April 28, 2024

వెంటాడే కథ – 22

వెంటాడే కథ 22
రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507
నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

ఉచిత సలహాలు

ఒక నడి వయసు తండ్రి, అతని కొడుకును వెంటపెట్టుకుని తమ గాడిదను సంతలో అమ్మాలని బయలుదేరాడు. ఇద్దరూ గాడిదకు అటు ఇటు నడుస్తూ దాన్ని తోలుకు పోతున్నారు. కొంత దూరం నడిచాక వారికి ఒక అమ్మాయిల గుంపు ఎదురయింది.
తండ్రి కొడుకులు ఇద్దరినీ చూసి అమ్మాయిలు అందరూ పకపక నవ్వారు.
“ఆ ఇద్దరూ చూశారా. ఎంత మూర్ఖులో! గాడిదను పక్కన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు.” అంది ఓ అమ్మాయి.
“ఎంచక్కా దానిపై ఎక్కి వెళ్లొచ్చు కదా? నువ్వు అన్నట్టు వీళ్ళిద్దరూ తిక్కలోళ్లే” అంది మరో అమ్మాయి మొదటి అమ్మాయిని సమర్థిస్తూ.
తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ మాటలు విన్నారు.
వెంటనే తండ్రి కొడుకుని “ఒరేయ్ అబ్బాయ్ వాళ్ళు చెప్పింది నిజమే. అనవసరంగా ఇద్దరం నడవడం దేనికి? నువ్వు గాడిద మీద కూర్చో” అని చెప్పాడు.
కొడుకు గాడిద మీద కూర్చుంటే తండ్రి పక్కనే గాడిద మెడకు వేసిన తాడు పట్టుకుని నడుస్తున్నాడు. మరికొన్ని మైళ్ళు నడిచాక కొందరు వృద్ధుల గుంపు కనబడింది.
వాళ్లు కూడా ఈ తండ్రీకొడుకుల్ని, వారి గాడిదని చూసి ఆశ్చర్యపోయారు.
“వయసులో ఉన్న కొడుకు గాడిద మీద స్వారీ చేస్తుంటే వయసు అయిపోయిన తండ్రి నడుచుకుంటూ పోవడం ఇది ఎక్కడి దారుణం ?” అన్నారు కొందరు వారికి వినపడేలాగా.
ఒక ముసలాయన విసవిసా నడుచుకుంటూ వచ్చి వారి వివరాలు కనుక్కున్నాక తండ్రితో ఇలా అన్నాడు, “కొడుకుని ప్రేమించడంలో తప్పు లేదు. కానీ మరీ ఇంత నెత్తినెక్కించుకోనక్కర్లేదు.. వాడు వయసులో ఉన్నాడు. నువ్వు వార్ధక్యంలోకి అడుగు పెడుతున్నావు. నువ్వు గాడిద మీద కూర్చో. వాడు నడుస్తాడు” అని చెప్పాడు.
తండ్రికి ఆయన చెప్పింది సబబుగానే తోచింది. వెంటనే కొడుకుని దిగమని చెప్పి గాడిదపై తను కూర్చున్నాడు.
అలా కొంత దూరం ప్రయాణించాక ఒక రైతు ఎదురయ్యాడు. అతను వాళ్లని ఆగమని చెప్పి,
”మీ ఇద్దరికీ కాస్త పిచ్చి ఏమీ లేదు కదా, లేకపోతే చక్కగా గాడిదతో వెళుతూ ఒకడు నడవడం ఎందుకు? అది ఉన్నదే బరువులు మోయటానికి ! ఇద్దరూ హాయిగా దాన్ని ఎక్కి వెళ్లొచ్చు కదా!” అన్నాడు.
తండ్రికి ఈ సలహా బాగా నచ్చింది.
వెంటనే కొడుకును కూడా గాడిదపైకి ఎక్కమన్నాడు. అలా ఇద్దరు గాడిదపై ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక గ్రామానికి చేరుకున్నారు. వారిద్దరూ గాడిదపై వీధిలో పోతుంటే ఆ ఊరివాళ్ళు ఇద్దరు వాళ్ళని నిలదీశారు.
“మీరు అసలు మనుషులేనా? దున్నపోతుల్లా ఉన్నారు.. ఆ ముసలి గాడిద మీద ఊరేగుతున్నారు! కొంచెం కూడా సిగ్గు లేదా? ఇంకాసే పుంటే అది చచ్చి ఊరుకుంటుంది. ఇప్పటికే మీ బరువు మోయలేక నురగలు గక్కుతోంది.. దిగండి దిగండి” అని తిట్టారు.
తండ్రి కొడుకులు సిగ్గుపడుతూ గబగబా గాడిదపై నుంచి దిగారు.
ఊరి వాళ్ళు చెప్పినట్టు అప్పటికే గాడిద బాగా అలసిపోవడంతో నోటి నుండి నురగ వస్తోంది.
నిజంగానే అది చచ్చిపోతుందేమో అని భయం వేసింది తండ్రి కొడుకులకు.
వెంటనే అతి ప్రయాసమీద గాడిదను కిందపడేసి, ముందు కాళ్లు రెండు కలిపి తాళ్లతో కట్టారు. వెనక కాళ్లు కూడా కట్టి వాటి మధ్య నుంచి ఒక పొడవైన కర్రను దూర్చి ముందొకరూ వెనుకొకరూ భుజాలపై మోసుకుపోవడం మొదలుపెట్టారు.
ఈ హడావిడికి గాడిద బెదిరిపోయింది.
కాళ్ల తాళ్లు విడిపించుకోవడానికి విపరీతంగా కదులుతూ ఉండటంతో మోస్తున్న తండ్రి కొడుకులకు చాలా కష్టంగా ఉంది. దానికి తోడు ఈ వ్యవహారం అంతా చూసి ఊళ్లో అందరూ పకపకనవ్వడం మొదలుపెట్టారు. కొందరు ఈలలు వేస్తే కొందరు డప్పులు మోగించారు.
అదే సమయంలో తండ్రి కొడుకులు గాడిదను ఒక వంతెన మీదుగా తీసుకెళ్తున్నారు. డప్పులు చప్పుడుకు ఈలల గోల ఎక్కువయ్యేసరికి గాడిదకు భయం పెరిగి పోయింది. బలవంతంగా తాళ్లు తెంచుకుని పరుగెడుతూ గబుక్కున నదిలో పడి మునిగిపోయింది.
తండ్రి కొడుకులు ఏమి చేయలేక నిస్సహాయంగా తిరుగు ముఖం పట్టారు.

-:000:-

నా విశ్లేషణ:

అవ్వడానికి పిల్లల కథలా ఉన్నా ఇది చాలా గొప్ప కథ. ఎప్పటికీ పాత పడని కథ. బహుశా ఏసుప్ కథలలోది కావచ్చు. ఏ కాలంలో అయినా సమాజానికి అద్దం పట్టే కథ. మనం ఏ రకంగా ఉన్నా, ఎలా నడుచుకుంటున్నా మనం వెళుతున్న మార్గం సరైనది కాదు అని ఉచిత సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు మన చుట్టూ చాలామంది ఉంటారు. మన అవసరాలు, బాధలు వారికి తెలియకపోయినా మనను జడ్జి చేస్తుంటారు. వారు చెప్పినది తు.చ తప్పకుండా పాటించాలని కోరుకుంటారు. ఈ ఉచిత సలహాలను పాటిస్తే మన జీవన గమనం కచ్చితంగా ఈ కథలోని గాడిద యజమాని ఉదంతంలాగే విషాదాంతం అవుతుంది.

1 thought on “వెంటాడే కథ – 22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *