ఆఖ్రి సలాం ( నోముల కథలు – 2014)

రచన:పరవస్తు లోకేష్

ఆంధ్రప్రదేశ్ అవతరించిన సంవత్సరమది

        ఆ రోజులలోఒకానొక సాయంత్రం హైదరాబాద్ పాతనగరం శాలిబండల మా ఇంటి వెనుక పెరట్ల నిండుపున్నమి, పండు వెన్నెల, మల్లెపందిరి క్రింద ఘుమ ఘుమల మత్తుగాలుల మధ్య ముషాయిరా శురువయ్యింది. రంగుపూల పత్రంజీ మీద మల్లెపూవులాంటి తెల్లని చాదర్ పరిచి అందులో గుండ్రంగా కూర్చున్న వాళ్ళ మధ్యల వెలుగుతున్న షమా సాక్షిగా కమనీయ కవితా గానానికి అంతా తయారయ్యింది. నాజూకు నడుము లాంటి తెల్లని పొడుగు పొడుగు సీసపు గ్లాసులల్ల ఎర్రెర్రని ఖర్బుజా షర్బత్తులు సరఫరా అవుతున్నాయి. అక్కడ అలరించిన షాయర్ ల శేర్వానీలకు చమేలీ అత్తరులను అలవోకగా అద్ది వారికి సవరతన్ పాన్ సుపారీలను సగౌరవంగా అందించారు. ఉజ్వలంగా వెలుగుతున్న షమా పక్కన తళతళలాడే తాంభాళంలో తాజా రోజా ఎర్ర గులాబీలు ఒద్దికగా ఒప్పుల ఒప్పుల కుప్ప వొయ్యారి భామలా బుద్దిగా కూచున్నాయి. అక్కడి మాహోల్ మొత్తం మురిపించి మైమరిపించే మాయాజాలంగా, మంత్రనగరిగ మారిపోయింది.

ఆనాటి ముషాయిరా మా బాపు సదారత్ లన్ (అధ్యక్షత) శురువయ్యింది. ఆయన జిగ్రీదోస్తులు జనాబ్ ఉస్మాన్ సాబ్, జిలానీ సాబ్, లతీఫ్ సాబ్, జాఫర్ మియా, గంగారాం, లక్ష్మీ నరసయ్యలే గాక ఇంకా నారు పేరు తెల్వని వాళ్ళు చాలామంది అక్కడ హాజరయ్యారు. నాదప్పుడు పన్నెండేళ్ళ వయసు. చిన్నపిల్లగాడ్ని కదా అందుకే దూరంగా నిలబడి ఆ ముషాయిరాను ఆనందిస్తున్నా.  రాత్రి రగులుకుని రంజుగ రాణిస్తుంటే నా తభ్యత్ ఖుష్ బపోయింది.

సదర్ ముందు షమా నిలబడిపోయింది. ఆయన ప్రారంభించాలని సూచన అది. మా బాపు అశువుగ ఒక షేర్ వినిపించిండు.

హమే దునియా స ర్యా మత్ లబ్

కుత్ బ్ ఖానా హై వతన్ అప్నా

మరేగే హమ్ కితాబో పర్

హర్ వరఖ్ హై కఫన్ అప్నా

( ఈ లోకంలో మాకేం సంబంధం గ్రంధాలయమే మా స్వదేశం పుస్తకాల కోసం ప్రాణాలు విడుస్తాం ప్రతి కమ్మను కప్పుకుని లోకాన్ని వదులుతాం)

మల్లెపందిరి క్రింద మల్లెపూల వాన కురిసినట్టుల అక్కడ వాహ్వా వాహ్వాల ప్రశంసల జల్లు కురిసింది. దాంతో ఆయన మరొకటి అందుకున్నడు.

పూల్ బన్ కర్ ముస్కురానా జిందగీ

ముస్కురాకే గమ్ బులానా జిందగీ

హర్ దిన్ స మిల్ పాయేతో క్యాహునా

దూర్ రహకర్ భీ దోస్తీ నిఖానా జిందగీ

( పూవు వలె చిరునవ్వులు చిందించటమే జీవితం. చిరునవ్వుల చింతలను మరిపించటమే జీవితం, ప్రతిరోజు కలసి మెలసి జీవించక పోతేనేం దూరాల నుండి స్నేహాన్ని కొనసాగించడమే జీవితం)

మా బాపు కు తెలుగు కన్నా ఉర్దూమీదనే మక్కువ ఎక్కువ. నైజాం జమానాలో ఆయన చదువంతా ఉర్దూ మీడియంలోనే జరిగింది. ఆయన పనిచేసేది కూడా ఉర్దూ మీడియం బడి. ఉర్దూ టీచర్ గానే ఇంటికి ప్రతిరోజు సియాసత్ అక్బార్ తెప్పించెటోడు. తెలుగు దినపత్రిక తెప్పిస్తే మేం కూడాచదువుతాం కదా అని అమ్మ కొట్లాట. ఇక రైస్ బజార్ నుండి  మా మేనమామ సైకిల్ తొక్కుకుంటూ మా ఇంటికి వస్తే చాలు బావాబామ్మలిద్దరూ కల్సి ఉర్దూలోనే మాటా ముచ్చట. మజాక్లు . మాకు మా చిన్నతనంల ఇంగ్లీష్ కంటే ముందు ఉర్దూనే పరిచయం అయ్యింది. అట్ల మాకు ఇద్దరు అమ్మాయిలు. ఒకరు తెలుగు మరొకరు ఉర్దూ. త్రివేణి సంగమంలాగ అరబ్బీ, ఫార్సీ, హిందీల మేలి కలయిక ఉర్దూ. అది ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. భారతదేశానికి మరో ముద్దుబిడ్డ.

జిలుగు వెలుగుల వెన్నెల చిక్కబడుతుంటే ముషాయిరా జోర్ అందుకుంది. ఉస్మాన్ సాబ్, జిలానీ సాబ్ ల కవితాగానం అయిపొంగనే షమా జాఫర్ మామూ ముందు హాజిర్ అయ్యింది. దీపశిఖ సాక్షిగా ఆయన తన రాగయుక్త సంగీత స్వరంతో శ్రోతలను మంత్రనగరిలోకి ఎత్తుకపోయిండు.

ఆఖే తమ్హారీ హూ తో అ సూ మేరీ హూ

దిల్ తుమ్హారీ హూ ధడ్రన్ మేరీ హూ

అల్లా కరే హమారీ ప్యార్ ఇత్నా గహకా హూ

సా స్ తుమ్హారీ మౌత్ మేరీ హూ

( కనులు నీవైతే కన్నీళ్ళు నావి. హృదయం నీదైతే స్పందన. నాది అల్లా దయవలన మన ప్రేమ ఎంతగాఢమో ఆగిన శ్వాస నీదైతే మరణం మాత్రం నాది కావాలి)

ఆ కవితామృతాన్ని ఆస్వాదించిన రసికుల నరనరాలలో పరవశత్వం పరవళ్ళు తొక్కింది.

శ్రీ రామచంద్రుడుకి హనుమంతుడు ఎట్లనో మా బాపుడు జాఫర్ మియా అట్ల. మా బాపు స్కూలుడు సదర్ సాబ్ అయితే అండ్ల జాఫర్ మియా ఒక చప్రాసీ. అతను పిల్లల కోడి కనుక స్కూలు పిల్లలంతా అతన్ని జాఫర్ మామూ అని పిల్చెటోళ్ళు. నాకు కూడాఅట్లనే అలవాటు అయ్యింది. ఉద్యోగం అంతస్తులు మతాల అంతరాలు మరచిపోయి వాళ్ళిద్దరు అక్కన్న మాదన్నలు గా జిగ్రీదోస్తులుగా కల్సి ఉండేటోళ్ళు. బాపు ఆయన్ని చనువుతో ప్రేమగా హమారే జాఫర్ మియా అని పిలవగానే జీసాబ్ అనో లేక హా సాబ్ అనో వెంటనే బదులు పలికేటోడు.

బడి పనులన్నీ జిమేదారిగ ఎట్ల చేసెటోడో మా ఇంటి పనులు కూడా అట్లనే నెత్తిల వేసుకు చేసేటోడు . అమ్మకు బజారు పనులల్ల ఆయన ఆసరాగా ఒక పెద్ద కొడుకుగా ఉండేటోడు. అమ్మకు ఉర్దూ రాదు. ఆయనకు తెలుగు రాదు. వారిద్దరి మాటామంతి, ఆ అవస్థను చూసి మా పోరలకు ఉచిత వినోద  ప్రదర్శనమై పొట్టలు పగిలేటట్లు నవ్వుకునేవాళ్ళం.

జాఫర్ మామూ రూపం హైదరాబాద్ దక్కనే ఆమ్ ఆద్మీకి ప్రతిరూపంగా ఉండేది. నెత్తిమీద నల్లని టర్కిష్ బూరు టోపి, మందంగా ఉండే ఊదారంగు బిన్నీ శేర్వానీ, లోపల తెల్లని మస్లిన్ లాల్చీ, దాని క్రింద తెల్లటి ఇరుకిరుకు కాటన్ పైజామా వేసుకుని మధ్యస్థంగ ఎత్తు లావులతో ఉండేటోడు, ముఖమంతా గుబురు గడ్డం మీసాలే గాక చాలా అస్పష్టంగా అమ్మవారు  సోకిన మచ్చలు కూడాఉండేవి. ఖిమామీ జర్దాపాన్ నమిలి ముదురు రంగుకు మారిన పెదుముల మీద వాడిపోని ఒక చిరునవ్వు మాత్రం హమేషా చమ్కాఇస్తుండేది.

ఎండాకాలం తాతీళ్ళల్ల( సెలవుల) కూడా మా ఇంటికి వచ్చి పనేమైనా ఉందా అని అడిగి పనులేమీ లేకపోతే దివాన్ ఖానా ఆరాం కుర్చీల పురుసత్ గ కూర్చుని బాపుతో వొడవని ముచ్చట్లల్ల మునిగి తేలేటోడు.

పెంజీకట్లు కమ్ముకొస్తున్న ఒకానొక సంజెవేళల తన ఎద లోపలి విషాదగాధను మొదటిసారిగా లోకానికి వెల్లడిచేసిండు. అది వ్యక్తిగతమే బనా చరిత్ర చెక్కిలి మీద ఘనీభవించిన కాలం కన్నీటి గాధ అది.

 

కోహీర్…..

తెలుగులో వజ్రాల గుట్ట అని అర్ధం. జాఫర్ మియా పుట్టి పెరిగిన వతన్ అది. ప్రకృతి పొత్తిళ్ళల్లో పసిపాపలా ముడుచుకుని పడుకున్న పల్లె అది. చుట్టూ నల్లరాళ్ళ గుట్టల మధ్య ఎర్ర మట్టినేల మీద ఆకుపచ్చని పచ్చల పతకంలా మెరిసే పల్లెకోహీర్, కోహీర్ తియ్యటి జామపండ్లు అవ్వల్ దర్జా నంబర్ వన్ అన్నమాట. మొత్తం నైజాం రాజ్యంలనే ఆ పండ్లు మహా మషూర్. ఆ పండ్ల ముందు బార్కాస్ జామపండ్లు కూడా బేకార్. హైదరాబాద్ కు నూరు కిలోమీటర్ల దూరంలో బీదర్ కు పోయే సడక్ కు ఎడమ పక్కమీద ఆ పల్లె ఉంటుంది. గంగా యమునల సంగమం వోలె హిందు ముస్లింలు అక్కడ సహజీవనం చేస్తుంటారు. కాని 1948 సెప్టెంబరు పదిహేను తారీఖు మాత్రం ఆ పల్లెను అతలాకుతలం చేసి హైదరాబాద్ చరిత్రగతిని ఉల్టాపల్టాచేసింది.

ఆ రాత్రి జాఫర్ మొదటి బుక్కను బిస్మిల్లా అనుకుంటూ నోట్లో పెట్టుకోంగనే ఆకాశం పగిలిందా అన్నట్లు పెళపెళా చప్పుళ్ళు అటువంటి చప్పుడు జిందగీల ఎప్పుడూ వినలేదు. చెవులు చిల్లులుపడి భీరిపోయాడు. మరుక్షణమే మరో వింత చప్పుడు అది సైరన్ మృత్యుదేవత పిలుపులాగ అది కర్ణకఠోరంగా ఉంది. ఏమీ సమజ్ గాక ఎంగిలిచేయి కడుక్కోకుండనే ఇంట్లనుండి ఇతలకి ఉరికొచ్చిండు. అప్పటికే అందరూ అక్కడికి చేరి చీకటి ఆకాశం దిక్కు తలలెత్తి   చూస్తుండ్రు. భూతాల్లాంటి గాలి మోటార్లు మబ్బుల్ని చీల్చుకుంటూ పట్నంవైపు పరుగులు తీస్తున్నయ్. వాటి పొట్టక్రింద ఊరంతట్ని పట్టపగలుగ వెలిగిస్తున్న  లైట్లు. అవి దయ్యం కండ్లవోలె మిరిమిట్లు గొల్పుతున్నయ్. అది సరిపోదన్నట్లు మీది కెల్లి చెవులు దిబ్బపడే సైరన్ చప్పుళ్ళు. ఎవరికీ ఏమీ సమజ్ కాలే. మెడలు విరిగేటట్లు నెత్తులు మీది కెత్తి బొమ్మలోల వరుసగ ఉరుకుతున్న ఆ ఇనుప డేగలను నోరెళ్ళబెట్టుకుని చూస్తున్నరు. అవి యుద్ద విమానాలని, మిలిటరీ జనరల్ జె.యస్.చౌదరీ నేతృత్వంలో అవి హైదరాబాద్ పట్నాన్ని దిగ్భంధం చేసి నిజాం నవాబును గద్దె దించడానికి పోతున్నయని వాళ్ళకు తెలియదు. ఆ ఊరికి అక్బార్ రాదు. రేడియో లేదు, ఇక వాండ్లకు దునియా మీది ముచ్చట్లు, సియాసత్ సంగతులు ఏం తెలుస్తయ్. అందరూ అయోమయం జగన్నాధంలే.

గాలి మోటార్లు అట్ల పోయినయో లేదో ఊర్లకు సడక్ మీద బుర్రుబుర్రున చప్పుడయ్యింది. మళ్ళీ ఇదేం పరేషాన్ అని అందరూ అనుకుంటూ అటువేపు చూడంగనే మిలిట్రీ ట్రక్కులు కనపడినయ్. అండ్ల ఇనుప చిప్పల టోపీలు, ఖాకీ రంగు డిరస్సులు, బుజాల మీద యాలాడే 303 తుపాకులు, కాళ్ళకు బూట్లు కనిపించినయ్. ట్రక్కు క్యాబిన్ మీద చిన్న సైజు ఫరంగి ఫిట్ చేసి ఉంది. టైర్లమీద ఎర్రటి దుబ్బమన్ను పుల్లుగ నిండిపోయి ఆ ట్రక్కులు చాలా దినాలా నుండి చాలా దూరం నుండి దేశ దేశాలు తిరిగి వస్తున్నట్లు చూడంగనే వాళ్ళకు తెల్సిపోయింది. అవి లాల్ ఖిలా నుండి ఉక్కుమనిషి సర్దార్ పటేల్ పంపిన సైన్యాలని వాళ్ళకేం తెలుకు. హైదరాబాద్ స్టేట్ బార్డర్ లల్ల – గుల్బార్గా, రాయచూర్, షోలాపూర్, బీదర్, బీడ్, పర్బనీ, నాందేడ్, ఐరంగాబాద్ బార్డర్లల్ల నైజాం సైన్యాల్ని, రజాకార్ దళాల్ని తమ ఉక్కు పాదాల క్రింద తొక్కి, నలిపి, నాశలం చేసి పట్నాన్ని పట్టుకునేందుకు పోతున్న యూనియన్ సైన్యాలని వాళ్ళకేం తెలుసు.

ఆ ట్రక్కులల్ల నుండి దబ్బుదబ్బున క్రిందిరి దుంకుతున్న మిలిట్రీని చూడంగనే వాళ్ళు పోయిలకు వచ్చిండ్రు. మామూలు పోలీసు జవాన్నో లేకపోతే అమీన్ సాబ్ నో చూస్తనే పంచెలు తడుపుకునే ఆ అనాడీలు మిలిట్రీ కనపడంగనే దస్కుతిని కలుగులకు దూరిన ఎలుకల్లాగ తమ ఇండ్లల్లకు జొర్రి తలుపులు బిగాయించుకున్నరు.

సైన్యం ఊరి మధ్యల నిలబడి ఒక వర్గం గుండెలలో భయాన్ని సృష్టించి ఇంకో వర్గం మనస్సులలో భరోసాను కల్గించే ఆలోచనతో తొలుత ఆ ఊర్ల కనపడుతున్న ఆకుపచ్చ మసీదు గుంబజ్ ను ఫరింగితో పేల్చేసిండ్రు. ఆ రాత్రి వాండ్లు జరుపబోయే హింసాకాండకు ఆ చర్య నాందీప్రస్తావన అయింది. ఓడిపోయిన శత్రుదేశంపై గెలిచిన సైన్యం విజయోన్మాదం తలకెత్తితే ఏం జరుగుతుందో ఆ రాత్రి ఆ ఊర్ల అదే జరిగింది.

మసీదు గుంబజ్ తునాతుకలు కాంగనే ఆ హమ్లా ఎవరిమీదనో ముస్లింలకు ఖుల్లంఖుల్లగ సమజయిపోయింది. ఎవరి ప్రాణాలువాళ్ళు అరచేతులల్ల పెట్టుకుని ఇంటెనక తలుపులు తీసి ఊరి బయటి పొలాలకు ఉరికిండ్రు. వయసుల ఉన్నవాళ్ళు అట్ల తప్పించుకుంటే ఇగ ఇండ్లల ఆడోళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు మిగిలిపోయిండ్రు. ఇరవై ఏండ్ల జాఫర్ భీ అన్నతో కల్సి అడివిలకు పరారయ్యిండు. కాని ఏం ఫాయిదా మిలిగిన కుటుంబం మాత్రం బర్బాద్ అయిపోయింది.

జాఫర్ వొదినా, అమ్మతోపాటు ఊర్ల ఉన్న ముస్లిం ఆడోళ్ళందరు అన్యాయానికి గురయ్యిండ్రు. జాఫర్ అబ్బాజాన్ తో పాటు మరికొందరు మిలిట్రీకి చిక్కితే వాళ్ళందర్ని వరుసగ నిలబెట్టి లుంగీలు విప్పి ముస్లింలేనని నిర్దారణ చేసుకున్నంక కాళ్ళు చేతులు బిగించి కట్టి నిండుగ నీళ్ళున్న మోటలావులల్లకు విసిరేసిండ్రు. ముస్లింలందరూ రజాకార్లు కాదని, నిజాం నవాబు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులని ఆ సైన్యం ఆలోచించలేదు. ఆ సైనికులలో ఎక్కువ మంది పంజాబి సిక్కులు. దేశ విభజన చేసిన గుండె గాయాలను వారు ఆ అమాయక ముస్లింలపై చేసే దుర్మార్గం ద్వారా మాన్పుకోవాలని అనుకున్నరు. చేసేదంతా చేసిం తర్వాత ఆ ఊరి మాలి పటేల్, పోలీస్ పటెళ్ళకు హకుం జారిచేసి కోళ్ళు, మేకలు, కోయించుకుని సుష్టుగా తిని మర్నాడు పట్నంవైపు ఆ పటాలం ప్రయాణమయ్యింది.

మిలిట్రీ ఊరు విడిచిందన్న సంగతి తెల్సుకుని అప్పటి వరకు చెరుకుతోటలెల్ల, జొన్న తోటలెల్లర దాక్కున్న ముస్లింలందరూ ఆ అన్నా తమ్ముళ్ళతోసహా ఊర్లకు తిరిగి వచ్చిండ్రు.ముస్లింల వాడకట్టు అంతా బర్బాద్ అయిపోయింది. ఖబరస్తాన్ వోలె కనపడుతుంది. మొగోళ్ళు మోటబావులల్ల తేలితే బ్రతికివున్న ఆడశవాలు మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాయి. ఊరు ఊరంతా ఏడ్పులుతో నిండిపోయింది. కాని అ దుఃఖ గాధ అంతటితో అయిపోలేదు.

ఆ పగటిపూట మరొక మిడతల దండు ఊరిమీద ఇర్సుకబడింది. వాండ్లు మరట్వాడా ప్రాంతం నుండి వచ్చిన హిందూ గూండాలు, ఆ గుంపు గుర్రాల మీద వచ్చింది. చేతులలల్ల తల్వార్లు, జంబియాలు, లారీలు, తాళ్ళు.  దొరికిన ముస్లిం మగవాండ్ల తలలను తేజ్ తల్వార్లకు బలి ఇచ్చిండ్రు. ఇండ్లల్లకు చొచ్చుకొచ్చి వెండిబంగారాన్ని మూట గట్టుకున్నరు. తాళ్ళతోఆడవాండ్లను మూటల్లాగా కట్టి గుర్రాలమీద అడ్డంగా వేసుకుని తమదేశఁ వైపు మెరుపుతీగల్లాగా మాయమయ్యిండ్రు. తర్వాత దినాలల్ల ఆ ఆడోళ్ళను అందరూ కల్సి ఉమ్మడి వొస్తువుల్లాగా వాడుకున్నరు. ఇండ్లల్ల కట్టుబానిసల్లాగా పెట్టుకున్నరు. వస్తుమార్పిడిల్లాగ అమ్ముకుని అనేక గ్రామాల సరిహద్దుల్ని దాటించిండ్రు. కొందర్ని బలవంతంగా హిందూమతంలకు మార్పించి హిందూ స్త్రీల పేర్లు వారికి పెట్టిండ్రు. వాడుకుని వాడుకుని యాష్ట కొట్టినప్పుడు దోస్తులకు నజరానాలుగ సమర్పించుకుండ్రు. ఆఖరికి ఆండ్ల కొందరు అంగడి బొమ్మలుగా మారి రోగాలు, నొప్పులతో నవిసి నవిసి చచ్చిపోయిండ్రు. జగన్నాథ రథ చక్రాల క్రింద విరిగిన చీమలకాళ్ళ చప్పుళ్ళు ఎవరి వింటారు. ఆ సైతాన్ కా దౌర్లో ఒక ఘోర దృశ్యాన్ని మాత్రం ఆ ఊరి ప్రజలు ఎన్నడూ మరచిపోలేదు.

సగం చచ్చిన శవంలా ఉన్న జాఫర్ వొదినను ఒక మరాఠా మహీల్వాన్ తన బుజాల మీద వేసుకుని గుర్రం వైపు ఉరుకుతుంటే ఆమె ఏడేండ్ల కొడుకు మేరీ అమ్మీకో మత్ లేజావ్ , ఉస్కో చోడ్ దో అనుకుంట అతనికి అడ్డమడ్డం తిరిగిండు. దాంతో ఆ దుర్మార్గుడికి కోపం వచ్చి చేతిల ఉన్న తల్వార్ ను ఆ పసిపోరడి మెడవైపు ఘుళిపించిండు. అంతే వొక్క వేటుతో ఆ పిల్లగాడి తల లేత మెడ నుండి వేరయ్యి క్రింద భూమి మీదకి చెండులాగా దొర్లిపోయింది. కాని అప్పుడొక భయంకర దృశ్యం అక్కడున్న వాళ్ళకు కనపడింది. తలకాయ క్రిందికి దొర్లిపోయినా ఆ మొండెంమాత్రం నేలకు ఒరగలేదు. కొన్ని సెకండ్ల వరకు ఆ పిల్లగాడి మొండెం అటూ ఇటూ ఉరికురికి ఆఖఱికి నేలమీద దబ్బున పడింది. కాల్జేతులు తపాతపా కొంచెం సేపు చేప పిల్లలాగా కొట్టుకుని కొట్టుకుని ఆ శరీరం ఇటూ అటూ కొంచెం సేపు తండ్లాడి ఆ తర్వాత చలనం ఆగిపోయింది. ఆ దృశ్యాన్నిచూసిన ఊర్లోళ్ళందరికి చాలా ఏండ్ల వరకు వాళ్ళ కలత నిద్రలల్ల తలలేని ఆ పిల్లవాడి మొండెం అటు ఇటు ఉరుకుతున్నట్లు మేరే అమ్మీకో మత్ లేజావ్ అని ఒర్లుతున్నట్లు పీడకలలు వచ్చి వాళ్ళను వెంటాడి , వేధించేవి.

మరాఠీ మూకలు వెళ్ళినంక ఆ ఊర్ల మిగిలిన ముస్లిం స్త్రీ పురుషులిద్దరూ కట్టగట్టుకుని ఊరి నడుమ బొడ్రాయికాడ హిందువుల కాళ్ళమీద పడి వాండ్లెవరో వేరే ఊరి మనుషులు చేతులల్ల చచ్చే కంటే మన ఊరోళ్ళ చేతులల్ల చచ్చినమన్న తృప్తి అయినా మాకుంటుంది మమ్మల్ని మీరే చంపి పుణ్యం కట్టుకోరాదుండ్రి అని వొలవొలా ఏడ్చిండ్రు. అప్పుడు హిందువులందరూ వాళ్ళను లేపి తమ గుండెలకు అదముకుని వాండ్లు భీ ఎక్కెక్కి కందనీళ్ళు కార్చిండ్రు. కార్చిన కన్నీళ్ళకు హిందూముస్లిం తేడాలు ఉంటాయా.

తప్పించుకున్న అనేకమందితో కల్సి జాఫర్, అతని అన్నయ్యా కలసి పెద్దరోడ్డు మీదనుండిగాక పొలాలల్ల నుండి, అడవుల నుండి కట్టుబట్టలతో కాలినడకన హైదరాబాద్ చేరుకున్నారు. అట్ల వాళ్ళు స్వదేశంలనే కాందిశీకులయి పోయిండ్రు.

పట్నం చేరుకునే సరికి అదొకప్పుడు అనఫ్ ణాహీలు పరిపాలించిన హైదరాబాద్ కాదు. నిజాం యూనియన్ సర్కార్ కు లొంగిపోయిండు. రాచరికం స్థానంల ప్రజాస్వామ్యం పేరుతో మిలటరీ పాలన ఏర్పడింది. ఆ సైనిక ప్రభుత్వానికి మద్దతుగ ఆంధ్ర నుండి వచ్చిన సివిల్ ఉద్యోగుల పెత్తనం కనపడుతుంది. విజేతల ఆధిపత్యధోరణి అంతటా విస్తరించింది. నగర సంస్కృతిలో, జీవన విధానంలో మార్పు స్పష్టంగా కనపడుతుంది.

గతం గాయాలను మర్చిపోదామని వారిద్దరు మళ్ళీ పెండ్లిళ్ళు చేసుకున్నరు. కొత్తగ పట్నం జీవితానికి అలవాటు పడిండ్రు. ఎవరో నవాబుగారి సిఫారస్ తో జాఫర్ కు చప్రాసీ నౌఖరీ దొరికింది. అక్షర జ్ఞానం లేని అన్నమాత్రం చార్మినార్ కాడ రిక్షాగ మారిపోయిండు. ఆ గడ్డుదినాలల్ల చానా మంది ముస్లింల బ్రతుకు నావలు తలక్రిందులై కాల క్రమేణా వారి జీవితాలు సమాజపు అట్టడుగు పొరలలకు వెళ్ళిపోయి తర్కారీబండీలుగ ప్యాజ్ ఔర్ మౌజ్ కీ బండీలుగ, సైకిల్ పంక్చర్లు లేదా హర్ ఏక్ మాల్ దుకాణాలుగా మారిపోయాయి. ఇక రాబోయే రోజులన్నీ జీవఫలం చేదువిషయం అన్న సంగతి వారికి తెలిసిపోయింది.

కాలం పగబట్టిన నాగుపాముగ వారి బ్రతుకుల్ని మరోసారి కసిగ కాటేసింది. అదే 1952 గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల తొలిదశ అది. తొలితరం పోరాటం అది. సెప్టెంబరు నెల హైదరాబాద్ కు అచ్చిరాదని పెద్దల అనుమానం. భయం. ఈ నెలలోనే ఔరంగజేబు గోల్కొండ ఖిలా మీద హమ్లా చేసి పట్నాన్ని పట్టుకున్నడు. 1909ల మూసీకి వరదలు వొచ్చి పట్నం సాంతం కొట్టుకుపోయింది ఇదే నెలల. ఆలేరు దగ్గర వసంతవాగుల రైలుపడి అగ్గిపెట్టెల్లాగ కొట్టుకుపోయింది ఇదే నెలల. 1948 పోలీస్ యాక్షన్ జరిగింది ఈ సెప్టెంబర్ నెలనే. అంతెందుకు రెండవ ప్రపంచయుద్దం మొదలయ్యింది ఇదే నెలల. ఇగ మళ్ళీ ఇప్పుడేం ముంచుకొస్తదో అని ముసలోళ్ళు భయపడుతుండగ గైర్ ముల్కీగోబ్యాక్ ఉద్యమం రానే వచ్చింది.

పోలీస్ యాక్షన్ తర్వాత ఉసిళ్లలా వచ్చిపడిన ఆంధ్రులు స్థానికుల నోళ్ళు పొట్టలు గొట్టి విద్యా, ఉద్యోగాలలో తిష్ట వేసిండ్రు. లంచాల వ్యవస్థతో దొంగ ముల్కీ సర్టిఫికేట్లు పుట్టుకొచ్చాయి. వీటికి వ్యతిరేకంగా ముల్కీలుకాని వాళ్ళంతా వెనక్కి పోవాలని విద్యార్థులు ఉద్యమాన్ని నడిపిండ్రు. తెలంగాణా అంతటా అగ్గి అంటుకుని ప్రజలు అగ్గిపిడుగులైనారు. ఇడ్లీసాంబార్ గో బ్యాక్, గోంగూరపచ్చడి గో బ్యాక్ అన్న నినాదాలు నింగికి అంటినాయి. సర్వర్ దండా అనే ఒక ఉర్దూకవి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మీద ఒక వ్యంగ్య వైభవ కవితరాసిండు.

 

సంజీవరెడ్డి మామా

అయ్యయ్యో రామరామ

కైసా హై ఏ జమానా

పాడేంగేతేరా పైజామా

రూపయికో భిక్త బియ్యం

దిన్ మే హీ దిక్త దయ్యం

సంజీవరెడ్డి మామ

అయ్యయ్యో రామరామ

ఈ సర్వర్ అనే కవి కలం పేరు దండా అంటే ఆయన కవితలు పాలకులపై ముల్లుగుర్రలా పనిచేస్తయి అన్నమాట. సర్వర్ దండా కవితలు సామాన్యుల్ని కడుపుబ్బా నవ్వించి చివరికి చైతన్యపరిచేవి.

సైఫాబాద్ సైన్స్ కాలేజి విద్యార్థులు జూలూస్ తీసి నిజాం కాలేజి చేరుకుని బంద్ చేసిన గేట్లను బద్దలు కొట్టి క్లాసులల్ల ఉన్నోళ్ళను ఇవతలికి గుంజి అబిద్ షాప్ దాక ఊరేగింపు నడిపిండ్రు. కట్టుల్లు( పోలీసోల్లకు ముద్దుపేరు) లాఠీలకు పని అప్పగించి పోరల కాల్జేతుల బొక్కలు ఇరగొట్టిండ్రు . తలలు పగిలిన కాలేజి విద్యార్థులు బ్యాండేజీలు కట్టుకుని నుదుటికి కఫన్ కట్టుకున్నట్లు తమకు తాము వీరులుగా భావించుకుని ఛాతీలు చూపింటుకుంట తిరుగుతున్నారు.

ఇగ ఆ మర్నాడు సిటీ కాలేజి స్టూడెంట్స్ క్లాసులు బాయ్ కాట్ చేసి జులూస్ తీసిండ్రు.  దానికి కేశవరావ్ జూదవ్ నాయకత్వం వహించిండు. జులూస్ హైకోర్టు, మదీనా హోటల్ చౌరాస్తాలకు చేరంగనే పోలీసులు కాల్పులు జరిగినయ్. విద్యార్థులు చనిపోయిండ్రు. వారి శవాలను బందోబస్తు మధ్య ఉస్మానియా దవాఖానాలు తరలించిండ్రు. ఆ శవాలను వాపస్ ఇవ్వాలని ప్రజలు పత్తర్ గట్టీ పోలీస్ నాకా మీద దాడి చేసిండ్రు. నగరం నవనాడులు బంద్ అయినాయి. నిరవధిక కర్ఫ్యూ  విధించబడింది. పోలీసులు నరకలోకపు జాగిలమ్ములుగ సడక్ ల మీద పహరా కాసిండ్రు. అలలు అలలుగా ఉద్యమకెరటాలై ప్రజలు తిరగబడ్డరు. చార్మినార్ దగ్గర మక్కామసీదు సాక్షిగ, మాతా లక్ష్మీ మందిర్ సాక్షిగ మళ్ళీ కాల్పులు జరిగినయ్. అమాయకంగా రిక్షా తొక్కుకుంట రోడ్డుమీదికి పోయిన జాఫర్ అన్నయ్య నెత్తికి తుపాకి గుండు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిండు.

కోహీర్ ఆకుపచ్చ పొలాల మధ్య ఆనందంగ రోజులు గడిపిన ఒక అమాయకపు రైతుబిడ్డ కాలవాహిని అలల వాలున నగరానికి కొట్టుకొట్టి బ్రతుకుబండి ఈడ్చుతూ చరిత్ర రథచక్రాల క్రింద నలిగి అకాలమరణానికి గురయ్యిండు. ఆ పాపం ఎవ్వరికి రాకూడదు. గరళ కంరుడైన జనాబ్ జాఫర్ మియా కాలం కత్తుల వంతెన మీద ముందుకు మున్ముందుకే నడిచి నడిచి ఒక మలుపుల ఒక మజిలీల మా బాపును కలుసుకుని ఆ సాయం సంధ్య వెలుగు చీకట్లల ఎదలోని గుండె గాయాలను ఆవిష్కరించుకుని తనను తాను స్వాంతన పరుచుకున్నడు.

నా బాల్య జీవితానికి జాఫర్ మామూ జీవితంలో ఒక బొడ్డుతాడు సంబంధఁ ఏర్పడిపోయింది. విడదీయరాని అనుబంధమయ్యింది.

మొదటిసారి నేను బడికిపోయింది ఆయన సైకిల్ మీదనే. ఆయన సైకిల్ తొక్కుతుంటే వెనుక సీటు మీద నేను చక్లంముక్లం కూర్చుని , సంకల కొత్తపలక ఇరికించుకుని జోరుగ, హుషారుగా బడికిపోయిన.  అట్ల నా చదువుకు శ్రీకారం చుట్టింది. జాఫర్ మామూనే అక్కడ పెద్ద పంతులతో సదర్ సాబ్ కా బేటా అని ఘనంగ ఉర్దూల పరిచయం చేసిండు. అప్పుడప్పుడూ ఇంటర్వూల్లుల తెల్లటి సీమెండి టిఫిన్ డబ్బల అమ్మ కలిపిచ్చిన మామిడికాయ పప్పన్నం పట్టుకొచ్చెటోడు.

ఆరోగ్యం బాగలేక బాపు ఒక నెల దవాఖానాల ఉన్నడు. ఆ నెలరోజులు జాఫర్ మామూ మా శాలిబండా నుండి నాంపల్లి సర్కారీ దవాఖానాకు అంతదూరం సైకిల్ మీద తోషాడాన్ ( టిఫిన్ క్యారియర్) మోసుకుపోయేది. ఇడిసిన మురికి బట్టలు వాపస్ తీసుకొచ్చి ఉతికి ఇస్త్రీ చేసినవి పట్టుకపోయేది మేం పిల్లలం జాపుకోసం రంధి పెట్టుకున్నమని గమనించి మమ్మల్ని ఖుష్ చేసేందుకు రసాలూరే తియ్యటి మల్ గోబా మామిడిపండ్లు, చల్లచల్లటి కర్బూజాలు, తర్బూజాలు పట్టుకొచ్చేది. అట్ల చిన్న జీతగాడయిన ఆయన జేబుకు మాకోసం చాలాసార్లు బొక్కపడేది.

ప్రతి పంద్రాగస్టు జండావందనం పండుగకు ఒక  సేరు తియ్యటి బూంది, సవ్వాసేరు కారా మిక్చర్, రెండూ వేరు వేరు చెంగీరీలల్ల ( వెదురు బుట్టలు) కట్టించుకుని వాటి మీద గులాబీ రంగులో మెరిసే పన్నీని అతికించుకుని మా ఇంటికొచ్చి అమ్మకు అందచేసెటోడు. ఆయన తెచ్చిన మిఠాయి తింటేనే మాకు జండా వందనం పండుగ పూర్తయినట్టు అనిపించేది.

ఒకసారి నాకు టైఫాయిడ్ వచ్చి మంసంల అరిగోసపడిన.  ఒకసారి క్రిందికి మీదికైతే డాక్టర్ సాబ్ స్వయంగ ఇంటికి వచ్చి నాడీ నిదానంచేసి ముఖం చిన్నగ చేసుకుని పక్క అర్రలకు పోయి అమ్మాబాపులతో చెవులల్ల ఏందో గుసగుస మాట్లాడంగనే వెక్కెక్కి ఏడుస్తున్న అమ్మ గొంతుచప్పుడు వినబడింది. ఆయన పోంగనే నన్ను హడావుడిగ మంచం మీద నుండి దించి క్రింద ఉత్త చాపల పండబెట్టిండ్రు. నాకు తప్ప సంగతి అందరికీ సమజ్ అయినట్టుంది. కొంచెం సేపు బేహూష్ అయ్యి మళ్ళీ కండ్లుతెరిచేసరికి నా పక్కన కూర్చున్న జాఫర్ మామూ కనిపించిండు.

ఆయన నెత్తిమీద బూరుటోపీలే వొంటిమీద నల్లని శేర్వానీ లే, నోట్లె జర్బాపాన్ భీ లే, తెల్లని పాల వెన్నెలాంటి మల్లెపూల లాల్చీ, తెల్లటి పైజామా. అసుంటి డిరస్ ల ఆయన్ని నెనెప్పుడు చూడలే. అని రంజాను ఉపవాసదినాలేమో. కండ్లకు నల్లని సుర్మానే గాక ఆయన వొంటిమీద నుండి చమేలీ అత్తరు సువాసన సన్నగ గుభాళిస్తుంది. నా జ్వరం కండ్లకు ఆయన అల్లా పంపిన ఫరిస్తా దేవదూతలాగా కన్పించిండు. నాజూకుగ లేక తమలపాకు లాంటి నా అరచేతిని తన చల్లటి చేతులల్లకు తీసుకుని లోపల్లోపల ఖురాన్ సురాలను స్మరించుకుంట ఎర్రదారం ఉన్న తాయత్తును నా మెడల కట్టిండు. అది సరిపోదన్నట్లు నాంపల్లి బజార్ ఘాట్ల ఉండే యూసుఫియా దర్గా దట్టీ భీ నా కుడి చేతి దండకు గట్టిగ కట్టిండు.

అట్లనే నిద్రలకు జారిపోయిన సాయంత్రం దీపాలుపెట్టె యాళ్ళకి మెల్కొచ్చి జరం జారింది. డాక్టర్ సాబ్ కీ దవా ఏందో గని జాఫర్ మామూ దువా కా అసర్ మాత్రం నన్ను బ్రతికించింది.

ఆ తర్వాత ఆయన మళ్ళా నాకు కనపడలేదు.

జాఫర్ మియా బడికి రాక వారం రోజులయ్యింది అన్నడు బాపు. వొళ్లేమైనా బాగలేదేమో అన్నది అమ్మ. ఇంకా వారం రోజులు గడిచినయ్.  కనీసం రుఖ్సత్ దరఖాస్త్ ( లీవ్ లెటర్) అయినా పంపలే అన్నడు విచారంగ. మరి నువ్వే వాళ్ళింటికి పోయి తెలుసుకోరాదా నిష్టూరంగ అన్నది.

ఆ తెల్లారిపొద్దు పొద్దుగాల్నే  అతనుండే ఖాజీపురా మొహల్లాకు పోయి ఒక గంట తర్వాత ఢీలా ముఖంతో ఇంట్లకొచ్చిండు.

ఏమైనా తెల్సిందా అడిగింది. ఆయన వాలకాన్ని అనుమానంగ చూస్తూ.

జాఫర్ మియా లేడు అని బాపు గుడ్లల్ల నీళ్ళు గుబగుబమని పొంగుతుంటే గద్గద స్వరంతో జవాబిచ్చిండు. అదేంది ఏమైందాయనకు నోరెళ్ళబెట్టి భీరిపోయింది.

ఎవరికి ఏమీ చెప్పకుండామొత్తం కుటుంబంతో సహా మాయమయ్యాడంట. బస్తీల అందర్నీ విచారించిన వాళ్ళకు కూడా ఏమీ తెలువదట.

అమ్మ ఏడ్చింది.

ఆమెను సమ్ జాయించబోయి బాపు అంతకంటె ఎక్కువ ఏడ్చిండు.

అమ్మ. బాపులు ఏడ్చిన తర్వాత కొద్దిరోజులకే మా ఇంటికి టపాల ( పోస్టు) ఒక లిఫాఫా (కవరు) వొచ్చింది. అమృత్ సర్ నుండి జాఫర్ మామూ రాసిన ఉత్తరం  అది. ఉర్దూల ఉన్న ఆ ఉత్తరాన్ని బాపు తప్సీల్ గ చదివి అమ్మకు తెలుగుల సమ్ జాయించిండు. ముక్తసరిగ దాని సారాంశం.

నా కన్నీటి కథ అంతా మీకు తెలుసు . అవన్నీ జరిగి పదేండ్లు దాటినా ఇంకా భయం భయంగ పాము పడగ నీడక్రింద ఉన్నట్లే బ్రతికిన. కత్తి వేలాడుతుంటే భద్రత, భరోసా ఇవ్వని బ్రతుకు దాని భవిష్యత్తు చీకటిగానే కనపడింది. ఇది మా రాజ్యం కాదని, మళ్ళీ మతకల్లోలాలు చెలరేగితే ముస్లింలు మిగలరని నా భయం. ఈ దేశంలో ముస్లింలెప్పుడూ రెండవ తరగతి పౌరులనేది జీవితం నాకు నేర్పిన గుణపాఠం. పాకిస్తాన్ మమ్మల్ని గౌరవిస్తుందని, రక్షిస్తుందని నా ధృఢ విశ్వాసం. ఢిల్లీలో వీసాలు సంపాదించి అమృత్ సర్ కు వచ్చిన. రేపు ఉదయం ఫజర్ సమాజులు హిందుస్తాన్ లో ఆఖరిసారి చదివి నాఘూ బార్డర్ దాటి పాకిస్తాన్ ల నా కుటుంబంతో సహా ప్రవేశిస్తున్న.

నా నిష్ర్కమణ గురించి నేనెవరికి చెప్పలేదు. ఈ రహస్యం మీకు మాత్రమే చెబుతున్న. మీదు చూపించిన ప్రేమాభిమానాలకు లాఖ్ లాఖ్ శుక్రియాలు. ఖుదా హాఫీజ్, అప్ కో ఆఖ్రీసలాం అమ్మాకో మేరా నమస్తే. బచ్చోంకో మేరా దువా.

ఆ ఉత్తరాన్ని చేతిల పట్టుకుని అమ్మాబాపులు ఇంట్ల నుండి శవం లేచినట్టు పెద్దగ శోకాలుపెట్టిండ్రు. ఆ ఉత్తరం చాలా కాలం మా సందుగలో ఉండె.

ఆరుపదుల క్రిందటి దుఖ్ భరీ పురానీ కహాని ఇది.

ఈ దేశాలు, ఈ సరిహద్దులు, ఈ ముళ్ళకంచెలు, ఈ గీతలు, ఈ గోతులు, ఈ గోడలు, ఈ గొడవలు ఎవరు ఎందుకు, ఏ ప్రయోజనాల కోసం సృష్టించిండ్రో మనుషుల్ని, మనుసుల్ని ముక్కలు ముక్కలు చేసే దేశాలు, దేశదేశాల రాజకీయాలు ఇప్పటికీ ప్రతి జండావందనం పండుగ నాడు నేను జాఫర్ మామూ తెచ్చె మిఠాయి కోసం ఎదురు చూస్తుంటాను. ఆయనెక్కడుంటేనేం అల్లా దయ వల్ల హమేషా చల్లగా సలామత్ గ ఉండాలి.

నేను హిందువును కాను, ముసల్మాన్ ను కాను

నేను మందిరాన్ని, మసీదును అధిగమించాను

నా మనస్సునే ప్రార్ధనా స్థలంగా మలచుకున్నాను

నా విశ్వాసమే నా మతం

నా ప్రేమనే నా మతం

1 thought on “ఆఖ్రి సలాం ( నోముల కథలు – 2014)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *