April 27, 2024

బాలమాలిక – కుంకుడు చెట్టు – తెల్ల దయ్యం

రచన: నాగమణి

“ఆ… ఇదే ఇల్లు… ఆ పందిరి వేసిన ఇంటిదగ్గర ఆపండి…” క్యాబ్ డ్రైవర్ కి చెప్పాను. మావారు ఈశ్వర్, అబ్బాయి క్రాంతి దిగి, వెనుక ట్రంక్ లోంచి సామాను తీసుకున్నారు. ఫేర్ చెల్లించి నేనూ క్యాబ్ దిగాను. ముఖం ఇంత చేసుకుని, గబగబా ఎదురువచ్చి మా చేతుల్లో బ్యాగులు అందుకున్నది మా పెద్దాడపడుచు వాణి. ఆమె వెనుకనే ఆమె ముగ్గురు కొడుకులూ నిలబడి, ఆప్యాయంగా లోనికి ఆహ్వానించారు.
కొత్తగా రంగులు వేయబడి, ఇల్లంతా ప్రతీ గుమ్మానికీ మంగళ తోరణాలతో, పసుపు కుంకుమలతో పెళ్ళి శోభ వెదజల్లుతోంది వదినగారిల్లు.
లోపలికి తీసుకువెళ్ళి ఒక బెడ్ రూమ్ చూపించి, సామాను అక్కడే పెట్టుకోమని చెప్పి, అటాచ్డ్ రెస్ట్ రూమ్ చూపించింది పెద్ద కోడలు దీపిక. మేము బ్రష్ చేసుకుని, ఫ్రెష్ అయ్యే సరికి రూమ్ లోనికే చాయ్ కప్పులతో వచ్చింది రెండవ కోడలు స్రవంతి. పెద్దకొడుకు నిరంజన్ తన భార్యతో కలిసి హైదారాబాద్ లోనే ఉంటాడు. రెండవ కొడుకు రాకేష్, అతని భార్య మా వదిన గారితో కలిసి ఇక్కడ బెంగుళూరు లోనే ఉంటారు. ఇప్పుడు మూడవ కొడుకు ఉత్తమ్ పెళ్లికని మేము బెంగుళూరు వచ్చాము. పెళ్లికింకా రెండురోజుల సమయం ఉంది.
‘ఆంటీ, మీరు నాకేం అవుతారు?” అమాయకంగా అడుగుతున్న స్రవంతిని చూస్తుంటే నవ్వు వచ్చింది. “నేను నీకు పెద్దమ్మను అవుతానమ్మా…” చెప్పాను.
“పెద్దమ్మా, ఈ ఇంటి గృహప్రవేశానికే వస్తారని అనుకున్నాము. ఇప్పుడింత లేటుగా మా మరిది పెళ్ళికి వచ్చారు. పోనీలెండి, ఇప్పుడైనా వచ్చారు!” అంది స్రవంతి.
“కుదరలేదమ్మా… ఇప్పటికీ వీలైంది…”
“ఆంటీ, మీరు టిఫిన్ తినేస్తారా? ఇక్కడికి తీసుకు వచ్చేయనా?” అంటూ వచ్చింది దీపిక.
“అక్కా, ఆంటీ కాదే, మనకి పెద్దమ్మ అవుతారు…” అంది స్రవంతి. దీపిక నవ్వింది. దీపిక, స్రవంతి అక్కా చెల్లెళ్ల బిడ్డలు.
“లేదమ్మా, అందరం కలిసే తిందాము… హాల్లోకి వస్తున్నాము…” అన్నాను. అప్పటికే ఈశ్వర్ వాళ్ళ చెల్లెలితో హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. నేను, క్రాంతి వెళ్ళి హాల్లో కూర్చోగానే ఇడ్లీ, వడ, చట్నీ వడ్డించిన పళ్ళాలు మా చేతుల్లో పెట్టారు మా అమ్మాయిలు ఇద్దరూ…
ఇల్లు చక్కగా కట్టుకున్నారు. మా వదిన భర్త ఏడేళ్ళ క్రితం ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి పిల్లలు ఇంకా ఉద్యోగాల్లో స్థిరపడలేదు. అంతకు ముందే బెంగుళూరు శివార్లలో కొనుక్కున్న స్థలంలో, అన్నయ్యకి వచ్చిన టెర్మినల్ బెనెఫిట్స్ తో ఇల్లు కట్టించింది వదిన. ఇళ్ల అద్దెలు భరించలేక, ఇక్కడికి మారిపోయారు. తరువాత నిరంజన్, రాకేష్ చదువులు పూర్తి చేసి, ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నిరంజన్ కి ఒక నాలుగేళ్ల బాబున్నాడు. వాడిపేరు ధీరజ్. ఎంతో ముద్దుగా ఉంటాడు. రాకేష్ కి ఈమధ్యనే పాప పుట్టింది. ఇంకా ఏడాది నిండలేదు.
“అవును దీపూ, నీ కొడుకు ఏడమ్మా అసలు కనిపించనే లేదు…” అన్నాను వాడి కోసం వెదుకుతూ…
“పక్క గదిలో ఆడుకుంటున్నాడు పెద్దమ్మా… ధీరూ, ఒకసారి రారా… అమ్మమ్మ పిలుస్తున్నారు…” అని పిలిచింది. వాడు గుమ్మం చాటునుంచి తొంగి చూశాడు. నన్ను చూసి, సిగ్గు పడుతున్నట్టుగా నవ్వాడు.
దగ్గరకు రమ్మని నవ్వుతూ సైగ చేశాను. ముందు సందేహించినా ఏమనుకున్నాడో… మెల్లగా దగ్గరకు వచ్చాడు. వస్తూనే, “నీకు దయ్యమంటే భయ్యమా?” అని అడిగాడు ముసిముసిగా నవ్వుతూ…
“అమ్మో మొదలు పెట్టాడు!” మురిపెంగా అంది వాళ్ళమ్మ.
నేను నవ్వాపుకుంటూ, “లేదురా, దయ్యానికే నేనంటే భయ్యం…” అన్నాను.
దీపిక చెప్పింది… “ఆ మధ్య మా మరిది వీడికో దయ్యం కథ చెప్పాడట పెద్దమ్మా… అప్పటినుంచీ ఎవరు కనిపించినా ఇలాగే అడుగుతాడు!” అంది నవ్వుతూ…
వాడు ఇంకా దగ్గరగా వచ్చి, నా మొహంలో మొహం పెట్టి, “నీకు కనపడిందా దయ్యం? నువ్వు చూశావా?” అడిగాడు ఆటపట్టిస్తున్నట్టుగా…
“హైదారాబాద్ లో నేను ఓ బుల్లి దయ్యాన్ని పెంచుకుంటున్నారా…” అంటూనే నవ్వేశాను. నోట్లో ఉన్న ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుని కొరబోయింది. ఆపకుండా దగ్గుతూ ఉంటే, గబుక్కున ముందుకు వచ్చి నీళ్ళు తాగించింది వదిన.
“అమ్మమ్మని టిఫిన్ చేయనీరా ధీరు… తర్వాత అడుగుదువు లే…” అంది మనవడిని మందలిస్తూ.
టిఫిన్ చేశాక రూమ్ లో విశ్రాంతి తీసుకుందామని లోపలికి వస్తే మాతో పాటే వచ్చేశాడు ధీరజ్. క్రాంతితో కబుర్లు చెప్పసాగాడు.
వాడడిగిన దయ్యం కబుర్లు నన్ను ఒక్కసారిగా బాల్యంలోకి తీసుకుపోయి, నేనెప్పుడూ మరచిపోలేని ఓ సంఘటనను గుర్తు చేశాయి…
***
“ఊరికే ఎండవేళా పెరట్లో పడి ఏమిటే అనూ ఆటలు? కాస్త పుస్తకం తెరిచి చదువుకోరాదా? ఇరుగు పొరుగుల్ని పోగేసి పిచ్చి ఆటలు… వాళ్లేమో అస్సలు కుదురుగా ఉండరు…” విసుక్కుంది బామ్మ.
“ఇప్పుడు సెలవులే కదా బామ్మా…” గారాంగా గునిశాను.
“వద్దమ్మా, అక్కడ చెట్లలో పురుగూ పుట్రా ఉంటాయి, అటు వెళ్లవద్దు…” అనునయంగా చెప్పింది అమ్మ.
అమ్మ వైపు కోపంగా చూసాను. అదేమీ లెక్క చేయకుండా “రెండో తరగతి తెలుగు వాచకం ఎదురింటి ఉష దగ్గర తెచ్చుకుని చదువుకో అనూ… అది మూడో క్లాసులోకి వెళ్లింది కదా…” అందమ్మ.
“రేపు తెచ్చుకుంటాలే… ఇప్పుడు పడుకుంటాను…” బద్దకంగా ఆవులిస్తూ (?) చాప మీద పడి ముసుగు పెట్టాను. బామ్మ, అమ్మ కూడా కాసేపు అలా ఒరిగి నిద్రకు పడ్డారు.
వాళ్ళ గురక సన్నగా వినపడగానే, నేను మెల్లగా లేచి, చప్పుడు చేయకుండా పిల్లిలా బయటకు వెళ్ళిపోయాను. తలుపులు దగ్గరగా వేయటం మరచిపోలేదు. వీధిలో అప్పటికే ఎదురు చూస్తున్న మా బ్యాచ్ కి పక్కనుంచి పెరట్లోకి రమ్మని సైగ చేసి, వెనకాల తలుపు తీసి, నేనూ పెరట్లోకి వెళ్ళాను.
గట్టిగా గోల చేయబోతే, “ఉష్… అమ్మా, బామ్మా పడుకున్నారు. గట్టిగా మాట్లాడకండి…” అని వారించి, పెరటి అరుగు మీద అష్టా చెమ్మా గీశాను. అరగదీసిన చింతపిక్కలే గవ్వలు… విరిగిన గాజుల ముక్కలు పావులు.
“ఏమే వల్లీ, నువ్వు గవ్వలు తెస్తానన్నావు కదా… ఏవీ?” నిలదీసాను.
“మా అమ్మ ఇవ్వలేదే అనూ…” నసిగింది వల్లి.
“అయితే నువ్వేం మాతో ఆడక్కరలేదు. ఫణీ, కమలా చాలు…ఇంటికి వెళ్లమ్మా…”
“ఏయ్ అనూ… ప్లీజే… రేపు తీసుకువస్తానే… ప్లీజ్ నన్నూ ఆడనియ్యవే…” బతిమాలింది వల్లి.
కాసేపు కాదని, తరువాత బింకంగా తల ఊపి, ఆటలో కూర్చోబెట్టాను.
వీళ్ళు పెరటి తలుపు తీసేసి వచ్చారేమో, కాసేపటికి ఒక మేక లోపలికి వచ్చి, పూల మొక్కలు తినటం మొదలుపెట్టింది. నేను చూసేసరికే ఒక రెండు మొక్కల ఆకులు నవిలి నవిలి పెట్టింది. నా గుండె జారిపోయింది.
“మీరు తలుపులు వేయకుండా ఎలా వస్తారే? మా అమ్మ లేచాక ఇక మనందరికీ పెళ్లే… పొండి…” వాళ్ళను కసిరి పంపేసి, మేకను తరిమేసి, పెరటి తలుపులు మూసి పెట్టి, మెల్లగా వెళ్ళి చాపమీద పడుకుని, మళ్ళీ దుప్పటీ ముసుగు పెట్టాను. పది నిమిషాలైనా గడవలేదు, అమ్మ అసాధ్యురాలనిపించుకుంది.
“ఏయ్ అనూ… లే… దొంగ నిద్ర చాల్లే గానీ, చూసావా తలుపులు తీసేసి వచ్చారు నీ ఫ్రెండ్స్… ఆ దొంగ మేక కాస్తా మొక్కలు నమిలేసింది… రేపటినుంచీ నీ గ్యాంగ్ తో దొడ్లో చేరి ఆటలు ఆడావో వీపు పేలుతుంది…” వార్నింగ్ ఇచ్చేసింది అమ్మ.
“ఒసే అనూ… నీకో విషయం చెప్పనా? అక్కడ కుంకుడు చెట్టుంది కదా మూలన… దానిమీద దయ్యం ఉంది… తెల్ల దయ్యం…” రహస్యం చెపుతున్నట్టు మెల్లగా అన్నది బామ్మ.
నా గుండె ఆగిపోయినట్టు అయింది… ముఖం పాలిపోయి ఉంటుంది… గొంతు తడారిపోయింది… మాటలు కూడబలుక్కుంటూ… “బామ్మా… దయ్యమా… నిజంగానా?” అన్నాను దీనంగా…
అదేమిటో గానీ నాకు చందమామలో దయ్యం కథలు ఇష్టంగా చదవటం, రాత్రి అయ్యేసరికి భయపడటం అలవాటు అయిపోయాయి.
“అవునే దయ్యమే… ఊరికే అలా మిట్ట మధ్యాహ్నం పూట దొడ్లో ఆడద్దు… అది మీకు కనపడి, భయపెడితే ఝడుసుకుంటారు…”
“దయ్యం రాత్రి ఉంటుంది కానీ పగలెందుకుంటుంది?” అన్నాను నా లాజిక్ అంతా ఉపయోగిస్తూ.
“పిచ్చి మొహమా, ఈ దయ్యం చెట్టు మీదే ఉంటుంది… పగలు ఎక్కడికి పోతుంది? ఈసారి కావాలంటే దగ్గరగా వెళ్ళి చూడు ధైర్యముంటే… తెల్లగా ఉండి కిందకే చూస్తూ ఉంటుంది…”
“అత్తయ్యా…” వారించబోయింది అమ్మ.
“అమ్మో, అయితే నేను పెరట్లోకి వెళ్ళనులే…” అన్నాను భయంగా…
ఆ తరువాత రెండు రోజులూ బహు భారంగా గడిచాయి. మాకు ఇప్పట్లాగా ఇంట్లోనే బాత్ రూములు లేవు. వెనకాల దొడ్లో ఉండేవి… రాత్రిపూట సరే, మా అమ్మ తీసుకువెళ్ళేది. ఇక పగటి పూట అతి జాగ్రత్తగా తల వంచుకుని వెళ్ళిరావటం… పొరపాటున కూడా ఆ చివరి కుంకుడు చెట్టు వైపు చూడకుండా… ‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం’ నోటికి కంఠతా కూడా వచ్చేసింది.
మూడవరోజు నాకు జ్వరం వచ్చింది.
“ఏమిటమ్మా… పసిదాన్ని అలా భయపెడతావా? పిల్ల చూడు ఎలా జ్వరం తెచ్చుకుందో… ఒళ్ళు సలసలా కాలిపోతోంది…” నానుదుటి మీద తడి బట్ట పట్టీ వేస్తూ, బాధగా అన్నారు నాన్న.
“అదికాదురా అబ్బీ, మొన్న శనివారం ఇది దాని పిల్ల స్నేహితులనే కాక, అబ్బాయిల్నీ ఇంటికి తీసుకువచ్చింది. మామిడి చెట్టు పూతా, పిందే మీద ఉందా… వెధవకుంకలు చెట్టెక్కి రెమ్మలూ, పిందెలూ విరిచి పెట్టారు… అక్కడికీ నేను అరుస్తూనే ఉన్నాను. వినలా… సరే, ఇలా దయ్యం పేరు చెబితే, ఇది వాళ్ళనెవ్వరినీ రానివ్వదని అలా చెప్పానురా… పిల్ల జడిసిపోతుంది అనుకోలేదు…” దిగులుగా అంది బామ్మ.
“అత్తయ్యా, నేను చెబుతూనే ఉన్నాను మీకు… పిల్లలు దయ్యాలంటే భయపడతారు, అలాంటివేమీ చెప్పకండని… చూడండి, ఎలాంటి పిల్ల ఎలా అయిపోయిందో…” నిష్టూరంగా అని, కళ్ళనీళ్లు పెట్టుకుందమ్మ.
“అవునే… పొరబాటే… దానికి జ్వరం తగ్గగానే చెప్పేస్తాను, దయ్యం లేదు, గియ్యంలేదు అని…”
“బామ్మా, నేను నిద్రపోవటం లేదు… అంతా విన్నాను… నన్ను భయపెడతావా? ఇలా అబద్ధాలు చెబితే దేవుడూరుకోడు… నాన్నా, నిజంగానే దయ్యాలు లేవు కదూ…” నీరసమైన గొంతుతో అన్నాను.
“లేదురా అనూ తల్లీ… నిజంగా దయ్యాలు లేవు… ఊరికే మనల్ని వినోదపరచటానికి చందమామ కథల్లో అలా రాస్తారు అంతే…” నా తల నిమిరారు నాన్న. “లేవరా తల్లీ, ఇదిగో ఈ బత్తాయి రసం తాగు… టేబ్లెట్ కూడా వేసుకుందువుగాని…” అమ్మ గ్లాసులో రసంతో వచ్చింది.
రెండు రోజుల్లో జ్వరమూ, నా భయమూ రెండూ తగ్గిపోయాయి.
ఇప్పుడు ఊరిలో మా ఇల్లు మోడర్న్ గా కట్టాడు మా తమ్ముడు… కుంకుడు చెట్టే కాదు, మామిడిచెట్టు కూడా లేదు. వెనకాల అంతా గచ్చు చేసేశారు. ఇంట్లోనే అటాచ్డ్ బాత్ రూమ్ లు కూడా కట్టుకున్నారు. బామ్మ ఎప్పుడో వెళ్లిపోయింది… అమ్మ కూడా సెలవు తీసుకుంది. నాన్నగారు తమ్ముడి దగ్గర ఉంటున్నారు. ఎప్పుడైనా వెళ్లినప్పుడు పెరట్లోకి వెళ్ళి, ఆ మూల చూడటం, కుంకుడు చెట్టును, దాని మీద కొలువైన తెల్ల దయ్యాన్ని తలచుకొని, నవ్వుకోవటం అలవాటుగా మారిపోయింది…
***
“అమ్మమ్మా… నీకు దయ్యమంటే బయ్యమా?” మళ్ళీ సాయంత్రం అడిగాడు ధీరజ్.
“భయం లేదు… మరి నీకు?”
“నాకసలే లేదు… దయ్యం నా ఫ్రెండు…” ముద్దుగా చెప్పాడు.
“ఓ… మరి నాకూ చూపించాలి నీ ఫ్రెండ్ ని… ఏం?” వాడిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాను. బాల్యమన్నది ఎంత విలువైన బంగారం !!!
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *