May 3, 2024

జామాత

రచన: గిరిజారాణి కలవల

‘ఇచట మీ చేయి చూసీ చూడగానే మీ జాతకం మొత్తం చెప్పబడును. జ్యోతిషపండిత రత్న శ్రీశ్రీ అనుగ్రహ స్వామి చేతిలో, మీచేయి పెట్టండి., గతి తప్పిన మీ గ్రహాలని దారికి తెచ్చుకోండి. రండి. చేయి చాపండి. మీ అతీగతీ తెలుసుకోండి.”
తాటికాయంత అక్షరాలతో ఉన్న బోర్డు కనపడగానే, ‘యాహూ!’ అనుకుంటూ ఎగిరి గంతేసాడు చిదానందం.
గత కొద్ది రోజులుగా తాను పడే సమస్యల నుంచి పరిష్కారం దొరికే మార్గం దొరికిందని సంబరపడిపోయాడు. వెంటనే మరేం ఆలోచించకుండా లోపలకి వచ్చేసాడు.
“చెప్పండి సర్! ఏ పని మీద వచ్చారు? మీ వివరాలు చెప్పండి.” అంది రిసెప్షనిస్ట్.
నడినెత్తిన కుండెడు కొప్పు, ముఖానికి అరంగుళం మందం మేకప్పు, ముదర ఎర్రని రంగు పూసుకుని వున్న లిప్పులతో, చిదానంద చెప్పే వివరాలు అన్నీ రాసుకుంది.
“వెయ్యి రూపాయలు ఫీజు అవుతుంది” అంది. వెంటనే జేబులోంచి వెయ్యి తీసి ఆవిజకి ఇచ్చి, రశీదు తీసుకున్నాడు.
“మీ రెండు చేతులు చాపండి” అంటూ చిదానంద చేతిలో శానిటైజర్ పోసింది.
“రెండు చేతులూ శానిటైజర్ తో శుభ్రంగా తుడుచుకుని, ఆ బెంచీ మీద కూర్చోండి. మీ పేరు పిలిచాక లోపలకి వెళ్ళండి” అంది.
“సరే” అంటూ కూర్చుని, పిలుపు కోసం వెయ్యి కళ్ళతో, వెయ్యి చెవులతో వెయిట్ చేయసాగాడు.
అక్కడ వున్న బెంచీలు, కుర్చీలు… అరిచేతులు రుద్దుకుంటున్న విజిటర్స్ తో నిండిపోయి వున్నాయి.
వారందరూ మాట్లాడుకునే మాటలు చిదానంద చెవిన పడుతున్నాయి.
‘ఈ స్వామీజీ చాలా పవర్ ఫుల్ అట. మన జాతకంలో గతి తప్పిన గ్రహాలని తిరిగి క్రమపద్ధతిలో పెడతారట. ఆయన ఆర్డర్ లో పెడితే అవి ఇక తారుమారయే ప్రసక్తే వుండదట. మహానుభావులు… ఆయన చేతిలో మన చేయి పడితే చాలు… ఇక మనల్ని ఆయనే నడిపిస్తాడట.’ ఆ మాటలన్నీ చిదానంద హృదయాన్ని తాకుతున్నాయి.
వాళ్ళతో పాటే చిదానంద కూడా మాటి మాటికీ చేతులు చూసుకుంటూ… ఈమధ్య తలకిందులు అయిపోయిన తన ఆర్థిక పరిస్థితిని తలుచుకుంటూ…లోపల అనుగ్రహ స్వామీజీ చెప్పబోయే తన అదృష్ట గీత గురించి ఎదురుచూడసాగాడు.
‘చిదానందా! చిదానందా! చిదానందా!’ కోర్టులో బిళ్ళ బంట్రోతు పిలిచినట్టు… పిలుపు వచ్చింది. చటుక్కున లేచి, మూసి వున్న తలుపు తీసుకువి, లోపలి గదిలోకి ప్రవేశించాడు.
ఖాళీ గదిలో ఒక గోడ వారన జింక చర్మం మీద ఆసీనులై కూర్చుని వున్న బవిరి గడ్డం నిమురుకుంటూ అనుగ్రహ స్వామీజీ కనిపించారు.
“నమస్కారం స్వామీ!” రెండు చేతులు జోడించి చెప్పబోయాడు చిదానంద.
“ఆ… ఆ… అలా రెండు చేతులని జోడించకు నాయనా! చేతుల్లోని గీతలు ఒకదానితో మరొకటి అతుక్కుపోతాయి. నీ తలని నేలకి ఆనించి, నాకు వందనం చేస్తే చాలు.” అంటూ సలహా ఇచ్చాడు అనుగ్రహ స్వామి.
ఆ ప్రకారం, తన తలని, స్వామి ముందు నేలకి తగిలేలా చేసి, వందనం చేసాడు చిదానంద.
“ఇప్పుడు చెప్పు… నీ సమస్యలు ఏంటో? ఇక్కడకి ఎందుకు వచ్చావో చెప్పు.! “ అన్నాడు
“నమస్కారం స్వామీ! ఇదివరలో బాగానే వున్నాను. ఈ మధ్య నా ఆర్థిక పరిస్థితి తారుమారైపోయింది. ఐపీ పెట్టే స్ధితికి వచ్చేలా వున్నాను. కాస్త నా చేయి చూసి ఏ గ్రహానికి శాంతులు, పూజలు చేయించాలో చెప్పండి స్వామీ!” నవ్వుతూ అడిగాడు చిదానందం.
“నీ చిరునవ్వు చూస్తోంటే, నీకేం కష్టాలూ లేనట్టే కనపడుతున్నాయోయ్!” అన్నాడు అనుగ్రహస్వామి.
“ఆయ్! నా మొహమే అంతండి. నా పేరు చిదానంద కదండీ!” అన్నాడు.
“పోన్లే… అలా అయినా తృప్తి పడు. ఏదీ నీ చెయ్యి చూపించు.” అంటూ భూతద్దంతో అరిచేయిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అయిమూలగా, అడ్డదిడ్డంగా చూసాడు అనుగ్రహస్వామి.
జాతక చక్రం గీసి మరీ చూసాడు. చిదానంద చేతి వేపూ, ఆకాశం వేపూ మార్చి మార్చి చూసాడు. అంతా సక్రమంగానే వుంది. సాలోచనగా ఆలోచించాడు. ఎక్కడా, ఏ దోషమూ, లోపమూ లేదే… జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు మొత్తం తిరగేసాడు. ఎక్కడా తేడా లేదు.
“మనందరి చుట్టూ వైఫై తిరుగుతున్నట్లు, నవగ్రహాలు నీకు అనుకూలంగానే నీచుట్టూ తిరుగుతున్నాయి. గ్రహదోషాలు ఏమీ లేవు. కానీ, నువ్వు దివాలా తీయడానికి కారణం మరింకేదో వుందని తోస్తోంది. అదేమయి వుంటుందబ్బా?” అంటూ తల మీద మూడు సార్లు చూపుడువేలుతో తట్టుకోగానే… ఫ్లాష్ లైట్ వెలిగింది కాబోలు.
వెంటనే . “నీకు పిల్లలు ఎంత మంది?” అని అడిగాడు.
“ఆయ్! నాకు ఒక్కతే కూతురండి. రెండు నెలల క్రితం దానికి పెళ్ళి చేసానండి. అత్తారింటికి పంపడానికి మా ఆవిడ ఒప్పుకోలేదండి. మా అమ్మాయి కూడా కాస్త గారంగా పెరిగింది కదండీ! కాపురానికి వెళ్ళడానికి సుతారామూ ఒప్పుకోలేదు స్వామీ! ఇక చేసేది లేక, వియ్యాలవారిని ఒప్పించి, అల్లుడి గారిని ఇల్లరికం తీసుకొచ్చేసాను స్వామీ!.” చిదానందంగా చెప్పాడు చిదానంద.
“ఓహో! అలాగా! మీ అల్లుడు ఏం చేస్తూంటాడు?” అన్నాడు స్వామీజీ.
“ఆయనాండీ! ఆయన పొద్దున్నే పదిడ్లీలు, పది దోశలు, పది పూరీలు టిఫిన్ తింటాడు. ఆ తర్వాత పట్టె మంచం మీద విశ్రాంతి తీసుకుంటాడు. మధ్యాహ్నం పీకల దాకా భోంచేసి, గుర్రు పెట్టి నిద్రోతాడు. సాయంత్రం సమోసాలు, బజ్జీలు, పకోడీల వంటివి నాలుగైదు రకాలైనా లాగిస్తాడు. రాత్రి భోజనం డజను చపాతీలైనా తినేసి నిద్రపోతాడు. రోజంతా ఇదే చేస్తాడు.” సమాధానం ఇచ్చాడు చిదానంద.
“హా! ఇప్పుడు తెలిసింది… నువ్వు దివాలా తీయడానికి కారణం… ఆ నవగ్రహాలు కాదోయ్ చిదానందా! నిన్ను పట్టుకుని వేధించే గ్రహం, పేరు దశమ గ్రహం. దానికి పూజలు, శాంతులు ఏవీ లేవు. చేతనైతే, నీ కూతురు మీద మమకారం తగ్గించుకుని అత్తారింటికి పంపించు. లేకపోతే మనసుని కుదుట పరచుకుని, ఎప్పటిలాగే చిదానందంగా నవ్వుతూవుండు. అదే పరిష్కారం. నీ నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వెళ్ళు నాయనా!”
“అంతే అంటారా స్వామీ! జామాతా! దశమగ్రహమా! ఇక నన్ను జీవితాంతం అంటిపెట్టుకునే గ్రహమే నువ్వు.” నిట్టూరుస్తూ దండం పెట్టి లేచాడు చిదానంద.

సమాప్తం.

1 thought on “జామాత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *