April 27, 2024

అంతర్మథనం

రచన: సుమలత దేష్పాండె

పిల్లల మాటలకు మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలై లావా ఉప్పొంగుతుంటె కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్ళు కనిపించకుండా అతికష్టంపైన తన గదిలో మంచంపై భారంగా ఒరిగిపోయింది రజనీ.
కళ్లల్లోంచి కన్నీళ్ళు ధారలుగా జాలువారుతుంటే ఆశ్చర్యంగా …ఇంక నా కళ్ళల్లో నీరుందా? ఎప్పుడో ఎండి బీటలువారింది కదా నా హృదయం, అని పేలవంగా నవ్వుకుంది. తను ఎందుకు పుట్టిందో, ఎందుకిన్ని కష్టాలో అంతుచిక్కని ప్రశ్న. మామూలు మధ్యతరగతి కుటుంబంలో తను రెండో సంతానం. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. ఆక్క అందంగానే ఉంటుంది కనుక తనకు పెళ్ళి సంబంధం తేలికగానె కుదిరింది. ఆ తర్వాత తను పెద్ద అందగత్తె కాదు. ఏదో మామూలుగా ఉంటుంది. పెళ్ళి సంబంధాల వేట మొదలయింది. ఒక్కొక్కరు రావడం వాళ్ళముందు తను గంగిరెద్దులా అలంకరించుకుని కూర్చోవడం. వాళ్ళు వెళ్ళినతర్వాత ఏ విషయం ఉత్తరం ముక్క రాస్తాననడం పరిపాటైపోయింది. అలా చూడగా చూడగా విసిగిపోయిన తండ్రి ‘ఇక నీకు జన్మలో పెళ్ళికాదు. నిన్నెవరు చేసుకోరు. నువ్వు వృద్ధకన్యగా మిగిలిపోతావు అన్నప్పుడు, భూమి బ్రద్దలై అందులో కూరుకుపోతే బాగుండు అనిపించింది. అసలు దేవుడు నన్నెందుకు పుట్టించాడు ? మొదటిసారిగా తన పుట్టుకపై తనకే కోపం వచ్చింది గుండెలు పగిలేల ఎడ్చింది.
ఈ నేపధ్యంలో దేవుడు కరుణించినట్లు ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి తను నచ్చినందుకు చాలా ఆనందం ఆశ్చర్యం వేసింది. నమ్మలేకపోయింది రజనీ.
ఒక శుభ ముహూర్తంలో పెళ్ళి జరిగింది. కోటి కోర్కెలతో, గంపెడాశలతో అత్తవారింట్లో అడుగు పెట్టిన తనకు వారం రోజుల్లో ఆ ఇంట్లో తన స్థానం ఏమిటో తెలిసిపోయింది. అత్తగారికి ఆరుగురు సంతానం. తనే పెద్ద కోడలు. ఇంటెడు చాకిరీ, అత్తగారి తిట్ల దీవెనలు, ఆడపడుచుల సూటీపోటీ మాటలు. ఇవన్నీ ఒకెత్తు అయితే భర్త వ్యక్తిత్వం లేకుండా అత్తగారి చేతిలో కీలుబొమ్మ అవడం. ఆ ఇంట్లో తన స్థానం ఒక పనిమనిషి… ఒక ఆటబొమ్మ. తన మనసుతో ఎవరికీ పనిలేదు. ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం యాదృచ్చికం. కష్టాలు, కన్నీళ్ళు, కలహాల మధ్య వాళ్లను పెంచడం పెళ్ళిళ్ళు చేయడం జరిగిపోయింది.
ఆరేళ్ళక్రితం భర్తకు కాన్సర్ అని తెలియగానే తలపైన పిడుగు పడినట్టుగా అయింది. ఆ దుర్వార్త మనసులో బాధనీ భయాన్నీ పురిగొల్పింది. ఎంత క్రూరుడయినా ముఫ్ఫై ఏళ్ళ అనుబంధం. ఎవ్వరూ తనను పెళ్ళి చెసుకోడానికి నిరాకరించినా, తను ముందుకొచ్చి చేసుకున్నాడనే కృతఙ్ఞతాభావం నరనరాల్లో జీర్ణించుకుపోయిన సాంప్రదాయం. ఇవన్నీ అతనిపైన ప్రేమనీ, జాలినీ రేకెత్తించాయి. రెండు సంవత్సరాలు ఆ వ్యాధితో పోరాడి, పోరాడి చివరికి ఓడిపోయాడు. అప్పట్నించీ ఒంటరిదైపోయిన తను, ముగ్గురు పిల్లలు ఎవరికి అవసరమయినప్పుడు వాళ్ళు తనను వంటమనిషిలా, పనిమనిషిలా ఉపయోగించు కుంటున్నారు. కన్నతల్లి అన్న ప్రేమకన్నా, అవసరానికి ఉపయోగపడే యంత్రంగానే వాళ్లకు తనపై ప్రేమ. వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. తన భర్త, అత్తగారు తనను చూసే విధానం ఇవన్నీ వాళ్ళకు తల్లిపై ప్రేమకన్న చులకన భావమే నూరిపోశాయి.
అప్పుడు అత్తగారు, భర్త, ఇప్పుడు పిల్లల చెప్పుచెతల్లోనే తన జీవితమంతా సాగిపొతూంది. ఇంటిప్రక్కన ఆలయానికి వెళ్ళాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లాండ్ లైన్ ఫోన్ కి ఎప్పుడూ రెడీగా అటెండ్ అవ్వాలి. లేకపోతే సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. తన పేరులాగానే తనజీవితం కూడా చీకటిమయం అనుకుంది రజనీ. ఎలాగో పిల్లల్ని బ్రతిమాలి ఒక్క గుడికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంది రజని. మనసులొ బాధనీ, ఒంటరితనాన్నీ మర్చిపోడానికి గుళ్ళోనే ఎక్కువ టైం గడపసాగింది.
గుడి వాతావరణం, ఆ ప్రశాంతత,ఆ రంగురంగుల పువ్వులు, పచ్చని తివాచీ పరిచినట్టున్న మెత్తని పచ్చిక, లేలేత ఉదయ భానుడి కిరణాలకు కోనేరులొ విచ్చుకున్న కలువలు మెరుస్తుండడం సన్నని గుడిగంటల సవ్వడి, జీవకళ ఉట్టిపడే ఆ దేవతామూర్తుల విగ్రహాలు. పూజారి ఎంతో ఆత్మీయంగా తనను పలకరించడం, ఇవన్నీ మనసుకు కాస్త సాంత్వన నిచ్చేవి. ఆకొద్ది సమయమే తను బాధను మర్చిపోయేది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే దీపం పురుగుల్లా భయంకరమయిన ఆలోచనలు మనసును తొలిచేస్తాయి. ఇంత అందమయిన ప్రకృతినిచ్చిన దేవుడు తననెందుకు అందవిహీనంగా పుట్టించి ఇన్ని కష్టాలనిచ్చాడు? ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు అన్న ఒక కవి మాటలు గుర్తొచ్చి, ఎంత నిజం అనుకుంది బాధగా రజని.
‘గుడిమూసే సమయం అయింది మీరు ఇంకా కూర్చునే ఉన్నారు,’ అన్న మర్యాదపూర్వక పలకరింపుతో ఈ లోకంలోకొచ్చింది రజని. అడుక్కునే వాళ్ళకు డబ్బులు, బ్లాంకెట్లు ఇస్తున్నప్పుడు అతన్ని చాలాసార్లు చూసింది. చాలా అందంగా ఉంటాడు.
‘అయ్యో, ఏదో పరధ్యానంలో పడి టైం చూసుకోలేదండీ,’ అంటూ అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వడివడిగా గుడిబయటకు వచ్చేసింది రజనీ.
ఆ తర్వాత అతను రోజూ ఎంతో ఆప్యాయంగా పలకరించడం, కొద్దిసేపు ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకోవడం పరిపాటైపోయింది. మాటల సంధర్భంలో అతని భార్య పది సంవత్సరాల క్రితం చనిపోతే, ఎంత కష్టమయినా, ఇద్దరబ్బాయిలను తనే చూసుకున్నాడనీ, మళ్ళీ పెళ్ళిచేసుకోమని కుటుంబసబ్యులు ఎంత ప్రోద్బలించినా, భార్యను మర్చిపోలేక, ఆమెపైన ఉన్న ప్రేమాభిమానాలు, అనురాగం ఒకవేపు, వచ్చే ఆమె పిల్లల్ని సరిగా చూసుకుంటుందో లేదో అనే భయం మరొకవేపు. వీటన్నిటితో అతని మనస్సు అందుకు అంగీకరించలేదు, అని అతను చెప్పినప్పుడు ఎంతో గౌరవభావం కలిగింది రజనీకి. పర్స్ లోంచి ఒక ఫొటో తీసి, ‘రజనిగారు, ఈమె నా భార్య రేఖ,’ అంటూ చూపించాడు. ఆ ఫొటొ చూసి రజనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె చాలా సింపుల్ గా, చాలా మామూలుగా ఉంది. ఆమె ముందు ఇతను చాలా అందగాడు. అయినా సరే భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత ఆరాధన అని అనుకోకుండా ఉండలేకపోయింది.
‘చాలా ప్రశాంతంగా, చాలా మంచి ఆమెలా ఉన్నారు రేఖ గారు. ఆమె చాలా అదృష్టవంతురాలు మీలాంటి ప్రేమించే భర్త లభించినందుకు,’ అని అనకుండా ఉండలేకపోయింది. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర.
‘ఇంతకీ మీ పిల్లలు ఎంచేస్తుంటారు?’
‘ఇద్దరూ మంచి ఐటి జాబుల్లో సెటిల్ అయిపోయారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి.’
‘అయితే బాధ్యతలన్నీ తీరిపోయాయనుకుంటాను. ఇప్పటికయినా మీరు హాయిగా కొడుకులు కోడళ్ళను చూసుకుంటూ, మనవల కోసం ఎదురుచూస్తూ, కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారనుకుంటాను. చాలా సంతోషం అండి.’
అతను ఏమీ జవాబు చెప్పకుండా పచ్చికలో చెంగున ఎగురుతూ, దొరికిన ఎవో గింజలను దాచుకోడానికి మోసుకెళ్తున్న ఉడుతలను చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత ఎలాగో గొంతుపెగిలించుకుని, ‘రజనీగారూ, పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళిద్దరిలో చాలా మార్పు వచ్చిందండీ. భార్యలచేతుల్లో కీలుబొమ్మల్లాగా బ్రతుకుతున్నారు.ఎవరి బిజీలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. ఒక తండ్రిని, నేనొకడిని ఉన్నానన్న ఊహే వాళ్ళకు రాదు. నేను ఫోన్ చేసినా మాట్లాడలేనంతగా కూరుకుపోయి ఉన్నారు. నా ఒంటరి బ్రతుకుబండికి ఇవే కాలక్షేపాలు.గుడికి రావడం. అనాధశరణాలయాలకు వెళ్ళడం, ఓల్డ్ పీపుల్ హోంస్ దర్శించుకుని, ఏదో చంద్రునికో నూలుపోగులా వాళ్ళకు నాకు తోచిన చిన్న చిన్న సహాయాలు చేయడం. అంతే. వృద్ధాప్యంలో కనిపెంచిన పిల్లలున్నా, అనాధల్లా బ్రతుకు వెళ్ళదీస్తున్న వాళ్ళను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏంలాభం? పిల్లల్ని నవమాసాలు మోసి కని, పెంచి, వాళ్ళే ప్రపంచంలా బ్రతికి, తినీ తినక, కడుపుకట్టుకుని వాళ్ళభవిష్యత్తు బంగారు బాట కావాలని ఆకాంక్షిస్తూ, అపురూపంగా చూసుకుని పెంచుకుంటే చివరికి వారిచ్చే బహుమతి వృద్ధాశ్రమం. ఎంతమంది తల్లిదండ్రులు ఈ క్షోభను అనుభవిస్తు న్నారో తల్చుకుంటే మనసు బాధతొ నిండిపోతుంది.
‘ఈతరం వాళ్ళకిది చాలా చాలా దురదృష్టం అండి,’ అంది రజనీ.
అతని మాటలు వింటూంటే, అతనెంత ఉదారస్వభావుడు, సున్నిత మనస్కుడు, ఎంత గొప్ప వ్యక్తిత్వం, అని అనుకోకుండా ఉండలెకపోయింది రజనీ. ఎందుకో, అతనెంతో ఆత్మీయంగా అలా మనసు విప్పి మాట్లాడుతూంటే, అతని మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేది రజనికి. అతని అందానికితోడు మరింత అందమయిన మనసు, వ్యక్తిత్వం.
సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. అదంటే ఏమిటో అతని పరిచయం అర్థం తెలిపిందామెకు.
‘నా చుట్టూ నా వాళ్ళే ఎంతమంది ఉన్నా, నా మనసు ఎవరూ అర్థం చేసుకోలేదు. ఎవరితో పంచుకోలేని ఆప్యాయత, ఆనందం, బాధ, కష్టసుఖాలు అతని దగ్గర అరమరికలు లేకుండా చెప్పుకోగలుగుతున్నాను. అతని స్నేహంలో స్వచ్చత ఉంది, నిజయితి ఉంది, మంచి ఉంది.’ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది రజనీ.
ఎప్పటిలాగే తలార స్నానం చేసి, నీలిరంగు జరీ చీర కట్టుకుని, పూల బుట్టతో గుడిలోకి అడుగు పెట్టిన ఆమెకి అతను ఎదురుగా తనకోసమే చూస్తున్నట్టు, గబగబా ఎదురొచ్చి, ‘రజనీ గారు, మీతో కాస్త మాట్లాడాలి. అలా అశ్వథ్థ వృక్షం కింద కూర్చుందాం రండి,’ అభ్యర్థనగా అడిగాడు.
తల ఊపింది రజనీ.
అతను ఏం మాట్లాడుతాడా? అని ఆలోచిస్తూ, సిమెంట్ బెంచీ పై అతనికి కాస్త దూరంలో కూర్చుంది రజని.
‘రజనీగారు, మీతో ఒక విషయం మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను,’ తటపటాయిస్తూ అడిగాడు అతను.
‘చెప్పండి అన్నట్టుగా చూసింది రజని.
అతను ఇంకా తటపటాయిస్తుంటే, ‘సూర్యకిరణ్ గారు, ఫర్వాలేదు అడగండి,’ అంది.
‘ఏం లేదు రజనీ గారు, మన ఇద్దరి జీవితాలు ఇంచుమించి ఒకలాగే ఉన్నాయి. మనం ఒంటరిగానే ఈ జీవిత పోరాటాన్ని సాగిస్తున్నవాళ్ళమే. ఆడమగ నిష్కల్మషమయిన స్నేహాన్ని కూడా ఈ సమాజం ఎన్ని యుగాలయినా అర్థం చేసుకోక అభాండాలు వేస్తూనే ఉంటుంది. వయసు ఏదయినా రాళ్ళు రువ్వడం వాళ్ళకలవాటు. అందుకని చాలా రోజులుగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. మీకు ఇష్టమయితే, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను.’
ఒక్కసారిగా అవాక్కయిపోయింది రజనీ. తేరుకోడానికి కొన్ని నిముషాలు పట్టింది. ‘మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావడం లేదు. ఇప్పుడు, ఈ వయసులో పెళ్ళేంటి?’ అంది రజని.
‘మనం ఆశలతోనో, కోర్కెలతోనో పెళ్ళి చేసుకోవడం లేదు. జీవిత కాలం మంచి స్నేహితులుగా, ఒకరికొకరు తోడుగా నీడగా ఉండడానికి మాత్రమే పెళ్ళి అనే ఒక లైసెన్స్. మీరు తోడుగా ఉంటే ఇంకా కొన్ని మంచిపనులు చెయగలుగాతాననే ధైర్యం. మీ తోడు నాకు చాలా అవసరం అనిపిన్చింది. ఇద్దరం కలిసి వృద్ధాశ్రమాలకు, అనాధ శరణాలయాలకు మన చేతనయినంత సహాయ సహకారాలు అందించడానికి సేవా కార్యక్రమాలను చేయడానికి మీ తోడు చాల అవసరం అని నాకు అనిపించింది. మీరు సమయం తీసుకుని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఇప్పుడే చెప్పనవసరం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.’ అతను గుక్కతిప్పుకోకుండా చెప్పి రజని వేపు చూశాడు.
అయోమయంగా చూస్తున్న ఆమెకి, ‘మీరు టెన్షన్ పడొద్దు. నిదానంగా ఆలోచించిన తర్వాతే చెప్పండి మీ నిర్ణయం. రండి వెళ్దాం.’అంటూ లేచాడతను.
ఆలోచిస్తూనే ఇంటి తాళం తీసిన ఆమెకు నిశ్శబ్దంగా, బోసిపోయిన, తన జీవితంలా స్తబ్ధుగా ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న తన మనసులా శూన్యంగా తోచింది. అలసటగా మంచంపై వాలిపోయిన రజనీకి ఆలోచనల అలలు చుట్టుముడుతూంటే కళ్ళు మూసుకుంది. అతని మాటల తరంగాలు అంతరంగంలో రింగుమంటుంటే అతను చెప్పింది నిజమే అని మనసు అంగీకరిస్తూంటే, కాదు కాదు అని అంతరాత్మ ఘోషిస్తుంటే, పిల్లలకు ఏం చెప్పాలి? వాళ్ళముందు ఈ విషయం ఎలా తీసుకురావాలి? తనకంత ధైర్యం ఉందా? ‘జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించావు. ఏం సుఖపడ్డావు గనక? చిన్నతనంలో తండ్రి మాటలకు మనసులో శూలం దిగింది. పెళ్లైన తర్వాత తన భర్త ప్రవర్తన మాటల తూటాలతో గునపాలు దిగాయి. పోనీ పిల్లలవల్ల ఏమయినా మనశ్శాంతి ఉందా అంటే అదీ లేదు. ఇంకా ఎంతకాలం అందరికీ భయపడుతూ, బాధపడుతూ, నిన్ను నీవు కొవ్వొత్తిలా కాల్చుకుని కరిగిపోతావు? బానిస బ్రతుకునుంచి బయటపడి సూర్యకిరణ్ మాటనామోదించి ఈ మిగిలిన కాస్త జీవితమయినా సంతోషంగా ఉండు.’ అంటూ హృదయం హెచ్చరిస్తూంది. అంతరాత్మ మాత్రం నీవు పుట్టి పెరిగిన సంస్కృతి, ఆచార వ్యవహారాలు తుంగలో తొక్కుతావా? సమాజానికి ఎం సమాధానం చెపుతావు? అంటూ భయపెడుతూంది. ఎటూ తేల్చుకోలేని మానసిక సంఘర్షణ, అంతర్మధనం తో వారం రోజులు గడిచిపోయాయి.
సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ముగ్గురు పిల్లలూ ఫోన్ చేసి వస్తామని చెప్పారు. అన్నట్టుగానే వచ్చారు. మూడురోజుల హడావుడి ముగిసిన తర్వాత రజని మెల్లిగా సూర్యకిరణ్ ప్రస్తావన తీసుకొచ్చింది. అది వినగానే ముగ్గురు పిల్లలూ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ‘నీకీ వయసులో పెళ్ళి కావాల్సి వచ్చిందా?’ అని హేళనగా అడిగారు. ‘మేం తలెత్తుకుని తిరగడం నీకిష్టం లేదా? ఈ నికృష్టమయిన పని చేసే బదులు, బండెడు రాళ్ళు కట్టుకుని భావిలో దూకు,’ అంటూ నానా దుర్భాషలాడి వెళ్ళిపోయారు.
వాళ్ళ మాటలకు మనసు విలవిలలాడిపోయింది. హృదయవిదారకంగా ఆక్రోశించింది.
ఎలాగో ఒకలాగా మనసును అదుపులో పెట్టుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ ఆలోచించిన కొద్దీ క్రమంగా ఒక పది రోజులకు గానీ మనసు స్థిమితపడలేదు.ఇవన్నీ ప్రేమ సంకెళ్ళు కావు తెంచుకోకపోవడానికి. ఇనుపసంకెళ్ళు. ఎంత ప్రేమించినా అవి బిగుసుకుంటే నరకమే కానీ, ప్రేమ, ప్రశాంతత వెదికినా దొరకదు. ‘నీకు ఓపిక ఉన్నంత వరకు చాకిరీ చేయించుకుంటారు. ఆ తర్వాత వృద్ధాశ్రమమనే కారాగార శిక్ష విధిస్తారు. ఇప్పటికయినా నిన్ను నీవు కాపాడుకో. ఈ ఊబిలోంచి బయటపడు ఈ శృంఖలాలు తెంచుకుని పారిపో! హృదయం ఘోష వినలేక, ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చిన రజని ఆ రాత్రి కంటినిండా నిద్రపోయింది. మర్నాడు ఉదయం ఎంతో హుషారుగా లేచి, తలార స్నానం చేసి మెరూన్ జరీ అంచు ఉన్న పసుపుపచ్చ పట్టుచీర కట్టుకుని, బుట్టనిండా పువ్వుల్తో గుడిలోకడుగు పెట్టింది. ఆమె కళ్ళు ఆత్రుతగా వెతికాయతనికోసం. దూరంగా, తెల్లని పైజామా, జుబ్బాతో శాంతిదూతలా వస్తూ కనిపించాడు సూర్యకిరణ్. తనను చూడగానే, తన చీకటి జీవితంలో ప్రవేశించిన వెలుగు రేఖలా, చిరునవ్వు నవ్వాడు.
‘ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత మీరు చెప్పింది సబబే అనిపించి నిర్ణయం తీసు కున్నాను. మీతో జీవితం పంచుకోడానికి నాకు అంగీకారమే,’ అంటూన్న రజనీ వేపు మెరుస్తూన్న కళ్ళతో చూస్తూ, ‘ధన్యుణ్ణి రజనీ గారు. చాలా థాంక్స్,’అంటూ ఆనందంతో ముఖం వెలిగి పోతూంటే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ‘ఈ స్నేహహస్తం నాకందించినందుకు జీవితాంతం ఋణపడి ఉంటాను. మీ సున్నితమయిన మనసుకు ఏ కష్టం కలిగించను. జీవితాంతం మనం మంచి మిత్రులం,’ అంటున్న సూర్యకిరణ్ మాటలకు, ఇన్నాళ్ళూ కరడుగట్టిన బాధకరిగి చిరుజల్లు కురిసినట్టుగా, రజనీ కళ్ళనుండి ఆనందభాష్పాలు జాలువారి అతని పాదాలను అభిషేకించాయి. దేవుడు ఆశీర్వదిస్తు న్నట్టుగా గుడి గంటలు మ్రోగాయి. పైనుండి అశ్విని దేవతలు అక్షింతలు చల్లినట్టు
చిరుగాలికి ఊగిన చెట్టు పారిజాతం పువ్వులను వాళ్ళిద్దరి తలపై తలంబ్రాలుగా కురిపించింది.

*****************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *