్యవాదములు చెపుదామనిపించింది!
Bye అని చెప్పకుండా! ఏమోయ్ వెళ్లొస్తానే అన్నా!!
(అంతే ఇది ఏడవ వింత ఆమెకు)
పాపము ఎన్నని భరిస్తుంది ? ఇక తట్టుకోలేకపోయింది!
ఏమండి! మీరు బాగానే ఉన్నారా అంది!
నాకు ఆ ప్రశ్న బహు వింతగా అయిందిప్పుడు ?
ఊ బాగానే ఉన్నా! ఏమి ఎందుకలా అడుగుతున్నావు ?అన్నా ??
ఏమీ లేదండి మీరు రోజూ ఇలానే ఉండొచ్చుకదా చక్కగా అని నా చేయి పట్టుకుని చిన్న ముద్దిచ్చింది!
(పొద్దుటినుంచీ శ్రీమతికి వింతల మీద వింతలు చూపించిన నాకు ఇంత పెద్ద వింత ఒక్కసారిగా చూపించింది శ్రీమతి)
మూడుగంటల వ్యవధిలో తెలుగు నిర్మలంగా ఉండటము ఎలాగో నాకే తెలియకుండా నేర్పినది!
శ్రీమతి ప్రేమ ఎంతటిదో చూపినది! సమయపాలన నేర్పినది!సంయమనము నేర్పినది!
ఇప్పుడు అనిపిస్తున్నది ఆ తెలుగు తల్లి సేవచేసుకుంటే నా జీవితము చక్కబడినట్లే!!!
తెలుగు పై హఠాత్తుగా ఆసక్తి పెంచుకున్న ఒక భర్త కథ!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *