April 28, 2024

స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు – 4

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

8. పెళ్ళికి రహదారి
ఇంటి మీద బెంగతో మిగతావన్నీ వదిలేసి వెళ్ళి అమ్మనూ నాన్ననూ చూడాలని నిశ్చయించుకున్నాను. నాతో పాటు సలీమ్ కూడా రావాలని ఆశపడినా, పనిలో అతనికి క్షణం తీరిక దొరక్క కనీసం నన్ను బస్ ఎక్కించడానికి కూడా రాలేకపోయాడు. నెలల గర్భవతిని అయినా చండీఘడ్ నుండి ఢిల్లీ బస్ ప్రయాణం, అక్కడినుండి ముప్పై ఆరు గంటల రైలు ప్రయాణం తప్పలేదు.
రెండు రోజుల తరువాత నేను మా అక్కయ్య ఇల్లు చేరుకున్నాను. మిగతా వాళ్ళంతా నన్ను కలవడానికి అక్కడికే వచ్చారు. ప్రతి నిమిషం మాటలు నా పెళ్ళి చుట్టూనే తిరగడంతో నా వికారం ( మార్నింగ్ సిక్నెస్) దాచుకుందుకు ప్రయత్నించాను. నా తలిదండ్రులకు సలీంను పెళ్ళి చేసుకోవాలనే నా అభిమతం తెలుసు. కాని నా పీజీ పూర్తయేవరకూ ఆగాలని వాళ్ళ కోరిక.
నా మనసులో నాకు హిందూ పెళ్ళి వద్దని స్పష్టమైన అవగాహన ఉంది. దాని వల్ల సలీం భావాలు దెబ్బతింటాయని, సలీం కూడా ముస్లిమ్ పెళ్ళి వద్దనే అనుకుంటున్నాడు, ఎక్కడ మా తలిదండ్రుల భావాలు దెబ్బతింటాయోనని.
అయితేనేం విషయం సంక్లిష్టం చెయ్యవద్దని, నా తోడబుట్టినవాళ్ళు, అమ్మా నాన్నా ఏం చర్చించుకున్నా నేను తల దూర్చలేదు. కాని లోలోపల మాత్రం అస్పష్టమైన మా (నేను, నా బిడ్డ) భవిష్యత్తు గురించి నిరాశపడిపోయాను. అలాగని అమ్మతోనో, అక్కతోనో నా నెలతప్పటం గురించి చెప్పలేకపోయాను. తీరా చెప్తే వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో తెలియదు. ఒక పాత మిత్రుడు డా. మధుతో నా సమస్య పంచుకున్నాను. ఈ సవాళ్లను ఎదుర్కోగలననీ, నాకు ఆ శక్తి ఉన్న బలమైన స్త్రీననీ అతను నాకెంతో నైతిక బలాన్ని ఇచ్చాడు. అతనిచ్చిన సలహాతో మా కుటుంబంలో జరుగుతున్న మంతనాలు సలీంకి వివరంగా ఉత్తరం రాసి నిర్ణయం అతనికే వదిలేసాను.
నేను చండీఘడ్ వెనక్కు వెళ్లవలసిన సమయం రానే వచ్చింది. అదృష్టవశాత్తూ కొందరు నా పాత కాలేజీ మిత్రులు కూడా అదే ట్రైన్ లో కలిసారు. సలీంని చూడగానే ఆనందపడిపోయాను, కాని అతనికి మాట్లాడే తీరికే లేకపోయింది. అతని ఉద్యోగం ఇంటర్వ్యూ అయ్యాక కోర్ట్ మారేజీ చేసుకుందామని మాత్రం చెప్పాడు.
ఆ రాత్రి మా అక్కయ్యకో పెద్ద ఉత్తరం రాసాను.
అక్కా,
ఎక్కడ మొదలుపెట్టాలో తెలవడం లేదు. అయినా నువ్వొక్కదానవే నా పరిస్థితిని బాగా అర్ధం చేసుకోగలవు, ఈ విషయంలో నాకు నీ ఆశీస్సులు కావాలి. నువ్వు సలీంని కలుసుకుని ఉంటావు కాని అతని పట్ల నా అభిప్రాయం మాత్రం నీకు తెలియకపోవచ్చు. నా హృదయంలో నేనెప్పుడో అతన్ని పెళ్ళిచేసుకున్నాను. నాకు తెలుసు అతనే నా ఆత్మ సహచరుడు, జీవిత భాగస్వామి అని. మేమిద్దరం ఒకరికోసం ఒకరం రాసిపెట్టుకుని పుట్టాము. ఇన్నేళ్ళూ మా రెసిడెన్సీ పుర్తి చేసి మా కాళ్ల మీద మేం నిలబడ్డాకే సెటిల్ అవ్వాలని ఎదురుచూసాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
కాని ఇక్కడితో అవలేదు…ఇది చెప్పడం అంత సులభమేమీ కాదు. నేను తల్లిని కాబోతున్నాను. రెండు మూడు వారాల క్రితమే నాకు ఈ విషయం తెలిసింది. కాని ఎవరికైనా ఎలా చెప్పాలన్న భయం. ఇప్పుడు నేనూ , సలీం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించు కున్నాము గనక, ఇది చెప్పవలసిన సమయం అనుకున్నాను. అయిదారేళ్ళ క్రితమే గుంటూరులో ఒక గుళ్ళో నేను వాగ్దానం చేసాను, సలీం భార్యనని అప్పటి నుండి అతని భార్యననే అనుకున్నాను. అందుకే నాకిది తప్పు అనిపించలేదు. మాతృత్వపు ఆనందాన్ని నేను అనుభవించాలి, ఆ ఆనందాన్ని నా కుటుంబంతో పంచుకోవాలి కాని ఆ పని చెయ్యలేకపోయాను. మనం ఉండే ఈ సమాజం, ఈ నాటి సమాజంలో స్త్రీకి ఉన్న కట్టుబాట్ల వల్ల.
నేను చేసిన పనివల్ల మిగతా అందరూ నేను వారికి లేనని అనుకున్నా, నాకు సమ్మతమే. ఇంకా జన్మించని నా బిడ్డ నాకిచ్చే బలం అది.
నేను తప్పు చేశాననో, కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేశాననో నువ్వనుకుంటే నన్ను క్షమించవూ, బేబీ కోసం, మా ఇంటికోసం మేం చాలా పొదుపు చెయ్యాలి, అందుకే మా పెళ్ళి చాలా సింపుల్ గా తొందరలో జరుగుతుంది.
మీరందరూ నన్ను అర్ధం చేసుకుంటారుగా!
నీ ఆశీస్సులు కోరుతూ
ప్రేమతో
లక్ష్మి
ఈ ఉత్తరం అక్కకు కన్నీళ్ళతో పంపాను కాని భవిష్యత్తు పట్ల నూతనోత్తేజిత నమ్మకంతో. నా భుజాల మీద భారం దిగిపోయి నట్టనిపించింది.
మా ఫైనల్ జాబ్ ఇంటర్వ్యూ తయారీ మధ్యలో నాకూ, సలీంకీ బట్టలు కొనడానికి వెళ్లాను. నా కోసం మూడు వందల రూపాయల చీర, సలీం కోసం ఒక క్రీమ్ కలర్ షర్ట్, టై కొన్నాను. ఆ రోజు నేను విచ్చలవిడిగా పెట్టిన ఖర్చు నన్ను పెళ్ళైన స్త్రీగా చూపించ గలిగే బంగారు నల్లపూసల గొలుసు. మేమిహ పెళ్ళికి సిద్ధంగా ఉన్నాము. మా జాబ్ ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 11న. సలీం కోరిక సెటిల్ అయ్యాక అని కదా. అందుకే ఫిబ్రవరి 14, 1976 పెళ్ళి నిర్ణయించుకున్నాము.
నాకు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో జాబ్ ఆఫర్ వచ్చినా నేను తిరస్కరించాను. కారణం మెడిసిన్ లో స్త్రీల పట్ల డా. బాలకిష్ణన్ కి ఉన్న అభిప్రాయాలు. కాని తరువాత మరో సీనియర్ ఫాకల్టీ నా అభిప్రాయం తప్పని నాకు నచ్చజెప్పడం, డా. బాలక్రిష్ణన్ బయటకు వచ్చి నన్ను అభినందించడం జరిగింది. అతను చిరునవ్వుతో, “ఈ జాబ్ నీ వెడ్డింగ్ గిఫ్ట్ గా ఒప్పుకో” అన్నాడు.
నేనతనికి ధన్యవాదాలు చెప్పాను. ఆ రోజునే తరువాత నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను. అతను ఆశ్చర్యపడినట్టు కనిపించినా, మెటర్నిటీ లీవ్ తీసుకునే లోపు కొద్ది నెలలైనా పని చెయ్యవచ్చని అన్నాడు.
నాకీ జాబ్ వచ్చిన సమయంలోనే జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో సలీం పోస్ట్ ధృవపడటంతో లీగల్ గా పెళ్ళి చేసుకోవాలన్నా మా కల సాకారం అవుతుందన్న నమ్మకం కుదిరింది.
ఆ రోజున, నా సోదరుడు ప్రేమ్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఒక వారం తరువాత అయితే తను పెళ్ళికి రాగలనని. ఒక వారం పెద్ద దూరమేమీ కాదని పెళ్ళి వాయిదా వేసాను, పెళ్ళి 21 ఫిబ్రవరిగా మార్చాము.
పెళ్ళి పత్రికలు వేసుకునే స్థోమతులేక ప్రతి వాళ్ళనీ వ్యక్తిగతంగా వెళ్ళి పిలిచాను. అందరూ మా పెళ్ళికి ఎంతో ఉత్సుకత చూపారు. ప్రొఫెసర్ పాఠక్ ఫాకల్టీ మెంబర్స్ లో ఒకరు, మాకు ఫామిలీ అకామడేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. అది నన్నెంతో కదిలించింది.
మా పెళ్ళికి రెండు రోజుల ముందు నేను వంట చేస్తుంటే హాస్టల్ కారిడార్ లో నడుస్తూ ఒక పరిచిత మొహం కనిపించింది. మా అక్క, బావ, వాళ్ల అమ్మాయి నా పెళ్ళి వేడుకలలో పాలు పంచుకుందుకు రాడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. మా అమ్మ, నాన్న పంపిన కానుకగా అక్క నాకు వేల రూపాయలు అందజేసింది. ముందు తీసుకుందుకు వెనకాడినా నాకూ, సలీంకూ తెలుసు ఇంటికోసం ఎన్నో వస్తువుల అవసరం ఉందని. హిందూ ఆచారం ప్రకారం సలీం నా మెడలో బంగారు నల్లపూసలు కట్టాలని అమ్మ కోరిక అని కూడా చెప్పింది. నేను ఊపిరి పీల్చుకుని మా పెళ్ళి వల్ల సలీం కాని, నా తలిదండ్రులు కాని బాధపడకుండా ఏర్పాట్లు చేసు కున్నాను.
ఆ రోజు పెళ్ళి రోజు. పెళ్ళి రిజిష్ట్రేషన్ కోసం కోర్ట్ కు వెళ్ళే ముందే నేనూ అక్కా, నా మిత్రురాలు సరళ ఇంట్లో ముప్పై మందికి లంచ్ కోసం వంట వండాం. బాగా కష్టపడే స్వభావం ఉన్న సలీం, మధ్యాన్నం సగం రోజే సెలవు తీసుకున్నాడు. ఈ అయోమయంలో హాస్టల్ లో ఫామిలీ బ్లాక్ కి నా సామాను షిఫ్టింగ్ ఒకటి.
ఉదయం 11 గంటల వరకూ కూడా సలీం అజాపజా లేదు. లంచ్ మొదలు పెట్తబోయే సమయానికి ఆదరాబాదరా వచ్చాడు. అతి మామూలుగా నేనూ, సలీం మా అతిధుల ముందు లంచ్ కి ముందు పూలదండలు మార్చుకున్నాము. ఏం ఇబ్బందిపడకుండా సలీం నా మెడలో నల్లపూసలు కట్టాడు. ఎందుకో గాని మా అన్నయ్య ఇంకా రాలేదు. మా మిత్రుడు డా. గోపాల్, మా పెళ్ళికి ఫొటో గ్రాఫర్ కూడా, ఎర్ర గులాబీల పూలదండలు తెచ్చాడు.
కోర్ట్ కి వెళ్లడానికి ఎర్ర చీర కట్టుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకుని చిరునవ్వుతో నా కడుపు నిమురుకున్నాను.
” ప్రియమైన చిన్నారీ, నీ తలిదండ్రుల పెళ్ళిని నువ్వు పర్యవేక్షిస్తున్నావు. మాట ఇస్తున్నాను నిన్నెప్పుడు సంతోషంగా ఉంచుతాను.”
కోర్ట్ కి బయలుదేరేముందు, మా అన్నయ్య హడావిడిగా వచ్చి చేరాడు. నాకు అత్యంత ముఖ్యమైన ఈ రోజున నా కుటుంబ సభ్యులు కొందరైనా ఉండటం నాకు అమితానందాన్ని ఇచ్చింది.
కోర్ట్ లో కూడా దాదాపు 60 మంది అతిధుల మధ్య కార్యక్రమం త్వరగా ముగిసిపోయింది. సలీం, నేనూ మారేజీ సర్టిఫికెట్ మీద సంతకాలు చేసాము. చప్పట్లు, అభినందనల వెల్లువ కోర్ట్ లో మారుమ్రోగాయి.
చివరికి మేం భార్యభర్తలమయ్యాము. నేను ఇప్పుడు మిసెస్ లక్ష్మీ సలీం.
కొన్ని విశ్వైక నియమ నిబంధనలు జాతి మతం, కులం జాతీయతల మీద ఆధారపడటం మార్చలేవు.
9. పెళ్లైన యువతిగా, కాబోయే తల్లిగా నా జీవితం
పెళ్ళైనా, ఈ కొత్త జీవితానికి, నా బిడ్డ ఆగమనానికి మానసికంగా సిద్ధం కావాలని తెలుసు నాకు.
మా పెళ్ళి రోజున కూడా సలీం పనిలోనే ఉన్నాడు. పెళ్ళైన జంటగా మా తొలి రాత్రిని మాత్రం సలీం గదిలో కలిసి గడిపాం.
అతను నా వంక చూసిన చూపుల్లో ఎంత ప్రేమో.
” లీగల్ గా పెళ్ళాడిన నా భార్యను నా జీవితంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాను” అన్నాడు.
గోడ మీడ తల్లీబిడ్డల చిత్రాన్ని చూపిస్తూ, ” ఇప్పుడిక నువ్వు అమ్మగా, ప్లాస్టిక్ సర్జన్ గా ఎలా సమన్వయం చేస్తావో చూడాలి”అన్నాడు.
” ఏదీ అసాధ్యం కాదు సలీం. నేను ఒక భార్యగా, తల్లిగా, ఒక సర్జన్ గా నా బాధ్యతలు సమానంగా, సక్రమంగా నిర్వహిస్తాను” అన్నాను.
నేను ఎదురుచూసినట్టుగా ప్రతి వాళ్ళూ సహకరించలేదు. మొదలు నా మిత్రురాలు ప్రమీల వాళ్ళింటికి ఆహ్వానించినప్పుడు అభినందించడానికో, ఏదైనా బహుమతి ఇవ్వడానికో అనుకున్నాను. దానికి బదులు నాకు అబార్షన్ చేసుకోమని చెప్పడం తన బాధ్యతగా భావించింది.
“లక్ష్మీ, ఈ సమాజం చాలా చిత్రమైనది. జనాలు నీ గురించి మాట్లాడతారు, ఈ బరువును నువ్వు జీవితాంతం భరించాలి. అది అంత అవసరమా?”
“నన్నలా చెయ్యమని నువ్వు ఎలా అడగగలిగావు? నాలో ఒక కొత్త జీవం ఉంది. నా బిడ్డ నాకు ప్రియమైనది. జనం ఏం అను కుంటారు, ఏం మాట్లాడతారు అనేది నాకు అనవసరం. ఇది నా ఎంపిక, నేను బిడ్డను కంటాను.” కోపంగా జవాబిచ్చాను.
” ఇప్పుడు నువ్వు బిడ్డను కంటే నువ్వు పనిచేసేంత తీరిక ఉండదు. దాని గురించి ఆలోచించు. నీకు మంచి మిత్రురాలిని గనక ఇలా చెప్తున్నాను” ఆమె వివరించాలని చూసింది.
నేను లేచి తలుపు వైపు నడిచాను. వెనక్కు తిరిగి కోపంగా, ” అన్నింటినీ సమర్ధించుకోగల శక్తి భగవంతుడు నాకిచ్చాడు. డా. బాలకృష్ణన్ కి ఈ విషయం కూడా తెలుసు. నేను ఆ జాబ్ లో చేరడం అతనికి సమ్మతమే. ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు”.
అలా అనేసి కోపం, నిరాశలు ముంచెత్తగా అక్కడి నుండి బయట పడ్డాను.
చివరికి నా కన్సల్టెంట్ లలో ఒకరు ఇలాటి ఎదురుచూడని సలహానే ఇచ్చారు. అంతే కాకుండా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అబార్షన్ విషయంలో సాయపడగల ఒక డాక్టర్ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. అతనితో వాదించడంలో అర్ధం లేదనిపించి వచ్చేసాను.
నా కుటుంబం నాకెప్పుడు అండగా ఉన్నా ఏవో వంకలు చెప్తూనే ఉండేది. నా డెలివరీ సమయంలో మా అక్క వచ్చి తన స్వంత బిడ్డగా పిల్లను తీసుకు వెళ్తాననీ ఇహ జనాలు మాట్లాడే అవకాశం ఉండదనీ చెప్పింది. కాని దాన్ని నేను ఒప్పుకోలేదు. నాకు చేసిన పనికి ఎలాటి అపరాధ భావనా లేదనీ ఇప్పుడెలాగూ పెళ్ళి చేసుకున్నాం గనక పట్టించుకునే విషయం కాదనీ అన్నాను. తను చండిఘడ్ నుండి వెళ్ళే ముందు నాకొక కెంపు ఉంగరం బహుమతిగా ఇచ్చింది. నా గురించి నేను శ్రద్ధ వహిస్తానని మాట కూడా తీసుకుంది.
మా అన్నయ్య ప్రేమ్ కి నా మిత్రురాలు ప్రమీల ఏమందో చెప్పాక, అతను చాలా ప్రశాంతంగా నా పరిస్థితి అసాధారణమైనదనీ, చాలామంది ఇలానే ప్రవర్తించ వచ్చనీ అన్నాడు.
” బలమైన వ్యక్తిత్వం ఉన్న దానవు. ఇదంతా భరించగలనన్న నమ్మకం నీకుంటే ఏదీ నీకు అడ్డం రాదు”అన్నాడు.
“ఎవరేమనుకున్నా నాకు నా బిడ్డ కావాలి. చివరికి నా కుటుంబం నన్ను అంగీకరించక పోయినా నాకు సపోర్ట్ గా నా బిడ్డ, భర్త నాతో ఉండాలి” అని చెప్పాను. నావైపు అతను విచారంగా చూసి భ్రాతృ ప్రేమతో,
” సమాజం మీ పెళ్ళి హర్షించదు గనక ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అవకండి. నార్త్ ఇండియాలో ఉండండి, లేదా విదేశాలకు పొండి. ఆ విధంలో మీ భవిష్యత్తు సురక్షితంగా, ఆనందంగా ఉంటుంది.” అన్నాడు.
అది చెప్పి నన్ను నా విచారాన్ని, దానితో పాటు జీవితం నా దారిలో ఏం విసిరినా భరించే శక్తినీ వదిలి వెళ్ళాడు.
కిశోర్, మరో అన్నయ్య మరింత సాయంగా ఉంటూ నాకు అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి బేబీని చూసుకుంటానని చెప్పాడు.
ప్రతి వాళ్ళ సలహా సహాయాలు విన్నా, నాకు తెలుసు నేను బిడ్డను మోస్తున్నానని , అందుకే డా. బాలకృష్ణన్ దగ్గరకు వెళ్ళి, ” సర్ నాకిచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు. కాని నాకీ బిడ్డ కావాలి. నా బిడ్డ పట్ల శ్రద్ధ వహిస్తూ నా బాధ్యత సక్రమంగా నిర్వహించగలనా అనిపిస్తోంది.” అన్నాను.
అతను నావైపు చూసి ఆర్ద్రంగా చిరునవ్వు నవ్వి, ” ఈ ఉద్యోగం నీకోసమే నిర్దేశించబడింది. నీకు పనిచేసేందుకు మూడునెలల సమయం ఉంది. ఆ పైన నువ్వు ప్లాస్టిక్ సర్జరీలో ఎమ్ సీ ఎచ్ చెయ్యాలా అనేది నిర్ణయించుకుంటావు.” నాకు ఇచ్చే అవకాశానికి, ఆయన నమ్మకానికి ఆనందపడి ఊపిరి పీల్చుకున్నాను.
నా జాబ్ మొదలు పెట్టడానికి ముందు, సలీమ్ ఎలాగో తన పనిలో కొంత సమయం వెసులుబాటు చేసుకున్నాడు. ఇద్దరం ఆగ్రాలో తాజ్ మహల్, ఢిల్లీ చూసి రావాలనుకున్నాము. మేం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎయిమ్స్( ఏ ఐ ఐ ఎమ్ ఎస్) కి వెళ్ళి డా. కటారియా రికమెండ్ చేసిన డాక్టర్ ని కలిసి రావాలనుకున్నాము. నేను వెనకముందాడాను కాని సలీం నన్ను ఆవిడను కలవడానికి ఒప్పించాడు. ఆవిడ నా ప్రెగ్నెన్సీ పద్దెనిమిది వారాలదనీ, ఈ స్థితిలో అబార్షన్ అసాధ్యం అనీ చెప్పింది. ఇలా చెయ్యమన్నందుకు డా. కటారియా మీద , సలీం మీద కూడా కోపం వచ్చింది.
తాజ్ మహల్ చూడటానికి వెళ్ళినప్పుడు అదంతా మరచిపోయి ఆనందంగానే గడిపాను. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం తాజ్ మహల్ కట్టాడు. నేను సలీంతో అన్నాను “మనిద్దరం ఏదో ఒకరోజున అవసరం ఉన్న వాళ్ళకోసం, వెనకబడిన వాళ్ళకోసం ఒక హాస్పిటల్ కట్టాలి.”
చండీఘడ్ తిరిగి వచ్చాక పచ్చి మామిడికాయల కోసం నా వ్యామోహం లాగా నా గర్భం మరింత ప్రస్ఫుటమయింది. కాని, విచారం ఏమిటంటే సలీం ఒక్క రోజైనా నీకేమైనా కావాలా అని అడగలేదు. ఆ రోజుల్లో అతన్నించి మరింత ప్రేమాదరణలు కోరు కున్నానని అతనికి తెలియదనుకుంటాను. నేనీ మాట చెప్పగానే నా సుఖ సౌఖ్యం కోసం చెయ్యగలిగినవన్నీ చేసాడు.
మా కాన్వొకేషనప్పుడు కూడా వెళ్ళడానికి వెనకముందయాను.అప్పటికే కడుపు బాగా కనిపిస్తోంది. కాని మన బిడ్డకోసం నువ్వు ధైర్యంగా , నమ్మకంగా ఉండాలని చెప్పాడు సలీం.
త్వరలోనే నా జాబ్ లో చేరాను. జీవితం మరింత కష్టమయిపోయింది. కాని నేను మాత్రం స్థిరంగా అన్ని సవాళ్ళనూ విల్ పవర్ తో ఎదుర్కొని నిలవాలని అనుకున్నాను. పొద్దున్నే వంటచేసి పనికి వెళ్ళి, మళ్ళీ రాత్రి వచ్చి వంట చెయ్యల్సి వచ్చేది. అయితే వేసవి మండే ఎండలకు వార్డ్స్ లోనే ఉండి చల్లబడేవరకూ అదో ఇదో చదువుకుని ఆపైన నడిచి వచ్చేదాన్ని. జనాలు నాకడుపును గమనించినా అడిగేవాళ్ళు కాదు. అడిగిన కొద్దిమంది మాత్రం బాధపెట్టేలా కామెంట్ చేసేవాళ్ళు. నేను అవి పట్టించుకోడం మానేసాను.
సలీం తన పనిలో బిజీగా ఉండేవాడు. మాకు కలిసి గడపడానికి కూడా ఎక్కువ సమయం దొరికేది కాదు.
అయినా ఏదో విధంగా సలీం సాయపడటానికి చూసేవాడు. ఇంటికి వెళ్ళి నేను వండిపెట్టిన లంచ్ పాక్ చేసుకు వచ్చేవాడు.
అది ఇద్దరం కలిసి తినే వాళ్ళం. అయినా ఇంకా అతనేదో నామీద మరింత శ్రద్ధ చూపించాలని గింజుకునేదాన్ని.
ఒకసారి డా. సోమరాజు అనే మిత్రుడితో డిన్నర్ చేసేప్పుడు పీజీఐ ఎమ్ ఈ ఆర్ లో కార్డియాలజీ డీ ఎమ్ చేస్తున్న అతను నా ఆరోగ్యం ప్రస్తావిస్తూ, ప్రతిదీ అలా గాలికి వదిలేసే బదులు ఒక అబ్స్ట్రెటీషియన్ ని చెకప్ కి కలవడం మంచిదని సూచించాడు. నేను బాగానే ఉన్నానని అతనితో అన్నా, చెకప్ కి నాతో పాటు సలీమ్ కూడా రావాలని నా ఆకాంక్ష. అయినా చెకప్ కి వెళ్ళి అంతా బాగనే ఉందని తెలిసాక చాలా ఆనందపడ్డాను. అప్పటికి నా గర్భం వయసు ముప్పై వారాలు.
నా డెలివరీ డేట్ దగ్గరపడుతుంటే నాకు పని మరింత కష్టం అనిపించేది. మొదటిసారి కలిసిన డా. బాలకృష్ణన్ లో మంచి స్ట్రిక్త్ గా క్రమశిక్షణ పాలించే మనిషి అదృశ్యమై ఒక జాలి, దయా గల తండ్రిని చూడసాగాను. నా సౌఖ్యం కోసం తాపత్రయపడేవాడు. నాకున్న షిఫ్ట్ లో పని చేసేందుకు నా బదులు ఎవరినైనా చూస్తానని కూడా అన్నాడు. కాని నేను కష్టపడి పనిచేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. నేను నా ఎమ్ సీ హెచ్ కోసం అప్ప్లై చెయ్యాలి కాని అతనితో కలిసి పని చెయ్యడానికి నేను సరితూగు తానా లేదా అనేది ఇంకా బాలకృష్ణన్ గారు నిర్ణయించుకున్నట్టులేదు. అందుకే నాకేం చెయ్యాలో తెలియట్లేదు. ఇంకోపక్క నా డెలివరీ డేట్ దగ్గరకు వస్తోంది.
బేబీకి నాకు సాయపడటానికి అమ్మ నాతో ఉండాలని అనుకుంటోందని అక్క చెప్పినప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఇంట్లో సాయం ఉంటుంది గనక ఎమ్ సి హెచ్ కి అప్ప్లై చెయ్యాలనుకున్నాను.
ఇదంతా ఒక పక్కన అవుతుంటే ఒక రోజున సలీం తమ్ముడు , తండ్రి మొదటి సారి మా ఇంటికి సర్ప్రైజ్ గా వచ్చారు. మా పెళ్ళి వార్త వాళ్ళకు చేరినా, వాళ్ళబ్బాయి నిజంగా ఒక హిందువుల పిల్లను పెళ్ళిచేసుకున్నాడా అనేది వాళ్ల స్వంత కళ్ళతో చూడాలని వచ్చారు. మా మొదటి కలయిక దురదృష్టవశాత్తూ అంత ఆహ్లాదంగా లేదు, మా మామగారు నన్ను నా మాతృభాష అయిన తెలుగులో కాక హిందీలోనే మాట్లాడాలని నియమం విధించడం వల్ల. పిల్ల పుట్టాక కూడా హిందీలోనే మాట్లాడాలని నిర్దేశించారు. . ఇది ఆయన నాకు చెప్పిన విధానాన్ని నేను హర్షించలేకపోయాను. కాని అలాగని ఒక సీన్ క్రియేట్ చెయ్యదలుచుకోలేదు.
వాళ్ళు మాతో రెండురోజులున్నారు. కాని అది అక్కడితో సరి కాదని ముందు ముందు చాలా దూరం వారితో కలిసి అత్త మామలతోనే కాక, కుటుంబంతోనూ ముందుకు సాగాలని నాకు తెలుసు.
సౌకర్యవంతమైన ప్రశాంతత గల ఉన్నత శ్రేణి జీవితానికి కొన్ని నియమాలతో సవాళ్ళను ఎదుర్కోవాలి.

ఇంకా వుంది…

2 thoughts on “స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *