April 30, 2024

మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను! – సమస్యకు జవాబు

j.k.mohanraoరచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

మాలిక మాసపత్రిక పాఠకులు నేను వివరించిన ఆటనుగుఱించి చదివారా అనే ఒక ప్రశ్న నాకు ఉదయించింది. ఈ ఆటనుగుఱించి ప్రచురణకు ముందే Facebook ద్వారా దయతో సంపాదకులు ప్రకటనను కూడ ఇచ్చారు. అయినా బహుశా వేలాది పాఠకులు చదివే ఈ అంతర్జాల పత్రికలోని ఈ ఆటలో ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు, కూడ నాకు సందేశము పంపలేదన్న విషయము ఎంతో బాధ కలిగించినదన్న మాట వాస్తవము. బహుశా అది నా దోషమేనేమో?  ఇకమీద ఇలాటి ఆటలకు స్వస్తి చెప్పాలా అన్న విషయముపైన నిర్ణయము తీసికొనకున్నా, నేను వివరించిన సమస్యకు పరిష్కారము చూపడము నా కర్తవ్యము, కాబట్టి దానిని ఇక్కడ వివరిస్తున్నాను.

నేను ఈ పద్యమును వ్రాయుటలో ద్విగుణాంక సంఖ్యలను (binary numbers) వాడినాను.  ఈ బైనరీ సంఖ్యలు కంప్యూటరువంటి సాధనములకు ఆయువుపట్టు. 1 నుండి 31 వఱకు ఉండే సంఖ్యలు బైనరీ ఈ విధముగా నుంటాయి – 1 ->  00001, 31 -> 11111.  సీస పద్యము, ఆటవెలది రెంటిలోని మొత్తము పాదముల సంఖ్య 6. అందులో ఆఱవ పాదము ఈ ఆటకు అనిమిత్తము. ఈ పద్య నిర్మాణములోని అక్షరములు ఈ బైనరీ సంఖ్యలకు సరిపోయేలా వ్రాసినాను. అంటే ఒక్కొక్క అక్షరము కొన్ని పాదములలో మాత్రమే కనబడుతుంది. ఒక అక్షరము మొదటి పాదములో మాత్రమే ఉండవచ్చును లేకపోతే 1 నుండి 5 పాదములవఱకు అన్ని పాదాలలో నుండవచ్చును.  ఎడమ నుండి  కుడి వఱకు ఆయా పాదముల సంఖ్యలను తెలుపుతాయి.

ఒకటవ పాదము – 10000, రెండవ పాదము – 01000, మూడవ పాదము – 00100, నాలుగవ పాదము – 00010, ఐదవ పాదము – 00001.  10101 అనగా మొదటి, మూడవ, ఐదవ పాదములు. పద్యములో వాడబడిన అక్షరములు, వాటి పాద సంఖ్యలు క్రింది పట్టికలో చూడవచ్చును –

1  2  3  4  5 పాదము

1  1  1  0  0 క

0  1  0  0  0 ఖ

1  0  1  1  0 గ

1  0  0  0  0 ఘ

1  1  0  1  0 చ

0  0  1  1  0 ఛ

0  1  1  1  0 జ

0  0  1  0  0 ఝ

0  1  0  0  1 ట

0  0  0  1  0 ఠ

1  1  0  0  1 డ

0  0  0  0  1 ఢ

0  0  1  0  1 ణ

1  0  1  0  1 త

1  0  0  0  1 థ

1  1  0  1  1 ద

0  0  0  1  1 ధ

1  1  1  1  0 న

0  1  1  0  1 ప

0  1  0  1  0 ఫ

1  0  0  1  1 బ

1  0  0  1  0 భ

1  1  1  1  1 మ

0  1  1  1  1 య

1  1  1  0  1 ర

1  0  1  1  1 ల

0  1  0  1  1 వ

0  1  1  0  0 శ

1  0  1  0  0 ష

0  0  1  1  1 స

1  1  0  0  0 హ

 

ఇందులో తెలుగులో ఎక్కువగా వాడని అక్షరములైన ఖ(2వ పాదము), ఘ(1), ఝ(3), ఠ(4), ఢ(5) లను ఒకే పాదములో (ఆ పాదముల సంఖ్యలు కుండలీకరణములో చూపబడినవి) మనము చూస్తాము. అన్ని పాదములలో కనబడే అక్షరము మ-కారము.  మిగిలిన అక్షరములను 2 నుండి 4 పాదములలో మనకు ప్రత్యక్షమవుతాయి.  మొత్తము 31 అక్షరములను మాత్రమే ఈ ఆటలో ఎన్నుకొన్నాను. ఎందుకంటే 32 కు సరిపోయే ద్విగుణాంక సంఖ్య 100000. 111111 సంఖ్య 63కు సరిపోతుంది. అందువలన ఈ సమస్య 31 అక్షరములకే పరిమితము.  ఇప్పుడు పద్యమును మళ్లీ గమనిద్దామా?

 

సీసము-

1) మన భాష గాథలు – మనకిచ్చు ఘనకీర్తి,

భారతిన్ బొగడుగా – నూరు హృదులు,

2) హృదయ మక్కటికమ్ము, – చిదమర శిఖరమ్ము,

ఫక్కియు నజడమ్ము – వరద కెపుడు,

3) మసృణపు ఝరులాయె, – మతి కింపు శ్రుతు లౌర,

మృష లేని జిగి క్రొత్త – మెఱపు ఛాయ,

4) సభలోన గఠినమ్ము – సఫల మవగ వాంఛ,

జయమది జగదంబ – చలువ విధిగ,

 

ఆటవెలది-

5) పృథివియందు దృఢిమ – బ్రియమార బిల్తు, స-

ద్వీణ మీటెడు విధి – రాణి సతము,

6) నన్ను గనుమ యమ్మ – నలువదేవుని గొమ్మ,

నిన్ను గొలుతు నమ్మ – నిజము నమ్ము.

మీరు స అక్షరమును తలచుకొన్నారనుకొనండి, అది 3 (సృ), 4 (స), 5 (స) పాదములలో మనకు కనబడుతుంది.  మీరెవరైనా నేను తలచుకొన్న అక్షరము 3,4,5 పాదములలో ఉన్నది అని చెప్పితే తక్షణమే ఆ అక్షరము స-కారము అని చెప్పగలను.  క-కారాన్ని తలచుకొంటే అది 1 (కి, కీ), 2 (క, క్కి, కె), 3 (కిం, క్రొ) పాదములలో ఉన్నది కనుక మీ ప్రశ్న అప్పుడు “నేను తలచుకొన్నది 1,2,3 పాదములలో ఉన్నది, అదేమి?”. ఇలాగే మిగిలిన అక్షరములకు.

ఛందస్సులో గణితశాస్త్ర విజ్ఞానము, క్రీడాతత్వము రెండు ఉన్నాయని దీనివలన మనము తెలిసికొనవచ్చును.  ఉంటాను!

 

2 thoughts on “మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను! – సమస్యకు జవాబు

Leave a Reply to NagaJyothi Ramana Cancel reply

Your email address will not be published. Required fields are marked *