May 9, 2024

చర్య – ప్రతిచర్య

రచన: రాజ్యలక్ష్మి బి

రఘురాం ఒక చిన్న కంపెనీలో చిరుద్యోగి. ఐదేళ్ల కొడుకు, ఒద్దికగా గుట్టుగా సంసారం నడిపే భార్య, చిన్న అద్దిల్లు. బస్ స్టాప్ వీధి ఒక చివర వుంటే, యిల్లు వీధి మరో చివర వుంటుంది. రోజూ పదినిమిషాల ముందు బస్ స్టాప్ చేరుతాడు. ఆ వీధి పెద్దగా సందడి వుండదు. ఒక్కోసారి బస్సు వేగంగా వచ్చి ఒక నిమిషం ఆగి వేగంగా వెళ్లిపోతుంది. అందుకే రఘు ముందుగా చేరి బస్సు కోసం క్యూలో వుంటాడు.
ఆ రోజు పదవుతున్నా బస్సు రాలేదు. జనాలు పెరుగుతున్నారు. అందరిలో కంగారు మొదలయ్యింది. రఘు విసుగ్గా చేసేదేమిలేక పరిసరాలు చూస్తున్నాడు. అవతల ఫుట్ పాత్ పైన ఒక అవిటి బిచ్చగాడు దీనంగా అరుస్తూ అడుక్కోవడం చూసాడు. ఒక కాలు తొడలదాకా లేదు, నిక్కరు వేళ్ళాడుతున్నది. యింకో కాలు బారుగా చాచి చింకి చాప మీద కూర్చున్నాడు. చిల్లులు పడ్డ సత్తు కంచం చూపుతూ అరుస్తూ అడుక్కుం టున్నాడు. రఘురాం యెప్పుడూ అంత పరిశీలనగా చూడలేదు.
ఆలా వాణ్ణి చూస్తుంటే చిన్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. ఐదో క్లాసులో పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని నాన్నగారు గట్టిగా చీవాట్లేసారు, అప్పుడు రఘు యేడుస్తూ రోషంగా వీధి గుమ్మం అరుగు మీద కూర్చు న్నాడు. రోజూ అక్కడ పడుకునే వూరకుక్కను చూడగానే యెందుకో రఘుకు తిక్క రేగి పెద్దరాయి దాని కాలు మీద విసిరాడు. అది అరుచుకుంటూ నెప్పితో కుంటుతూ రక్తం కార్చుకుంటూ వెళ్లింది. రఘు ప్రతీకారం తీర్చుకున్న వీరుడిలాగా లోపలికి వెళ్లాడు. రెండురోజుల తర్వాత ఆ కుక్కకు అమ్మ కంచంలో పెరుగన్నం పెడ్తే తింటూ అరుగు మీద కనిపించింది. రక్తం గడ్డ కట్టి కాలు దగ్గర పుండు యెఱ్ఱగా వుంది. “చూడరా రఘు, తుంటరి వెధవెవరో కాలు రాయితో కొట్టినట్టున్నాడు, పాపం” అంటూ అమ్మ కుక్కను జాలిగా చూసింది.
“అవునమ్మా” అంటూ రఘు అమాయకంగా ముఖం పెట్టాడు. అమ్మకు తెలియకుండా కుక్క కాలి పుండు పైన కొబ్బరినూనెలో ముంచిన దూది పెడదామని ప్రయత్నించాడు కానీ ఆ కుక్క రఘును కోపంగా చూస్తూ దగ్గరికి రానియ్యకుండా అక్కడినించి బాధగా అరుస్తూ వెళ్లిపోయింది.
రఘుకు ఆ సంఘటన గుర్తుకొచ్చి ఆ బిచ్చగాడి కాలు కూడా యెవరైనా విరగ్గొట్టారేమో అనుకున్నాడు. వాడి ఆకలి అరుపులు వింటుంటే తట్టు కోలేకపోతున్నాడు. రఘుకు యెవరికీ ధర్మం చేసే అలవాటు లేదు. తన జీతం అంతా భార్య చేతికిచ్చి తన అవసరాలకు నెలకు సరిపడా మళ్లీ భార్య దగ్గర్నించీ తీసుకుంటాడు, కొద్దిగా అదనంగా అయిదువందలు ఖర్చు చేసుకోకుండా అదనంగా వుంచుకుంటాడు. స్నేహితులందరూ రఘు అలా భార్యకు జీతం యిచ్చి మళ్లీ తీసుకోవడం వేళాకోళం చేస్తారు. పిచ్చివాళ్ళు ! అలా భార్యకు యివ్వడం వల్ల భార్యామణి చీరె, నగా, సరదాల వేధింపులు వుండవని అనవసర చిరాకులుండవని వాళ్లకేం తెలుసు ! అందుకే వాళ్లను చూసి వెర్రినవ్వు నవ్వుతాడు.
ఈ ఆ అవిటివాడికి యెంతో కొంత ధర్మం చెయ్యాలనిపిస్తున్నది. వాణ్ణి చూస్తుంటే చిన్నప్పుడు తను కొట్టిన రాయి దెబ్బకు బాధపడ్డ కుక్క గుర్తుకొస్తున్నది. గబగబా అవతల ఫుట్ పాత్ వైపు వెళ్లి వాడి సత్తు బొచ్చెలో పదిరూపాయలు వేసాడు. వాడు కన్నీళ్లతో దణ్ణం పెట్టాడు. రఘురాం గుండె చెరువయ్యింది. ప్రతి రోజూ యెంతో కొంత వాడికి ధర్మం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తనకు అదనంగా వున్న ఐదువందలున్నాయిగా !
రఘురాం కంపెనీలో ప్రతిసంవత్సరం ఆఖర్లో ఒక నెల జీతం బోనస్ గా యిస్తారు. రఘు ఆ బోనస్ డబ్బు యెక్కడికయినా టూర్ కి వాడుకుంటాడు. భార్య పాపా తనూ సరదాగా వారం రోజులు గడిపేస్తారు. బోనస్ డబ్బులు తీసుకున్నాక బిచ్చగాడికి కనీసం ఒక అయిదు వందలు ధర్మం చేద్దామనుకున్నాడు. మర్నాడు బస్సు స్టాప్ కు తొందరగా బయల్దేరాడు.
వంద రూపాయలకు అయిదు కొన్ని అరటి పళ్లు పట్టుకుని ఆ బిచ్చవాడి కోసం చూసాడు. వాడు చుట్టుప్రక్కల యెక్కడా కనిపించలేదు. రఘురాం నిరాశ చెందాడు. ఎంతో తపనతో ఉత్సాహంతో ధర్మం చేద్దామని వస్తే వాడు కనిపించకపోతే దిగులయ్యింది. ఒక వారం రోజులు ఆ అవిటివాడు అసలు కనిపించలేదు.
సుమారు పదిరోజుల తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు రఘురాం. కారణం వాకింగ్ చేస్తున్నప్పుడు లారీ వేగంగా వచ్చి అతన్ని వెనకినించి కొట్టేసింది. బలమైన దెబ్బలు తగిలాయి కుడి కాలు తెగింది. తన పరిస్థితి తల్చుకుని కుమిలిపోతున్నాడు. కళ్లముందు చిన్నప్పుడు రాయి దెబ్బకు బాధపడ్డ కుక్క కనిపించింది ఆశ్చర్యం ! బస్సు స్టాప్ దగ్గరుండే అవిటి బిచ్చగాడు కర్ర సాయంతో కుంటుకుంటూ తలుపు దగ్గర్నించి లోపలికి వస్తున్నాడు. మనిషి మరీ యెండిపోయాడు. రఘురాం దగ్గరగా వచ్చి పిప్పిపళ్లతో నవ్వుతూ దణ్ణం పెట్టాడు. ఎందుకో వాడి నవ్వు రఘుకు కుక్క తనని చూసిన చూపు గుర్తుకు తెచ్చింది. అంతే రఘుకు తిక్క రేగింది. బిచ్చగాడి చేతి కర్ర లాగేసి ఏం తెలియనట్టుగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. పాపం అవిటివాడు దభేలున పడి యేడుస్తున్నాడు. అందరూ అతన్ని లేపి కూర్చోపెట్టారు. వాడు రఘును అసహ్యంగా చూసాడు కానీ ఏం చెయ్యగలడు ?
రాత్రి నిద్రపట్టక బాధతో అరుపులు మొదలు పెట్టాడు రఘు. కాలు దగ్గర విపరీతం నొప్పి రక్తం కారుతున్నది. డాక్టర్ వచ్చారు “కుట్లు వుడాయి మళ్లీ ఆపరేషన్ చెయ్యాలి” అని రఘు భార్యతో చెప్పాడు. రఘు తనకు దేవుడు వేసిన శిక్షగా భావించాడు. కర్మ ఫలితం ఎంతవారైనా అనుభవిం చక తప్పదు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *