March 19, 2024

*సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం*

రచన: రమా శాండిల్య

బెంగుళూర్ నుంచి ఒక్కరోజులో వెళ్ళి, తిరిగి రాగలిగిన అద్భుతమైన వినోద, విజ్ఞాన, ఆధ్యాత్మిక, చారిత్రక యాత్ర, ఈ సారి నేను వ్రాస్తున్న ఈ యాత్రాదర్శిని.

బెంగుళూర్ మా ఇంటినుంచి, ఉదయం ఆరుగంటలకు బయలుదేరి, సాయంత్రం ఏడుగంటలకు ఇంటికొచ్చేసాము.


ఈ ట్రిప్పులో, మేము చూసిన స్థలాలు, సోమనాథ్ పురాలోని, శ్రీ కేశవస్వామి ఆలయం. ఈ మధ్యలో ఏ ఆలయానికి ఇంత ‘థ్రిల్’ అయి చూసిన అనుభవమే లేదు. అంత అద్భుతమైన ఆలయం.
రెండవది, ఒక కిలోమీటర్ దూరం నడచిన తరువాత వచ్చే, పంట చేలలో ఉన్న శివాలయం, కావేరీ నది చూసి, అక్కడే ఉన్న కావేరీ క్రాఫ్ట్ ఎంపోరియంలో చందనం, ఎర్ర చందనంతో చేసిన అనేక వస్తువులను చూసి వచ్చాము.

***

కేశవ స్వామి ఆలయం:
ప్రతి అంగుళం వివరంగా చూడవలసిన ఆలయమిది. ఆ శిల్పకళా సౌందర్యం మాటలలో చెప్పలేని అనుభూతిని మిగిల్చినది.
అంగుళ ప్రమాణంలో ఉన్న విగ్రహమూర్తులనుంచీ నిలువెత్తు కేశవ, మాధవ, మధుసూదనుడి విగ్రహమూర్తులను సందర్శించి, ఆ గర్భగుడి సౌందర్యానికి ముగ్ధురాలనైపోయానని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఆ ఆనందంలో, ‘మాధవా, కేశవా, మధుసూదనా!’ అని వచ్చీరాని పాట – గొంతు బావుండదు, స్వరం నిలువదు, అయినా పాడుకున్నాను. అంత తన్మయత్వంతో చూసిన ఆలయం ఈ మధ్య కాలంలో ఇదేనేమో! ఈ ఆలయం చూస్తున్నంతసేపు అన్నమాచార్య కీర్తన, ‘మాధవా, కేశవా, మధుసూదనా!’ అని మనసు పాడుతూనే ఉంది.
ఇంతగా, ఈ ఆలయం గురించి చెబుతున్నానని, పూజలూ అవీ ఆలోచిస్తున్నారేమో! అలాంటివేమీ లేని శిథిలాలయం ఇది. మైసూర్ మహారాజుల పరిపాలనలో అత్యంత శక్తివంతమైన, అన్ని కళలతో, ఆరాధనలతో, వార్షిక సేవలతో అత్యంత శ్రద్ధతో విలువ కట్టలేని ఆభరణాలతో, అష్టైశ్వర్యాలతో సేవలనందుకున్న కేశవయ్య, ఈ రోజు గర్భాలయంలో చేతి వేళ్ళు విరిగిపోయి, ఆయన చేతిలోని మురళిని కూడా విరగొట్టి పెట్టిన శిథిలాలయం మాత్రమే అక్కడ వుంది. ఏ విగ్రహం కూడా, ఆలయంలో ప్రతిష్టకుగాని, పూజకు గాని అర్హతలేకుండా ఉన్నాయి. అయినా ఆ శిల్పసౌందర్యమో, పూర్వం జరిగిన వైభవాన్ని గుర్తుచేసుకుంటూ చూడటమో తెలియదు గాని ఆ ఆలయం నుంచి బయటకు రావాలనిపించటమే లేదు.
ఆ శిల్పాలలో లేని గ్రంథమే లేదు. రామాయణము, మహాభారతము, భాగవతంలో వచ్చే విష్ణుస్వరూపాలన్నీ అక్కడ మూర్తులలో ఉన్నాయి. ఆ మూర్తులను చూస్తుంటే, ఒకప్పుటి ఈ ఆలయ శోభ ఊహించుకుంటే, ఒడలు పులకరించి పోయింది. మహారాజు ఏనుగు నెక్కి, తన పరివారంతో స్వామిని దర్శించిన కథనం, వెనువెంటనే టిప్పుసుల్తాన్ ఆ ఆలయాన్ని భ్రష్టు పట్టించిన విధానకథనం పరస్పర విరుద్ధ భావాలను కలుగ చేసిందనటంలో ఆశ్చర్యం లేదుకదా!
కురుక్షేత్ర సంగ్రామమంతా, ఆలయం చుట్టూ ఒక లైన్లో మూడంగుళాల ఏనుగు బొమ్మల మీద ఎంత వివరంగా చెక్కారో, చూసి తీరవలసినదే! అలా ఆరు లైన్ లలో, నెమళ్ళూ, జింకలు, హంసలు ఏనుగు అంబారిమీద సైనికులను వివరంగా చెక్కిన ఆ శిల్పుల శిల్పకళా చాతుర్యానికి అచ్చెరువు పొందానంతే!!

ఈ ఆలయంలోకి ప్రవేశించగానే వేయి స్తంభాల మంటపం నాలుగు ప్రక్కల ఉంటుంది. ఒకో మంటపంలో పదేసి విగ్రహమూర్తులే లేని గర్భాలయాలు వెలవెలబోతూ ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఆ గర్భగుడిలో ఏ మూర్తి ఉండేదో తెలియచేసే మూర్తి ద్వారం పైన చెవో, ముక్కో, చెయ్యో, కాలో లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రతీ ఆలయం దగ్గరా కనులు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి.
ఆలయం ప్రతీ అణువూ శిల్ప కళా సౌందర్యమే! గర్భగుడిలో అయితే ఆకాశ మంటపాల శిల్పాలను ఏకశిలా తోరణాలతో, మూర్తులపైన ఉన్న చోట పద్మతోరణాలతో అద్భుతంగా ఉంది.
ఈ ఆలయం యొక్క చరిత్ర గూగుల్ లో పుష్కలంగా దొరుకుతున్నది. గూగుల్ సెర్చ్ కోసం, ‘సోమనాథ్ పురా’ అని చదవండి తప్పకుండా!
ఈ ఆలయంలో బాడ్ ఎక్సపీరియన్స్ ఏమిటంటే, మొదట దేవాలయానికి వెళ్ళగానే, టిక్కెట్ కోసం కౌంటర్ లేదు, ఒక బోర్డ్ మీద ఆ ఆలయ వెబ్ సైట్ గురించిన వివరాలిస్తారు. అవి ఓపెన్ కావు. అరగంట సమయం వేస్ట్ అయ్యాక సెక్యూరిటీ గార్డ్ కూడా మాతోపాటు కష్టపడితే, ఎలాగో ఒకలాగా ఆ, ’20’ రూపాయల టిక్కెట్ తీసుకుని లోపలికెళ్లాము. లోపలికి వెళ్లబోయేముందు ఆలయ ఆవరణలో ఉన్న లాన్, పెద్దపెద్ద వృక్షాలు, నల్లని మబ్బు పట్టిన ఆకాశము ఆ ఆలయ దర్శనానికి మరింత వన్నె తీసుకు వచ్చాయనిపించింది. బెంగుళూరులో ఉన్నవారే కాకుండా అందరూ చూడవలసిన యాత్రాస్థలమిది.

****

యాత్ర ఉత్తరార్థంలో సంగమ దర్శనం:

మూడు నదుల సంగమం. సోమనాథ్ పురానుంచి కొంచెం లోపలికి అంటే, ముప్పైరెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
సోమనాథ్ పురా నుంచి ఒక గంటలోపే ప్రయాణం. ఒక నది ప్రవహిస్తేనే పరిసరాలను సస్యశ్యామలపరుస్తుంది, నదీమ తల్లి. అలాంటిది, మూడు నదులు కలిసే ఈ చోటు అద్భుతమనే చెప్పాలి. ఈ గంటసేపు డ్రైవ్ లో నేననుభవించిన ఆ శాంతీ, ప్రశాంతి చెప్పనలవి కాదు. దారంతా పచ్చని కొండలూ, కురవటానికి సిద్ధంగా ఉన్న నల్లమబ్బులు, బారులు బారులుగా ఎగురుతున్న కొంగలు, అప్పుడప్పుడు చేల మధ్యలో కనపడుతున్న, విరిసిన తామరలతో నిండి ఉన్న చెరువులు, రకరకాల పంటలు, ముఖ్యంగా చెరుకు, కొబ్బరి, మొక్కజొన్న, జొన్న, వరి పంటలతో నేలంతా ఆకుపచ్చని కంబళి పరచినట్లు, కళ్ళ పండుగగా ఉంది.
ఆ దారిలో అరగంట ప్రయాణించి కొండల మధ్యనుంచి సరిగమలు పాడుతూ ఉరకలు వేస్తూ వస్తున్న కావేరీ నదిని, ఇంకొక ప్రక్కనుంచి లోకపావని (కబిని) నెమ్మదిగా కదిలితే శబ్దం వస్తుందేమో అనేట్లు వసున్న కబినీ నదిని తనలో కలుపుకుంటూ స్నేహితురాలి చేయి పట్టుకుని హేమావతి, మరొక స్నేహితురాలు కావేరితో కలిసి, ముగ్గురూ కలిసికట్టుగా ఒప్పులగుప్ప అంటూ అడుతున్నట్లు వయ్యారంగా మూడు నదులు కలిసిపోయి ప్రవహిస్తూ, చేసే ఆ సందడంతా ముగ్గురు ఆడపిల్లలు కలిసి గలగలలాడుతూ అల్లరి చేస్తున్నట్లే ఉంది.
ఒకప్రక్క సంగం విధులు నిర్వహిస్తున్నవారు, ఇంకొక ప్రక్క సంగమస్నానాలు చేసేవారితోను, మరొక ప్రక్క శ్రాద్ధ కర్మలు చేసేవారి తోనూ సందడిగా ఉంది. చేపల కోసం బాతులు వేట, కొంగలు చేసే విన్యాసాలూ చూస్తూ ఎంతసేపైనా గడిపెయ్యవచ్చు!!
*****
అక్కడనుంచి ఒక గంట ప్రయాణం చేసాము. మన కొండపల్లి లాగానే, ఇక్కడ, ‘చెన్నపట్నం’ బొమ్మలకు ప్రసిద్ధి చెందినది. ఆ బొమ్మలు బయటనుంచే చూసుకుంటూ వచ్చేసాము. కర్ణాటక సిల్క్ సిటీగా పేరు గాంచిన, ‘రామనగరం’ లోని హనుమంతుడి గుడికి బయటనుంచే దణ్ణం పెట్టుకుని వచ్చేసాము. సిల్క్ ఫ్యాక్టరీస్ బోలెడున్నాయని, అవి మళ్ళీసారి వచ్చినప్పుడు సిల్క్ బట్టలు చూసిరావాలని నిర్ణయించుకున్నాము.
ఉదయం మేము ఉపాహారం తిన్న, ‘లోకారుచి’ వచ్చింది. దానిలో భోజనానికి 20 నిమిషాలు లైన్ లో నిలుచున్నాము. హోటల్ వారు, మా వంతు వచ్చినప్పుడు పిలిచి, “అన్నీ అయిపోయాయి. ఓన్లీ నార్త్ కర్ణాటక భోజనం ఉంది” అనిచెప్పారు. ఈ హోటల్ లో పూర్తి శాకాహార భోజనం మాత్రమే ఉంటుంది.
ఆ భోజనంలోని అన్నిరకాలు, ఎప్పుడూ తిననివే ఎన్నో రకాలన్నీ వడ్డించారు. అవి, జొన్నరొట్టెలు, కర్ణాటకలో తప్పని సరిగా తినాల్సిన ఐటమ్ ఈ జొన్నరొట్టెలు. చాలా మెత్తగా బావుంటాయి. సెనగపప్పుతో కోసాంబరి అనే వంటకం, గుత్తివంకాయ కొబ్బరిపాల మసాలాతో కూర, సెనగపిండితో గుజరాతీ వంటకం ధోక్లాలాంటిదే కానీ కొంచెం తేడాగా ఉంది, అది ఒకటి చాలా బావుంది. పచ్చి బీన్స్ గింజలతో కొబ్బరి చల్లి చేసిన కూర, పచ్చి చెమ్మకాయలతో కూరా, మజ్జిగ పులుసు, సాంబారు, రసం, పెరుగు, అరటిపండుతో సహా అన్నీ తిని భుక్తాయాసంతో, ప్రక్కనే ఉన్న, మన శిల్పారామం వంటిదే, ‘జానపద’ అని చోటకి వెళ్ళాము.

కర్ణాటక రాష్ట్రములోని, కొండలు, అడవులు, గ్రామాల్లో, కూర్గ్ వారి జీవన విధానంలోని 17వ సెంచరీ నుంచి, ఇప్పటి వరకూ పరిణామక్రమంలో వారు వాడిన వస్తువులు, బట్టలు, పండుగలు, గ్రామదేవతల సంబరాలు, కళలు, చేతిపనులు, అల్లికలు, నగలు, తోలుబొమ్మలాట, యక్షగానం అన్ని రకాల ప్రదర్శనలతో అద్భుతంగా ఉంది. అలిసిన మేము సగం వరకూ చూసి ఇంటిముఖం పట్టాము.
కర్ణాటకలో చూడ తగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. అందులో ఒకటి చూశానన్న సంతోషంతో రాత్రి ఏడింటికి ఇంటికి చేరుకున్నాను.
లోకాస్సమస్తా సుఖినో భవంతు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *