May 9, 2024

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2

రచన: డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. ఏమ్ సీ ఎచ్

అనువాదం: స్వాతీ శ్రీపాద

2. మెడికల్ స్కూల్‌లో ప్రవేశం

నా స్కూల్ జీవితం పుస్తకాల్లో, అసైన్మెంట్లలో పీకల్లోతు మునిగి ఉండేదనుకుంటే మెడికల్ స్కూల్ ప్రవేశానికి నా తయారీ మరింత కఠినతరం అయింది.
నాన్న నిజామీ హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న జహీరాబాద్ బ్ర్రిడ్జ్ ప్రాజెక్ట్ కు పనిచేస్తూ ఉండడంవల్ల కుటుంబాన్ని హైదరాబాద్ కు మార్చారు. మళ్ళీ మాధ్యమం ఇంగ్లీష్ కావడం వల్ల క్లాసులో ఫస్ట్ రాడానికి రెండింతలు శ్రమపడవలసి వచ్చేది. ఆ పెద్ద సిటీలో నా కొత్త స్కూల్ నాకు బాగా నచ్చింది కాని నా హృదయం మాత్రం నా స్వస్థలం విజయవాడవెళ్ళి మెడిసిన్ చదవాలని అభిలషించేది. 12 వ తరగతిలో బాగానే చేసినా స్థానికులకు స్థానికేతరులకు అసెస్మెంట్ విధానం వేరుగా ఉండటం వల్ల, నేను 12వ తరగతి విజయవాడలో చదవకపోడం వల్ల నాకు ప్రవేశం దొరకలేదు. స్థానిక విద్యార్ధులతో పోటీ పడలేకపోయాను. నాకు స్థానికత సర్టిఫికెట్ లేకపోడం వల్ల ఇహ తప్పక గుంటూర్ మెడికల్ కాలేజీలో అప్లై చెయ్యవలసి వచ్చింది.
తీరా అప్లై చేసాక నాకు పెద్ద నిరాశ స్వాగతం పలికింది. ఆ రోజుల్లో అమ్మాయిలకు విద్యాసంస్థల్లో 33.3 శాతం రిజర్వేషన్ ఉండేది. 100 సీట్లలో 33 మంది అమ్మాయిలకు అడ్మిషన్ ఇచ్చేసారు.
“మరి మిగిలిన 0.3 అమ్మాయిల శాతం మాటేమిటి?” మా నాన్న గట్టిగా అడిగారు.
“మీ అమ్మాయి 34వ అమ్మాయి అవుతుంది గనక 0.3 శాతం ఒక ప్రవేశంగా పరిగణించలేము” అది వాళ్ళ జవాబు.
ఏడవాలో నవ్వాలో అర్ధం కాలేదు నాకు. కేవలం సాంకేతికత కారణంగా నేను సీట్ పోగొట్టుకుంటున్నానా? ఈ కోటా రవ్వంతలో చేజారిపోతున్నప్పుడు నేను విపరీతమైన నిరాశకు గురై దాన్ని భరించలేకపోయాను. ఎన్నో రోజులు ఏడుస్తూ ఉండి పోయాను. అమ్మా నాన్న నా పక్కన ఉండి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇది చాలు, సినిమా పద్ధతిలో స్లీపింగ్ పిల్స్ మింగి ఇక్కడికి జీవితం ముగిద్దాం అని కూడా అనుకున్నాను- అప్పట్లో నాకు మిగిలిన దారి అదే అనిపించింది మరి. అదృష్టం బాగుండి డాక్టర్లు నన్ను రక్షించగలిగారు. వారిలో ఒక డాక్టర్ నాకు సలహా, సహాయాలు అందించారు.
“నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు కదా? అవునా?” ఆయన అడిగాడు.
నేను తల ఊపాను.
“ఈ జీవితం అంత సులభంగా సాగిపోయేది అనుకున్నావా? కానే కాదు. సంవత్సరాలకొద్దీ శ్రమపడాలి. నీ వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుంది. నీ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకదు. రోగులతో వారి కుటుంబీకులతో వ్యవహారం. అన్నీ మంచి అనుభవాలే కాకపోవచ్చును. మెడికల్ స్కూల్‌లో ప్రవేశం దొరకనంత మాత్రాన అదే జీవితానికి ముగింపు కాదు. నువ్వు తెలివైన అమ్మాయివి, ఎన్నో సాధించగలవు. ప్రపంచాని ఎదుర్కోడం నేర్చుకో, నీ గమ్యం చేరడానికి పోరాడు. అంత త్వరగా ఓటమి ఒప్పుకోకు.” ఆయన చిరునవ్వుతో ఒక మిత్రుడిలా చెప్పాడు.
ఆ మాటలు నన్ను నవ్వేలా చేసాయి, ఎంతో బలాన్ని అందించాయి. భగవంతుడు చిన్న చిన్న వివరాలతో సహా నా జీవితంలో నన్నొక కూతురిగా, డాక్టర్ గా, భార్యగా, ఒక మంచి తల్లిగా ప్లాన్ చేసి ఉంచాడని నాకప్పుడు ఏమాత్రం తెలియదు.
మెడికల్ స్కూల్ ప్రవేశానికి కఠినమైన పరిస్థితులు, ప్రయత్నాలూ జరుగుతున్నా సీట్ పొందేందుకు అంత సమీపానికి వెళ్ళి కూడా పొందలేని స్థితిలో భావోద్వేగాలు చెప్ప తరమా? చివరికి నా స్వప్నాలు సాకారమైనది. మా నాన్న న్యాయపరమైన మార్గం ఎంచుకుని నా విషయంలో పోరాడటానికి సిద్ధమయాక… 0.3 శాతం కోటాలో న్యాయంగా నాకు దక్కవలసిన సీట్ ఇచ్చి తీరాలని వాదించాక… ఆయన కేస్ గెలిచి 1966 లో నేను విజయోత్సాహంతో పేరొందిన గుంటూర్ మెడికల్ కాలేజీలోకి ప్రవేశించాను.
మొదటిరోజు నుండే తెలుసు నాకు నేను మిగతా విద్యార్ధులకు భిన్నం అని. చాలామంది అమ్మాయిలు రంగురంగుల బట్టలు ధరిస్తే నేను తెల్ల చీరలనే ఎంచుకునేదాన్ని. ఎందరో విద్యార్ధులు టీచర్లను తప్పించుకుందుకు వెనక బెంచీల కోసం పరుగులు పెడితే నేను మాత్రం లెక్చర్ హాల్స్‌లో మొదటి బెంచీలో మొదటి సీట్ కోసం ఆత్రపడేదాన్ని. చాలామంది అమ్మాయిలు కాలేజీకి నడిచి వచ్చేవారు, నేను ఒక్కదాన్నే సైకిల్ మీద వెళ్ళేదాన్ని అదీ చీర కట్టుకుని. ఆ రోజుల్లో అబ్బాయిలతో కలిసి మాట్లాడటం సాధారణ విషయం కాదు కాని అబ్బాయిలకు పాఠాలలో, సబ్జెక్ట్‌లలో సాయపడటమే కాదు, ఏ విషయంలోనైనా సరే వెనక్కు తగ్గేదాన్ని కాదు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, నేను సాయపడేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండేదాన్ని.
నా స్నేహస్పూరిత, నిస్సంకోచ స్వభావం, ఒక్కోసారి ఆశించని, ఎదురు చూడని పరిస్థితుల్లోకి నెట్టేసేవి. వాటిల్లో ఒకటి కాలేజి ఎగ్జిబిషన్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండమనటం. నా పర్సనాలిటీకి థాంక్స్ చెప్పుకోవాలి, మెడికల్ ప్రదర్శనలో ఒకటి కానందుకు.
మరోసారి నేనొక క్లాస్‌మేట్‌తో స్నేహంగా ఉన్నానని తన సోదరిని మా అమ్మానాన్న దగ్గరకు పెళ్ళి ప్రపోజల్‌తో పంపడం. నేను గట్టిగానే నిరాకరించాను.
అందరితో ఒకే విధంగా మాట్లాడేదాన్ని, ఎవరినీ మిత్రులను మించి పరిగణించలేదు. నా చదువు, నా తలిదండ్రులు, నా రోగులు, మిత్రులకు ఇష్టంగా, ఆసక్తిగా సాయపడటం అన్నీ సమతూకంలో ఉంచుకునేదాన్ని.
ఒకసారి నా మిత్రుడొకడు చదువుకునే రోజుల్లో చెప్పాడు.
“లక్ష్మీ, నువ్వు ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్‌లా అందంగా ఉంటావని ఒప్పుకుని తీరాలి.”
అంతేకాదు ఒక అందమైన స్త్రీ చిత్రం చూపించాడు.
అది నా పట్ల నాకున్న ఒక అభిప్రాయాని మార్చేసింది. అంతవరకూ నేను పెద్ద అందగత్తెనేమీ కాదనీ అంత బాగా ఏమీ ఉండననీ అనుకునేదాన్ని. అప్పుడు నేను అన్ని విధాలా మనసా వాచా ఒక స్త్రీనని గుర్తించాను.
ఆ తరువాత సలీమ్‌ను కలుసుకున్నాను. నా జీవితమే పూర్తిగా మారిపోయింది.
మనం నేర్చుకుందుకు సిద్ధంగా ఉన్నంతకాలం జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.

3. సంఘర్షణ సమయాన విరబూసిన ప్రేమ.
వయసులో ఉన్న ప్రతి అమ్మాయిలాగే నాకూ ప్రేమ భావన, నా జీవిత భాగస్వామి ఎవరో తెలుసుకోవాలనీ అనిపించింది. ఒక యువతి ప్రేమ కోసం పడే తపన ఒక కవితగా రాసేలా చేసిందది.
నాకు అందరూ ఉన్నా,
నీ లేమి వల్ల ఎంత ఏకాకితనం అనుభవిస్తున్నాను
ప్రతి క్షణం లెక్కిస్తూ ప్రేల పక్షిలా నిరీక్షిస్తున్నాను.
నిన్ను ఆకర్షించేందుకు నేను అందంగా లేకపోవచ్చును
కాని నీతో పంచుకుందుకు ఎన్ని తేనెలూరే మాటలు
నా కోసం వచ్చీ, నన్ను గుర్తుపట్టలేక వెనక్కు మళ్ళితే
నా హృదయం ముక్కలవుతుంది.
తేనెవాకలు జనాల పాలవుతాయి
నిన్నెప్పుటికీ మర్చిపోయేలా చేస్తుంది నన్ను.
అదే జరిగితే
నేను బ్రతుకలేను
ఎప్పటికీ నీ నీడలో నన్ను సజీవంగా నిలవనీ
ఈ సప్త సముద్రాలను దాటి నిన్ను చేరుకోనీ
నీ ఒడిలో విశ్రమించనీ, నీ ఊపిరినై, నీ హృదయమై
నీలో కరిగి ఇంకిపోనీ.
నీ ఉనికి నాకు తెలుసు,
చీకటిలోనూ నువ్వు కనిపిస్తావు,
గాలిలో నీ పరిమళం ప్రవహిస్తుంది
నీ పాదాల మీద ఒక చిన్న రెల్లు పూవునవనీ
కోయిల స్వర మాధుర్యం పోగేసుకుని
నీ కోసం గానం చెయ్యనీ.
ఇవేమీ చెయ్యలేను, నాకే పుష్ప సౌందర్యమూ
పరిమళమూ లేదు.
కాని పూరెక్కలంత మృదువైన హృదయం ఉంది.
వాటి మధ్య నిన్ను దాచుకుంటానుగా.
నిన్ను పిలుస్తూ తియ్యగా పాడలేను.
కాని నా మౌన గానాన్ని నీ హృదయంతో వినవూ.
ఈ కవిత కాలేజి మాగజైన్‌లో పబ్లిష్ అయింది. కాని నా పేరు బయటకు రాడం నచ్చక కలం పేరుతో ఇచ్చాను. అయితేనేం, ఈ క్షణికమైన ఊహలను నా మస్తిష్కం వెనక్కు నెట్టేసి రాబోయే పరీక్షలు, చివరి సంవత్సరం చదువు ముందుకు వచ్చాయి.
నా చివరి సంవత్సరంలో మా “పిల్లల పుట్టుక – తల్లి ఆరోగ్యం” కింద కనీసం ఇరవై ప్రసవాలు చెయ్యాలన్నారు. మేము ఒక పక్కన మా ఈ ఎన్ టీ పరీక్షకు తయారవాలి. అది నా విధిరాతో పొరబాటో గాని, డెలివరీ రూమ్ డ్యూటీకి నాతో పాటూ సలీమ్‌ను వేసారు. డెలివరీ రూములో ప్రసవానికి వచ్చే వారికోసం ఎదురు చూస్తూ నేనూ సలీమ్ మాటలు పంచుకోడం, మా పరీక్షలకు కలిసి చదువుకోడం మొదలుపెట్టాం.
డెలివరీ సమయాల్లో సలీమ్ చాలా నిదానంగా అనునయిస్తూ, నొప్పులు పడుతున్న తల్లులు కాబోతున్న స్త్రీలను ఓదార్చేవాడు. ఆ క్షణం నుండే సలీమ్‌ను మరో కోణం నుండి చూడటం మొదలుపెట్టాను. అతను జాలిగుండె గలవాడు, పరోపకారి, చాలా శ్రమపడతాడు.
చాలాసార్లు అనుకున్నాను, “నేను అమ్మను, సలీమ్ నా బిడ్డకు, అదీ ఆడపిల్లకు నాన్న అయితే నేనెంత అదృష్టవంతురాలనో కదా” అని.
అయితే ఈ ఆలోచనలు నాకు మాత్రమే పరిమితం చేసుకున్నాను. 70 లలో ఇలాటి ఆలోచనలు రావడమే అసాధ్యం, సాంస్కృతికంగా, ఆచారపరంగా ఎంతో తారతమ్యం ఉన్న మతాలు మావి. మరోసారి నా ఆలోచనలను వెనక్కు నెట్టేసి నేనూ సలీమ్ డెలివరీ రూంలో, బయట కూడా మిత్రులుగా ఉంటూనే వచ్చాం.
మా ఫలితాలు ప్రకటించాక 110 మంది ఉన్న మా బాచ్‌లో కేవలం 17 గురు మాత్రమే పాస్ అయారు. వారిలో నేనూ, సలీమ్ కూడా ఉన్నాము. కంబైండ్ స్టడీ మంచి ఫలితం ఇచ్చిందని సలీమ్ కృతజ్ఞతలు చెప్పాడు.
సర్జరీ, మెడిసిన్, గైనకాలజీలో ఫైనల్ పరీక్షలకు మరో ఆర్నెల్లు మాత్రమే ఉంది. నేనూ పొద్దున్నే వార్డ్స్‌కి వెళ్ళి కేస్ ప్రెజెంటేషన్లు తయారు చేసేదాన్ని. వాటిని సలీమ్‌కి చూపించేదాన్ని, అది అతని వైవా పరీక్షలకు ఉపయోగపడేది, నమ్మకాన్ని ఇచ్చేది.
విజయవాడలో మా కుటుంబం ఆర్ధిక సంక్షోభంలో పడింది. నా చదువు కొనసాగించడం కష్టంగా ఉండేది. కాని ఢిల్లీలో పని చేసే మా పెద్దన్నయ్య ప్రేమ్ నా పుస్తకాలకు డబ్బు పంపేవాడు. నా ఫీజులకు వాటికీ స్కాలర్ షిప్ సంపాదించుకోగలిగాను. మా నాన్న తన సివిల్ కాంట్రాక్ట్ పనులతో వేరే ఊళ్ళు తిరుగుతూ ఉండటం వల్ల, మా అమ్మ నా ఇద్దరు మేనకోడళ్ళతో నా కాలేజీకి దగ్గరలో ఉన్న చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్ళం. విజయవాడలో మా ఇల్లు అద్దెకు ఇస్తే మా రోజు వారీ ఖర్చులకు ఆ అద్దె సరిపోయేది.
మేం ఎంత డబ్బు ఇబ్బందులు అనుభవించామంటే, ఆరేళ్ళ నా కాలేజీ జీవితంలో ఒక కప్పు కాఫీ సౌఖ్యాన్ని కూడా అనుభవించలేకపోయాను. పనిమనిషిని పెట్టుకోలేక ఇంటి పనుల్లోనూ నేను సాయం చెయ్యవలసి వచ్చేది. నాకు అయిదు చీరలు మాత్రమే ఉండేవి. అవే మార్చి మార్చి కడుతూ సెలవున్న ఆదివారం, తీరిక దొరికితే వాటిని ఉతుక్కునేదాన్ని. నా దృష్టి చదువుమీదే ఉంచడం వల్ల, ఈ కష్టాలు దాని మీద ఏ ప్రభావాన్నీ చూపలేదు.
ఆర్ధిక సమస్యలు మాత్రమే కాదు, కుటుంబ గొడవలూ ఎదుర్కోవలసి వచ్చేది.
ఒక్కోసారి మా అన్నదమ్ములు, అక్కలు వచ్చి మాతో ఉండేవారు. ఒకసారి మా పెద్దన్నయ్య అమ్మతో దెబ్బలాడి కోపోద్రేకంతో నేను సబ్మిట్ చెయ్యవలసిన నా ఫార్మకాలజీ అసైన్మెంట్ చింపేసాడు.
ఆ అసైన్మెంట్ మళ్ళీ పూర్తిగా రాయవలసి రాడమే కాదు నాకొక మెడల్ తెచ్చిపెట్టగల మెరిట్ పరీక్షను వదులుకోవలసి వచ్చింది కూడా. ఫార్మకాలజీ ఫైనల్ పరీక్ష పాసవడం నాకు ముఖ్యం.
మా తుది పరీక్షలు సమీపించేసరికి మిగతా మిత్రులతో పాటు సలీమ్ కూడా చదువుకుందుకు ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలోనే మా కాలేజీలో విద్యార్ధి సంఘపు ఎన్నికలు. సరిపోదన్నట్టు జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ పదుతున్న ఇద్దరు విద్యార్ధులు రెండు వేరు వేరు కులాలకు చెందినవాళ్ళు. ఒకరు సలీమ్ రూమ్ మేట్ మరొకరు నా మిత్రుడు. ఒక్కో సారి ఈ ఎన్నికల వేడీ ఎంతలా పెరిగిపోయేదంటే సామాజికంగా, కులాల మధ్య చిచ్చు రగిల్చేది. నేను మిత్రులను చదువుకుందుకు ఇంటికి రావద్దని చెప్పాల్సి వచ్చింది. కాని పోటీ చేస్తున్న నా మిత్రుడు ఎన్నికల విధానం గురించి చర్చించడానికి మా ఇంటికి వచ్చేవాడు.
దురదృష్టం, అతను ఎన్నికల్లో ఓడిపోయాడు. దాంతో హింసాకాండకు దారితీసి, నా మిత్రుల గ్రూప్ వాళ్ళ కోపాన్ని చూపించడానికి సలీమ్‌ను, అతని మిత్రులను కొట్టాలని పధకం వేసుకున్నారు.
అదృష్టవశాత్తూ సలీమ్ దీని గురించి వినడం, అతనికి ఎక్కడైనా దాక్కోమని మిత్రులు సలహా ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళగలడు, మా ఇంటికే వచ్చాడు. నా మిత్రుడు వస్తాడేమోనని మా అన్నయ్య అతన్ని కిచెన్‌లో దాచి ఉంచాడు. నా మిత్రుడు వచ్చాడు కూడా. నేనెంతగా ప్రాధేయపడి ఈ హింసను వదలమని అడిగినా నా మిత్రుడు వినలేదు. ఫలితంగా ఆ రాత్రంతా సలీమ్ మా ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. ఏదేమైనా నేను సలీమ్ పక్షం వహించి అతనికి అండగా ఉండాలని నాకు తెలుసు.
చదువుకోసం చాలామంది అబ్బాయిలు ఇంటికి వచ్చినా సలీమ్ మాత్రం మిగతా వారికన్న ప్రత్యేకం అని అమ్మ ఎలాగో పసిగట్టింది. అతనితో కంబైండ్ చదువు వద్దని నన్ను హెచ్చరించింది. కాని తమ్ముడు మాత్రం కాస్త వివేకంతో ఆలోచించి కల్సి చదువుకుందుకే అతను వస్తున్నాడనీ, అందులో తప్పులేదనీ అమ్మకు నచ్చజెప్పాడు.
చదువులో ఎంతగా మునిగిపోయే వారమంటే నాకు తెలీకుండానే సలీమ్ జేబులో నాపెన్నో, కర్చీఫో ఉంచేదాన్నట, చాలా ఏళ్ళ తరువాత చెప్పాడు సలీమ్.
మా ఫైనల్ పరీక్షలు వచ్చేసాయి. నేనూ సలీమ్ చాలా బాగా చేసాం. నా క్లాసులో మొదటి అయిదుగురిలో నేనూ రాగలిగాను. మేమ్ మా ఇంటర్న్ షిప్ మొదలుపెట్టాం. వేరు వేరు ఆసుపత్రుల్లో మమ్మల్ని వేసినా రోజు కలుసుకుని ఆసక్తి గల కేసుల గురించి చర్చించుకునేవారం. ఎమర్జెన్సీ ఆపరేషన్లకు కలిసి వెళ్ళేవాళ్ళం. ఇద్దరికీ సర్జన్లమవ్వాలని ఎంతో ఆసక్తి మరి.
మా అమ్మ త్వరలోనే నాన్న దగ్గరకు వెళ్ళిపోయింది. నేను వెళ్ళి పెద్దక్కతో ఉండటం మొదలుపెట్టాను. కాని వాళ్ళిల్లు హాస్పిటల్‌కి చాలా దూరం కావడంతో, నేను రోజూ సైకిల్ మీద వెళ్ళవలసి వచ్చేది.
ఒక రోజు సలీమ్ ఎందుకో కొంచం కలవరపాటుతో వచ్చాడు.
కాస్సేపు తటపటాయించి, ” లక్ష్మీ! హాస్పిటల్‌కి సైకిల్ మీద రాడం మానేస్తే బాగుంటుంది” అన్నాడు.
నేను ఆశ్చర్యపోయాను.
“ఎందుకు? ఏమైంది?”
“జనాలు నీ గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్ చెయ్యడం నాకు నచ్చలేదు.” అతను ఆదుర్దాగా అన్నాడు.
నేనెప్పుడు కామెంట్స్‌ను పట్టించుకునే రకం కాదు. మనమీద మనకు నమ్మకం ఉన్నంతవరకు జనం ఏమైనా అనుకోనీగాక అనేది నా మతం.
కాని సలీమ్ ఆదుర్దా నిజాయితీగా అనిపించింది. అందుకే సైకిల్ వాడకం వెంతనే మానేసాను. ముఖ్యంగా అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక.
చాలా దూరంగా ఉండటం, దారి ఖర్చులు పెట్టుకోలేకపోడం వల్ల సాయంత్రం రౌండ్స్ అయ్యాక నాతో పాటు రమ్మని సలీమ్‌ను అడిగాను. పేష్ంట్ల గురించి చర్చిస్తూ, ఏవేవో మాట్లాడుకుంటూ రైల్వే ట్రాక్ వెంట నడిచేవాళ్లం. ఒక్కోసారి నాతో పాటు ఇంట్లోకి వచ్చి మా అక్కయ్య కుటుంబంతో సమయం గడిపేవాడు.

” ప్రేమకు సరిహద్దులు లేవు. అది విశ్వజనీనం. స్నేహం, అప్యాయత, ప్రేమ, లైంగికత ఏమిటో తెలుసుకోవాలి.”

ఇంకా వుంది…

1 thought on “స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *