May 2, 2024

అమరనాథ్ యాత్ర

రచన: కర్రా నాగలక్ష్మిnagalakshmi karra

 

 

 

 

 

హిమాలయాలలో ఉన్న మరో ముఖ్య మైన శైవక్షేత్రం  అమరనాథ్ . ఈ యాత్ర మెత్తం ఏడాదిలో ఒక నెల మాత్రమే జరుగుతుంది. మిగిలిన 11నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ యాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢ పూర్ణిమతో మొదలయి శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ యాత్రని 2 నెలలకు పొడిగించారు అంటే ఇప్పుడు జ్యేష్ట పూర్ణిమతో మొదలయి శ్రావణ పూర్ణిమ వరకు కొనసాగుతోంది . ఈ యాత్ర కొరకై  చాలా ప్యాకేజి టూర్లు వచ్చేయి. ఇలాంటి టూర్లలో మనకు నచ్చిన దానిలో మనకు అందుబాటులో ఉన్న వాటిని ఏన్చుకోవచ్చు .ఈ టూర్ అపరేటర్లు ఈ యత్రకి కావలసిన  రిజిస్ట్రేషన్, యాత్ర డేట్ బుకింగ్ భోజన వసతులు అన్ని వాళ్ళే చూసుకుంటారు .

Amarnath_yatra_16597

శ్రీనగర్ నుంచి అమరనాథ్ గుహ 120 కీమీ దూరంలో ఉంది సముద్ర మట్టానికి 3888 మీటర్ల యెత్తులో ఉంది. ఈ గుహా చేరడానికి రెండు దారులు ఉన్నాయి 1)బాల్తాల్ 2) పహల్ గావ్.

1) బాల్తాల్—-

శ్రీనగర్ నుంచి సోనేమార్గ్ మీదుగా బల్తాల్ కి సుమారు 120కిమీ బాల్తాల్ నుంచి అమర్నాథ్ గుహకి

16 కిమీ బాల్తాల్ నుంచి గుర్రాలు డొలీలు దొరకుతాయి. హెలికాప్టర్ సర్వీసు కూడా ఉంది. హెలికాప్టర్ 9 కిమీ వరకు మాత్రమే వెడుతుంది . అక్కడ నుంచి మళ్ళీ గుర్రం కానీ,  డోలీలోగాని ప్రయాణం చెయ్యాలి. బాల్తాల్ నుంచి 8, 9 కిమీ ప్రయాణం తరవాత “బరారి “అనే  ఊరు వస్తుంది  ఊరు అంటే ఏవో రెండు ఇళ్ళు 2,3 లంగరులు ఉంటాయి అంతే . లంగరు అంటే యాత్రకి వచ్చే భక్తులకి ఉచితంగా భోజనం పెడతారు.  ఇల్లాంటివి జమ్మూ నుంచి అమరనాథ్ గుహ వరకు ఉంటాయి. “బరారి” నుంచి 4 కిమీ ప్రయాణం తరవాత సంగం చేరుకుంటాము . సంగం నుంచి గుహ కి 3 కిమీ ఈ 3 కిమీ గ్లేషియర్  మీద మన నడక సాగుతుంది . కాబట్టి ఆ వాతావరణానికి సరిపడే బట్టలు, జోళ్ళు తీసుకు వెళ్ళడం మరచిపోకోడదు .1/2 కిమీ మెట్లు ఉంటాయి.  గుహ దగ్గర పడ్డాక 4, 5 పావురాలు మాత్రం కనబడతాయి అవి తప్ప మరో జీవరాసి కనబడదు.  నేలబారు చిన్నచిన్న మొక్కలు అక్కడక్కడ కనిపిస్తాయి.  కొందరు సాధువులు వీటిని తెంపి భద్ర పరుచుకుంటూ కనిపిస్తారు అవి ఏంటని ప్రశ్నిస్తే ఏవో దుర్లభమైన ఆయుర్వేద మందులని చెప్తారు. సంగం నుంచి అడుగు అడుగునా లంగరులు , వైద్య సదుపాయాలూ,  రాత్రి ఉండడానికి టెంట్లు ఉంటాయి కాని దర్శనం చేసుకొని వెంటనే క్రిందకి రావడానికి ప్రయత్నిస్తే మంచిది.

M_Id_403623_Amarnath_Yatra

గుహలో నిలువెత్తు మంచులింగ దర్శనం చేసుకోగానే కలిగే అనందం, ప్రశాంతత మాటలలో చెప్పలేము. అనుభవించవలసిందే. తరవాత పార్వతి , వినాయకుడిని (ఇవి కూడా మంచుతో ఏర్పడే ఉంటాయి )దర్శించుకున్న తరవాత అక్కడే ఉన్న చిన్న గుహ లోంచి ప్రవహిస్తున్న అమరగంగ ని మన దగ్గర ఉన్న నీళ్ళ బాటిల్ లో నింపుకోవడంతో అమరనాథ్ యాత్ర పూర్తి అవుతుంది. బల్తాల్ లో ఉదయం 5 గ0 లకి బయలుదేరితే దర్సనం చేసుకొని తిరిగి బాల్తల్ సాయంత్రం 6 లేక 7 గం లకి చేరుకోవచ్చు . అదికూడా గుర్రాల మీద కాని, డోలిలో కాని, హెలికాఫ్టర్ అయితే అప్పుడప్పుడు తక్కువ సమయం పట్ట వొచ్చు.   చాలాసార్లు ఎక్కువ సమయం పట్టవచ్చు  ఆ రోజు అక్కడి వాతావరణం బట్టి, హెలికాఫ్టర్ లో వెళ్లేవారి సంఖ్య బట్టి ఉంటుంది. హెలికాఫ్టర్ ఆపరేటర్లు మాత్రం చాల బాగా ఆపరేట్ చేస్త్తున్నారు . హెలికాఫ్టర్ మీద వెల్తే 7 కి.మీ గుర్రాలమీద గాని డోలిలలో కానీ వెళ్ళవలసి వస్తుంది .

image.png

2) పహల్ గావ్ దారిలో చేసే యాత్రని శివుడు పార్వతి వెళ్ళిన దారిగా శివ పురాణంలో చెప్పబడింది . ఈ దారిలోనే చడి ముబారక్ (ఇది ఎర్ర వస్త్రంలో  చుట్టబడి మిగిలిన సంవత్సరం అంతా జమ్ములో అమరనాధుని రూపంగా పూజ చెయ్య బడుతుంది. దీనిని ఆషాఢపూర్ణిమ రోజుకి అమరనాధ్  గుహకి తీసుకొనివచ్చి తిరిగి శ్రావణ పూర్ణిమ నాడు ఆఖరు పూజ చేసి జమ్ముకి తిరిగి తీసుకోని వస్తారు)ని ఈ దారంటే తీసుకోని వస్తారు. దారిలో యాత్రకి మెత్తం 42 కి.మీ ప్రయాణం చెయ్యాలి. భగవంతుని దయవలన ఈ దారిలో కూడా వెళ్లి అమరనాధుని దర్సించుకొనే భాగ్యం  మా దంపతులకి కలిగింది. పహల్ గావు నుంచి 16 కి.మీ  ఫట్ ఫటి (చిన్న వేన్ లాంటిది 15,16 మంది ప్రయాణించ వచ్చు.)మీద ప్రయాణం . ఈ దారిలో ఈ ప్రదేశాన్ని బేస్ కేంప్ గా వ్యవహరించవచ్చు. దీనిని చందనవాడి అని అంటారు. ఇక్కడ రాత్రి బస చేసుకొని మర్నాడు 6 గం లకి ప్రయాణం మొదలు పెట్టాలి ఇక్కడ నుండి అంతా నడకే గుర్రాలు, డోలీలు ఉంటాయి . చందనవాడి సముద్ర మట్టానికి 9500 ఆడుగుల ఎత్తులో ఉంటుంది. చందనవాడి  నుంచి “శేష్ నాగ్ 13 కి మీ . ఇక్కడ మళ్ళీ రాత్రి బస చేసి మర్నాడు 14 కి మి ప్రయాణం చేస్తే గుహ చేరుకుంటాం . శేష్ నాగ్ నుంచి 8 కిమీ దూరంలో పంచ తరణి . పంచ తరణి నుంచి 3 కిమీ ప్రయాణం తరవాత సంగం చేరుకుంటాం.  ఇక్కడ ” బాల్తాల్” నుంచి ” పహల్ గావ్ “నుంచి వచ్చే దారులు రెండు కలుస్తాయి ఇక్కడ నుంచి గుహ 3 కి మి. చాలా మంది భక్తులు తిరిగి “పహల్ గావ్ ” వెళ్ళకుండా “బాల్తాల్” మీదుగా శ్రీనగర్ చేరుకుంటారు  సమయం శ్రమ కలసి వస్తాయని .

అమరనాధ్ కధ శివపురాణం ప్రకారంగా ఇలా చెప్పబడింది .

నారదునికి శివపార్వతుల  అన్యోన్యత చూసి ఇద్దరికీ తగవు పెట్టాలనే చిలిపి ఆలోచన కలిగిందిట. వెంటనే నారదుడు ఈశ్వరుడు లేని సమయం చూసుకొని కైలాసానికి వెళ్లి పార్వతి తో ఈశ్వరునితో  పని ఉండి వచ్చి నట్లు చెప్పి ఈశ్వరుడు వచ్చే సమయానికి తిరిగి వెళ్లి పోయేవాడుట .ఈవిధంగా 2,3 రోజులు జరిగిన తరవాత పార్వతిదేవి “నారదా రోజు వచ్చి ఈశ్వరుని కోసం వేచి ఉంటున్నావు ఏ పనిమీద వచ్చేవు నాయనా ” అని అడిగిందిట . అందుకు ఆ కలహ ప్రియుడు “ఒక సందేహం కలిగింది తల్లి అది ఈశ్వరుడు తప్ప మరి ఎవ్వరు తీర్చలేరు తల్లీ” అని అంటాడు . దానికి పార్వతిదెవి” అదేమిటి నాయనా నేను ఈశ్వరుని పత్నిని నాకు తెలియని విషయం, ఈశ్వరునికే తెలిసిన విషయం ఏదీ లేదు” అని అందిట. అప్పుడు కలహాభోజనుడు కొంతసేపు బ్రతిమలాడేక మురిపించుకొని ” మరేమీ లేదు తల్లి ఈశ్వరుడు కపాలమాలని ఎందుకు యెదపై ధరిస్తున్నాడు . ఆ కపాలములు ఎవరివి అని సందేహం కలిగి తెలుసుకోగోరి ఈశ్వరుని  దగ్గరకి వచ్చానమ్మా.  నా సందేహ నివృత్తి గావించు తల్లి” అని అన్నాడుట. పార్వతీదేవి “అయ్యో నారద ఈ విషయం నేనెప్పుడు నా స్వామిని అడగలేదు ఈ దినం తెలుసుకుని నీకు చెప్తాను రేపు రా నాయనా” అని అన్నదిట .

మరునాడు నారదుడు రాగానే “అయ్యో నారదా! అవి నా పుర్రెలేనుట నా పతికి నేనంటే ఎంత ప్రేమో చూసేవా? నా  గత జన్మల జ్ఞాపకార్ధం నా పుర్రెలని తన హృదయం పైన మోస్తున్నాడు ” అని అన్నదిట. కలహప్రియుడు కలహం పెట్టడానికి వచ్చేడాయే ఊరుకుంటాడా? “మరి అలాగైతే నీకు నీ పతిమీదా ప్రేమలేదా తల్లి మరి నీ మెడలో కపాల మాల లేదేమి “అని”అయినా బ్రహ్మచారిని నాకేమి తెలుస్తాయి . ఈ ప్రేమలగురించి  అని ఓరకంటన పార్వతిదేవిని చూసి తను వచ్చిన పని పూర్తి అయిందని సంతోషించి ” నారాయణ నారాయణా “అంటూ వెళ్లిపోయాడుట  .

నారదుడు లేవనెత్తిన సందేహం గురించి పార్వతి అడుగగా ఈశ్వరుడు తనకు అమరత్వం ఉన్నట్లు పార్వతికి అమరత్వం లేనట్లు చెప్తాడు . తనకు కూడా అమరత్వం కలిగించమని ఈశ్వరుని వేడగా  కాదని ఈ కథని ఎవరు వింటే వారికి అమరత్వం కలుగుతుంది కావున ఏ ప్రాణి నివాసయోగ్యం కాని ప్రదేశం వెతకమని ఈశ్వరుడు తన నంది మొదలగు గణాలను పంపగా వారు ఈ గుహలో ఏ  ప్రాణి కూడా లేవు అని నిర్ణయించుకొని ఈశ్వరునికి ఈ ప్రదేశం గురించి చెప్పగా ఈశ్వరుడు తన నందిని విడిచిపెట్టి పార్వతిసమేతంగా  గుహవైపు పయనిస్తాడు. నందిని విడిచిపెట్టిన ప్రదేశం “బైల్గావ్ (బైల్ అంటే ఎద్దు అని అర్ధమ్) కాలక్రమేనా బైల్గావ్ పహల్గావ్ ఐంది. మరికొంత దూరం ప్రయాణించాకా తలపై నున్న చంద్రున్ని విడిచి పెట్టిన  ప్రదేశం చందన్ వాడి గా పిలవబడుతోంది . సేషనాగ్ లో మెడలోనున్న పాముని పంచతరణి లో ఢమరుకము , త్రిశూలము మెదలైనవి విడిచిపెట్టి తను పార్వతి మాత్రమే  గుహలోనికి వెళ్లి నంది గణాలు ఏర్పాటు చేసిన దర్భాసనము పై కూర్చుని పార్వతికి అమరకధ వినిపిస్తాడు ఈశ్వరుడు . కధ పూర్తి అయిన తరవాత ఈశ్వరుడు పార్వతిసమేతముగా కైలాసమునకు పోవుటకు సంసిద్దులు కాగా ఒక పావురము వారు కూర్చున్న దర్భల మధ్య నుండి ఎగిరి పోతూ ఉండుట చూచి ఈ పావురము అమరకధ విన్నదని  తెలుసుకొని ఈశ్వరుడు ఆ పావురాయి ని వెంటాడుతూ  దాని వెనకాలే వెళ్తాడు అప్పుడు ఆ పావురము అరుంధతి పొట్టలోకి దూరి  పోయి దాక్కొంటుంది . అరుంధతి దివ్యదృష్టితో చూచి ఎవరు నువ్వు ఎందుకు నా పొట్టలో దాక్కోన్నావు అని అడుగగా ఈశ్వరుడు తనను సంహరించేందుకు కాపుకాచి  ఉన్నాడు కావున ఈశ్వరునినుంచి అభయం ఇప్పిస్తే నీ పొట్టలోంచి బయటికి వచ్చి సన్యాసించి సన్యాసిగా బతుకుతాను అని విన్నవించుకుంటాడు . అందుకు సరే అని అరుంధతి ఈశ్వరుని ప్రార్దించి అభయం ఇప్పిస్తుంది.  అప్పుడు ఆ పావురము బయటకి వచ్చి అరుంధతికి, ఈశ్వరునికి నమస్కరించి నైమిశారణ్యమునకు వెళ్లి మునులకు , ఋషులకు పురాణములు చెప్పుకుంటూ శుకమహర్షి గా పేరుపొంది ఇప్పటికి అక్కడ అమరునిగా ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి.  ఆ పావురము కోరిక పై పార్వతి పరమేశ్వరులు రోజూ ఈ గుహలో కొంతసేపు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారని  ప్రతీతి .

AMARNATH_YATRA__1_1501348g

కలియుగ ప్రవేశానంతరం పరమశివుడి భక్తులను పాప విముక్తులను గావించి జన్మ రాహిత్యం కలించే ఉద్దేశ్యంతో ఈ క్రింది విధంగా తాను  ఈ గుహలో ఉన్నట్లు తెలియజేయాలనుకుంటాడు .

అది ఈవిధంగా ఉంది . ఒక ముస్లిం కుర్రవాడు ఒక బ్రాహ్మణుని దగ్గర గోవులను సంరక్షిస్తూ ఉంటాడు . ఒక రోజు ఒక ఆవు మేతమేస్తూ లోయలో పడి మరణిస్తుంది.  ఆవులకాపరి తన యజమానికి విషయం వివరిస్తాడు.  బ్రాహ్మణుడు పిల్లవాని మాటలు నమ్మక ” మీరు నా ఆవుని చంపి తిని ఉంటారు. నా ఆవును  రేపటిలోగా నాకు తెచ్చి ఇవ్వలేని పక్షంలో రాజుగారికి చెప్పి మరణదండన విధిస్తాను ” అని అంటాడు. ఆ బాలుడు ఆవు మరణించిన ప్రదేశానికి వెళ్లి ప్రాణత్యాగం చేసుకోదలుస్తాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆవుని బతికించి బాలునికి ఇస్తాడు. బతికి ఉన్న ఆవుని చూసి కోపోద్రేకుడై బ్రాహ్మణుడు బాలకుని సంహరించేందుకు  కత్తి పట్టుకొని చంపేందుకు వెంటబడి తరుముతాడు. అది చూచి ప్రాణభయంతో ఈశ్వరుడు  ప్రత్యక్షమైన  ప్రదేశానికి  వచ్చి మహానుభావా!   నీవే వచ్చి మా యజమానికి నిజం చెప్పు లేకపోతే  నాప్రాణాలు తీసుకో అని కన్నీరు మున్నిరుగా విలపిస్తాడు.  అప్పడు ఈశ్వరుడు బ్రాహ్మణునికి కూడా దర్సనం ఇచ్చి బాలుడు నిర్దోషి అని చెప్తాడు . ఆ రోజు నుంచి బ్రాహ్మణుడు ఆ గుహలో పూజలు నిర్వహించసాగాడు. హుండిలో వచ్చే సొమ్ము ఆ ముస్లిం బాలకుడికి, బ్రాహ్మణునికి సమ వాటాలు గా పంచబడేవి . ఇప్పటికి కూడా ఇదే పద్దతి సాగుతోంది.  కొంత భాగం బ్రాహ్మణుని వారసులకు, కొంత ముస్లిం కుర్రాడికి వారసులకు, కొంత గవర్నమెంటు వారికి చెందుతుంది . ఈ యాత్రలో గుహలో పావురాలు కనబడితే చాలా పుణ్యం చేసుకున్నట్టు గా భావిస్తారు.  అమరానాధుని దర్శించుకుంటే అమరత్వం ( మరో జన్మ ఉండదని) సిద్దిస్తుందని ప్రతీతి.

ఏమైనా గాని ఈ ప్రయాణం ఒక మరపురాని అనుభవమే అని చెప్పుకోవాలి. ఈయాత్రలో  ప్రకృతి వైపరిత్యాలే కాకుండా మిలిటెంట్ల వాళ్ళ కుడా భయం ఉంటుంది. అంటే అంతా ఈశ్వరేచ్ఛ అనుకొని చేయవలసిన యాత్ర .

సర్వే జనా సుఖినో భవంతు . ఓం నమః శివాయః .

3 thoughts on “అమరనాథ్ యాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *