May 2, 2024

ఏక వాక్యం రసాత్మకం “శ్రీ” వాక్యం .

సమీక్ష: జగద్ధాత్రి
SANMA 2

దాదాపు గత రెండు దశాబ్దాలుగా ఎక్కువగా మన్నన పొందిన కవితా రూపం మినీ కవితలు లేదా చిన్న కవితలు . వీటికి పేర్లు ఛందస్సులు కూడా జోడించి కొన్ని ప్రక్రియలు చేస్తున్నారు . ఏది ఏమైనప్పటికి వీటన్నిటికి ఒక తాటి కిందికి తీసుకు వస్తే వాటిని చిన్న కవితలే అనగలం. అలాంటి చిన్న కవితల్లో ఏక వాక్య కవితలుగా , వాటిని ఒక్కచోట చేర్చి  శ్రీ వాక్యం అనే పుస్తకాన్ని విడుదల చేసారు.    .

“శ్రీ వాక్యం” గురించి : ఇక మనం కవితల్లోకి వెళ్తే , అందమైన వెన్నెల ముద్దను మీ చేతితో తాకినంత మృదువుగా, అల్లరిగా ఆడపిల్ల జడ లాగినంత చిలిపిగా, నల్లని స్వామిని ఆరాధించే రాధగా మీరు మమేకమై చదువుతారు ఈ కవితలు.ఇందులో అతిశయోక్తి లేదు .ఇందులోని కవితలన్నీ దాదాపుగా భావుకాత్మకంగా ఉంటాయి. కొన్ని భక్తి అరాధన, విరహం, మధుర భావాలన్నీ ఈ వాక్యాల్లో మనకు దర్శనమిస్తాయి.

ఈ ఏక వాక్య కవితలు రవీంద్రుని  “స్టేబర్డ్స్ “లాంటివని చెప్పినా వాటికి వీటికి చాలా తేడా ఉంది . రవీంద్రుని కవితలు అన్నీ మధుర భక్తితో నిండి ఉంటాయి. శ్రీ వాక్యాలలో ఎక్కువగా వెన్నెల , వలపు , ప్రేమ , విరహం ఇవి మనల్ని ఎక్కువగా ఆకట్టుకునే భావనలు. వెన్నెలన్నా , విరహమన్నా స్పందించని , రాయని కవి ఉండడు అనుకుంటాను ఏ భాషలోనైనా. ఆహ్లాదంగా ఆనందంగా అప్పుడప్పుడూ చిలిపి తగవులూ , వేదనలూ , అన్నీ కలిపి బాపు సినిమా లాగా అందంగా సాగుతాయి కవితలన్నీ . మానసిక విశ్రాంతి కోరే పాఠకుడికి చాలా ఆనందిస్తాయి.

ఉదా: అల్లరి జాబిల్లి __వెన్నెలమ్మ పెట్టే వెండి బువ్వల్ని ఆకాశం లో విసిరేస్తూ.

ఈ కవితలో అదే వెన్నెల అదే రేయి కానీ కవి చూసిన భావన వేరు.ప్రకృతి , వెన్నెల, సముద్రం, ఇవన్నీ వాటి పని అవి చేసుకు పోతుంటాయి నిర్మమంగా , మనం మన మనసుల ననుసరించి వాటికి భావాలను ఏర్పరుస్తాము. దీన్నే ఆంగ్లం లో పెర్సోనిఫికేషన్ అంటాము.మాటాడలేని వాటికి మనిషి లాగే ఉండే భావనలు కూర్చి రాయడం.

“గుప్పెడు భావాల కోసం గుండె తెరిచా _భావ సంద్రంలో తడుస్తూ ఉండి పోయా” ఇలా భావుకాత్మకంగా , శృంగార పరంగా సున్నితంగా సాగే ఈ ఏకవాక్య కవితలు ఇలా ఒక పుస్తక రూపంలో రావడం బాగుంది. ఇలా ఏక వాక్యాలు ఒక పుస్తకంగా తేవడం ఇటీవల ఎక్కడ జరగలేదు. ఇందాకే  చెప్పానుగా పేరులూ ప్రక్రియలూ వేరు కానీ ఇవన్నీ చిన్న కవితల కోవకే చెందుతాయి.

అక్షరాలు కొన్నైనా భావాలెన్నో అన్నాడో కవి అలా గుప్పెడు అక్షరాల్లో గుండెనిండే భావాలను గుప్పించడం శ్రీ కి బాగా వచ్చును అనిపిస్తుంది.

అతని కవితల్లో నిండిన భావుకత , మంచి అభివ్యక్తి చూస్తే కేవలం ఇలా కొన్ని విషయాలకే పరిమితమై పోవడం. కేవలం వైయుక్తికమైన కవిత్వం రాయడం కాక ఇంకా ఎదిగి ఎదిగి లోకాన్ని పరిశీలించిన నాలుగున్నర పదులు దాటిన వయసులో ఇంకా పరిపక్వమైన సామాజిక అంశాలతో కవిత్వం రాయగలరని నా ఆకాంక్ష . ఎందుకంటే శ్రీ లో సామాజిక స్పృహ లేక పోలేదు కొన్ని అక్కడక్కడా  అటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా అభ్యుదయం అతని మాటల్లో కొట్టొచ్చి నట్టు కనిపిస్తుంది .

కనుక శ్రీ కవిత్వంలో ఇంకా కవిత్వా పటుత్వ సంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ అక్షరాల్లో అంత చల్లదనమేమిటో_ కలాన్ని శ్రీ గంధంలో ముంచి రాశావా” అన్న కవి మాటలతోనే ముగిస్తున్నాను

 

ఈ పుస్తకం ప్రతులకోసం  : సింధుజ పబ్లికేషన్స్ ,

ఆర్.వి.వి. ఎస్ శ్రీనివాస్ ,

దూర దర్శన కేంద్రం,

శ్యామలా హిల్స్ ,

భోపాల్-462013,

మధ్య ప్రదేశ్,

సెల్ నంబర్ :9425012468.

వారిని సంప్రదించవచ్చు .పుస్తకం వెల 60/-

8 thoughts on “ఏక వాక్యం రసాత్మకం “శ్రీ” వాక్యం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *