April 28, 2024

సుందరము సుమధురము – 7, (ఆదిభిక్షువు వాడినేది కోరేది?)

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:

‘ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేది అడిగేది?’

ఈ పాటను గురించి కొంతమంది వివరణ అడిగారు. అందుకని ఈ నెల సుమధుర గీతంగా ఈ పాట గురించి వ్రాస్తున్నాను.
ఒక భక్తుడు ఆ మహాదేవుడైన శివుడిని ఇలా స్తుతిస్తున్నాడు. ఈ ప్రక్రియను ‘నిందాస్తుతి’ అని అంటారు. పైకి నిందిస్తున్నట్టు, ఆక్షేపిస్తున్నట్టు అనిపించినా, లోలోపల శ్లాఘిస్తున్న భావం వస్తుంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అలవోకగా వ్రాసేసారు.
మరి భావాన్ని అవధరించండి.
పల్లవి:
ఆదిభిక్షువు వాడినేది కోరేది? బూడిదిచ్చే వాడినేమి అడిగేది? (2)
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
(ఆయనే ఒక బిచ్చగాడు. ఆయనను నేనేమి అడగాలి? అడిగినా ఇవ్వటానికి ఆయన దగ్గర ఉన్నది బూడిద మాత్రమే. అటువంటి ఆయనను ఏమి కోరాలి? – నింద.)
(జగత్తులో మొదటి భిక్షువు ఆయనే. ఆయనను నేనేమి అడుగగలను? చివరకు బూడిద తప్ప మరేమీ మిగలదని చెప్పే ఆ తండ్రిని ఏమి అడుగగలను? – స్తుతి)
చరణం 1:
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది? (2)
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేమి అడిగేది?
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
(కోకిలమ్మ ఎంతెంత తీపిరాగాలు పాడుతుంది? అటువంటి పక్షి శరీరం నిండా నల్లరంగు పులిమేసాడు! వాడినేమడగాలి? కరకుగా గర్జించే ఆ మేఘాలకేమో మెరుపులను సమకూర్చాడు! వాడినేమి కోరాలి? మంచివాటికి చెడ్డ లక్షణాలు, చెడ్డవాటికి మంచి లక్షణాలు. అన్నీ తికమకగానే! – నింద)
(కోకిల కాటుక రంగులోనున్నా సరే, గొంతు విప్పితే చాలు తేనెరాగాలే! అలాగే గుండెలు జలదరించే భయంకరమైన ధ్వనితో ఉరిమే మేఘాలను సైతం మెరుపుతీగల జలతారుతో అలంకరించాడే! వాటికే ఇంతటి అపురూపమైన అయాచిత వరాలను అందించిన ఈ ముక్కంటిని ప్రత్యేకంగా ఏమడగాలి? ఏమి కోరుకోవాలి? – స్తుతి)
చరణం 2:
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది? (2)
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేమి అడిగేది?
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
ఏది కోరేదీ? వాడినేమి అడిగేది?
(ఏమిటో ఈయన! మధువులు చిందించే పూలబాలలకేమో కేవలం మూడురోజుల ఆయుష్షే ఇచ్చాడు! జీవం లేని ఆ బండరాళ్ళకేమో చిరాయువుగా జీవించమని వరమిచ్చాడు! ఇలాంటి వాడినేమడగాలి? ఏమి కోరాలి? – నింద.)
(ఎంత గొప్పవాడో ఈ నీలకంఠుడు! కేవలం మూడురోజులే కొమ్మనంటిపెట్టుకొని, నాల్గవరోజున నేలకు రాలిపోయే పూలబాలలకు సైతం తేనెలొలికే వరాన్నిచ్చి వాటి జన్మను సార్థకం చేసాడే… బండరాళ్ళ కొండలను చిరాయువులుగా మార్చి, వర్షాలు కురవటానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా చేస్తున్నాడే… అంతటి మహానుభావుడిని నాకోసం ఏమైనా అడగవలసిన అవసరముందా? కోరుకోవలసిన వరముందా? – స్తుతి.)

చరణం 3:
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిజేసినాడు, వాడినేది కోరేది?
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు, వాడినేమి అడిగేది?
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేది కోరేది?
ముక్కంటి ముక్కోపి…
ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు…
(పార్వతీదేవితో ఆయనకు వివాహం జరిపించాలని, ఆయన దృష్టి ఆమెపై పడాలని, పూలబాణాన్ని సంధించిన మన్మథుడిని నిర్దాక్షిణ్యంగా మసిచేసేసాడే… అంత కఠినాత్ముడినేమి కోరుకుంటామయ్యా?
వరగర్వంతో ముల్లోకాలనూ పీడించే రాక్షసులను అనుగ్రహించి, వరాలిచ్చాడే… అతడినేమడుగుతాను?
కొంచెం పొగడితే చాలు ఉబ్బి పోయి దగ్గరకు చేర్చేసుకుంటాడు! మళ్ళీ మహా ముక్కోపి. మూడుకళ్ళున్న వాడు ఆ తిక్కశంకరుడు! – నింద)
(మన్మథుడిని దహించివేయుట ద్వారా అతడిని అనంగుడిగా అంటే శరీరము లేనివాడిగా మార్చాడు! మన్మథుడు ఇప్పుడు ఎక్కడ లేడు? పూలలో, మధువులో, వసంత ఋతువులో, పంచభూతాలలో, తనువులో, మనస్సులో… పూల విలుకాడిని, సర్వవ్యాపిగా మార్చిన ఘనత శివుడిదే కాదా? ఇన్ని తెలిసిన గంగాధరుడిని నేను ఏమికోరగలను?
దానవులకు వరాలిచ్చాడు నిజమే. కానీ అవి వారి నాశనం కోసమే సుమా! వరాలు పొందిన మదం తలకెక్కగా, ఇంకెన్నో తప్పులు చేస్తే, ఆ విష్ణుమూర్తి చేత అవతారాలు ధరింపజేసి, దనుజ సంహారం చేయించి, తద్వారా లోకకళ్యాణం జరిపించే కైలాసనిలయుడిని నేనేమి అడుగగలను?
కొంచెం వేడుకుంటే చాలు, ఆ భోళాశంకరుడు కరుణిస్తాడే… కొంచెం శృతి మించి తప్పులు చేస్తే చాలు, మూడవకన్ను తెరచి శిక్షిస్తాడే… అటువంటి గొప్ప దేవుడిని నేనేమి అడగాలి? మరేం కోరాలి? – స్తుతి.)
ఇంత గొప్పగా శివస్తుతి చేసిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, మరింత హృద్యంగా గానం చేసిన శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి, ఇంత గొప్ప పాటను అడిగి మరీ వ్రాయించుకున్న కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారికి… నా వేలవేల వందనములు తెలియజేస్తున్నాను.
మరి ఇంత హృద్యమైన పాటను వినేద్దామా, మనసారా!


***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *