April 27, 2024

వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం

పంపినవారు : శ్రీధర్ అయల

 

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలతో పాటు కొన్ని విచిత్ర కథలని కూడా వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ఉగాది ప్రత్యేక సంచిక ౨౭.౦౩.౧౯౬౩లో  ప్రచురింప బడింది..}

 

మహారాణి సుమిత్రా దేవి అంతః పురంలో, ‘చేటీ జనాధ్యక్షురాలు వసుంధర’  సంభ్రమంతో మహారాణి సన్నిధానానికి వెళ్లుతున్నది. ఆమె నడక లోని సంభ్రమం పరిచారికా వర్గానికి హడలు కొడుతున్నది ! వసుంధర మహారాణిని సంధించింది.

 

సుమిత్రా దేవి వ్యాఘ్ర చర్మంచే కప్పబడిన పెద్ద ఆసనంపై కూర్చొని ఉంది.

 

తెల్లని వస్త్రాలను ధరించి, ఆమె వేదిగతాగ్ని జ్వాల వలె పవిత్ర భీకరంగా కన్పిస్తోంది !

 

“ వసుంధరా ! ఏం విశేషం ?”

 

“ మహారాణీ ! చాలా రహస్యమైన విషయాన్ని తమతో మనవి చేయడానికి వచ్చాను.”

 

సుమిత్రా దేవి చుట్టుప్రక్కల ఉన్న పరివారికా వర్గాన్ని సాభిప్రాయంగా చూసింది. అందరూ ఆ చోటు విడిచి చల్లగా జారుకొన్నారు ! అంతః పురం గోడలకు చెవులుంటాయన్న సత్యం వసుంధర వంటి అనుభవఙ్ఞులకు తెలియని విషయం కాదు ! ఆమె మహారాణికి దగ్గరగా వెళ్లి, శ్వాస  తగలనీయ కుండా హస్త తలాన్ని అడ్డాంగా పెట్టుకొని , మహారాణి చెవిలో గుసగుసలాడింది.

 

“ హా ! ఎప్పటినుంచి ?” అని అడిగింది సుమిత్రా దేవి. ఆ ధ్వనిలో ఆందోళన, భయం, శోకం, మిళితమై ఉంది.

 

“ ఈ రోజే తెలిసింది.”

 

“ మరెవరికైనా ఈ విశయం తెలుసా ?”

 

“ బ్రహ్మకు కూడా తెలియదు, మహారాణీ !”

 

“ వసుంధరా ! నేను భగవాన్  వసిష్ఠుల వారిని రహస్యంగా చూడాలి.”

 

“ చిత్తం,మహారాణి ! నేనే రహస్యంగా వెళ్లి తీసుకొని వస్తాను.”

*****************

 

ఆనాడు మధ్యాహ్నం మైత్రావరుణి వసిష్ఠ మహర్షి, సుమిత్రా సదనానికి వెళ్లారు. సుమిత్రా దేవి గురు సన్నిధానంలో వసుంధర చెప్పిన రహస్య వృత్తాంతాన్ని చెప్పింది. వసిష్ఠ మహర్షి అంతా సావధానంగా విన్నారు.

 

“ రాజమాతా ! ఇలాంటి సందర్భాలలో మనం కఠినమైన రాజనీతిని అవలంబించాలి. వసుంధర , నీవు, నేను – ఈ ముగ్గురికీ తక్క, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ! ఇదంతా సుఖాంతంగానే పరిణమిస్తుందని  నా అంతతాత్మ చెబుతున్నది. ఈ సాయంకాలమే ఒక ప్రకటన చేయించాలి. ప్రకటన ఈ విధంగా ఉండాలి. – “ యువరాణి ఊర్మిళ ’ దీర్ఘమైన యోగనిద్రలో ఉంది ! కాబట్టి ‘ లక్షణావతి సౌధం’ దగ్గర ఎట్టి శబ్దమూ ఎవరునూ చేయరాదు. చేటీ జనాధ్యక్షురాలు వసుంధర తక్క మరెవరును సౌధం లోనికి వెళ్లకూడదు.అలా వెళ్లడానికి ప్రయత్నించిన వారు కఠినంగా శిక్షింప బడుదురు. ఇదే శ్రీరామ పాదుకా ప్రతినిథి శతృఘ్నుల వారి రాజ శాసనం” అని.

 

“ మహాత్మా ! మీరు చెప్పినట్లే చేస్తాను. కాని శతృఘ్న కుమారుని — ” అని మాట మధ్యలో ఆపేసింది సుమిత్రా దేవి.

 

“ రాజమాతా ! ఆ పనిని నేను నెరవేరుస్తాను.”

 

భగవన్ వసిష్ఠ మహర్షి వెళ్లిపోయాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజశాసనం ప్రకటించ బడింది.

 

*******************

 

“లక్ష్మణా ! ఇదో చూడు, గౌతమి గమన విన్యాసం ఎంత మనోహరంగా కన్పడుతున్నదో ! ఒక చోట ఎగిరి గంతులు వేస్తున్నది, వేరొక చోట స్థాయీభావాన్ని  పొందిన గాన ప్రవాహం వలె గంభీరంగా నడుస్తున్నది. ఇక్కడ చూడు,  తాళగతులను అవగాహన చేసుకొన్న మహానర్తకి వలె భీజర ఘట్టనలతో రాళ్లపైనుండి దొర్లుతున్నది !  ఈ ప్రాంతం లోనే చదునైన స్థలం చూసి, మనం ఆశ్రమ నిర్మాణం చేసుకొంటే బాగుంటుంది. ఏం సీతా ! నీవేమంటావు ?”

 

సీతాదేవి కోదండ పాణి కోదండాన్ని నల్లని ఆకు పసరుతో బాగా రుద్ది మెరుగు దిద్దుతూ, తన మనోహరుని చూసి —“ప్రాణేశ్వరా ! మీ కంటికి ఏది ఇంపుగా ఉంటుందో, అది నా కంటికి శతాధిక మాధుర్యాన్ని చేకూర్చేదిగా ఉంటుంది ! ఈ ప్రాంతం  ఎంతో రమణీయంగా ఉంది !” అని అన్నది.

 

లక్ష్మణుడు గండ్ర గొడ్డలిని చేత ధరించి భూమిని చదును చేయడానికి పూనుకొన్నాడు. ఇంతలో మధురాతి మధురమైన వేణునాదం వాయు మండలంలో అలలను రేపుతూ వారి కర్ణ కుహరాలలో ప్రవహించింది. ఎంతో కమ్మగా ఉంది ఆ నాదం.!

 

“ చూచావా ,సీతా ! విధాత అద్భుత సృష్టి !  సామాన్యమైన వే దండంలో ఎంత తీపైన నాదం ఉబుకుతోందో !  అదే వేణు దండం మంత్ర పూతమైనప్పుడు నిప్పులు గ్రక్కుతుంది , ప్రళయాన్ని కూడ రేపుతుంది !” అని అంటూ లక్ష్మణుని వైపు తిరిగి, శ్రీరాముడు “ లక్ష్మణా ! వెళ్లి ఆ గానం ఎవరి వాయుపూరితం లోంచి నిర్గమిస్తూందో చూచుకొని రా ! ఆ బండ రాతి మీద మేమిద్దరం నీ రాకకై ఎదురు చూస్తూ కూర్చుంటాం” అన్నాడు.

 

లక్ష్మణుడు మితభాషి ! వానికి వదినె, అన్న – ఇద్దరూ దైవ స్వరూపులు ! వారి ఆఙ్ఞ వానికి శిరసాధార్యం. వెంటనే శబ్దం వస్తున్న దిక్కును అనుసరించి వెళ్లడానికి తయారయ్యాడు..

 

“ లక్ష్మణా ! ఈ గోదావరికి అవతల ప్రదేశమంతా ‘ జనస్థాన’  రాజ్యానికి సంబంధించినది ! రాక్షస రాజు ‘ ఖరుడు’ దానిని పరిపాలిస్తున్నాడు ! ఇచ్చట ఋషి గణం చెప్పిన మాటను మరచిపోవద్దు. ఈ శబ్దం ఒక వేళ రాక్షస మాయగా ఉండనూ వచ్చు.” అన్నాడు రాఘవుడు.

 

“ అన్నయ్యా ! మీ తమ్ముని భుజ బలాన్ని శంకిస్తున్నారా ?” వాని వృషభాక్షాలలో ఎరుపు జీర మెరిసింది.

 

శ్రీరాముడు మందహాసం చేసాడు. సీతా దేవి ఓరకంటితో సాక్షేపంగా భర్త వైపు చూసింది.

 

“ సౌమిత్రీ, కాదయ్యా వట్టి చేతుల్తో వెళ్లుతుంటే  చెప్పాను. ఆయుధ ధారివై వెళ్లు.”

 

లక్ష్మణుడు రామాఙ్ఞను శిరసావహించి వెళ్లాడు.

 

*******************************

 

ఒక నల్లని యువతి గుబురుగా పెరిగిన అశోక వృక్షం క్రింద రాతిపై కూర్చొని ఉంది. ఆమే వేణువుని పూరిస్తున్నది !

 

ఆమె మైకట్టు ,అవయవాల్లో  పొంగి పొరలుతున్న లావణ్య ఝురి , –ఇవి ఆ యువతి వయస్సుని కప్పి ఉంచుతున్నాయి. ఆమె స్తన మిథునం చక్రవాక మిథునం వలె అన్యోన్యం బుజ్జగించుకొంటూ, వీపున ముడి వేయబడిన నల్లని ఉత్తరీయంచే బాగా బిగించబడి ఉంది. కుచ్చెళ్లు పోసి కట్టుకొన్న నల్లని వస్త్రం ఆమె కటిప్రదేశం నుంచి విరివిగా వ్రేలాడుతున్నాది. నల్లని ఉత్తరీయాన్ని వల్లెవాటు వేసుకొని ఉంది ఆమె ! ఆమె కండ్లు నల్ల కలువ మొగ్గల్లాగు సోగదేరి చూడ సొంపుగా ఉన్నాయి. ఆమె ముక్కు కండ్లను భజిస్తున్న సంపంగి పువ్వువలె కన్పిస్తున్నది ! ఆమె  నుదుటిపై ఎర్రని సింధూర తిలకం రాణిస్తున్నది. ఆమె భుజదండాలు సౌకుమార్యాన్ని ఒలక పోస్తున్నా, అంతస్సారం కలవై కన్పడు

తున్నాయి !

 

లక్ష్మణుడు ఆమెను చూచాడు.‘ లోకమాత కాళికా దేవి కాదు గదా !’ అని సందేహించాడు. “మాతా, ఎవరవు నీవు ?” అనే  ప్రశ్న ఆ యువతి నాదోపాసనను కలచింది.

 

ఆమె లేచి నిలబడింది. ఆమె మంచి ఎత్తరి. ఒంటి పేట ముత్యాల సరం ఆమె నల్లని శరీరంపై  జిగ జిగ మెరుస్తున్నది.

మెడలో నల్ల పూసల కుత్తిగంటు కన్పించక పోయినా, దాని లోని బంగారం తళతళమని మెరుస్తున్నది ! ఆమె ముంజేతి

శంఖ వలయాల్లోని చిరు మువ్వలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి.

 

ఆమె లక్ష్మణుని చూచి ముఖం దించేసుకొంది.  క్రిందకి వంగి బండరాతిపై సుద్దముక్కతో  “ నా పేరు నీలి” అని వ్రాసింది.

లక్ష్మణుడు నవ్వాడు. “ బాగు.విఙ్ఞులు నీలిమాకాశాన్నే ‘ అదితి’ అని చెప్తారు. దాన్నే ‘దేవమాత ’ అని కూడ పేర్కొంటారు నా కంటికి ,‘ఓ నీలీ ! నీవు దేవమాత అదితివిగా కన్పిస్తున్నావు !? అని చెప్పాడు తృప్తిగా ఆమెనే చూస్తూ.

 

నీలి బండరాతిపై కొన్నిపంక్తుల్ని వ్రాసింది “ నేనేమీ అంత గొప్పదాన్ని కాదు. పచ్చి రక్త మాంసాదులతో కూడిన మనిషిని. నన్ను మీరు గౌరవించనక్కర లేదు. నేనొక నిషాద స్త్రీని ! మీ చరణ దాసిని.”

 

‘ చరణదాసి’ అన్న మాటని విని సౌమిత్రి  కంపించాడు. క్రోధంతో వాని ముఖం గైరిక ధాతువు వలె ప్రకాశించింది. “ నీలీ ! ఆ పదాన్ని ఉపసంహరించుకో, నేను వివాహితుణ్ని.”

 

నీలి నవ్వింది. వ్రాసిన వాటిని చెరిపి తిరుగ ఇలా వ్రాసింది,“ ప్రభూ ! ఎందుకంత కోపం ? ఆ పదాన్ని తుడిచేసాను లెండి. నేనూ వివాహిత స్త్రీనే ! కాబట్టి నా  మాటలో చెడు ఉద్దేశం లేదు.”

 

“ నీలీ, సంతోషించాను. నీవు ఒంటరిగా ఇక్కడికి ఎందుకొచ్చావు ? ఏమి, నీవు మాట్లాడ లేవా ?”

 

నీలి మరల ఇలా వ్రాసింది. “ ప్రభూ  ! నేను మూగదాన్ని. అయినా కొద్దిపాటి చదువు కొన్నాను. నా అన్న ఇకడికి యాభై యోజనాల దూరంలో ఉన్నాడు. అంటే  పంపా సరోవరం దగ్గరన్నమాట ! భగవత్స్వరూపులైన  మీ సేవ చేయాలని నాకు బుధ్ధి పుట్టింది. నా అన్న దానికి సమ్మతించాడు. నేను మీ నివాసం కొరకు ఇక్కడికి శతపత్ర దూరంలో ఆశ్రమ నిర్మాణం చేసాను. మీరు దానిని పావనం చేయాలని నా ప్రార్థన !”

 

“ నీ భర్త ఒప్పుకొన్నాడా ?”

 

నీలి నిశ్శబ్దమైన నిండు నవ్వు ను ప్రదర్శించింది. ఆమె కండ్లు మిలమిలమని మెరిసి పోయాయి. భర్తంటే స్త్రీకి అపూర్వమైన వస్తువ కాబోలు , భర్త పేరు వినగానే ఈ నల్లని పిల్ల ఎంత చక్కగా నవ్వింది ! కండ్లలో ఎంత ఆనందం తాండవించింది. ’ అని లోలోపలే తలంచాడు సౌమిత్రి.

 

నీలి మరల వ్రాసింది,“ నా భర్త విరాగి. ముని వృత్తిలో ఉన్నారు ! నేను మూగదాన్ని కాదా ?” నీలి కండ్లు చెమర్చాయి.

 

అనుతాపంచే సౌమిత్రి  ముఖం వాడింది. “ నీలీ ! నీ భర్త చర్య సమర్థనీయం కాదు.’నీవు మూగదానివైనా ,నీ సౌందర్యంలో మాధుర్యం ఉంది !”

 

నీలి సిగ్గుదొంతర్లచే పులకరించింది.

 

********************

 

సీతా రాములు క్రొత్తగా ,నీలిచే నిర్మింపబడిన ఆశ్రమంలో కాపురం పెట్టారు. గోదావరి నది ప్రక్కనే ఎత్తయిన చదును జాగాలో ఆశ్రమం నిర్మింప బడింది. ఆశ్రమం చుట్టూ వెదురుదడి వేయబడి ఉంది. ఆ దడిని పెనవేసుకొని  రకరకాల

పుశ్పలతలు ఉన్నాయి. ఆశ్రమం నల్లసాని రాతి పలకలచే కట్టబడి ఉంది. నేల కూడ నల్లసాన రాతిపలకలచే నున్నగా గచ్చువలె నిగనిగలాడుతున్నది !

 

ఆశ్రమ ముఖద్వారం దగ్గర పెద్ద  మంచె కట్టబడి ఉన్నది. ఆ మంచె బలమైన సాల వృక్షాల మొదళ్లచే  చాల పటిష్టంగా కట్టబడింది. మంచె పైన విశాలమైన గది ఉంది ! గదికి నలువైపులా కిటికీలు ఉన్నాయి. వెదురు గోడలు వివిధ చర్మాస్తరణాలై శీత వాతాతపాలకు తట్టుకోగలవిగా ఉన్నాయి.మంచెపై ఎక్కి వెళ్లడానికి చెక్కలచే అమర్చబడ్డ పావంచాలు ఉన్నాయి,

 

అది లక్ష్మణుని నివాస స్థలం ! అది సైనక పర్యవేక్షణ శిబిరంలాగ ఉంది. ఈ ఆశ్రమాన్ని నిర్మించిన మహాశిల్పి – నిషాద స్త్రీ నీలి !

 

సీతా దేవి తమ ఆశ్రమాన్ని చూసి చాలా ఆనందించింది. “ నాథా ! మన అంతః పుర నందన వనం కేవలం కృత్రిమ సౌందర్యం కలది. ఇచ్చటి నందన వనంలో ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉందో చూడండి. నా చెల్లెలు ‘ ఊర్మిళ’  సౌందర్యోపాసకురాలు ! ఆమె గాని ఈ శోభని చూస్తే  ఎంత మురిసిపోనో గదా ! మరిదిని చూచినప్పుడు నాకు జాలి వేస్తుంది  సుమండీ ! పాపం జత విడిచిన పక్షిలాగున్నాడు !” అని పలికింది.

 

“ ప్రియే ! వానప్రస్థాశ్రమ నియమాలు పాటించవలసిన మాకు జత పక్షి ఉన్నా లేకున్నా ఒకటే కదా !” అన్నాడు రఘువీరుడు.

 

“ వాన ప్రస్థాశ్రమ ధర్మాలు పాటించ వలసిన నిర్భందం మీకు గాని, మా మరిదికి లేదే ! అతడు కావాలంటే ఊర్మిళను తెచ్చుకొని ఈ మనోహర ప్రాంతంలో కేళి వినోదాలని అనుభవించవచ్చు కదా !” అని నవ్వింది సీతా దేవి.

 

మల్లిపొదల మధ్యనున్న జలయంత్రాన్ని పరీక్షిస్తున్న సౌమిత్రి  ఈ మాటను విని గతుక్కుమన్నాడు.

 

“ ఓయ్, తమ్ముడూ ! ఇలా రా, నీ వదినె ఏమంటున్నదో విన్నావా ? నీవు ఊర్మిళను తెచ్చుకోవడంలో మాకేం ఆక్షేపణ  లేదోయ్ ! ”

 

అన్నా తమ్ముళ్ల  సంభాషణకు  మందహాసం , ముఖమంతా ఆవరించగా నీలి అరుగు వారగా నిలబడి వింటున్నది.

లక్ష్మణుని ముఖం  వాడిన పద్మంలాగై పోయింది. ఆ వీరుని కంటి వెంట కన్నీటి బొట్లు నేలబడి చితికాయి. తన్ను తాను సమాధానం చేసుకొని  కన్నీటిని కొనగోటితో ఎగజిమ్మి , నవ్వుతూ అన్నగారిని చూసి ఇలాగన్నాడు.

 

“ వదినె గారితో చెప్పంది అన్నాయ్యా ! సుఖ దుఃఖాలు రెండింటి లోనూ సౌమిత్రికి అన్నగారితో సమవాటా ఉంది. అదిన్నీ గాక  సౌమిత్రికి ధనస్సు వంచడం, నారిని ఖోతికి ఎక్కించడం , వర్ష కాలపు  వాన జల్లు వలె భాణాలను చిమ్మడం ఇత్యాది వీర క్రియల్లోనే నేర్పు ఉందే కాని  ప్రియురాలితో  కలిసి  కేళిని సల్పడం అలవాటు లేదు.”

 

శ్రీరాముడు తన ప్రియురాల్ని చూచి నవ్వాడు.

 

“ మరిదీ ! ఆ విషయంలో నీవేమంత శ్రమ పొందనక్కర లేదు. మా ఊర్మిళ  ఆ విద్యని సంపూర్ణంగా నేర్పగలదు.”

 

సౌమిత్రి తల వంచుకొని , “ తల్లీ ! రాళ్లని చెక్కడంలో సిధ్ధహస్తురాలైన మీ చెల్లెలు భర్తని కూడా ‘తరిణె’ పట్టగలదన్న సత్యం మీ నోటివెంట నాకు ఇప్పుడే తెలిసింది ! సానికి నేను కృతఙ్ఞుణ్ని,” అన్నాడు.

 

సీతా దేవి ఉల్లాసంగా నవ్వింది. నీలి కూడ దొంగ చాటుగా నవ్వుకొంది.

 

“ లక్ష్మణా ! మా పర్ణశాల కంటె నీ శిబిరం నూతన ఫక్కీలో కట్టబడింది. ఇంతకీ ఈ పట కుటీర  నిర్మాత, నీలీ దేవికి మనం ధన్యవాదాల్ని సమర్పించాలి.;; అని చెప్పి నీలి వంక చూశాడు శ్రీరాముడు.

 

నీలి ముఖం నీలోత్పలం లాగు మెరిసింది. ఆమె శ్రీరాముని పాదాలకు వంగి నమస్కరించి, రాతి ముక్కతో రాతి బల్లపై వ్రాసింది.“  ప్రభూ ! శరణు కోరుతున్నాను .” అని.

 

రాఘవుని భుజాలు పొంగి పోయాయి. అతడు సరణన్న వారికి పెన్నిధి వంటి వాడు కదా !

 

“ భద్రే ! చెప్పు, నేను నీకు శరణు ప్రసాదించాను. ఏం కావాలో నిర్భయంగా చెప్పు. అది దేవ దానవ సాధ్యమైనదైనా ఈ దాశరథి ఆచరించి తీరుతాడు.

 

నీలి రాతి పలకపై వ్రాసింది.“ ప్రభూ ! నన్ను మీరు మీ ఆశ్రమ పరిచారికగా స్వీకరించండి.”

 

శ్రీరాముడు తటపటాయించి  సీత వంక చూచాడు. “ నీలీ ! నీ సేవను ప్రభువులు అంగీకరించారు.” అని సమస్యను పరిష్కారం చేసింది సీత.

 

****************

 

కొన్ని మాసాలు సీతా రాములు ఆశ్రమ వాసాన్ని నిశ్చింతగా గడిపారు.

 

ఒక రోజు రాత్రి లక్ష్మణుడు తన గదిలో  పచారు చేస్తున్నాడు. వాని చేతిలో నారి ఎక్కుపెట్టిన ధనస్సు ఉంది.  గ్రుడ్డి వెన్నెల దీనంగా ప్రసరించి ఉంది. ఆశ్రమానికి  కొన్ని గజాల దూరంలో నది ఒడ్డున  ఎవరో ఏదో పనిని తదేక దీక్షతో చేస్తున్నట్లు పసిగట్టాడు సౌమిత్రి.  సౌమిత్రి వింట భాణాన్ని సంధించాడు. తీక్షణంగా చూచాడు. చటుక్కుమని  విల్లును క్రిందకి దించేసాడు. కారణం ? నీలి ఆకృతి ఆ వెన్నెట్లో  వానికి కన్పించింది.

 

‘ ఈ నల్ల పిల్ల ఏం చేస్తోందో ?’ అని సందేహించి  గ్రుడ్డి వెన్నెల్లో  చక చకమని తిరుగుతున్న నీలిని తదేక దీక్షతో చూడ సాగాడు.

 

ప్రకృతిలో , హృదయాహ్లాదకర  వస్తువుల్లో  సుందర యువతి అగ్రస్థానం వహిస్తుంది. ప్రకృతినే స్త్రీగా వర్ణించి తృప్తిని పొందక , కవులు దాని లోని ఒక్కొక్క వస్తువునూ స్త్రీల అవయవాలతో పోల్చి వర్ణిస్తారు. ముగ్ధత్వం, ప్రౌఢత్వం, అనే జంత పదాలు ప్రకృతిలోని ప్రతీ వస్తువుకూ సామాన్యమై ఒప్పుతుంటాయి. రెండింటిలోనూ ప్రత్యేకత ఉంటుంది. అనుభవించే వ్యక్తి సర్వ శక్తులనూ పూర్తిగా తన వశం చేసుకొంటుంది. ప్రౌఢావస్థను పొందిన వస్తువు !

 

నీలి ప్రౌఢావస్థను పొందిన పూర్ణ  సుందర వస్తువు. అర్థ నగ్న  శరీరంతో నిరాటంకంగా నది ఒడ్డున సంచరిస్తున్న చక్కని, చిక్కని నల్లని చుక్క— నీలి ! ఆమె అవయవాల  వంపు సొంపులు ధీర యువకుల హృదయంలో ధారాళంగా ప్రవేశించి స్పందాన్ని  పుట్టించ తగినవై ఉన్నాయి. మహాధీరుడైన  లక్ష్మణుని  హృదయాకాశంలో  తటిత్తులాగు ఒక విపరీత భావం మెరిసింది ! నియమ కంచుకంతో  బెహ్మచర్య దీక్షను పాటిస్తున్న  ఆ ధర్మ వీరుని  హృదయంలో  ఆ భావం చప్ప జారి ఫోయింది. ఆరిపోయిన కొరకంచు దూమాన్ని  కొంత కాలం క్రక్కుతుంది. అలాగే లక్ష్మణుని  ముఖంలో లజ్జా దూమం

త్రుటికాలం తాండవించింది..

 

రాత్రిలో చాల భాగం గడిచింది. చంద్రుడు అస్తమించాడు. నీలి ఆ చీకటిలో కలసి పోయి, సౌమిత్రికి కన్పించ లేదు !మంచె క్రింద అడుగుల చప్పుడు.

 

“ ఎవరది ?” అన్నాడు సౌమిత్రి.

 

సన్నని మధురమైన వేణు నాదం విన్పించింది.

 

“ నీలీ ! ఇలా రా !” అని పిలిచాడు సౌమిత్రి. ఆ ధ్వనిలో ఆఙ్ఞ స్ఫురించింది.

 

నీలి పావంచాలను ఎక్కి సౌమిత్రికి ఎదురుగా వచ్చి నిలబడింది.

 

“ నీలీ ! నది ఒడ్డున ఏం చేస్తున్నావు ?” అని ప్రశ్న.

 

“ ఆశ్రమ  క్షేమాన్ని అనుసరించి ఆ విషయం చాలా గోప్యం — ప్రభూ ! ” అని వ్రాసి చూపించింది నీలి.

 

సౌమిత్రి  ముఖం కోపంతో ఎర్ర తామర వలె భాసించింది. “ నీలీ ! సఖితో కలిసిన ప్రణయంలో తప్ప రహస్య గోపనం

ఇక్ష్వాకుల యువక రక్తంలో లేదు ! రాజనీతిలో  కూడ భగవంతుడైన శ్రీరామునికి రహస్యం ఉండదు ! యుధ్ధనీతిలో

బొత్తిగా  లేదు.”

 

నీలికి ఈ మాటలలో కొంత అత్యుక్తి గోచరించింది. కాని ఆమె మూగది ! ఆ విషయంలో ఆ మహావీరునితో వాదించడానికి  శక్తి ఉన్నా మౌనం వహించి ఇలాగు వ్రాసింది.

 

“ ప్రభూ ! క్షమించండి. శూర్పణఖ ముక్కు చెవులను  మీరు కోసి పంపారు కదా ! ఆ రాక్షసి తన సోదరుడైన ఖరునితో మొరపెట్టుకొంది. ఖరుడు తన సోదరులైన దూషణ త్రిశిరస్సులతో  ఆలోచించి మన ఆశ్రమాన్ని ముట్టడించాలని మూడు రోజుల క్రిందట తీర్మానించాడు. కాబట్టి ఆశ్రమ  సంరక్షణ  నిమిత్తం కొన్ని యాంత్రిక  క్రియలను చేస్తున్నాను. వెదురు గొట్టాల్లో విష వాయువులను  లేపే ద్రవ్యాలను  నింపి నది ఒడ్డంట  చిక్కగా నాటి ఉంచాను. ‘జానకి త్రాడు’ మూలంగా అగ్నిని ఉద్దీపింప చేసిన కొన్ని క్షణాల్లో భయంకర ధూమం శత్రు  సైన్యాన్ని  చీకాకు పరుస్తుంది.! ఈ పనిని నేను వారం రోజులుగా సాంతం చేయ గలిగాను. ”

 

లక్ష్మణుడు నీలి వ్రాసిన  పంక్తుల్ని చూచి తనలో మునిగి పోయాడు. వాని స్మృతి పథంలో  తానూ అన్నా, విశ్వామిత్ర మహర్షితో  కలిసి వెళ్లడం , తాటక వధ, యాగ రక్షణ, మిథిలా పురిలో తమ సోదరుల వివాహం ఙ్ఞప్తికి వచ్చాయి. అయోధ్యలో తన ప్రాణ సఖి  ఊర్మిళతో  కలిసి సంచరించిన రోజులు కండ్ల ముందర గోచరించాయి. సౌమిత్రికి.

 

ఊర్మిళ ! చంద్రోర్ముల మేళనం ! ధాళధళ్యమైన  శరీర ప్రభకు  తగ్గ అంగ సౌష్టవం, ఆ సౌష్టవానికి తగ్గట్లు సౌకుమార్యం, ఆ సౌకుమార్యంలోనూ పటుత్వం , ఆ శిల్పకళా వైశద్యం, తపోనుగ్రహ మిళితమైన కళోత్కృష్టత, లలితమైన కళామతల్లికి తగ్గ శాస్త్ర పాండిత్యం, మూలికా ప్రభావ  ఙ్ఞానంతో పాటు, అనుభవ  ఙ్ఞానం, సౌందర్యం శాస్త్ర విఙ్ఞాన మేళన రాశి – తన ప్రాణాధిక శయన సఖి — ఊర్మిళ మనోహర విగ్రహం , సౌమిత్రి హదయ ఫలకంలో జాగృతమయింది.

 

సౌమిత్రి కండ్లు చెమ్మగిల్లాయి. ఆ చెమ్మ తెరగుండా ఒకమారు నీలని చూశాడు. ‘ నీలీ ! అన్నగారు ఇలాంటి యుధ్ధనీతికి విరోధులు.”

 

నీలి మందహాసం చేసి మరల వ్రాసింది , “ ప్రభూ ! నాకా విషయం అఙ్ఞాతం కాదు అయినా సాహసించాను, కారణం వినండి, ఖరుడు సామాన్యుడు కాడు. మహా మాయావి. వాని మూల బలం పద్నాలుగు వేల సంఖ్య కలది. ఒక్కొక్కరూ ఆరితేరిన యోధులు. కృత్రిమ యుధ్ధంలో ఆరితేరిన మహావీరుడు – ఖరుడు !”

 

లక్ష్మణుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు . నీలి సహేతుక తర్కం వానికి నచ్చింది. “ నీలీ !నీ బుధ్ధి విశేషానికి మెచ్చుకొన్నాను. సరే, నీవు వెళ్లు, తెల్లవారుతోంది.”

 

నీలి వెళ్లిపోయింది !

*******************

 

శ్రీరాముడు  బీకరంగా  సింహం లాగు పచారు చేస్తున్నాడు. లక్ష్మణుడు చెతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. సీతాదేవి భర్త ముఖాన్ని చూస్తూ, కూర్చొని ఉంది. నీలి సీతా దేవి దగ్గరగా నిలబడి ఉంది.

 

శ్రీరాముడు నీలి వంక తిరిగాడు. “ నీలీ ! జనస్థాన విజయం నీది గాని మాది కాదు ! నీవు వ్రాసి బాణానికి కట్టి నా ముందర విసరిన పత్ర ఖండం నాకు అందింది. నేనింకా కర్తవ్యాన్ని నిర్ణయించక ముందే ఖరాఉరుని సైన్యం సమీపించడం, నీచే వ్యాప్తమైన దూమంలో పడి సైనికులు చెల్లాచెదురై, ఒకరి నొకరు కొట్టుకొని చావడం, జరిగింది ! ధూమంతో సమంగా గాంధర్వ  మాయని ఎలా నడిపావా అని నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యాన్ని పొందుతున్నాను !

 

“ నీలీ ! అధర్మ యుధ్ధాన్ని మేము హర్షింప జాలము ! నీవు స్త్రీవి, అదిన్నీ కాక నా అభయాన్ని పొంది ఉన్నావు. కాబట్టి, ఇన్నాళ్లూ నీవు మాకు చేసిన పరిచర్యని ఉద్దేశించి, నిన్ను క్షమించాను ! ఇక మీద నీవు మా ఆశ్రమంలో ఉండ వీలు లేదు. సాయంకాలం లోపుగా నీవు ఈ స్థలం విడిచి వెళ్లిపోవలసిందే !”

 

“ నీలీ ! నీవు మాకెట్టి సమాధానం చెప్పనక్కర లేదు !”

 

నీలి ముఖం దించుకొంది. ఆమె కనుకొలకుల నించి కన్నీటి బిందువులు నేల మీద వ్రాలి చితికి పోతున్నాయి. సీతా దేవి జాలిగా నీలి వంక చూచింది. నీలి పక్షాన భర్తతో చాదించడానికి ఆమెకు ధైర్యం చాలదు. ఆమె కండ్లు కూడ చెమర్చాయి.

 

లక్ష్మణుడు నిశ్చలంగా నిలబడే ఉన్నాడు. అన్నగారి వైపు చూసి ఇలాగన్నాడు. “ అన్నా ! నీలి చేసిన అపరాధంలో నాకూ కొంత భాద్యత ఉంది.” అని తలని దించుకొన్నాడు. సీతా దేవి తన తలపై పిడుగు పడినట్లే భావించి కంపించింది.

నీలి గజ గజ వణికి పోతున్నది.

 

పచారు చేస్తున్న శ్రీరాముడు ఆగి పోయాడు. “ నా చేవులేనా, సౌమిత్రీ , ఈ మాటల్ని వింటున్నది !? పిరికి మందు నీకు ఎవరు పోశారోయ్ ?  మహావీరుడవు, భగవాన్ విశ్వామిత్ర మహర్షి శిష్యుడవు, నేవేనా ఈ అన్యాయ యుధ్ధనీతికి తోడ్పడింది ! నీ చేతిలోని ధనస్సుని, నీ ఒరలోని కత్తిని, నీ శరీరంలో ప్రవహిస్తున్న ఇక్ష్వాకుల రక్తాన్ని, ప్రశ్నించి చూడు, అవేమంటాయో విను , కృత్రిమమైన ధూమంచే శత్రు నాశనం చేయడం  అధర్మం అని ఘోషిస్తాయి !”

 

“ అధర్మానికి  ఉదాహరణ భూతులైన రాక్షసులను, అధర్మ యుధ్ధంతోనే ఎదుర్కోవచ్చు  అని నేను తలంచాను ! శత్రువులు బహుళంగా ఉన్నప్పుడు కూటయుధ్ధ నీతి అధర్మం కానేరదు !” అని నీలిని సమర్థించాడు లక్ష్మణుడు.

 

“ శ్రీరామునికి ఇలాంటి దురవస్థ సంభవిస్తుందని నేను తెలుసుకోలేక పోయానోయ్ ! శ్రీరాముని భుజ సారాన్ని అస్త్ర పటుత్వాన్ని వాని సోదరుడే సందేహించిన దుర్గతి  సంభవించింది. తండ్రీ ! పద్నాలుగు వేలు కాదు, పద్నాలుగు భువనాలు  ఎదురు వచ్చినా, భగవాన్  విశ్వామిత్ర శిష్యునికి దీటు రారని తెలుసుకో ! ఆలోచించి చూడు లక్ష్మణా,  సరే ! జరిగినదేదో జరిగి పోయింది. ఈ జనస్థాన విజయం అమేయ ప్రతిభావంతురాలైన  నిషాద స్త్రీ నీలిదిగానే ఉండనీ ! నాకు దాంత్లో ఏమాత్రం అసూయ లేదు ! ఇంత సంకట స్థితిలోనూ నాకు ఒకే తృప్తి, లక్ష్మణా ! ఖర దూషణాదులు ధూమానికి లొంగక నా వైపుకి దూసుకొని వచ్చారు. వారిని నేను సక్రమ యుధ్ధంలోనే  జయించ గలిగాను ! నీలి మాత్రం మన ఆశ్రమం వదిలి వెళ్లిపోవలసిందే ! ఈ నా నిర్ణయానికి తిరుగు లేదు.”

 

******************

 

మరునాడు ఉదయం ఉషస్సు నిర్గమించక ముందే లక్ష్మణుడు తన నిత్య విధులను నెరవేర్చుకొనే నిమిత్తం మంచె నుంచి క్రిందకు దిగాడు. మంచె దగ్గరగా  సింహద్వారం దగ్గర  సీతాదేవి  నిలబడి తూర్పు దిక్కుగా చూస్తున్నది. పాదాల సవ్వడి విని సీతాదేవి తిరిగి చూసింది. ఆమె ముఖాన్ని చూచి లక్ష్మణుడు చకితుడై పోయాడు. సీత, మిక్కుటంగా దుఃఖించినట్లు ఏడ్చినట్లు ఆమె ముఖమే ఎత్తి చూపెట్టుతోంది ! ఆమె బుగ్గలపై కన్నీటి చారలు కన్పడి ,మిక్కుటంగా ఏడ్చినందు వల్ల కాబోలు , కనుబొమలు వాచి ఎరుపెక్కాయి !

 

“ మరిదీ ! మన నీలి వెళ్లిపోయింది. ” అని చెప్పింది సీతాదేవి, గగ్దద కంఠంతో !

 

లక్ష్మణుడు దీర్ఘంగా నిట్టూర్చాడు.

 

********************

 

సముద్రం భీకరంగా కెరటాలను తీరానికి దొర్లిస్తున్నాది. ఆడ కెరటాలు మగ కెరటాలతో ఎకసెక్కాలాడుతూ కొండెత్తుకు

పొంగి హుందాగా ముందుకు వస్తున్నాయి. దగ్గరగా ఉన్నపర్వత శ్రేణులపై వానర బలం దీనంగా ముఖాలు వేలవేసుకొని  సముద్రాన్నే చూస్తున్నాయి.

 

శ్రీరాముడు దర్భశయనం పైన పవళించి ఉన్నాడు.లక్ష్మణుడు చేతులు కట్టుకొని అన్న వైపు చూస్తూ నిల్చుని ఉన్నాడు ! సుగ్రీవుడు, అంగదునితోనూ,  హనుమదాది మంత్రులతోనూ శ్రీరాముని సన్నిధానంలో సభ తీర్చాడు. ఎవరి నోటి వెంటా మాట లేదు ! అందరి మస్తిష్కాల్లోనూ ‘ సముద్రానికి వారధి కట్టడం ఎలా ?’ అనే ప్రశ్న తిరుగాడుతోంది ! ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికినీ దొరకడం లేదు.

 

“ లక్ష్మణా ! నా విల్లందుకో ! బ్రహ్మాస్త్ర  ప్రయోగం చేసి ఈ దుష్ట సముద్రాన్ని ఇంకిస్తాను !” అన్నాడు శ్రీరాముడు.

 

వానర బలంలో అలజడి చెలరేగింది. హనుమంతుడు పెద్ద నిట్టూర్పును  బరువుగా  వదిలాడు. సుగ్రీవునికి కలవరం హెచ్చింది. లక్ష్మణుడు కోదండాన్ని అన్నగారికి  అందిచ్చాడు. శ్రీరాముడు , ఉపవాస శరీరం ఎర్రపడ వింటి నారిని జోడించాడు.

 

సముద్రం పొంగింది. అలల మధ్యనుండి ఆర్తనాదం బయలు దేరింది. “ భగవన్ ! శ్రీరామా ! శరణు, శరణు , ఆడదాని కోసం స్వార్థానికి లొంగి కోట్లకొలది  జీవరాసులని చంపుతావా ? అలల అలజడి నేను నిశ్చలంగా ఉంటాను. నాపై వంతెన నిర్మించుకోవచ్చు. శాంతిని వహించు, శ్రీరామా, శాంతిని వహించు .”

 

శ్రీరాముడు శాంతించాడు. వానరులు గంతులు వేశారు.

 

“ హనుమా ! సముద్రుడు సరైన నీతిని భోదించాడు. అదో చూడు, సముద్రం పెద్ద చెరువులాగ నిశ్చలంగా ఉంది ! వంతెన కట్టండి. వీలు పడనప్పుడు నేను మరలి పోవడానికే తీర్మానించాను. సీతా నిమిత్తం  కోట్ల కొలది జీవ రాసులను వధించడం అధర్మం !” అని గంభీరంగా చెప్పాడు శ్రీ రాముడు.

 

“ ప్రభూ ! నీలుడు వేసిన రాళ్లు మునిగిపోవు. కాని ఆ రాళ్లు ఒకదానికొకటి కలిసి ఉండవు .వాటిని అతికే విద్య వానికి తెలియదట ! ” అన్నాడు మారుతి తడబడుతూ.

 

తిరుగ పెద్ద సమస్య లేచింది !

 

“ ప్రభూ ! తమ దర్శనార్థం ఒక మూగది, నిషాద స్త్రీ వచ్చింది.” అని విన్నవించుకొన్నాడు యువరాజు అంగదుడు.

 

“ కుమారా ! ప్రవేశపెట్టు ” అని ఆఙ్ఞ ఇచ్చాడు. శ్రీరాముడు.

 

శ్రీరామ పాదాలను స్పృశించి కళ్లకు అద్దుకొంది నీలి. “ నీలీ ! నీలాగే శ్రీరాముడు కూడా అక్రమ నీతిని అవలంబించడానికి సిధ్ధమయ్యాడు.  కాని సమయానికి బుధ్ధి వికసించింది. నిన్ను పూర్తిగా క్షమిస్తున్నాను. ఏం కావాలో కోరుకో !” అన్నాడు ధర్మ మూర్తి శ్రీరాముడు.

 

నీలి తనతో తెచ్చుకొన్న రాతి బల్లపై వ్రాసింది, “ ప్రభూ ! నేను సముద్రంలో రాళ్లని కదలనీయకుండా అతికి వంతెన కట్టగలను. ఈ సేవా భాగ్యాన్ని మీరు నాకు  ప్రసాదించాలి – ఇదే నా కోరిక !”

 

శ్రీరాముని ముఖం తామర పువ్వు వలె వికసించింది ! అందరు వానరులూ సంతోషం పట్టలేక కుప్పిగంతులు వేసారు. వానరులు రాళ్లను సముద్రంలో కుమ్మరిస్తున్నారు. నీలి అతి నేర్పుగా నీలుని సహాయంతో రాళ్లను జోడిస్తోంది. రాళ్లు అతుక్కొని  పోతున్నాయి. వరధి బంధనం ఆరంభమయింది.

 

******************

 

శ్రీ రామాయణ  కథాభాగంలో అతి ముఖ్యమయిన రావణ సంహారం జరిగింది ! సీతాదేవి విడుదల, అగ్ని పరీక్ష పూర్తి అయినవి ! భక్తాగ్రేసరుడైన  విభీషణుని పట్టాభిషేకం విద్యుక్తంగా జరిగింది.

 

పుష్పక విమానంపై  వానర ముఖ్యులు , విభీషణుడు మొదలైన వారితో శ్రీరాముడు, స్వపత్నీ సోదర సహితుడై అయోధ్యకు పయనమయ్యాడు. నీలీదేవి, సీతాదేవి ప్రక్కనే ఆసీనయై ఉంది.

 

ముని వేషంతో  భరతుడు, వానప్రస్థ నియమాలను పాటిస్తున్న శతృఘ్నుడు, వసిష్ఠ మహర్షి , సుమంత్రాది అమాత్య వర్గం, పుర ప్రముఖులు, అందరూ సరయూ నదీ తటమందు సమ్రాట్  లాంఛనాలతో శ్రీరామ చంద్రుని  రాబట్టుకొన్నారు.

సంతోషంతో  ఘీంకరిస్తున్న, స్వర్ణాభరణ భూషితమైన పట్టపు టేనుగుపై  సీతా రాములు కూర్చొన్నారు. ఏనుగు అంబారీకి రత్న ఖచిత స్వర్ణదండ విరాజితమైన  శ్వేతఛ్ఛత్రం  గంభీరంగా రాణిస్తూంది. స్వర్ణ  సుందరుల వలె చూడ ముచ్చటగానున్న ఇద్దరు కన్యకామణులు  ఇరువైపులా వింజామరులు వీస్తున్నారు. పట్టపు టేనుగు ఠీవిగా కదిలింది. కాహళ శంఖ ధ్వనులు మిన్నుముట్టాయి. రాచనగరు  సింహద్వారం  వద్ద  రాజమాతలు మువ్వురున్నూ  సీతా రాములను అక్కున చేర్చుకొని ఆశీర్వదించి  ఆనంద భాష్పాలను రాల్చారు.

 

శ్రీరాముడు  సరిగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే  రాజప్రాసాదాన్ని ప్రవేశించాడు. వసంతాగమనంచే రాణించే నందన వనం వలె అయోధ్యా నగరి, సంపూర్ణ  లక్ష్మీ కళలతో  శోభించింది. ఆ దినం ఇంటింటా పండుగలు చేసుకొన్నారు ప్రజలు. రెండు మాసాలకు ముందే దీఘ దర్శియైన  వసిష్ఠ మహర్షి  అభిషేక సంభారాలను సేకరించి ఉంచుకొన్నాడు. మహామంత్రి సుమంత్రునికి శ్రీరామ పట్టాభిషేకానికి అనుఙ్ఞ ప్రసాదించారు. మహా పురోహితులు.

 

పట్టాభిషేక మహోత్సవం మహా వైభవంగా జరిగింప బడింది. భూరి దక్షిణలు, గోదానాలు విరివిగా జరిగాయి. అభిషేకానంతరం మహా సభ కూడింది. మంత్రి , దండనాథ ప్రముఖులతోను, సామంత రాజులతోను,పుర ప్రముఖులతోను  సభ నిండుగాను కోలాహలంగాను ఉంది. యుధ్ధంలో  తనకు సహాయం చేసిన వారికి అందరికిని సన్మానించుటకే  ఆ సభను సమావేశ పరిచాడు  చక్రవర్తి శ్రీరామ చంద్రుడు. సన్మాన సభ  పూర్తి భాద్యత  లక్ష్మణునిపై పడింది. భగవన్ వసిష్ఠులవారి వేదఘోషతో  సభ ప్రారంభమయింది. “ శ్రీరామాయణ రత్నం  అనే బిరుదు మారుతికి ప్రసాదించబడింది. ” అని సౌమిత్రి సభలో  ప్రకటించాడు. మారుతి ఆనందంతో ఎగిరి గంతు వేసి శ్రీరామ పాదాలని పట్టుకొని నమస్కరించాడు.

 

జాబితాలో రెండవ పేరి ‘ శ్రీమతి నీలీదేవిది’.“ జనస్థాన విజయ పతాక , సేతు బంధన కార్యనిర్వహణ భాగ్యశీలి  నీలీదేవి” అని ఆహ్వానించాడు సౌమిత్రి.

 

సింహాసనం పైన శ్రీరాముని ప్రక్కన కూర్చొన్న సీతాదేవి మందహాసం  చేసింది ! సభలోని వారందరూ ఆతురతతో నీలీ దేవి దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారు. నీలీదేవి సభలో లేదు ! లక్ష్మణుడు నాలుగు ప్రక్కలా చూసాడు

 

తన ఆసనం నుంచి లేచి వసిష్ఠ మహాముని లేచి ఇలాగన్నారు. “  నీలీదేవి ఏదో కార్యాంతరంచే సభలో హాజరు కాలేక

పోయిందనుకొంటాను. ఆమెకు చెందవలసిన బహుమతిని ఉద్ఘాటించి మీది కార్యక్రమాన్ని కొనసాగించడం ఉచితంగా

ఉంటుంది.”

 

“ నీలీదేవి సేవ చాలా గొప్పది ! ఆ సేవని అంగీకరిస్తూ సమ్రాట్ శ్రీరామ చంద్ర ప్రభువు ఆమెకి ఖరపాలితమైన జనస్థాన రాజ్యాధిపత్యాన్ని సంపూర్ణ హక్కులతో ప్రసాదించారు. మాండలిక ప్రభ్వి నీలీ మహారాణి .ఇక మీదట  అయోధ్యా నగర సామ్రాజ్యానికి  ప్రధాన మాండలిక రాణిగా వ్యవహరింపబడుతుంది !” అని ఉద్ఘాటించాడు లక్ష్మణుడు.

 

తరువాత జరుగ వలసిన సన్మాన ప్రకటనలు యథావిథిగా జరిగాయి. ఆనంద తరంగాలతో సభ, క్షీర  సముద్రం లాగ పొంగి పొరలింది.

 

***************

 

సౌమిత్రి  రాజోచిత అలంకారాలతో , నవ మన్మధునిలాగ తయారై తన్ ప్రణయ సఖిని, ఊర్మిళను చూచి  సంభావించాలని ఉవ్విళ్లూరుతూ ‘ లక్షణావతికి’ బయలు దేరాడు. ఏమాశ్చర్యం ! నగరు తాళాలు వేయబడి ఉంది. ఒక సాయుధ పాణియైన  కాపలాదారు పచారు చెస్తున్నాడు సింహద్వారం ముందర.కుతూహలంతోను, ప్రియురాలి  దర్శన లాభ కాంక్షతోను,  బరువెక్కిన  హృదయంతో  కూడిన లక్ష్మణునికి గొప్ప ఆశా భంగమయింది ! ద్వార పాలకుడు సైనికాభివాదనం చేసాడు.

 

“ దారుకా ! నగరు తాళాలు వేసి ఉంచుటకు కారణమేమి ?” అని ప్రశ్నించాడు సౌమిత్రి

 

ద్వారపాలకుడు రాజశాసనాన్ని చూపించాడు. “ సరే ! వెళ్లి వసుంధరా దేవిని పిలుచుకొని రా !”

 

ద్వారపాలకుడు పరుగు తీసాడు. కొన్ని నిముషాలలో చేటీ జనాధ్యక్షురాలు వసుంధర వచ్చింది. మౌనంగా తలుపులు తీసింది. తాను ఓరగా నిలబడి తల వంచుకొంది.

 

“ ఊర్మిళాదేవి ఎంత కాలం నుండి యోగనిద్రలో ఉన్నారు ?” అని ప్రశ్న వేసాదు లక్ష్మణుడు.

 

వసుంధర నిలువెల్లా కంపించింది. ఆమె సుమిత్రా దేవితో ఈవిషయంగా సంప్రదించే .వచ్చింది. “ మనమేం చేయగలం వసుంధరా ? కుమారుడు వచ్చినప్పుడు లోపలికి ప్రవేశపెట్టు. ఆ తరువాత ఏం జరిగితే అదే జరుగనీ !;” అని సుమిత్రాదేవి సలహా చెప్పింది.

 

ధైర్యం కూడతీసుకొని వసుంధర  ఇలా చెప్పింది. “ ప్రభూ ! మీరందరూ అరణ్యానికి  వెళ్లిన  రెండు మాసాలైన  తరువాత యువరాణి  యోగనిద్రలో ప్రవేశించారు.

 

“ సరే ! శయనాగారానికి దారిని చూపెట్టు.”

 

“ ఇలా రండి ప్రభూ !” అంటూ దారి తీసింది వసుంధర.

 

హంసతూలికా తల్పాల మీద మెరుగు దిద్దిన నల్ల సానరాతి విగ్రహం వలె పవళించి ఉంది ఒక వనిత !

 

“ ఓహ్ !  ” అనే శబ్దం వసుంధర నోటంట వెడలింది.

 

ఆమె చెమటచే తడిసిపోయింది. నోటంట మాట రాలేదు.

 

“ నీలి ! ఇది అసంభవం ! నీలి ఇక్కడికి ఎలా వచ్చింది ?”

 

“ క్షంతవ్యురాల్ని నాకేం తెలియడం లేదు. ఈమె ఎవరో నాకు తెలియదు ప్రభూ !!”

 

“  వసుంధరా ! నీవు ఎదో అసత్యం చెబుతున్నట్లే తలుస్తాను. సరే ! వెళ్లి మా అన్నగారికి ఈ  వృత్తంతాన్ని చెప్పు. ఇదిగో రాజముద్ర ! ఇది నిన్ను చక్రవర్తి సన్నిధానానికి ప్రవేశం ఇవ్వగలదు.” అని సౌమిత్రి వసుంధరకు రాజముద్రను ఇచ్చాడు.

వసుంధర బ్రతుకు జీవుడా అని  శ్వసించి నిష్క్రమించింది.

 

***************

 

సీతా రాములు  ఇద్దరూ రథారూడులై లక్షణావతికి వచ్చారు. వసుంధర దారి చూపుతుండగా శయనాగారాన్ని  చేరుకొన్నారు.

 

“ అన్నా ! చూడండి , ఊర్మిళ పర్యంకంలో నీలిపడుకొని ఉంది ! ” అన్నాడు దీనంగా లక్ష్మణుడు.

 

“ మరిదీ ! నీవేం కంగారు పడవద్దు. మన నీలి మనల్ని మోసపుచ్చింది. నీలే మన ఊర్మిళ !! ఊర్మిళే మన నీలి !!! నీవుగాని , ప్రభువులు గాని  పోల్చుకోలేక పోయారు. నేను కొంత కాలానికి పోల్చుకొన్నాను. నా చెల్లెలు నా పాదాలపై పడి క్షమాభిక్ష అడిగింది ! రహస్యాన్ని చెప్పవద్దని బ్రతిమాలింది. నేనూ సందర్భాలను  బాగా ఆలోచించి నీలి రహస్యాన్ని  కాపాడాను.”

 

లక్ష్మణుడు ఆశ్చర్యంతోను, సిగ్గుతోను క్రుంగి పోయాడు ! రాముడు తమ్ముని  భుజంపై చేయి వేసి, నవ్వుతూ ఇలాగన్నాడు. “ సౌమిత్రీ ! ఊర్మిళ శ్లాఘనీయమైన  ప్రతిభ గలది ! ఆమే లేకుంటే మనం సముద్రాన్ని దాటడం సాధ్యం కాని పని ! కాబట్టి ఊర్మిళ  రహస్య చర్య  విధి ప్రేరితమే ! ఈ రహస్యం వసుంధరకు, మనకు తప్ప మరెవరికీ తప్ప ఎవరికీ తెలియనవసరం లేదు.  ఊర్మిళను నిద్ర పోనీ ! ఆమె లేచిన తరువాత ఏమీ ఎరగనట్లే  సంధించి సంభావించు. వసుంధర లక్షణావతిని కాపాడుకొంటుంది.” అన్నాడు మహాత్ముడు శ్రీరాముడు.వసుంధర తప్ప అందరూ నిష్క్రమించారు.

 

ఊర్మిళ గాఢంగా నిద్రపోతున్నది.

 

 

 

 

3 thoughts on “వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం

  1. శ్రీధర్ గారు, అత్యధ్బుతంగా ఉన్న కథను పంచుకున్నందుకు ధన్యవాదములు..
    చాలా బాగుంది… మిగతా భాగం కోసం ఎదురుచూస్తుంటాను..

    1. శ్రీ శివకుమార్ గారికి . జనస్థానం కథ మీకు నచ్చినందుకు చాల సంతోషం. దీనికి మూలం ఒక కన్నడ యక్షగానం ! ‘ ఊమిళ నిద్ర’ అనే పేరు గలది. కీ.శే. వాసిష్ఠ తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో . అసిస్టెంటు ఎడిటర్’గా పనిచేస్తున్నప్పుడు దానిని చదివారు. అతనికి తెలుగు సంస్కృతం, తమిళం, కన్నడం, మళయాళం భాషలు వచ్చు. అందుకే అక్కడ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది. ఆ కథని అతను తెలుగులో జనస్థానం అనే పేరుతో వ్రాసారు. నేను పూర్తి కథను మాలిక సంపాదకులు శ్రీమతి జ్యోతిగారికి పంపించాను, దానిని వారు రెండు భాగాలుగా వేస్తారని అనుకొన్నాను. కాని పూర్తిగా ప్రచురించాక కూడా , ‘ తరువాయి భాగం మరొకసారి’ అని వ్రాయడం ఆశ్చర్యం !! తరువాయి ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని గమనించండి. — శ్రీధర్. ఎ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238