March 29, 2023

సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది

రచన: నండూరి సుందరీ నాగమణి

చిత్రం:స్వర్ణకమలం

 

సుందరము – సుమధురము

  • నండూరి సుందరీ నాగమణి

 

సుందరము సుమధురము ఈ గీతం:

స్వర్ణ కమలం’ చిత్రంలోని ‘అందెల రవమిది’ గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.

భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1988లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి  శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. యస్. రామారావుగారి సమర్పణలో శ్రీ సి.హెచ్. అప్పారావుగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. నటి భానుప్రియలోని అసలైన నటీమణిని, నాట్యకళాకారిణిని ప్రపంచానికి పరిచయం చేసి, ఆమెకు ఎంతో పేరును తెచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు కళాభిమానులంతా తప్పక చూసి తీరవలసిందే. కథానాయకుడు చంద్రశేఖర్ పాత్రలో శ్రీ దగ్గుబాటి వెంకటేష్, కథానాయిక మీనాక్షి పాత్రలో భానుప్రియ నటించి, ఆ పాత్రలకు జీవం పోసారు. మీనాక్షి పాత్ర చుట్టూనే కథంతా నడవటంతో, ఆ పాత్రలో భానుప్రియగారు నవరసాలను పోషించి, పాత్రలో పూర్తిగా లీనమై నటించి, భానుప్రియ అంటే మీనాక్షే అనే భావనను కలిగించటంలో పూర్తిగా కృతకృత్యులయ్యారు. అంతలా ఆ పాత్రను మలిచిన శ్రీ విశ్వనాథ్ గారికే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది.

ఈ చిత్రంలో ఇంచుమించు పది పాటలు ఉన్నాయి. వాటిలో ఎనిమిది పాటలు పూర్తిగా నృత్యప్రధానమైనవే. ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఆరుగురు నృత్యదర్శకులు ఈ చిత్రానికి పనిచేయటం విశేషం. ప్రస్తుతం మనం ప్రస్తావించుకుంటున్న ఈ గీతానికి శ్రీ గోపీకృష్ణ గారు నృత్యదర్శకత్వం వహించారు.

కథాపరంగా మీనాక్షి, ఆమె అక్క సావిత్రి తమ తండ్రిగారైన కూచిపూడి నాట్య శాస్త్ర విద్వాంసులు శ్రీ వేదాంతం శేషేంద్రశర్మ గారితో కలిసి ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఉంటారు. సావిత్రికి సంగీతం, మీనాక్షికి నృత్యం నేర్పిస్తాడు తండ్రి. కానీ కళల పట్ల ఏమాత్రం సద్భావన లేని మీనాక్షి నాట్యాభ్యాసాన్ని పక్కన పెట్టి, ఉద్యోగం మీద, సరదాలు, సినిమాల మీద దృష్టి కలిగి ఉంటుంది. నాట్యం ఏదో మొక్కుబడిగా శాస్త్రప్రకారం నేర్చుకుంటుంది కానీ, ఆమె ఇచ్చే ప్రదర్శనలలో జీవం ఉండదు. ఆ నృత్యం అనేది మనసుకు అయిష్టమైన పనిగా భావిస్తుంది.

ఒక గురుపౌర్ణమి నాడు చంద్రశేఖర్ ఆమెను తన తండ్రిగారి శిష్యుడు చేస్తున్న గురుపూజకు తీసుకుని వెళతాడు. అప్పటికే నృత్యం చేయటంలోని ఆనందాన్ని, తాదాత్య్మ్యతను తెలుసుకున్న మీనాక్షి, మనసారా తన తండ్రికి నమస్కరిస్తుంది. ఆ గురువందనంగా ఈ పాటను ఆలపిస్తూ, నృత్యాన్ని చేసి, ఎంతో సంతృప్తితో, తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తుంది. కళారాధనలోని ఆనందపు ఉన్నత శిఖరాలను అందుకున్న మధురక్షణం అది. ఆ నాట్యాన్ని ఆనందంతో తిలకించిన మరో ప్రముఖ ఛావ్ నృత్యకళాకారిణి షెరాన్ లోవెన్, “ఈరోజు నీ ఆత్మ నాట్యం చేసింది!” అంటూ మీనాక్షిని ప్రశంసిస్తుంది. ఈ పాటలోని నృత్యభంగిమలలో, ముఖంలో పలికించిన హావభావాలలో, నృత్యం చేసిన తరువాత, చంద్రశేఖర్ ఆమె పాదం పట్టుకున్నప్పుడు ఆమె చూపిన అభినయం, భావావేశం, చివరిగా ఆమె కన్నీరు కారుస్తూ, ‘ఈ కళలన్నీ ఇహానికే కానీ, పరానికి ఎంతమాత్రం పనికిరావనే అపోహలో ఉండిపోయాను. కానీ మనసు పెట్టి నాట్యం చేస్తే కలిగే ఆనందం ఎంత గొప్పదో ఈరోజు నేను అనుభవించి తెలుసుకున్నాను!’ అని పలికే సంభాషణలు మన మనసులకు ఎంతో ఆనందాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి.

సిరివెన్నెల గారి కలం కొత్త ఉత్సాహంతో, ఎన్నెన్నో మధుర పదబంధాలతో చిందులు వేసింది. దానికి అద్భుతమైన బాణీ ఇళయరాజా గారిది. ఆ భావాలను మరింత మధురంగా ఆలపించిన ఘనత బాలూ, వాణీజయరామ్ గార్లది. మరి పాటలోకి వెళ్ళిపోదాం.

సాకీ:

గురు బ్రహ్మః…  గురు విష్ణుః… గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మః… ఆ… ఆ

గురు సాక్షాత్ పరబ్రహ్మః…  ఆ… ఆ

తస్మై శ్రీ గురవే నమః

అతడు : ఓం నమో నమో నమశ్శివాయ

ఆమె : మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ

          గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ

అతడు : ఓం నమో నమో నమశ్శివాయ

ఆమె : శూలినే నమో నమః కపాలినే నమః శివాయ

          పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ

పల్లవి:

ఆమె : అందెల రవమిది పదములదా? ఆ… ఆ

         అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా?

         అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా?

         అమృత గానమిది పెదవులదా? అమితానందపు ఎద సడిదా?

 

(మీనాక్షి : ఈ అందెల సవ్వడి నా పాదాలదా? లేక ఆకాశాన్ని అంటుతున్న నా హృదయానిదా? ఈ అమృతమయమైన గానం నా పెదవులదా? లేక ఎంతో ఆనందాన్ని పొందుతున్న నా గుండె సవ్వడిదా?)

అతడు : సాగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగఫలముగా

            సాగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగఫలముగా

            బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా…

 

(చంద్రశేఖర్ : సాగిన నీ సాధన సార్థకమయింది. అందుకే, ఒక యోగబలం లాగ, ఒక యాగఫలం లాగ నీ జీవితం ఓంకారమై మ్రోగుతున్నది.)

ఆమె : అందెల రవమిది పదములదా? ఆ… ఆ

 

చరణం 1 :

ఆమె : మువ్వలు ఉరుముల సవ్వడులై… మెలికలు మెరుపుల మెలకువలై

         మువ్వలు ఉరుముల సవ్వడులై… మెలికలు మెరుపుల మెలకువలై

         మేను హర్ష వర్ష మేఘమై… ఆ… ఆ… వేణి విసురు వాయు వేగమై… ఆ… ఆ

 

(మువ్వలు ఉరుముల సవ్వడులైనాయి… మెలికలు మెరుపులా మెలకువలైనాయి. నా మేను సంతోషం నిండిన వర్షపు మేఘమే అయింది, నా జడ విసురు వాయు వేగమైనది…)

అతడు : అంగ భంగిమలు గంగ పొంగులై, హావభావములు నింగి రంగులై

            లాస్యం సాగే లీల… రస ఝరులు జాలువారేలా

 

(నీ శరీర భంగిమలు గంగాప్రవాహంలా పొంగుతున్నాయి, నీ హావభావాలు నింగి రంగుల్లా ప్రకాశిస్తున్నాయి… ఇలా నీ లాస్యం సాగుతుంటే, రసప్రవాహం వర్షమై  జాలువారుతోంది…)

ఆమె : జంగమమై జడమాడగా

 (శివుని స్వరూపమై జడుడి వలె కదలకుండా ఉండే శివుడే ఆడగా…)

అతడు : జలపాత గీతముల తోడుగా

ఆమె,  అతడు : పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా

 (పర్వతరాజు కుమార్తె పార్వతి… అలా పర్వతాలు కన్నా బిడ్డలాంటి పచ్చని ప్రకృతి యొక్క ఆకృతి పార్వతీ దేవియై వెలసింది…)

ఆమె : అందెల రవమిది పదములదా? ఆ.. ఆ…

చరణం 2 :

అతడు : నయనతేజమే…  నకారమై (నీ నయనాలలోని తేజం నకారం అయింది…)

            మనోనిశ్చయం… మకారమై (నీ మనోనిశ్చయం మకారం అయింది…)

            శ్వాసచలనమే… శికారమై (నీ శ్వాస యొక్క చలనం శికారం అయింది…)

            వాంఛితార్థమే… వకారమై  (నీవు కోరుకున్న వరం వకారం అయింది…)

           యోచన సకలము… యకారమై (నీ ఆలోచన అంతా యకారం అయింది…)

           నాదం… నకారం… మంత్రం… మకారం… స్తోత్రం… శికారం…

          వేదం… వకారం… యజ్ఞం… యకారం… ఓం నమశ్శివాయ…

 (నాదం నకారమై, మంత్రం మకారమై, స్తోత్రం శికారమై, వేదం వకారమై, యజ్ఞం యకారమై – ప్రణవమైంది… అదే ఓంకారం.)

ఆమె : భావమె భవునకు భావ్యము కాగా భరతమె నిరతము భాగ్యము కాగా

 (భావము శివునకు తగినది కాగా, భరతము సదా నా అదృష్టం కాగా)

 అతడు : తుహిన గిరులు కరిగేలా … తాండవమాడే వేళా

(మంచు కొండలు సైతం కరిగిపోయేలా, నీవు తాండవం సలిపేవేళ)

ఆమె : ప్రాణ పంచకమె పంచాక్షరిగా… పరమపదము ప్రకటించగా

(పంచప్రాణాలు పంచాక్షరీ మంత్రంగా పరమపదాన్ని తెలియజేస్తూ ఉండగా…)

అతడు : ఖగోళాలు పద కింకిణులై… పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా

(గ్రహాలూ, ఉపగ్రహాలు పాదాల మువ్వలై, పది దిక్కులలోనూ శివుని యొక్క మహాతాండవ స్వరూపం నిండగా…)

ఆమె :

అందెల రవమిది పదములదా?… అంబరమంటిన హృదయముదా?

అమృత గానమిది పెదవులదా?… అమితానందపు ఎద సడిదా?

అందెల రవమిది పదములదా?… ఆ.. ఆ

ఈ పాటంతా శివపార్వతుల తాండవ వర్ణనతో సాగుతుంది. ఓంకారాన్ని ఆవాహనం చేసుకొని, మనసుతో నృత్యం సలిపినప్పుడు పార్వతీదేవి యొక్క లాస్యం, పరమేశ్వరుని యొక్క తాండవం కలిసి చూసేవారి కనులకు, సలిపేవారి మనసుకు ఎంతటి విందు చేకూరుతుందో సవివరంగా, సవర్ణమయంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కనులముందు ఆ చిత్రాన్ని నిలుపుతారు. మొదటి చరణమంతా అమ్మవారి నృత్యాన్ని వర్షఋతువుతో పోల్చటం చాలా హృద్యంగా ఉంటుంది. రెండవ చరణమంతా ఆ మహాదేవుని తాండవ రూపాన్ని వర్ణిస్తారు.

ఇక ప్రతీ పదాన్ని ఎంతో అర్థవంతంగా అభినయించటం భానుప్రియగారికే చెల్లింది. ముఖంలోని ఆ భావాభినయం ఆమెకే స్వంతం. చూసి తీరవలసిందే కానీ వర్ణించటానికి మాటలకు అందనిది. మరి ఇక ఆలస్యం ఎందుకు? రండి, ఆ పాటను వీక్షించుదాము.

***

1 thought on “సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది

  1. Very Purposeful review of the lyric word by word and the way it’s picturised gives an in-depth exposure of both the lyric writer and the dance composer in effectively bringing out the mood through the artists. That’s the best quality of a seasoned director.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2023
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
2728