April 27, 2024

సుందరము – సుమధురము – 9

రచన: నండూరి సుందరీ నాగమణి

మనసుకు ఎంతో ఆహ్లాన్నిచ్చేది సంగీతం. శాస్త్రీయ సంగీతంలోని రాగాలన్నీ కూడా వినటానికి, అనటానికి (పాడుకోవటానికి) ఎంతో హాయిగా ఉండి, ప్రేక్షక శ్రోతల హృదయాలనే కాక, గాయనీగాయకుల మానసాలకు కూడా ఎంతో సాంత్వనాన్ని కలిగిస్తాయనటంలో సందేహమేమీ లేదు.
కొన్ని రాగాలలో సమకూర్చిన చిత్రగీతాలు ఎంతో మనోహరంగా ఉండి, శ్రోతల మనసులకు హాయిని కలిగిస్తాయి. అలాంటి రాగాలలో చిత్రాలలో ఎక్కువగా ఉపయోగించినవి హిందోళ, మోహన రాగాలు. రెండూ ఔడవ రాగాలే. అంటే సప్తస్వరాలు ఉండవు. కేవలం ఐదు స్వరాలు మాత్రమే ఆరోహణంలోనూ, అవరోహణంలోనూ ఉంటాయి. మోహన రాగంలో స్వరపరచిన మధురగీతాలు సినిమాలలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ సరే, మరి మోహనరాగమే ఒక పాట అయితే?
ఆ పాటే ‘పలికినది, పిలిచినది… పరవశమై నవ మోహన రాగం…’ అనే పాట. ఈ పాటను జయకృష్ణా మూవీస్ పతాకం పై 1980లో విడుదల అయిన ‘సీతారాములు’ చిత్రం కోసం ఆచార్ ఆత్రేయ గారు రచించగా, సత్యం గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు దర్శకత్వాన్ని వహించారు.
చిత్ర కథానాయకుడిగా శ్రీ కృష్ణంరాజు, కథానాయికగా జయప్రద నటించారు. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోతున్న పాటను గాయకులు శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు, గాయని శ్రీమతి పి సుశీల గారు ఎంతో మధురంగా గానం చేసారు.
ఈ పాట మొత్తం మోహన రాగంలోనే సాగుతుంది. ముందుగా మోహన గీతమైన ‘వరవీణా మృదుపాణీ’తో బృందగానంగా ప్రారంభమై, పల్లవి అవగానే, వీణపైన మోహన వర్ణమైన ‘నిన్నూ కోరీ’తో కొనసాగి, మొదటి చరణం కాగానే మోహనరాగ కృతి అయిన ‘రామా నిన్నే నమ్మినవారము’ (త్యాగరాజ విరచితం) అని మురళీనాదంతో కొనసాగి, రెండవ చరణం కాగానే తని ఆవర్తన వలె మృదంగ ధ్వానంతో కొనసాగి, మూడవ చరణం మరియు పల్లవిలతో ముగుస్తుంది. పాట ముగిసిపోయినా మన మనోమందిరాలలో మోహనరాగం అలా పలుకుతూనే ఉంటుంది. ఈ పాట యొక్క మహత్వం అలాంటిదని చెప్పక తప్పదు.
మరి ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించుదాం రండి…
పాట సాహిత్యం:

సాకీ :
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని.. జయ జయ జయ…
(సరస్వతీ దేవి స్తుతి. మృదువైన చేతిలో వరవీణను ధరించిన తల్లీ! కలువ కన్నుల విరించికి రాణీ! మిక్కిలి మనోజ్ఞమైన తుమ్మెదల వంటి కుంతలములు కలదానా! దేవతలు స్తుతించే కళ్యాణీ! పోల్చలేనటువంటి ఉత్తమ గుణాలు కలదానా, ఎల్లప్పుడూ జయాన్ని కలిగించే తల్లీ, వరదునికి ప్రియమైన రంగ నాయకీ, కోరిన ఫలాలను ప్రేమతో ఒసగే కరుణామయీ, తామరపువ్వు ఆసనముగా కల మా వాణీ… జయము జయము జయము నీకు అమ్మా!)

పల్లవి :
పలికినది… పిలిచినది…
పరవశమై నవమోహనరాగం

పలికినది… పిలిచినది…
పరవశమై నవమోహన రాగం
పలికినది… పిలిచినది…
(మోహన రాగం ఎంతో పరవశమై, పలికినది, మనలను పిలిచినది)

చరణం 1 :
గగనాంగనాలింగనోత్సాహియై…
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై …
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై…

(గగనాన్ని ఆలింగనం చేసుకోవాలన్నంత ఉత్సాహంతో, ఈ జగమంతా పూలగుచ్ఛమై పులకించింది.)

మమతలు అల్లిన పెళ్ళిపందిరై ..
మమతలు అల్లిన పెళ్ళిపందిరై …
మనసులు వీచిన ప్రేమ గంధమై ….
పలికినది… పిలిచినది..
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది…

(మమతలు అల్లిన పెళ్ళి పందిరి అయింది, మనసులు వీచిన ప్రేమతో కూడిన చల్లని గాలి కూడా అయింది, ఈ మోహన రాగం… పలికినది, పిలిచినది…)

చరణం 2 :
గంగా తరంగాల సంగీతమై… కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై… కమణీయ రమణీయ యువగీతమై
కలిమికి లేమికి తొలి వివాహమై… కలిమికి లేమికి తొలి వివాహమై..
యువతకు నవతకు రసప్రవాహమై…
పలికినది పిలిచినది… పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది…

(గంగాతరంగాల సంగీతమై, కమనీయంగా, రమణీయంగా యువతీయువకులు పాడుకునే యుగళగీతమై, కలిమికి లేమికి తోలివివాహమై, యువతకు, కొత్తదనానికి రసప్రవాహమై ఈ మోహన రాగం పలికినది, పిలిచినది.)
చరణం 3 :
మలయాద్రి పవనాల ఆలాపనై… మధుమాస యామిని ఉద్దీపనై …
మలయాద్రి పవనాల ఆలాపనై… మధుమాస యామిని ఉద్దీపనై…
అనురాగానికి ఆది తాళమై… అనురాగానికి ఆది తాళమై… ఆనందానికి అమరనాదమై…
పలికినది పిలిచినది… పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది…

(మలయపర్వతం మీది నుంచి వీచే చల్లని పవనాల గానమై, వసంత రాత్రి యొక్క ఉద్దీపనయై, మన అనురాగానికి ఆది తాళమై, ఆనందానికి అమరనాదమై… పలికినది, పిలిచినది ఈ మోహనరాగం, పరవశమై…)

పాట యొక్క చిత్రీకరణ గురించి మాట్లాడుకోకపోతే ఈ వ్యాసం పరిపూర్ణం కాదు. అది కథానాయిక సీతకు (జయప్రద) వచ్చిన ఒక స్వప్నం. అందులో ఒక పెద్ద మందిరం… అక్కడ కొలువైన వీణాపాణి సరస్వతీ దేవి, ఎంతో అందంగా, నిండుగా కొలువుదీరి ఉంటుంది. ఆమె ఎదురుగా చాలా మంది పిల్లలు కూర్చుని ‘వరవీణా’ అంటూ గీతం పాడుతూ ఉండగా పాట మొదలవుతుంది. అప్పుడు ప్రవేశించిన కథానాయికా నాయకులు జయప్రద, కృష్ణంరాజులపై పల్లవి చిత్రీకరణ జరుగుతుంది. పెద్ద పెద్ద వీణలు సెట్టింగ్ లో ఉంటాయి. వాటి మీద జయప్రద నాట్యం చేస్తుంది.

పల్లవి అయిపోగానే మళ్ళీ వీణపైన మోహన వర్ణం ‘నిన్ను కోరీ…’ జయప్రద వీణపై పలికిస్తూ ఉండగా వస్తుంది. ఆ తరువాత మొదటి చరణం. మొదటి చరణం కాగానే వచ్చే పల్లవిలో బాలూ స్వరంలో కొన్ని కొత్త సంగతులు ఎంతో బాగా పలికాయి. అది పూర్తి కాగానే, ‘రామా నిన్నే నమ్మిన’ కీర్తన చాలా మంది పిల్లలు మురళీగానంలో వినిపిస్తారు. అది పూర్తి అవుతూ ఉండగానే మళ్ళీ రెండవ చరణం మొదలు అవుతుంది. అది కూడా అయిపోయాక పెద్ద పెద్ద తబలాలు. వాటి పైన మళ్ళీ జయప్రద నాట్యం… లయవిన్యాసంతో… అప్పుడు మూడవ చరణం, పల్లవి వస్తాయి. పాట పూర్తి అయేసరికి రసజ్ఞుడైన ప్రేక్షకుడికి, మృష్టాన్న భోజనంతో కడుపునిండిపోయినంత ఆనందం కలుగుతుంది.

ఇంత ఈ అందమైన గీతాన్ని ఈ క్రింది వీడియో లింక్ లో వినేద్దాం రండి.

 

 

మరో మధురగీతంతో మళ్ళీ వచ్చే సంచికలో కలుసుకుందామా!

 
***

1 thought on “సుందరము – సుమధురము – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *