April 28, 2024

చివరి బోధ

రచన: నండూరి సుందరీ నాగమణి

ఖిన్నుడై కూర్చుండిపోయిన మోహన్, తనకు వాట్సాప్ మెసేజ్‌లో వచ్చిన సమాచారాన్ని చూసి, నమ్మలేకపోయాడు.
అప్పుడే కాఫీ కప్పుతో లోపలికి వచ్చిన సువర్చల పాలిపోయినట్టున్న భర్త ముఖం చూసి, అనుమానంగా “ఏమైంది?” అని అడిగింది.
వెంటనే నోట మాట రాలేదు మోహన్‌కి. తడబడుతూ, ఏదో చెప్పబోయి ఆగి నుదురు రాసుకున్నాడు బాధగా. తరువాత గొంతు పెకలించుకుని, “మా సీనియర్ కొలీగ్ పద్మనాభంగారని చెబుతూ ఉంటానే, ఆయన ఈ రోజు ఉదయమే చనిపోయారట…” అన్నాడు నాలుక పొడారిపోతూ ఉండగా…
“అయ్యో…” కాఫీ కప్పు అక్కడే బల్ల మీద పెట్టేసి, వాటర్ బాటిల్లోని నీళ్ళు గ్లాసులో పోసి, తాగటానికి ఇచ్చింది.
నీళ్ళు తాగి కొద్దిగా స్థిమితపడ్డాడు మోహన్.
“ఏమైందండి, సిక్ అయ్యారా ఆయన?”
“వివరాలు తెలియవు సువీ… మా రిటైరీస్ గ్రూప్‌లో పెట్టారు. ఓసారి వెళ్ళి రావాలి…” అంటూ వాష్ రూమ్‌లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు మోహన్.
“సరే, జాగ్రత్త. కాస్త ఏదైనా తినేసి వెళ్ళండి. జాగ్రత్త. మనసు పాడుచేసుకోవద్దు…” లోపలికి వినపడేలా గట్టిగా చెప్పి వంటింట్లోకి వెళ్లింది త్వరత్వరగా టిఫిన్ చేయటానికి.
***
సరిగ్గా పావుగంటలో తిన్నాననిపించి బయలుదేరాడు మోహన్.
“డేడ్, నేను దింపుతాను మీరు డ్రైవ్ చేయకండి. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేయండి…” చెప్పి బండి తీసాడు రాకేష్.
అదే మంచిదనుకుంటూ, కొడుకు వెనకాలే కూర్చున్నాడు మోహన్.
పద్మనాభం ఇంటి ముందు అప్పటికే టెంట్ వేసి ఉంది. వరండాలో చాలా మంది జనం ఉన్నారు. అందరి ముఖాలు విషాదమయంగా ఉన్నాయి. లోపలినుంచి సన్నగా ఏడుపులు వినిపిస్తున్నాయి. అవి వింటూ ఉంటే, అప్రయత్నంగా మోహన్ కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి. అదిరే గుండెతో లోపలికి నడిచాడు. అప్పటికే తనతో పని చేసిన కొలీగ్స్ కొంతమంది అక్కడ ఉన్నారు. లోపలి హాల్లో పద్మనాభం పార్థివ శరీరం పడుకోబెట్టి ఉంది. అతని భార్య కుమిలిపోతూ, శోకాలు పెడుతోంది. పక్కనే ఉన్న ఒకావిడ ఆమెను సముదాయిస్తోంది. పిల్లలు తమ దుఖాన్ని అణచుకుంటూ, వచ్చిన వారు మాట్లాడుతూ ఉంటే జవాబు చెబుతున్నారు.
కొలీగ్స్ వలన తెలిసిన సమాచారం ఏమిటంటే, పద్మనాభం రెండు కిడ్నీలు చెడిపోయాయి. పదిహేను రోజులుగా వైద్యం కోసం హాస్పిటల్లో ఉన్నాడు కానీ పరిస్థితి అప్పటికే చేయి జారిపోయిందని వైద్యులు చెప్పారు. తెల్లవారుఝామున అతను ఈలోకం నుంచి నిష్క్రమించాడు.
ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకులు ఏవో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇల్లు స్వంతమే కానీ తనఖాలో ఉందని విని ఆశ్చర్యపోయాడు మోహన్.
కాసేపు ఉండి, వికలమైన మనసుతో ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చేసాడు మోహన్.
***
బట్టలు విడిచి, తడిపి, తలారా స్నానం చేసి వచ్చాడు దిగాలుగా. భోజనం కూడా సయించలేదు. పద్మనాభం రిటైర్ అయ్యి రెండేళ్ళు దాటింది. సర్వీస్‌లో ఉండగా పద్మనాభం తమకు గురుతుల్యుడు. ఆయన దగ్గర తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఏ సర్క్యులర్ కావాలన్నా ఆయన దగ్గర ఫైల్‌లో దొరికేది. ఆఫీసుకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఆయనకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలిసేవి కావు. అందుకే ఏం కావాలన్నా అందరూ ఆయన్ని అడిగే తెలుసుకునేవారు.
కొలీగ్స్ ద్వారా తెలుసుకున్న విషయాలు మోహన్‌ని కలవరపరచాయి. ప్రతీరోజూ క్వార్టర్ పడందే నిద్రపోడట పద్మనాభం. పేకాట పిచ్చి కూడా బాగా ఉందట. దాంతో వస్తున్న పెన్షన్ ఇంట్లో ఇవ్వకపోగా, ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి మరీ జల్సా చేసాడని తెలిసి చాలా బాధ కలిగింది మోహన్‌కి. దాని పర్యవసానమే అనారోగ్యం. ఆయన వైద్యం కోసమని పిల్లలు కూడా అప్పులు చేయవలసి వచ్చింది. “ఒకరకంగా ఆయన వెళ్లిపోవటం భార్యకు, పిల్లలకు రిలీఫ్” అని మిత్రుడు శ్రీధర్ చెప్పినప్పుడు అంత మాట అన్నందుకు అతనిపై కోపం వచ్చినా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తెలిసాక నిజమే అనిపించింది మోహన్‌కి.
***
మధ్యలో రెండు సార్లు పద్మనాభం ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చాడు మోహన్.
“అంకుల్, మీకు వీలైతే ఒక మూడు లక్షలు ఎక్కడైనా అప్పుగా ఇప్పించండి. చిల్లర అప్పులు తీర్చేసుకుంటాము. ఇంటి మీద అప్పు వాయిదాల మీద తీరుస్తాను. నా పీయఫ్ లోన్ పెట్టి మీకు మూడు లక్షలు తీర్చేస్తాను…” పద్మనాభం పెద్దకొడుకు రమేష్ వేడికోలుగా అడుగుతూ ఉంటే మోహన్ మనసు కరిగిపోయింది.
“అలాగే రమేష్. కర్మ కాగానే ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళు… ఇంకా ఏమైనా అవసరమైతే మొహమాటపడకుండా అడుగు…” అంటూ అతని భుజం తట్టాడు మోహన్.
ఇంటికి వచ్చిన మోహన్ సరిగ్గా నిద్రపోలేకపోయాడు.
ఆ రాత్రి అస్థిమితంగా కదులుతున్న భర్తను లేపి, వేడినీళ్లు ఇచ్చి తాగి పడుకోమని చెప్పింది సువర్చల.
“ఎందుకు బాధపడుతున్నారు? మరణం అనేది సహజం కదా… కొద్దిగా ధైర్యం వహించండి. భయం అన్నది అస్సలు మంచిది కాదు” హితవు చెబుతున్న ధోరణిలో అన్నది సువర్చల.
“మన సరదాల కోసం మనింటి వాళ్ళను అవస్థ పెట్టటం ఎంతవరకూ సబబు సువీ? అస్సలు కాదు కదా… పద్మనాభంగారిని గురువుగా భావించేవాడిని. కానీ ఆయన చేసిన పని ఏమీ బాగుండలేదు. తన అలవాట్ల కోసం లక్షల కొద్దీ వచ్చిన డబ్బు ఆర్పేయటమే కాక, ఇల్లు తనఖా పెట్టటం, పైగా తన అనారోగ్యం కోసం… అదీ కొని తెచ్చుకున్న వ్యాధి కోసం పిల్లల డబ్బును ఖర్చు చేయించటం, వాళ్ళను కూడా అప్పుల పాలు చేయటం ఎంతవరకూ కరెక్ట్? అస్సలు సరియైనది కాదు… కానే కాదు!” బాధగా చెబుతున్న మోహన్‌తో, “పోనీలెండి, వాళ్ళకి మీకు చేతనైనంత సాయం చేయండి. మనసులో అవేవీ పెట్టుకోకుండా ప్రస్తుతం నిద్రపొండి ప్రశాంతంగా…” చెప్పి, ఫాన్ స్పీడ్ కొద్దిగా పెంచి, అతనికి దుప్పటి కప్పింది సువర్చల.
***
మర్నాడు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, స్నానం చేసి తయారైన భర్తను చూసి ఆశ్చర్యపోయింది.
“రెడీ అవ్వు సువీ, పార్క్ లో వాకింగ్‌కి పోదాము…” నవ్వుతూ చెబుతున్న మోహన్ మాటలకు మరింత వింతగా చూసింది.
రోజూ ఎనిమిది అయితే కానీ మంచం దిగడు మోహన్. వాకింగ్‌కి వెళ్ళమని పిల్లలు ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. అలాంటిది ఇప్పుడు… పైగా తనను కూడా రమ్మంటున్నాడు!
“ఏమైంది మీకు, ఈరోజు ఉదయమే కొత్తగా?”
“అవును… ఉదయంతో పాటు జ్ఞానోదయం కూడా అయింది సువీ. పిల్లల మీద భారం మోపకుండా ఉండాలంటే మనం మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అర్థమైంది. ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవరచుకోవాలని తెలిసింది. బంధువుల ఇళ్ళల్లో ఫంక్షన్‌లు ఉన్నప్పుడు కూడా, సరదాకైనా, ఎవరు బలవంతం చేసినా గ్లాసెత్తకూడదని తెలిసింది. రోగాలపాలు కాకుండా రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుని, మనకున్న రుగ్మతలకు మందులు వాడాలని, ఆహారనియమాలు పాటించాలని అర్థమైంది. మహానుభావుడు పద్మనాభంగారు. తన మరణంలోనూ నాకు పాఠాన్ని బోధించి, ఎలా ఉండకూడదో నేర్పించి, గురువుగానే మిగిలిపోయాడు. పిల్లలకు మనం కలకాలం వాళ్ళతో ఉంటే బాగుండునని అనిపించాలి కానీ, మన మరణం వాళ్ళకు ఒక విముక్తి కాకూడదు సువీ… అందుకే ఈరోజు నుంచి సరికొత్త జీవితానికి శ్రీకారం చుడదాము. జీవితంలో కలిసే నడుస్తున్నాము, ఇప్పుడు కూడా కలసి నడుద్దాం పద సువీ… మనల్ని మనం కాపాడుకుందాము, మన పిల్లలనూ కాపాడదాము…” ప్రశాంతంగా నవ్వుతూ చెబుతున్న భర్తను చూసి, “సరే, డ్రెస్ మార్చుకుని వస్తాను…” అంటూ లోపలికి వెళ్ళి పంజాబీ డ్రెస్, కాళ్ళకు షూస్ వేసుకుని వచ్చింది.
అలికిడి విని బయటకు వచ్చిన రాకేష్, బయటకు నడుస్తున్న తల్లిదండ్రుల వైపు ఆనందంగా చూసి, చేయి ఊపాడు.
***
(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *