April 28, 2024

వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా! – 3 వ రంగము

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు

సుందర దాసు ఇల్లు
దాసు:- ( సరుకులతో ఇంటిలోకి ప్రవేశిస్తూనే)
కాళీ కాళీ కాళీ
వేళొచ్చెను నీకు ఇంటి వెలుగువు గాగన్
కాళీ:-ఏవండోయ్ దాసుగారూ! డోసేమైనా పడిందా మాంఛి హుషారులో కందళిస్తున్నారు
దాసు:-తాళుము రేపటి దాకా
పాళికి పదునెక్కు ఘడియ
పరతెంచునహో-11
కాళీ:-కలయో నిజమో తెలియదు
అలవోకగ ఆత్మసఖుడు
అల్లెను కందం
బెలకోయిల వలె పాడగ
పులకించెను మేను పద్య పోడిమి
గనినన్-12
(నోటి వద్ద చేయి పెట్టి వాసన చూసి)
సురాపాన వాసన ఏమీ లేదే !
చిరు నవ్వులు చిందిస్తున్న భర్తాళుని గని
ఏమి విశేషమోయి మగడేశ్వర చెప్పుము మందహాసముల్
మోమున చిందు కారణము మోవిని విప్పుము ఆలసించకన్
తామిటులెన్నడున్ సరసతాననులౌటను గానలేదు మీ
కేమయెనయ్యొ వేగిరమె ఏర్పడ జెప్పుడి చంపకుండగన్-13
దాసు:- ఆగవలెనొక్క రాతిరి అతివ నీవు
రేపు ఉదయము గుట్టది
రేకువిప్పు
మార్పు రానున్నదిక నీదు
మనికిలోన
ఊహకందని దా వార్త ఓర్పు
వలయు-14
కాళీ:- ఎ హె సస్పెన్సుతొ చంపకు
సహనములేదింక నాకు చప్పున
చెప్పెయ్
కహొనా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
సహిసె బతావో జరాస సాథీ మేరీ-15
దాసు:-అచ్ఛా ఠీక్ హై సునో ఫిర్.

నీ పద్యాలకు ఇంకమీదటను ఓ నీరేజ పత్రేక్షణా
ఏపారన్ ప్రభ గల్గు కాలమదియే ఏతెంచె నెట్లన్న మా
తోపాటే బడిలోన విద్యగడిసెన్ తోడైన మా మిత్రుడే
రేపేదో ఒక సీరియల్ మొదలుబెట్టే రిచ్చ టన్ కొత్తగా-16
కాళీ:- ఏంటి టీవీ సీరియలా! నిజమా!
మరి దానికి నాకేమిటి లింకు.అందునా పద్యాలతో.
దాసు:- చెబుతా గానీ ముందో కాఫీ పట్రా
కాళీ:- కాఫీ కోసం ఇంత బిల్డపా
దాసు:- మీ ఆడాళ్లింతే మగవాళ్ల మాటలన్నీ అబద్ధాలుగానే తోస్తాయి.
కాళీ:- ఆహాహా
సత్యకాలమునుండి సత్యహరిశ్చంద్రు
డవతరించె నేడు అవని పైన
దాసు:-
దెప్పి పొడుచుట చాలు దేవతామూర్తులు
ఆడువారలంత అవనిపైన
కాళి:-
ఆడు వారము కాము ఆడించు వారము
కూడు దొరక దోయి కొంపలోన
దాసు:-
నేటి కాలమందు కూటికి కరువేమి
ఆన్ లైను లోన అన్ని దొరుకు
కాళి:-
అయిన నేడింక ఆన్లైను ఆర్డరిచ్చి
ఆరగించుడి నే వంట అసలు చేయ
దాసు.:-
చాలు చాలింక జోకులు చంద్ర వదన
వంట మొదలెట్టు వెంటనే వలపు మొలక
-16
కాళి:-అలా దిగి రండి మరి .ఇంతకీ అసలు సంగతి ..
దాసు.:- చెప్తా తీరుబడిగా.నువ్వు వంట మొదలెట్టు.ఫోన్ వస్తోంది……(ఫోనెత్తి)
ఆఁ శర్మా……
***
దాసు,బ్రహ్మం,శర్మ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు.కాఫీ కప్పులతో కాళీ ప్రవేశం.
కాఫీలు అందిస్తూంటే …
శర్మ:- రండి.మేడమ్.మీరు కూడా కూర్చోండి.మా వాడు చెప్పే ఉంటాడు మీకు విషయం.
బ్రహ్మ:-చెల్లాయ్ కాఫీ అమృతం.అవును మరచి పోయాను.నిన్న నువ్వు రాసిన సరుకులజాబితా పద్యాలు అద్భుతం.నన్నడిగితే అవి ఫ్రేంకట్టించి పెట్టుకోవాలి.
కాళి:- (కొంచెం సిగ్గు పడి ) ఏదో సరదాగా రాసానన్నయ్యా.అవి మీదాకావస్తాయనుకోలేదు.
దాసు:- నేనేం కావాలని వినిపించ లేదు.
వాడు లిస్టు మరచి పోయాను ఇంటికి వెళ్లి తెస్తానంటే ఇచ్చాను.
శర్మ:- ఏది జరిగినా మన మంచికే. ఇవాళ మీ దగ్గరికి రావడానికి కూడా ఆ పద్యాలేకారణమయ్యాయి కదా!
కాళీ:- ఏదో ఊసుపోక వాట్సప్ గ్రూపుల్లో పోటీలు పడి మా స్నేహితురాళ్లంతా రాస్తూఉంటే ఈ మధ్యే నేనూ రాయడం మొదలు పెట్టాను గానీ నేను మీ ప్రోగ్రామ్‌ లో పార్టిసిపేట్చేసేంత దాన్ని కానండి. మా వారితో కూడా అదే అన్నాను.
దాసు:- ఇందాక వాడు రాగానే అదే చెప్పాను.కానీ వాడు నీతో మాట్లాడుతా డట విను. విన్న తరువాత నీ ఇష్టం.
బ్రహ్మ:- చెల్లాయ్ ఇలాంటి అవకాశం కావాలంటే లభిస్తుందా.నువ్వు కాదనకు.
శర్మ:- మేడం ముందు నేను చెప్పేది విన్న తరువాత మీ అభిప్రాయం చెబుదురు గాని.నోఫోర్స్ .బట్ హియర్ మి ఫస్ట్.
కాళీ:- చెప్పండి ఫర్వాలేదు.
శర్మ:- ముందు మీరు రిలాక్సవండి.
నా ప్రాజెక్టు గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒకటి రెండు విషయాలు అడగాలి.
కాళీ:- అలాగే అడగండి.
శర్మ:- మీరు తెలుగు టీచర్ కదా!
కాళీ:- (తల ఊపుతూ)అవునండి.
శర్మ:- తెలుగులో పద్యాలు రాస్తారు కదా!( కాళీ తలాడిస్తూంది)
శర్మ:- మీరు ఎన్ని వాట్సప్ గ్రూపుల్లో ఉన్నారు.
కాళీ:- కొంచం ఇబ్బంది గా ఫీలవుతూ ఐదారు గ్రూపుల్లో ఉన్నాను.
శర్మ:-అడగాల్సినా ప్రశ్న కాకపోయినా అడుగుతున్నా.ఎఫ్బీలో కూడా ఉన్నారా?
కాళీ:- ఉన్నాను.
శర్మ:- పద్యాలేనా ? కవితలూ గేయాలూ
దాసు:- అన్నీ రాస్తుందిరోయ్
బ్రహ్మ:- చెల్లాయి నాతో బాటుగా కవి సమ్మేళనాల్లో కూడా పాల్గొంది.
శర్మ :- చాలు మీరు మా ప్రాజెక్టులో నూటికి నూరు పాళ్లు పనికొస్తారు.అదంతా నేనుచూసుకుంటాను.అదంతా వివరంగా చెప్పే ముందు మీరో పని చేయాలి.
(అందరూ ఏమిటన్నట్టుగా శర్మ వైపు చూడటంతో)
శర్మ:- ఏం లేదు మేడం.ముందు మీరు నాలుగు మాటలు మాట్లాడాలి.అప్పుడే మీరు ఫ్రీఅవుతారు.మేం వాట్సప్ గ్రూపుల ఆధారంగా ఒక టీవీ సీరియల్చేయాలనుకుంటున్నాం.కామెడీ,సెటైర్ లతో రియలిస్టిక్ ఎప్రోచ్ ఉండే విధంగా ప్లాన్చేస్తున్నాం.ముఖ్యంగా సోషల్ మీడియాను ,యూజ్ ఫుల్ మోటివేషనల్ గా మార్చాలనేసంకల్పం.దానిలో చాలా వరకు మీలాంటి టాలెంటెడ్ వాళ్లను ఇన్వాల్వ్ చేయాలని మాఉద్దేశం.
బ్రహ్మ:-ఇంతకీ చెల్లెమ్మ ఏం చేయాలో చెప్పలేదు.
శర్మ:- (జోవియల్ గా నవ్వుతూ) ఏం లేదు
మేడం కొన్ని పద్యాలు చదవాలి.
బ్రహ్మ:- ఓ భలే.భలే.
శర్మ:- మా కెమెరా వుమన్ లకుమ ఆన్ ద వే.ఆమె వచ్చిన తరువాత కొన్ని రికార్డు చేస్తాంఫర్ ట్రయల్.ఈ లోగా కొంచెం ఈజ్ అవడానికి ఏదైనా చదవి వినిపించడమోమాట్లాడటమో చేయాలి.
దాసు:- కాళీ విన్నావుగా .నా మీద పద్యాలతో దాడి చేయడం కాదు. ఇప్పుడు
చూపించు నీ టాలెంట్. (కాళీచిరు కోపంతో చూస్తుంది భర్తవైపు) అయినా విషయంవిన్నావుగా ముందు నీ అభిప్రాయమేమి టో చెప్పు . వాడి ప్రపోజల్ నీకు ఓకేనా,
బ్రహ్మ:-ఏరా మా చెల్లెమ్మ సంగతి తరువాత ముందు నీకు ఓకేనా.అది చెప్పు
కాళీ:-భలే అడిగారు అన్నయ్య గారూ.విషయం వింటుంటే కొంచెం ఉత్సాహంఅనిపించినా నావల్ల అవుతుందా అనేదే నా సందేహం. ఇల్లు,బడి అంటే వేరు.ఇది కొత్తకదా.
శర్మ:- ఏ కొత్త విషయమైనా అంతే కదండీ.
ఒక రకంగా నాకూ ఇది కొత్తే.సినిమాల నుండి సీరియల్ వైపు రావడం.
దాసు:- చెప్పు కాళీ.నాకైతే ఏమీ అభ్యంతరం లేదు.అలాగని నిన్ను బలవంత పెట్టను.నీకిష్టమైతే నాకు ఓకే.
బ్రహ్మ:- కాదనకు చెల్లెమ్మా.ముందు ఓ పద్యం వినిపించు.
కాళీ:- (భర్తవైపు చూసి అతడు చదువు ఏం ఫర్లేదన్నట్టు సైగ చేయగానే) ఏం చదవాలి .
దాసు:-మొన్న మహిళా దినోత్సవం నాడు రాసిన పద్యాలు చదువు రెండు మూడు.
శర్మ:-(థమ్సప్ చేసి) బెస్ట్.ప్రొసీడ్ మేడం.
కాళీ:-(ఫోన్ లో వెతుక్కుని)

ఆకసమునందు సగమంద్రు అతివ యనిన
యత్ర నార్యస్తు పూజ్యతే యనుచు నుంద్రు
ఆధునిక మహిళ అన్నిట అగ్రగామి
అయిన నేమిటి లాభమ్ము అబలయంద్రు -18
శర్మ:- ఫెంటాస్టిక్
బ్రహ్మ:- ఎంత చక్కటి పద్యం. కానియ్యమ్మా.
కాళీ:-
బోధనమునుండి నింగిలో నీదుదనుక
ఎన్నియో రంగముల లోన ఎదిగె మహిళ
మహిళలకు సాధికారత మాట వరకె
ఎన్ని చేసినా అబలయను చిన్నచూపె-19

శర్మ:- నిజం మేడం మీరన్నది.కంటిన్యూ ప్లీజ్ .
కాళీ:-
వంటపని ఇంటి పనులెన్నొ వనితజేయు
పిల్లలను బెంచు చదివించు ప్రేమమీర
బయటికేగును ఉద్యోగ బాధ్యతలకును
అయిన నేమాయె ఆడది ఆటబొమ్మ-20
దాసు:-ఏయ్ నిన్ను నేనాట బొమ్మలా చూసానా?
బ్రహ్మ:- కుళ్లుకోకోయ్.నువ్వొక్కడివి చక్కగా చూసుకుంటే సరిపోతుందా .చెల్లెమ్మ లోకంతీరు చెప్పింది.
శర్మ:-సుందరం .నీ ఎంకరేజ్ మెంట్ స్పష్టంగా తెలుస్తుంది లేరా!ఏమంటారు మేడమ్.
కాళీ:-అవును .ఆయన సహకారం చాలా ఉంది.
శర్మ:- నైస్ మేడమ్. మీరు చాలా షైనవుతారు.నో డవుట్.అయితే మీరు ఇంకా కొందరుమీలాంటి టాలెంటెడ్ వాళ్లని డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ కుకింగ్,
గార్డెనింగ్,పెయింటింగ్ ఎట్సెట్రా లేడీస్ ని సజెస్ట్ చేయండి. వి షెల్ హావ్ ఎ నైస్
సిరీజ్.బట్ అందరూ వాట్సప్ వాడే వాళ్లై
ఉండాలి.
బ్రహ్మ.:-ఇంతకీ సీరియల్ పేరేమిటిరా
శర్మ :- అదే ఆలోచిస్తున్నాం క్యాచీగా ఉండాలి.
బ్రహ్మ:- పోనీ నేను చెప్పనా
శర్మ:-వై నాట్.
బ్రహ్మ:- వాట్సప్ వాట్సప్ వల్లప్పా
శర్మ :- ఓహ్! సూపర్ రా.ఐతే టైటిల్ సాంగ్ నువ్వే రాయి.అది కూడా అదిరి పోవాలి.
బ్రహ్మ:- థాంక్యూ.
లకుమ వస్తుంది కెమెరాతో.
లకుమ:- గుడ్మాణింగ్ సర్.
శర్మ:- కమాన్ లకుమ దీజార్ మై ఫ్రెండ్స్ దాసు అండ్ బ్రహ్మం.షీ ఈజ్ మిసెస్ కాళీ దాస్.
లకుమ:- (అందరినీ విష్ చేసి కెమెరా సెట్ చేసుకుంటుంది)
కాళీ:- ఏమండీ నేను వెళ్లి టిఫిన్ తెస్తాను అందరికీ.

సశేషం

1 thought on “వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా! – 3 వ రంగము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *