April 27, 2024

సుందరము – సుమధురము – 11

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:
‘మయూరి’ చిత్రంలోని ‘అందెలు పిలిచిన అలికిడిలో’ అనే గీతాన్ని గురించి ఈ సంచికలో ముచ్చటించుకుందాము.

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై, శ్రీ రామోజీరావు గారు నిర్మాతగా 1984 లో విడుదల అయిన ఈ చిత్రానికి, దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రకథ, ఈ చిత్రంలో నాయిక పాత్ర పోషించిన సుధాచంద్రన్ గారి నిజజీవిత గాథ. కథానాయిక మయూరికి చిన్నతనం నుండీ నృత్యం అంటే ప్రాణం. తను కూడా నృత్యం నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతుంది, కానీ సవతి తల్లి వేదవల్లి అందుకు అంగీకరించదు. మయూరి తండ్రి, నాయనమ్మ వేదవల్లి నోటికి భయపడి ఏమీ అనలేక ఊరుకుంటారు. కాలేజీకి వెళుతూ చదువుకుంటున్నప్పుడు ఇంట్లోవారికి తెలియకుండా, దొంగతనంగా డాన్స్ నేర్చుకుంటుంది మయూరి. ఆ విషయం ఎవరి ద్వారానో వేదవల్లి చెవిలో పడి, మయూరిని ఇంటినుండి బయటకు వెళ్ళకుండా కట్టడి చేస్తుంది. అంతకు ముందే ఆమె నృత్యాన్ని చూసి ఆమెను ప్రేమించిన మోహన్ అండతో అతన్ని వివాహం చేసుకోవాలని, నృత్యకళకు అంకితం కావాలని ఆశిస్తుంది మయూరి.
విధి వైపరీత్యం వలన ఒక ప్రమాదంలో మయూరి తన మోకాలి నుంచి దిగువభాగం వరకూ కాలిని కోల్పోతుంది. నడకకు దూరమైన ఆమెను ఆమె ప్రియుడు కూడా నిరాకరించగా, నిరాశతో ఇంటికే పరిమితమైపోతుంది మయూరి. ఆ తరువాత జైపూర్ పాదంతో తన వైకల్యాన్ని జయించి, నాట్యాభ్యాసం కొనసాగించి, ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా ఎంతో పేరును తెచ్చుకుంటుంది మయూరి. ఆమె నృత్య కళాకారిణిగా మళ్ళీ ప్రదర్శనలు ఇవ్వటం చూసి, ఆమెను చేరబోయిన మోహన్ ను, తానున్న గదిలోని తలుపులు, కిటికీలు మూసివేయటం ద్వారా అతన్ని తిరస్కరిస్తుంది, మయూరి.
ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. వాటిలో నాలుగు పాటలు నృత్య ప్రధానంగా సాగగా, ఒక పాట పాదం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ టైటిల్స్ పడుతున్నప్పుడు నేపథ్యంలో వస్తుంది. సుధాచంద్రన్ నిజజీవితంలో తనదే అయిన తన పాత్రను ఎంతో చక్కగా అభినయించి, ఒప్పించారు. ఈ చిత్రంలోని నృత్యాలన్నింటినీ, నృత్యదర్శకులు శేషుగారు కంపోజ్ చేసారు. ఈ పాటను వేటూరిగారు వ్రాయగా, సంగీత దర్శకులు శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు కంపోజ్ చేయగా, మధుర గాయని శ్రీమతి జానకి గారు ఎంతో భావయుక్తంగా గానం చేసారు.
జైపూర్ పాదం అమర్చిన తరువాత తొలిసారిగా వేదిక మీద మయూరి ఇచ్చిన నృత్యప్రదర్శనగా ఈ గీతాన్ని చిత్రీకరించారు. ఆమె ఆహార్యం కూడా కృత్రిమ పాదం ప్రస్ఫుటంగా కనిపించేలా ఉంటుంది. ఆ పాదంతో కూడా ఆమె చేసే నాట్యవిన్యాసం మనలను ఎంతగానో అబ్బురపరుస్తుంది అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
పాట సాహిత్యం:

సాకీ:
అందెలు పిలిచిన అలికిడిలో… అణువణువున అలజడులూ
ఎద పదమొకటౌ లాహిరిలో… ఎన్నడు ఎరగని ఉరవడులు
(నా అందెలు పిలిచిన అలికిడి వినిన నాకు అణువణువున అలజడులు రేగాయి. నా హృదయమే పాదమైపోయిన మైకంలో, ఎప్పుడూ నాకు తెలియని వేగవంతమైన తరంగాలు! – మళ్ళీ నాట్యం చేయగలుగుతున్నందుకు ఆమెలో రేగిన ఆనంద ప్రకంపనలివి.)
పల్లవి:

ఇది నా ప్రియ నర్తన వేళ, తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ, తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ… ఆ…

(ఇది నాకెంతో ఇష్టమైన నర్తనాసమయం… జీవితంలోని ఆనంద హేలకు అంతం ఎక్కడుంది? – చివరివరకూ నేనిలాగే ఆడుతూ గడిపేస్తాను అని ఆమె అంతరంగంలోని భావం.)
చరణం 1:
ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా… ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా… ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక, చిరు మెదలిక… గిలిగింతగ జనియించగా
ఒక కదలిక, చిరు మెదలిక… గిలిగింతగ జనియించగా
నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటనమాడనా?
నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటనమాడనా?
అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా, పాడనా?

(ఆడటానికి సందర్భం ఎందుకు? అదిగో ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిందా, తుంటరి చిలిపి మెరుపూ ఒకటి మెరిసిందా? అది చాలదూ? ఆ దృశ్యం చూసి, ఒక చిన్న కదలిక, చిరు మెదలిక… గిలిగింత పెట్టినట్టు లోలోపలి నుంచి పుట్టుకుని రాగా… ఈ నాలుగు దిక్కుల నడుమను ఉన్న పుడమియే నా వేదికగా చేసుకుని, నేను నృత్యాభినయం చేయనా? అంతమెరుగని లయతో, నిరంతరంగా సాగే గతితో జతులను ఆడనా, మరి పాడనా?)
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ… ఆ…
చరణం 2:
మేఘ వీణ చలి చినుకు చిలికినా మేనులోన చిరు అలలు కదలినా
మేఘ వీణ చలి చినుకు చిలికినా మేనులోన చిరు అలలు కదలినా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా
సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా
సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా
వరాళి ఎదలో స్వరాల రొదతో పదము పాడనా? ఆడనా?

[మేఘమనే వీణ చలిచినుకు స్వరాన్ని పలికిస్తే, నా మేనులోన చిరు అలలు కదిలితే, ఆ అల పెద్ద కెరటమై, నాలోని విరహవేదనగా జనించగా (వలవంత – మన్మథ వ్యధ – నాట్యం చేయాలనే కోరిక ఆమెను మన్మథుని వలె బాధిస్తోంది అని కవి హృదయం…) సులభంగా అర్థమయ్యే వేదామృతం ఎదలో పొంగుతూ ఉంటే, వరదలా ఉప్పొంగిపోనా? చందమామ వంటి హృదయంలో పొంగిన, స్వరాల రవళితో నేను పాటను పాడి ఆడనా?]
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల
ఇది నా ప్రియ నర్తన వేళ ఆ… ఆ…
ఇక తాను నృత్యం చేయలేనని, పరిస్థితికి తలవంచిన ఆమెకు భగవంతుడు వరంగా ప్రసాదించిన జైపూర్ పాదంతో నృత్యసాధనను అవిరామంగా చేసి, తనువు, మనసు నృత్యంగా మారిన ఒక కళాకారిణి యొక్క అవధులు లేని ఆనందాన్ని, పరవశాన్ని, తన్మయత్వాన్ని, ecsatasy ని వేదికపైన ఆడుతూ ఉండగా ఆమె అనుభవించిన ఆ స్థితిని అక్షరీకరించిన శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి పాదాభివందనాలు అర్పించాల్సిందే.
ఆనందాన్ని అర్ణవంగా మనలో పొంగించే ఈ గీతాన్ని ఈ క్రింది లింక్ లో వీక్షించుదామా?

***

1 thought on “సుందరము – సుమధురము – 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *