నలుగురి కోసం

రచన:- డా.  కె.  మీరాబాయి

సాయంకాలం ఆరు గంటలు కావొస్తోంది.  శివరాత్రికి చలి శివ శివా అంటూ పరిగెత్తి పోయిందో లేదో గానీ ఎండ మాత్రం కర్నూలు ప్రజల దగ్గరికి బిర బిర పరిగెత్తుకు వచ్చింది . ఫిబ్రవరి నెలాఖరుకే ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగి ఎండ తన ప్రతాపం చూపుతోంది.

మామూలుగా ఆ వేళప్పుడు వూళ్ళో ఉన్న టెక్నో స్కూళ్ళు, డిజిటల్ స్కూళ్ళు , ఎంసెట్ నే ధ్యేయంగా మూడో క్లాసు నుండి పిల్లలను రుద్ది రుద్ది చదివించే కార్పొరేట్ స్కూళ్ళ నుండి బస్సులలోనూ ఆటోలలోను బి క్యాంప్ కు వచ్చే బాల బాలికలు వీపు మీది పుస్తకాల సంచీల బరువుతో ముందుకు వంగిపోయి ఇంటి వైపు నడుస్తూ ఉంటారు.

సిల్వర్ జుబిలీ కళాశాల వెనుక వైపున కాళీ స్థలం ఉంది.  పదవీ విరమణ చేసిన నలుగురు వృద్ధులు ఆ సమయంలో అక్కడ చేరి కష్టసుఖాలు కలబోసుకుంటూ కూర్చుంటారు.

ఆ రోజు అందరికన్నా ముందుగా పద్మనాభయ్య వచ్చాడు . కాలేజి ఎదురుగా ఉన్న చిన్న పార్క్ వంటి దానిలో అటు ఇటు నాలుగు సార్లు నడిచి వచ్చి తమ మామూలు చోటులో  కూర్చున్నాడు .

అంతలోనే అరోరా నగర్ వైపు నుండి వచ్చే గంగిరెడ్డి అటువైపుగా వస్తూ కనబడ్డాడు .  ఆ రోజు గంగిరెడ్డి నడకలోనే ఏదో తేడా ఉన్నట్టు తోచింది పద్మనాభయ్యకు.  మామూలుగా అటూ ఇటూ చూస్తూ కాస్త హుషారుగా అడుగులు వేసే మనిషి కాస్తా తల దించుకుని భారంగా నడుస్తూ వచ్చాడు .

అదే సమయానికి హౌసింగ్ బోర్డ్ నుండి   వచ్చే వెంకటాచలం, సీ క్యాంప్ వైపు నుండి వచ్చే దాసు కూడా అక్కడికి చేరుకున్నారు .

” రాను రాను ఎండ ఎక్కువైపోతోంది ” అంటూ అలసటగా కూర్చున్నాడు గంగిరెడ్డి .

” ఎందుకు కాదూ? ఒక పక్కన చెట్లు కొట్టేసి రోడ్లు వేస్తున్నారు.  ఇంకో పక్కన పంట పొలాల్లో, చెరువులలో ఆకాశ హర్మ్యాలు కడుతున్నారు.  ఇగ వానలు కురిసేది ఎట్లా ? ఎండలు మండి పోతా వున్నాయంటే మండవా ? గవర్నమెంటు ఏంచేస్తోంది అంటే సారా కొట్లు పెట్టి ప్రజలకు మత్తు మప్పుతోంది .  తాగి తాగి నాశనమైన సంసారాలు చూసిన ఇల్లాళ్ల కదుపులో మంట మాదిరి ఎండలు  మండుతాయి . ” నిస్పృహగా అంటూ తాను అతని పక్కన చతికిల పడ్డాడు .         వెంకటాచలం .

,

”  ఇంకా ఇప్పుడు నీళ్ళ కొట్లాటలు మొదలాయె గదా! పంపు దగ్గర    కొట్లాడే ఆడోళ్ళ   మాదిరి రెండు రాష్ట్రాల గవర్నమెంటు ఇంజినీర్లు కాలవ గట్ల మీద ఒకరినొకరు తోసుకునే కాలమొచ్చింది.    వాళ్ళకు కాపలాగా రెండు పక్కల పోలీసులు .  ఇంకా ఇట్లాంటివి ఎన్ని చూడాల్నో?”  జేబులో నుండి రుమాలు తీసి క్రింద పరచి  దాని మీద కూర్చుంటు అన్నాడు దాసు.

దాసు జీవిత భీమా సంస్థ లో పని చేశాడు.  ఉద్యోగంలో ఉన్నప్పుడే భార్య కాలం చేసింది.  అతనికి పిల్లలు లేరు.  రామ కృష్ణ మఠం తరపున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆధ్యాత్మిక విషయ చింతన ను పెంచే పుస్తకాలు చదవడం అతని మనసుకు నచ్చిన విషయాలు.  సమాజమ్లో కలుషిత మవుతున్న వ్యవస్థలు ,రాజకీయాలలో చోటు చేసుకుంటున్న వ్యక్తి పూజ, జీవితంలో భాగంగా మారిపోయిన అవినీతి గురించి మథన  పడుతుంటాడు .  పదవీ విరమణ తరువాత అతను ఒక అరక్షిత బాలుర ఆశ్రమం లో మ్యానేజర్ గా ఉచితం గా సేవలు అందిస్తున్నాడు .

ఆ పిల్లలను తీర్చి దిద్దడం లో ఆనందం పొందు తున్నాడు.

” సరే, మనకుండే వెతలు చాలక ఈ కతలు  దేనికీలే ఇడ్సండి.  ఏంది గంగిరెడ్డి మెత్టగున్నావు.  కొడుకు, బిడ్డ, పిల్లలు అంతా బాగున్నారు కదా . ” అందరికన్నా ముందు వచ్చి కూర్చున్న పద్మనాభయ్య గంగిరెడ్డి ని పలుకరించాడు.

గంగి రెడ్డి విద్యుత్ శాఖ లో ఎ ఈ గా పనిచేసి పదవీ విరమణ పొందాడు.  ఒక  కూతురు, ఒక కొడుకు .  కూతురు పెండ్లి కి అతను కష్టపడే పని లేకుండా సంబంధం వెతుక్కుంటూ వచ్చింది.  వాళ్ళకు పిల్ల డాక్టర్ చదివితే చాలు అన్నారు.  .

గంగిరెడ్డి నెత్తిన   పాలు  పోసినట్టు అయింది .  దండిగా నగా, నట్రా, పెట్టి బ్రహ్మాండముగా పెళ్లి చేశాడు.  కూతురు అల్లుడు రెండు చేతులా సంపాదించు కుంటున్నారు.  గంగిరెడ్డి కొడుకు ఏదో మంచి కంపనీ లో పనిచేస్తున్నాడు.  కోడలు డిగ్రీ దాకా చదివింది.  ఇల్లు చక్కబెట్టుకుంటుంది.  గంగిరెడ్డి ది వడ్డించిన విస్తరి లాటి జీవితం ” అని స్నేహితులు అనుకుంటారు.

ప్రస్తుతం సిల్వర్ జుబిలి కాలేజీ వెనుకనున్న స్థలం లో కలుసుకున్న ఈ నలుగురు వాకింగ్ స్నేహితులు.  అదే వూళ్ళో నే వేరు వేరు శాఖల నుండి రిటైరైన వాళ్ళు.

వెంకటాచలం నీటి  పారుదల శాఖ లో పనిచెసాదు. ఇద్దరు కూతుళ్ళు.  ఇద్దరికి మంచి సంబంధాలే చూసి చేసాడు .  రెండో పిల్ల, భర్త బాగానే ఉన్నారు.  పెద్ద కూతురు రంజని మొగుడు ఒక సాడిస్ట్.  తాగుబోతు .  ఎన్నో సార్లు మైకంలో పెళ్ళాన్ని చావ గొట్టి ఇంట్లో నుండి గెంటేసి తలుపు వేసుకుంటాడు.  ఆ పిల్ల రాత్రి అంతా బిక్కు బిక్కు మంటూ ఇంటి వరండాలో చలికి ముడుచుకు పడుకుని, పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళి పనిలో పడుతుంది .  ఇటువంటి సంసారం లోనే ఆ పిల్ల గర్భవతి అయి ఆడపిల్లను కన్నది.

భర్త చేతిలో దెబ్బలే కాకుండా ఆడ పిల్లను కన్నందుకు అత్త సాధింపులు తోడు అయ్యాయి.  దేవుడు ఆ అమ్మాయికి శిక్ష చాలు అనుకున్నాడు లా ఉంది.  ఒక రోజు తాగిన మత్తులో వస్తూ లారీ కింద పది చచ్చిపోయాడు అల్లుడు.

కుల నాశనం చేసిందని తిట్టి కోడలినీ, మనవరాలిని ఇంట్లోనుంది గెంటివేసింది అత్త.  నాలుగేళ్ళ బిడ్డతో తండ్రి ఇల్లు చేరింది రంజని .

ఇక అందరికన్నా ముందు వచ్చి కూర్చున్న పద్మనాభయ్య డి మరో కథ.  అతను ప్రభుత్వ ఖజానా లో పనిచేసాడు.  ఇద్దరు కొడుకులు బాగా చదువు కున్నారు . పెద్దవాడు ఎం బి ఏ చేసి వ్యాపారం లోకి దిగాడు.  రెండో వాడు బి టెక్ చేసి ఎం ఎస్ చేస్తానని అమెరికా వెళ్లాడు.  పెద్ద కొడుకు పెళ్ళైన ఆరు నెలలకే కారు ప్రమాదం లో కళ్ళు మూసాడు .  అతనితో బాటు పక్కన ఉన్న భార్య భర్తను విడిచి ఉండలేను అన్నట్టు తాను ప్రాణం విడిచింది .

రెండో కొడుకు భాస్కర్ మీద మమకారం తో బ్రతుకుతున్న పద్మనాభయ్య ఆశల మీద నీళ్ళు చల్లుతూ అక్కడే ఒక అమెరికన్ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు భాస్కర్.  పెళ్ళయిన ఏడాది తరువాత విషయం తండ్రికి చెప్పిన భాస్కర్ ఆయనను రమ్మని పిలువలేదు.  తాను రాలేదు.  మనవడు పుట్టాడు అని తెలిసి పద్మనాభయ్య మనసు ఆగక భార్య సమేతం గా అమెరికా వెళ్లాడు.

ఆరు నెలలు కొడుకు దగ్గర హాయిగా ఉండి అమెరికా లో చూడ వలసిన ప్రదేశాలు చూసి వద్దామనుకుని వెళ్ళిన దంపతులు పదిహేను రోజుల్లో తిరిగి వచ్చారు.  ‘ అదేమిటి అప్పుడే వచ్చేశారు అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి? ‘ అని అడిగిన వాళ్ళకి ‘ ఆ చలి తమకు పడ లేదని, ఆరోగ్యం బాగా లేదని ‘ జవాబు ఇచ్చారు.  వాడి పోయిన వారి ముఖాలు చూసి అవునేమో అనుకున్నారు అయిన వాళ్ళు.  స్నేహితుల ఓదార్పు తో కోలుకున్నాడు పద్మనాభయ్య.

పద్మనాభయ్య పరామర్శ కు జవాబుగా పెద్దగా నిట్టూర్పు విడిచాడు గంగిరెడ్డి .  ” ఆ అంతా బాగానే ఉన్నారు.  ఇన్నాళ్లు పిల్లల చదువు కోసం , సీట్లు వస్తాయో రావో అని బూగులు పడి , లక్షలు పోసి చదివించామా, ఇప్పుడు వాళ్ళ బిడ్డలకు కూడా మేమే పెట్టాలని తొందర చేస్తున్నారు.  ఇండ్ల స్థలాలు ఉన్నాయి కదా అవి అమ్మేసి మనవడికి డొనేషన్ కట్టాలంట.  వాళ్ళకు వొచ్చింది వొచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు.  కారుకు పది లక్షలు, ఇంటికి యాభై లక్షలు, సినిమాకు పోతే ఐమ్యాక్స్ అంటూ మూడు వేలు, స్టార్ హోటెల్ అంటూ నాలుగు వేలు పెట్టేస్తారు.  వాళ్ళు కూడబెట్టేది లేకున్నా ఎప్పుడో నేను కొన్న స్థలాలు అమ్మేసుకుంటే రేపటికీ ఏమీ మిగులుతుంది . ” గంగిరెడ్డి కోపము, దిగులు కలసిన స్వరం తో అన్నాడు.

” నీ కథ అట్లుంటే నా గ్రహచారం ఇంకా బాగాలేదు రెడ్డీ .  తాగి తాగి అల్లుడు కూతురి కొంప ముంచి మట్టి కొట్టుకు పోయాడు.  సరే నా తల రాత అనుకుని వాళ్ళని తెచ్చి పెట్టుకుని, రంజనికి ఉద్యోగం వేయించి,దాని కూతురును సాకినామా.  ఇప్పుడు చేతికి అందిన నా మనుమరాలు ఎవరో కులం కాని వాడిని ప్రేమించినాను అని ఇంటికి తీసుకు వచ్చింది .  ముసలితనాన అదే మమ్మలిని చూసుకుంటుందని ఆశ పడినామా.  అంతా అయిపాయే.  నా కూతురు తల కొట్టుకుని ఏడుస్తోంది. ” వెంకటాచలం తన ఆవేదన, ఆక్రొశమ్ వెళ్ళబుచ్చు కున్నాడు .

” చూడు చలం ఈ కాలం లో కులం గురి చి ఆలోచన ఎందుకు.  నీ కూతురుకు కులం , జాతకం అన్ని చూసి చేసినావు .  ఏమయింది.  మన ప్రారబ్ధం అంతే .  నా కొడుకు అమెరికా లో ఉన్నాడు నాకేమి అనుకుంటారు మీరు.  వాడు అమెరికా పిల్లను చేసుకుని,వాళ్ళ తిండి వాళ్ళ మతం నాది అంటున్నాడు.  మేము అంత దూరం పోయి వెనక్కి కొట్టిన బంతి మాదిరి రెండు వారాలలో ఎందుకు తిరిగి వచ్చినామో మీకు ఎవరికి చెప్పలేదు నేను.  మా కోడలు అత్తా మామలను వారం కన్నా భరించ లేదంటా.  అట్ల అత్త మామలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే పద్దతి అక్కడ లేదని నా కొడుకే చెప్పినాడు.  పిలవని పేరంటానికి పోయినందుకు అవమానం దిగమింగి తిరిగి వచేసాము.  పైకి అందరికి మాకు చలి పడ లేదని, ఒళ్ళు బాగాలేక వచ్చేసినామని చెప్పుకున్నాము.

” నీ కూతురు బ్రతుకుకు దారి చూపించావు .  మనవరాలిని చదివించావు.  ఆ పిల్లకు నువ్వు సంబంధం చూసి చేస్తే మాత్రం ఇంతకన్నా సుఖం గా ఉంటుందని ఎమి నమ్మకం.  తనకు నచ్చిన వాడిని మీ అందరి సమ్మతి తో చేసుకోవాలనుకుంది .  అక్కడికిన్మెలే కదా.  ఆలోచించు.  నీ బాధ్యత తీర్చుకో.  మనసుకు నెమ్మది పొందు. ” పద్మనాభయ్య మనసు విప్పి సలహా చెప్పాడు .

దాసు రెడ్డి భుజం మీద చెయ్యి వేసాడు.  ” రెడ్డీ, నీ పిల్లల భవిష్యత్తు కోసమే నీ ఇళ్ళ స్థలాలు అట్టి పెట్టాలి అనుకున్నావు.  ఆ భవిష్యత్తు కోసమే చదువుకు డబ్బు కావాలంటున్నారు వాల్లు. దానికి నువ్వు బాధ పడడం దేనికి.  నువ్వు ఎవరి మీదా ఆధార పడకుండా ఒక ఇల్లు, కొంత పొలం నీ కోసం పెట్టుకుని వాళ్ళది వాళ్ళకు ఇచ్చేస్తే తాకరారు లేదు కదా.  దానికి ఇంత దిగులు, బుగులు ఎందుకు. .

” పిల్ల పీచు లేని వాడివి నీకేం ఎన్నయినా చెప్తావు అనుకోకు.  నిజమే తాడు బొంగరం లేని వాడిని.  దేవుడు నాకు పిల్లలను ఇవ్వలేదు.  అందుకే అనాధ పిల్లలను ప్రేమిస్తున్నానేమో ! అందుకే నాకు ఇవ్వడం లో ఉండే హాయి తెలిసింది.  మీ బాధ్యతలు తీర్చు కున్నారు.  బంధాలు వదిలించుకోవాలి.  వాన ప్రస్థం అంటే అడవికి పోనక్కర లేదు.  సంసారం అనే దానిలో కూరుకు పోకుండా మనకు ఇంత ఇచ్చిన సమాజానికి కొంత తిరిగి ఇద్దాము అనుకుందాము.

” మీ పిల్లలకు చేయ వలసినవి చేసారు.  ఇక వాళ్ళు మీకు ఏదో చేయాలని ఆశించకండి.  మీకు ఉన్నంతలో పదిమందికి సాయ పడండి.  అదెంత తృప్తిని ఇస్తుందో నాకు అనుభవమే.  నా భార్యను దేవుడు తీసుకు పోయాడు.  కానీ నాకు ఆయుషు ఇచ్చాడు.  అందుకే నలుగురికీ ఉపయోగం గా బతకాలి అనుకు న్నాను .  నాకు మంచి అనిపించిన మాట చెప్పాను.  ఆలోచించు ” అని ఉరుకున్నాడు. . .

చీకటి పడింది.  వీధి దీపాలు వెలిగాయి.  నలుగురు లేచి ఇంటి దారి పట్టారు.  ఎవరి ఆలీచనలో వాళ్ళు నాలుగు దారుల్లో తమ గమ్యం వైపు కదిలారు.  సిల్వర్ జుబిలి కాలేజీ హాస్తాలు పిల్లలుకొందరు బయటకు వచ్చి జంక్షన్ దగ్గర బండిలో ఏవో కొంటున్నారు.  దాసు షేర్ ఆటో ఆపి ఎక్కాడు.  దాసు ఉండేది ఆరక్షిత బాలుర ఆశ్రమం లోని ఒక గదిలో మ్యానేజర్ అక్కడే ఉంటే పిల్లలను ఒక కంట కనిపెట్టే వీలు ఉంటుందని ఆ ఏర్పాటు .

మరునాడు దాసు నిద్ర లేచి ఆఫీసు గది దగ్గరకు వచ్చేసరికి పిల్లలు అందరు అక్కడ మూగి ఉన్నారు.  ” ఈ రోజు ఆదివారం స్కూలుకు వెళ్లే పని లేదు.  మరి వీళ్లంతా ఎందుకు వచ్చినట్టు ? ” అనుకుంటూ లోపలికి నడిచాడు.

” దాసుగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ” అని బోర్డ్ మీద రాసి ఉంది.

‘ వీళ్ళకు ఎలా తెలుసు?అనుకుంటూ ఆశ్చర్యం గేయా చూస్తున్నాడు దాసు.

నమస్తే సార్ అంటూ ముందుకు వచ్చాడు ఒక పాతికేళ్ళ యువకుడు.

ఎవరా అన్నాట్టు తెరి పారా చూసాడు దాసు.

” నేను ఈ ఆశ్రమం లో పెరిగి, ఇక్కడ చదువుకున్న శంకర్ ని సార్.  నాకు ఈ వూళ్ళో నే ఉద్యోగం వచ్చింది . మమ్మల్ని స్వంత బిడ్దల్లాగా చూసుకున్న మీకు ఈ శుభ వార్త చెప్పాలని వచ్చాను.  ఈ రోజు మీ జన్మ దినం అని తెలుసు కున్నాను.  ఎవరెవరో వారి ఆత్మీయూల పుట్టిన రోజుకు.  పెళ్లి రోజుకు.  స్మరించుకోవడానికి ఆయా రోజులలో పిల్లలకు విందు భోజనానికి డబ్బు కడతారని ఆ భోజనం కోసం ఎదురు చూసే మాకు తెలుసు. వారి పుట్టిన రోజు నాడు ఆ దాతల పేర్లు మా చేతనే బోర్డ్ మీద రాయించే వారు మీరు.

కానీ ఈ తారీఖున మాకు విందు భోజనం ఉండేది గానీ ఎవరి పేరు బోర్డ్ మీద రాసేవారు కాదు.  ఆకు ఈ మధ్యనే తెలిసింది ఈ రోజు మీ పుట్టిన రోజు అని .  నా వంటి వారికి ఎందరికో పెద్ద దిక్కుగా ఉంటూ , మయ ఆలనా పాలనా చూసిన మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఈ ఏర్పాటు చేసాను . ” గద్గదికమ్ ఐన గొంతు తో అన్నాడు ఆ యువకుడు .

ఎన్నడు లేని విధంగా ఆశ్రమం అంత పూల తోరణాలతో రంగుల కాగితాల దండలతో కళ కళ లాడుతుంది.  పిల్లలందరి ముఖాలలో సంతోషం.

దాసు కళ్ళు చెమరించాయి.  ” ఎవరు లేని తన కోసం ఇంతమంది ఆత్మీయత చూపుతున్నారు.  అంతకన్నా కావలసింది ఏముంది ?”

అదే సమయం లో నెమ్మదిగా నడుస్తూ లోపలికి వచ్చారు గంగిరెడ్డి, వెంకటాచలం, పద్మనాభయ్య.  ఒక్కొక్కరూ వచ్చి దాసును ఆలింగనం చేసుకున్నారు.

” నిన్న మనం మాట్లాడుకున్న విషయాలే రాత్రంతా తలలో తిరుగుతూ ఉండినాయి దాసు.  నువ్వు చెప్పిన మాట నిజం.  ఈ వయసులో లంపటాలు వదుల్చుకుని, నేను ,నా వాళ్ళు అని మాత్రమే కాకుండా సమాజం లో మా సహాయం కావలసిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని తోచింది.  నేను నా భార్య కూడా సేవ చేసే దానికి సిద్ధం.  దారి నువ్వు చూపించు. . ” అన్నాడు   పద్మనాభయ్య .

మేము కూడా అదే బాట లో నడవాలని అనుకుంటున్నాము.  ఎట్లా చేస్తే బాగుంటుందో అందరం కల్సి మాట్లాడుకుందాము.  ఎంత సేపు పిల్లలు, మనవలు అంటూ సంసారంలో భ్రమిస్తున్నాము.  నలుగురి కోసం ఆ ప్రేమలో కొంత పంచడం ఇప్పటి కైనా మొదలు పెడటము.  ” అన్నారు రెడ్డి , చలం.

దాసు చేతికి కొత్త బట్టలు అందించి దండం పెట్టాడు శంకర్.

సార్ మేము మీకు కానుక ఏమీ తేలేదు అన్నారు పిల్లలు సిగ్గు పడుతూ.

మీరంతా ఈ శంకారన్న మాదిరి చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి.  అదే నాకు పెద్ద కానుక . అన్నాడు దాసు నవ్వుతూ.

శంకర్ కనుల లోని వెలుగు తాము ఎన్నుకున్న మార్గం సరియైన దని ఆ నలుగురికీ చెప్పింది.

 

 

 

మన( నో) ధర్మం

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం

తెల్లని రాయంచ లాటి బెంజ్ ఎస్ యూ వి గంటకు యాభై మైళ్ళ వేగంతో ఆరు వందల ఎనభై ఫ్రీ వే మీద కాలిఫోర్నియా లోని శాన్ రామన్ నుండి మిల్పిటాస్ వైపుకు దూసుకు పోతోంది. లోపల కూర్చున్న వారికి మాత్రం పూలరథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంది. కారులో స్టీరియో నుండి ‘ దిద్ద రానీ మహిమల దేవకి సుతుడు” అంటూ బాలకృష్ణ ప్రసాద్ పాడిన అన్నమయ్య పాట వస్తోంది. అన్నమాచార్యుని ఆరు వందల తొమ్మిదవ జయంతి సంధర్భంగా జరుగుతున్న పాటల పోటీలో పాల్గొనడానికి పాపను తీసుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్లేదాకా నాకు ఈ పోటీలు సిలికానాంధ్రా విశ్వవిద్యాలయంలో జరుగుతున్నట్టు తెలియదు.
యూనివర్సిటీ ముందు కారు దిగి నామఫలకం చూసే సరికి మనసంతా ఒక విధమైన ఉద్విగ్నతతో నిండిపోయింది. ఇంతకు ముందుసారి అమెరికా వచ్చినప్పుడు పాలో అల్టో లోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చూడడానికి వెళ్ళినప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ సరస్వతీ నిలయాన్ని కనీసం చూడగలిగినందుకు పులకించిపోయాను. అక్కడ చదివే వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపించింది.
గ్రాడ్యూయేషన్ పూర్తి అయిన కొందరు విద్యార్థుల జట్టు మెడలో రంగు రంగుల పూల దండలు వేసుకుని ఆనందం గా నాట్యం చేస్తున్నారు చెట్టు కింద. లోపల హాల్లో ఏదో పార్టీ జరుగుతున్నది. ఇంకో తరగతి గదిలో ప్రొఫెసర్ పాఠాలు చెబుతున్నాడు. నా యూనివర్సిటీ రోజులు గుర్తుకు వచ్చాయి.
అల్లాగే యూరప్ ట్రిప్ లో లండన్ లో కేంబ్రిజ్ యూనివర్సిటీని చూడగలగడం ఒక భాగ్యంగా తోచింది. రాజా ప్రాసాదం ముందు చేన్జ్ ఆఫ్ గార్డ్స్ సెరిమొని, మేడమ్ టసాడ్స్ మ్యూజియమ్ , లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్ టవర్ ఇవన్ని చూడడం ఒక ఎత్తు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చూడగలగడం ఒక ఎత్తు అనిపించింది. అలిసిపోయి ఎక్కడికీ రానని పడుకున్న నన్ను పట్టుబట్టి తీసుకు గొప్ప విశ్వవిద్యాలయం చూపించిన మా చెల్లెలి కూతురును కౌగలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. కాలిఫోర్నియాలో బెర్కిలీ లో ఇస్కాన్ గుడి, రామకృష్ణ మఠం దర్శించుకుని, బెర్కిలీ యూనివర్సిటీ కూడా చూసాను.
ఇదివరకు సిలికానాంధ్ర వారు జరిపిన ఉగాది ఉత్సవానికి వెళ్ళి ఉన్నాను. వచ్చిన వారందరికీ చిన్న గ్లాసులలో ఉగాది పచ్చడి అందించారు పట్టు చీరెలలో ఉన్న పడతులు. తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇండియా ఇక్కడికే వచ్చిందా అనిపించేలా ఆవరణలో కొలువైన అంగళ్లలో చీరెలు, చుడిదార్లు, గాజులు , ఆభరణాలు, గోరింటాకు కోన్ లు వచ్చినవారిని ఆకట్టు కున్నాయి. ఇవి కాక సమోసాలు, కారం,తీపి వస్తువులు కూడా నోరూరించాయి. ఆఖరుగా అచ్చమైన తెలుగు పండుగ భోజనం వడ్డించారు అందరికి. మన పండుగలను సామూహికంగా ఇంత సంబరం గా అమెరికాలో జరుపుకుంటారా అని ఆనందం కలిగింది.
ఆ మధ్యన మెన్లొ. ఎతెర్టన్ లో ” ఇన్ ఫైనిట్ ఫేసెట్స్ – యాన్ ఎక్స్‌ప్లొరేషన్ ఆఫ్ ద సెల్ఫ్”అన్న థీమ్ తో విశ్వ శాంతి వారు ఏర్పాటు చేసిన భరత నాట్యం ప్రదర్శన చూశాను. భిన్నత్వంలో ఏకత్వం భావనను, ఒకే పరమ సత్యం భిన్నరూపాలలో వ్యక్తం కావడం అద్భుతం గా చూపించారు. ఇరవై మంది కన్నా ఎక్కువ నాట్య కళాకారులు రెండు గంటల సమయంలో ఈ విశ్వాన్ని శాశిస్తున్న ఒక శక్తి, , భిన్న రూపాలలో స్త్రీ పురుష శక్తి ప్రతీకగా అర్థ నారీశ్వర తత్వంగా, త్రిమూర్తి స్వరూపంగా, చతుర్ వేదాలుగా, పంచ భూతాలుగా, షట్ చక్రాలుగా, సప్త స్వరాలుగా, అష్ట రసములుగా, నవ గ్రహాలుగా, చివరగా సత్ చిత్ ఆనంద స్వరూపమైన పూర్ణత్వంగా “ఓం పూర్ణమద: పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావశిష్యతే ” అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ అద్భుతంగా అభినయించి వీక్షకులకు ఒక అలౌకిక అనుభవాన్ని కలిగించారు . రసానుభూతిలో ఓలలాడించే విధంగా ఆవిష్కరించారు.
తాము పుట్టిన తెలుగు నేలకు పదివేల మైళ్ళ దూరంలో ఉన్న దేశానికి ఉద్యోగ ,వ్యాపార నిమిత్తంగా వచ్చి, ఈ దేశంతో మమేకమై, అన్ని రంగాలలో ఈ దేశాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగువారు తమకు జన్మనిచ్చిన భూమిని, ఆ భూమి నుండి సంక్రమించిన సంస్కృతిని, సంస్కారాన్ని, కళలను ఇక్కడి నేలలో పండించుకుంటున్న తీరు చూస్తే గుండె పులకించక మానదు.
కానీ ఈ రోజు సిలికానాంధ్ర యూనివర్సిటీ లోపలికి అడుగు పెడుతుంటే ఇదీ అని చెప్పలేని ఉద్విగ్నత నన్ను కుదిపివేసింది అమెరికా గడ్డ మీద మన తెలుగువారి తేజాన్ని వెదజల్లుతున్న ఆ సరస్వతీ నిలయం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రను దర్శించిన క్షణం నా మాతృసంస్థ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంను చూస్తే కలిగే గర్వంతో కూడిన ఆర్థ్రత మళ్లీ అనుభూతి చెందాను.
లోపలికి వెళ్లగానే ఎదురుగా ఒక బల్ల మీద వినాయకుడి విగ్రహం , చుట్టూ పూల దండలు, వెనుక గోడమీద యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అన్న పదాలు, పైన వారి లోగో దర్శన మిచ్చాయి.
క్రింది అంతస్థులో పాప రిజిస్ట్రేషన్ చూపితే ఒక నంబర్ ఇచ్చారు. పదిహేను సంవత్సరాల లోపు వారికి అన్నమయ్య పాటల పోటీలు రెండవ అంతస్తు లో జరుగుతాయని చెప్పారు. సరే క్రింద జరుగుతున్న పోటీ ఏమిటో చూసి వెళ్ళవచ్చు అనుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఎటు చూసినా భారతీయత ఉట్టి పడేలా పట్టు, జరీ చీరెలలొ ఆడవాళ్ళు. పోటీలో పాల్గొంటున్న పదహారు నుండి ఇరవైలోపు కుర్రాళ్ళు చక్కగా పంచ కట్టులో కనబడ్డారు.ఆడపిల్లలు పావడా పైటలో వచ్చారు. అక్కడి వాతావరణం చూస్తే అమెరికాలో ఉన్నామన్న విషయం జ్ఞాపకం రాదు. అక్కడ కార్య నిర్వాహకులు కూడా ధోవతి , జుబ్బా ధరించి పైన కండువాతో నిండుగా ఉన్నారు.
పేరు పిలవగానే శ్రుతి బాక్స్ పట్టుకుని వేదిక మీదికి వచ్చింది ఒక అమ్మాయి. సభికులకు, తమని పరీక్షించ నున్న పండితులకు నమస్కరించి, ఆ రోజు తాను పాడబోతున్న పాట , రాసినవారి పేరు, రాగము, తాళము ధర్మావతి రాగంలో ఆది తాళం “మంగాంబుధి హనుమంతా నీ శరణ మంగవించితిమి హనుమా “అంటూ వివరాలు చెప్పింది .
ఖంగున మోగుతున్న కమ్మని కంఠ స్వరంతో , ఆత్మ విశ్వాసం తొంగి చూస్తున్న ముఖ కవళికలతో ఆలాపన మొదలు పెట్టింది. ” బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరిచేతల హనుమంతా” అని నెరవలి పాడుతుంటే పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత గుర్తుకు వచ్చింది ఆ అమ్మాయిని చూస్తుంటే.
తరువాత వచ్చిన అబ్బాయి కల్యాణి రాగంలో ఆలాపన అందుకున్నాడు.
“కల్యాణి రాగానికి, శంకరాభరణం రాగానికి ఆరోహణ అవరోహణ లో తేడా చెప్ప గలవా?” ప్రశ్నించారు గురువుగారు.
“కళ్యాణికి శంకరాభరణంకు మధ్యమంలో తేడా వున్నదండీ! కల్యాణిలో ప్రతి మధ్యమం ఉంది. శంకరాభరణంలో శుద్ధ మధ్యమం పలుకుతాము.” వినయంగా జవాబు చెప్పాడు ఆ చిన్నారి.
“శంకరాభరణంలో గాంధారం జీవస్వరం . కల్యాణి సర్వ గమక రాగం. “అంటూ పాడి వినిపించారు ఆయన. అలాగే పల్లవి పాడిన తరువాత నెరవలి మొదలు పెడుతూనే స్వర కల్పన గురించి అడిగారు.
పరీక్షకురాలిగా వచ్చిన సంగీత విద్వాంసురాలు ఏ ప్రశ్న అడిగినా తడ బడ కుండా తమకు తెలిసి నంతలో జవాబులు చెప్పాడు
తరువాత వేదిక మీదికి వచ్చిన అబ్బాయి శుద్ధ ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన” భావములోన భాగ్యము నందున” ఆది తాళంలో పాడుతున్నట్టు చెప్పి మొదలు పెట్టాడు. అతను కల్పన స్వరముల దగ్గరికి వచ్చేసరికి భిన్నమైన ఆవృతులలో స్వర కల్పన చేయమని అడిగి, పరీక్షించారు. చెదరని చిరునవ్వుతో ఆయన సూచనలను అనుసరించి స్వర కల్పన చేసి మెప్పించాడు.
అతను పాట పూర్తిచేస్తూ “హరి నామములే అన్ని మంత్రములు” అంటూ ఆలపిస్తుంటే” అంటే అర్థం తెలుసా? ” అని అడిగారు చెన్నై నుండి వచ్చిన సంగీత విద్వాంసుడు. ఆ పిల్లవాడు చిరునవ్వుతో ఆయన వైపు చూసి తల వంచుకున్నాడు.
అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు అమ్మా నాన్న పట్టుబడితే కొద్దిగా తెలుగు నేర్చుకుంటారు. బాగా నేర్చుకోవాలని సిలికానాంధ్ర వాళ్ళ ” మన బడి”లో చేర్పించితే ఇంకొంచెం బాగా భాష తెలుస్తుంది. గానీ సాహిత్యంలో అర్థాన్ని గ్రహించే అంత గా కాదు .
“సంగీతం లో మనో ధర్మం మీద మిమ్మల్ని పరీక్షిస్తున్నాము. ఒక రాగాన్ని ఎంత లోతుగా ఆకళింపు చేసుకున్నారు, దాని మీద ఎంత పట్టు సాధించారు, ఆ రాగంలో కల్పనా స్వరాలలో , నెరవలిలొ అప్పటి కప్పుడు ఆ రాగంలో కల్పనా స్వరాలు పాడగల సృజనాత్మకతలో మీ శక్తి ఎంత అనేది చూడడానికే ఈ పరీక్ష. ఇదే మనో ధర్మం. విద్యార్థి దశలో వంద సార్లు విని , సాధన చేస్తే అందులో పది శాతం వేదిక మీద ప్రదర్శించగలరు. ఇది ఒక అగ్నిపరీక్ష వంటిది. సాధనతో సాధించగలరు . ”
“ఒక రాగాన్ని ఆకళింపు చేసుకోవడంతో బాటు రసాత్మకతను అనుభూతి చెందడం, అందులో లయించి తన్మయత పొందడం వలన మీ పాటలో జీవరసం చిందులు వేస్తుంది. సాహిత్యంలోని భావాన్ని అనుభవించితేనే అటువంటి రసాత్మకత సాధ్య మవుతుంది. హరి నామమే అన్ని మంత్రములు అంటే ఆ ఒక్క హరి అనే పేరు అన్ని మంత్రములకు సమానము అన్న భావాన్ని గ్రహించి పాడితే ఇంకా గొప్పగా వుంటుంది. అప్పుడే అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించగలవు. ” ప్రసన్న వదనంతో మనసుకు హత్తుకునే రీతిలో చెప్పారు ఆయన .
ఆ అబ్బాయి చిరునవ్వుతో వారికి నమస్కరించి వేదిక దిగాడు . చదువులు, ప్రాజెక్ట్స్, ఆటలుతో తీరిక సమయమే దొరకని ఈ వయసు పిల్లలు ఇంత సంగీత జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకున్నారు? ఆ నేర్పిన గురువులు ఎంతటి విద్వత్తు గల వారు? ఉద్యోగ నిర్వహణలో, పిల్లల పెంపకంలో ఉక్కిరి బిక్కిరి అయ్యే ఆ తలిదండ్రులు ఎంతటి అంకిత భావంతో వీళ్ళ కు నేర్పించారు అని తలచుకుంటే ఆశ్చర్యం గా అనిపించింది.
ఇంతలో రెండవ అంతస్తులో చిన్న పిల్లలకు పోటీ జరుగుతుందని మైక్ లో వినిపించడంతో మేము ఎలివేటర్ లో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా ఆడపిల్లలు పావడా జాకెట్ లలో ముచ్చటగా కనిపించారు. ముఖాన బొట్టు, చేతులకు గాజులు, మెడలో గొలుసులతో సంప్రదాయబద్ధంగా ఉన్నారు. అబ్బాయీలు పైజామా కుర్తాలలో ఉన్నారు.
పిల్లలు అందరు రాగ తాళ లయానుగుణంగా శ్రుతి పేయంగా అన్నమయ్య పాటలు ఆలపించారు.
పోటీలో గెలవడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడుతుంది. పోటీలో పాల్గొనడం ముఖ్యం అని చెప్పి పిలిచుకు వచ్చాము మా మనవరాలి ని .
ఆ వారంలో జరిగిన సిలికానాంధ్ర వారి ” మన బడి” స్నాతకోత్సవం లో వేదిక మీద కూచిపూడి ఆనంద్ గారి చేతికి నా కథా సంకలనాలు అందించే సమయంలో హాలు నిండా స్నాతకోత్సవ దుస్తులలో కూర్చున్న చిన్నారులను చూసి మనసు నిండి పోయి మాటలు రాలేదు. అమెరికాలో తెలుగు భాషకు పట్టం కడుతున్న సిలికానాంధ్ర వారు రాబోయే రోజులలో పదకొండో తరగతి పిల్లలు రాసే కాలేజ్ ప్రవేశ పరీక్ష “శాట్” కూడా తెలుగును ఒక అంశంగా చేర్చ డానికి కృషి చేస్తామని చెప్పడంతో అక్కడ ఉన్న వందల మంది తలిదండ్రులు, పిల్లల హర్షధ్వానాలతో హాలు ప్రతిధ్వనించింది.
తిరిగి వెళ్తున్నప్పుడు నా మనసు నిండా ఎన్నో ఆలోచనలు. ఎక్కడో ఒక చోట మొదలైన మానవ జాతి దేశ దేశాలకు విస్తరించి , ఆయా దేశ ప్రజలు తమదైన సంస్కృతిని, సంప్రదాయాలను, కళలను, సాహిత్యాన్ని పెంపొందించుకుని తమకు మాత్రమే సొంతమైన అస్తిత్వాన్ని కలిగి వర్ధిల్లుతున్నాయి.
ఇక్కడ అమెరికాలో ” వీక్షణం ” వారు నెల నెలా రచయితల సాహితీ సమావేశాలు జరుపుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి తెలుగు భాషాభిమానులు ఆంతర్జాలంలో ” కౌముది”, “సృజన రంజని” మాసపత్రికలు వెలువరిస్తున్నారు.
మనదైన ఆ ఆస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇతర సంస్కృతుల నుండి మంచిని ఆహ్వానిస్తూ మన పరిధిని విస్తరింప చేసుకుంటూ తన జాతి గౌరవాన్ని తల ఎత్తి చాటుతున్న తెలుగు వాళ్ళని చూసి తల్లిగా అమ్మమ్మగా గర్వపడడం నా హక్కు అనిపించింది.
సంగీతంలో నిష్ణాతులై సృజనాత్మకత సాధించడం “మనోధర్మం” అయితే, తెలుగు జాతి గౌరవప్రతిష్టలను కాపాడుకుని తెలుగు వెలుగుని ముందు తరాలకు అందించడం “మన ధర్మం ” అన్న గ్రహింపే మనకు శ్రీరామ రక్ష అనిపించింది.

——- ——– ———

బూలా ఫిజీ

రచన: మీరా సుబ్రహ్మణ్యం

నాడి విమానాశ్రయంలో ఆగిన విమానం నుండి దిగగానే ఇండియాకు వచ్చేసినట్టు అనిపించింది. ట్యాక్సీ కోసం బయకునడుస్తున్న మాకు దారికి ఇరువైపులా ఎర్రని మందార పూలు స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా నుండి అమెరికాకు ప్రయాణంలో మధ్యలో ఫిజీ లో నాలుగు రోజులు గడపాలని ముందుగానే అక్కడ డెనరవ్ ద్వీపంలో ఎస్టేట్స్ అనే రిసార్ట్ లో ఇల్లు తీసుకుంది అమ్మాయి.
ఫిజీ దీవులు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. ఎక్కడ చూసినా పచ్చదనమే. కొబ్బరి చెట్లు, ఎర్రని పూల గుత్తులతో నిండి ఉన్న సుంకేసుల చెట్లు, అక్కడక్కడ దేవ గన్నేరు చెట్లు. ఎకరాల కొద్దీ వ్యాపించిన చెరకు తోటలు. ఈ అందాలన్ని ఆస్వాదిస్తూ సందర్శకులు సేద దీరడానికి అనుకూలంగా కట్టిన రెండంతస్తుల లో వరుసఆపార్ట్మెంట్లు ఉన్నాయి ఎస్టేట్స్ రిసార్ట్ లో.
మేము తీసుకున్న దానిలో మంచాలు పరుపులు ఉన్న రెండు పడక గదులు, సోఫాలు టీవీ ఉన్న హాలు, భోజనాల బల్ల, కుర్చీలు వున్న డైనింగ్ రూము, స్టవ్, మైక్రో ఓవెన్ , గాజు గిన్నెలు, కాఫీ మేకర్ ఉన్న వంట ఇల్లు వున్నాయి . వెనుక వైపు వరండాలో హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కూర్చుని టీ తాగడానికి ఏర్పాటు చేశారు.
అక్కడికి దగ్గరలోనే పెద్ద గోల్ఫ్ కోర్ట్ ఉంది. చక్కని ఈత కొలను కూడా నడిచి వెళ్లే దూరంలో వుంది.
ఇదివరకు కేరళకు వెళ్ళి నప్పుడు మున్నార్ లో అత్యున్నతమైన కొండ మీద దేశాదన్ అనే రిసార్ట్ లో నాలుగు రోజులు గడిపిన అద్భుతమైన అనుభవాన్ని ఫిజీలోని పచ్చదనం గుర్తు చేసింది. రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఉన్న అమ్మాయి మోకాళ్ళ దాకా ఉన్న రంగురంగుల పువ్వులున్న గౌన్ తొడుక్కుంది. ఆమెను చూడగానే ఆకర్షించించింది ఆమె చెవిలో పెట్టుకున్న రేక మందారపువ్వు. చూడడానికి ఇక్కడి ఆడవాళ్ళు మగవాళ్ళు బలిష్టంగా కనిపిస్తారు. పొడుగ్గా పొడవుకు తగిన లావు, వెడల్పు ముఖాలు, పొట్టి ముక్కులు, లావు పెదవులు. మరీ కాటుక నలుపు కాదు గాని నలుపే అనిపించే దేహ ఛాయ ,నొక్కుల బిరుసు జుట్టు ,స్నేహ పూరితమైన చిరునవ్వు.
మమ్మలిని చూడగానే చిరునవ్వుతో ‘ బూ లా ‘ అంది. ఆది ఫిజీ పలకరింపుట. తరువాత వూళ్ళోకి వెళ్ళినప్పుడు చూశాము అక్కడక్కడ పెద్ద సైన్ బోర్డులు ‘బూలా ‘ అన్న పదం, చిరునవ్వు ముఖాలు.
మేము కూడా తెచ్చుకున్న ఉప్పు, పప్పు ,కాఫీ పొడి లాటి సామాను బయటకు తీసింది మా అమ్మాయి. కాఫీలు అయ్యాక చూసుకున్నాము మా అమెరికన్ టూరిస్టర్ సూట్ కేస్ బదులు వేరే వాళ్ళది తెచ్చుకున్నామని.
కొంప మునిగింది రా దేవుడా అని అమ్మాయి అల్లుడు మళ్లీ ఏర్పోర్ట్ కి పరిగెత్తారు. మా పెట్టె అక్కడే వుంది గాని మేము పొరబాటున తెచ్చుకున్న పెట్టె అసలు మనిషికి ఒప్ప చెబితే గాని మాది మాకు ఇవ్వరట. సరే అడ్రెస్ చూస్తే అతను మరో దీవికి వెళ్లినట్టు తెలిసింది. రిసెప్షన్ వాళ్లు చూపిన మనిషితో పడవ మీద పంపించారు. అతని నుండి సూట్కేస్ అందినట్టు ఫోన్ వచ్చాక మా పెట్టి ఇస్తారట.
ఏదో కాస్త తినేసి పడుకుందామని గదిలోకి అడుగు పెట్టగానే అక్కడ బల్ల మీద బైబుల్ కనబడింది.
ఈ ద్వీపవాసుల మీద బ్రిటిష్ వారి ముద్ర బలంగానే పడింది. చాలా మందికి కాస్తో కూస్తో ఇంగ్లీష్ వచ్చును. భాషతో బాటు మతము తోడుగా వచ్చింది. స్కూల్లో ఇంగ్లీష్, హిందీ , ఇటౌకీ భాషలు నేర్పిస్తారు. ఇక్కడ ముందునుండి ఉన్న జాతుల సంస్కృతీ అక్కడక్కడా కొనసాగుతుంది.
1800 సంవత్సరం తరువాత బ్రిటిష్ వాళ్ళ హయాం మొదలైంది అంటారు. అంతకు ముందు ఇక్కడ టోన్గంస్, రోటుమ్యాన్స్, సామోన్స్ వంటి జాతులు ఉన్నారు.
1879 నున్డీ 1911 లోపు ఇంచు మించు అరవై వేల మంది ఇండియన్స్ ని ఇక్కడికి తీసుకువచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఇండియన్స్ తో బాటు వాళ్ళ దేవుళ్లు వినాయక, కృష్ణ, శివ ,అల్లా ఇక్కడకు వచ్చారు. నవంబర్ లో ఇక్కడ వాళ్ళు దీపావళి పండుగ జరుపుకుంటారు. అంతకు ముందే చైనావారు కూడా ఇక్కడకు వచ్చిన దాఖలాలు వున్నాయి.
డాకువాకా, రావుయాలా, టెవోరో వంటి దేవుళ్ళు ఉన్నట్టు చెప్తారు. క్రైస్తవ మతం ఇక్కడికి రాకముందు వీరికి డేగై అనే దేవుడు ఫిజీ జాతికి మూల పురుషుడుగా నమ్మేవారు.
ఏదైనా పుస్తకం చదవనిదే నిద్ర రాదు కనుక హాల్లో టీపాయి మీద ఉన్న ‘డెనరావ్ ‘అనే ఆ ద్వీపం గురించిన పుస్తకం తిరగేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
ఆ డెగై అనే మూలపూరుషుడు సర్ప జాతి వాడని నమ్ముతారు. శ్రీ కృష్ణుడు కాళియ మర్ధనమ్ చేశాక ఆ కాలీయుడే ఇక్కడికి వచ్చాడని అతడే డేగై అని అంటారు.ఈ కాలియుడు లేక డేగై అనే సర్పజాతి మూలపూరుషుడు ‘కౌవాడ్రా వాడ్రా ‘అనే పర్వత శ్రేణి వద్ద నివసించారని ఒక కథనం. డేనరా దీవి కి ‘కౌవాడ్రావాడ్రా ‘శ్రేణి కి నడుమ ‘రాకీరాకి ఓటు కౌలా ‘అనే బంగారు గని ఉంది. ఆ గని తవ్వకాలలో ఇంజనీర్ల కు పొడుగాటి రాక్షస పాము కుబుసాలు కనబడి నాయని అంటారు. ఈ కథనం కాలీయుడు, లేక డేగై కథకు ఉత మిస్తోంది.
ఈ విచిత్ర విషయాలు చదువుతూ కనులు మూత బడ్డాయి.
సాయంత్రం తాత మనవరాలు ఈతకొలను వైపు వెళ్ళుతుంటే నేను అనుసరించాను. అమ్మాయి, అల్లుడు అలా వూళ్ళోకివెళ్లారు. వాళ్ళ బట్టలు ఏర్ పోర్ట్ లో ఉన్న సూట్ కేస్ లో వున్నాయి. స్నానం చేసి బట్టలు మార్చుకోక పోతే నిద్రపోలేరు.
కొలను చుట్టూ పచ్చని చెట్లు. గట్టు మీద కూర్చో డానికి సిమెంట్ బెంచీలు. పరిశుభ్ర మైన నీరు. పిల్లల కోసం ఒక వైపు లోతు తక్కువగా వుంది. పదేళ్ళ చిన్నారి చేపపిల్ల లాగా ఈదుతోంది. రరకాల విన్యాసాలు చేస్తూ ‘తాతా చూడు’ అంటూ పిలుస్తున్నది. అవును మరి అమ్మమ్మ కు ఈత రాదు కదా. తాతకు అన్ని తెలుసు అన్న ఆరాధన. ఎవరోఒక శ్వేత జాతీయుడు నడుము లోతు నీళ్ళ లో నిలబడి నవల కాబోలు చదువు కుంటున్నాడు.
తిరిగి వచ్చేసరికి అమ్మాయివాళ్ళు వచ్చేసారు. అమ్మాయి చెవిలో మందార పూవు పెట్టుకుని పువ్వు లాగా నవ్వుతున్నది. ‘బూలా వినాకా ‘ అంది నన్ను చూడగానే. ఆది పూర్తి పలకరింపు అట. వినాకా అంటే స్వాగతం అని కూడా అర్థం అట. తనకు పువ్వులున్న పొడుగు గౌను, మొగుడికి షార్ట్స్, పైన పూలచొక్కా, పాపకు రంగురంగుల గొడుగు కొన్నది.
వాళ్ళుతిరిగిన ట్యాక్సీ అతను ఇండియన్ ట. ఫిజీ యూనివర్సిటీలో చదువు తున్నాడు. ఖాళీ సమయంలో కారు నడుపు తాడు. ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడగలదు. ఇండియన్స్ అని తెలిసి చాలా సంతోషపడ్డాడుట.
పొద్దునే ఇల్లు అలికి, మంచం మీద దుప్పటి మార్చి వెళ్ళడానికి ఇద్దరు వచ్చారు. ఆతడు పువ్వుల చొక్కా, మొకాళ్ళ వరకువున్న లుంగీ వంటి లాగూలోను, ఆమె పువ్వుల గౌన్ లో వున్నారు. నేనే ముందుగా ‘బూలా ‘అని పలుకరించాను. రోజకుమూడు షిఫ్ట్స్ లో పని చేస్తారు. వచ్చే జీతం అంతంతమాత్రమే. పర్యాటక స్థలమే గాని పేదరికం ఎక్కువేలా వుంది.
మేము ఉండే రెండురోజులు తిరగడానికి ఒక ట్యాక్సీ మాట్లాడారు. ఈరోజు వూళ్ళో చూడవలసినవి చూసి, రేపు పడవలో దగ్గర ఉన్న ద్వీపాలు చూద్దాం అనుకునాము. ఏ నిముషానికి ఎ ఏమి జరుగునో ఎవరు ఉహించెదరు ? ఎంతో సరదాగా బయలు దేరిన మా ఫిజీ యాత్ర ఇలా ముగుస్తుందని మాత్రం అస్సలు ఉహించలేదు.
ముందు డెనరావ్ పోర్ట్ కి బయలుదేరాము. అక్కడ యాత్రికుల కోసం ఉన్న అంగళ్ల లో రకరకాల వస్తువులు అద్దాల వెనుక నుండి చూస్తూ వెళ్ళి పోర్ట్ లో ఆగి ఉన్న ఓడలు చూసాము. అక్కడే రెస్టారెంట్ లో మంచి శాఖాహార భోజనం దొరికింది.తినేసి కార్ ఎక్కాము. మా తరువాతి మజిలీ స్లీపింగ్ జైయంట్ పర్వతం, ఆ పైన ప్రకృతి సహజమైన వేడి నీటి సరస్సులు.
డెనరావ్ ద్వీపం నీటి ఆటలకు ప్రసిద్ధి. జెట్ బోట్ రైడింగ్, స్కుబా డ్రైవింగ్, స్నార్క్లింగ్, స్కీయింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఆకర్షిస్తాయి.
వూళ్ళో నుండి స్లీపింగ్ జైయంట్ చూడాలి అని బయలు దేరాము. దారికి రెండు వైపులా చెరుకు తోటలు. చెక్కర పరిశ్రమ ను వృద్ధి చేసినవారుభారతీయులు. మామిడి చెట్లు కూడా కనిపించాయి. కారెట్ మాంగో అనే పొడుగ్గా ఉండే పళ్ళు కనిపించాయి.
కారు డ్రైవర్ పేరు జాన్. ఆరున్నర అడుగుల పొడుగు, అంతకు తగిన లావు ఉండి నలుగురిని ఒంటి చేత్తో చావబాద గలిగేలా ఉన్నాడు. నా కథలో ఇతడే ముఖ్యుడు అవుతాడని అప్పుడు అనుకోలేదు.
కారు రహదారి నుండి మలుపు తిరిగి పొలాల మధ్య నుండి సన్నని మట్టి బాట లో సాగుతోంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎవరైనా కారు ఆపి మమ్మల్ని నాలుగు కొట్టి ఒంటిమీది బంగారం లాక్కున్నా అరిచినా పలికే దిక్కు లేదు . అసలు జాన్ ఎటువంటి వాడో.ఏమో ఎవరు నమ్మారు ?
అసలు ఆ డ్రైవర్ ఆకారం చూస్తేనే భయంగా వుంది. నిజంగా సరైన దారిలోనే వెడుతున్నాడా దారి తప్పించాడో కూడా అనుమానమే. కొత్త చోటు. ఎవరు ఎలాటివారో? చిన్న పిల్ల, ఇద్దరం ముసలి వాళ్ళు. అమ్మాయి అసలే నాజూకు. అల్లుడు ఒక్కడు ఈ భీకరాకారంతో తలపడ గలడా?మనసులో గుబులు బయటకు చెప్పలేను. దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నా…
“అమ్మ అదిగో స్లీపింగ్ జైయంట్ పర్వతం ” అంటూ ఉత్సాహంగా అరిచింది నా కూతురు. నిజంగానే ఎత్తైన పర్వతం పై భాగం ఎవరో రాక్షస ఆకారం పడుకున్నట్టు వుంది. నాకేమో ఆది చూసిన సంతోషం ఒక వైపు అమ్మయ్యా సరైన దారిలోనే తీసుకు వచ్చాడు అన్న నిశ్చింత మరోవైపు.
అంత సేపు మౌనంగా ఉన్న జాన్ కబుర్లు మొదలు పెట్టాడు. జాన్ కి ముగ్గురు పిల్లలు. భార్య దగ్గర వున్న స్కూల్ లో క్లీనర్ గా పని చేస్తుంది. వచ్చీ రాని ఇంగ్లీష్ లో చెప్పాడు. అక్కడక్కడ కనిపించే మల్బరీ చెట్లు చూపించాడు. ఆ చెట్టు బెరడుతో ‘ మాసీ ‘ అనే వస్త్రం తయారు చేస్త్రారట. పూర్వం ఈ ‘ మాసీ ‘అనే వస్త్రాన్ని గుడి కప్పు నుండి క్రిందికి వేలాడ దీసేవారట. దాని మీదుగా జారి క్రిందికి వచ్చి దేవుడు పూజారి ద్వారా పలికే వాడట.
‘ ఐవీ ‘ వీళ్ళకు పవిత్రమైన చెట్టు. కిడ్నీ ఆకారంలో వుండే దాని పండు మంచి ఆహారం. పండును నిప్పులో కాల్చి లోపలి గుజ్జు తింటారుట. పర్యాటకులకు ఆకులలో చుట్టి అమ్ముతారు.
అలాగే కొబ్బరి చెట్టు కూడా వీరికి పవిత్రమైనది. దానికి “ట్రీ ఆఫ్ లైఫ్ ” అని పేరుట. మనుషులకు కూడా కొబ్బరికి సంబంధించిన పేర్లుపెడతారు. ‘నారెన్జు ‘( ముదురు కొబ్బరి), ‘నవారా'(కొబ్బరి మొలక) వంటి పేర్లు. వంటలలో కూడా కొబ్బరి బాగా వాడుకుంటారు ట.
తమ వారి గురించి మాట్లాడుతున్న జాన్ గొంతులో ఉత్సాహం వినిపించు తున్నది.
‘ యాకొంగ్ ‘ అనే పొదల వ్రేళ్ళు ఎండబెట్టి పొడిచేసి నీళ్ళ లో కలిపి వడగట్టిన మత్తు పానీయం వాళ్ళకు ప్రియమైనది అట. ‘యాకోనా ‘ అనే ఈ పానీయం పండుగలలో సేవిస్తారు ట. ఈ విషయం చెబుతున్న జాన్ ముఖంలో నవ్వులు పూసాయి.
అతగాడు గాని కాస్త పుచ్చుకు వచ్చాడా అని సందేహంగా చూసాను. నా మనసు చదివినట్టు మా అమ్మాయి నవ్వేసింది.
ప్రకృతి సహజ వేడి నీటి బుగ్గల కొలను వైపు మా ప్రయాణం సాగుతోంది. జాన్ ఫిజీ విశేషాలు చెప్పడం కొనసాగించాడు.
తీర ప్రాంతాల్లో ఉండే కొన్ని జాతులలో కొన్ని ఆచారాలు వుంటాయి ట. జాతి నాయకుడు చనిపోతే వంద రోజుల దాకా చేపలు పట్టే ఒక ప్రాంతంలో చేపల వేట నిషేదిస్తారు. తరువాత ఆ ప్రాంతంలో చేపల వేటలో ఇబ్బడి ముబ్బడిగా చేపలు దొరుకుతాయి. వాటితో చనిపోయిన నాయకుడి జ్ఞాపకార్థం కోలాహాలంగా దినం జరుపుతారు.
దూరంగా వేడి నీటి బుగ్గల సంబంధించిన బోర్డ్ కనబడింది. జీపు మలుపు తిరిగి ఆ దారి పట్టింది. కాస్త దూరం పోగానే రిసెప్షన్ ఆఫీస్ కనబడింది. అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలయ్యింది. ఫిజీ కి వచ్చినప్పటి నుండి గమనించినది ఏమంటే సముద్ర తీరం కావడాన ఏమో అప్పుడు అప్పుడూ వానపడుతూనే వుంది. మళ్లీ అంతలోనే తెరపి ఇస్తుంది.
రిసెప్షన్ లో వాళ్ళు మమల్ని చూసి కుర్చీలు తెచ్చి వరండాలో వేసారు. చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు అక్కడక్కడా కొలనులు. పెద్ద వనంలా కన్నుల పండుగగా వుంది.
మేము ఇద్దరం కుర్చీలలో కూర్చున్నాము. పిల్లలు గొడుగు వేసుకుని వానలోనే వేడి నీటి కొలనులు చూడ డానికి ముందుకు నడిచారు. అక్కడక్కడజంటలు పరుగులు తీస్తూ కనిపించారు.
మా పిల్లలు ముగ్గురు గొడుగుక్రింద నడుస్తూ పోతుంటే నాకు ప్రియమైన పాత హింది పాట మనసులో మెదిలింది. నర్గీస్, రాజ్కపూర్ వర్షంలో గొడుగుపట్టుకుని నడుస్తూ పాడే “ప్యార్ హువా ఇక్రార్ హువా ” గుర్తొచ్చింది. అందులో ఆఖరున ” తూ న రహేగా , మై న రహేగా ఫిర్ భీ రహేగి నీశానియా ” అనేది మరీ ఇష్టం.
వాళ్ళు అలా వానలో నడుస్తుంటే ఫోటో తీయాలనిపించింది. సెల్ ఫోన్ ఫోకస్ చేస్తూ మెట్టు దిగబోయాను. రెండో క్షణం తడి మెట్ల మీద జారి నాలుగు మెట్ల క్రింద నేలమీద వున్నా. భరించలేని నొప్పి. కాలు మడత పడి భరించలేని నొప్పితో గట్టిగా అరిచేసా.
రిసెప్షన్ లో ఉన్న ఆడ మగ ఇద్దరు పరుగున బయటకు వచ్చారు. చేయి అందించారు గాని కాలు కదప లేక “కాల్ మై డాటర్ ” అని అరుస్తున్నా. జాన్ పరిగెత్తుకు వచ్చాడు. ఈయన వానలోకి వెళ్ళిన మా వాళ్ళను వెనక్కి రమ్మని కేకలు.
అంత బాధలోను నా దృష్టి కుర్చీ మీద వదిలేసిన హాండ్ బాగ్ మీదే. అందులో డబ్బు , బంగారు నగలు , పాస్ పోర్ట్ అన్ని ఉన్నాయి. అక్కడున్న వాళ్లకు అర్థం కారాదని తెలుగులో “నా చేతి సంచీ జాగ్రత్త ” అంటున్నా. మా ఆయనకు దిక్కు తోచడంలేదు. అంతలో పిల్లలు పరుగున వచ్చారు.
కాలు ఫ్ర్యాక్చర్ అయిందో ఏమో తాకితే విలావిలలాడుతున్నా. ఎలాగో నలుగురు కలిసి నన్ను ఎత్తి జీపులోకి ఎక్కించారు నా బాగ్ పాప భద్రంగాపట్టుకుంది.
వాన ఆగింది. వెనక్కి వెళ్లే దారిలో ఆసుపత్రి ఉన్నదని జాన్ చెప్పాడు. అరగంటలో అక్కడికి చేర్చాడు. చక్రాల కుర్చీ తెచ్చి నర్సులు , అమ్మాయి నన్నుకుర్చీలోకి చేర్చారు.
నా పరిస్తితి చూసి డాక్టర్ ముందు మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎక్స్ రే తీసి ఫ్ర్యాక్చర్ లేదని అన్నాడు. మందులు రాసిచ్చాడు. అయిదు వంద డాలర్స్బిల్లు. నొప్పికి తోడు ఇదో బాధ. నన్ను బయటకు తీసుకు వచ్చేసరికి జాన్ లేడు .తీరిగ్గా పది నిముషాల తరువాత వచ్చాడు. అసలే అతని మీద సదభిప్రాయం లేదేమో నాకు ఒళ్ళు మండి పోయింది.
మా వారిని , పాపను ఇంటిదగ్గర వదిలి రమ్మన్నారట. వాళ్ళను వదల డానికి అరగంట చాలు. తన పనులేవో చూసుకుని వచ్చి వుంటాడు పెద్దమనిషి.కాలి నొప్పి కి కోపం తోడు అయింది.
మళ్లీ నలుగురు కలిసి కష్టం మీద నన్ను జీపు ఎక్కించారు. బండి కదిలాక గమనించాను. ముందు సీట్ లో భారీగా ఉన్న ఒక స్త్రీ కూర్చుని ఉంది.
మా రిసార్ట్ ముందు బండి ఆగగానే ఆమె దిగి నేను కూర్చున్న వైపు వచ్చింది. సైగలతో తన మెడ చుట్టూ చేతులు వేయమని సూచించింది. మా అమ్మాయి దిగి సాయం చేయడానికి సిద్ధంగా నిలబడింది.
ఆమె మెడ చుట్టూ చేతులు వేయగానే ఏడు పదుల వయసు మనిషిని ఏడేళ్ల పిల్లను దించినట్టు నడుము పట్టుకుని కిందకి దింపి నా కాలు కింద మోపకండ మావారి రోలేటర్ లో కూర్చో బెట్టింది. అమ్మాయి రోలేటర్ ను తోసుకుంటూ ఇంట్లోకి తీసుకు వెళ్తూ వుండగా ఆమెకి కృతజ్ఞతతో నమస్కారంపెట్టా.
“పాపం ఆ నర్సు ఇంటి దాకా వచ్చి సాయం చేసింది. ఏమన్నా డబ్బు ఇచ్చారా లేదా పాపం ?” నన్ను మంచం మీదకి చేర్చాక అడిగాను.
“నర్సును ఎందుకు పంపుతారు అమ్మా! ఆవిడ జాన్ భార్య. పాపను, నాన్నను ఇక్కడ దింపి, ఇంటికి వెళ్ళి మనకు సాయం కోసం భార్యను తీసుకువచ్చాడు.” అన్నది నా కూతురు.
ఏముంది లే ఈరోజు కాక పోతే రేపు వీళ్ళు డబ్బులు బాగా ఇస్తారని తెలుసు అతనికి అనుకున్నా మనసులో. సాయంత్రంఆ రిసార్ట్ జ్యానిటర్ వరండా లోవెళ్తూ కిటికీలో నుండి నా గదిలో కూర్చున్న పాపను “అమ్మమ్మ ఎలా వుంది ” అని అడిగాడు.’ బావుంది’ అంటూ అతనికి హై ఫైవ్ ఇచ్చింది పాప.
“నిన్న తాత కు కారులో నుండి దిగడానికి రాబర్ట్ సాయం చేశాడు.” చెప్పింది పాప.
మరునాటికి నొప్పి తగ్గింది. “మేము ఇక్కడే వెనుక ఉన్న వరండాలో కూర్చుని గోల్ఫ్ ఆడేవాళ్ళని, కప్పు మీద కొబ్బరి ఆకులు పరచి లోపల పదిమందికూర్చునే వీలున్న వ్యాన్ లో డెనరావు అందాలు చూస్తూ చుట్టూ తిరిగే టూరిస్ట్ లను చూస్తూ ఉంటాము మీరు పోర్ట్ కి వెళ్ళి నౌకా విహారం చేసి రమ్మని ” చెప్పాం పిల్లలకు.
వెళ్ళిన గంటకే ఫోన్ చేశారు సముద్రంలోకి పోకూడదు అంటూ తుఫాను సూచనగా ఎర్ర జండాలు ఎగుర వేసారుట. వూళ్లోకి వెళ్ళి విండో షాపింగ్ చేసి వస్తాము అని.
రేపే ప్రయాణం ఈ తుఫాను ఏమి చిక్కులు తెస్తుందో !
అనుకున్నట్టే మరునాడు రహదారులన్ని నీళ్ళలో మునిగాయని కబురు. ఎలాగైనా సమయానికి విమానాశ్రయం చేరాలి.
జాన్ భరోసా ఇచ్చాడట. ఫోర్ బై ఫోర్ బండి తెస్తానని వేళకు విమానం ఎక్కిస్తానని.
భోజనాలు ముగించి, సామాను సర్దుకుని బండి ఎక్కాము. సగం దారి దాటేసరికి నడుము లోతు నీళ్ళలో బండి నడవడము కష్టంగా ఉంది. దారిలో కొందరు నడుము లోతు నీళ్ళలో అతి కష్టం మీద నడుస్తూ కనబడ్డారు.
దేవుడి మీద భారం వేసి కూర్చున్నాం. మెల్లిగా జాగ్రత్తగా ముందుకు పోనిస్తున్నాడు జాన్.. జాన్ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయంట . భార్య, పిల్లలు దగ్గర ఉన్న స్కూలులో తలదాచు కున్నారట.
ఎలాగైతేనేం ఏర్పోర్ట్ కి చేరుకున్నాం. థ్యాంక్ గాడ్ అంది మా అమ్మాయి నిట్తూరుస్తూ. థ్యాంక్ గాడ్ అన్నాడు జాన్. థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూజాన్ అన్నాను నేను మనస్పూర్తిగా.
జాన్ ముఖంలో సంతోషంతో కూడిన నవ్వు కనబడింది.
సామాను దింపాక, నన్ను వీల్ ఛైర్ లో చేర్చారు. జాన్ కి మరోసారి థాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చి కదిలాము. జాన్ పరుగున నా ముందుకు వచ్చాడు. నా కుడి చేయి అందుకుని అరచేతిలో ఏదో పెట్టి నా నా ముఖంలోకి చూసాడు. అరచేతి లోని వస్తువు చూసి నాకు మతి పోయింది. అది నా రవ్వల కమ్మల జత లోని దుద్దు. బరువుకు చెవులు సాగిపోతున్నా యని తీసి కాగితంలో పొట్లం కట్టి హాండ్బాగ్లో వేసాను. అసంకల్పితంగా బాగ్ తెరిచి ఇంకోచేత్తో పొట్లం బయటకి తీసా. పొట్లం వూడిపోయి ఉంది. ఒక్కటే కమ్మ ఉంది అందులో ఇందాక వచ్చేటప్పుడు జాన్ పక్కన సీట్లో కూర్చున్నా. ఒళ్ళో వున్న బాగ్ జారి కింద పడితే తీసి అందించాడు. అప్పుడు పడి పోయిందేమో.
జాన్ వైపు ప్రశ్నార్థకంగా చూసా.” కారులో దొరికింది.. మీదేనా? ” అన్నాడు.
జత కమ్మలు రెండు పక్క పక్కన పెట్టి చూపాను.
జాన్ సంతోషంగా చిరునవ్వు చిందించాడు. అప్పుడు జాన్ నలుపు రంగు , భీకరాకారం నాకు కనబడలేదు. అమ్మ పోగొట్టుకున్న వస్తువు వెదికి ఇచ్చిన పసి బిడ్డ నవ్వు అది.
ఎదుటి మనిషిని నమ్మకపోవడం, ఆనుమానించడము ఈ రోజుల్లో మామూలై పోయింది. మనిషి ఆకారం, రంగు, రూపం, అంతస్తు లను బట్టిగుణాన్ని అంచనా వేయడం అలవాటుగా మారింది. నేను అంతే చేసాను. ” అనుకుని సిగ్గుపడ్డాను.
అది అమ్ముకుంటే అతనికి కనీసం పదిహేను వందల డాలర్స్ వచ్చేవి. మనిషి పేదవాడే గాని నిజాయితీలో గొప్పవాడు.”ఈ మనిషిని గురించా నేను అంత చెడుగా అలోచించాను “అన్న అపరాథ భావనతో నాకు కళ్ల నీళ్ళు తిరిగాయి.

నా చేయి అందుకుని అరచేయి వెనక్కి తిప్పి ముంజేతి మీద పెదవులు ఆనీ ఆననట్టు ముద్దు పెట్టి “గుడ్ లక్ మమ్మా ” అనేసి గబా గబా వెళ్ళిపోయాడు.
విమానం ” ఎక్కగానే ” బూలా” అంటూ చిరునవ్వుతో, చెవిలో మందార పువ్వు పెట్టుకున్న గగన సఖి కనబడింది.

—————

ఇరుకు

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం.

బంధువుల ఇంట్లో పెళ్ళికి బెంగుళూరు వెళ్ళాను. ఆ పెళ్ళికి చిన్న మామయ్య కూతురు మాధవి వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటిలాగే నిరాడంబరంగా వుంది. ఆప్యాయంగా పలుకరించింది . చిన్న మామయ్య అరుణాచలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన తన అక్కా చెల్లెళ్లను ఆదరించిన తీరు నాకు ఆయన ఎడల గౌరవాన్ని పెంచింది. ఆయనకు వచ్చే జీతం తక్కువ. అయిదుగురు పిల్లలు. కానీ మేమంత మామయ్య ఇంటికి సెలవుల్లో వెళ్ళి వారాల తరబడి ఉండేవాళ్ళం. అత్తయ్య కూడా మమ్మల్ని ప్రేమగా ఆదరించేది. మంచివాళ్ళకు దేవుడే సహాయం చేస్తాడు అంటారు. ఆయన ఎప్పుడో తక్కువ ఖరీదులో కొన్న ఇళ్ళ స్థలాల ఖరీదు బాగా పెరిగి పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు డబ్బుకు ఇబ్బంది లేకుండా ఆదుకుంది .
మా పెద్ద మామయ్య కూతురు వసుంధర కూడా ఈ వివాహానికి హాజరు కావడం వలన తనని కూడా చూసే అవకాశం కలిగింది నాకు. పెద్ద మామయ్య వాళ్ళతో మాకు అంతగా రాకపోకలు లేవు. మామయ్య తరపు వాళ్ళను దూరముగా పెట్టింది ఆయన భార్య. వాళ్ళకు ఇద్దరే సంతానం. భార్య ఆస్తి కూడా కలిసి వచ్చింది మామయ్యకు. బహుశా అందుకే ననుకుంటాను ఇంట్లో ఆవిడ మాటే చెల్లుబాటు అయ్యేది. అమ్మ , మేము పెద్ద మామయ్య ఇంటికి ఒకటి రెండుసార్లు వెళ్ళిన గుర్తు. పెద్ద కూతురు వసుంధర చదువులో రాణించక పోవడం వలన పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేసారు. బాగా డబ్బున్న సంబంధం.
సంవత్సరాల తరువాత చూస్తున్నానేమో ముందు గుర్తు పట్టలేక పోయాను. బాగా లావయి పోయింది. జరీ ముద్దలా ఉన్న కంచిపట్టు చీర కట్టి, మెడలోను చేతులకు కలిపి సుమారు కేజీ బరువు ఉండే నగలు ధరించి ఉంది. వసుంధర అక్క పెళ్ళికి వచ్చింది గాని నా పెళ్ళికి రాలేదు. తాను అక్క కంటే పెద్దది. అప్పటికే తనకి ఇద్దరు పిల్లలు.
అమ్మ పోయాక మా మధ్యన రాకపోకలు తగ్గాయి.
“బాంక్ లో ఆఫీసరుగా పని చేస్తున్నావుట. పుట్టింటిలో ఉన్నప్పుడు పెట్టుకున్నట్టు తులం బంగారం గొలుసులోనే ఉన్నావేమిటి ? నీ సంపాదన అంతా మీ ఆయన దాచేస్తున్నాడా ఏమిటి.” దగ్గరికి వెళ్ళి పలుకరించగానే నవ్వుతూ అడిగింది. వాళ్ళతో పోలిస్తే మా నాన్నగారి ఆదాయం తక్కువే. అయితే పిల్లలు అందరమూ చదువులో ఎక్కి వచ్చాం.
అక్క పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను తనని. చేతుల నిండా బంగారు గాజులు, మెడలో రాళ్ళ నెక్ లేసు, చంద్రహారం, నడుముకు వడ్డాణము పెట్టుకుని, పాతిక వేల ఖరీదైన చీరలో డాబుగా కనబడింది . అయిదేళ్ళ కూతురు తల మీద ముందు వైపు సూర్యుడు, చంద్ర వంక అటు ఇటు పెట్టి మధ్యలో పాపిడి పిందెలు, వెనకాల బంగారు జడ గంటలు, జడలో నడుమ రాకిడి, పైన నాగరం పెట్టుకుని పట్టు పావడలో తెగ తిరిగింది.
నేను చేతికి రెండేసి బంగారు గాజులు, మెడలో ఒంటి పేట గొలుసుతో ఉంటే ‘కాలేజ్ గర్ల్ నని నాజూకు పడుతున్నావా?” అని సాగదీసి వెక్కిరించింది గుర్తుకువచ్చింది నాకు.
తను ఏమీ మారలేదు. నవ్వేసి వూరుకున్నాను.
పెళ్లి కూతురుకి నేను వెండి దీపాలు చదివించాను. ఏదో ఫోటో ఫ్రేమ్ చదివించిన వసుంధర ఆశ్చర్యంగా చూసింది.
నేను వూరికి బయలు దేరుతుంటే అన్నది “ఎంత పెద్ద ఆఫీసరువైనా హైద్రాబాదు వచ్చినప్పుడు మమ్మలిని మరచి పోకు. ఈ సారి మా ఇంట్లో దిగక పోతే ఇంకెప్పుడూ నీతో మాట్లాడను. లంకంత ఇల్లు. ”
వాళ్ళ అమ్మలా కాకుండా. బంధుప్రీతి ఉన్నట్టు వుంది అనుకున్నాను.
” నేరుగా మీ ఇంటికే వస్తాను. సరేనా” అన్నాను.
మాధవీ కూడా హైద్రాబాద్ లో వుంటున్నట్టు చెప్పింది. ఈసారి వస్తే మా ఇంటికి రాకూడదూ” అని అడ్రెస్ ఇచ్చింది. అనుకోకుండా నెల రోజుల తరువాత హైద్రాబాదు వెళ్ళ వలసిన పని పడింది. వారంరోజులు శిక్షణ కోసం ఆఫీసు వాళ్ళు పంపారు. మాకు అక్కడ ఉండే దానికి వాళ్లే ఏర్పాటు చేస్తారు. కానీ నాకు వసుంధర బెదిరింపు గుర్తుకు వచ్చింది. సరే తన పిల్లలను చూసినట్లు అవుతుంది రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉందాం అనుకుని నేరుగా కూకట్ పల్లికి ఆటో మాట్లాడు కున్నాను.
మాధవి ఇంటికి వూరికి వెళ్లే ముందు ఒక పూట వెళ్ళి చూసి బయలుదేరి పోవచ్చును. మాధవి భర్త చిన్న ఉద్యోగంలో వున్నట్టు విన్నాను. ఇద్దరు పిల్లలు. మధ్య తరగతి సంసారం. తన మీద అదనపు భారం మోపడం దేనికి? అనుకున్నాను . అంతే కాకుండా మాధవీ ఏదో యధాలాపంగా రమ్మని పిలిచినట్టు అనిపించింది .
కాలింగ్ బెల్ కొట్టగానే వసుంధరే తలుపు తీసింది. నన్ను చూడగానే ముఖంలో ఆశ్చర్యం కనబడింది .
“ఇదేంటి ఉన్నట్టుండి ఊడిపడ్డావు” అంటూ లోపలికి రమ్మన్నట్టు పక్కకు తప్పుకుంది.
ఏదో శిక్షణ కోసం వచ్చానులే” చేతిలోని చిన్న సూట్ కేస్ హాల్లో సోఫా పక్కన పెడుతూ చెప్పాను .
“మీ శిక్షణ క్యాంపులు అన్నీ ఒక రోజు రెండు రోజులే కదా” అంది. “ఈసారి వారంరోజులు వేశారు.” అన్నాను.
వసుంధర ముఖంలో భావాలు మారాయి.
” ఏదో నా మాట కాదనలేక వచ్చావు గాని మీకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఏసీ గెస్ట్ హౌస్ వదిలి రోజు ఇంత దూరం నుండి వెళ్ళి అవస్థ పడతావా ఏమిటి?” అంటూ లోపలికి దారి తీసింది.
ఉండడానికి నాలుగు పడక గదులు , పెద్ద హాలు, విశాల మైన భోజనాల గది , అన్ని సౌకర్యాలు ఉన్న వంటగది ఉన్నాయి గాని ఏమిటో పొందికగా పద్ధతి గా అమర్చి లేవు.
ఒక గదిలో మంచంమీద ఆడ్డ దిడ్డముగా పడుకుని ఉన్న వసుంధర ఇరవై ఏళ్ల కూతురు “తను నా మేనత్త కూతురు. బాంక్ లో ఆఫీసర్ గా చేస్తున్నది.” అని నన్ను పరిచయం చేస్తే కనీసం మర్యాదకన్నా లేచి కూర్చోకండా ఒకసారి నాకేసి చూసి కనుబొమలు ఎగుర వేసి తాను చదువుతున్న హెరాల్డ్ రాబిన్స్ రొమ్యాంటిక్ నవల లో మునిగిపోయింది.
ఇంకో గదిలో మోకాళ్ళ మీద, చీల మండల వద్ద చినిగి ఉన్న జీన్స్ ప్యాంట్స్ పైన ఏదో విచిత్రమైన రాతలు ఉన్న చొక్కా లో ఉన్న పదహారు ఏళ్ల కొడుకు పిచ్చి గంతుల డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నన్ను పరిచయం చేసింది. డ్యాన్స్ ఆపకుండానే హై అన్నాడు. మంచం మీద చిందర వందరగా పడి ఉన్నాయి విడిచేసిన బట్టలు, చదివిన పుస్తకాలు.
వంట ఇంటి లోకి వెళ్ళాక చెప్పింది ” వాళ్ళ నాన్నగారు ముంబై వెళ్లారు. అందుకే ఇష్టారాజ్యంగా ఉన్నారు. ఇద్దరికీ ఇప్పటి కిప్పుడు అమెరికా వెళ్లిపోవాలని ఉంది. “ఆ పిల్ల చదువుతున్నది బి. ఏ అయినా ఏదో అమెరికా సంబంధం చూసి, కట్నం పారేసి చేసేయవచ్చు. కానీ వాడు డిగ్రీ పూర్తి చేసి అదేదో జి ఆర్. ఈ రాయాలంట. ఖర్చుల గురించి బెంగ లేదనుకో.” అంది వసుంధర.
” న్యూ ఇయర్ కి క్లబ్ లో పార్టీలు, పుట్టిన రోజుకి డ్యాన్స్ పార్టీలు …అబ్బో అంతా అమెరికా పద్ధతులే. ఈ నడుమ హాల్లోవీన్ కూడా జరుపుతున్నారు.” ఇండియాలో ఏముంది మమ్మీ దుమ్ము మురికి తప్ప. ఉంటే ఆమెరికాలో ఉండాలి” అంటారు. కాస్త గర్వంగా చెప్పింది.
“ఆయన ఇవాళ ఫ్లైట్ లో వస్తున్నారు. నెలకు నాలుగు సార్లు బిజినెస్ పని మీద ఫ్లైట్ లోనే తిరుగుతుంటారు.” అని చెప్పింది.
శ్రీమంతురాలిని అన్న అహంకారం ఆమె మాటలలో కనబడుతున్నది. అమెరికాలో వున్న వాళ్ళ పిల్లలకు మనదైన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని శని ఆది వారాలలో ముప్పై మైళ్ళ దూరంలో వున్నగురువుల దగ్గరికి తీసుకు వెళ్ళి కర్నాటక సంగీతం, కూచిపూడి నాట్యం నేర్పించి అరంగేట్రం చేయిస్తున్నారని వింటున్నాము. మన స్వాతంత్ర్య దినం ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త కారు కొన్నా, పుట్టిన రోజు అయినా గుడికి వెళ్లుతున్నారు. ఉగాది , హోలి పండగలు జరుపు కుంటున్నారు. ఇక్కడి వాళ్ళకి అమెరికా పిచ్చి పట్టుకుంటున్నది.” అనుకుంటూ ” నేను స్నానం చేసి వస్తాను. ప్రయాణం వలన చికాకుగా ఉంది” అన్నాను .
” బట్టలు మా గదిలో మార్చుకో. ఆయన లేరుగా. నాలుగో బెడ్ రూమ్ తాను ఆఫీస్ గది లాగా వాడుకుంటూ ఉంటారు. వెనక ఒక గెస్ట్ రూమ్ వుంది . నువ్వు రెండు రోజులు వుంటాను అంటే ఆది వాడుకోవచ్చును. ఈలోపున ఆఫీసు వాళ్ళు ఎవరైనా వస్తేనే ఇబ్బంది. ఏమిటో ఇంత ఇల్లు ఉన్న ఇరుకు అనే అనిపిస్తుంది . ఫలహారం చేసి వుంటావు. వంట మొదలు పెడతాను.” అంది.
నేను స్నానం ముగించి బట్టలు మార్చుకుని వచ్చాను. భోజనాల బల్ల దగ్గర పిల్లలతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ కంచాలలో కావలసినవి వడ్డించుకుని తీసుకు వెళ్ళి టి వి ముందు కూర్చున్నారు హై అన్న ఒక్క మాటతో నన్ను పలుకరించేసి. “మాధవి చిక్కడపల్లి లో ఉందిట కదా. వెళ్ళి చూడాలి ” అన్నాను భోజనం అయ్యాక.
” వాళ్ళ ఇంట్లో వుండాలని అనుకుంటున్నావా ఏమిటి కొంపతీసి? చిన్న ఇల్లు. ఆ ఇరుకులో ఎలా వుంటారో బాబూ నేను అయితే ఒక పూట గడపలేను అలాటి చోట .” అంది వసుంధర ముఖం చిట్లిస్తూ. సాయంత్రం వసుంధర భర్త వచ్చారు. నన్ను పరిచయం చేసింది. ఆయనే అందరికన్నా బాగా నన్ను పలుకరించారు. ” రాక రాక వచ్చారు. మీకు కావలసినన్ని రోజులు ఉండండి . మా గెస్ట్ రూమ్ లో మీకు సౌకర్యంగానే వుంటుంది ” అన్నారు.
ఒక గంట అయ్యాక నేను సూట్ కేస్ తీసుకుని బయలు దేరాను. “రేపు పొద్దున్న ఏడు గంటల కల్లా మేము సమావేశం కావాలి. మాకు బస ఏర్పాటు చేసిన అతిధి గృహం అక్కడికి దగ్గర . నాకు అనుకూలం.” అని చెప్పి.
” అదేమిటి? నువ్వు ఇక్కడే వారం రోజులు వుంటావు అని అనుకున్నాను. అవునులే పెద్ద ఆఫీసరువి. మా ఇళ్ళలో ఎందుకు వుంటావు? “అన్నది నిస్టురముగా.
” మీ ఇంట్లో దిగాను నీ మాట ప్రకారం. ఒక పూట ఉండి అందరినీ చూశాను. నాకు అక్కడ దగ్గరగా ఉంటే సౌకర్యంగా వుంటుంది.” చిరునవ్వుతో చెప్పి బయట పడ్డాను.
నేను ఓలా ట్యాక్సీ కోసం ఫోనుచేస్తుంటే ఇంటి ముందు వాళ్ల కారు, డ్రైవర్ వున్నా అందులో పంపుతాను అనలేదు వసుంధర .
మరునాడు సాయంత్రం మాధవి నుండి ఫోను వచ్చింది. “మీ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాను ఖాళీగానే వున్నావు కదూ ?” అని అడిగింది. వసుంధర చెప్పిందట నేను వచ్చినట్టు. తాను వాళ్ళ ఇంట్లో వుండమని బలవంతం చేసినా వినకుండా వెళ్ళిపోయానని చెప్పిందట.
సరే కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చునని రమ్మన్నాను. వచ్చీ రాగానే గదిలోని నా వస్తువులన్నీ పెట్టెలోకి సర్దేసింది. “ఇప్పటికీ రెండు రోజులు అయిపోయాయి. కనీసం మిగిలిన అయిదు రోజులయినా నా దగ్గర వుండాల్సిందే . కాదంటే నామీద ఒట్టే ” అంటూ పెట్టె పట్టుకుని గది బయటకు నడిచింది. నా మాట వినిపించుకునే లాగా లేదు. సరే ఒక రోజు ఉండి ఎలాగో నచ్చచెప్పి వచ్చేద్దాము అనుకుని తన వెంట నడిచాను.
చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంది వాళ్ళ ఇల్లు. ఆటో డబ్బులు కూడా నన్ను ఇవ్వనీయ లేదు మాధవి. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురు వచ్చారు పిల్లలు ఇద్దరు. “ఆత్తని. లోపలికి తీసుకు వెళ్లండి” అని చెప్పింది మాధవి.
” మీరు బాంక్ లో ఆఫీసరుగా పని చేస్తున్నారట కదా? మేము మీలాగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అమ్మ ఎప్పుడూ చెప్తుంది అత్తా . మీ పెట్టె మా గదిలో పెడతాను. ” అంటూ లోపలికి దారి తీసారు.
వసుంధర చెప్పినట్టు ఇల్లు చిన్నదే. కానీ ఎక్కడికక్కడ సామాను పొందికగా సర్ది వున్నందున ఇరుకుగా అనిపించదు.
“పిల్లల గది నువ్వు వాడుకో. వాళ్ళు హాల్లో పడుకుంటారు. పోతే నువ్వు నిద్రపోయేదాకా కబుర్లు చెబుతారు. నిన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వరేమో ” అని నవ్వింది మాధవి .
” అవును అత్తా. మీరు కథలు బాగా రాస్తారు అని చెప్పింది అమ్మ. ” అన్నారు వాళ్ళు.
” ఏమిటి నాగురించి వీళ్ళకు చాలా గొప్పగా చెప్పేశావే?” “ఉన్నవే చెప్పానులే . ఏమీ కల్పించలేదు. ” అంది నవ్వుతూ.
మాధవీ వాళ్ళ ఆయన కూడా ఆదరంగా పలుకరించాడు. ” వస్తూ పోతూ వుంటేనే కదండీ బంధుత్వాలు బలపడేది . మేము కూడా ఎప్పుడో విజయవాడ వస్తాము. మీ ఇంట్లోనే దిగుతాము. మీరు మొహమాట పడకండి.” అన్నాడు.
మాధవి నాకోసం ప్రత్యేకంగా ఏమీ చేయ లేదు. ఆర్భాటంగా ప్రేమ ప్రకటించ లేదు. వాళ్ళు తినేదే నాకు పెట్టింది. వాళ్ళ ఇంట్లో మనిషి లాగా చూశారు. అదే నాకు చాలా నచ్చింది. అంత ఆప్యాయంగా వాళ్ళు అక్కడే ఉండిపొమ్మంటే కాదు అనడానికి మనసు రాలేదు.
మధ్యలో వచ్చిన ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దామని బయలుదేరదీసాను. పిల్లలు చాలా ఉత్సాహంగా తయారు అయ్యారు. పొద్దున్న తొమ్మిది కల్లా బయట పడ్డాము. కాస్త ఖర్చు ఎక్కువ అయినా పరవాలేదని ప్రత్యేకమైన టికెట్లు కొన్నాను. వోల ట్యాక్సీ లో వెళ్ళి ముందుదిగి లోపలికి వెళ్ళాము.
వెళ్ళగానే స్వాగతం చెబుతూ చల్లని పండ్ల రసం ఇచ్చారు మా అందరికీ. అక్కడి నుండి వాళ్లే బండిలో తిప్పి చూపిస్తారు. ఒక పెద్ద భవనం చూపించి అందులో ఒక వైపు కళాశాల- నాయిక నాయకులు ప్రేమలో పడడానికి, మరో ముఖ ద్వారం చర్చ్ / గుడి- పెళ్లి చేసుకోవడానికి, మరో ద్వారం హనీ మూన్ హోటెల్, నాలుగో వైపు హాస్పిటల్ – డెలీవెరీ కోసం అని చెప్పి నవ్వించాడు గైడ్.
బ్రహ్మాండమైన సెట్లు, సినిమా షూటింగ్, జరిపే విధానం చూపించారు. సందర్శకుల నుండి ఒక అమ్మాయిని పిలిచి షోలేలో హేమ మాలిని లాగా తయారుచేసి వేదిక మీద గుర్రాలు లేని ఉత్త బండిలో కూర్చో పెట్టారు. చేతిలోని చెర్నాకోలాతో ముందు వైపు గుర్రాలు ఉన్నట్టు ఊహించుకుని కొట్టమన్నారు. మరో ఇద్దరు పర్యాటకులను వేదిక పైకి పిలిచి ఆ బండిని అటు ఇటు కదప మన్నారు. ఆ వెనక తెర మీద గుర్రాల మీద దుండగులు వెంటాడుతున్న దృశ్యం కనబడుతున్నది. మొత్తం షూటింగ్ చేసి వేరే హాల్లో తెరమీద చూపించారు. అందులో అమ్మాయి బండిలో వేగంగా ముందుకు పోతుంటే వెనుక దుండగులు గుర్రాల మీద వెంటాడుతున్న దృశ్యం కనబడి అందరూ చప్పట్లు కొట్టారు.
ఇంకా ఎన్నో విశేషాలు చూసి స్టార్ హోటెల్ లో భోజనం చేసి, నీళ్ళతో నిప్పుతో చెలగాట మాడిన వాళ్ళను చూసి, మురిసి పోయారు. బాగా అలిసి పోయినా ఒక కొత్త మాయలోకంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి తో బయట పడ్డాము.
“అత్తా! అమెరికాలోని హాలివుడ్ కన్నా మన రామోజీ ఫిల్మ్ సిటీ నే బాగుందని అంటారు కదా” అన్నాడు మాధవి కొడుకు .
“ఏమో. నువ్వు చూశాక చెప్పు” అన్నాను.
“అక్కడ ఆభిప్రాయాలు రాసే పుస్తక లో ఎవరో రాసారు. నేను కూడా రాశాను ఈ స్టూడియో మనవాళ్ళకు గర్వ కారణం. అని అన్నది మాధవి కూతురు. “తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయంను వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ ఓటు వేయమంటే మన దేశంలో ఎక్కువమంది పట్టించుకొ లేదంటారు కదూ . పోయి ఆ వేసవిలో కన్యాకుమారి ,మధురై వెళ్ళాము. ఎంత గొప్ప గుడులు అవి.” మాధవి అంది.
“అవును . చాలా బాగున్నాయి.” అన్నారు పిల్లలు.
ఇంటికి వెళ్ళాక ఆరోజు ఇద్దరు నేను పడుకుంటున్న గదిలోనే పడుకున్నారు. మరునాడు నేను వెళ్ళి పోతానని నాతో కబుర్లు చెప్పాలని. తీరికగా నా ల్యాప్టాప్ లో మా ఇద్దరి పిల్లల ఫోటోలు, మావారి ఫోటోలు చూపించాను వాళ్ళకి.
ఈసారి వాళ్ళను కూడా పిలుచుకు రావాలి”అంది మాధవి.
” అవును అత్తా!”అన్నారు ఇద్దరూ.
“ముందు మీ వారు అన్న మాట ప్రకారం మీరు విజయవాడ రండి. “అన్నాను. ” నేను జి ఆర్ ఈ రాస్తున్నాను అత్తా! మంచి మార్కులు వచ్చి, మంచి యూనివర్సిటీ లో ఉపకార వేతనంతో సీట్ వస్తే నేను అమెరికా వెళ్లే ముందు మీ ఇంటి కి వచ్చి అందరినీ చూసి వెళ్తాను.” అన్నాడు మాధవి కొడుకు. ఆ రాత్రి నాకు బాగా అర్థం అయ్యింది నేను వసుంధర ఇంట్లో ఎందుకు ఉండలేకపోయానో? ఇక్కడ హాయిగా ఎందుకు ఉండిపోయానో! ఇల్లు ఎంత పెద్దది అయినా వసుంధర వాళ్ళకు ఇరుకుగా అనిపించడానికి కారణం తెలిసింది. డబ్బుకు మాత్రమే విలువ నిచ్చే పెద్ద అత్తయ్య పెంపకంలో, బంధుత్వాలకు, బాంధవ్యాలకు చోటు లేని ఆ వాతావరణంలో పెరిగిన వసుంధరకు ఇరుకైన మనసు, సంకుచిత భావాలు ఉండడం సహజ పరిణామమేమో! తన పిల్లలు కూడా అదే రకంగా ఉండడము కూడా వింత కాదు మరి. వాళ్ళ మనసు ఇఱుకు. దృక్పథం కూడా ఇరుకే. అందుకే అక్కడ నాకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. ఆప్యాయతకు మారుపేరైన చిన్నమామయ్య, అత్తయ్యల చేతులలో పెరిగిన మాధవి ఇల్లు చిన్నది అయినా మనసు విశాల మైనది. ఆ తల్లి గుణాలే పిల్లలకు వచ్చాయి. అమ్మలాగే వీళ్ళకూ బంధుప్రీతి వుంది. తాము పుట్టిన దేశం మీద గౌరవం వుంది . ఏ దేశానికి వెళ్ళినా ఈ పిల్లలు కొత్తను రెండు చేతులా ఆహ్వానించగలరు. అదే సమయంలో తమది అయిన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించ గలరు. నా సంతానం ఇలా పెరిగితే నేను గర్వ పడతాను. అనుకుంటూ హాయిగా నిద్ర పోయాను.

చేసిన పుణ్యం

రచన: డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

అరవింద శంషాబాద్ విమానాశ్రయం చేరేసరికి తెల్లవారు ఝాము మూడు గంటలయింది.
ఉదయం ఆరు గంటల ముప్పై నిముషాలకి విమానం బయల్దేరుతుంది. విదేశీ ప్రయాణం కనుక మూడు గంటల ముందే సామాను చెక్ ఇన్ చేయాలి. అరవింద కేవలం రెండు వారాలు సెలవు మీద ఇండియా రావడం వలన తాను రెండు సూట్ కేసులు తెచ్చుకునే అవకాశం ఉన్నా ఒక పెట్టే తెచ్చుకుంది. క్యాబిన్ లగేజ్ గా చిన్న సూట్ కేసు ఒకటి ఉంది.
రాత్రి ఒంటి గంటకే లేచి స్నానం చేసి ఇడ్లీ ,కాఫీ తయారు చేసింది అరవింద అత్తయ్య. కూకట్ పల్లి నుండి శంషాబాద్ రావడానికి అర్థ రాత్రి కూడా గంటన్నర పట్టింది.
చేర గానే ఫ్లాస్క్ లోని కాఫీ మూడు గ్లాసులలో పోసి ఆరవిందకు , తన భర్త కు, ఇచ్చి ఆవిడా తాగింది.
“విమానం ఎక్కగానే ఇడ్లీలు తినేయి”అని మరోమారు కోడలికి చెప్పింది.
అరవింద నాన్నకు ఉండేది ఒక్కడే తమ్ముడు. చిన్నాన్న ఆఖరి కూతురు పెళ్ళికి రావాలని నాన్న మరీ మరీ చెప్పడం వలన రెండు వారాలు సెలవు పెట్టి ఇండియాకు బయలుదేరింది అరవింద. పిల్లలకి స్కూల్ వుంది. వాళ్ళ బాధ్యత భర్త సందీప్ కు ఒప్పజెప్పి బయలుదేరింది. శంషాబాద్ లో దిగి నేరుగా కర్నూల్ వెళ్ళింది.
అమ్మానాన్నల తో ఒక వారం గడిపింది. పెళ్లి అనంతపురంలోజరిగింది గనుక వాళ్ళతో కలిసి వెళ్ళింది. అదయ్యాక అత్తగారింట్లో ఒక వారం వుందామని హైద్రాబాదు వచ్చింది. పదిహేను రోజులు పదిహేను క్షణాల్లా గడిచిపోయి అప్పుడే తిరుగు ప్రయాణం రోజు వచ్చింది.
బ్రిటిష్ ఏర్ వేస్ విమానంలో రాను పోను ఒకే సారి బుక్ చేసుకుంది. ఇక్కడి నుండి లండన్ కు , రెండు గంటలు అక్కడ ఆగాక ,లండన్ నుండి అట్లాంటాకు ప్రయాణం. ఇంచుమించు ఇరవై నాలుగు గంటలు. ఆదివారం చేరుతుంది. మర్నాడు సోమవారం ఆఫీస్ కు వెళ్ళ వలసిందే.
అత్తా మామలకు వీడుకోలు చెప్పి, లోపలకు వెళ్ళి సామాను చెక్ ఇన్ చేసి, సెక్యూరిటీ చెక్ ముగించుకుని, విశ్రాంతిగా కూర్చుంది అరవింద. ఇండియాకు బయలుదేరేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో తిరిగి వెళ్లేటప్పుడు అంత దిగులుగా ఉంటుంది. ప్రతీ సారీ అంతే. పోనీ అమెరికా నుండి వెనక్కి వచ్చేద్దామా అంటే ఆ సౌకర్యాలు, జీవన శైలి వదిలి రాబుద్ధి పుట్టదు.
అమెరికా నుండి వచ్చేటప్పుడు పెట్టె నిండా షాంపూలు, బాడీవాష్ లు, సెంట్ లు ఉంటాయి బంధువులకు ఇవ్వడానికి. తిరిగి వెళ్లే టప్పుడు ఆవకాయలు, తీపివంటలు, పిల్లలకు పైజామా కుర్తాలు,తనకు చుడిదార్లు ఉంటాయి.
నాన్నా అమ్మా, ఇంకో నాలుగు రోజుల్లో కాశి యాత్రకు బయలుదేరు తున్నారు. తాను దగ్గరుండి తీసుకు వెళ్ళాలని ఉంది గానీ సెలవు పొడిగించడం కుదరదు. ఇద్దరూ వయసైన వాళ్లే. దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడూ వాళ్ళ గురించిన దిగులే. వాళ్ళు ఒప్పుకుంటే అమ్మావాళ్ళని తనతో కూడా అట్లాంటాకు తీసుకు వెళ్ళ గలిగితే బాగుంటుంది అనుకుంది గానీ ,వాళ్ళు కాశీ యాత్రకు బుక్ చేసుకున్నారు.
ఆలోచనల నుండి తేరుకుని సెల్ ఫోనులో టైమ్ చూసింది అరవింద. ఆరు కావస్తోంది. ఇంకా బోర్డింగ్ కు పిలవలేదే అనుకుంటూ తల పైకెత్తి చూసింది. డిస్‌ప్లే బోర్డ్ లో విమానం బయలుదేరడం ఆలస్య మని కనబడు తోంది. అప్పుడే మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.
అరవిందకు విసుగ్గా అనిపించింది. ఈ ఆలస్యం గురించి ముందే తెలిస్తే అర్థరాత్రి లేచి పరిగెత్తుకు వచ్చే వాళ్ళం కాదు కదా అనుకుంది. ఇది విమానం రాక ఆలస్యం కావడం వలన జరిగిన డిలే కాదు. విమానం లో పబ్లిక్ అనౌున్స్ మెంట్ సిస్టమ్ పనిచేయడం లేదుట.
ఇంటికి ఫోను చేసి విషయం చెప్పింది. తొమ్మిది కావస్తుంటే కావలసిన వాళ్ళు వెళ్ళి ఫలహారాలు తినవచ్చునని , అసౌకర్యానికి మన్నించమని మళ్లీ చెప్పారు.
అరవింద చుట్టూ చూసింది. పెద్దా చిన్నా అందరు ఆలస్యం గురించే మాట్లాడు కుంటున్నారు. గంటలకొద్ది ఇక్కడ కూర్చో పెట్టి నందుకు కనీసం టిఫిన్ పెట్టించారు అంటోంది ఒక పెద్దావిడ. కొంతమంది ఇళ్లకు ఫోను చేసి దిగులుగా మాట్లాడుతున్నారు.
ఆరుగంటల ఆలస్యం తరువాత ఎట్టకేలకు పన్నెడు గంటలకు ఆకాశంలోకి ఎగిరింది లండన్ వెళ్లే బ్రిటిష్ ఏర్ వేస్ విమానం.
. . . . . . . . . . . . . . . . . . .

అనుకున్నట్టుగానే లండన్ హీత్రూ విమానాశ్రయం చేరేసరికి అక్కడినుండి అట్లాంటాకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ ఎప్పుడో వెళ్లిపోయింది. ప్రాణం ఉసూరు మంది అరవింద కు. మర్నాడు మధ్యాన్నం దాకా లండన్ లో ఉండాల్సిందే.
కౌంటర్ దగ్గర అంతా హడావిడి. అరవింద వెళ్ళి పాస్ పోర్ట్ ,బోర్డింగ్ పాస్ చూపించి విషయం వివరించాక ప్లేన్ డిలే వలన ఆగిపోవలసి వచ్చిన ప్రయాణీకులకు హోటెల్ షెరాటన్ లో బస ఏర్పాటుచేశామని చెప్పి , రాత్రికి మార్చుకోవడానికి పైజమా షర్ట్, చిన్న పిల్లొ లాటివి పెట్టిన కవరు అందించారు. అవి తీసుకుని పక్కకు వచ్చింది. అరవింద వెనుక నిలబడిన ఒక పెద్ద వయసు ఆమె క్కౌంటర్ లో వాళ్ళు అడిగినది అర్థం కాక జవాబు చెప్ప డానికి భాష రాక బెదురు గా అటు ఇటు చూస్తోంది. అరవింద ముందుకు వెళ్ళి ఆమెను తెలుగులో పలుకరించింది. ఆమె పాస్‌పోర్ట్ , టికెట్ తాను తీసుకుని వాళ్ళకు వివరంగా చెప్పింది. ఆమెకు అదే హోటెల్ లో రాత్రికి వసతి ఇచ్చారు.
అదే వరుసలో నిలబడిన మరో ముగ్గురు యాభై పైబడిన వయసు స్త్రీలు అరవింద సహాయం కోరారు. వాళ్ళలో ఒక్కరికీ ఇంగ్లీష్ రాదు. పిల్లలు అమెరికాలో ఉన్నారు. రమ్మని ఏర్పాట్లు చేశారు. ప్రయాణంలో ఇటువంటి ఆటంకం వస్తుందని అనుకోరు కదా. అందరి తరపున తానే మాట్లాడి , అదే హోటెల్ లో వసతి తీసుకుని, అందరినీ వెంట బెట్టుకునిబయటకు వచ్చి షటల్ లో ఎక్కి హోటెల్‌కు చేరింది.
“నువ్వు ఉండే చోటే మాకు గది అడుగమ్మా”అని ముందే చెప్పేశారు వాళ్ళు నలుగురు. అల్లాగే ఎలివేటర్ లో వాళ్లని కూడా తీసుకు వెళ్ళింది. అక్కడ గది తలుపులు తెరవడానికి అరవిందే కార్డులు స్వైప్ చేసింది.
రాత్రి భోజనానికి ఆ నలుగురిని తనతో బాటు కిందికి తీసుకు వచ్చింది. మళ్లీ వాళ్ళని గదుల దగ్గర వదిలి తన రూము లోకి వెళ్ళి పడుకుంది.
అర్థరాత్రి తలుపు మీద దబ దబ చప్పుడు వినబడి తలుపు తెరిచింది. ఆ అంతస్తులో చివరి గదిలో ఉండే ఆమె కంగారుగా లోపలికి వచ్చింది.
“బయట ఏదో చప్పుడు వినబడి గదిలో తలుపు తీసుకుని బయటకు వచ్చానమ్మా. తలుపు తాళం పడిపోయింది. కార్డ్ లోపలే ఉంది ఎలా ఇప్పుడు?”ఆందోళనగా అడిగింది ఆమె.
”పరవాలేదు. రిసెప్షన్ కి ఫోను చేస్తాను. “అని జరిగిన విషయం కింద కౌంటర్ లో వాళ్ళకు చెప్పింది. వెంటనే వాళ్ళు వచ్చి తలుపు తెరిచారు.
“అమ్మాయీ! నువ్వు లేకుంటే మా గతి ఏమయ్యేదో” అన్నది ఆమె ఆరవిందను కౌగలించుకుని.
మర్నాడు ఉదయం ఫలహారం అందరు కలిసే చేశారు. మళ్లీ షటల్ లో అందరినీ విమానాశ్రయానికి తీసుకు వచ్చింది. . విమానం లో కూడా వాళ్ళు నింపవలసిన ఫామ్ లు కూడా అరవింద చేతికే ఇచ్చారు వాళ్ళు.
పన్నెండు గంటల ప్రయాణం చేసి బ్రిటిష్ ఏర్ వేస్ విమానం వాళ్ళను క్షేమంగా అట్లాంట చేర్చింది.
అరవింద తప్ప మిగతా అందరు వాళ్ల సామాను తీసుకుని బయటపడ్డారు. అరవింద తెచ్చుకున్న ఒక్క సూట్ కేసు ఎక్కడో తప్పి పోయింది. సందీప్ తో కలిసి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి అరవింద బయటకు రావడానికి గంట పట్టింది. బయట ఆ నలుగురు స్త్రీలు అరవింద కోసం కాచుకుని ఉన్నారు. ఆమెను చూడగానే తమ కోసం వచ్చిన కొడుకులకు, కూతుళ్లకు పరిచయం చేసి అరవింద ఆదుకోక పోతే తమ పాట్లు భగవంతుడికే ఎరుక అంటూ గొప్పగా చెప్పారు.
”అయ్యో ఆంటీ!నేను చేసిందేమీ లేదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు ‘అవసరం లో ఉన్నవారికి మన చేతనయిన సహాయం చేయడం కనీస ధర్మం ‘ అని. మీతో బాటు వున్నాను గనుక చిన్న సహాయం చేయగలిగాను. మీరు నా కోసం ఇంత సేపు కాచుకుని వున్నారు. మీకే నేను థాంక్స్ చెప్పాలి. “అంది అరవింద.
వాళ్ళ పిల్లలు అరవింద కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందులో ఒక ఆమె తన పెట్టె తెరచి అందులో ఉన్న డబ్బా లో నుండి కొన్ని లడ్డూలు కవరులో వేసి అరవింద చేతిలో పెట్టింది”కోడలి సీమంతం కోసం తెచ్చాను. నీవు రెండు తింటే నాకు తృప్తి”అంది.
ఇంకొక ఆమె”మా అందరికీ సహాయ పడిన నీ సూట్ కేసు పోవడం అన్యాయం.”అంది.
“ఎక్కడికీ పోదు ఆంటీ. రేపటి కల్లా ఇంటికి తెచ్చి ఇస్తారు. అని నవ్వింది అరవింద. నలుగురు వాళ్ళ ఫోను నంబరు ఇచ్చి అరవింద నంబరు తీసుకున్నారు.
మరొకసారి అరవింద కు థాంక్స్ చెప్పి వెళ్లారు.

. . . . . . . . . ———

మరునాడు అరవింద సూట్‌కేసు ఇంటికి వచ్చింది.
రెండు రోజుల తరువాత అరవింద మనసు కలత పదే కబురు వచ్చింది ఇండియా నుండి. అరవింద అమ్మా నాన్నలు క్షేమం గా బెనారసు చేరారు. అయితే ట్యాక్సీలో బ్యాగ్ మరిచి పోయారుట. అందులో వాళ్ళ పాస్ పోర్ట్ లు , డబ్బు అన్ని ఉన్నాయి. హోటల్ కి ముందే ఆన్‌లైన్ లో డబ్బు కట్టేసారు కనుక అక్కడ దిగారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారుట. అరవిందకు ఈ వార్త బాధ కలిగించింది.
“ఎలా సందీప్ ఏం చేద్దాం? కాశీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు.”అంటూ రాత్రి నిద్ర పోకుండా కూర్చుంది.
బంధువులకు ఫోను చేసి డబ్బు పంపమన్నామని, పాస్ పోర్ట్ విషయంగా మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నామనీ చెప్పారు.
రాత్రి అంత నిద్ర పోకండ హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చుంది అరవింద అమ్మా నాన్నల పాస్పోర్ట్ దొరకాలని.
మర్నాడు మళ్లీ ఫోను చేశారు. అక్కడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ అని అరవిందతో బాటు ఎల్ ఎల్ బి చదివాడట. “మేము అమ్మాయి అరవిందతో బాటు కర్నూల్ నుండి అమెరికా వెళ్ళ వలసింది. కాశి యాత్ర కోసం మానుకున్నాము.”అన్నాము.
”మీ అమ్మాయి 2001 లో కర్నూల్ లో ఎల్ ఎల్ బి చదివిందా? అని అడిగి మేము అవును అనగానే అయితే మీ అరవింద మా బ్యాచ్లో చదివిన అరవింద అయి ఉండాలి. మీ పాస్ పోర్ట్ ఉన్న బ్యాగ్ మీకు వెదికి పెట్టే భాద్యత నాది అంకుల్. మీరు నిశ్చింత గా ఉండండి. ‘ అంటూ భరోసా ఇచ్చాడు.”అప్పుడే బ్యాగ్ దొరికేసి నంత సంతోషంగా చెప్పాడు అరవింద నాన్న.
నాన్నగారు చెప్పిన విశ్వనాథ్ అనే పేరు వినగానే తన బాచ్ లో పొడుగ్గా దృఢంగా ఉండే విద్యార్థి కళ్ల ముందు మెదిలాడు అరవింద కు. “దేవుడా ఏదో దారి చూపించావు”అని మనసు లోనే దండం పెట్టుకుంది.
ఆశ్చర్యం గా మరునాడే బ్యాగ్ దొరికి నట్టు ఫోన్ వచ్చింది. ఆ ట్యాక్సీ లో ఎక్కిన మరొక ప్రయాణికుడి సామానులోకలిసి పోయిందా బ్యాగ్ . ఆయన మూడు రోజులు ఆ ట్యాక్సీ అతని కోసం తిరిగి, చివరికి తనకు పరిచయం ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ కు విషయం చెప్పి బ్యాగ్ ఇచ్చాడు ట. విశ్వనాథ్ వెంటనే అరవింద తండ్రిని పిలిపించి అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయేమో చూసుకోండి అంటూ బ్యాగ్ అందించాడు.
” నాన్నగారూ! మీరు మా చిన్నపుడు ఒక మాట చెప్పారు.”అవసరం ఉన్నవారికి మన చేత నయిన సహాయం చేయడం మన ధర్మం. అదే మనని రక్షిస్తుంది”అని. అదే ఇప్పుడు జరిగింది.”
“దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా”అంటూ తనని ఆశీర్వదించిన ఆ నలుగురు స్త్రీలను తలచు కుంటూ ఆనందంగా అంది అరవింద
“అవునురా తల్లి. ‘చేసిన పుణ్యం చెడని పదార్థం ‘అని కూడా చెప్పారు మన పెద్దలు.”అన్నారు అరవింద నాన్నగారు చెమర్చిన గొంతుతో.
——— ———- ———