May 9, 2024

అనగనగా ఓ జాబిలమ్మ

రచన: కోసూరి ఉమాభారతి

అనగనగా ఓ జాబిలమ్మ…..
“చంద్రకళా, ఎక్కడమ్మా నువ్వు?” అమ్మ పిలుపుకి, “ఇదో ఒక్క నిముషం,” అని చందూ జవాబు చెప్పింది. రాత్రి పడుకునే ముందు రోజూవారీగా జరిగే వారి ‘కథా-సమయం’ ఆసక్తికరంగా సాగుతుంది. అందుకోసం అమ్మ ఇలా దాన్ని పిలవడం, చందూ అలా జవాబివ్వడం రోజూ వినేదే.
మామూలుగా అయితే, ఆ సమయానికి, అమ్మ గది సర్దుతూ వాళ్ళ మాటలు వింటుంటాను. రెండు రోజులుగా చందూ పుట్టినరోజు పనులతో, అమ్మ గది వైపు చూడనేలేదు.
అమ్మకి- చందూకి మధ్య జరిగే కథా-సమయం గురించి ఆలోచిస్తూ, చిందరవందరగా ఉన్న అమ్మ గదిలోకి వెళ్ళి, సర్దడం మొదలు పెట్టాను.
“ఇంత పనివత్తిడిలో కూడా నీకెందుకే ఈ సర్దడాలు? పనిపిల్లని పడక గదుల్లోకి రానివ్వవు. నన్ను చెయ్యనివ్వవు. అందరి గదులూ నువ్వే సర్దాలంటావు,” విసుక్కుంది పుస్తకం చదువుతున్న అమ్మ. చదవడమే కాదు, రాయడం, అనువదించడం కూడా చేస్తుంది.
నాన్న, అమెరికన్ ఎంబసీలో లైబ్రేరియన్ గా పనిచేస్తారు. ఇతర భాషల్లో పేరొందిన పుస్తకాలు – వాటి అనువాదాలు అడిగి తెప్పించుకొని మరీ చదువుతుంది అమ్మ.
దశాబ్దాలుగా పేరొందిన ‘కగు య హైం’ (moon princess) అనే, జాపనీస్ అద్భుతకథ స్ఫూర్తితో, ‘జాబిలమ్మ’ కథలని తానే అల్లి, చందూకి చెబుతుంది. ఆ ముద్దుల మనమరాలికి, ఆ కథల్లో మంచిమాటలు, సూక్తులు పొందుపరిచి మరీ…
అమ్మ అందమైన కథల్లోని అమ్మాయి పేరు – జాబిలమ్మ. ఎక్కడో, అల్లంత దూరాన నీలాకాశంలో ఉన్న వెన్నెల సామ్రాజ్యాన్ని చేరుకొని, ఓ నక్షత్రంలా వెలగాలన్నది, ఆ చిన్నారి జాబిలమ్మ కోరికట…. అందుకోసం ఆ అమ్మాయి, వంద వెన్నెలమెట్లు ఎక్కాలట. అలా ఒక్కో మెట్టు ఎక్కే అర్హత కోసం, యేడాది పొడవునా బుద్దిగా ఉంటూ, బాగా చదువుకోవాలట. అలా చేస్తేనే, ప్రతియేడూ తన పుట్టినరోజున ఒక వెన్నెలమెట్టు ఎక్కగలుగుతుందట ఆ అమ్మాయి. ….
ఇలా సాగే ధారావాహిక కధనానికి, వింతలు-విశేషాలు, నీతులు-నియమాలు చేర్చి ఇంకెన్నెన్నో అంశాలతో ఆసక్తికరంగా మలుస్తుంది అమ్మ…అందునా తన కథల్లోని జాబిలమ్మతో, చందూకి దగ్గర పోలిక ఉండేలా….
అమ్మ చెప్పే ‘జాబిలమ్మ కథలు’ నేనూ ఇష్టంగా వింటుంటాను. సంప్రదాయాలు-కట్టుబాట్లు అందంగా రంగరించి, రేళ్ళ చందూకి అర్ధమయ్యేలా ఎంత అద్బుతంగా చెబుతుందో కదా! అని ఆశ్చర్యపోతుంటాను కూడా…
రాత్రి ఎనిమిదిన్నరయింది. భోజనాలయ్యాక, వంటిల్లు సర్ది అమ్మ గదిలో మంచినీళ్లు పెట్టి మందులివ్వడానికి వెళ్లాను.
“చూడు శారదా, రేపు చాలా పనుంది మనకి. మీరు కూడా పెందరాళే పడుకోండమ్మా. ఇతరత్రా పనులేమీ పెట్టుకోకుండా దినమంతా ఆలయం వద్దే మనతో ఉండాలని అల్లుడుగారికి కూడా చెప్పావుగా.” అని అమ్మ నాతో అంటుండగానే…
“అమ్మమ్మా! వచ్చేసాను,” అంటూ పరుగున వచ్చి, పందిరి మంచం మీద అమ్మ పక్కన చేరింది చందూ. పుట్టినరోజుకి
అమ్మిచ్చిన బంగారు చిరుగజ్జెలతో, నిన్నటినుంచి దాని పరుగులు వినడానికి కూడా బాగున్నాయి.
“జాబిలమ్మ’… కథ వినే టైం కదా! నేను రెడీ. చెప్పు మరి,” గోముగా అమ్మకు దగ్గరగా వొదిగింది చందూ.
అమ్మకి చందూ పట్ల ఆ ఎనలేని ప్రేమని అర్ధం చేసుకోగలను. అమ్మకి నేనొక్కితినే సంతానం. నాకూ పెళ్ళైన ఐదేళ్లకి గాని చందూ పుట్టలేదు. ‘ఎండోమీట్రియాసిస్’ అనే గర్భకోశ వ్యాధి వల్ల, నేను ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవలసి రావడం అమ్మని కాస్త కలవర పెట్టింది. చందూ తరువాత ఇక నాకు సంతానం కలగదని కూడా తెలిపారు వైద్యులు. దాంతో అమ్మ ఆశలన్నీ చందూ మీదనే పెట్టుకుంది. అపురూపంగా చూసుకుంటూ ‘చిన్నారి దేవత’ ని పిలుచుకుంటుంది.
**
చందూ చేత లలితాసహస్రనామాలు పలికించడం, కూచిపూడి గురించి చెబుతూ, హస్తముద్రలు పట్టించడం కూడా అమ్మకి పరిపాటే. తానొక ప్రఖ్యాత నాట్యగురువు అవడంతో నన్నూ డాన్సర్ ని చెయ్యాలని ప్రయత్నించి, కుదరక సంగీతంలో పెట్టిందని తలుచుకుని నవ్వుకుంటుంటాను.
మరుసటి రోజు ఆలయంలో జరగబోయే కళోత్సవానికి మా వంతుగా వందమందికి సరిపడా పులిహోర అందించాలి. టి.వి చూస్తున్న నాన్నకి, మోహన్ కి పెందరాళే పడుకోమని గుర్తు చేసి, పులిహోర పులుసు తాళింపు వేద్దామని వంటింట్లోకి నడిచాను.
స్పష్టంగా వినిపిస్తున్న అమ్మ కబుర్లు, చందూ మాటలు వింటూనే పని చేసుకోసాగాను.
“అవునా? నాకు లాగానే జాబిలమ్మకి కూడా ఆరేళ్ళు నిండాయా?” అంటూ గట్టిగా చందూ కేరింతలు, చప్పట్లు.
“అవును మరి, ఆరేళ్ళు నిండి, ఏడవ వెన్నెలమెట్టు మీద కాలు పెట్టిన మా ఈ జాబిలమ్మకు వెన్నెల సామ్రాజ్యం నుండి నిన్నటి పుట్టినరోజున… బంగారు మువ్వలు, పట్టు పరికిణీలు బహుమతులుగా వచ్చాయిగా.” అంది నవ్వుతూ అమ్మ.
“అమ్మమ్మా, జాబిలమ్మ ఆకాశంలో నక్షత్రం అవ్వాలంటే చాలా వెన్నెల మెట్లు ఎక్కాలా? మొత్తం హండ్రెడ్ మెట్లు అన్నావుగా.!” అడిగింది చందూ.
“అంతేగా, చేసిన మంచి పనులకి బహుమతులు పొందుతూ, ప్రతి పుట్టినరోజుకి ఒక్కో మెట్టు చొప్పున, అలా ఇంకా తొంభైమూడు మెట్లన్నా ఎక్కుతుంది జాబిలమ్మ. సరే మరి ఇక పడుకోమ్మా.” అంది అమ్మ.
పని ముగించుకుని నేనూ పడకెక్కాను.
**
చీకటితో వచ్చిన వంటమనిషి అంబుజతో రెండు పూటలకి వంట చేయించేసి, నేను చందూకి మేకప్ వేసే పనిలో ఉండిపోయాను. అమ్మ కాఫీ తాగి, తన వాన్ లో డాన్స్ స్టూడియోకి వెళ్ళిపోయింది. నాన్నకి, మోహన్ కి బల్ల మీద టిఫిన్, కాఫీలు సర్ది వెళ్ళింది పనిపిల్ల. తినడం అయ్యాక, చందూకి నేను కృష్ణుడి మేకప్ వేస్తుంటే, ఎప్పటిలా తనే చందూకి పారాణి
పెట్టారు మోహన్.
స్థానికంగా చెన్నైలో, అమ్మ ఆధ్వర్యంలోనే జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నిటా ఆమెదే ముఖ్యపాత్ర.
**
మైలాపూర్ ఆలయంకి అరగంట ప్రయాణం. ఏటవాలుగా ఉండే ఆ గుడిదారి అంటే నాన్న వెనుకాడుతారు. అందుకే ఎప్పటిలా మోహన్ కారు నడుపుతున్నారు..
“చూడు మోహన్, మీరంతా మేకప్ పనిలో ఉండగా, మన ఎంబసీ నుండి ఫోన్ వచ్చింది. మీ అమెరికా ఇమిగ్రేషన్ విషయంగా అధికారిక లాంఛనాలన్నీ పూర్తయినట్టేనని, నెల రోజుల్లో వాషింగ్టన్ కార్యాలయం నుండి సమాచారం అందుతుందని తెలియజేసారు. ఇక ఆ ఇమిగ్రేషన్ కాగితాలు చేతికందిన ఆరు నెల్లలోగా ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్ళొచ్చు,” అన్నారు సంతోషంగా.
“ఏమైనా, మీరు, అత్తయ్య కూడా మాతో వచ్చేస్తే బాగుంటుంది మామయ్యా,” అన్నారు మోహన్ రాజ్…
“ఎలా మోహన్? నాకింకా సర్వీస్ ఉంది. మీ అత్తయ్య నాట్యగురువుగా మంచి స్థాయిలో ఉంది కదా! ఇంకొన్నాళ్ళు పని చేసి ఎలాగూ మీ వద్దకే చేరుకుంటాముగా,” సర్ది చెబుతూ నాన్న.
అమ్మవాళ్ళని వదిలిపెట్టి వెళ్లాలని లేదు. నా మటుకు నాకు అమెరికా అంటే అస్సలు మోజు లేదు. “ఏమిటో నాన్న, నన్నొదిలి ఉండలేమని, మీరు ఇల్లరికం అల్లుణ్ణి తెచ్చుకున్నారు. పదేళ్ళల్లో మనసు మార్చేసుకొని మాకు ఆసక్తి లేని అమెరికా వాస్తవ్యం అంటగడుతున్నారు,” నా మాట నాకే విసుగ్గా వినిపించింది.
“చూడు శారదా, ఈ విషయాలు ఇప్పటికే చాలాసార్లు చాలా మాట్లాడాము కదా! మన చంద్రకళకి అమెరికాలో చదువుకునే అవకాశం చిన్నతనంలోనే వస్తుంటే, మంచిదే అనుకున్నాము. నేను, మోహన్ కూడా యు.ఎస్. ఎంబసీకి పనిచేయడం వల్లే మనకీ అవకాశం వచ్చిందని కూడా నీకు తెలుసుగా తల్లీ,” అన్నారు కాస్త అసహనంగా.
**
అమెరికా ప్రయాణంకి తేది ఖరారయింది. నాలుగు నెలల సమయం ఉంది. మేము వెళ్ళి సెటిల్ అవ్వబోయేది హ్యూస్టన్ నగరంలో. మోహన్ కి అక్కడ ఇండియన్ కాన్సొలేట్ లో ఉద్యోగానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నాన్న వాళ్ళు.
**
హ్యూస్టన్ వచ్చి, పుష్కరకాలం గడిచింది…… గత పన్నెండేళ్ళగా, ఈ కొత్త ప్రపంచంలో చందూతో పాటు మేమూ ఎదిగాము. చందూ ఎప్పటిలా చదువులో, ఆటల్లో – పాటల్లో – కూచిపూడి డాన్సులో కూడా చక్కగా ముందుకి సాగుతుంది. క్రమశిక్షణతో మసులుతుంది.
నా దృక్పథంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రపంచ సంస్కృతుల సంగమంలా ఉన్న అమెరికాలో, కొంగొత్త కోణాల్లో ఇతర దేశాల సంస్కృతీ – సంప్రదాయాల్ని అర్ధం చేసుకొంటూ, మరింత మెరుగ్గా
మనుగడ సాగించవచ్చని తెలుసుకున్నాను. వారాంతాల్లో ఆసక్తి ఉన్న పిల్లలకి శాస్త్రీయ సంగీతం నేర్పడం ముఖ్య వ్యాపకంగా పెట్టుకున్నాను.
**
చెన్నైలో అమ్మావాళ్ళ వద్దకి, గడిచిన పన్నెండేళ్ళలో నాలుగు సార్లు వెళ్ళాము. హాయిగా గడిపాము. అమ్మా, చందూ ఎప్పటిలా ముచ్చటగా ‘జాబిలమ్మ’ కథలు చెప్పుకుంటూ, అదే ఆప్యాయతతో మెలిగారు. అమ్మతో కొన్ని విషయాల్లో, ముఖ్యంగా చందూ పెంపకం విషయంగా వాదించాను కూడా. చందూకి అన్నిటా పూర్తి స్వేచ్చ నివ్వడమే సముచితం అని వాదించాను. పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా ఎదగాలంటే, స్వేచ్చ అవసరమని, పద్దెనిమిదేళ్ళ చందూ అన్ని విషయాల్లో చక్కగా ఎదుగుతుందని సంతోషాన్ని వ్యక్తపరిచాను.
**
చందూ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ కి ముందే తాము పర్మనెంటుగా మా వద్దకు వస్తున్నామని మంచి వార్త చెప్పారు అమ్మావాళ్ళు. వాళ్ళు వచ్చాకే చందూ కూచిపూడి రంగప్రవేశంతో పాటు హైస్కూల్ గ్రాడ్యుయేషన్ కూడా ఓ వేడుకలా జరిపించాలని అనుకున్నాము.
**
అమ్మవాళ్ళ రాకతో, చందూ ముఖంలో ఓ కొత్త వెలుగు వచ్చింది. అచ్చమైన తెలుగు స్వచ్చంగా మాట్లాడుతున్న చందూని చూసి అమ్మ మురిసిపోతే, తన ‘రంగప్రవేశం’ అమ్మమ్మ చేతుల మీదుగా జరిగిందని చందూ పొంగిపోయింది.
తరువాత, కొద్ది రోజులకి కాలేజ్-స్టేషన్ లోని ‘టెక్సాస్ ఎ & ఎం యూనివర్సిటీ’ కి వెళ్ళిపోయింది చందూ. దగ్గరే కాబట్టి, వీలయినంత తరుచుగా తను రావడమో, మేము వెళ్ళడమో చేస్తున్నాము….
**
అమ్మమ్మ – చందూల సుదీర్ఘ ఫోన్ సంభాషణలు, వారాంతంలో కలవడాలు, వారిని మునుపటంత దగ్గర చేసి, వారి ‘జాబిలమ్మ స్టోరీ-సెషన్స్’ ని చర్చా వేదికలుగా మార్చాయి. అలా వాళ్ళు ఎన్నెన్నో అభిప్రాయాలని,
భావాలని పంచుకుంటుంటే, వింటూ ఆనందిస్తాను. అమ్మకి, మొదట్లో- చందూ వేసే అధునాతన దుస్తులు, ఎప్పుడన్నా ఫిష్ వండించుకు తినడాలు, దాని పెంపుడు కుక్కలు నచ్చలేదు. కాని మనమరాలు మీదున్న ప్రేమ, అన్నిటిని సమర్దిస్తూ చందూ ఇచ్చే సమాచారం ముందు, ఆమె అయిష్టత పటాపంచలైపోయింది.
ముందే కొంత కంప్యూటర్ వాడకం తెలిసున్న అమ్మకి ల్యాప్టాపులో ‘తెలుగు లిపి’ అమర్చింది చందూ. దాంతో, ఒకరికొకరు మెసేజులు, కవితలు పంపుకుంటూ మంచి స్నేహితులైపోయారు.
కాలం ముందుకి సాగి, వారి కథలోని ‘జాబిలమ్మ’ కూడా చందూలా చక్కగా ఎదిగింది. ఇంజినీరింగ్ కోర్స్ చదువుతో కొంత బిజీ అయ్యాక మాత్రం, మాతో మునుపటంత సమయం గడపలేక పోతుంది చందూ. అయినా అదే కాలేజీ అవడంతో వీలునప్పుడల్లా కలుస్తూనే ఉన్నాము..
**
మరో మూడేళ్ళకి కాలేజీ గ్రాడ్యుయేషన్ నాడు, ‘ఎడ్వర్డ్ జోన్స్’ అనే ఓ అమెరికన్ యువకుణ్ణి మాకు ప్రత్యేకంగా పరిచయం చేసింది చందూ. ఇద్దరూ ‘ఉన్నత విద్యార్ధుల విభాగం’ లో అవార్డులందుకున్నారు. వాళ్ళిద్దరు, ఒకరితో ఒకరు చాలా దగ్గరగా మసలడం చూసి, అమ్మ ఇబ్బందిపడింది. తిరిగి ఇంటికొచ్చాక కూడా, మాతో ఏమీ అనకపోయినా ఆమె మనసు పడుతున్న ఆందోళన నాకే తెలుసు.
**
మరునాడు, చందూ, ఎడ్వర్డ్ ఇంటికొచ్చారు. ఒకరినొకరు ఇష్టపడుతున్నామని స్వచ్చంగా తెలియజేశారు. అమ్మ షాక్ నుండి తేరుకునేలోగా, మేము అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాము. మర్యాదస్తుడిలా ఉన్నాడు. ఆప్యాయంగా మాట్లాడాడు.
భోజనాలు చేసి తిరిగి వెళ్ళిపోయారు చందూ, ఎడ్వర్డ్ లు.
వారితో గడిపిన ఆ కొద్దిగంటల్లోనే, మాకు ఎడ్వర్డ్ పై సదభిప్రాయం ఏర్పడింది. కాని, హాయిగా సాగుతున్న మా జీవితాల్లోకి ఇతర దేశస్థుడైన ఎడ్వర్డ్ రాక, ఓ అపశ్రుతే అంది అమ్మ. దిగాలు పడిపోయింది.
“ఇరవై నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ చదివిన యువతి, తనకి నచ్చిన వాడితో జీవితం పంచుకోవాలనుకోడం తప్పు కాదమ్మా,” అని ఆమెకి నచ్చజెప్పాను.
ఎడ్వర్డ్ కి, అన్ని అర్హతలు ఉన్నాయని, ఓ ప్రైవేట్ బ్యాంక్ అధినేతకి ఏకైక వారుసుడని, నాలుగేళ్లగా చందూకి తెలిసినవాడు, దాని మనసుకి నచ్చినవాడని చెప్పాను.
**
మరో యేడాదికి అమ్మ ఆశీస్సులతో, చందూ-ఎడ్వర్డ్ ల వివాహం ఘనంగా జరిపించారు ఎడ్వర్డ్ తాతగారు. ఆ పెద్దాయన పేరు డేవిడ్ జోన్స్. ఆయన్ని కూడా కలిసాక గౌరవప్రదమైన కుటుంబమేనని సంతోషించింది అమ్మ.
అటుపై చిలకా గోరింకల్లా చందూ-ఎడ్వర్డ్ లు కళ్ళెదుటే తిరుగుతుంటే సంబరపడిపోయింది.. ‘నానమ్మా’ అంటూ తన చుట్టూతా తిరిగే ఎడ్వర్డ్ మీద ఆపేక్ష పెంచుకుంది.
చందూ-ఎడ్వర్డ్ ల సందడితో, అమ్మకి సమయం చాలడం లేదు …
రెండేళ్ళు గడిచాక మాత్రం, తనకో మునిమనవడని కనివ్వమని వాళ్ళని వొత్తిడి చేసింది. వచ్చీరాని తెలుగులో, “మీ కోరిక మేము తప్పక తీరుస్తాం నానమ్మా,” అని ఎడ్వర్డ్ ఆమెతో అన్నప్పుడు తెగ మురిసింది అమ్మ.
**
డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ ముగించి, చందూవాళ్ళ ఫామిలీ రూములోకొచ్చి కూర్చున్నాము. ఏవో ఉబుసుపోక కబుర్లు చెబుతూనే ఉంది చందూ. నేను, అమ్మా ముఖాలు చూసుకున్నాము.
తెల్లవారక ముందే, ఫోన్ చేసి, ‘మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి, వెంటనే వచ్చేయండి’ అన్న మనిషి, ఏవో మాటలు చెబుతుందే తప్ప అసలెందుకు రమ్మందో చెప్పదు. మాకేమో దాని నోటెంట శుభవార్త వినాలని ఆత్రుతగా ఉంది. అమ్మని చేత్తో తట్టాను.
“సరే, ఇక ఆగలేము తల్లీ. ముఖ్యమైన విషయమంటూ పొద్దున్నే పిలిచి, కడుపునిండా మంచి తిండి కూడా పెట్టావు. ఆ శుభవార్త కూడా చెప్పెయమ్మా. డాక్టర్ వద్దకు వెళ్లుంటావు… ఏమన్నారు? ఎన్నో నెలంట?” అడిగింది అమ్మ.
వెంటనే గంభీరంగా మారింది చందూ. ఎడ్వర్డ్ వంక చూసింది. అతనే వెళ్ళి చందూ పక్కన కూర్చుని, దాని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
“కవలలని చెప్పాడేమో! డాక్టర్ వీళ్ళకి,” అంది అమ్మ నాకు మాత్రం వినబడేలా.
తల వంచుకునున్న చందూ భుజంపై మృదువుగా తట్టాడు ఎడ్వర్డ్. ‘పర్వాలేదు, నేనున్నాగా’ అన్నట్టు. ఏం చెబుతుందోని మాకు ఆత్రుతగా ఉంది.
తల పైకెత్తి తన ఎదురుగా కూర్చునున్న మా వంక చూసింది చందూ..
“మీరంతా నేను చెప్పబోయేది పూర్తిగా వినండి. ఎవరూ భావోద్వేగాలకు గురికావద్దు.ఇక బిడ్డ కావాలని మేమూ ఆదుర్దాగానే ఉన్నాము. కాని, నాకు ఆరునెలలుగా అప్పుడప్పుడు వచ్చే భరించలేని తలనొప్పి, ఈ మధ్య ఉధృతంగా మారడంతో, వైద్య పరీక్షలు చేయించాము… నాకు అసామాన్యమైన ‘బ్రెయిన్ కాన్సర్ వ్యాధి’ ఉందని తెలిసింది,” క్షణమాగింది చందూ.
“గ్రేడ్ 2 గ్లియోబ్లాస్టోమ మల్టిఫార్మే (glioblastoma multiforme) అంటారు నాకున్న ఆ వ్యాధిని,” దుఃఖాన్ని పంటిబిగువున ఆపుకుంటూ, మా వంక సూటిగా చూసింది చందూ. “ఆపరేషన్ చేయించుకుంటే కనీసం పదేళ్ళైనా ఉంటానని, మరో ఇద్దరు నిపుణులు కూడా తేల్చారు. నాకు బతకాలని ఉంది.. ఇంత మంచి జీవితాన్ని, ఇలాంటి పరివారాన్ని వదలాలని లేదు. మీరంతా నాకు ధైర్యాన్నివ్వండి. మీ అశ్రువులకి బదులు ఆశీస్సులనిచ్చి, నన్ను ఆ పదేళ్ళైనా సంతోషంగా బతికించండి. మీరు కృంగిపోయి నన్ను ఇటువంటి సమయంలో ఏడిపించవద్దు. ఈ వ్యాధి గురించి, వ్యాధి తీవ్రత గురించి మీరూ తెలుసుకోండి,” అంటూ కన్నీళ్ళతో చేతులు జోడించింది.
ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించి వొళ్ళు తేలిగ్గా అయిపోయింది. ‘మైగ్రేన్ హెడ్-ఏక్స్’ లా వస్తున్నాయని చందూ చెప్పింది. కానీ..ఇలాటి వ్యాధి’..ఇక..ఆలోచించలేక పోయాను. తల తిరిగినట్టయ్యింది.. గబుక్కున లేచి వాకిలి వైపు వేగంగా అడుగులేశాను. “శారదా, శారదా!, అంటూ నా వెంటే పరుగున వచ్చిన మోహన్ చేతులు నన్ను చుట్టేసాయి, పడకుండా ఆపడానికేనేమో.
**
జేవురించిన ముఖాలతో అందరం మెథడిస్ట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలో ఉన్నాము. ఆరుగంటలుగా నా చందూకి బ్రెయిన్ సర్జరీ జరుగుతుంది. మాలో ఎవ్వరికీ మరొకరితో మాట్లాడాలన్న కోరిక లేదు. జరుగుతున్నది అర్ధం కాక మా మనస్సులు, ఆలోచన స్తంభించి పోయాయి.
అమ్మ అప్పుడపుడు ‘నా ‘జాబిలమ్మ’ అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎడ్వర్డ్, మోహన్ మా అందరికోసం గుండె నిబ్బరాన్ని కనబరుస్తూ, మాకు కాఫీలు, సాండ్విచ్ లు తెచ్చిస్తున్నారు. అవన్నీ టేబిల్ మీద అలాగే పడున్నాయి.
**
సర్జరీ అయ్యాక మమ్మల్ని రికవరీ పక్కన ఉన్న రూములో హాజరు పరిచారు. సర్జెన్, డాక్టర్, స్పెషలిస్ట్ అంతా మా ముందున్నారు. ఆపరేషన్ గురించి వివరణ ఇచ్చారు. ముందుగా పార్షియల్ – క్రేనియాటమీ (partial craniotomy) తో బ్రెయిన్ మీద ఉండే బోన్-ఫ్లాప్ (bone-flap) ని సర్జరీ చేసి, పక్కకి తీయడమయిందట. లోపలున్న టెంపోరల్-లోబ్ (temporal lobe) చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూని తొలిగించి, టెంపోరల్-లోబ్ ని కొంత భాగం తీసివేసారట. వ్యాధి వల్ల సీజర్స్, గుడ్డితనం, మాటపడిపోవడాన్ని వీలయినంత అరికట్టే ప్రయత్నంలోని భాగమని ప్రస్తావించారు.
పేషంటు కూడా స్పృహలోకి వచ్చి, కాస్త కోలుకున్నాక, మరిన్ని విషయాలు వివరిస్తామని, నాలుగు రోజుల్లో ఫామిలీ అంతా తప్పక వచ్చి కలవమని సూచించారు వైద్యులు. నాలుగు రోజులు ఆ బాధ, అయోమయం తట్టుకునే శక్తి మాకెవరికీ లేదు. జీవచ్చవాల్లా సమయాన్ని గడపాలి. చందూ కోసం!
**
అమ్మ మానసికంగా శారీరకంగా బాగా కృంగిపోయింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసినా, అందరి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో, ఏం చేయలేక మందులతో గడుపుకొస్తున్నాము. అందరం ఎడ్వర్డ్ ఇంటికే వెళ్ళి వస్తున్నాము. అక్కడ వంటమనిషి, హౌజ్-కీపర్ ఉండడంతో, ఒకింత టీలు – తిండి అక్కడ కానిస్తున్నాము. గుండెలు పిండేస్తున్న బాధతో, ఆగని కన్నీళ్ళతో దేవుడిని ప్రార్దిస్తూ గడుపుతున్నాము…
**
మళ్ళీ వారానికి, చందూ కుర్చోగలిగే పరిస్థితికి వచ్చాకే, డాక్టర్లతో, నిపుణులతో సమావేశమయ్యాము.
“చూడండీ, చంద్ర గురించి కొన్ని నిజాలు మీముందు పెట్టక తప్పనందుకు, మాకు చాలా బాధగా, సంశయంగా ఉంది.
సర్జరీతో మేమాశించినది చేసాము. కానీ, ఆమె వ్యాధి గురించి, కొత్తగా తీవ్రమైన ప్రతికూల విషయాలు బయట పడ్డాయి. చంద్రకళ బ్రెయిన్ కాన్సర్ గ్రేడ్ 4 గ్లియోబ్లాస్టోమ మల్టిఫార్మే (glioblastoma multiforme) గా నిర్దారణయ్యింది. సర్జరీ వల్లనే ఆ విషయం తెలుసుకోగాలిగాము,” ఒక్క క్షణం మౌనం వహించి మళ్ళీ చెప్ప నారంభించారు.
“ఇంతకన్నా సున్నితంగా చెప్పెగల పరిస్థితి కాదు మాది. చికిత్సకందని ఈ గ్రేడ్ 4 కాన్సర్ వ్యాధి, చంద్ర మెదడుని అతి వేగంగా కబళించి వేస్తుంది. ఆమెకిక ఆరునెలల సమయం మాత్రమే మిగిలుండవచ్చు. అంటే జీవనానికి సంబంధించిన సామాన్య ప్రక్రియలు కూడా ఒక్కోటి క్రమేణా స్తంభించిపోతాయి. వాక్కు, చూపు, నడక అన్నీ వేగంగా తగ్గిపోతాయి. సీజర్స్ ఎక్కువవుతాయి. ఇది వ్యాధి లక్షణం. తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి… ఆమెని ఇంటికి తీసుకువెళ్ళి, ఆమెతో మీకు ఉన్న సమయం వీలయినంత సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి,” అని సర్జన్ వివరించాక, “మే గాడ్ బి విత్ యు ఆల్,” అంటూ శలవు తీసుకున్నారు డాక్టర్లు.
దిగ్బ్రాంతి చెందే అసమాన పరిస్థితి. చుట్టూ చీకట్లుగా, గుండెల్ని బయటనుండి కొట్టి పిండిచేస్తునట్టుగా బాధ – ఎదుర్కునే శక్తి లేక అచేతనమైపోయాను. నా పక్కనే అమ్మ కుప్పకూలిపోయింది. ఇంకేమీ తెలియడం లేదు. ఎంతసేపయిందో. ఆ భయంకర నిశబ్దం చెదిరింది నా బంగారుతల్లి చందూ మెత్తని మాటలతోనే.
“విన్నారుగా! ఇది ఆ దేవుని నిర్ణయం. మనం తలొగ్గవలసిందే. ఉన్న సమయాన్ని వృధా కానివ్వకుండా అనుభ విద్దాము. ఇదే వ్యాధి సోకి, హాస్పైస్ లో ఉన్న పేషంట్స్ ని, త్వరలో నాతో పాటు మీరూ విజిట్ చేయవచ్చు,” అనేసి, “నన్నిక ఇంటికి తీసుకు వెళ్ళు ఎడ్వర్డ్,” అంటూ అతని చేయందుకుంది.
**
రోజూ పొద్దున్నే చందూతో వాకింగ్ అయ్యాక, దాని చిన్నప్పటి కబుర్లు, జాబిలమ్మ కథలు చెప్పుకుంటూ పగలంతా వాళ్ళింటనే గడిపి, సాయంత్రానికి ఇల్లు చేరుతున్నాము. అమ్మ కూడా చందూ కుక్కల్నిప్పుడు ఇష్టంగా చూసుకుంటుంది.
**
గుడి నుండి ప్రసాదం తీసుకొని, ఎప్పటిలా పొద్దున్నే చందూ ఇంటికి వెళ్ళాము. లివింగ్-రూమ్ లో చందూతో పాటు, ఎడ్వర్డ్ వాళ్ళ తాతగారు కూడా ఉన్నారు. మా అందర్నీ తన చుట్టూ కుర్చోమని సైగ చేసింది చందూ. ఎడ్వర్డ్ మా నలుగురికి ‘చందూ లెటర్స్’ అంటూ అందించాడు. వణుకుతున్న చేతులతో వాటినందుకొని చదవడం మొదలెట్టాము.
ప్రియమైన అమ్మా, నాన్నా, అమ్మమ్మా, తాతయ్యా,
నిన్న మీరు వెళ్ళాక, నేను మాట స్పష్టత కోల్పోయాను. అందుకే వెంటనే కూర్చుని, మీకు నేను చెప్పాలనుకున్నది లెటర్ లో రాసాను. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను దయచేసి అర్ధం చేసుకోమని ప్రార్ధన. మీ అందరి మనస్థితి నాకు తెలుసు. నేనూ కుమిలిపోతున్నాను. ఎడ్వర్డ్ తో నేను ఎంతో అందమైన భవిష్యత్తుని ఊహించుకున్నాను. మా కలలు కల్లలయ్యాయి కదా! పాపం ఎడ్వర్డ్!!……ఇక ఈ వ్యాధి వల్ల, ఎప్పుడేమౌతుందో అని భయపడుతూ, నేను కూడా కీకారణ్యంలో అంధురాల్లా ఇలా క్షణక్షణం చస్తూ జీవించలేను.
హాస్పైస్ లో రోగులని చూసాక, వ్యాధిని గురించి క్షుణ్ణంగా ఆధారాలతో సహా తెలుసుకున్నాను. ఎడ్వర్డ్ కి, గ్రాండ్-పా కి కూడా, హాస్పైస్ లోని రోగుల గురించి, వ్యాధి తీవ్రత, పర్యవసానాల గురించి పూర్తి అవగాహన కల్పించాను. సర్జరీ అయ్యాక, ఈ నెల రోజులుగా ‘డెత్ బై యూతనేషియా’ గురించి కూడా అవసరమైనదంతా తెలుసుకున్నాను.
దాన్నే ‘డెత్ విత్ డిగ్నిటీ’ అంటారు.
తిరుగులేని, నయంకాని వ్యాధితో అచేతనమౌతూ – శారీరికంగా, మానసికంగా తీవ్ర వొత్తిడికి లోనౌతున్న నాలాంటి వారికి, వైద్యుల పర్యవేక్షణలోనే – తమ జీవితాన్ని తామే అంతం చేసుకొనే వెసలుబాటు కల్పిస్తుంది – ఈ ‘డెత్ విత్ డిగ్నిటీ’’ చట్టం. కాని ఈ చట్టాన్ని, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అమలు పరుస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా, ఆ చట్టం అమలులో ఉన్న ‘ఆరగెన్’ కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని అర్ధిస్తే, ఎడ్వర్డ్, డేవిడ్ తాతగారు కూడా నా నిర్ణయాన్ని గౌరవించారు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన నాకు, కనీసం ఈ మార్గాన్ని చూపాడు దేవుడు.. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న ఈ కార్యాన్ని, డేవిడ్ తాతగారే చేపట్టి, సునాయాసంగా ఏర్పాట్లు జరిపించేస్తున్నారు.
అంతేకాక, ‘డెత్ విత్ డిగ్నిటీ ‘ చట్టాన్ని – ‘రైట్ టు డై ’ చట్టంగా – మిగతా రాష్ట్రాలు కూడా అమలులోకి తేవాలన్న కొన్ని సంస్థల పోరాటాన్ని, నా తరఫున కూడా, మా ట్రస్ట్ ద్వారా ముమ్మరం చేస్తాన్నారు ఆయన.
మతి-గతి పూర్తిగా కోల్పోయి, బ్రెయిన్-డెడ్ అయ్యాక కూడా, నన్ను హాస్పిస్ లో లైఫ్ సపోర్ట్ మీదుంచి మీరంతా బాధపడుతూండడం నేనూహించలేను. అందుకే, నేను పూర్తిజ్ఞానంతో ఉండగానే, మీ అందరి సమక్షంలో హాయిగా వెళ్ళిపోవాలని నా కోరిక. అందుకు, తేది-సమయం కూడా నిర్దారించాను. మీరు నలుగురూ పది రోజుల్లో సేలంకి వచ్చేయండి……ఏర్పాట్లన్నీ మేమే చేస్తాము…
1. అమ్మా! నీ కడుపుకోత అర్ధం చేసుకోగలను. ఐనా ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వమ్మా. ఇంతకన్నా అధ్వాన్న స్థితిలో నీవు నన్ను చూసి తట్టుకోలేవు మరి. నాకు కళ్ళు కూడా మసకబారాయి తెలుసా?
2. నాన్నా! మీ ప్రేమకి మీ చేయూతకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
3. తాతయ్య, ఎవరేమన్నా నేను మీ పోలికే. నిజం.
4. అమ్మమ్మా, నీ ఈ జాబిలమ్మ ఇక యేడాదికో మెట్టు ఎక్కనవసరం లేదు. ఇరవైయేడేళ్ళకే ఒక్క పరుగున మిగతా డెబ్బైమూడు మెట్లు ఒక్క ఉదుటున ఎక్కేసి, వెన్నెల సామ్రాజ్యంలో నక్షత్రమై, త్వరలో అక్కడి నుండి నిన్ను పలకరిస్తుందిగా! అదీ సంగతి. మీరంతా నన్ను క్షమించి, నాతో ఉంటారు కదూ!

మీ ప్రియాతి ప్రియమైన చందూ (జాబిలమ్మ)

*************

2 thoughts on “అనగనగా ఓ జాబిలమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *