April 28, 2024

బాలమాలిక – గురుర్బ్రహ్మ

రచన: సూర్య గండ్రకోట

 

ఆ రోజు రోహిత్ బడినుంచి రావటమే ఆరున్నొక్క రాగాలాపన చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అతన్ని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. అతని తల్లి ఏమైందని అడిగితే ఏడుపే సమాధానంగా వచ్చింది. అతని నాయనమ్మ ఎంతగానో బుజ్జగించాలని చూసింది. కానీ వాడు అసలామె మాట వింటేనా? ఏడుపు ఆపితేనా? దాంతో అతని తల్లి, నాయనమ్మలు ఎంతగానో కంగారు పడ్డారు. రాత్రి అతని తండ్రి రాజారావు ఇంటికొచ్చేదాకా ఆ ఏడుపు అలా సాగుతూనే ఉంది. తండ్రి ఇంటికి రావటం ఆలస్యం, అతడు తన ఏడుపును ఉధృతం చేశాడు.

పెళ్ళయిన నాలుగేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ. ఎంతో అపురూపంగా కళ్ళలో పెట్టి చూసుకుంటున్న తన ఏకైక వారసుడు, అలా కంటికి మంటికీ ఏకధారగా ఏడవటం చూసి రాజారావు తట్టుకోలేకపోయాడు. వాడిని ఎత్తుకుని తన గదిలోకి తీసుకెళ్ళి బ్రతిమాలి, బుజ్జగించి, చివరికి పాకెట్ మనీ ఆశపెట్టి అడిగితే, అప్పుడు చెప్పాడు వాడు స్కూల్లో తనపట్ల జరిగిన ఘోరాన్ని.

***

అయిదో తరగతి చదివే రోహిత్, బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి కావటంతో స్కూల్లో చేసే అల్లరికి అంతుండేది కాదు. అందరు పిల్లల్లా కాకుండా అతడు కాస్త పెంకిగా ఉండటంతో స్కూలు టీచర్ భారతి చాలా విసుగు చెందేది. ఆ స్కూల్లో చదివే పిల్లలంతా హైక్లాస్ కు చెందిన వాళ్ల పిల్లలు కావటంతో, ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలను దండించకూడదని యాజమాన్యం టీచర్లందరికీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఆమె ఆ పిల్లవాడికి ఎంతో మంచిగా చెప్పి చూసింది. కానీ అతడు దారిలో పడకపోవటంతో నిస్పృహకు లోనయ్యేది. ఎన్నోసార్లు అతనికి పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాకపోవటంతో, ఆమె మాటలు పడాల్సివచ్చేది.

ఆ రోజు చెప్పిన హోమ్ వర్క్ చెయ్యకపోగా, రోహిత్ ఆమెకు ఎదురు చెప్పటంతో ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది. వాడి చెవులు పిండింది. వాడి చేత పాతిక గుంజీళ్ళు తీయించింది. అంతే… తన సహవిద్యార్థుల మధ్య వాడిని ఎన్నడూ జరగరాని అవమానం జరిగినట్లు వాడు ఫీలైపోయాడు. స్కూలు బస్సు ఎక్కేదాకా మామూలుగా ఉన్నవాడు, ఆ తర్వాత ఏడుపు అందుకున్నాడు.

***

జరిగినదానికి ఇంకాస్త లేనిపోనిది జోడించి రోహిత్ చెప్పటంతో, అదంతా విన్న రాజారావు ఉగ్రుడైపోయాడు. తన కొడుకుని హింసకు గురిచేసిన ఆ టీచర్ను స్కూల్ నుంచి ఊస్ట్ చేయిస్తానంటూ ఊగిపోయాడు.

అది విని అతని తల్లి, “చూడు రాజా! పిల్లలు చిన్న చిన్న మొక్కలలాంటి వాళ్ళు. వాళ్ళను సరైన దారిలో పెట్టటానికి గురువులకు స్వేచ్ఛ ఉండాలి. నువ్వు చదివే రోజుల్లో నిన్ను మీ టీచర్లు కొట్టలేదా? మీ రోజుల్లో కొంత నయం. మా రోజుల్లోనైతే శిక్షలు ఇంకా ఘోరంగా ఉండేవి. కాబట్టి నువ్వు ఈ విషయంలో కల్పించుకోకుండా ఉండటమే మంచిది” అని చెప్పింది.

కానీ దానికతడు, “లేదమ్మా! ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు. మనం ఎంతో సున్నితంగా పెంచుకుంటున్న పిల్లలని ఇలా దండించటం తప్పు కదా! అదీగాక ఆ స్కూలు రూల్స్ ప్రకారం పిల్లలపైన చెయ్యి వెయ్యకూడదు. ఈ టీచర్ చెవులు పిండి, వాడితో గుంజీళ్ళు కూడా తీయించిందట. ఊరికే వదుల్తానా?” అంటూ ఆవేశపడ్డాడు.

దానికతని తల్లి “నాయినా! మనం ఏదైనా గుడికి వెళితే అక్కడ వినాయకుడి ముందు చెవులు పట్టుకుని గుంజీళ్ళు తీస్తాం కదా! అదే వాడు స్కూల్లో చేశాడని అనుకోరాదా?” అంది.

“అక్కడ మనం భక్తితో చేస్తాం. కానీ స్కూల్లో వాడికి వేసింది శిక్ష” అన్నాడు.

అప్పుడావిడ ఒక న్యూస్ పేపర్ తీసీ అతని చేతికిచ్చి “ఇది ఒకసారి చదువు” అంది.

దానిలో ఒక వార్త ఉంది. ఒక జపాన్ సైంటిస్ట్ కి నోబుల్ ప్రైజ్ వచ్చిన వార్త అందులో ఉంది. అది చదివి “ఆ సైంటిస్ట్ చేసిన పరిశోధనలకి నోబుల్ ప్రైజ్ ఇచ్చి ఉంటారు. ఇందులో విశేషమేముందమ్మా?” అడిగాడు.

“అదే. ఆ పరిశోధన సారాంశం కూడా ఏమిటో పూర్తిగా చదువు” అందావిడ.

ఆ వార్త చదువుతున్నకొద్దీ అతని కళ్ళు విచ్చుకోసాగాయి. అందులో ఇలా ఉంది…  పిల్లల చెవి తమ్మెలను సాగదీస్తే వాళ్ళ మేధాశక్తి పెరుగుతుందని ఆ శాస్త్రజ్ఞుడు కనుగొన్నందుకు అతనికి నోబుల్ ప్రైజ్ ఇస్తున్నారట.

అది చదివి తనకేసి చూసిన అతనితో ఆవిడ “మన ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడో కనుక్కున్నారు. అయితే దానికి దేవుడి భక్తిని జోడించి, దేవుడి ముందు చెవులు పట్టుకుని గుంజీళ్ళు తీస్తే పుణ్యమని చెప్పారు. దాంతో దేవుడంటే మనకి భక్తీ పెరుగుతుంది. మన తెలివితేటలూ పెరుగుతాయి. వాళ్ళు ఇలా ఏది చెప్పినా మన శారీరక దారుఢ్యాన్ని, మానసిక శక్తినీ పెంచటానికే చెప్పేవారు. పూర్వం గురుకులాల్లో గురువులు శిక్ష పేరుతో చక్కని శిక్షణనిచ్చి మంచి శిష్యులను తయారు చేసేవాళ్ళు. ఇప్పటికీ అంతే… మనం గురువులను శిక్షించకుంటేనే, వాళ్ళు పిల్లలకు మంచి శిక్షణనివ్వగలుగుతారు. బాగు చేయాలనే ఉద్దేశ్యమే తప్ప, వాళ్ళకి పిల్లలపైన కక్ష ఏమీ ఉండదు. కాబట్టి నీ ఆవేశం తగ్గించుకుని, నీ కొడుకుని మంచి మార్గంలో నడిపే గురువులను గౌరవించు. అప్పుడే నీ కొడుక్కి భయమూ, భక్తీ రెండూ కలిగి, బాగా చదివి మంచి పౌరుడౌతాడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారు” అంది.

అంతా విన్న రాజారావు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి కొడుకుని దగ్గర పడుకోబెట్టుకుని, టీచర్ అతన్ని ఎందుకు శిక్షించిందీ కనుక్కుని, క్లాసులో టీచర్లతో ఎలా మెలగాలో, చదువులో ఎలా ముందంజ వేయాలో తర్ఫీదునివ్వటం మొదలుపెట్టాడు.

***

1 thought on “బాలమాలిక – గురుర్బ్రహ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *