May 2, 2024

యాత్రా దీపిక – హైదరాబాద్ నుంచి ఒక రోజులో (దర్శించదగ్గ 72 ఆలయాలు)

psm lakshmi

సెలవురోజుల్లో కుటుంబంతోనో, స్నేహితులతోనో కొంతసేపు సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు.  అవకాశమున్నవాళ్ళు ఆటవిడుపుగా నూతన ప్రదేశాలకి వెళ్ళాలని కూడా అనుకుంటారు.  అయితే దానికి సమయం, తోడు, డబ్బు, ఇలా అన్ని అవకాశాలూవున్నా సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేవారెందరో.
దూర ప్రదేశాలకి వెళ్ళిరావటానికి అనేక కారణాలవల్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు.  అలాంటివారు కొంతమార్పు కోసం ఉదయం వెళ్ళి సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చేయాలనుకుంటారు.  అయితే మళ్ళీ పెద్దవారు ఆలయానికెళ్దామంటే పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కావాలంటారు.  ఇంటి పెద్దకి పర్సు బరువు తగ్గకూడదనుకుంటే, ఇంటి ఇల్లాలు అందరూ కలిసి సరదాగా ఒకచోట గడుపుదామనుకోవటం సహజం.  వీరందరికోసమే అన్నట్లుగా శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి ఈ పుస్తకం వ్రాశారు.  ఇందులో హైదరాబాదు చుట్టుపక్కల వున్న 72 ఆలయాలగురించి పౌరాణిక, చారిత్రాత్మక వివరాలు, ఆలయాలకి వెళ్ళే దోవలు, అక్కడ లభ్యమయ్యే సౌకర్యాలు, వీటన్నింటిగురించీ వివరంగా వ్రాశారు.  ముఖ్యంగా ఏ రహదారిలో వెళ్తే ఏ, ఏ ఆలయాలు దర్శించుకోవచ్చో రహదారివారీగా విడి విడిగా ఇచ్చారు.  కొత్త ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ ముందుగా తెలియటం ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.
ఇందులో ఇచ్చిన 72 ఆలయాలలో కొన్ని ఆలయాలు చాలామందికి తెలిసివుండవు.  ఉదాహరణకి జోగులాంబ ఆలయానికి వెళ్ళినవాళ్ళల్లో ఎంతమంది కూడలి సంగమేశ్వరాలయాన్ని, పాపవినాశని ఆలయాల సమూహాన్ని చూసి వుంటారు?   అలాగే కంచికి వెళ్ళలేనివాళ్ళు హైదరాబాదుకు సమీపంలోని కడకంచి దర్శిస్తే చాలని ఎంతమందికి తెలుసు?   కొన్ని ప్రదేశాలు మనం చూసినవే అయినా అక్కడి అన్ని విశేషాలూ తెలియకపోవచ్చు.  ఇలాంటి పుస్తకాలవల్ల ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు.
తమ ముందుమాటతో శ్రీరామ చుట్టిన శ్రీ పరిపూర్ణానందస్వామి చెప్పినట్లు హైదరాబాదునుంచి ఒక రోజులో దర్శించదగ్గ ఆలయాల చరిత్ర అనే భావనే చక్కని ఆసక్తి గొలుపుతుంది.  ప్రధానంగా భాగ్యనగరవాసులు, నగరానికి వచ్చివెళ్ళేవారు, వారాంతాలలో ఆలయ సందర్శన చేసి రావాలని తలపెట్టటానికి ఈ పుస్తకం దోహదం చేస్తుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. తమ ఆశీస్సులో శ్రీ పరిపూర్ణానందస్వామి అన్నట్లు జీర్ణ దేవాలయోధ్ధరణ అంటే శిధిలమవుతున్న మన సంస్కృతిని, దివ్యవారసత్వాన్ని తిరిగి ఉధ్ధరించుకోవడమే.  అట్టి బృహత్ యజ్ఞంలో ఇలాంటి గ్రంధ రచన కూడా భాగమే.  శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మిగారు ఇలాంటి రచనలు ఇంకెన్నో చెయ్యాలని ఆశిద్దాం.
ఇలాంటి గ్రంధాలు ఒకసారి చదివి పక్కన పడేసేవికాదు.  రిఫరెన్సు బుక్స్ లాంటివి.  మనకవసరమయినప్పుడల్లా తీసి చూస్తూ వుండాల్సినవి.  అందుకే ఆలయ సందర్శనాభిలాషవున్నవారు తప్పక కొని దాచుకోవాల్సిన పుస్తకం ఇది.

ఈ పుస్తకాన్ని కినిగెనుండి కొనుక్కోవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు..

హైదరాబాద్ ను౦చి ఒక రోజులో On Kinige

1 thought on “యాత్రా దీపిక – హైదరాబాద్ నుంచి ఒక రోజులో (దర్శించదగ్గ 72 ఆలయాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *