April 27, 2024

వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా – 2 (సామాజిక పద్యనాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు

2 వ రంగము
(స్కూటర్ స్టాండు వేసి షాపులోకి వెళ్తుంటే చిన్ననాటి మిత్రుడు బ్రహ్మానందం ఎదురయ్యాడు)
బ్రహ్మ :- ఒకే సుందరదాసూ ఎన్నాళ్లయ్యిందిరా నిన్ను కలిసి. బాగున్నావా? చెల్లెమ్మ బాగుందా? అదేదో ప్రైవేటు బళ్లో తెలుగు చెప్తుందని చెప్పావు క్రితంసారి కలిసినప్పుడు. ఏమైనా సందేహాలుంటే నన్నడగమని కూడా చెప్పినట్లు గుర్తు.
దాసు: అర్జునుడు బాణం మీద బాణం రెండు చేతులతో వేసినట్టు వేసి అడిగిన వాటికి జవాబులు చెప్పకముందే ఇంకేమిటి సంగతులంటావేమిట్రా బాబూ.
బ్రహ్మ:- ఏదో యథాలాపంగా అడిగాన్లే.
దాసు:- ఆ స్కూల్‌లో ఏమని తెలుగు టీచరుగా చేరిందో కాని, మా ఇల్లంతా పద్యాలతో నిండిపోయిందిరా బ్రహ్మయ్యా! ఈ మధ్యన అనేక వాట్సప్ గ్రూపులూ, ఫేస్బుక్కుల్లో సాహిత్య వేదికలూ తెగ పెరిగినాయి కదా. మీ చెల్లెలుకు తీరికే లేదనుకో. పలుకరిస్తే చాలు పద్యం గిలకరిస్తుంది.
బ్రహ్మ:-ఆహాహా అదృష్టవంతుడివి. మా ఆవిడకు నేనేదైనా రాసి వినిపిద్దామంటే ఆ దిక్కు మాలిన సీరియళ్లలో పడి నీకో దండం, నీ కవిత్వానికో దండం నా సీరియళ్లు డిస్ట్రబ్ చేయవద్దని గోల. నేనూ అనేక గ్రూపుల్లో పద్యాలు కవితలు పెడుతున్నాను. నీకు వాట్సప్లో పెడుతున్నాను గానీ నువ్వు చూడటం లేదు గదరా.
దాసు:-మా ఆవిడే టీలు, ఠిఫిన్లు, లంచులు డిన్నర్లు పద్యాలతో కంచం నింపేస్తుంటే ఇంకా నీ పద్యాలెక్కడ చూడాల్రా బ్రహ్మం.
బ్రహ్మ:-ఓహో అయితే మా చెల్లాయి చాలా ఎదిగిపోయిందన్నమాట. ఈసారి ఆవిడకే పంపిస్తా నా పద్యాలన్నీ.
దాసు:- ఆ పని చెయ్యి. సరే నువ్వు షాపుకా లేక ఎటైనా వెళ్తున్నావా?
బ్రహ్మ:-షాపుకనే బయలుదేరాను. తీరా చూస్తే సామాను లిస్టు ఇంట్లో మరిచాను తిరిగి తెచ్చుకుందామనే లోపు నువ్వు కనిపించావు.
దాసు:- నీలాంటి మతిమరుపు మహారాజులకోసం మీ చెల్లెలు పద్యరూపక పచారు కొట్టు సరుకుల పద్యాలు రాసింది. అవి ఫార్వార్డు చేస్తా. చూసుకుని సరుకులు తీసుకుందువు గాని.
(పద్యాలు ఫార్వార్డు చేయును)
బ్రహ్మ:-(మొదటి పద్యం కళ్లు మెరిపించుకుంటూ తలాడిస్తూ రెండవ పద్యం పైకి చదవడం మొదలెట్టాడు.)

చం
ఉలవలు పల్లిగింజలునుఉప్పుడు రవ్వయు సెన్గపప్పుయున్
జిలుకర మెంతులింగువయు చెక్క మసాలలు బెల్లపుండలున్
నలుపువి మిర్యముల్ పెసలు నాలుగు చేరుల కాఫిపొట్లముల్
దులిపెడు చీపురుల్ బ్రషులు దువ్వెనలద్దము టూతుపేస్టులున్-7

ఆహాహా ఏమి పద్యం ఏమి ధార. పద్యాలు నోటికి వస్తే చాలు ఏ లిస్టూ అక్కరలేదు.
దాసూ! నీ భార్య మహా ఉద్ధండురాలోయ్. ఏమో అనుకున్నా. సరే లోపలికి పద. సరుకులు కొందాం.
(అని ఇద్దరూ లోపలికి పోబోతుంటే)
శర్మ :- వ్హ్వాటె వండర్ ఫ్రెండ్స్. హౌడు యుడూ. (అంటూ వెనుక నుండి ఇద్దరి భుజాలపై చేయి వేస్తూ పలుకరించాడు)
దాసు:-ఒరేయ్ శర్మా! నువ్వెప్పుడు దిగబడ్డావురా చెన్నైనుండి. బ్రహ్మం వీడిని గుర్తు పట్టావా లేదా? అవధానిగారి అబ్బాయి. చెన్నైలో స్థిర పడ్డాడు. ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతాడు. నేనే నీతో అనటం మరచిపోయాను. చిన్నప్పుడు వీడిని పండిత పుత్రుడనే వాడివిగా.
బ్రహ్మ:-ఓరి శొంఠి శివశర్మవు గదా.
శర్మ:-అవును ఆ శుంఠశర్మనే.
బ్రహ్మ:-చెన్నై లో ఏం చేస్తున్నావ్.
దాసు:-నన్నడుగు నే జెబుతా. సినిమా ఫీల్డులో వెలుగుతున్నాడు. సినిమాలకు స్క్రిప్టులు, పాటలు రాస్తున్నాడు.
బ్రహ్మ:- నమ్మలేకపోతున్నారా. వీడు చిన్నతనంలో చక్కగా పద్యం కూడా చదవ రాకపోతే అవధాని మాస్టారు ‘నా కడుపున చెడబుట్టావురా. ఆ బ్రహ్మం చూడు ఎంత బాగా చదువు తున్నాడో’ అనేవారు. మొత్తానికి మీ నాన్న పేరు నిలబెట్టావురోయ్.
శర్మ:- అంతా ఆయన చలవే. కాలేజీ రోజుల్లో ఏవో గెలుకుతుంటే , నా ఆసక్తిని గమనించి సాహిత్యం ఒంటబట్టించారు.
దాసు:-మొన్నేదో పౌరాణిక సినిమాలో పాటలు పద్యాలు అన్నీ వీడివే. ఆడియో పంపిస్తే విన్నాను. ఫేస్బుక్ లోనూ బాగా చురుకుగానే ఉంటాడు. కొన్ని సినిమాల్లో వేషాలు వేసాడు.
బ్రహ్మ:- చాలా సంతోషంగా ఉందిరా పదండలా. ఆక్కడ టీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుందాం.
(వీళ్లు టీ కొట్టు దగ్గరకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ)
వ్యక్తి 1:-ఏరా పెళ్లికి రాలేదేరా వాట్సప్లో శుభలేఖ పంపాను కదా!
వ్యక్తి 2:- అరే సారీ! చూసుకోలేదురా. వాట్సప్ మెసేజులు చాలా అయ్యేసరికి మిస్ అయ్యింది.
(దాసు, బ్రహ్మం, శర్మ ముగ్గురూ మూడు ప్లాస్టిక్ మోడాలపై కూర్చుని కబుర్లు చెప్పు కుంటున్నారు టీ కొట్టు పక్కన)
దాసు:-చూసావురా ఈ వాట్సప్ ఎంతగా వ్యాప్తి చెందిందో. ఎవరిని చూడు వాట్సప్ వాట్సప్. ఇంతకీ ఏంటిరా శర్మా! సడన్ గా ఊడిపడ్డావు హైదరాబాదులో
శర్మ:- ఊడిపడడం కాదు. ఉండిపోవడానికి వచ్చాను.
దాసు & బ్రహ్మ:- (ఇద్దరూ ఒకేసారి ) అవునా!
శర్మ:- అవున్రా! అన్నయ్య ఇక్కడే ఉండేవారని తెలుసుగా. కరోనా వల్ల పోయాడు. అన్నయ్య దగ్గర ఇన్నాళ్లూ ఉన్న అమ్మ చెన్నై రాననడంతో నేనే ఇక్కడికి షిఫ్ట్ కావాలను కుంటున్నా. వదిన అమెరికాలో సెటిలైన అబ్బాయి వద్దకు వెళతానంటోంది. ఇన్నాళ్లూ వాళ్లే చూసుకున్నారు. ఇకనుంచీ అమ్మ బాధ్యత నాదే. నాకు ఇక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయి, కనుక నా ప్రొఫెషన్ కు ఢోకా లేదు.
దాసు:- ఓ అదా సంగతి.
బ్రహ్మ:- మంచిదే. మన వాడొకడు ఫీల్డ్‌తో టచ్ ఉన్నవాడు దొరికితే మనకూ మంచిదే కదా!
శర్మ:- ఈ పక్క కాలొనీలో ఇల్లొకటి నచ్చింది ఆల్మోస్ట్ సెటిలయింది. ఆ పనిమీదే ఇటు వచ్చాను. మీరు కనిపించారు.
(ఇంతలో టీ కొట్టువాడు చాయ్ ఇచ్చాడు)
దాసు:- చాయ్ సిప్ చేసి, ఛాయంటే ఇది గదరా!
బ్రహ్మ:- అది కందపద్యపు మొదటి పాదంరోయ్. నేను రెండో పాదం చెబుతా
కాయంటే జామకాయ కమ్మగనుండున్
శర్మ:- (నవ్వి )పాయింటే ఇది కూడా
దాసు:- నేయుంటే బూరెల రుచినేమని చెప్పన్
బ్రహ్మ:- భలే కంద పద్యం తయారయింది కదా.
చాయంటే ఇదికదరా
కాయంటే జామకాయ
కమ్మగనుండున్
పాయింటే ఇదికూడా
నేయుంటే బూరెలరుచినేమని చెబుదున్ -8
దాసు:- ఇందాక ఇంట్లో మా ఆవిడతో ఏవో నాలుగు మాటలు చెప్పగానే అది కందపద్యం అంది. నేను ఆశ్చర్యపోయా. చూస్తే నా మాటలు అన్నీ కలిపితే ఇదిగో ఇలాగే పద్యమై కూర్చుంది.
శర్మ:- ఏవిటి మీ ఆవిడకు ఛందస్సు తెలుసా?
బ్రహ్మ:- ఏమిటి? ఛందస్సు తెలుసా అంటున్నావా. చెల్లాయి అద్భుతంగా పద్యాలు రాస్తుంది రోయ్..
ఇదిగో ఇంటి సరుకులన్నీ మరచిపోకుండా పద్యాల్లో రాసింది.
శర్మ:- వావ్ ! ఒరే దాసూ. నేనో సీరియల్ ట్రయల్లో ఉన్నాను. అది వాట్సప్ గ్రూపుల మీద సెటైరికల్గా కామెడీ టచ్‌తోఉంటుంది. మీ ఆవిడకు అభ్యంతరం లేకపోతే ఆ టీంలో చేరుద్దాం.
బ్రహ్మ:- అభ్యంతరం ఉంటే వీడికే ఉండాలి. చెల్లాయి డైనమిక్.
దాసు:- డైనమిక్ కాదు డైనమైట్. మా ఇంట్లో ఈ మధ్య సంభాషణంతా పద్యాల్లోనే సాగు తోంది. ఇక టీవీసీరియల్ ఛాన్స్ వస్తే నేను యతినవటమే గతి.
బ్రహ్మ:- కుళ్లు కుళ్లు ఆడవాళ్లు పైకి రావడం ఇష్టం లేని వాళ్లు ఇలాగే మాట్లాడుతారు.
ఆడువారల ప్రతిభలనణచి వేసి
ఆడుకొనరొకో మగవారు ఆదినుండి
నాటికాలము కాదులే నేటిమహిళ
మేటి అన్నింటి లోపల మేలు గదర-9
దాసు:- ఒరే బ్రహ్మం అలా అభాండాలు వేయకురా నా మీద. ఏదో సరదాకు వాడు ఇస్తా నన్నాడు. నేను సరదాకు గొణిగాను. తను భేషుగ్గా ఉద్యోగం చెయ్యటం లేదా
బ్రహ్మ:- నేనూ సరదాకే అన్నాను లేవోయ్. నాకో ఆశువుగా పద్యం చెప్పే అవకాశం వచ్చింది గదా అని విసిరాను.
శర్మ:- హహహహ ఎంత హాయిగా ఉందిరా ఇవాళ. కలిసి కాసేపు అయినా మనసంతా తేలికైపోయిందిరా. మా ఫీల్డ్ లో మాకు ఎప్పుడూ దిక్కుమాలిన టెన్షనే.
దాసు:- ఇలా అనుకోకుండా పాతమిత్రులం కలుసుకోవడం సరదాగా కబుర్లు చెప్పు కోవడం ఎంతో హాయిగా ఉంది. మా ఆవిడ సరుకుల కోసం పంపింది నన్ను. మళ్లీ కలుద్దాం మరి. నువ్విక్కడే ఉంటావు కదా.
శర్మ:- ఇక్కడే ఉండటం, కలుసుకోవడం సరే. రేపు మా డైరెక్టర్‌ను తీసుకుని మీ ఇంటికి వస్తాను. సిస్టర్ తో మాట్లాడి మా ప్రొడక్షన్ కు శ్రీకారం చుడదాం.
దాసు:- నిజమా !
శర్మ:- హండ్రెడ్ పర్సెంట్. బ్రహ్మం నువ్వూ రా తప్పక. ఐయామ్ వెరీ వెరీ హాప్పీ. బై రా
బ్రహ్మ:- చాలా సంతోషంగా ఉందివాళ నిజంగా. ఒక్క పద్యం వినిపో. మేమూ సరుకులు తీసుకొని వెళ్లాలి.
దాసు:- విసురు మరి

స్నేహమధురిమ మించునె చెరకుతీపి
మైత్రి సంపద మించునే మాన్య సిరులు
మనసు మనసును కలిపెడు మహిత శక్తి
చెలిమి ఒక్కటే భువనాన చెలగి చూడ-10

శర్మ :- వండర్ఫుల్ రా రేపు దాసు వాళ్లింట్లో కలుద్దాం. దాసూ నీ లొకేషన్ షేర్ చెయ్యి.
బై సీ యూ (వెళ్తాడు)
దాసు & బ్రహ్మ :- భలే చిత్రం. పద మరి

*****

1 thought on “వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా – 2 (సామాజిక పద్యనాటకం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *