May 5, 2024

సంపాదకీయం : పుస్తకం హస్తభూషణం

Shelves-Center-for-Childrens-Books

 

డిసెంబర్ నెల. అప్పుడే సంవత్సరం చివరాఖరుకు వచ్చేసింది. తెలుగువారి  పెద్ద పండగలన్నీ ఐపోయాయి. చలిగాలులు మొదలయి గిలిగింతలు పెడుతుంది. కాని చాలా మంది  ఈ నెలలోనే వచ్చే ఇంకో పండగ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.  పండగ కదా అని అందరూ జరుపుకోరు. సంతోషించరు. ఆ పండగలోని అంశాలు, విశేషాలంటే ప్రేమ ఉన్నవారు మాత్రమే ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ, రోజులు లెక్కపెడుతూ ఉంటారు. కొన్నేళ్ళుగా, దక్షిణభారత దేశంలోని అనేక నగరాల్లో శీతాకాలంలోనే  ఈ  పండగ జరుగుతోంది. ఇది కూడా కన్నుల పండువుగానూ ఉంటోంది. రుచుల విందు కూడా  పెడుతోంది, ఐతే, నోటికి కాదు, బుర్రకి. ఇంకా అర్ధం కాలేదా. అదేనండి  డిసెంబరు నెలలో హైదరబాదులోనూ, జనవరిలో విజయవాడలో  జరిగే ముఖ్యమైన పండగ పుస్తకాల పండగ. పుస్తకాలను నమిలి మింగేసె ప్రేమికులకు ఓ విశేషమైన పండగ …. పుస్తక ప్రదర్శన.

 

పుస్తకం మనకున్న ఓ మంచి నేస్తం.. ఇది తెలిసిందే కొత్తగా చెప్పేదేముంది. దాదాపు ప్రతీమనిషి జీవితంలో పుస్తకంతో అనుబంధం ఉంటుంది.. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా. కంప్యూటర్, అంతర్జాలం ఆధారంగా ప్రపంచం మన ముంగిట్లోకి వచ్చినా కంప్యూటర్, మొబైల్ ఫోన్, ఐపాడ్ మొదలైనవాటిలో పుస్తకాలు చదివే వీలు ఉన్నా.. పుస్తకాన్ని కొని అందరికీ దూరంగా, మనదైన లోకంలో ఒక్కో పేజీ తిప్పుకుంటూ ఆ స్పర్శని అనుభవిస్తూ అందులోని అక్షరాల వెంట ఒకోసారి నిదానంగా, ఒకోసారి హడావిడిగా పరిగెడుతూ కథలో పూర్తిగా మునిగిపోవడం పుస్తకప్రియులకు అనుభవైకవేద్యమే కదా.. ఇప్పటికే ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నా ఇంకా ఏదో లోటు. ఇంకా అన్వేషించాలి. కొనాలి. చదవాలి అనే ఆరాటం . ఈ ఆరాటానికి, అన్వేషణకు పుస్తక ప్రదర్శన సరైన పరిష్కారం… వందల కాదు కాదు వేల పుస్తకాలు ఒక చోట మనకోసం కొలువై ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రదర్శనలోకి అడుగుపెడితే “అటు నేనే ఇటు నేనే” అన్నట్టు ఎటు చూసినా పుస్తకాలు!… ముందుకు వెళితే పుస్తకాలు, వెనక్కి చూస్తే పుస్తకాలు, పక్కకు జరిగితే పుస్తకాలు!  పెద్దలు, పిల్లలు అందరికోసం  ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరిబికిరి చేస్తూ “నన్ను చదువు అంటే నన్ను చదువు” అని పోటీపడుతూ  ఆహ్వానిస్తూ ఉంటాయి. ఏది కొనాలో, ఎది వదులుకోవాలో అర్ధం కాదు. అన్నీ కావాలనిపిస్తుంది.

పదండి మరి ఎల్లుండి అంటే 7వ తారీఖునుండి 14 వరకు హైదరాబాదు పుస్తకప్ర దర్శనను సందర్శించి చలం, బాపిరాజు, విశ్వనాధుడు, దేవులపల్లి, కొ. కుటుంబరావు, కొవ్వలి, యద్ధనపూడి, శ్రీనాధుడు, బీనాదేవి, నోరి నరసింహశాస్త్రి,వేటూరి, బాపు,  పిలకా గణపతి శాస్త్రి, మొదలైనవారి నుండి ఈనాటి మేటి రచయితలను పలకరించి, నచ్చినవాళ్లని ఇంటికి తెచ్చేసుకుందాం. ఎక్కడ అంటే ఇందిరా పార్కుకు ఎదురుగ్గా ఉన్న ఎన్.టీ.ఆర్ స్టేడియంలో..

అందుకే  అనేది గతకాలపు నానుడి. పుస్తకం మస్తిష్క మధన సాధనం అనేది నేటి నానుడి.

5 thoughts on “సంపాదకీయం : పుస్తకం హస్తభూషణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *