April 27, 2024

రామాయణంలో తాటక వధ

రచన: కర్లపాలెం హనుమంతరావు

తన యజ్ఞ సంరక్షణార్ధం, రామలక్ష్మణులను, విశ్వామిత్రుడు అయోధ్య నుండి తీసుకొని పోతున్నాడు.
సరయూ నదీ దక్షిణ తీరం చేరారు ముగ్గురూ. బల, అతిబల అనే మంత్రాలు , విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రబోధించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల అలసట కలుగదు. జ్వరం రాదు. ఆకలి దప్పులు ఉండవు. రూపంలో మార్పురాదు. నిద్రలో ఉన్నా , జాగ్రదావస్థలో ఉన్నా రాక్షసులు బెదిరించలేరు .
ఆ రాత్రి ముగ్గురూ సరయూ నదీ తీరంలో సుఖంగా విశ్రమించారు. మర్నాడు, ప్రభాతవేళలో, విశ్వామిత్రుడు,
‘కౌసల్యా సుప్రజారామ! పూర్వాసంధ్యాప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం’
అంటూ రామలక్ష్మణులను నిద్రనుంచి మేల్కొలిపాడు. అందరూ ముందుకు ప్రయాణం సాగించారు.
దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. శివుడికి, కాముడి కారణంగా తపోభంగం అయి ఆ కోపాగ్నిలో మన్మథుడు భస్మీభూతుడై, శరీరం కోల్పోయిన ప్రదేశం అదే. ఆ ఆశ్రమం గంగా సరయూ నదుల సంగమ స్థానంలో వుంది. కామాశ్రమం దాని పేరు. ఆ రాత్రికి అక్కడ నిద్రపోయి, మర్నాడు ముందుకు బయలుదేరారు మళ్లీ.
గంగను నావల సాయంతో దాటారు. గంగానది దక్షిణ తటం చేరారు. ప్రయాణం కొనసాగించారు.
భయంకరమైన నిర్జనారణ్యం చేరారు. ఈల పురుగుల రొదలు, క్రూరమృగాలు, పెద్ద పెద్ద పక్షులు, ఏనుగులు, సింహాలతో నిండిన ఆ అరణ్యాన్ని చూశారు . రకరకాల చెట్లతో దట్టంగా వున్న ఆ అడవి ఆశ్చర్యం కలిగించింది రామలక్ష్మణులకు.
ఈ అరణ్య విశేషాలను గురించి చెప్పమని విశ్వామిత్రుడిని అడిగారు రామసోదరులు.
విశ్వామిత్రుడు ఆ అరణ్యాన్ని గురించి చెప్పుకొస్తూ ‘గతంలో ఇంద్రుడు, వృత్రుని చంపి, బ్రహ్మహత్యాపాపం పొందాడు. తపస్సంపన్నులయిన మహర్షులు మంత్ర పూర్వకంగా మంగళ స్నానాలు చేయించి, దేవేంద్రుణ్ణి పాపవిముక్తునిగా చేసిన చోటు నాయనలారా ఇది. అందుకు దేవేంద్రుడు ఆనందపడి, ఆప్రదేశం, మలద, కరూశ నామాలతో ధనధాన్య సమృద్ధితో లోకంలో గొప్ప గుర్తింపు పొందుతుందని వరమిచ్చాడు.
కొంతకాలానికి, వెయ్యి ఏనుగుల బలంగల ఒక యక్షిణి పుట్టింది. ఆమె కామరూపిణి. పేరు తాటక. సుందుడికి భార్య అయింది . వాళ్ల వల్ల ఒక కొడుకు పుట్టాడు. వాడు దేవేంద్రుడంతటి బలశాలి. కండలు తిరిగిన భుజాలు, భైరవాకారం! ప్రజలను పీడించడమే పనిగా పెట్టుకొన్న దుర్మార్గుడు. తల్లితో కలిసి ఈ ప్రదేశాలను ధ్వంసం చెయ్యడం మొదలెట్టాడు.’ అంటూ ‘ఈ దారి గుండానే మనం నా ఆశ్రమానికి పోవాలి. నా మాట ఆజ్ఞగా భావించి, ఈ తాటకను చంపేసెయ్! ఈ ప్రదేశాన్ని నిష్కంటకం చెయ్యి.’ అని ఆజ్ఞాపించాడు రుషి.
‘యక్షులు అల్పవీర్యులని అంటారు గదా! మరి ఈ తాటక, సహస్ర నాగబల సంపన్న ఎట్లా అయింది?’ అని రాముడు మరో ధర్మ సందేహం వెలిబుచ్చాడు. విశ్వామిత్రుడు, తాటకా జనన వృత్తాంతం ఇట్లా చెప్పుకొచ్చాడు.
‘పూర్వం సుకేతుడు అనే శుభాచారుడు బిడ్డలు లేని కారణంగా, బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ, వెయ్యేనుగుల బలం ఉన్న తాటక అనే అమ్మాయిని ప్రసాదించాడే కాని కొడుకును మాత్రం ఇచ్చాడు కాదు.
ఆ తాటక, బ్రహ్మ ఇచ్చిన బలంతోపాటు అందచందాలను కూడా సంతరించుకొంది. ఝర్జుని కొడుకు సుందునుడితో వివాహం అయింది. దుర్ధర్హుడూ దుర్మార్గుడూ అయిన మారీచుడు అనే పుత్రుణ్ణి కన్నది.
గతంలో తన మొగుణ్ణి వధించాడన్న కోపంతో అగస్త్యుణ్ణి చంపబోయింది ఆ మహాతల్లి. ఆ తల్లికి సాయానికి వెళ్లిన మారీచుడు కాస్తా రుషి శాపం మూలకంగా అందమైన రూపం కోల్పోయి కురూపి రాక్షసుడిగమారాడు. ‘మనుషుల్ని తింటూ, అందచందాలు కోల్పోయి భయంకరమైన రూపం, ముఖం పొందుతావు'(పురుషాదీ మహాయక్షి విరుపా వికృతాననాI ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తుతే) అంటూ తాటకనూ శపించాడు అగస్త్యుడు. అప్పటి బట్టి ఈ రాక్షసి చేసే నరభక్షణ కారణంగా ఈ వనం ఇట్లా నిర్మానుష్యమై పాడుపడింది.’
ఇదంతా చెప్పి ‘ఇప్పుడు నువ్వు ఆ తాటకను చంపాలి రామా! ఇదీ నా ఆజ్ఞ’ అన్నాడు విశ్వా మిత్రుడు.
స్త్రీ హత్య పాపమని గదా సాధారణంగా జనానికో నమ్మకం. అయినా విశ్వామిత్రుడు తాటకను వధించమన్నాడే! రాజు, రాజర్షి, బుషి, మహార్షి, బ్రహ్మర్షి కూడా ఆయన. జీవితగ్రంథాన్ని ఆసాంతం క్షుణ్ణంగా చదివిన జ్ఞాని. ఆయనకు తెలీని ధర్మరహస్యం, న్యాయమర్మం ఉంటాయా? అని తర్కించుకొని గోబ్రాహ్మణ హితార్థమై తాటకను చంపమంటున్నాడంటే లోకహితార్థం చంపమన్నట్లే (గోవుకు భూమి అనే అర్ధం కూడా కద్దు). తాటక వధ గాని జరగకపోతే భూమ్మీద ఇక మనిషనే వాడే మిగలడు. అట్లాగే బ్రాహ్మణ శబ్దం తెలివి, సంపద, జ్ఞానాలకు సంకేతం. జగత్కల్యాణం కోసం విజ్ఞానైశ్వర్యాల అవసరం ఉంది. ఆ సత్కార్యానికి ముప్పుగా మారిన తాటకను చంపటంలో అధర్మమేమీ లేదన్న భావమైనా కావచ్చు. కాబట్టి తాటకవధ స్త్రీ హత్య కిందకు రాదు. పైపెచ్చు దౌష్ట్యాలకు మరణమే తగిన దండన అని లోకానికి చాటినట్లవుతుంది.’ అని తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు రాముడు.
న్యాయశాస్త్రానికి స్త్రీ పురుషులనే తేడా ఉండదు కదా! మన దేశ రాజ్యాంగం ప్రకారం (Article 14 of the constitution) చూసుకున్నా న్యాయం ముందు అందరూ సమానులే. IPC (Indian Penal Code) ప్రకారమయితే, ఒకే నేరం చేసిన, స్త్రీ పురుషులకు విధించే దండనలో, స్త్రీలకు ఒక విధంగా, పురుషులకు ఒక విధంగా ఉండదు. ఇప్పుడు అమల్లో ఉన్న న్యాయసూత్రాలకు అనుగుణంగానే అప్పటి తాటక మరణ దండన కూడా! రాముడి ఆలోచనలో సబబు ఉంది.
‘నహితే స్త్రీవధకృతే ఘృణా కార్యానరోత్తమ! చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం, రాజసూనునా-(లోకోపద్రవం చేసే, ఈ తాటకను వధించాలి. ఆడది అని దయ చూపించడం రాజధర్మానికి తగింది కాదు) అన్న విశ్వామిత్రుడి ఆజ్ఞ వెనక ప్రజారక్షణ కారణంగా, కొన్ని కార్యాలలో క్రూరత్వం కనబడ్డా, వాటిని రాజు చేసి తీరాల్సిందే (నృశంసమనుశంసంవా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా)అన్న శిక్షాస్మృతి నిర్దేశమే ఉంది. నేటి ప్రభుత్వ విధానంలో కూడా Public Vs Individual సంఘటనలో ఏదైనా వివాదం తల ఎత్తిలే (Public Interest) ప్రజా సంక్షేమానికే, ప్రాధాన్యం ఇస్తారు కదా.. అట్లాగే!
న్యాయస్థానంలో, న్యాయవాదులు, చట్టాన్ని న్యాయమూర్తికి నివేదించే సందర్భంలో న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పులను, Precedentsగా ఎత్తి చూపిస్తారు. ఆ పద్ధతిలోనే, విశ్వామిత్రుడు, పూర్వం భూదేవినే చంపడానికి పూనుకొన్న, విరోచనుని కూతురయిన మంధరను ఇంద్రుడు చంపిన సంగతి గుర్తు చేశాడు. అట్లాగే సజీవంగా ఉండకూడదన్న కసితో ఇంద్రుణ్లి చంపాలమకొన్న, శుక్రమాత(భృగుమహర్షి భార్య)ను విష్ణుమూర్తి సంహరించిన సంగతినీ గుర్తుచేశాడు.
ధర్మసూక్ష్మం అర్థం చేసుకొన్నాడు కాబట్టే తాటకను వధిస్తే స్త్రీ హత్యాపాపం అంటదని తెలుసుకొని ‘దేశ సౌభాగ్యం కోసం, విజ్ఞానైశ్వర్యాలు నిలబెట్టడం కోసం, నీ వచనం పాటిస్తాను గురువు గారూ’అన్నాడు రాముడు.
ఇంతలో తాటక రానే వచ్చింది. రాముడు ధనుస్సును సజ్యం చేశాడు. ధనుష్టంకారంతో దిక్కులు యావత్తూ పిక్కటిల్లాయి. తాటక తారకరామునిపైకి దూసుకొచ్చింది. ధూళివర్షం కురిపించింది. అంతర్థానమై రాళ్లవర్షం కురిపిస్తూ తన వైపుకు విసురుగా రావడంతో రామచంద్రుడు శరసంధానంతో ఆ తాటక రెండు చేతులను ఖండించేశాడు. భుజాలు తెగి, అలసిపోయి క్రిందబడిపోయింది రాక్షసి. లక్ష్మణుడు గబగబా వెళ్ళి కసిదీరా ఆమె ముక్కు చెవులను కోసేశాడు. (తరువాత వచ్చే కథలో కూడా శూర్పణఖకు అలాంటి శిక్షే విధించాడు లక్ష్మణుడు! అదేమి చిత్రమో..లక్ష్మణుడి చూపెప్పుడూ ఆడవాళ్ళ ముక్కూ చెవుల మీదే. బాల్యంలో కూడా ఇట్లాగే ముద్దు కొద్దీ తనను ఎత్తుకొన్న స్త్రీల ముక్కూ చెవులను కూడా తడిమేవాడని విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో చమత్కరించారు)
తాటక వూరుకోలా. మరింత కసిగా రకరకాల రూపాలు ధరించి మరీ, రామలక్ష్మణులను విస్తుపరుస్తూ, రాళ్లవర్షం కురిపించింది.
‘సాయం సంధ్య సమీపిస్తోంది. రాక్షసులను సాయం సంధ్యలో బలం పెరుగుతుంది. చంపడం కష్టం. వెంటనే తాటకను నువ్వే ముందు చంపు రామా!’ అని రాముణ్ణి తొందరపెట్టాడు విశ్వామిత్రుడు.
రాముడు, శబ్దవేది కాబట్టి, తాటక దుశ్చేష్టలకు, తన బాణాలతో ఆటకట్టు పలికేశాడు. పిడుగులాగా మీదకు దూకబోయిన తాటకను, రొమ్ముపై బాణంతో గొట్టాడు. ఆమె క్రిందపడి అసువులు బాసింది. దేవతలు యథావిధిగ సంతోషించారు. విశ్వామిత్రుడు ఆశీర్వదించడంతో తాటక వధ సత్య కాముకులందరికీ సంతోషం కలిగించింది.
రామావతారంలో, రామబాణాగ్నిలో పునీతులయిన వారిలో మొట్టమొదటి అదృష్టవంతురాలు తాటక. రామబాణం కారణంగా ప్రాణం కోల్పోయి స్వర్గం చేరినవాళ్లలో మొదటి వ్యక్తి రామాయణంలో తాటకే!
దాన్నే ‘కియత్ భాగ్యమహోతస్యా స్తాటకాయా మహత్తరమ్I
హతాఃదౌ రామబాణేన ప్రవివేశ దివంఖలు’ అన్నాడు ఆదికవి వాల్మీకి మహర్షి .

2 thoughts on “రామాయణంలో తాటక వధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *