‘వేయి పడగలు’ అక్షర యాత్రకు దారి

రచన: విజయలక్ష్మీ పండిట్

“విశ్వనాథ ‘వేయిపడగలు’ లోని కొన్ని ముఖ్యాంశాలు, విశ్వనాథ గురించి కొందరు ప్రముఖుల భావాలు” అనే డా.వెల్చాల కొండలరావుగారి సంకలనం ఈ తరం కవులు, రచయితలు చదవవలసిన సంకలనం.
వివిథ వర్ణాల సుగంథభరిత పూలతో, వైవిధ్యభరిత వృక్షాలతో మనోహరంగా ఉండే దట్టమైన ఒక అందమైన అడవిలో మనిషి ప్రయాణించడానికి ఆ అడవి అందాలను పూర్తిగా అనుభవించడానికి, దారి తెన్ను తెలపడానికి ఒక నావిగేషన్ మ్యాప్ (navigation map) కావాలి.
అలాగే కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ బృహత్ నవలలోకి సామాన్య పాఠకులను చేయిపట్టి నడిపిస్తూ అందమైన వర్ణనలు, కథలు, జానపద గాథలు, అలౌకిక ఉపమానాలతో వైవిధ్యభరిత పాత్రలతో కూర్చిన బృహత్ ఇతిహాస నవలలో అక్షరయాత్ర చేయడానికి ఒక గైడ్, మార్గదర్శిగా ఉపయోగపడుతుందీ సంకలనం.
ఈ సంకలనంలో ‘వేయి పడగలు’లోని కొన్ని ముఖ్యాంశాలు అనే ఔపోద్ఘాత శీర్షికలో కొండలరావుగారు ‘వేయిపడగలు’నవల గురించి అన్న ముఖ్యమైన మాటలు వారి మాటల్లో…
“వేయిపడగలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చదవవలసిన గొప్ప నవల, గొప్పతనం గురించి మంచితనం గురించి సవివరంగా, సందర్భోచితంగా, తరువాత వృత్తాంతాల ద్వారా, కథల ద్వారా, పాత్రలద్వారా, ఉదాహరణల ద్వారా రచించిన నవల”.
“మనిషి మానవుడు ఎలా కావాలో, ఎలా కావడంలేదో చెపుతారు వేయిపడగలలో, నిజమయిన గొప్పవాడే నిజమయిన మంచివాడని అంటారు విశ్వనాథ”.
తరువాత “వేయిపడగలు ఎందుకు చదవాలి?” అనే శీర్షికతో ‘వేయిపడగలు’ నవల గురించి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యగారి తొమ్మిది పేజీల అభిప్రాయం చదవడంతో ‘వేయి పడగలు’ నవల గురించి ఒక సమగ్ర అవగాహన, ఆ నవల హృదయం, ఏ ఎఱుకతో ఆ నవలను పరిశీలించాలో వివరిస్తారు.
కోవెల సుప్రసన్నాచార్య ఒక కవి/రచయిత మనస్సులో ఒక వస్తువు గురించి జరిగే పరివర్తనా క్రమాన్ని గురించి వ్రాస్తూ.. విశ్వనాథవారు ఈ నవలలో ఏ ఏ దశలుగా పరివర్తనం చెందుతూ నవలను వ్రాశారో చెపుతారు.
సుప్రసన్నాచార్య మాటల్లో..
“కవి రచనావేళ ఒకానొక వ్యక్తావ్యక్త స్థితిలో సంధి దశలో విశ్వ చైతన్య గర్భం నుంచి ఎన్నుకున్న అంశాలు, ప్రతీకలై బింబాలై ఉపమానాది అలంకారాలై శిల్ప మార్గాన పయనించి లౌకిక స్థితిని అలౌకిక స్థితిగా పరిణమింపజేస్తాయి. అందువల్లే రచయిత (విశ్వనాథ) ఆ తాదాత్మ్యస్థితిలో నుంచే “వేయి పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నదీ కలలలోన రాజునూ” అని ప్రారంభించారు నవలని.
కథాకథన దశలో ఆ మొత్తం నవలలోనూ రచయిత (విశ్వనాథ) ఒక పారవశ్య స్థితికి, స్వప్నస్థితికి తిరిగి ప్రయాణం చేస్తుంటారు. ఈ భూమిక మీద ఈ నవలలో రచయిత సూత్రధారుడవుతాడు, కథానాయకుడవుతాడు. కథ చెప్పుతూ, చెప్పుతూ తన ఆత్మకథలోకి వెళ్లిపోతాడు. ఆత్మకథలోంచి సాగి, జగత్మథనం, ఇహపరలోకాల అనుబంధాన్ని వాటి అవినాభావ స్థితినీ వ్యాఖ్యానిస్తాడు” అని అంటారు. ఆలోచిస్తే ఇది ప్రతి కవి/రచయితకు అన్వయిస్తుంది. కవులు/ రచయితలు తమ రచనలలో వస్తువును విశదపరిచే క్రమంలో తమను తాము వివిథ అవస్థలలో వ్యక్తపరచుకోవడం అనేది సర్వసాధారణం. కవితలు, కథలు, నవలలు, ఆయా కవుల, రచయితల మనోప్రపంచ ఆలోచనల, అనుభవాల అనుభూతుల మథనంలో అక్షరరూపం దాల్చినవే క దా!
“కోవెల సుప్రసన్నాచార్య” వేయిపడగలు నవల గురించి వివరిస్తూ..
“వేయిపడగలు”ఇతిహాసం తాళం తెరిచేందుకు కావలసింది జానపద గాథావిజ్ఞానం అంటారు. జానపద గాధాప్రవృత్తిని ప్రవేశపెట్టడంతో ఈ ఇతిహాసం భూమ్యాకాశాల మధ్య సేతువుగా నిలువబడ్డది” అని వ్యాఖ్యానించారు.
వారు “వేయిపడగల”లోని వివిధ పాత్రల ప్రాముఖ్యతను, కథాసారాంశాన్ని వివిధ విష్యాలపై సంక్షిప్తంగా చెపుతూ “వేయిపడగలు”లో గ్రామీణ ఆర్ధికవ్యవస్థ శైథిల్యం చెప్పడం ఎంత ముఖ్యమైన అంశమో , కుటుంబ వ్యవస్థకు మూలమైన దాంపత్య జీవనం, వివాహ వ్యవస్థ శిథిలమైన సంగతి చెప్పటమూ ముఖ్యాంశమే అంటారు. సమాజంలోని అన్ని వ్యవస్థలకు అన్ని థర్మాలకు, అన్ని పురోగామి శక్తులకు, అన్ని జీవన మాధుత్యాలకు, అన్ని పరలోక సంభావనలకు, అన్ని విశ్వకుటుంబ తత్వములకు, ఈ వివ్వాహవ్యవస్థే మూలమని, ఈ దాంపత్యమే మూలమని రచయిత గాఢంగా విశ్వసించాడు. అందుకే సమాజ వ్యవస్థ ఆధారంగా చేసుకున్న ఒక వివాహాన్నీ, ప్రణయం మూలాధారంగా ఉన్న మరొక వివాహాన్ని శరీరాలకు అతీతంగా జీవాత్మ, పరమాత్మల సంయోగ హేతువుగా సంసిద్ధిగా మరొక వివాహాన్ని ఆయన మూడు కేంద్రాలుగా నిర్మించి ఈ త్రిభుజం చుట్టూ పరిక్రమించవలసిన మానవ జీవన ధర్మచక్రాన్ని “వేయిపడగల”పేర ఆయన నిర్మించాడు” అని అంటారు.

సుప్రసన్నాచార్య మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసిమ్హారావుగారు (1982)లో విశ్వనాథగారిని గురించి ప్రసంగంలోని వాక్యాలను మననం చేసుకొన్నారు. “విశ్వనాథ తన రచన ద్వారా పాశ్చాత్య, సాంస్కృతిక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం ఇంకా కొనసాగవలసి ఉన్నది. మన చరిత్రలో వ్యక్తిత్వం లేనివారుగా చిత్రించి, ఆర్య ద్రావిడులుగా విభజించి మన మతాలను, అపరిణత వ్యవహారాలుగా ప్రదర్శించి, మన వేదాలను ప్రకృతికి భయపడ్డ మానవుని ఆర్తగీతాలుగా చిత్రించి, మనల్ని మన మూలాల నుంచి దూరంగా విసిరివేసే ప్రయత్నం చెసిన మహాప్రయత్నం నుంచి మనం విముక్తులం కాలేదు. విశ్వనాథ తనకు పూర్వం హెన్రీ డిరేజియో, రాజా రామ్మోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరబిందో మొదలైనవారు సాగించిన ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పార్ష్వాలన్నింటినీ సమన్వించుకుని భారతీయ సమాజాన్ని పునరున్మిలితం చేయటానికి వాజ్మయం ద్వారా ఉద్యమం సాగించాడు. ఈ గొప్ప ఉద్యమం సందర్భంలోని కొన్ని కొన్ని అవగాహనలు ఈనాడు మనకు సమంజసంగా కానరాకపోవచ్చు. కానీ సమగ్ర దృష్టితో చూస్తే ఆయన ప్రాణాలు దేశంకోసం, సంస్కృతి కోసం, భాషలకోసం, నిరంతర జాగరూకత కోసం ప్రయత్నించబడ్డవి” అని అన్నారని వ్రాశారు.
భారతజాతి శక్తి చావరాదన్నది విశ్వనాథగారి ప్రతిపాదన. అదే స్ఫూర్తితో “ఒక జాతి సర్వత ఉన్మీలితమైనా గావచ్చు కాని శక్తి చావరాదు” (25 అధ్యాయం) వేయిపడగలకు కేంద్రమైన వాక్యమిది. మూలము నుంచి పెళ్లగించడం జరిగిన సహజంగా అంతరికమైన ప్రాణశక్తి నిలిచివుంటే దాన్ని పునరుజ్జీవింపజేసుకొనవచ్చును”.
ఈ శక్తిధీరుడు మొదటి ఆధ్యాయం, చివర దర్సనమిచ్చిన ‘మహాపురుషుడు’ ధర్మారావు. అతడు చివరి అధ్యాయంలో అరుంధతిని చూచి “నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి” అంటాడు. ఈ విధంగా వేయిపడగలు మొత్తం గ్రంధం ఈ శక్తి ఉద్యమాన్ని నశించకుండా నిలబెట్టడాన్ని సూచిస్తూ ఉన్నది.
పర్యావరణ పరిరక్షణ గురించి ఎనభై ఏళ్ళ క్రితమే విశ్వనాథ ఈ నవలలో చర్చించారన్నారు సుప్రసన్నాచార్య. వారి మాటల్లో.
“ఈనాడు పర్యావరణ శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఏయే అంశాలను గూర్చి చర్చిస్తున్నదో వాటిని వేయిపడగలు ఎనభై ఏళ్ళ క్రితమే చర్చించింది. ప్రకృతిలో ఉండే సంతులనాన్ని భంగం చేయడం వల్ల మానవ జీవితం ఎంత దుఃఖభాజన మవుతున్నదో ఇంతటి అభినివేశంతో చర్చించిన నవల మన దేశంలోనే అరుదైనది. చెట్లను నిర్మూలించడం, మెట్ట పొలాలను లేకుండా చేయడం, వాణిజ్య సస్యాలకు ప్రాధాన్యం వచ్చి తిండి గింజలు తగ్గిపోవడం, ఇవన్నీ పాశ్చాత్య నాగరికత తెచ్చిపెట్టిన బస్తీల పెరుగుదలతో వచ్చిన ఇబ్బంది. ఇంతేకాక సృష్టి అంతా మానవుడి సుఖభోగాల కోసమే ఏర్పడిందని భావించినట్లు ఈ నాగరికత ప్రవర్తిస్తుంది. మిగిలిన జీవకోటికి ఆశ్రయభూతమైన ప్రకృతి అంతా వికవికలు చేయబడింది. ఇరువదవ అధ్యాయంలో ఈ కల్లోలం ఆశ్చర్యకరమైన విధంగా చిత్రింపబడింది. వృషన్నిది అన్న మేఘ వృత్తాంతం. ఈ మేఘం ఆదివటం మీద నిలుస్తుంది. ఆ చెట్టు, ఆ మేఘముల మైత్రి ఊరు పుట్టినప్పటినుండి కొనసాగుతున్నది. అంటే అనంతకాలం నుండి కొనసాగుతున్నది. అది ఈ క్రొత్త నాగరికత వల్ల విశదమయింది. ఆదివటము విద్యుద్దీపముల కొఱకు విచ్చేదమైపోవడం వల్ల ఆ మేఘానికి ఆ గ్రామాన్ని గుర్తుపట్టడం కష్టమయింది. వృషన్నిధి అక్కడ కురియలేదు. అయితే వృషన్నిధికి కూడా ఒక తుపాకీ గుండు తగిలింది. ఈ గుండు సామరస్యాన్ని త్రోసివేస్తూ ఆక్రమిస్తూ వున్న నాగరికత, ఈ గుండు వల్ల నాగరికతా మోహంలో ఆత్మ విస్మృతి పొందిన ప్రజల నూతన భావఝరుల వల్ల ఈ మేఘము ఏదో నీరక్కరలేది ఒక గుట్ట పైభాగాన కూలబడిపోయింది. మేఘాన్ని ప్రియా సందేశ వాహకంగా కాళిదాసు నిర్మిస్తే, ఆధునిక కాలంలో పృథ్వీ చైతన్యంలో ప్రాకృతిక అసంతులనం వల్ల ఏర్పడ్డ విషాదాన్ని వ్యక్తం చేయడానికి ఈ వృషన్నిధిని తీర్చిదిద్దాడు విశ్వనాథ” అంటారు సుప్రసన్నాచార్య.
“ఇన్ని కథన పార్ష్వాలను ఇముడ్చుకున్న ఈ ఇతిహాసం, ఈ మహాకావ్యం, ఈ నవల బహిరూపాన్ని బట్టి అదేమిటొ గుర్తించటం సులభ సాధ్యం కాలేదు. ఇది నవలే కాదన్న వాళ్ల దగ్గర నుంచి దీనికంటే గొప్ప నవల లేదనే దాకా, విమర్శకులు వైవిధ్యంతో ముక్తకంఠంతో గొంతెత్తి పలికారు” అంటూ. “వేయిపడగలు” రచించిన విశ్వనాథ సత్యనారాయన తెలుగు వాజ్మయ పరిమితులను, భారతీయ వాజ్మయ పరిమితులను దాటి ఈ ఆంగ్ల పరివర్తనతో విశ్వసాహిత్య పరిధులలోనికి ప్రవేశిస్తున్నాడు అని ఆయనకు స్వాగతం పలుకుతున్నాడు సుప్రసన్నాచార్య.
ఈ సంకలనంలో వున్న /చర్చించిన వివిథ శీర్షికలు..
1. విద్య గురించి విశ్వనాథ,
2. భాష, సాహిత్యం – కావ్యం, వాజ్మయం, రసం గురించి విశ్వనాథ,
3. మతం – సంప్రదాయం, ప్రేమ వివాహ వ్యవస్థ తదితరాల గురించి విశ్వనాథ.
4. విశ్వనాథగారి కొన్ని వర్ణనలు,
5. కొన్ని కథలు, కొన్ని సామెతలు,
6. “Some Valuable Views on Vishwanatha” అనే శీర్షికతో ఆంగ్లములో ప్రముఖ కవులు, రచయితలు, విద్యావేత్తలు, మేధావుల పరిశీలనలు వున్నాయి.

ఈ సంకలనం కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి, వారి సాహిత్య రచనా వ్యాసంగాల గురించి అన్ని కోణాలలొ దర్శించడానికి, ఆ ఎఱుకతో “వేయి పడగలు” నవలలో ప్రవేశించి చదివి అర్ధం చేసుకొని ఆనందించడానికి దోహదం చేసే ఒక మంచి సంకలనం.

వేదిక – విశ్లేషణ

రచన: నండూరి సుందరీ నాగమణి

వేదిక!
ఎంత చక్కని శీర్షిక!!
గోతెలుగు వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వెలువడినప్పుడు నేను అనుసరించలేకపోయాను. కానీ పుస్తకరూపం లోనికి వచ్చాక చదువుతూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది.

రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు నాకు చక్కని మిత్రురాలు, సన్నిహితురాలు. క్రిందటేడు ఆమె మాతృభూమికి వచ్చినప్పుడు శ్రీమతి మంథా భానుమతి గారి గృహంలో వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. అంత గొప్ప నృత్యశాస్త్ర కోవిదురాలు అయినా కూడా కించిత్ గర్వమైనా, అహంభావమైనా లేక ఎంతో ఆత్మీయంగా పలకరించి, మనసారా మాట్లాడారు. వారి స్నేహితానికి పాత్రత కలిగి వారికి సన్నిహితురాలినైనందుకు ఆ కళాభారతి పాదాలకు భక్తి పూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.

సహజంగా తానూ నర్తకి కావటం వలన కథానాయకి చంద్రకళ పాత్రలో తాను లీనమైపోయి వేదిక నవలా రచన సాగించారు రచయిత్రి. మేజర్ సత్యదేవ్, గాయని శారదల సంతానం చంద్రకళ, వినోద్ లు. చంద్రకళకు చిన్ననాటి నుండీ నాట్యకళపై మక్కువ ఎక్కువ. తల్లి శారద ప్రోత్సాహంతో, ఇంటి దగ్గరగా చేరిన డాన్స్ స్కూలు మాష్టారి ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుంటుంది. కళల పట్ల ఎంతో అభిమానం కల తల్లిదండ్రులకు వారసురాలు కావటం చంద్రకళ అదృష్టం. ఆమె విద్య కోసం, ఆమెకు కాస్ట్యూమ్ కుట్టించడం దగ్గరనుంచి, పాట పాడుతూ అభ్యాసం చేయించడం, మేకప్ చేయటం వంటి పనులన్నిటిలో తన కుమార్తెకు ఎంతో చేదోడు వాదోడు గా ఉంటుంది శారద. అలాగే సత్యదేవ్ కూడా తన పిల్లల ఆనందం కన్నా వేరే ఏమీ కోరుకోని ప్రియతమ పితృదేవుడే.
సత్యదేవ్ స్నేహితుడైన భూషణ్, ఆయన భార్య నిరుపమలు చంద్రకళను ఎంతగానో ఆదరించటమే కాక, తమ కుమార్తె అయిన రాణి తో సమానంగా ఆమెను ప్రేమిస్తారు… ఆమె నృత్యకళకు భూషణ్ ఎన్నో సోపానాలు వేస్తాడు. ఎన్నో వేదికలను ఆమె అభివృద్ధికి గాను అమరుస్తాడు. అలాగే మేనత్త కొడుకు జగదీష్ తో చంద్రకళ అనుబంధం, ప్రేమలను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు ఉమాభారతి గారు తనదైన చక్కని శైలిలో… జగదీష్ కూడా మరదలు, ప్రేయసి అయిన చంద్రకళతో ఎంతో ప్రేమగా, చనువుగా ఉంటూనే, స్నేహితురాలైన రాణితో, ఆమె తల్లిదండ్రులతో కూడా ఎంతో అభిమానంగా ఉంటూ ఎన్నో సమస్యలలో వారికి తోడుగా, నీడగా ఉంటాడు.

బాలికగా ఉన్న చంద్రకళనుంచి, యవ్వనంలో అడుగిడిన చంద్రకళతో పాటుగా, ఆమె మనసుతో పాటుగా, ఆమె కళా సేవతో పాటుగా, ఆమె భావాలతో పాటుగా మనమూ పయనిస్తాము. చివరికి అమెరికాలో కూడా విజయకేతనం ఎగురవేస్తుంది చంద్రకళ. నృత్యకళాకారిణి, మరియు ఆచార్యురాలైన శ్రీమతి తేజస్విని గారి ద్వారా అక్కడికి వెళ్ళి, ఎన్నెన్నో ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా, అక్కడే కొన్నాళ్ళుండి చాలా మంది విద్యార్థినులకు నాట్యవిద్యలో శిక్షణను ఇస్తుంది. చివరికి ఆమె భారతదేశానికి తిరిగి రావటం ద్వారా కథ ముగింపుకు చేరుకుంటుంది. అయితే చంద్రకళ తన బావ జగదీష్ చేయిని అందుకుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే మాత్రం నవల ఆద్యంతమూ చదవక తప్పదు.

‘వేదిక’ నవల మకుటమే ఎంతో అందాన్ని, ఆనందాన్ని తెచ్చింది ఈ గ్రంథానికి. చదువుతూ ఉంటే సమయం తెలియదు, పేజీలు మాత్రం తిరిగిపోతూనే ఉంటాయి. కథానాయికతో పాటు మనమూ నాట్యమాడుతాము… పార్టీలలో హాయిగా ఆనందిస్తాము. జగదీష్ తో విహరిస్తాము. ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడినా, అసూయతో తూలనాడినా సంయమనం వహిస్తాము. ఇలా ఎన్నెన్నో సుగుణాలను మనకు తెలియకుండానే ప్రధాన పాత్ర అయిన చంద్రకళ ద్వారా మనము నేర్చుకుంటాము. అలాగే బిడ్డల ఉన్నతి కోసం, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, ఉంటారో శారద, సత్యదేవ్ పాత్రల ద్వారా తెలుస్తుంది. పెంపకం ఎలా ఉండకూడదో రాణి తల్లిదండ్రులు భూషణ్, నిరుపమల పాత్రల ద్వారా అవగతమౌతుంది. మరొక చక్కని ఆత్మీయమైన పాత్ర కోటమ్మత్త. ఆప్యాయతానురాగాల మేలు కలయిక.
నవలలో ఎన్నెన్నో చక్కని కీర్తనలు… వాటికి అభినయాలు… తరంగాలు, అష్టపదులు… అన్నమయ్యా, త్యాగయ్యా, క్షేత్రయ్యా పలుకరిస్తూనే ఉంటారు ఆత్మీయంగా… మువ్వల సవ్వడి మన కనుల ముందూ, మనసులోనూ మారుమ్రోగుతూనే ఉంటుంది. సర్వం, సకలమూ సరస్వతీమయమే అవుతుంది.
ఇంత మంచి నవలను, చక్కని సులభ శైలిలో మనకోసం అందించిన శ్రీమతి కోసూరి ఉమాభారతిగారు నిజంగా అభినందనీయులు. వారి కలం నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఉమాభారతిగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పుస్తకము తెరచి చదవటం మొదలుపెట్టింది మొదలు మనమూ ఆ పాత్రలతో సహా నడుస్తాము…

అనుబంధాల టెక్నాలజీ – సమీక్ష

రచన: లక్ష్మీ రాఘవ
పరిచయకర్త: మాలాకుమార్

లక్ష్మీ రాఘవగారి పుస్తకం “అనుబందాల టెక్నాలజీ”, పేరేదో కొత్తగా ఉందే అని చదువుదామని తీసాను. మొదటి కథనే “అనుబంధాల టెక్నాలజీ”. చదవగానే ఇదేదో మన కథలానే ఉందే అనుకున్నాను. అవును మరి ఈ తరం అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు మనవళ్ళతో గడపాలంటే అంతర్జాలంలోకి ప్రవేశించక తప్పదు.
మొదటి కథ చదివిన అనుభూతితో అలా అలా మిగితావీ చదివేస్తూ పోయాను.
జెల్ పాడ్ చదవగానే మా ఇంట్లో ఎలుకల కోసం ఎవరో దీని గురించి చెపితే నా ఫీలింగ్స్ గుర్తొచ్చి , అచ్చం రామచంద్ర కూడా నాలాగే ఫీలవుతున్నాడే అనుకున్నాను.
అవిటితనాన్ని ఎలా జయించాలో “గెలుపు గుర్రం” లో ,
విక్కీ లీక్స్ గురించి హాస్యంగా “వెంకీ”లో ,
తల్లి ఆరోగ్యం కోసం వెంకటేశు “బలి” కావటం టచ్చీగా లో,
చేసిన సహాయం మనుషులు ఎలా మర్చిపోతారో “ఇలా జరుగుతుంది మరి!”లో,
రోజూ ఆలశ్యంగా వస్తూ , వచ్చిన తరువాత కూడా డల్ గా ఉండే కొడుకు కార్తీక్ కోసం ఆరాటపడే తల్లి భారతి, స్నేహితుని కోసం చిన్న వయసులోనే పరితపించి , సహాయం చేసేందుకు ఆరాటపడ్డ కొడుకు కార్తీక్ ల గురించి ఉదాత్తంగా “మానవత్వం” లో,
ఇలా ఏ కథ తీసుకునా అదే ప్రత్యేకంగా ఉన్నట్లుగా ఉన్నాయి. మొదటి నుంచి చివరి వరకు మొత్తం ముప్పైరెండు కథలూ ఏకధాటిన చదివాక , ఓ సారి రచయిత్రితో మాట్లాడుదామనిపించింది!
వెంటనే మెసేజ్ బాక్స్ లోకి వెళ్ళి,
నేను:”హలో లక్ష్మీరాఘవగారు, “అని పలకరించాను.
లక్ష్మీరాఘవ:”హలో అండి. ”
నేను:”మీతో మీ గురించి మాట్లాడుదామనుకుంటున్నాను మాట్లాడవచ్చా ?”
లక్ష్మీరాఘవ:”అలాగే”

నేను:”ముందుగా మీ రచనల గురించి మాట్లాడుకుందాం. . మీరు రచనలు ఏ బేస్ మీద చేస్తారు? అంటే ఏదైనా సంఘటన చూసి చలించి రాయాలనుకుని రాస్తారా? ఏదో ఒక విషయం రాయాలని అనుకుని రాస్తారా?లేక ఏదో విషయం తోచి రాస్తారా?”
లక్ష్మీరాఘవ:” ఏదైనా విషయం నా హృదయాన్ని కదిలించి నన్ను ఆలోచింప చేస్తే, ఏదైనా వార్త చదివినప్పుడు అది నన్ను కదిలిస్తే రాస్తాను. అందుకే నా కథ ల్లో కల్పితాలకంటే వాస్తవాలు ఎక్కువ కనబడతాయి. చదివినవారికి తమ జీవితాల్లో ఎక్కడో ఇలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. ”
నేను: అవును అది నిజమే. కొన్ని కథలల్లో నేనే వాటికి కనెక్ట్ అయ్యాను 🙂 మీకు ఎలాటి రచనలు చేయటం ఇష్టం. ”
లక్ష్మీరాఘవ:”సహజంగా, సరళంగా హాయిగా చదువుకునే రచనలు చేయటం ఇష్టం. ”
నేను: ” మీ రచనల్లో మీకు నచ్చింది ఏది? ఎందుకు?”
లక్ష్మీరాఘవ:” నేను రాసిన కథల్లో నావాళ్ళు. మారుతోన్న తరం, మహాలక్ష్మిలో మార్పు, స్వచ్చ భారత్ ఇలా నచ్చినవి చాలా వున్న్నాయి. ఎందుకు అంటే ఎప్పుడూ నాకు తోచిన చిన్న పరిష్కారం ఇవ్వటమే కాకుండా ప్రాబ్లెంస్ ఇలా వుంటాయి అని చెబుతాను కనుక”
నేను:”మీకు నచ్చనిది, ఇంకా బాగా రాయాల్సింది అని అని అసంతృప్తిని కలుగచేసిన రచన వుందా?”
లక్ష్మీరాఘవ:”లేదు. పూర్తి సంతృప్తి కలిగేంతవరకూ మళ్ళీ మళ్ళీ ఆలోచించి రాస్తాను కనుక. ”
నేను:” మీకు ఎలాటి సాహిత్యం ఇష్టం? అనుబంధాల టెక్నాలజీ మీకు నచ్చినవి, నచ్చనివి కథలు ఏమిటి?”
లక్ష్మీ రాఘవా “వర్తమాన సాంఘిక సాహిత్యం ఇష్టం, అనుబంధాల టెక్నాలజీ లో నాకు నచ్చినది బలి, ఎర, రాజ మార్గం, స్వచ్చ భారత్, నిలబడి నీళ్ళు లాటివి కొంచెం ఎక్కువగా. . . ప్రతి కథలోనూ ఒక చిన్న హెచ్చరిక, ఒక పరిష్కారం వున్నాయి కనుక నచ్చనివి ఏవీ లేదు. ”
నేను: “పరిష్కారం” కథ నన్ను ఆలోచనలో పడేసింది. రోజంతా నన్ను వెంటాడుతూనే ఉంది. దాని గురించి మిమ్మలిని ఓ ప్రశ్న అడిగేముందు కథను మళ్ళీ గుర్తుచేసుకుంటాను. ప్రభు విజయ భార్యాభర్తలు. వారికి సంతానము కలుగలేదు. అందుకని విజయ స్నేహితురాలు డాక్టర్. సంధ్య సంతాన సాఫల్య కేంద్రము నడుపుతున్నది. ఆమెను సంప్రదించారు. ప్రభుకు స్పెర్మ్ కౌంట్ తక్కువ వలన సంతానం కలగటము లేదని చెప్పి, కృత్రిమ ఫలదీకరణ ప్రయత్నిద్దామని చెప్పింది. ఆలోచించుకునేందుకు సమయము కావాలని చెప్పి తిరిగి వచ్చేసారు. ప్రభు, విజయ ఒక రోజు సెకెండ్ షో సినిమా కు వెళ్ళి వస్తుండగా ఒక రౌడి వారిని అటకాయించి, ప్రభును కొట్టి, విజయపై అత్యాచారం చేస్తాడు. ఆత్మహత్య ప్రయత్నం చేయబోయిన విజయను వారిని, సంధ్య దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి ఓదారుస్తాడు ప్రభు. ఆ అత్యాచారం ఫలితంగా విజయ గర్భవతి అవుతుంది. ఎబార్షన్ చేయవచ్చు అన్న సంధ్య ను వారించి ఆ బిడ్డను నా బిడ్డగా పెంచుతాను. తాగుబోతు, అత్యాచారాలు చేసే తండ్రి బుద్దులు రాకుండా ఒక మంచి పౌరునిగా పెంచుతాను. అంతే కాదు, నాకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి, నా సైట్ లో ఒక ప్రత్యేక శరణాలయాన్ని నిర్మిస్తాను. దానిన్లో అమానుషంగా , అనాగరికతతో పురుషుని ఉన్మాదానికి గురైన ఆడపిల్ల ను ఆదరిస్తాను అంటాడు. స్తూలంగా ఇదీ కథ. ఈనాడు ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించే వార్తలు కనిపిస్తున్నాయి. ఆ నేపధ్యం లో రాసిన ఈ కథ నన్ను కదిలించింది. లక్ష్మీగారూ. ఈ పరిష్కారం కథ లో మీరు సూచించినట్లు భర్త ఓదార్పు, ఆశ్రమం స్థాపించడం సంభవమే అంటారా?”
లక్ష్మీరాఘవ:”సంభవం అవ్వాలనే ఉద్దేశం! ఇలాటి వ్యక్తులు, ఇలాటి ఆలోచనలు కూడా ఉంటాయని తెలియ చెప్పడం బాగుంటుంది అనిపించిది . సమాజంలో మార్పులు రావాలంటే ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. . సుబ్రహ్మణ్య భారతి లాగా మార్పులు తేగలమని కాదు. . . . రచనలో ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు?”
నేను:”అవునండి నిజమే అలా చేయగలిగితే బాగుంటుంది. సరే ఇంకో కథ “ఈ ఎడబాటు వద్దు!”కథ లో నాయిక వ్రాసిన లేఖలోని భావాలు, నేను మా అమ్మాయి డెలివరీకి యు. యస్ వెళ్ళినప్పటి నా భావాలే అనుకున్నాను. మావారి బిజినెస్, మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండటం మూలముగా నేనొక్కదాన్నే వెళ్ళాల్సివచ్చింది. ఈ విషయం ఎందుకు చెప్పానంటే , మీ కథలోని కొడుకు స్వార్ధంతో తండ్రిని కాకుండా తల్లిని ఒక్కదాన్నే రమ్మని టికెట్ పంపిస్తాడు. ఈ కథ అనే కాదు , సినిమాలల్లో , చాలా కథలల్లో అమెరికా వెళ్ళిన పిల్లలని స్వార్ధపరులుగా చిత్రీకరిస్తున్నారు. అది నాకు నచ్చటం లేదు. మీరు కూడా అలా రాసేసరికి కొడుకు స్వార్థం కాకుండా వేరే ఆలోచించి వుండవచ్చుకదా ? అని అడగాలనిపించింది”
లక్ష్మీరాఘవ:” నిజమే అలా ఆలోచించాను కూడా. . . ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఒక్క టికెట్టు పంపుతున్నట్టు కొడుకు చెప్పి వుండవచ్చు. . కానీ తల్లిని మాత్రమే పిలిపించుకోవడానికి వెనుక పనికి సహాయపడుతుందనే ఉద్దేశ్యం ఉన్న కొడుకులు వుండటం లేదా? అది చెప్పాలని కూడా అనిపించింది. అంతేకాదు లేటు వయసులో “ఎడబాటు” ఎంతగా ఫీల్ అవుతామో చెప్పడం ముఖ్యోద్దేశం. స్వార్థం లేని కొడుకుల గురించే రాస్తే ఆ “ఎడబాటు” లేఖ ఇంకోలా వుండేది. ఇంత ఎఫెక్ట్ వుండేదా? మీరే చెప్పండి. ”
నేను:”ఏమో మరి , ఆ కథ లో మీరు కొడుకును తొలి నుంచీ స్వార్ధపరుడిగానే చిత్రీకరించారు కాబట్టి అది సరిపోయిందేమో!కాకపోతే ఆ లేఖలోని కొన్ని భావాలతో నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి మా అబ్బాయిలా అనిపించి నచ్చలేదేమో 🙂 కొన్ని కొన్ని వాక్యాలు ముఖ్యంగా “జీవన మలి సంధ్యలో నాతో మరింత చేరువైన మీరు. . . ” అబ్బ ఎంత నచ్చేసిందో! మా గ్రూప్ లో ఈ వాక్యం సమస్యాపూర్ణంగా ఇవ్వబోతున్నాను, విత్ యూర్ పర్మిషన్ 🙂
నేను:”సరేనండి, మరి రచనలు కాకుండా ఇంకా మీకేమైనా హాబీస్ ఉన్నాయా?”
లక్ష్మీరాఘవ:” నాకు చిన్నప్పటి నుండీ కళలపై మక్కువ. ఎలిమెంటరీ స్కూ ల్లో వున్నప్పడే పెన్సిల్ తో బొమ్మలు వేసేదాన్ని. ఏడవతరగతిలో నాకు డ్రా యింగ్ లో మొదటి బహుమతి వచ్చింది. డాన్స్ చేయడం ఇష్టం. స్కూ ల్లో అనేకసార్లు డాన్సులు చేయడమే కాదు. ప్రైజులు కూడా వచ్చాయి. కాలేజీ వచ్చాకకూడా అంతే. హైదరాబాదు
రెడ్డీ కాలేజీ తరఫున వేసిన ఇంటర్ కాలేజీ నాటక పోటీలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇంకా పెయింటింగ్స్ వేయటం ఇష్టం. వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ వేయటం చాలా ఇష్ట పడతాను. పోట్రెయిట్ పెన్సిల్ స్కెచెస్ వేసాను. ఇప్పటికీ చేస్తున్నాను. శారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్ చేస్తాను. క్రియేటివ్ డిజైన్ చేస్తే ఏంతో సంతృప్తి గా వుండేది. ఫాబ్రిక్ పెయింటింగ్ ఎన్నో చేసాను . వేస్టు వస్తువులతో ఎన్నో వస్తువులు చేసాను. కలకత్తా లో వున్నప్పుడు ఎక్జిబిషన్ పెట్టాను కూడా. మా వూరు చేరాక వీటిని చూసిన కొంతమంది ప్రోద్బలంతో స్కూల్స్ లో కూడా ఎక్జిబిషన్ పెట్టాను.
తరువాత పిల్లలు కూడా చాలా క్రియేటివిటీ చూపడం ఆనందం కలుగచేసింది.
ఇంకా చెప్పాలంటే టైలరింగ్ ఇష్టం. పిల్లలకు నేనే బట్టలు కుట్టేదాన్ని.
ఏది కొత్తగా చూసినా చేసేసేయ్యాలనే తపన అందుకే కలకత్తా లో కాపురం వున్నప్పుడు చాలా నేర్చుకున్నాను Rajasthan Jharokas. Murals. Earthan pots with 3 dimensional figures, 3D name plates. Tanjore paintings, Decoupage, Lamosa ఇలా ఎన్నో నేర్చుకున్నాను. చేసిన ప్రతిసారి ఎంతో చాలా సంతృప్తి చెందుతాను.
రిటైర్మెంట్ తరువాత మా స్వంత వూరు కురబలకోట అనే చిన్న పల్లె చేరాక కావలసినంత తీరిక దొరికిన మళ్ళీ [మొదటికథ ప్రింట్ అయ్యింది 1966 లో ] రచనలు చెయ్యడంతో నాకు రోజుకు 24 గంటలు చాలవని అనిపిస్తుంది . బతికున్న ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలన్న తపన వుంది.
నేను:”అబ్బో గ్రేట్. మీరు బ్లాగ్ కూడా నిర్వహిస్తున్నారుకదూ. . మీ బ్లాగ్ పేరు ఏమిటి? ఇంకా నిర్వహిస్తున్నారా ?”
లక్ష్మీరాఘవ:”నా బ్లాగ్ పేరు “బామ్మగారి మాట“ దానిని 2007 లో స్టార్ట్ చేసినా ఈమధ్య ఎక్కువ రాయటం లేదు. ఫేస్ బుక్. వాట్స్ అప్ అలవాటు అయ్యాక బ్లాగులో రాయటం తగ్గించాను. కానీ ఇప్పటికీ నా మనోభావాలు రాసుకోవడానికి బ్లాగే సరి అయినదని అబిప్రాయం. ”
నేను:”మీరు ఇన్ని పనులు చేస్తున్నారంటే , మీ చదువు, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఉంది. కుటుంబ సభ్యుల సహకారము లేకుండా చేయలేరు కదా అందుకన్నమాట. ”
లక్ష్మీ రాఘవ: ” M. sc దాకా హైదరాబాదులో చదువుకున్నాను. తరువాత పెళ్లి అయ్యింది . మాశ్రీవారికి హైదరాబాదులోనే ఉద్యోగం కావడంతో ఇంట్లో ఒంటరిగా వుండటం ఇష్టం లేక ఉద్యోగంలో చేరాను. పిల్లలు ముగ్గురూ పుట్టాక, వాళ్ళు కాలేజీ చదువులకు ఎదిగాక నాకు Phd చేయాలనే కోరిక కలిగి నీ నలభై రెండ ఏట Phd చేసాను.
అత్తవారింట మా శ్రీవారికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు వున్నారు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. మా మామగారు మరణించిన తరువాత మా అత్తగారు తొంబై ఏళ్ళదాకా మాతోనే వున్నారు. అలా పెద్దవారికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఆవిడ సావాసంతో ఎన్నో నేర్చుకున్నాను. కొన్ని కథలకి ఆవిడ స్పూర్తి అయ్యారు. ”
నేను. “ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, పెద్దవారిని చూసుకుంటూ, ఇన్ని కళలలో రాణిస్తున్నారంటే చాలా గ్రేట్. ఈ మహిళాదినోత్సవ సంధర్భంగా మీ లాంటి బహుముఖప్రజ్ఞాశాలిని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఓపికగా నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ”
“అనుబంధాల టెక్నాలజీ” పుస్తక రచయిత్రి శ్రీమతి. లక్ష్మీరాఘవగారి పరిచయముతో కూడిన “అనుబంధాల టెక్నాలజీ” పుస్తక పరిచయములో కొన్ని కథల గురించే ప్రస్తావించాను. అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు అన్నం మొత్తం పట్టి చూడక్కరలేనట్లు పుస్తకం గురించి తెలుసుకునేందుకు కొన్ని కథలు రుచి చూపించాను. మిగిలినవి మీరే జె. వి పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ ఐన “అనుబంధాల టెక్నాలజీ ” 100రూపాయలకు కొని చదివి మీ అభిప్రాయాలను తెలపండి.

ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాపులల్లోనూ , జె. వి పబ్లికేషన్ అధినేత్రి జ్యోతి వలబోజు వద్ద కూడా లభ్యమవుతాయి.

రచయిత్రికి నేరు గా మీ అభిప్రాయాలు తెలపాలంటే రచయిత్రి సెల్ నంబర్ :9440124700 కు కాల్ చేయండి.

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి – వేదిక

రచన: సి. ఉమాదేవి

ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వవాఙ్మయమ్
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్త్వికం శివమ్
అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న నృత్యాంశాల నేపథ్యంలో సమున్నతమేననిపించింది. ఈ నవల చక్కటి నృత్యగీతాలను మనోవీధిలో మరొక్కమారు విహరింపచేసింది. కోసూరి ఉమాభారతి జగమెరిగిన రచయిత్రేకాదు అలరించే నర్తకి కూడా. వేదిక నవల ద్వారా నృత్యప్రాధాన్యమైన నవలాంశాన్ని తీసుకుని పాఠకరంజకంగా రచించి మనకందించడం ముదావహం. నృత్యాంశంతోపాటు సమాంతరంగా ఒక కుటుంబం, దాని చుట్టూ అల్లుకున్న స్నేహబాంధవ్యాలు,తొంగి చూచే అసూయలు,పెనవేసుకునే ఆత్మీయతలు. ఇవన్నీ మన ప్రక్కనే కూర్చుని కష్టసుఖాలు పంచుకునే స్నేహితురాలిలా మొత్తం నవలను మనకు చంద్రకళ పాత్ర ద్వారా వినిపిస్తారు.
చంద్రకళ తల్లి శారద సంగీతం నేర్పే గురువేకాదు నృత్యం పట్ల అవగాహనగల వ్యక్తి. నాట్యమనగానే పదనర్తనం గావించే చంద్రకళ నృత్యాభిరుచిని గ్రహించి కూతురికి నృత్యం నేర్పడమేకాదు చక్కని వేదికలపై విభిన్న గీతాలకు చక్కని నృత్యాలను సమకూరుస్తుంది. ఇక మలేషియా,కౌలాలంపూర్,లండన్,పారిస్,ఇటలీవంటి దేశాలలో ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లను చేసేందుకు తండ్రి సత్యదేవ్,అతని స్నేహితుడు భూషణ్ పాత్రలు కూడా అత్యంత సహజంగా సాధకబాధకాలను చర్చిస్తూ నవలలో ఒదిగిన తీరు ప్రశంసనీయం. తన కూతురి నృత్య ప్రదర్శనకు ముందు చక్కని పరిచయాన్ని వినిపించే సత్యదేవ్ మాటలు వేదికను హరివిల్లుగా మలచడంలో శ్రీకారమవుతాయి. ఒక కళాకారిణి ఎదుగుదలకు తల్లిదండ్రులు పోషించే పాత్ర ఎనలేనిది అనే నిజాన్ని ఈ నవల మరింత స్పష్టం చేసింది. తాళ,లయ జ్ఞానాన్ని ఔపోసన పట్టి పాదరసంలా పదనర్తనం గావించే చంద్రకళ అభినయం వెనుక మరొక ముఖ్యమైన వ్యక్తి ఆమెకు శాస్త్రీయంగా నృత్యం నేర్పిన గురువు పాత్రను మలచినతీరుకు గురుభ్యోన్నమ: అనిపిస్తుంది. యువకళాకార్ అవార్డ్ తో మొదలైన బహుమతుల పర్వం అనేకానేక అవార్డులను,రివార్డులను ప్రసాదించడమేకాక ప్రపంచనర్తకిగా గుర్తింపు పొందుతుంది చంద్రకళ. నృత్యభాష అంటే లయజ్ఞానమే కదా. మరి ఆ నృత్య భాషకు చక్కని భాష్యం పలికిన చంద్రకళకు కుటుంబ బాంధవ్యాలపైనా మెండైన అభిమానమే. చదువు,నృత్యం నడుమ ఆమ్మమ్మ,నానమ్మల ఊరికి ప్రయాణం,వారు ప్రేమను కూరి వండిపెట్టే విభిన్న వంటకాలు,వారి ముద్దుముచ్చటలు చదివే పాఠకుల మనసులు తమ ప్రమేయం లేకుండానే వారి బాల్యపు అనుభూతులను నెమరువేసుకునేలా చేస్తుంది.
వేదికకు నమస్కారంతో ప్రారంభమైన నృత్యలహరి మంగళంతో ముగుస్తుంది. వేదికపై నర్తించే వారే కాక నృత్యాన్ని తిలకించే వారి మనసును కూడా నర్తింపచేసిన వేదికకు ప్రణామాలు పలకాలనిపిస్తుంది. శ్రీకృష్ణావతారం,,కాళీయమర్ధనం,బ్రహ్మమొక్కటే,చిరుతనవ్వులవాడు
ఇలా ఎన్నో! బ్రహ్మమొక్కటే దర్శించే తీరువేరు,నృత్యమొక్కటే నర్తించే రీతులు వేరు. జతులు,సంగతులు మేళవించిన నృత్యవేదిక సాహితీ సంస్కృతుల మేలు కలయిక. ఈ అందమైన వేదికపై అలరించే ఆహార్యం అందించే క్రమంలో ముత్యాలు,మువ్వలు అమర్చిన నృత్య వస్త్రాలు అద్భుత: అనిపిస్తాయి. నృత్యానికి చక్కటి వస్త్రాలను క్రిష్ణ సమకూర్చడంతో వేదికపై నాట్యం మరింత సొబగునందుతుంది. వేదిక ఒకసారి సరస్వతీ ప్రాంగణంలా,మరొకసారి కైలాసంలా,దేవాలయంలా భాసిల్లినట్లు చంద్రకళ ము:ఖత వింటుంటే నృత్యాన్ని మనోనేత్రంతో దర్శించగలం. చక్కని రహదారిలో సునాయాసంగా చేస్తున్న ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు ,స్పీడు బ్రేకర్లు ఎలా నిలువరిస్తాయో అలా నవలలో అందరి మనసులను తన వింత,మొండి ప్రవర్తనతో స్థంభింప చేసే పాత్ర భూషణ్ కూతురు రాణి. అయితే ఆమె మంచి గాయని. చంద్రకళ నర్తించే వేదిక పైనే తన గానామృతంతో అలరించి మొమెంటోలు పొందిన వ్యక్తి. చంద్రకళకు కావలసిన సహాయాన్ని ఎంతో నిబద్ధతతో చేసే వ్యక్తి భూషణ్. ఇదే రాణిలో చంద్రకళపట్ల అసూయకు కారణమవుతుంది. తన బావ జగదీష్ తో రాణి తీసుకునే అతి చనువు చంద్రకళకు ఇబ్బందిగా అనిపించినా ఆమెలోని సర్దుకుపోయే మనస్తత్వం మరే విధమైన అవాంఛిత సంఘటనలకు తెరలేపదు. కాని జగదీష్ నే పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం మనసులో బలంగా ముద్రించుకుంటుంది రాణి. ఈమె సరదాగా ‘ సినీహీరోనిచ్చి పెళ్లి చేయగలవా?’ అన్న మాటను నిజమనుకుని సినీహీరోతోనే పెళ్లి చేస్తానంటాడు భూషణ్. అయితే విచక్షణాలేమితో రాణి తనను తాను గాయపరచుకోవడంతో ఈ ముక్కోణపు ప్రేమకథలోని ప్రేమ మథనంలో కళ్యాణవేదికపై ఎవరు దంపతులవుతారో అనే ఆదుర్దా పొటమరిస్తుంది. రాణిని ఆత్మీయంగా స్నేహధర్మంతో పలకరించినా చంద్రకళతో వివాహానికి పెద్దల అనుమతి తీసుకున్న జగదీష్ పాత్ర మనోనిబ్బరానికి, మంచితనానికి ప్రతీక.
అకస్మాత్తుగా సత్యదేవ్ అనారోగ్యానికి గురవడం చంద్రకళను ఆందోళనకు గురి చేస్తుంది. తన కూతురు రాణికి జగదీష్ తో పెళ్లికై చంద్రకళ త్యాగాన్ని అర్థిస్తాడు భూషణ్. అతడు చేసిన సహాయానికి ప్రతిఫలంగా జగదీష్ కు దూరం కావాలనుకుంటుంది చంద్రకళ. నృత్యకారిణి తేజస్విని అమెరికానుండి అందించిన ఆహ్వానంతో తన గమ్యానికది మలుపు కాగలదని భావించి అమెరికా చేరుకుంటుంది. ఇక రాణి ప్రవర్తన అసూయ,ఆవేశాలకు ఆలవాలమై చివరకు ఆమెను పతనంవైపు నడిపిస్తుంది. నవల ముగింపు సంతరించుకునే వేళ పాఠకుల ఊహలకు విరామం పడుతుంది. భూషణ్ గుండెపోటుకు గురవడంతో దాదాపు మూడు సంవత్సరాలుగా మాతృదేశానికి దూరమైన చంద్రకళ తిరిగి వస్తుంది. అప్పటికి రాణికి జరగాల్సిన నష్టం జరగనే జరుగుతుంది. అయితే జగదీష్ కు దూరమై రంజిత్ కు దగ్గరైన రాణికి అతడితోనే వివాహం జరిపిస్తారు. జగదీష్ ,చంద్రకళల వివాహవేదికతో నవల ముగుస్తుంది. కళకైనా,కలలకైనా జీవితమే వేదిక అనే వివరణతో వేదిక అనే శీర్షికకు అందమైన అర్థాన్ని తాపడం చేసి, ముఖచిత్రంగా నర్తకిని చిత్రించడం సముచితంగా ఉంది. ఇక నవల మధ్య మధ్యలో పలకరించే నృత్యభంగిమలు ఆహ్లాదపరుస్తాయి. వేదికపై ప్రదర్శించే అద్భుత నృత్యానికి ప్రేక్షకుల చప్పట్లు అభినందనసుమాలు. నవలకు చక్కని శీర్షికనొసగి వేదికకున్న ప్రాముఖ్యాన్ని మరింత ఉన్నతీకరించి చక్కని భాష,సున్నిత భావప్రకటనతో నవల ఆసాంతం చక్కని పట్టాలపై పరుగులు తీయించి మనల్ని వేదిక దగ్గరకు చేర్చిన కోసూరి ఉమాభారతికి అభినందన చప్పట్లు.

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి – వేదిక (సమీక్ష)