April 27, 2024

ప్రాయశ్చితం – 1 (నవల)

రచన: గిరిజారాణి కలవల

అమెరికాలోని సియాటిల్ నగరం. అది ఎండాకాలం. రాత్రి ఎనిమిది అయినా కూడా ఇంకా సూర్యాస్తమయం అవలేదు. అదే మనకైతే ఇండియాలో సాయంత్రం ఏ ఐదు గంటలో అయినట్టు వుంటుంది. చీకట్లు ముసురుకోవడానికి మరో అరగంటైనా పడుతుంది.
అక్కడ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ సురేంద్ర. ఇంటి నుండే ఆఫీసు పని చూసుకుంటూ వుంటాడు. ఆ రోజుకి చేయాల్సిన పని పూర్తయినట్లే. సిస్టమ్ షట్ డౌన్ చేసి, బద్ధకంగా వళ్ళు విరుచుకుని, కుర్చీలోంచి లేచాడు.
కిచెన్ లోకి వెళ్ళి, ఫ్రిజ్ లోనుంచి పాలు, కప్పులోకి ఒంపుకుని, ఓవెన్ లో పెట్టి వేడి చేసాడు. దాంట్లో ఇన్ స్టంట్ కాఫీ పౌడర్, బ్రౌన్ సుగర్ వేసి, కరిగేదాకా స్పూన్ తో కలిపాడు. కాఫీ కప్పు తీసుకుని, నెమ్మదిగా బేక్ యార్డ్ లో వున్న సోఫాలో కూర్చుని, సిప్ చేయసాగాడు.
చుట్టూ పెద్ద పెద్ద పైన్ వృక్షాలు… నిటారుగా ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లు అనిపిస్తున్నాయి. ఫెన్సింగ్ చుట్టూ వేసిన అందమైన పూవుల మొక్కల నిండా విరబూసిన పూవులు, గాలికి తలలూపుతూ చాలా ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఇటు పరుగులు తీసే ఉడతలు, పక్షుల ధ్వనులు, నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. అందమైన ప్రకృతి ని చూస్తూ, కాఫీ తాగడం పూర్తి చేసాడు. కప్పు టేబుల్ మీద పెట్టి, కాసేపు ఆరుబయట చల్లగాలిలో వాకింగ్ చేద్దామనుకుని…. “ఉదయా! వాకింగ్ కి వెడుతున్నాను. నువ్వూ వస్తావా?” అంటూ పెద్దగా పిలిచాడు.
సమాధానం రాలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది.
భార్య ఉదయ ఇంట్లో లేదని. ఆరోజు తన స్నేహితురాలి ఇంట్లో స్లీపోవర్ వుంది, మర్నాటి మధ్యాహ్నం దాకా రానని నిన్నే చెప్పింది.
ఇక మిగిలినవారు పిల్లలిద్దరూ… కాలేజీ చదువులకి వచ్చిన కొడుకు రిషి, కూతురు విన్నీ… ఎక్కడికి పెడతారో, ఎప్పుడు ఇంటికి చేరతారో సురేంద్రకి ఎప్పుడూ తెలీదు. కొంతలో కొంత రిషీ నయమే. తండ్రికి అందుబాటులోనే వుంటాడు. తండ్రితో మాట్లాడుతూనే వుంటాడు. విన్నీ మాత్రం తన తిరుగుళ్ళు, తన ఫ్రెండ్స్ ఇదే లోకం. ఇంటిని, ఇంట్లోవారిని పట్టించుకోదు. ఉదయ కూడా ఈ విషయంలో కూతురుని తప్పు పట్టదు. ఎప్పుడైనా సురేంద్ర మందలిస్తే, ‘ఇదంతా అమెరికా కల్చర్ లో భాగమే…’ అంటూ, భర్తని ఇక మాట్లాడకుండా చేస్తుంది. ఆమె మాటకి ఎదురు చెప్పే ప్రయత్నం చేయడు సురేంద్ర. చేసినా తన మాటకి విలువ వుండదని తెలుసు సురేంద్రకి.
సురేంద్రతో పెళ్ళి జరిగే సమయానికి ఉదయ కూడా ఉద్యోగం చేస్తూ వుండేది. తర్వాత పిల్లలు పుట్టాక కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడంతో, చేసే ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. పిల్లలు కూడా పెద్దయి, వాళ్ళ బాధ్యతలు లేకపోవడంతో, స్నేహితులు, షికార్లు, షాపింగులతో కాలక్షేపం చేయసాగింది. సురేంద్ర సంపాదించే డాలర్లకి న్యాయం చేసేది.
ఎనిమిది గదులు వున్న ఆ విశాల భవంతిలో వున్న ఆ నలుగురూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వుంటారు.
ఒంటరిగా గడపడం అలవాటే అయినా, ఆరోజు ఎందుకో బోర్ అనిపించింది సురేంద్రకి. వాకింగ్ కి వెడదామనుకున్న నిర్ణయం మానుకుని, కారు డ్రైవ్ చేసుకుంటూ, దగ్గర్లో వున్న పార్కుకి చేరుకుని, అక్కడ వున్న సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాడు.
పక్కనే స్విమ్మింగ్ ఫూల్ లో పిల్లలు, వారికి ఈత నేర్పిస్తూ వుండే తల్లిదండ్రులతోనూ కోచింగ్ మాష్టర్లతోనూ… కోలాహలంగా వుంది.
అప్పుడప్పుడే వెలుగుతున్న పార్క్ తాలూకు నియాన్ లైట్ల వెలుతురులో స్విమ్మింగ్ ఫూల్ లోని నీళ్ళు మిలమిలా మెరుస్తూ కనిపించాయి.
ఆ ఫూల్ లో… ఐదారేళ్ళ వయసు వున్న పిల్లవాడికి ఈత నేర్పిస్తున్న ఒక వ్యక్తి మీద సురేంద్ర దృష్టి పడింది. అతను బహుశా ఆ పిల్లవాడి తండ్రి కాబోలు. కొడుకు తనంతట తాను ఈత కొట్టడానికి భయపడుతూంటే, ధైర్యం చెపుతూ, తన అరచేతి మీద పిల్లవాడి పొట్ట ఆనించి పెట్టి, అతని కాళ్ళు చేతులు వేగంగా కదుపుతూ వుండమని చెపుతున్నాడు. మధ్య మధ్యలో తన చేతిని తీసేస్తున్నాడు.
ఆ ఇద్దరినీ అలా చూడగానే వెంటనే, సురేంద్రకి తన తండ్రి గుర్తుకు వచ్చాడు. ఈ మధ్య ఏంటో, ఎందుచేతనో తండ్రి తరచూ గుర్తు వస్తున్నాడు. తన చిన్నతనంలో తమ వూరి చెరువులో తనకి ఇలాగే ఈత నేర్పించాడు. భయపడుతున్న తనని చెరువు మధ్యకి తీసుకువెళ్ళి, హఠాత్తుగా వదిలేసేవాడు. తాను ఉక్కిరిబిక్కిరి అవుతూ, కాళ్ళు చేతులు ఆడిస్తూ, పెద్దగా ఏడిచేసేవాడు. అయినా తండ్రి పట్టించుకునేవారు కాదు. చివరకి ఎలాగోలా ఒడ్డుకి చేరుకునేవాడు. ఇంటికి వచ్చాక తండ్రితో పెద్దగా దెబ్బలాట పెట్టేసుకునేవాడు సురేంద్ర.
“సురేంద్రా! జీవితమే ఒక పెద్ద ‘ఆట’! భయపడకూడదు. ధైర్యంగా పోరాటం చేయాలి. గెలుపు ఓటములు దైవాధీనాలే అయినప్పటికీ గెలిచే దాకా ఆట ఆపకూడదు.”
తను, నాన్నని మర్చిపోయినా, నాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మరువలేనివే తనకి. అదే మాటల సారాంశం, ఆటలలోనే కాదు చదువులలో కూడా చూపించేవాడు సురేంద్ర…
ఎప్పుడూ కూడా, గెలుపు గుర్రం పైనే స్వారీ చేయాలనే తన కలలని సాకారం చేసుకున్నాడు సురేంద్ర.
అయితే బతుకు ఆటలో గెలిచాడో, ఓడాడో తెలియని డోలాయమానం ప్రస్తుత పరిస్ధితి.

సశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *