April 27, 2024

బుచ్చిబాబుకి పెళ్ళయింది

రచన… కలవల గిరిజా రాణి.

“సార్! రేపు సెలవు కావాలి.” చేతులు నులుముకుంటూ అడుగుతున్న బుచ్చిబాబు వేపు జాలిగా చూసాడు మేనేజర్ సావధానం.
ఆ చూపుకి అర్ధం తెలిసిన బుచ్చిబాబు నేలచూపులు చూడసాగాడు.
“అలా నేలచూపులెందుకులేవోయ్ బుచ్చిబాబూ! ఇంతకీ రేపటివి ఎన్నో పెళ్ళిచూపులేంటీ?”
“ముఫై నాలుగోది సార్!” ముఫై నాలుగు పళ్ళూ బయటపడేలా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.
“నీ వయసు ముఫై నాలుగు దాటి, నాలుగేళ్లు అయిందనుకుంటా ను. ఈసారైనా పెళ్లి కుదుర్చుకునేదుందా? లేదా?” లీవ్ లెటర్ మీద ఆటోగ్రాఫ్ చేస్తూ అన్నాడు సావధానం.
“అంతా దైవాధీనం సార్. నా చేతుల్లో ఏముంది? ‘ఐనా నా ప్రయత్నం నేను చేస్తూనే వున్నాను’. మా బామ్మ గొంతెమ్మ కోరికలతో కొన్నీ, నా బట్టతల మూలాన కొన్నీ, పెరిగే నా ఏళ్ళూ, వళ్ళూ మూలాన కొన్నీ, మొత్తం ముఫై మూడు తప్పిపోయాయి” నిరాశగా అన్నాడు.
“ఆల్ ది బెస్ట్. ఒకవేళ ఇదీ కుదరకపోతే చెప్పు. నాకు తెలిసిన సంబంధం ఒకటి వుంది. అది చెపుతాను. ఆ అమ్మాయికి నువ్వు కచ్చితంగా సరిజోడువనిపిస్తోంది..” సావధానంగా అన్నాడు మేనేజర్ సావధానం.
“అలాగే సార్! థాంక్యూ!” చెప్పి మేనేజర్ రూమ్ లో నుండి బయటకి వెళ్ళాడు బుచ్చిబాబు.
వెడుతున్న బుచ్చిబాబు వేపు సావధానంగా చూస్తూ , ఫోను అందుకుని ఓ నెంబరు డయల్ చేసాడు సావధానం.
***
మూడో రోజు ముఖం వేలాడేసుకుని వచ్చిన బుచ్చిబాబు వేపు చూసి విషయం అర్థం అయినట్టుగా తల పంకించాడు సావధానం.
“నిరాశ పడకోయ్ బుచ్చిబాబూ! చిన్నప్పుడు హిస్టరీలో చదవలేదూ గజనీ మహమ్మద్ దండయాత్రల గురించి. అంతే అనుకో… నేనో మేచ్ చెపుతా అన్నాను కదా? వచ్చే ఆదివారం ఆ పిల్లని చూడడానికి వెళ్ళు. అమ్మాయి చక్కగా వుంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చంటే నమ్ము. నాకయితే మీ ఇద్దరి ఈడూజోడూ బావుంటుందనే నమ్మకం వుంది.” అన్నాడు సావధానం.
ఆ మాటలకి సోడాబుడ్డి కళ్ళజోడు వెనకాతల నుంచి బుచ్చిబాబు కళ్ళు మెరిసాయి.
“ఆ అమ్మాయి ఫాదర్ అడ్రసూ, ఫోను నెంబరు ఇవ్వండి సార్!. “ అన్నాడు.
“కూర్మనాథం గారి ఏకైక కూతురు కుముదవల్లి. డిగ్రీ చదివింది. తండ్రి ఆస్తి మొత్తం కూతురికే. కాబట్టి నీకు అది బంపర్ ఆఫర్ అనుకో! నీ ఫోనుకి ఆయన అడ్రస్ , నెంబర్ పెడుతున్నాను. చూసుకో! ఈలోగా నేను ఆయనకి ఫోన్ చేసి , ఆదివారం పిల్లని చూసుకుందుకి వస్తావని చెపుతాను.” అనేసరికి, ఆనందంతో తబ్బిబ్బైపోయి, ఎండిపోయిన గోదారిలో మేట వేసిన ఇసుక తిన్నెలా మెరుస్తున్న తన తలని తడుముకుంటూ, “సరే సార్! అంతా మీ అభిమానం.” అంటూ పొంగిపోయాడు బుచ్చిబాబు.
***
తనకున్న ఆప్తబంధువు అయిన ఏకైక బామ్మని తీసుకుని ,సావధానం చెప్పిన ప్రకారం, పిల్ల తండ్రి కూర్మనాథం ఇంటి అడ్రసు వెతుక్కుంటూ వెళ్ళాడు బుచ్చిబాబు. వాళ్ళకి, సావధానం ముందే చెప్పి వుండడంతో , గేటు దగ్గరే ఎదురు చూస్తున్న కూర్మనాథం, ఇంచుమించు పూర్ణకుంభంతో స్వాగతం పలికినట్లే సాదర గౌరవాలతో ఆహ్వానం పలికేసరికి, అక్కడే మురిసిపోయాడు బుచ్చిబాబు.
హాల్లో సోఫాలో ఆసీనులయాక, బామ్మ, మనవడు ఇంటిని నఖశిఖపర్యంతం ఎక్స్ రే , స్కానింగులు గట్రా చేసేసి, సంతృప్తి గా ఒకరినొకరు చూసుకున్నారు.
వెండి పళ్ళాలలో ఫలహారాలు చూసి, తలకిందులైపోయారు.
“ఇవన్నీ ఇప్పుడు ఎందుకండీ? అమ్మాయిని పిలిస్తే చూస్తాము” మైసూర్ పాక్ నోట్లో కుక్కుకుంటూ బామ్మ అంది.
“అలాగే అండీ!” అని జవాబు ఇచ్చి, “అమ్మాయిని తీసుకురా మథురభాషిణీ!” అంటూ భార్యకి చెప్పాడు కూర్మనాథం.
లోపల నుండి, తల్లి చేయి పట్టుకుని మందగమనంతో వచ్చిన కుముద వల్లిని చూసి, నోరు తెరిచేసాడు బుచ్చిబాబు. బామ్మ అయితే ఏకంగా తన బోసినోరు మొత్తం తెరిచి అమ్మాయి వేపే చూడసాగింది.
ఆహా! ఎంత లలితంగా… కాదు కాదు ఏకంగా లలితా జ్యుయలరీ దుకాణమే నడిచి వచ్చేస్తోందా అనేలా కుముదవల్లి వచ్చి, ఇద్దరు పట్టే సోఫాలో తను ఒకతీ సర్దుకుని కూర్చుంది.
అది చూడగానే గతుక్కుమని, “బామ్మా!” అంటూ బామ్మ చెయ్యి గోకాడు.
“ఫర్వాలేదురా బుచ్చీ! మనమూ సర్దుకుపోవాలి” పిల్ల మెడలో కాసులపేరు వేపు కన్నార్పకుండా చూస్తూ అంది.
“అమ్మాయిని ఏమైనా అడుగుతారా” ఘీంకార స్వరంతో పిల్ల తల్లి మధురభాషిణి అడిగేసరికి, బుచ్చిబాబు ఉలిక్కిపడ్డాడు.
“వంటొచ్చా అమ్మాయ్” తనదైన ప్రశ్న వదిలింది బామ్మ.
వెంటనే, “మీ హాబీలేంటీ?” అంటూ బుచ్చిబాబు అడిగాడు. ఆ ప్రశ్నలకు జవాబుగా బామ్మ వేపు చూసి, “వాచింగ్ టీవీ,అండ్ ఫేస్బుక్, అండ్ సింగింగ్, అండ్ డ్యాన్సింగ్, అండ్ ఛాటింగ్ ఇన్ వాట్సాప్” అనీ, బుచ్చిబాబు వేపు చూసి, “ స్విగ్గీ,జొమాటో ఏప్ లు డౌన్లోడ్ చేసుకున్నానండీ. వాటిలో ఫుడ్ బుక్ చేయడం వచ్చు” అంది.
మళ్లీ ”బామ్మా!” అంటూ గోకాడు.
అర్ధం చేసుకున్న బామ్మ “వంట రాకపోయినా ఫర్వాలేదు, మెల్ల అదృష్టంరా బుచ్చీ!” అంది.
“సావధానం మీకు చెప్పే వుంటారు. నాకు ఒక్కతే కూతురు. అంతా అమ్మాయికే. “ కూతురి వేపు మురిపెంగా చూస్తూ అన్నాడు కూర్మనాథం.
“అమ్మాయి మహాలక్ష్మి లా వుంది. మా వేపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు.” టక్కున చెప్పేసింది బామ్మ.
“మాకూ పిల్లాడు బాగా నచ్చాడు. ఏమ్మా! కుముదం! నువ్వేమంటావు?” తండ్రి మాటలకి సిగ్గుతో,
“ఫో! నాన్నా!” అంటూ తనరెండు చేతులతో ముఖాన్ని దాచుకుందామనుకుంది కానీ, ఆ చేతుల్లో ముఖం దాగలేకపోయింది.
నెలరోజుల్లోనే, ఎంగేజ్మెంట్ ఆ తర్వాత మరో పదిహేను రోజుల్లోనే బుచ్చిబాబు, కుముదవల్లిల వివాహం కూడా అయిపోయింది. పెళ్ళిలో తెలిసింది కూర్మాథంకి సావధానం దగ్గర బంధువే అని.
పిల్లని కాపురానికి పంపించేటపుడు తోడుగా వచ్చిన కూర్మనాథం, మధురభాషిణి మూడు నెలలయినా తమ ఇంటికి వెళ్ళకుండా, ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చునేసరికి, బామ్మ నెమ్మదిగా తీగ లాగింది. ఆ వెనకాల డొంక మొత్తం కదిలేసరికి, బామ్మా మనవడు గుడ్లు తేలేసారు.
వెంటనే సావధానం దగ్గరకి వెళ్లి అడిగితే, “ఇదిగో! బుచ్చిబాబూ! వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయాలన్నారు. అదే నేనూ చేసాను. నీకా వళ్ళూ, ఏళ్ళూ పెరిగిపోతున్నాయి. మీ బామ్మకా డబ్బు ఆశ తగ్గడం లేదు. మా కుముదవల్లికా, ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. ఆస్తి వుందని చెపితే మీ బామ్మ తప్పకుండా సరే అంటుందని… బోలెడు ఆస్తి వుందని చెప్పాను. కిరాణా కొట్లో గుమాస్తాగిరీ తప్ప కూర్మనాథానికి వేరే ఆస్తులేవీ లేవు.ఇక నుంచి నీ భార్యతో పాటుగా, నీ అత్తమామల బాధ్యత నీదే. ఏకైక కూతురిని విడిచి వాళ్ళు వుండలేరు. ముఫై నాలుగు సంబంధాలు తప్పిపోయిన నీకున్నూ, నలభై మూడు సంబంధాలు తప్పిపోయిన కుముదవల్లికీ ముడి పెడదామనుకున్నాను. తర్వాత నెమ్మదిగా నీకు చెప్పవచ్చు అనుకున్నాను. ఇంతలో నువ్వే అడిగావు. ‘అదన్నమాట అసలు విషయం!!”సావధానంగా చెప్పాడు సావధానం.
“మరి ఆరోజు వేసుకున్న నగలూ? టిఫిన్లు పెట్టిన వెండి సెట్లూ? ఫర్నిఛర్ తో వున్న ఆ ఇల్లూ?” నీరసం గొంతుతో అడిగిన బుచ్చిబాబు వేపు చూసి, “ఆ ఇల్లు మాకు కూర్మనాథం పనిచేసే షావుకారు గారిది. ఆ నగలూ, వెండి సామానూ…గిల్టువే” ఆ మాటలు ఇంకా పూర్తి చేయాలనే లేదు… ఢాం అనే శబ్దంతో బుచ్చిబాబు వెల్లకిలా పడ్డాడు. ‘అదన్నమాట అసలు విషయం’.

సమాప్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *