May 4, 2024

ప్రాయశ్చిత్తం – 4

రచన: గిరిజారాణి కలవల

ఆలోచనల నుండి బయటకి వచ్చి చుట్టూ చూసాడు. పార్క్ లో జనం పల్చబడ్డారు.
చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి.తను కూడా లేచి ఇంటి దారి పట్టాడు.
పార్క్ లో ఇందాక విన్న మాటలే చెవిలో గింగిరాలు తిరుగుతున్నాయి. అన్యమనస్కంగా కారు నడుపుతున్న సురేంద్ర ఆలోచనలకి , ఫోన్ రింగ్ బ్రేక్ వేసింది. తనతో పాటు పని చేసే రమణ వద్ద నుంచి ఫోన్.
లిఫ్ట్ చేసి, “ హలో! రమణా! చెప్పరా?” అన్నాడు.
“హలో! సురేంద్రా! ఎక్కడున్నావురా? ఓసారి ఇంటికి రాగలవా? నేను, ఫేమిలీతో కలిసి రేపు మార్నింగ్ ఫ్లైట్ కి ఇండియా వెడుతున్నాను. మళ్లీ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. నీతో కొంచెం పనుంది.” అన్నాడు రమణ.
“ఓ! ఔనా! పదినిమిషాల్లో వస్తాను.” అంటూ కారుని రమణ ఇంటి వేపు మళ్ళించాడు సురేంద్ర.
ఇంత అర్జంటుగా ఇండియా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో? అనుకున్నాడు.
సరిగ్గా పదే నిముషాలలో రమణ ఇంటి ముందు కారు ఆపి కాలింగ్ బెల్ కొట్టాడు సురేంద్ర.
రమణ కూతురు శిల్ప వచ్చి తలుపు తీసి, “రండి, అంకుల్! నాన్న రూమ్ లో వున్నారు వెళ్ళండి.” అంది.
శిల్ప తన కూతురు విన్నీ ఈడుదే. కానీ ఇద్దరిలోనూ హస్తిమశకాంతరపు తేడా వుంది. రమణ అతని భార్య విజయ ఇద్దరూ కూడా పిల్లలని చాలా పద్ధతిగా, తీరువుగా పెంచుతారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలని పాటిస్తూ, పిల్లల్లో కూడా వాటిని ప్రతిబింబించేలా చూడడం సురేంద్రకి ఎంతో ముచ్చట కలిగిస్తుంది. రమణ పిల్లలిద్దరూ కూడా తెలుగుభాషలోనే మాట్లాడడం, శాస్త్రీయ సంగీతం, కూచిపూడి నృత్యం ఇటువంటి కళలలోనే కాకుండా ప్రావీణ్యం సంపాదించారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తూనే వున్నాడు.
విన్నీకి కూడా చిన్నతనంలో సంగీతం నేర్పిద్దామని తెగ ముచ్చటపడ్డాడు. కానీ సురేంద్ర ఉత్సాహానికి ఉదయ మొదట్లోనే నీరు కార్చేసింది. “మనం ఇప్పుడు అమెరికాలో వుంటున్నాము. ఆ సాపాసా సరిగమలు ఇప్పుడు ఎవరూ మెచ్చుకోరు.” అంటూ సురేంద్ర ఏది నేర్పించాలని అనుకున్నా కూడా ఆపోజిట్ గానే మాట్లాడేది. విన్నీ కూడా దేనికీ ఇంట్రెస్ట్ చూపించేది కాదు. దాంతో సురేంద్ర ఇక ఏమీ అనేవాడు కాదు.
అసలు రమణ కుటుంబం అన్నా కూడా ఉదయకి చిన్నచూపే. విజయ ఏదైనా పేరంటానికో, పూజకో పిలిచినా రావడానికి ఉదయ ఇష్టపడేది కాదు. తన అభిరుచులకి, తన స్టేటస్ కి విజయ తగినది కాదనదేది ఉదయ అభిప్రాయం.
కానీ, సురేంద్ర మాత్రం రమణ కుటుంబంతో ఆత్మీయతని పెంచుకున్నాడు. అప్పుడప్పుడు విజయ చేతి భోజనం తింటూ… ఎప్పుడో చిన్నతనంలో తన మేనత్త చేసిపెట్టే భోజనం తలుచుకునేవాడు.
సురేంద్ర గదిలోకి వెళ్ళేసరికి సూట్కేస్ సర్దుతూ విజయ, రమణ కనిపించారు.
“ఏంటి రమణా! ఇంత సడెన్ గా ప్రయాణం ఏంటి? మీ ఇంట్లో అందరూ కులాసాయే కదా?” భుజం మీద చెయ్యి వేసి అడిగాడు సురేంద్ర.
వెంటనే సురేంద్రని కావలించుకువి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రమణ. అటు విజయ కూడా చీర చెంగుతో చెమర్చిన కనులని అద్దుకుంటోంది.
జరగరానిదేదో జరిగిందని అర్థం అయింది సురేంద్రకి.
“ఏమైందిరా?” చిన్నగా అడిగాడు.
“నాన్న… నాన్న ఇక లేరట. అన్నయ్య ఫోన్ చేసాడు.” చెప్పాడు రమణ.
ఆ మాట వినగానే నిశ్చేష్టుడయ్యాడు సురేంద్ర.
“అయ్యో! ఎలా జరిగింది? సుస్తీ చేసినట్టు కూడా నువ్వేమీ చెప్పలేదే? ఇంత సడెన్ గా ఇలా ఎలా అయింది?” అన్నాడు.
“అనారోగ్యం ఏదీ లేదు అన్నయ్యా! నిద్రలో హార్ట్ఎటాక్ వచ్చిందట. ముందు రోజు సాయంత్రం వాకింగ్ కి వెళ్లి వచ్చారట. రాత్రి మామూలుగా తినేదే పుల్కాలు తిని, టివీలో న్యూస్ అవగానే పడుకున్నారట. ఏమాత్రం ఏదీ అనుమానం లేదట. తెల్లవారుజామున ఐదింటికి యోగాకి లేవకపోయేసరికి బావగారు వచ్చి లేపారట. ఎంత లేపినా లేవకపోయేసరికి, అనుమానం వచ్చి, వీథి చివరిలో వుండే డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపించారట. అప్పటికే ప్రాణం పోయి ఐదారు గంటలు అయుంటుందని చెప్పారట.” అంది విజయ.
“నాన్నని వచ్చే నెల ఇక్కడకి తీసుకువద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు.” రోదించసాగాడు రమణ.
“ఊరుకోరా! ఇలా అవుతుందని నువ్వు మాత్రం అనుకున్నావా? ఆయనకి ఇంతవరకే రాసిపెట్టి వుంది. ఇప్పుడు మరి ప్రయాణం అవుతున్నావు. ఓకే… నువ్వు ఇండియా వెళ్ళడం, రావడం…నీ వీసాకి ఇబ్బంది అవుతుందేమో ఆలోచించావా? పైగా పిల్లలని కూడా తీసుకెడుతున్నావు. తిరిగి రావడానికి వీసా లేటయితే… వాళ్ళ చదువులకి ఇబ్బంది అవుతుందేమో? అయినా, అక్కడ మీ నాన్నగారి కర్మకాండలు చేయడానికి మీ అన్నయ్య వున్నారు కదా? వీటికి పెద్దకొడుకే ముఖ్యం.” అంటున్న సురేంద్ర వేపు వింతగా చూసాడు రమణ.
“ఏంట్రా నువ్వు అనేది? అక్కడ నాన్న చనిపోయారురా? జన్మనిచ్చిన తండ్రిరా! ఆఖరిసారి ఇప్పుడు చూడక పోతే జీవితాంతం నా మనసులో ముల్లు గుచ్చుకున్నట్టే వుంటుంది. అదీకాక తండ్రి కర్మకాండలలో పాలు పంచుకోని కొడుకు వంటి కృతఘ్నుడు మరొకడు వుండడు. అన్నయ్యతో పాటు నాకూ ఆయన నాన్నే అవుతారు. ఈ రోజు నేను ఇంతటి స్టేజ్ లో వున్నానంటే ఆయనే కారణం.” రమణ అన్న ఆ మాటలు సురేంద్రకి ఛళ్ళున తగిలాయి.
సిగ్గుతో తలదించుకున్నాడు.
“వీసా తేడా వస్తే అక్కడే వుండిపోతాము అన్నయ్యా! అలాంటి పరిస్థితే వస్తే పిల్లల చదువులు ఇండియాలోనే కంటిన్యూ చేస్తారు. అవన్నీ ఆలోచించే ప్రయాణం అవుతున్నాము. అందుకే మళ్లీ ఎప్పుడు రిటర్న్ వస్తామో అని, ఇంటి తాళాలు మీకు ఇస్తే మీరు చూస్తూంటారని మిమ్మల్ని రమ్మన్నారు ఈయన. ఈ బేగ్ కూడా మీ దగ్గర జాగ్రత్త పరచండి. మా వీసా స్టాంపింగ్ అయితే తిరిగి వచ్చాక తీసుకుంటాము. లేదంటే మీరు ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు తీసుకు వస్తే అక్కడ తీసుకుంటాము.” అంటూ విజయ, సురేంద్ర కి ఒక లెదర్ బేగ్ అందించింది.
“రేపు ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఎయిర్ పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను.” అన్నాడు సురేంద్ర.
“వద్దు వద్దు… మేము కేబ్ చేసుకుని వెళ్ళిపోతాము. ఫర్వాలేదు. ఇండియా చేరాక, ఫోన్ చేస్తాను.”
రమణ మాటలకి సరేనంటూ, జాగ్రత్త అని చెప్పి, బయటకి వచ్చి కారు ఎక్కాడు.
దారి పొడవునా రమణ మాటలే… గుర్తు రాసాగాయి.
కన్నతండ్రి చనిపోతే వెళ్ళని కొడుకుని మించిన కృతఘ్నుడు మరొకడు వుండడు. ఔను… తన వంటి కృతఘ్నుడు మరొకడు వుండడు. తెలీకుండానే సురేంద్ర కళ్ళనుంచి ధారాపాతంగా ఆశ్రవులు కారసాగాయి.
సశేషం.

1 thought on “ప్రాయశ్చిత్తం – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *