April 27, 2024

అన్నమాచార్యులు – హరి నీవే సర్వాత్మకుఁడవు

వ్యాఖ్యానము: చామర్తి శంకర నాగ శ్రీనివాస్

 

ఉపోద్ఘాతము: అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలను సత్యమునకు దారి చూపు దివిటీలుగా మార్చి వ్రాసిరి. వారు ఆ వ్యక్తం చేయలేని భావనా స్థితి నుండి ప్రపంచమునకు సెలవిచ్చిన ఈ కీర్తనలను, ముఖ్యంగా అన్నమాచార్యుల అంతరంగమును పరిశీలించక; కేవలము పదముల అర్థములను విశదీకరించుట వలన ప్రయోజనం చేకూరదు.

వారు తమ కాల పరిస్థితులకు దృష్టిలో ఉంచుకొని తమ విప్లవాత్మక ఉద్దేశములను సంప్రదాయము అను తెరల వెనుక దాచి ఉంచిరి. అతి జాగ్రత్తగా గమనించిన వారు చేరుకున్న స్థితి నుండి తనకు దైవముతోను లేదా సత్యముతోను ప్రత్యక్ష అనుభవంగా కలిగిన (లేదా తెలుసుకున్న దానిని వివరించుటకు) వేలాది విధములుగా ప్రయత్నం చేసారు.

అన్నమాచార్యులవారు అత్యంత గహనమైన విషయములను మనకు సూటిగా సులభముగా చెప్పుటకు తేట తెలుగులో వ్రాసినారు. కానీ కాలగమనముతో భాషలోని మార్పులతో అవి అర్థం చేసుకొనుట కొంత కష్టమగుచున్నది. కావున ఈ కీర్తనలను మనము ఊహించుకొని మన అనుభవమునకు వచ్చిన పాక్షిక సత్యములతో రంగులు అద్ది భాష్యమును చెప్పుట పరిపాటి అయినది.

హరి నీవే సర్వాత్మకుఁడవు
యిరవగు భావన యియ్యఁగదే ॥ పల్లవి॥

ముఖ్య పదములకు అర్ధములు: ఇరవు = అనుకూలము, తగిన

భావము: హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా!

వివరణము: భగవానుడు సర్వాంతర్యామియై వుండగా, మనము దైవమును తెలియుటకు ఏల యత్నము చేపట్ట వలెను అని సందేహము కలుగక మానదు. ‘మానవుడు ఏ రకమైన కార్యములను చేపట్టిన జన్మ సాఫల్యము పొందును’ అను ప్రశ్న ఉదయించును.

వీనికి నేరుగా సమాధానము సులభం కాదు. ఎన్నో మతములున్నను, ఎందరో మహానుభావులు అనేక విధములైన వివరణలు యిచ్చినప్పటికి, ఇది తిరిగి తిరిగి మనలను వేధించుచునే యున్నది.

అన్నమాచార్యుల ప్రతిభ వారు మూల విషయములతో సహా మానవులను పరీక్షించు వానిని నేరుగా ప్రస్తావించుటలో వున్నది. మన ఇప్పటి భావనలు సరి అయినవి కావని సూటిగా చెప్పారు.

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యఁగదే ॥ హరి ॥

ముఖ్య పదములకు అర్ధములు: యీడువడని = కాలముతో పాటు క్షయమునొందని;
భావము: మా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును. వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా!

వివరణము: మనచుట్టూ వున్న ప్రపంచము అనూహ్యమైనది. దీనిని మనము తరగతులుగాను ఇది లోపలిది. అది బయటది అని విభజించి చూచుటను అన్నమాచార్యులు ఎత్తి చూపు చున్నారు.

భగవద్గీత పదమూడవ అధ్యాయంలో “బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ” (13-16) అనగా “జీవులన్నింటికి బయట లోపలా ఉన్నది, కదులువానియందు కదలనివానియందునూ ఉన్నది దైవమే” అని చెప్పిరి. ఎవరైతే అంతరంగములోని వాడు, గుణముల తెరయు, దానికి ఆవల వున్నది ఒకటేనని యథార్థముగా తెలియునో వానినే దృష్ట అనిరి.

ఇదే విషయమును తెలుపుతూ విశ్వవిఖ్యాత సర్రియలిస్ట్,(అధివాస్తవిక కళాకారులు) రీనె మాగ్రిట్ గారు La Savoir (జ్ఞానం) అను పేరు గల చిత్రమును గీసారు. ఈ చిత్రం వారి ప్రతిభకు అద్దము పట్టును. మనకు పట్టపగలు అనిపించు దృశ్యం అగుపిస్తుంది. అక్కడ ఒక ద్వారము వుంది. ఆ ద్వారము తలుపు తెరచి చూస్తే రాత్రి వేళ, అందులో చంద్రుడు కనబడుతుంటాడు. (ద్వారము తలుపు తెరచి చూచుటను పరీక్షగా చూచుటతో సమముగా చేసికొనవలెను.)

ఈ బొమ్మ ద్వారా వెలుగు చీకట్లు పరికించి చూచిన ఒకే నాణెమునకు ఇరువైపులని చూపారు. సుఖదుఃఖములు అట్లే. పగటిని చైతన్యము గాను, రాత్రిని అనుభవ మునకు అందని దానిని తీసికొన్న చైతన్యాచైతన్యములు అటులనే. ఒక దానిని చూచుట నేర్చిన మరొక దానిని గ్రహించినట్లే.

కావున, ఈ చరణములో మనము చూచు చూపులను సరి దిద్దు కొనవలెనని ఆచార్యులు చెప్పినారు. దానికి మార్గములు లేవు. “నేను సరిచేసుకోగలను” అను కొనుట అహంభావము. “చేయలేననుకొనుట” నైరాశ్యము. విష్ణుని ఆశ్రయించిన సంభవము. ఆ మార్గము తెలియుటకై చేయు ప్రయత్నము తపస్సు. అదియే అన్నమాచార్యులు పేర్కొన్న కాలముతో చెడిపోని యీడువడని తెలివి.

పారక మానదు పాపపు మన సిది
యీరసములతో నెందైనా
నీరజాక్ష యిది నీమయమేయని
యీరీతుల తలఁ పియ్యఁ గదే ॥ హరి ॥

ముఖ్య పదములకు అర్ధములు: యీరసములు = ఈ స్థాయీభావములు (= 1. శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము 9. శాంతము అను రసములు )
భావము: నా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని నాకు బోధ పరచవే.
వివరణము: మన ప్రపంచమంతా అనేక అనేక రసములతో స్థాయీభావములతో ప్రజ్వరీల్లుచున్నది వీనిలో ఏదో ఒకదానికి మనం తగులుకుంటాం. దానితో ఆ నీరజాక్షుని చూడలేకపోతున్నాం.
అనగా మనము ఏ విధమైన మార్గము ఎంచుకున్నను దానికి ఒడబడు ఏదో ఒక సిద్ధాంతము, భావనము, దర్శనము కలుగ వచ్చును. కావున ఎటువంటి రసములకు ఉద్వేగములకు ఆర్భాటములకు తగలనీ మనసును ప్రసాదించమని అన్నమాచార్యులు కోరుకుంటున్నారు.

సత్యము ఆశల గాలములకు, జిజ్ఞాసుల కనుల కళ్లెములకు, మరియు భక్తిహీనుల హారతి పళ్ళెములకు లోను కాదు, ఒడబడదు.

కలుగక మానవు కాయపు సుఖములు
యిల లోపలఁ గల వెన్నైనా
అలరిన శ్రీ వేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహ మియ్యఁగదే ॥ హరి ॥

ముఖ్య పదములకు అర్ధములు: అలరు = ఒప్పు, ప్రకాశించు
భావము: కాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.
వివరణము: “అలరిన శ్రీ వేంకటాధిప నీకే / యిలనర్పితమను యిహ మియ్యఁగదే” ఎంత శోధించినా మనవాళికి అటువంటి లోకము కాన రాలేదు. కాబట్టి అటువంటి లోకము యత్నమున సాధించదగినది కాదని, వేరేమి యుక్తులతోనూ సాధించలేనిది అన్న భావంతో “ఓ వెంకటేశ్వర అది నీవు ఇచ్చిన కానీ నేను చేర గలిగినది కాదు” అని చెప్పారు

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ లోకమున మానవునికి ఈ లోకమున అనుభవించు సుఖదుఃఖములకు అతీతముగా ఉండును ఆ భావనలు ఉండవు అని కూడా స్పష్టం చేశారు.
ఈనాటి మానవులు అనేక మత గ్రంథములలో పేర్కొన్న పవిత్రత, నిర్మలత్వము అను వానిని మెచ్చుకొందురు గాని ఆ దిశలో అడుగులు వేయరు. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చినది కాదు; కఠోర పరిశ్రమ ద్వారా సాధించి వలసినది.

కీర్తన సారాంశం:
పల్లవి: హరి నీవే క్షేత్రజ్ఞుడవు. మాలో సానుకూల భావములను కలిగించ రాదా!

చరణం 1: మా కళ్ళు వద్దన్నా కూడా నిన్ను (సత్యము) తప్పించి ఇతరములనే చూచును. వాటిని దాటి (వానికి నీడలుగా లేదా పరిపూరకములుగా) వున్నది నీవే నని గ్రహించు కాలముతో మార్పు చెందని జ్ఞానమ ఒసగ రాదా!

చరణం 2: నా యీ పాపపు మనస్సు యీరసములలో పారుతూ అక్కడే వుండి పోవ చూచును. నీరజాక్ష కనబడునదంతా నీ మయమే యని నాకు బోధ పరచవే.
చరణం 3: కాయపు సుఖములు ఈ లోకములో ఎన్నో కలవు. శ్రీ వేంకటాధిప నీకే అర్పితమైన లోకము నా కీయ గదే.

-x-సమాప్తము-x-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *