March 19, 2024

కుబేరుడు

రచన: రసజ్ఞ
సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డంకలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.

ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే, రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి (మాలి, సుమాలి, మాల్యవంతుడు) ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మ వర్తనుడు. నర్మద అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకా నగర పాలకులయిన ముగ్గురూ ఈ ముగ్గురినీ అనగా మాల్యవంతుడు – సుందరినీ (వీరి కుమారులు – వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త మరియు కుమార్తె – నల), సుమాలి – కేతుమతిని (వీరి కుమారులు – ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రద, ప్రక్వత, భాసకర్ణ మరియు కుమార్తెలు – వేక, పుష్పోల్కత, కైకసి, కంభినది) మరియు మాలి – వసుతినీ (వీరి కుమారులు – అనల, అనిల, అహ, సంపతి) వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా, మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు.
అటువంటి రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క “కుంభ”స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట!

రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని “అపర కుబేరులు” అంటారు.

మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి వుండే ఈ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి, కల్పవృక్షం నుండీ వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు, గంధర్వ కన్యలు గానం చేస్తుంటే, రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత, మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హాలకక్షుడు, మొదలయినవారు కుబేరుని కొలువులో ముఖ్యమయిన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తున్నట్టు వస్తుంది.
కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశ్యంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటారు. తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశ్యము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు.
కుబేరుని భార్య చిత్ర రేఖి (కానీ మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం, కుబేరుని భార్య పేరు భద్ర), పుత్రులు – పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు మరియు పుత్రిక – మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకూబరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే (నారద మహాముని శాపం వలన వారిరువురూ మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు). ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రయిన కుబేరుని లాగానే ఇతను కూడా శివ భక్తి కలవాడు, శివునికి ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీ దేవి అగ్నికి ఆహుతయ్యింది. ఈ విషయం తెలిసిన పరమ శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసినా, భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు “ఉన్మాదనాస్త్రాన్ని” ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమయిన విరహ తాపానికి గురవుతూ, ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించివేస్తాయి. దానితో ఆ నదీ జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి “కాళింది” అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహ తాపం మాత్రం తీరటం లేదు. ఇంతలో మన్మధుడు “సంతాపనాస్త్రాన్ని” వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈ సారి మన్మధుడు “విజృంభణాస్త్రాన్ని” ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు.
ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడయిన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తనకి వచ్చిన అదృష్టావకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి, తన మీద ప్రయోగింపబడిన మూడు (ఉన్మాదన, సంతాపన, విజృంభణ) అస్త్రాల వేడినీ తీసుకోమని కోరతాడు. మహా శివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమయిపోతుంది అని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా, దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడినీ తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి, చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి, మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండీ పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలో, హిమవత్పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడనీ, చైత్ర మాసంలో ఈయనని చూసినా, విగ్రహాన్ని ముట్టుకున్నా, భక్తిగా స్మరించుకున్నవారు ఎవరయినా (చిన్న/పెద్ద, ఆడ/మగ భేదం లేకుండా) ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత వ్యాధిలాగానో, అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటం వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమనీ వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి, తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడనీ వామన పురాణం వివరిస్తోంది.

ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “లాఫింగ్ బుద్ధ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.

“రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “

హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.

“ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్”

13 thoughts on “కుబేరుడు

  1. ప్రచురణకు ముందు ఈ వ్యాసాన్ని ఎవరైనా చదివారా? ఎన్నెన్ని తప్పులు ఉన్నాయో!

  2. శ్రీ రసజ్నగారికి, నమస్కారములు.

    చక్కటి కథను వినిపించారు. చెప్పుకోదగ్గ విషయేమిటంటే, మన భారత పురాణ కథలలో అడుగడుగునా ధర్మం, నీతి గురించి చెప్పబడుతూ, సామాన్యులకైనా, దేవతలకైనా ధర్మం, నీతి ఒకేరకంగా వర్తిస్తుంది అని చెబుతూ, జన సామాన్యానికి ఈ కథలని మనస్సుకు హత్తుకొనేటట్లుగా చెప్పటం.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

  3. ’జన్మకో శివరాత్రి’ ,’కళ్ళు పోతాయ్’ అనేవాటికి ఇంత కథుందా !
    పోస్ట్ గురించి కొత్తగా చెప్పేదేంలేదు, ఎప్పటిలాగే బాగుంది 🙂
    ఒక విషయం ప్రజెంట్ చేయడానికి మీరు చెప్పే add-ons, తీసుకునే శ్రమ (notes etc ) అద్భుతం అండీ.

  4. కుబేరుడి గురుంచి సమగ్రంగా తెలియజేశారు.గుణనిధే కుబేరుడిగా జన్మించాడని తెలిసి ఆశ్చర్యపోయాను.పాంచాలకుడి వృత్తాంతం ఎప్పుడూ వినలేదు.అలాగే కళ్ళుపోతాయనే నానుడి ఎందుకొచ్చిందో కుబేరుడు రావణునికి పంపిన సందేశం ద్వారా తెలియజేశారు.ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *