May 9, 2024

లోపలి ఖాళీ – తపస్సు

రచన: రామాచంద్రమౌళి

మళ్ళీ అదే దృశ్యం.
రాత్రి ఎనిమిది ముప్పై నిముషాలు.. డైనింగ్ టేబుల్.. నాన్న అబ్రహం.. అమ్మ అరుంధతి.. అక్క ఎలిజబెత్.. అన్న రామ్మోహన్.. సుశీల అనబడే నేను.. అందరమూ నిశ్శబ్దంగానే భోజనం చేస్తున్న ‘ డిన్నర్ ’ సందర్భం. హైదరాబాద్ లోని డి ఆర్ డి ఎల్ ల్యాబ్ లో సైంటిస్ట్గా పని చేస్తున్న నాన్న ఆ రోజే భారతదేశపు ఆర్మీలో యుద్ధసమయంలో అత్యంత కీలకమైన రాత్రి వేళల్లో రాడార్ సిస్టంలో పనికొచ్చే ఒక ప్రత్యేకమైన సెన్సర్ ను తన టీం డిజైన్ చేసిన విజయం గురించీ, దేశ ప్రధానమంత్రి నుండి పొందిన ప్రశంస గురించీ చెబుతున్నప్పుడు.. ఆయన ముఖంలోని వెలుగునూ.. తృప్తినీ.. ఒక విజయాన్ని సాధించినపుడు ఒక వ్యక్తి పొందే అద్భుతమైన ఆత్మానందాన్నీ గమనిస్తూ పొంగిపోతున్న తరుణంలో.. అన్నాడు మళ్ళీ అదే వాక్యం.
‘‘నాన్నా.. మీలో ఎవరూ ‘ జీనియస్ ’ కారురా. అదే నన్ను ఎప్పుడూ వేధిస్తూంటుంది ’’ అని.
జీనియస్.. జీనియస్.. జీనియస్.
ఏమిటి ‘జీనియస్’ అంటే. డిక్షనరీ అర్థం జీనియస్ అంటే.. కౌశలమైన బుద్ధి గలవాడు.. మేధావి.. కుశాగ్ర బుద్ధి కలవాడు.. ఇలా.
అక్క ఎలిజబెత్.. అప్పటికే పి. జి లో బంగారు పతకాన్ని సాధించి డిల్లీలోని జె ఎన్ యు లో లెక్చరర్ గా పని చేస్తోంది. అన్న రామ్మోహన్ ఎం.టెక్.. మెకానికల్ ఇంజనీరింగ్.. ప్రొడక్షన్ టెక్నాలజీ లో రోబట్స్ రంగ స్పెషలిస్ట్. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, గురుగాం లో పని చేస్తున్నాడు. ఇక తను.. సుశీల.. ఉస్మానియాలో సైకాలజీలో పి.జి చేసి.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో పి.హెచ్ డి లో అడ్మిషన్ ను సాధించి ఇక పది రోజుల్లో చేరబోతోంది. ఈ సీట్ దక్కడం ఒక అద్భుతమైన విజయమే. అంత సుళువైన విషయం కాదు 1740 లో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేత స్థాపించబడ్డ అమెరికాలోని ఆధ్యాత్మిక నగరం ఫిలడెల్ఫియాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో డాక్టోరల్ సీట్ సంపాదించడం. తమ కుటుంబం చుట్టూ ఉన్న అనేకమంది ప్రముఖులు ఈ విజయాలను సాధిస్తున్న తమ ముగ్గురిని చూచి వాళ్ళ వాళ్ల కుటుంబాల్లో ఒక ఉదాహరణగా ఉటంకిస్తూ ప్రశంసిస్తూంటారు బహిరంగంగానే. కాని నాన్న మాత్రం.,
‘మీలో ఏ ఒక్కరూ జీనియస్ కాదురా ’ అని అనడం మాత్రం మాననే లేదు.
అసలు ‘ జీనియస్ ’ అంటే నాన్న దృష్టిలో ఏమిటి.. మమ్మల్ని ఏ ‘ ఐన్ స్టిన్ ’ తోనో పోల్చి అతనంత ఎత్తుకు ఎదగలేదు అని కించపర్చడమా.. లేదా అతనంత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించడమా.
ఆ విషయమే అడిగేదాన్ని నేను ధైర్యంగా.. సూటిగా నాన్నను.
అప్పుడాయన చిద్విలాసంగా, ముఖంనిండా బ్రహ్మవర్చస్సుతో నవ్వుతూ.. ‘‘నువ్వే అర్థం చేసుకో బిడ్దా’’ అని ఒక ఆశీః పూర్వక దృక్కును సారించి లేచి వెళ్ళిపోయేవాడు అక్కడినుండి.
ఆ సందర్భం కంట్లో పడ్ద నలుసులా.. మనసులో నాటుకున్న ముళ్ళులా.. అప్పుడే ఎవరో రగిల్చిన అగ్నిలా దహించేది నన్ను.
‘దహించబడ్తున్న అరణ్యంలో నేను… దహించబడ్తున్న నాలోనే ఒక అరణ్యం ’
ఆ స్థితిలో అడుగు పెట్టాను యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా లో.
పెన్న్.. ఒక జ్ఞాన ప్రపంచం.. ‘ ది కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ’ లో.. మొత్తం అత్యాధునికమైన 60 కోర్స్ లు. అందులో ఒకటి నా ‘ సైకాలజీ’ కోర్స్. ఫిలాసఫీ కూడా నా అభిమాన విషయం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బిజినెస్ కాలేజ్ ‘ వార్టన్ స్కూల్ ’ లో 30 కోర్స్ లు మేనేజ్మెంట్ సైన్స్ లో. పెన్న్ ఇంజనీరింగ్ లో 10 కోర్స్ లు.. అసలా ప్రాంగణమే ఒక జ్ఞాన ఖని. అంతా విద్యా సుగంధం.
ఇక ప్రారంభించాను ప్రయాణాన్ని.. నాన్న పదే పదే అంటున్న ‘ జీనియస్ ’ ను కావాలని.
ఇంటర్ రిలిజియస్ వివాహం చేసుకున్న నాన్న అబ్రహం.. అమ్మ అరుంధతిల వల్ల పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో పుట్టి అటు క్రిస్టియన్ మత గ్రంథాలనూ, ఇటు హిందూ మహా చతుర జ్ఞాన సంహితలైన వేదాలూ, ఉపనిషత్తులూ, ఋక్కులూ, ఇతిహాసాలూపురాణాలూ, వాటి భాష్యాలూ, వ్యాఖ్యలూ.. ప్రబంధ తర్క శాస్త్రాలూ ఇవన్నీ అధ్యయనం చేసిన నాకు ఇప్పుడు అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రసిద్ధ సామాజిక విశ్లేషకులనూ, వ్యక్తిత్వ వికాస రచయితల హృదయాలనూ, ప్రముఖ సైకాలజిస్ట్ లనూ అధ్యయనం చేసే భాగ్యం కలిగింది.
1883 నుండి 1970 వరకు జీవించిన ‘ నెపోలియన్ హిల్ ’ రాసిన ‘ థింక్ అండ్ గ్రో రిచ్ ’,
1888 నుండి 1955 వరకు జీవించిన డేల్ కార్నిన్ రాసిన ‘ హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై పబ్లిక్ స్పీకింగ్ ’,
1932 నుండి 2012 వరకు బ్రతికి కార్పొరేట్ మేనేజ్ మెంట్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసిన స్టీఫెన్ ఆర్ కోవె రాసిన ‘ది సెవెన్ హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’, ‘ది ఎత్ హాబిట్’, ‘ది లీడర్ ఇన్ మి’,
1947 లో జన్మించి ఇంక బతికే ఉన్న పీటర్ ఎం సింగె రాసిన ‘ది ఫిఫ్త్ డిసిప్లైన్’.. ఈయనను కలిశాను కూడా నేను మూడు సార్లు.
2003 లో ప్రచురించబడి 1000 వ్యూహాత్మక సూచనలతో మెదడును ఎలా చురుగ్గా ఉంచుకోవాలో చెప్పిన, లక్షల కాపీలను విక్రయించిన మగ్గీ గ్రీన్ వుడ్- రాబిన్ సన్ పుస్తకం ‘20/20 థింకింగ్’.. ఆమెతో మూడుసార్లు ముఖతః సంభాషించడం.,
వాళ్ళ గ్రంథాలు.. వాళ్ల బోధనలు.. వాళ్లు ఈ తరానికి చూపిన బాటలు.. ఇవన్నీ నన్ను ఒక అనంతమైన తపో ముద్రలోకి నడిపించాయి.
భారత సంతతికి చెందిన నాలోని ఆది విద్యలైన మెడిటేషన్, ధ్యానం, ప్రార్థన, యోగా.. వీటికి తోడు.. ఈ ప్రాచ్య మేధో ఉన్నతి తాలూకు అధ్యయనాలు.. అన్నీ కలిసి.. నాన్న చెప్పిన ‘ జీనియస్ ’ గా పరివర్తిస్తూ నన్ను కొత్త ఉన్నత శిఖరాలవైపు నడిపించడం మొదలెట్టాయి. నాదైన ఒక నూతన దృష్టితో.. నా మార్గాన్ని అన్వేషించుకుంటూనే కొత్త అడుగులను.. కొత్త దిశలో.. బలంగా, స్థిరంగా వేయడం ఆరంభించాను.
ఆ క్రమంలో నేను కలిసింది వందలమంది కార్పొరేట్ మేనేజర్లను, ఎగ్జిక్యూటివ్స్ ను. సమాచారం సేకరించింది ఎందరో రచయితలూ, విద్యావేత్తలూ, ఆలోచనాపరులనుండి. చదువు.. డాక్టరేట్.. పోస్ట్ డాక్టరేట్.. అంతిమంగా.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా లో ప్రతిష్టాత్మకమైన ‘ ప్రొఫెసర్ ’ ఉద్యోగం.. ఇవీ సాధించింది ఈ కొన్నేళ్ళలోతను.
ఐతే గత వారం జరిగిందొక అనూహ్య అద్భుతం.
నా సకల శక్తులనూ, బుద్ధి కుశాగ్రతనూ, మేధో సంపత్తినీ క్రోడీకరించి రాసిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం ‘ది పవర్ ఆఫ్ పాషన్ ’ ఒక్క వారంలోపలే ఒక మిలియన్ ప్రతులు అమ్ముడుపోయి.. ఒక రికార్డ్ సాధించగా.. ఆ పుస్తకం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ మాక్ ఆర్థర్ ’ పురస్కారాన్ని పొందడం.
ఈ ‘ మాక్ ఆర్థర్ పురస్కారం ’ ఎంతో విశిష్టమైంది. దానికి రచయితగానీ, ఏ ప్రతిభాశీలిగానీ అప్లై చేసుకోవడమో, పైరవీలూ చేసిగానీ, ప్రభావితం చేసిగానీ పొందే అవార్డ్ కాదు. అత్యంత గోప్యంగా ఒక నిపుణుల కమిటీ ఈ పురస్కారంకోసం వ్యక్తిని వెదికి ఎంపిక చేస్తుంది.
ఈ పురస్కారం విలువ 6, 25, 000 డాలర్లు. అంటే దాదాపు 4, 0625, 000.. నాలుగు కోట్ల రూపాయలకు పైననే.
ఇప్పుడు నేను ‘ జీనియస్ ‘ నేనా.
వ్చ్.. ఏమో నాన్నను అడగాలి.
***
ఏర్పోర్టులో విమానం దిగగానే పట్టరానంత సంతోషంతో. మహోద్వేగంతో ఒబెర్ టాక్సీలో చాంద్రాయణ గుట్టలో ఉంటున్న ఇద్దరే.. అమ్మా, నాన్న దగ్గరికి పరుగు పరుగున వెళ్లేసరికి.. అప్పటికే నేను వస్తున్న వార్త తెలిసిన కుటుంబ మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను అభినందించేందుకు పుష్ప గుచ్ఛాలతో సిద్ధంగా ఉన్నారు. ఒక అరగంటసేపు హడావిడంతా కొనసాగి.. అంతా సద్ధు మణిగిన తర్వాత.. ఇక మిగిలింది ఒక్క అమ్మా.. నాన్నే.
విషాదమేమిటంటే.. నాన్న అప్పటికే ఎనిమిది సంవత్సరాలుగా ‘పార్కిన్ సన్’ దీర్ఘవ్యాధితో యుద్ధం చేస్తున్నాడు. పోరాటం చేసీ చేసీ చాలా అలసిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది ఆయన ముఖంలో.
నా సంతోషంకోసం.. ఉద్వేగభరిత ఆనందం కోసం.. నాన్నకు నా ‘ పవర్ ఆఫ్ పాషన్ ’ పుస్తకంను ప్రశాంతంగా వాక్యం తర్వాత వాక్యం అంతా వినిపించాను ఓపికగా. దాదాపు నాలుగు గంటలు. ఆయన కుర్చీలో కదలకుండా కళ్ళుమూసుకుని నాలుగ్గంటలూ వింటూ ఉండిపోయాడు. ఆయనకు పుస్తకమంతా అర్థమయ్యిందా.. లేదా.. అసలాయన మానసిక స్థితి ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. కాని ఏకాగ్రచిత్తంతో అంతా విన్నట్టుమాత్రం నాకు బోధపడిరది.
కాని చివరికి.. చదవడం అంతా అయిపోయిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి.. ప్రసన్న వదనంతో ‘ ఐయాం ప్రౌడాఫ్ యు’ అని ప్రతి అక్షరాన్నీ అతి కష్టంగా ఒత్తి ఒత్తి పలుకుతూ.. నావైపు అతి ప్రశాంతంగా చూశాడు.
ముఖం నిండా శాశ్వతానందం తొణికిసలాడుతూండగా తలను పంకించి.. ఒక చిద్విలాసమైన చిరునవ్వు కూడా నవ్వాడు. ఆయన కళ్ళలోనుండి ఎందుకో జలజలా కొన్ని కన్నీళ్ళు జారాయి.
అప్పుడర్థమైంది నాకు ‘ జీనియస్ ’ అంటే ఏమిటో.

***

1 thought on “లోపలి ఖాళీ – తపస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *