April 28, 2024

భగవంతుని ఆత్మస్వరూపం

రచన: సి.హెచ్.ప్రతాప్

భగవంతుడికి అనంత నిరాకార జ్ఞానరూపం , అనంత విశ్వరూపం మరియు సాకారరూపం వుంటాయి. సాకార రూపాన్ని మనం సృష్టించుకున్నది, దానిని ఫొటోలలో, విగ్రహాలలో దర్శించవచ్చు. అయితే మొదటి రెండు రూపాలను ఎంతో సాధన చేస్తే గాని దర్శించడం కష్టం. ఇది ఆత్మ దర్శనం కలిగిన వారికి మాత్రమే సాధ్యపడుతుంది. విశ్వంలో భగవంతుడు లేక సద్గురువు ఎక్కడ వున్నాడంటే విశ్వమంతా చైతన్యం వలే వ్యాపించి వున్నాడని వేదం చెబుతోంది. చివరకు ఆత్మ జ్యోతి రూపంలో మన హృదయాలలోనే సదా కొలువై వున్నాడు. దీనిని సంవత్సరాల తరబడి కఠోర సాధన చేస్తే తప్ప దర్శించడం సాధ్యం కాదు.
మనకు స్థూల దేహమే శరీరమైతే భగవంతుడికి మరియు సద్గురువుకు విశ్వమే శరీరం అన్నది శాస్త్ర వాక్యం.
అందుకే గురుగీత ” గురు: విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ:” అని గురువు వైభవాన్ని అత్యద్భుతంగా కీర్తిస్తోంది.
అంటే ప్రపంచమంతయూ గురు స్వరూపమే కాని మరి వేరు కాదని, అందుకే అట్టి భగవత్ స్వరూపమైన గురువుకు వందనం చేయాలని పలికింది.
మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తద్వారా తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ఎంతో నిఘూఢమైన అర్ధం వుంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. “గు” అంటే గుహ్యమైనది, తెలియనిది. “రు” అంటే దానిని పటాపంచలు చేసేది. ఆత్మను తెలుసుకోవడం అంటే శాశ్వతమైన ఆనందాన్ని మరియు శాశ్వతమైన శాంతిని ఆస్వాదించడమే. స్వీయ-సాక్షాత్కారం శాశ్వతమైన ఉనికిని, సంపూర్ణ జ్ఞానాన్ని మరియు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది.
అట్లే శాస్త్రం సర్వ దేవ నమస్కార: కేశవం ప్రతిగచ్చతి: అని తెలిపిందీ. అంటే మనం ఎవరికి నమస్కారం పెట్టినా ఆ కేశవుడికే అంటే భగవంతుడికే చెందుతుంది అని అర్ధం. అట్లే మనం ఎవరిని తిరస్కరించినా, కొట్టినా, తిట్టినా, మోసం చేసినా అది ఆ భగవంతుడికే చేసినట్లు అవుతుంది.
ఈ విధమైన అవగాహనతో మనం ప్రవర్తిస్తే క్రమంగా మనసు అంతా భగవంతుని చింతనతో నిండిపోతుంది. ఈ విధంగా కఠోర సాధన చేస్తే కొంత కాలానికి భగవంతుని కృపతో మనసు అంతర్ముఖమై ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే మన జీవన లక్ష్యం, గమ్యం కావాలి.
ఈ విశ్వమంతా భగవంతుని శరీరం. ఈ ప్రపంచమంతా భగవంతుడు లేదా విరాట్ స్వరూపమే. ఈ ప్రపంచం మృత పదార్థంతో కూడిన ప్రపంచం కాదు, సజీవ ఉనికి అన్న సంగతి మనకు అర్ధం కావాలి. ఈ ప్రపంచం ఆత్మ యొక్క స్వరూపం. అన్ని యుగాల ప్రాథమిక లోపం ఆధ్యాత్మిక ప్రపంచం మరియు పదార్థం వేరు అనే నమ్మకం.అయితే ఏనాడైతే ఆధ్యాత్మిక ప్రపంచం మరియు పదార్ధం ఒక్కటే అన్న ఎరుక కలుగుతుందో అప్పుడే అద్వైత సిద్ధాంతం మనకు అనుభవం లోనికి వస్తుంది.
అవినాశి అయిన భగవంతుడు ఏ జ్ఞానంతో పొందగలుగుతున్నాడో అదియే అత్యున్నతమైన జ్ఞానమని ముండకోపనిషత్తు తెలియజేస్తోంది. భగవంతుడు దర్శింప సాధ్యం కానివాడు.అర్థం చేసుకోవడా నికి సాధ్యంకాదు. ఉత్పత్తి లేదు. మానవునికున్నట్లు అవయవాలు లేవు. శాశ్వతమైన వాడు. అనంతమైన రూపాలను సంతరించుకొనగలడు. సర్వవ్యాప్తి, అత్యంత సూక్ష్మమైనవాడు, అవినాశి, సృష్టికి మూల కారణమైన వాడు. జాగృత చైతన్యులు ఆయనను సర్వత్రా దర్శించగలరు. అందుకు అద్వైత జ్ఞానానుభవం ఎంతో అవసరం. అది ఆత్మజ్ఞానంతోనే సాధ్యం.

1 thought on “భగవంతుని ఆత్మస్వరూపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *