May 3, 2024

అస్థిత్వం (నోముల కథలు 2014)

 రచన:సమ్మెట ఉమాదేవిఉమాదేవి

గాలితో ఊసులాడుతూ కొమ్మలు సాచిన చెట్లు దారికి పచ్చని గోపురాలు కట్టాయి. వాటి మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ .. ప్రయాణిస్తున్న వారికి గుత్త్తులుగా పూసిన బంతిపూలు, అడవితంగేడు, టేకుపూలు, మరెన్నో పేరు తెలియని పూలు ఆ దారికి సౌందర్యాన్నిస్తున్నాయి. కనుచూపుమేరలో చుట్టూ నిలిచి వున్న కొండలు ప్రకృతికి పహారా కాస్తున్నట్టుగా వుంటాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంతటి ఆహ్లాదరకమైన వాతావరణంలో తిరుగాడలేము అనుకుంటుంటాడు మాధవ్‌. ఒకనాడు  బండి వినోభా తండాలో వున్న తన బడి వైపు మళ్ళుతుండగా కోక్యా తండా చీనా కలిసాడు.

‘‘ఏంటి చీనా ఎట్లా వుంది మీ అబ్బాయికి.’’ అడిగాడు.

‘‘ఎట్లుండుడేంది సారూ.. చెట్టు మీనుంచి పడంగనే సచ్చిపోయిండనే అనుకున్నం గాని మా అదృష్టం బాగుండి మనిషైతే బతికిండుగాని ఒగ కాలిరిగింది.. తలకు దెబ్బలు తగిలినయి సార్‌.. రేపు కాలికి ఆపరేషన్‌ చేస్తరంట..నాలుగు నెలలు హైద్రాబాద్‌లోనే వుండాల్నంట..’’ చీనా దాదాపు ఏడుస్తున్నాడు.

‘‘పోనిలే చీనా అదృష్టవశాత్తు అబ్బాయి ప్రాణాలు దక్కాయి నువ్వేమి బేజారు కాకు అంతా మంచే జరుగుతుంది..’’

‘‘ఏమి మంచి సారూ..తెల్ల కారెటున్నోళ్ళకు పైసల్‌ లేకుండే ఆపరేషన్‌ చేస్తరంట గానీ మా అందరి చార్జీలకు తిండీ తిప్పలకు, గటు దిప్పీ గిటు దిప్పీ చేసిన పరీచ్చలకే ఏలకు ఏలయినయి సారూ..యాడ్నుంచి దెచ్చేము..’’

మౌనం వహించడం తప్ప ఏమనగలడు..? ఇంటిల్లిపాది కూలికి వెళ్తే తప్ప రోజు గడవని బ్రతుకులు వాళ్ళవి.

‘‘ఏం జెప్పమంటరు సారూ.. ఇగ ఈ పేర్లతోని తిప్పలచ్చినయి సార్‌. ఇంట్ల మేం బెట్టింది ఒక పేరు. బడిల రాపిచ్చేది ఇంకో పేరు. రాషేన్‌ కారెట్ల ఇంగో పేరయితున్నది. మాకా సదువు రాకపాయె.. మా బతుకులిట్ల ఆగమయిపోతున్నయి. ఎవళ్ళనూ ఏమి అనేటట్లు లేదు సారూ. వాడు చిన్న బడిల సదివినప్పుడు టీచర్లు అనిల్‌కుమార్‌ అని రాసినప్పుడు మావోళ్ళు మస్తు సంబరపడ్డరు. గది మర్సిపోయి.. ఆధార్‌ కారెటోల్లు వచ్చినప్పుడు  మా అమ్మగిట్ట ఇంట్ల బిలిచే పేరే అన్నీలాల్‌ అని కారెట్‌ల రాపిచ్చిన్రంట. అట్లనే ఆడ దవఖానల చేర్పియ్యంగనే మా ఆడోళ్ళు మావోని పేరు అన్నీలాల్‌ అని రాపిచ్చిండ్రంట. నేనేమో రాషన్‌ కారెటు దీసిన్నాడు అనీల్‌కుమార్‌ అని రాపిచ్చిన. ఆధార్‌ కారెట్‌లనేమో అన్నీలాల్‌ అని ఉన్నదంట సారూ. నా పేరు మా ఆడోళ్ళపేరు.. మా అమ్మది నాయినది నా ఆడిపిల్లలది అందరిది కలిస్తున్నది గానీ ఇస్లావత్‌ అన్నీలాల్‌ అనీల్‌కుమార్‌ ఒక్కరే అని ఎమ్మార్వోతోని రాపిచ్చుక రావాల్నంట..’’

‘‘ దవాఖానలోళ్ళ తప్పేముంది. రాంగనే మీరు చెప్పిన పేరు వేరు. తెచ్చిన కారెట్ల పేరు వేరే తీరున్నది అంటున్నరు. ఎల్లుండి  ఆపరేషన్‌ చెయ్యాల్నంటే ఈ ఆన్నిలాల్‌ పేరు అనిల్‌ కుమార్‌దే అని మా సర్పంచ్‌తో ఎమ్‌ఆర్వోతో రాపిచ్చుక రమ్మని పంపిండ్రు. ఎమ్మార్వో సాబేమో తిరుపపతి బోయిడంట. రెండు రోజులదాంక రాడంట. ఇప్పుడు నేను బోయి ఎవరి కాళ్ళు బట్టుకోవాల్నో..సర్పంచు సార్‌ ఎమ్మేల్లే కాడికి బోదమంటున్నడు. నడుమ ఆడ మా ఆడోళ్ళు ఎంత పరేషాన్‌ అయితున్నరో నాకేమో గీ ఫోన్లు జేసుడు రాదు. ఆళ్ళు మాట్టాడితేనే నేను మాట్లాడుతా..’’ చీనా బాధ చూసి ఫోన్‌ నంబర్‌ తీసుకుని తన ఫోన్‌ నుండి చీనా భార్య రామ్లాకి ఫోన్‌ చేసి చీనాతో మాట్లాడించాడు. అతనికి కాస్త ధైర్యం చెప్పి ప్రార్థనా సమయం మించిపోతున్నదని బండిని బడివైపుకు మళ్ళించాడు. మాధవ్‌ను చూడగానే చెట్టుకింద ఆడుకుంటున్న పిల్లలు కొందరు చుట్టు ముట్టారు.

‘‘సార్‌ చూడు నన్ను పోలీ.. పాలి అనుకుంట ఏడిపిస్తున్నరు..’’ పరుగు పరుగున వచ్చి ప్రవళ్లిక అన్నది.

‘‘అదేంటి పిల్లలూ.. పోలీ ఏంటీ పాలీ ఏంటి ?’’ ఆశ్చర్యంగా అడిగిగాడు మాధవ్‌.

‘‘సార్‌ గామె అస్సలు పేరు ప్రవల్లిక కాదు పోలి. అయితే చిన్నబడిల చేరినప్పుడు రంగరావు సార్‌ గిట్ట ఆమె పేరును ప్రవల్లిక అని మార్చిండ్రు. ఇంట్లో అందరూ పోలీ అనే పిలుస్తరు. వాళ్ళమ్మోళ్ళకయితే అసలు  ప్రవల్లిక అనుడే రాదు..’’ పిల్లలు పోటి పడి నవ్వుతూ వెక్కిరింతగా చెప్పారు మాధవ్‌కి.

‘‘అదేమిటి పేర్లు తల్లీదండ్రుల పెట్టిన పేర్లు మార్చడమెందుకు.?’’ చీనా గుర్తుకువచ్చి ఏదో అనబోయాడు

‘‘నిజం సార్‌ అసల్కయితే అనూష అసలు పేరు అమ్రు. శైలజ పేరు సాల్కి.. పవన్‌ కళ్యాణ్‌ పేరు సక్రూ, రామ్‌చరణ్‌ అసలు   పేరు రామ్‌నాయక్‌, హరీష్‌ పేరు అసలు హర్యాలాల్‌  మహేష్‌బాబు అసలు పేరు బిక్కూలాల్‌ ..వింటున్న మాధవరావుకి మతిపోయింది. ఎంత చక్కని పేర్లు  సాల్కి ,ఆమ్కి, అమ్రు సక్రూ, రామ్‌లాల్‌, బిక్కూలాల్‌  హర్యా, సూక్యా, వాలీ, దివిలీ, మాంగినీ ఎంత బాగున్నాయి వీళ్ళ పేర్లు ఇలా పేర్లు మార్చుకోవాలన్న ఆలోచన ఎవరిది.?’’ ఆ  విషయాన్ని అంతటితో వదిలి  పెట్టబుద్ది కాలేదు. వీళ్ళెందుకిలా చేస్తున్నారు అంటూ తోటి టీచర్స్‌తో చర్చించాడు.

‘‘మరి మార్చక ఆ పిల్ల పెద్దయ్యాక పోలి, నాజ్కీ,, సక్రూ, సూక్యా అంటే అంటే ఎట్లా వుంటుంది.? ఆ టీచర్లెవరో గాని మంచిపని చేసారు.’’ సమర్థించాడు రాజేష్‌ సార్‌.

‘‘ఎట్లా వుంటుందేమిటి అవి వాళ్ళ పేర్లు? మా నాన్నపేరు ఐలయ్య..మా అమ్మపేరు మల్లమ్మ వినడానికి బాగుండలేదని అనుకుని మార్చేస్తామా..’’భవాని టీచర్‌ అన్నది.

‘‘అయ్యో సార్‌ అట్లా పేర్లు మార్చమని ఆ తల్లిదండ్రులే ముచ్చట పడుతుంటారు. ఇక్కడ చాలామంది పేర్లు చరణ్‌, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌  తేజా రామ్‌చరణ్‌, నరేష్‌ ఇక అమ్మాయిలైతే అనుష్క, మౌనిక, సుస్మిత, సోనియా, శైలజ ఇలాంటి పేర్లు అడిగి మరీ పెట్టించుకుంటారు..’’ చెప్పాడు రామారావు.

‘‘ఏం మేడమ్‌ అట్లాంటి పేర్లు మీరు మాత్రమే పెట్టుకోవాలని రూలుందా.? మా వాళ్ళు పెట్టుకుంటే వినడానికి కష్టంగా వుందా.? వీళ్ళు కూడా మాకు పోటికి వచ్చేస్తున్నారేమిటి అని ఫీలైపోతున్నారా.?’’ చేర్యా సార్‌ విసురుగా అంటూ ఎప్పటిలా ఉక్రోషంగా దాడికి  దిగాడు. విస్తుబోయారు మాధవ్‌, మాలతి, భవాని.

‘‘అదేమీ లేదు సార్‌ నాకు మీ పేర్లంటే మాకూ చాలా  ఇష్టం ఇలా మార్చుకుని మన వునికిని ఎందుకు పోగొట్టుకోవాలన్నదే నా బాధ.’’ మాధవ్‌ అన్నాడు.

‘‘ఏంటి సార్‌ మా తండాల వారంటే అంత ప్రేమ వున్నట్టు మాట్లాడుతున్నారు. తొంభై శాతం గిరిజన పిల్లలు చదువుకుంటున్న బడి మనది. మరి కిందటి సంవత్సరం మా దాటోడి పండక్కి స్థానిక సెలవడిగితే హెడ్‌మాష్టార్‌గారు  ఇచ్చారా.? బడిలో వున్న వారందరూ చేసుకోవడం లేదు కదా ఒక్కో తండాలో వారు ఒక్కోసారి చేసుకుంటున్నపుడు ఎలా ఇవ్వాలని వంక పెట్టారు. అప్పుడు మీరెవరన్నా అదేమిటని అడిగారా? రంజాన్‌ పండగ వస్తే హసన్‌సార్‌ నమాజ్‌ చేసుకోవాలంటూ మూడున్నరకే బండెక్కి వెళ్ళిపోతారు. గవర్నమెంట్‌ రూలుందని చెబుతారు. మా తీజ్‌ పండక్కి అమ్మాయిలు ఆ పది రోజులు మీరు బతుకమ్మలాడిన్నట్టు ఆడుతారు. మా అమ్మాయిలను ముందు పంపుతారా.? అన్నింటికి గవర్నమెంటు రూలుండదండి. విచక్షణ వుండాలి మా పిల్లలంటే, మేమంటే ప్రేముండాలి.. ఇది అధిక శాతం గిరిజన పిల్లలు చదువుకునే బడన్న ఆలోచన వుండాలి..’’

‘‘ఆ రాజకీయ నాయకులకు ఎలాగూ మా ఓట్లు కావాలి గాని మా బాగు అక్కరలేదు. మా ఆచారాలు, మా పండుగలు వాళ్ళకు పట్టదు. స్ధానిక సెలవు, స్థానికావసరాలను గమనించి హెడ్‌మాస్టార్‌ తన విచక్షణతో ఇవ్వాలి. ఎందుకిస్తారు చెప్పండి మేమంటే చులకన. అప్పుడే వారికి పరీక్షలూ, సిలబస్‌లు గుర్తుకు వస్తాయి.’’ చేర్యా ఆవేశంగా ఏదేదో అంటున్నాడు. అతను ఏదేదో అలా మాట్లాడుతూనే వున్నాడు.. బెల్‌ మోగింది.

అందరూ ప్రార్థనా సమావేశానికి వెళ్ళారు. ప్రతి ప్రభాతాన ప్రార్థనా సమావేశాల్లో అందరూ ఒక దగ్గర చేరి ఎంతో క్రమశిక్షణతో ఏక కంఠంతో జాతీయగీతాలు పాడుకోవడం.. చాలా స్ఫూర్తిదాయకంగా వుటుంది. వందేమాతరం అని అందరూ కలిసి ఎలుగెత్తి పాడుతుండగా ఎంతో వుద్వేగానికి లోనవుతుంటాడు మాధవ్‌. మరే ఇతర ప్రభుత్వ సంస్థల్లోనూ ఇంత నిబద్ధతగా జరుగని ప్రార్థన కేవలం బడిలోనే జరుగుతుంది. పిల్లలందరికీ ఎంతో ప్రేరణగా వుంటుంది.  పిల్లలకు రోజుకో కొత్త విషయం చెప్పడం కోసం ఎంతో సమాచారం సేకరించి చెప్తుంటాడు మాధవ్‌. ప్రార్థన ముగిసి ఎనిమిదో తరగతికివెళ్ళగానే

‘‘సార్‌ నిన్న రామరావు సార్‌ మాకు హాజర్‌ పెట్టలేదు. నువ్వు పెట్టు..’’ వాళ్ళ మాటల్లో ధ్వనించే యాస గమ్మత్తుగా వుంటుంది. అన్నారు. చిరునవ్వుకుంటూ ‘‘ఏం రామారావు సార్‌ ఎందుకు పెట్టలేదు అడిగాడు. ‘‘సార్‌ పాఠం చెప్తుంటే బెల్‌ పడింది. ఎమ్మట్నే ఎల్లిపోయిండు.’’ అన్నారు.

‘‘నువ్వు నిన్న మాకు రాలె.. ఇంగ్‌లీస్‌ చెప్పలే.’’ నిలదీసారు. ‘‘అవునమ్మా నిన్న టెంత్‌ అక్కల, అన్నయ్యల పరీక్షల కోసం వాళ్ళ పేర్లు రాసాం. అందుకే రాలేదు.’’ అంటూ హాజర్‌ తీసుకున్నాడు. బడి పిల్లలకు ఎనభైశాతం హాజరుంటేనే మూడు కిలోల బియ్యం ఇస్తారన్న రూల్‌ ఎనాడు వచ్చిందో ఆనాటినుండీ పిల్లలకు హాజరు పట్ల స్పృహ పెరిగింది. ఇప్పుడు మొదటి పీర్యడు హాజరు చూసే బియ్యం, పప్పూ లెక్క వేసి కొలిచి ఇస్తారు అప్పుడవి పొయ్యికెక్కుతాయి.

అనూష మాధవ్‌ దగ్గరకు వచ్చి ‘‘సార్‌ బుధవారం నేను బడికి రాను నేనే కాదు మా కొత్త తండా వాళ్ళెవరూ బడికి  రారు సార్‌ అని చెప్పింది. ‘‘ఎందుకురా అడిగాడు మాధవ్‌. బుధవారం మాకు దాటోడి పండుగ సార్‌.’’  ఉత్సాహంగా చెప్పారు. ఆక్కడ చుట్టుపక్కల ఎడెనిమిది తండాలవారు చదువుకుంటున్న ఉన్నత పాఠశాల అది. ‘‘ఒక్కొక్కరూ ఒక్కోరోజు దాటోడి పండగ చేసుకుంటుంటే మేము చేసుకుంటున్నపుడు ఇవ్వలేదు గాని వాళ్ళు చేసుకుంటున్నపుడు ఇస్తారా.?’’ అని వారిలో వారే తగవు పెట్టుకున్నారన్నది హెడ్‌ మాష్టారి వాదన. పాఠం చెప్పడం అయ్యాక పిల్లలను చదువుకోమ్మని చెప్పి  మాధవ్‌  చేర్యా సార్‌ దగ్గరకు వెళ్ళాడు.

‘‘చేర్యా సార్‌!  .మీరు చెప్పిన  ప్రతీ మాట నూటికి నూరు శాతం నిజం సార్‌. పిల్లలంతా దాటోడి పండగ సంతోషంలో వున్నారు. ఈ బుధవారం కొత్తతండా పిల్లలు ఎవరూ బడికి రారంట. మనం అందరూ తండాల పెద్దలను పిలిపించి అందరికీ అమోదమై ఒక రోజును దాటోడి పండుగ సెలవుగా స్థానిక సెలవును ఇప్పించే ప్రయత్నం చేద్దామా అని అడిగాడు. చేర్యా కళ్ళల్లో మెరుపొచ్చింది. అవును సార్‌ అడగాలి ఒప్పుకుంటారో  లేదో చూడాలి..

సరే సర్‌ ఈ లోగా మనం ‘మన పండుగలు’ అని తండాల్లో జరుపుకునే పండుగల గురించి పిల్లలకు వ్యాస రచన పెడదామా అడిగాడు మాధవ్‌.

‘‘అలాగే పెడదార్‌ సార్‌’’ అన్నాడు. ఇద్దరూ వెళ్ళి హెడ్‌మాస్టారు ద్గరకు వెళ్ళి అనుమతి తీసుకున్నారు. చేర్యా తరగతి తరగతికి తిరిగి వెళ్ళి వారికి వ్యాసం ఎలా రాయాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇంట్రవెల్‌ అయ్యాక పిల్లందర్నీ చెట్లకింద కూర్చోబెట్టి వారి పండగల గురించి రాయమన్నారు. పచ్చగా విస్తరించిన విశాలమైన వేప చెట్టుకింద ఆహారం  కోసం నేలను చేరిన రామచిలుకల్లా కువకువలాడుతూ కనిపించారు. పరీక్ష కాకుండా వారికిష్టమైన అంశంపై వ్యాసం రాయమనే సరికి వారి పెదవులపై చిరునవ్వులు విరబూసాయి. పాల్గొన్న పిల్లలంతా చాలా ఆసక్తిగా రాసారు.

భాషా దోషాలకు ప్రాధాన్యతనివ్వకుండా భావానికే ప్రాధాన్యతనిచ్చి ఆ పేపర్లు పరిశీంచారు టీచర్లు. చాలా చక్కగా రాసారు పిల్లలంతా. మిగతా టీచర్లతోపాటు మాధవ్‌ అందరి పేపర్లు చాలా ఆసక్తిగా చదివాడు.

‘‘ఉదయానే తలస్నానాలు చేసాక ఇంట్లోని వాళ్ళందరం కలిసి ఊరి చివరున్న చేనుకో, వాగొడ్డుకో వెళ్తాం. అక్కడ మా దేవతలు ఏడుగురిని పెట్టుకుంటాం. ఇంటినుండి గుగ్గిళ్ళు వండుకుని తీసుకెళ్తాం. పసుపూ కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేసాక గుగ్గిళ్ళు శీతలా దేవతకు నైవేద్యం పెడతాం. మేకను బలిచ్చి దాని పేగులను పరిచి దానీ మీదనుండి మా ఆవులను పశువులను దాటిస్తాం. కోడిని కోసి దాని రక్తంలో ఈ గుగ్గిళ్ళు కలిపి పశువుల పైకి విసురుతాం. ఇట్లా చెయ్యడం వల్ల పశువులకు ఎలాంటి జబ్బులూ, ఆపదలూ రావని నమ్ముతాం. అందరం కలిసి పాటు పాడుతూ నృత్యాలు చేసుకుంటాం. ఇల్లు చేరుకుని కోడిని కోసుకుని భోజనాలు చేస్తాం..ఆ రోజు మేమంతా ఎంతో సంతోషంతో గడుపుతాం.

వేరే ఊర్లల్లో వున్న మా బంధువులు మా ఇల్లకు రావడం మాకు చాలా అనందకరం.’’ అంటూ తమకు తెలిసినంతవరకూ తమకు తెలిసిన పదాలతో రాసారు

ఇక తీజ్‌ పండుగ గురించి..‘‘ఒక శుక్రవారం నాడు ముందు చిన్న చిన్న మట్టి కుండల్లో గాని బుట్టల్లో గాని గోధుమలు నారు వేస్తారు. దానిని మంచె పై వుంచి.. మూడు పూటలా స్నానంచేసి  నీళ్ళు తెచ్చి మూడు పూటలా మంచె పై వున్న నారుపై చల్లుతుంటారు. మూడురోజుల కల్లా అవి మొలకెత్తుతాయి. తొమ్మిది రోజులు సాయంకాలం పూట గణ్‌ గౌరీ దేవి పూజ చేస్తూ ఈ నారు వున్న కుండలు లేదా మట్టి పిడతలు మధ్యలో పెట్టుకుని వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చివరి రోజున చాలా పెద్ద తతంగం వుంటుంది. తండా వాళ్ళంతా ఒక దగ్గర చేరి ఆటలూ,  పాటలు నవ్వులతో కేరింతలతో గడిపే పర్వదినమిది. ఉదయం పాయసం వండి గణ్‌ గౌరీకి నైవేద్యము పెడతారు. అందరూ మగ పిల్లలు నారు వేసిన బుట్టలను దాచేసి వరసయిన ఆడపిల్లలను ఏడిపిస్తారు. ఆ నారు బుట్టలను ఇమ్మంటూ ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ వేళ్ళా పడుతూ ఏడుస్తారు. వాళ్ళు బతిమాలుతున్న కొద్దీ మగప్లిలు మరింతగా ఏడిపించడం ఓ వేడుక. చివరకు పెద్దవాళ్ళు కలగచేసుకుని అమ్మాయిలను ఏడిపించవద్దని కోప్పడతారు. అప్పుడు వాళ్ళు నారు బుట్టలను  తిరిగి ఇచ్చేస్తారు. ఆ గోధుమ నారున్న పిడతను కుండలనూ పెట్టుకుని బాగా ఆడిపాడాకా గోధుమ నారును కొద్ది కొద్దిగా అందరికీ పంచుతారు. అందరూ చెవి దగ్గర పెట్టుకుంటారు. అది తీసుకున్నవాళ్ళు ఈ ఆడపిల్లలకు కానుకగా కొంత సొ మ్ములిస్తారు.

ఈసారి ఆడపిల్లలు గణ గౌరీ విగ్రహాలను చెరువులో కలపాల్సి వస్తున్నందుకు ఏడుస్తారు..పెద్దలు ఓదార్చుతారు.. తరువాత అందరు కలిసి ఆడుతూ పాడుతూ డప్పులు మోగిస్తూ వాగు దగ్గరకు చేరుకుంటారు అక్కడ వాగు నీళ్ళతో అన్నాదమ్ములు అక్కా చెల్లెల్ల పాదాలు  కడుగుతారు. ఆ తరువాత ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ తతంగమంతా ముగిసేసరికి నడిరేయి అవుతుంటుంది.  సందర్భానుసారంగా ఏడవడం కూడా వారి సంప్రదాలయాల్లో భాగమని చదివినప్పుడు మాధవ్‌కి ఆశ్చర్యం కలిగింది. ఉపాధ్యాయులంతా అవి చదువుతూ.. మొదటిసారిగా వారి పండుగల గురించి తెలుసుకున్నారేమో అబ్బురపడిపోతున్నారు..

పిల్లలంతా పోటీలు పడి తమకు తోచిన రీతిలో తమ పండుగల గురించి రాసారు. ఇక మూడో పండగ అయిన భారాంద్‌ కాయినే అనే వన భోజనాలు గురించి రాసారు. ఊరు ఊరంతా ఒక దగ్గర చేరి ఏటిఒడ్డునో మమిడితోటల్లోనో అడవిలోనో చేరి అందరూ కలిసి పాటలు పాడి, నృత్యాలు చేసి కలిసి వండుకుని కలిసి బోజనం చేసే పండగ గురించి ఆసక్తికరంగా రాసారు. ఏ పండగైనా కానీ వీరు చక్కగా పాడుకుంటారు. కలిసి నృత్యంచేస్తారు. ప్రతీ వేడుకలో డప్పులకు వీరిచ్చే ప్రాధాన్యత చెప్పుకోతగ్గదిగా వుంటుంది అని గ్రహించాడు.  ప్రధమ, ద్వితీయ బహుమతులు ఇవ్వడమే కాకుండా పిల్లలకందరికీ చాక్లెట్లు,  బిస్కెట్లు పంచాలని నిర్ణయించారు. మధ్యాహ్నం బోజనాలయ్యాక చిన్న సభలా పెట్టి టీచ్లర్లందరితో మాట్లాడించి, పిల్లలతో పాటలు పాడించి.. మిఠాయిలు పంచారు.

ఇంటర్వెల్‌లో ‘‘చాలా బాగా జరిగింది ఇవాల్టి వేడుక. ఇలా నిర్వహించడం వల్ల మరచిపోతున్న పండుగలు  సంస్కృతుల గురించి పిల్లలకు తెలియజేసినట్లవుతుంది..’’ అన్నది మాలతి టీచర్‌

‘‘నిజమే మేడం దాదాపు ఎనిమిది వందల గిరిజనుల భాషలు మరుగున పడిపోతున్నాయని ప్రసన్నశ్రీ గారు గిరిజనులకు కొత్త లిపిని రూపొందించారు. దానికి యూఎన్‌ఓ గుర్తింపు వచ్చింది.’’ తనకు తెలిసిన విషయాన్ని ఆత్రుతగా చెబుతున్నారు గంగాధర్‌ సార్‌.

‘‘ఇంక ఆపండి సార్‌ అసలు మా వెనుకబాటుకు మూలకారణమే ఈ భాషలు. మా ఇళ్ళల్లో మాట్లాడేది ఒక భాష. బడిలో మాట్లాడేది మరో భాష. ఇక మార్కుల కోసం నేర్చుకోవాల్సింది మరో రెండు భాషలు. మా బ్రతుకంతా ఈ  భాషలు నేర్చుకోవడానికే సరిపోతున్నది. ఇక ఇప్పుడు మా భాషకు ఓ కొత్త లిపి నేర్చుకుని ఇప్పుడు మేము ఒరగబెట్టదేమీ లేదు. ప్రపంచమంతా చిన్న కుగ్రామయి పోతున్నదంటూ ఆంగ్లభాష వైపు, కంప్యూటర్‌ విద్య వైపు మీరు ముందుకు పరుగుల తీస్తూ మమ్ముల్ని మళ్ళీ ఒక కొత్త లిపి నేర్చుకుని ఏమి చెయ్యమంటారు..సార్‌.?’’ ఆవేశాల వెనుక ఎంతో ఆవేదన వుంటుందని మాధవ్‌కి బాగా తెలుసు. అందుకే అతని ప్రతీ మాటను జాగర్తగా వింటాడు. అతని వెంట వెంట వుంటాడు.

‘‘సరే చేర్యా సార్‌ మనం దాటోడి పండగకి ఓ రోజు స్థానిక సెలవిప్పించాలి..రేపు మరి స్థానిక పెద్దలను పిలిపిచి నాలుగైదు తండాలు కలిసి ఓకే రోజు పండుగ చేసుకున్న రోజున సెలవిప్పిద్దాం అనుకన్నాం కదా మరి వారిని కలిసే ప్రయత్నమేదైనా చేస్తున్నారా..?’’ వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడు మాధవ్‌

‘‘కలిసి వద్దాం సార్‌..’’  అన్నాడు చేర్యా. పిల్లంతా కోలాహలంగా తిరుగుతూ గంట మోగగానే తరగతులను చేరుకున్నారు.

అంతలో అంగన్‌ వాడీ టీచర్‌ రాజేశ్వరి వచ్చింది. ‘‘ఏం చెప్పమంటారు సార్‌ హర్యా నాయక్‌ కూతురు ఆమ్కికి  పెళ్ళికుదిరింది. ఆమెకి కిషోర్‌ బాలికా పథóకంలో వచ్చే సొమ్ములు తెచ్చుకుందామని వెళ్తే.. అక్కడ పేరులో తేడా వచ్చిందట. తండ్రి పేరు జాటోతు హర్యా అమ్మ పేరు జాటోతు సువాలి అమ్మాయి పుట్టంగనే జనన లెక్కల్లో జాటోతు ఆమ్కి అని రాయించారు. బడికి వచ్చాకా ఆమ్కి కాస్త అనుష్క అయ్యింది. రేషన్‌ కార్టుల్లో పేరు వేరు బడిలో వేరు. ఇప్పుడు నాకు తిప్పలచ్చినయి. బడి రికార్టుల్లో చూసి రిపోర్టు రాసి పంపమన్నారు. ఒకరేమో పంచాయితీ ఆఫీసులో వుండే రికార్టులో మా దగ్గర వున్న రికార్డుల్లో మార్చమంటున్నారు.. మేం ఎప్పటికప్పుడు రిపోర్టులు పైకి పంపుతుంటాం మార్చడానికెట్లా  కుదురుతుందని చెప్పినా వారికి అర్థం కావడంలేదు.’’ హెడ్‌ మాష్టారి దగ్గర పెద్దగొంతుతో ఆమె  మొత్తుకుంటూంటే టీచర్లందరూ విన్నారు..ఇప్పుడు ఆమ్కి పరిస్థితి ఏమిటా అనిరకరకాలుగా వ్యాఖ్యానిస్తూ టీచర్లు మాటల్లోపడ్డారు. ఇది విన్న చేర్యా ఏమంటాడో చూద్దామని చూస్తే చేర్యా ఎక్కడా కనపడలేదు మాధవ్‌కి. దూరాన చెట్టుకింద కూర్చుని ఆడుకుంటున్న పిల్లలవంక అన్యమస్కంగా చూస్తున్నాడు…

‘‘ఏంటి చేర్యా సార్‌ అలావున్నారు..?’’ నఅడిగాడు.

‘‘ఐదు నిమిషాల క్రితం మా అక్క దగ్గరనుంచి ఫోను వచ్చింది సార్‌..’’ ఆమె మాటలే మదిలో మెదులుతున్నాయి సార్‌..’’

‘‘ఒరే చేర్యా.. నువ్వే వచ్చి నా బిడ్డను ఆదుకోవాలేరా. సిన్నదో పెద్దదో ఉద్యోగంజేసే అల్లుడు సచ్చిపోయి ఆర్నెల్లయింది గదా. నా బిడ్డా మనుమల బతుకు ఆగమై పోతుంటే పాపం కలెక్టర్‌ సార్‌ అమ్మాయికి ఉద్యోగమిప్పిస్తనన్నడు. సువాలి పదోది పాస్‌ కాలేదని చెప్రాసి వుద్యోగమే వస్తదన్నా సరే అన్నం కొడుకా. ఎనిమిదోది చదివిన కాయితం బట్క రమ్మన్నరు. అల్లుడు రాసిన నామిని పేరు సువాలి బడిల రాపిచ్చన పేరు సునీత వొక్క తీరు లేవని.. మస్తు కిర్‌ కిర్‌ బెడుతున్నరు. నువ్వొచ్చి జర ఏ తక్లీబ్‌ లేకుంట చెయ్యాలెరా తమ్మి ’’ అంటూ చేర్యా అక్క  ఎంతగానో దు:ఖపడుతూ  చెప్పిన విషయాలను  మాధవ్‌కు  వివరిచాడు.

మాధవ్‌ చేర్యా భుజం మీద చేయివేసి.. చీనా అన్నీలాల్‌ల గురించీ, ఆమ్కీ గురించి కూడా  చెప్పాడు.

‘‘చేర్యా సార్‌ ఏం మేము వేరే పేర్లు పెట్టుకోకూడదా అని అడిగారు కదా. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే..మనం సాంకేతికంగా అభివృద్దిచెందాలి. విద్యా ఉద్యోగాల్లో అభివృద్ది చెందాలి. కాని మన అస్థిత్వాలను వదులుకుని మన ఉనికికి ప్రమాదం తెచ్చుకోవాల్సిన అవసరంవుందా అని.. అన్నీలాల్‌ ఆపరేషన్‌కీ, ఆమ్కీ పెళ్ళికీ, ఇప్పుడు మీ మేనకోడలు సువాలికి మధ్యలో మారిపోయిన ఈ పేర్లు అడ్డంకిగా అవుతున్నాయి. ఉద్యోగాలు పొందే సమయంలో, ఓటర్ల లిస్టుల్లో, ఆధార్‌  రేషన్‌ కార్డుల్లో.. ప్రభుత్వ పథకాలు అమలు సమయంలో ఈ పేర్ల నమోదు వాటి మార్పిడి చాలా ఇబ్బంది అవుతున్నది. మీ లాంటి యువకులే దీనికి గురించి పూనుకుని ఏం చెయ్యాలో నిర్ణయించుకొని వారికి సాయపడండి..’’

‘‘నిజమే సార్‌..’’ఆలోచనగా అన్నాడు చేర్యా.

తను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలెన్నో కళ్ళముందు కనపడుతుంటే చేర్యా..  ముందుకు అడుగేయగా  ఆత్మీయంగా అతని భుజం చుట్టూ చేయి వేసి నడిపించాడు మాధవ్‌.

 

 

6 thoughts on “అస్థిత్వం (నోముల కథలు 2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *