May 4, 2024

సినీబేతాళ కథలు – 1. ఓవర్ నటేశన్

రచన: డా. వివేకానందమూర్తి

‘కాస్త చూసి నడువు విక్రా!’ అన్నాడు బేతాళుడు.
విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు.
‘అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్.టి.సి బస్సు, దానికి ఎన్టీ రామారావైనా ఒకటే. ఎకస్ట్రా నటుడైనా ఒకటే.’
విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్తపడ్డాడు. “విక్రా! నీకు ఆయాసం రాకుండా ఉండగలందులకు ఈ వారం – అప్పుడయితే ఓ డబ్బింగు చిత్రంలో హెవీ సీన్లు చెప్తాను.” అంటూ మొదలెట్టాడు. – “ఓ భట్టి విక్రమార్క మహారాజా! విను, అనగనగా ఓ నటేశన్ ఉన్నాడు. ‘ఓ’ అంటే ఒక అని అపోహపడకు. ‘ఓ’ అంటే ఇంగ్లీషులో ‘O’ అతని ఇంటి పేరు. పూర్తి పేరు ఓవర్ నటేశన్. హహ్వహ్వ! అవును రాజా! ఓవర్ నటేశన్ ‘అనగనగా ఒక తల్లి’ అనే నే చెప్పబోయే తమిళ డబ్బింగు చిత్రంలో హీరో. నా డైలాగ్ డెలివరీ వేరేగా ఉందని భావిస్తున్నావా బాబా! చెప్పేది డబ్బింగు చిత్రం గూర్చి కనుక డబ్బింగు భాషే వాడుతున్నాను, వీరుడా చెవులు పెట్టి విను. చిత్రంలో అర్ధరాత్రి అంతా భయంకర చీకటి. అయితే నిశ్శబ్దం మాత్రం లేదు. తమిళ డబ్బింగ్ కాబట్టిబ్యాగ్రౌండ్లో అరవదేశంలో గుడ్లగూబ ‘బా’ అని అరుస్తూ ఉంటుంది. హీరో ఓవర్ నటేశన్‌కి మేడమీద గదిలో ఎంత దొర్లినా నిద్రపట్టలేదు ఒక్కసారి ‘ఓ ఆం’ అని అరిచి లేచాడు. లేచి ‘ఓ దుప్పటీ! నా నిద్రకి నేడు సహాయకారి కాలేకపోయావే పైత్యకారీ’ అని దుప్పటిని పట్టుకుని, పరపరా పది ముక్కలుగా చింపేశాడు. చింపేసిన ముక్కలన్నీ మెళ్ళో వేసుకుని ‘ఓ దుష్ట మంచమా నాకీ రోజు నిద్రని ప్రసాదించలేకపోయావే. ఓ సుఖమీయని చెక్క వస్తువా? ఆయ్ – అహహ్వ’ అని మంచం కోళ్ళన్నీ చేత్తో విరిచేసి, వికటాట్టహాసం చేస్తూ కోళ్ళు విరిగిన మంచాన్ని మధ్యకి – ఓ గుద్దుగుద్దిరెండు ముక్కలు చేసేశాడు. గది బైటకి వచ్చాడు. మేడమీంచి దిగువకున్న మెట్ల వరసని చూసి ‘ఉహూహ్వ’ అని మళ్ళీ నవ్వి, మెట్లమీంచి దిగకుండా, సైడునున్న నున్నటి ఉడ్వర్కు మీద గుర్రం మీద కూర్చున్నట్టు కూర్చుని క్రిందకి జారాడు. నేరుగా తల్లి నిద్రోతున్న గదిలోకి వెళ్ళి ‘అమ్మా! ఓ తల్లీ!’ అని అరుస్తూ ఆమెను నిద్రలేపాడు.
ఆమె ‘ఏరా నా ముద్దు బిడ్డా ఏమయిందిరా! వాగరా వాగు’ అంటూ ఆప్యాయంగా లేచింది.
‘రా అమ్మా! రా!’ అని తల్లిని చెయ్యి పట్టుకుని వంటింట్లోకి బరబరా లాక్కుపోయాడు. లైటు వేశాడు. లైటు వెలిగింది కానీ స్విచ్ చేతిలోకి ఊడొచ్చేసింది. దాన్ని గుప్పిట్లో బిగించి, పొడిచేసి గుప్పిట తెరిచి ఆ పొడిని ఉఫ్మని ఊదేసి తల్లికేసి చూశాడు.
తల్లి ‘ఏమిరా! ఏమి నీ ఆత్రుత. నేను కన్న నా సొంత బిడ్డా చెప్పరా!’ అనడిగింది. ఓవర్ నటేశన్ ‘చూడమ్మా’ అని చొక్కా విప్పేసి భుజం మీద వేసుకుని, కుడిచేత్తో తన పొట్టమీద, ‘ఛపట్ – ఛపట్’ మని కొట్టుకుని – ‘అవునూ – అమ్మా నువ్వు నా కన్నతల్లివే అయితే వేగిరమే ఒక బాల్చీడు సాంబారు కాచమ్మా. నువ్వు ప్రేమతో కాచిన ఆ ప్రేమ సాంబారుతో ఈ రాత్రే నేనీ ఉదరాన్ని నింపాలమ్మా. అయ్యో ఓ రామా! సాంబారు, సాంబారు!’ అని వంటిల్లంతా తిరిగి తిరిగి ఆయాసపడ్డాడు. అప్పుడతని
పొట్ట బాణం తగిలిన రాబందు పొట్టలా ముందుకీ వెనక్కీ ఊగింది. వెంటనే తల్లి – ‘హారిబిడ్డా! నా పొట్టన పుట్టిన నా బిడ్డ పొట్ట ఆకలితో ఆక్రోశించవలిసిందేనా మురుగా ఉండు. శీగ్రమే సాంబారు చేస్తాను’ అని వెనువెంటనే సాంబారు తయారుచేసింది.
ఓవర్ నటేశన్ బాల్చీడు సాంబారూ రెండు చేతుల్తో బాల్చీని ఎత్తిపట్టుకుని, చంటిపిల్లాడు పాలు తాగినట్టు, గడగడా తాగేసి ‘బ్రేవ్’మని త్రేన్చి, డ్రెస్సులున్న గదిలోకి వెళ్ళాడు. సూటు వేసుకుని హాల్లో సోఫాలో మధ్య కొచ్చి తల్లితో – ‘అమ్మా! అప్పుడయితే నువ్వు నా తండ్రి భార్యవే అయితే నన్నిప్పుడే దొడ్డ చదువులకి విదేశాలు పంపమ్మా’ అనడిగాడు.
తల్లి ‘తప్పకుండా పో కొడుకా. విదేశాలు పోయి వింత మనిషివై తిరిగిరా’ అని ఆశీర్వదించి ఓవర్ నటేశన్ని ఫారిన్ తోలింది.
కొన్నాళ్ళ తర్వాత ఓవర్ నటేశన్ ఓవర్ కోటు వేసుకుని తిరిగి వచ్చాడు. ఇంటి దగ్గర కారు దిగి గేటు తెరుచుకుని బరువుగా అడుగులు వేస్తూ లోపలికి నడుస్తున్నాడు. నడుస్తూ చేతివేళ్ళతో కోటు బొత్తాన్ని మెలి తిప్పడం ప్రారంభించాడు. ఇంటి గుమ్మంలోకి రాగానే హఠాత్తుగా ఆగిపోయాడు. ఎందుకంటే బొత్తం తెగిపోయి చేతిలోకి ఊడొచ్చేసింది.
ఇంతలో అతని తల్లి ఎదురొచ్చింది. వచ్చి – ‘ఒరే నా బిడ్డా నీ దేశానికి మళ్ళీ తిరిగొచ్చావా నాయనా! రారా రా, నీ కాళ్ళతో నడిచి శీఘ్రమే లోపలికి రా!’ అంది.
ఓవర్ నటేశన్ మారుమాట్టాడకుండా – ‘సూది ఉందా అమ్మా?’ అనడిగాడు. వెంటనే తల్లి భోరుమని ఏడుపు ప్రారంభించింది. హీరో మళ్ళీ – ‘సూది ఉందా తల్లీ?’ అనడిగాడు. తల్లి మళ్ళీ తలబాదుకుంటూ ఏడ్చింది. కాస్సేపయ్యాక ఏడుపు ఆపుకుంటూ – ‘బిడ్డా సూదయితే ఉంది గానీ దాని మొన విరిగిపోయింది బాబూ!’ అని మళ్ళా ఏడిచింది.
వెంటనే ఓవర్ నటేశన్ ఠక్కున వెనక్కి తిరిగాడు.
‘బిడ్డా’ అని అరిచి తల్లి అతని కాలు పట్టుకుంది. ‘లోపలికి రా బిడ్డా, లోపలికి రా!’ అంది.
హీరో కాలికి తగులుకున్న తల్లిని తెగిపోయిన చెప్పు తొడుక్కున్నట్టు నడుస్తూ నడుస్తూ – ‘రాలేనమ్మా అప్పుడయితే రాలేను. తరతరాలుగా మన వంశ ప్రతిష్ఠనీ, కుల గౌరవాన్నీ కాపాడుతూ వచ్చిన మన ‘కుటుంబ సూది’ మొన విరిగి పోయాక – హు మొన విరిగిన మొండిసూది ఉన్న ఈ ఇంట్లోకి నేను అడుగుపెట్టలేను.’ అని ఇంకా ముందుకి తల్లిని ఈడ్చుకుంటూ పోతాడు.
తల్లి అలాగే కాలు వదలకుండా – ‘రారా దాని మొన విరిగితే ఏరా? దబ్బనం ఉంది. దాన్ని తెచ్చిస్తారా లోపలికి రా బిడ్డా’ అంది.
హీరో మళ్ళా కాలు ఈడుస్తాడు. ఈసారి తల్లి చేతుల్లోకి అతని బూటు ఊడొచ్చేస్తుంది. అయినా ఓవర్ నటేశన్ అలాగే ఓ కాలికి బూటు లేకుండా నడుస్తూ – ‘వద్దమ్మా వద్దు. దబ్బనం వద్దు. గునపం వద్దు. నా కోటు బొత్తం తెగిపోయింది. నేనిక మన గృహంలోకి రాలేను.’ అని తల్లినీ, తల్లి చేతిలో బూటునీ అలాగే వదిలేసి వెనక్కి వెళ్ళిపోతుంటాడు.
తల్లి – ‘పోరా పో! మీ నాయనే ఉంటే ఇలా పోతావా. మీ యబ్బే పోకపోతే ఇలా వాగగలవా. అవును నిన్ను విదేశాలు తోలడం నాదే తప్పు. నీకింకా ఓ సొంపైన తండ్రి కూతురితో కళ్యాణం చేద్దామని అనుమానపడ్డాను. ఇన్నాళ్ళకి నీ ఉల్లం నాకు తెలిసింది. ఉండులే వీధిలోనే ఉండు’ అంటూ భోరు భోరున విలపిస్తుంది.
– “అదీ విక్రమార్కా! డబ్బింగ్ చిత్రం. అయితే నాకో చిన్న డౌటు. ఓవర్ నటేశన్ ఊడొచ్చేసిన కోటు బొత్తాన్ని ఏం చేసాడు? ఎలా కుట్టుకున్నాడు? చివర్లో నేను నిద్రొచ్చి పడుకోడం చేత ఆ కాస్తా మిస్సయ్యాను. అంచేత నా డౌటు క్లియర్ చెయ్యి. మరి నీకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీకర్జంటుగా బట్టతల వచ్చి విగ్గు పెట్టుకోవాల్సొస్తుంది” అని ముగించాడు బేతాళుడు.
“ఓ! బేతాళా నా చేత మోయబడే బేతాళా ఓవర్ నటేశన్ అప్పుడయితే ఊడొచ్చేసిన కోటు బొత్తాన్ని తిరిగి కుట్టుకోలేదు. ఇటూ అటూ చూసి గబుక్కున నోట్లో వేసుకుని కసిగా ‘పట్రక్ పట్రక్’మని చప్పుడు చేస్తూ వేయించిన చిట్టి వడియాన్ని తిన్నట్టు తినేసి తలవూపుతూ ‘బేవ్’మని’ఉ ఆఁ హాహ్వహ్వా’ అంటూ విశాల ప్రపంచంలోకి గేటు వెయ్యకుండా నడిచి వెళ్ళిపోయాడు” అని చెప్పడంతో విక్రమార్కుడికి మౌనభంగం కలిగి, బేతాళుడు కాల్షీట్స్కి దొరకని హీరోయిన్లా ఎగిరి చెట్టెక్కి కూచుని, ఓ కొమ్మ విరిచేశాడు.!!

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *