May 3, 2024

పేగుముడి (నోముల కథలు 2014)

రచన: పర్కపెల్లి యాదగిరి పెరికపల్లి

giri.parkapelly@gmail.com

 

 

దూరం నుండి బడి గంట వినపడింది.

‘‘అవ్వో… ఇంటర్‌ బెల్లైయ్యింది. ఎక్కడ పని అక్కడ్నే ఉన్నది. కోల్యాగె ఉర్కత్తది. మల్ల జరసేపు పని కూషి’’ అనుకుంటూ ముందుకూ వెనక్కి ఊగుతూ బీడీలు చేసే వేగం పెంచింది సరోజన.

‘‘మల్ల గిప్పుడు ఒచ్చుడేందవ్వో… బాగ గావ్రం జేత్తన్నవ్‌’’ లన్నది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘ఏదొ తీ పెద్దవ్వ. బడి దగ్గరుండుట్ల ఒత్తండు, దూరముంటె ఒచ్చునాతీ…’’

‘‘ఏమో బిడ్డ, నీకే ఎర్క, ఎమన్నంటె పెద్దవ్వ లావడ్డి ఐతది’’

‘‘నీయ్యవ్వ గట్లంటవ్‌! మా అవ్వైతె అనక పోవునాతీ..’’ అంది సరోజన.

‘‘ఏం కూరొండినవ్‌ బిడ్డ…’’

‘‘రాత్రి ఇన్నన్ని బుడ్డ పర్కల్‌ దెచ్చిండు. గదే ఉన్నది’’

‘‘ఊహు.. నీసులేని దినం, గుడుంబ తాగని దినం ఉండనే ఉండదీ… షేస్కున్నది షేస్కున్నట్టు మింగుడేనా…’’ అన్నది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘నీయ్యవ్వ! షేషేది అమాలి పనాయే… కూరాకు తినంది రెక్కలెట్లాడ్తయి. పొద్దంత మోష్టాలకు పెయ్యంత పుండు పుండైతది. ఓ బొట్టు తాగంది నిర్దెట్ల పడ్తది’’

‘‘పుస్సిక్యాట్‌, పుస్సిక్యాట్‌…’’ రైమ్‌ పాడుతూ, ఎగురుకుంటూ సంపతిగాడు వాకిట్లోకి వచ్చాడు.

‘‘పడేవు బిడ్డా… కాల్రెక్క ఇర్గుతదీ..’’ అంది సరోజన

‘‘మమ్మి.. అగజూడే మన పిల్లి గోడలు దుంకుకుంటూ ఎట్లుర్కుత్తుందో’’

పిల్లి దగ్గరగా వస్తున్న కొలదీ కేరింతలు పెడుతూ గంతులేస్తూ ఉన్నాడు. టై కిందికీ పైకి ఊగుతోంది.

‘‘ఓ… పిలగా… ఏం ఎగుర్తవ్‌, ఆయింత కింద మీదైతయ్‌’’ అన్నది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘నీయ్యవ్వ, గట్లంటవ్‌’’ అని సరోజన నవ్వింది.

సంపతిగాడు ఏమీ వినిపించుకునే స్థితిలో లేడు. పిల్లి రానే వచ్చింది. వీపూతో, తోకతో వాడి కాళ్ళను రుద్దుకొంటోంది.

‘‘మియ్యాం… మియ్యాం…’’ అంటూ వాడి ముఖంలోకి చూస్తోంది.

సంపతిగాడు పిల్లిని రెండు చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు. దాని వెనుక కాళ్ళు గాలిలో వేలాడుతున్నాయి.

‘‘ఇడ్వు బిడ్డా.. ఆయింత గీరజిక్కెనూ… మిల్కు తాగి పోదువురా’’ అంది సరోజన.

‘‘దీనికి గుతం గిన్నన్ని పోత్తనే నేను తాగుత’’

‘‘అవ్వల్లో… నీకే గతిలేదు గని ఇంక పిల్లికి పోయమంటానవా..’’ దీర్ఘం తీసింది ఇంటోల్ల పెద్దవ్వ.

సంపతిగాడు కళ్ళుమూసి నోరు తెరిచి వెక్కిరించాడు. వాడి దంతాలు కలువల్లా మెరిసాయి.

‘‘అగొ సూడే ఎట్లెక్కిరిత్తాండో… నీ ముక్క కత్తిరిత్తుండు… కత్తెరేదిరా… ఓయ్‌, పెండ్లానికి అక్కరాక్రుంట షేత్తమరి’’ పండ్లు కొరుకుతూ గుడ్లు ఉరిమి కోపం నటించింది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘అమ్మో… అట్ల ఎక్కిరియ్యోద్దు బిడ్డా… అమ్మమ్మ గాదు.. కండ్లు బోతయి’’ అంటూ పాలగ్లాసు పట్టుకొచ్చింది సరోజన.

‘‘ఆ.. పిల్లి గిన్నేది మల్ల’’ గట్టిగా అరిచాడు.

‘‘సీసకమ్మరోడు, అన్నది అన్నట్టు గావాలే’’ పిల్లి గిన్నెల పాలుపోస్తూ అంది.

‘‘ఆ.. గట్లమరీ..’’ పాలు గటగటా తాగేసాడు సంపతిగాడు.

సరోజన కొంగుతో వాడి మూతి తూడుస్తూ ‘‘ఉంగ పో బిడ్డ. లేటైతే మేడం కొడ్తది’’ అంది.

వాడు పాలు తాగుతున్న పిల్లి నడుముపై చేయ్యిపెట్టి ‘‘లంచులో కర్డుపోసి రైస్‌ పెడ్త’’ అన్నాడు.

ఉడుము పిల్లవలే స్కూలువైపు పరుగెత్తాడు.

సరోజన వివాహం జరిగాక చాన్నాళ్ళు పిల్లలు కోసం ఎదురుచూసింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగింది. కనపడిన ప్రతి దైవానికి మొక్కింది.

సంపతిగాడు ఇప్పుడు ఎల్‌కేజీ చదువుతున్నాడు.

సరోజన కూనిరాగం తీస్తూ బీడీలు చేస్తోంది.

‘‘ఓ.. సరోజనా.. నా.. కొంపముంచిందే… నీ… పిల్లో… కంచుడ్ల షాపలకూర అంత తిన్నది… ముసలోడు తిననీకొత్తడు. ఇగేం జెయ్యాల్నవ్వో… నాకింగ సావుమర్నమే ఉన్నదీ… ఓ… అడ్డమైన పిల్లిని సాత్తండ్రో…’’ అరుస్తోంది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘ఓ పెద్దవ్వ జర తిట్టకు బాంచను, పెద్నాయ్నకు మా షాపలకూర ఏత్త’’ బతిమాలింది సరోజన.

‘‘ఏందవ్వా… మీకే తినేతందుకు గతిలేదు… పిల్లెందుకుల్లా మీకూ… పిల్లినన్న ఎల్లగొట్టుండ్రి, ఏరే ఇల్లన్న సూస్కోంన్రి అది సుట్టూ పక్కలిండ్లల్ల దొంగతనానికి ఎగపడ్డది. కోడి పిల్లల్ని సుతం ఎత్కపోతాందట’’

‘‘ఏదోతి పెద్దవ్వ, దేవుడిచ్చింది తింటున్నామ్‌ తీ ఏరే ఇల్లు, నోరులేని పిల్లి, దానికేమన్న బుద్ది షెప్పొత్తదా…

మస్సులసొంటిది వంకర తింకర తొవ్వలు తొక్కుతున్నరు’’

‘‘ఇల్లు గల్లదాన్ని… నేను ఒక్కమాటంటె సుతం ఉంచుకోవూ… రేషం బాగానే పొడ్సుకొత్తందీ.. ఇల్లు కాల్జేయ్యాలే రేప్పొద్దుగాలా… షిప్పలు అవ్తల పారేత్త లేకుంటె…’’

హాఠాత్తుగా రెచ్చిపోయింది ఇంటోల్ల పెద్దవ్వ.

‘‘ఏ.. ఏం ఒర్తవ్‌ కుక్కోలే… షేత్తంతీ… కుక్క బెదిరిచ్చి షెప్పెత్తపోద్ది.. నువ్వు ఇల్లున్న దానివి… నును లేని దాన్ని… ఎవలకు కొపమొచ్చినా మేమే పోతం, ఇండ్లు లేనోల్లకు పదిండ్లు…’’

సరోజన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి.

చేపల కూర గిన్నెలో వేసుకొని తెచ్చింది.

‘‘కట్టెల పొయ్యిమీన కంచుడు పెట్టి ఒండినంత రుషుంటదా… మాదేమో మాగిన షింతపండు… మీదేమో కొత్తదాయే… ముసతి ముండకొడుక ఏర్పాటు జేసి పజితషేత్తడు’’

‘‘పెద్దవ్వా… నీ కాల్లు మోక్కుమన్నా… మోక్కుత, నా ఇంట్ల కలిగింది ఏసిన, నువ్వన్నట్టు కావాల్నంటె యాడికి పోనూ…’’

‘‘ఏందవ్వ! ఏమో పరిక్కంపల పడ్డట్టే ఉన్నదీ… నువ్వు షిడంల ఇల్లు కాల్జెయ్యాలే… కల్వది మీకు మాకు’’

ఇంటోల్ల పెద్దవ్వ ఆవేశంతో ఊగిపోతోంది… పెదవులు వణుకుతూ ఉన్నాయి.

‘‘ఏ… షేత్తంతీ… నీ గ్గాంకున్నది బంగారిల్లు’’

‘‘అవ్‌… నాగ్గాంకున్నదిల్లు. నీకున్నాదే… బోడుసోద్దానా… రేపు నువ్‌ సత్తె నడిబజార్లేత్తరు’’

‘‘నువు సత్తె నిన్ను నడిరట్లనే పెడ్తరు, నేను సత్తె నన్ను బస్టాండు పాయికాన బొందలపెడ్తరుతీ…’’ అనుకుంటూ కళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజన.

ఇంటోల్ల పెద్దవ్వ అరుస్తూనే ఉంది.

సరోజన బీడీలు చేస్తోంది కాని దుఖం తెరలు తెరలుగా వస్తోంది.

‘‘అడ్డమైనోడు గింతంత సంతనీడ దోరింపు చెయ్యకపాయె… మందితోని మాటలు పడవడ్తిమి…, గా పొద్దు కౌన్సిలేరు గాడు మూడు వేలు తీసుకొని ఇండ్ల జాగలిచ్చిండు.

పైసలకు కటుమిటై తీస్కోక పోతిమి’’

ఏడుస్తూనే ఉంది.

ఇంటి ముసలాయన దగ్గు వినబడిరది. ఇంటోల్ల పెద్దవ్వ గొడవ విషయం చెబుతోంది.

‘‘కాల్జేపియ్యాలే.. ఎండిల్లో… బంగారిల్లో… దానికి ఈంత సుతం గతిలేదు కదా’’ అనుకుంటూ గుమ్మంలోకి వచ్చాడు ముసలాయన.

‘‘ఓ… సరోజన… రేప్పొద్దుగాల ఇల్లు కాల్జెయ్యాలె బిడ్డా… మాకు పంచాదులు పెట్టుకునుడు షాతగాదు బిడ్డా… దానికి ఇంతంత బీపి ఉన్నది. ఆయింత అడ్డపడజిక్కమరిష’’

‘‘మాగ సూస్కుంటంతీ… ఎంత మంది అంటరు, ఎన్ని మాట్లంటరు’’ అంది సరోజన బడి గంట వినబడింది.

సంపతిగాడు పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాగు ఇంట్లోకి విసిరాడు.

పిల్లి వచ్చింది. అరుస్తూ వాడి చుట్టే తిరుగుతోంది.

‘‘కాల్రెక్కలు కడుక్కొచుకో బిడ్డా, బువ్వ తిందువు’’

‘‘ఊ నీయ్యవ్వ, నువ్వు తినిపియ్యి’’ అన్నడు సంపతిగాడు

‘‘ఈప్‌ పల్గుతదీ, బీడీలు సూపియ్యనీకి పోవాలే. పొద్దుపోతే మేస్తిరి మామ కోపం జేస్తడు’’

‘‘ఐతే నేను స్కూలుకు పోను’’ పండ్లు కొరుకుతూ, పాదాలు నేలకు కొడుతూ ఉన్నాడు.

‘‘ఈనయ్యను తియ్యారాదు, ఈన్ని పెట్టరాదు, ఈల్లన్నది అట్టుకు సాగాలే, ఇల్లు ముంగిలి లేని లేకిడొల్లకు పిల్లి వద్దురా అంటె ఇకన పోతివి. ఓ పిల్లిని తెత్తివి, వాల్ల షాపలకూరంత తిన్నదట, వాల్లు ఇల్లు కాల్జెయ్యమంటంన్రు’’ అంటూ అన్నం కలుపుతోంది.

సంపతిగాడు పిల్లితోక పట్టుకొని ఆడుతూ ఉన్నాడు.

‘‘ఒద్దు బిడ్డా… ఆయింత షెయ్యందుకుంటదీ.. దాని పండ్లు సూదిలోలె ఉంటాయీ…

ఊ… బుక్క పెట్టుకో..’’

‘‘ఎత్తుకో మరి’’ చేతులు పైకి చాచాడు.

‘‘నీ దండం బెడ్త, నాకు షాతనైత లేదు, రెక్క గుంజ్తంది’’

‘‘ఊ ఐతె బువ్వదిన’’

‘‘అయ్యో.. గోస వెట్టుకో వడ్తివి గదరా…’’ అంటూ చంకలో వేసుకున్నది.

‘‘ఊ… నోరుదెర్వు’’

‘‘పిల్లికి పెరుగుబువ్వ పెడ్తెనే తింట’’

‘‘అయ్యో… ఈ రపరప పాడుగానో… ఇగ యాన్నన్న పడి సత్తగనీ…’’

‘‘నీయ్యవ్వ! నువ్వు సచ్చిపోతే నేనెట్ల మరీ…’’ అన్నడు సంపతిగాడు.

‘‘పిలగ, తినరాదో.. ఏం సతాంస్తవ్‌, నీ పిల్లిని దొమ్మరోల్లకిత్త గనీ’’ అన్నాడు ఇంటి ముసలాయన.

‘‘మమ్మీ.. దొమ్మరోల్లంటె ఎవలే…’’

‘‘వాల్లు పిల్లుల కోస్కోని తింటరు’’

‘‘నీయ్యవ్వ! ఆల్లతోని పైటింగుషేసి ఆల్లను సంపేత్త’’ కాల్లూ షేతులు ఊపుకుంటూ అన్నాడు సంపతిగాడు.

‘‘ఊ… సరేగని బుక్కవెట్టుకో బిడ్డా…’’

‘‘నీయ్యవ్వ! పిల్లికి బువ్వపెట్టో…’’ గట్టిగా అరిచాడు

‘‘ఎవ్వతి కలి సల్లిందో… పున్యాత్కురాలు’’

వాడిని కిందకు దించి పిల్లికి పెరుగన్నం పెట్టింది సరోజన.

‘‘మమ్మి… దీని కడుపుల షాన పిల్లలున్నయి కదనే… అన్నింటిని మనమే సాదుకుందాం.

అన్ని దీన్లెక్కనే ముద్దుగుంటయి కదా… ముయ్యాం… ముయ్యాం.. అంటయి కదా…’’

బుంగ మూతిపెట్టి. ముక్కు విరస్తూ అన్నాడు.

సంపతిగాడు స్కూలుకు వెళ్ళిపోయాడు.

సమయం రెండు దాటింది.

సరోజన బీడీలు చూస్తూ ఉంటె ఇంటోల్ల పెద్దవ్వ వచ్చింది.

‘‘నీకు అంటె కోపం గాని… అగో… తెనుగోల్లింట్ల ఒల్షంత పెరుగు తాగిందట పిల్లి. ఆల్లకు ఇల్లెందుకిచ్చినవని నన్ను తిడ్తండ్రు’’ అంది.

‘‘ఏందవ్వ లొల్లి, కాల్జేత్తంతీ… ఊరుమీన పిల్లులే లేనట్టు షెయ్యవడ్తిరి… పిల్లులేమన్న ఎన్కటిసంది అడ్విలుంటున్నయా… ఊల్రెనే ఉంటన్నయి. ఇన్నొద్దులోలె ఎలుకలు కూడ దొర్కుతలెవ్వాయే… ఊరబిష్కలు కూడ కండ్ల వడ్తలవ్వు, తిని బత్కనీకి, పిల్లులెట్ల బత్కుతయి మరీ…’’

వేకువ ఝూమునే నిద్రలేచింది సరోజన.

బయట వాకిలి ఊడ్చి, కల్లాపి చల్లి ముగ్గులు వేస్తోంది.

మందారాలు విరిసినట్టుగా తూర్పు ఎరుపెక్కింది. కోయిలలు అరుస్తున్నాయి. చెట్లపై పక్షులు అలికిడి చేస్తున్నాయి.

ఇంటోల్ల పెద్దవ్వ మేయిన్‌ రోడ్డుపై నడుస్తూ వాకిట్లోకి చేరుకుంది.

‘‘సరోజనా.. పీడ ఒడ్షింది… పిల్లిని సంచిల కొంటబొయ్యి తిరుపతి బస్సుల సీటుకింద పెట్టొచ్చిన’’ అంది ఇంటోల్ల పెద్దవ్వ, అంది నవ్వుతూ.

‘‘అయ్యో… నీ అన్యాలం పాడుగానో… రాత్రి పిల్లి ఈనింది గాదవ్వా’’ అంటూ ముగ్గు గిన్నె కింద వదిలేసింది సరోజన.

‘‘ఓ.. బిడ్డో… పాపంల పడ్తినే… పిల్లి పాపం షిన్నది గాదో…’’ నుదురుపై చాతిపై కొట్టుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టింది.

ఇరుగుపొరుగు జనం గుంపుకూడారి. సోమయ్యతో పాటు సంపతిగాడు కూడా వచ్చి తల్లి కొంగు పట్టుకొని నిలుచున్నాడు.

‘‘ఓ ముండా! గింత మబ్బుల్నే నీకు పిల్లి యాడ దొరికిందే…’’ నుదురుపై కొట్టుకుంటూ ఇంటి ముసలాయన.

‘‘తెల్లారిగట్ల ఇంట్లకచ్చి బువ్వగిన్నె మూత పడగొడ్తంటె లప్పుక్కున అందుకున్న’’

‘‘అవ్వలాలా… ఓ అడ్డమైన పిల్లిని సాదిండ్రు, మకు పాపం అంట గట్టింన్రు, ఇల్లు గంటలోపట కాల్జెయ్యాలే…’’ గొంతు పెంచాడు ఇంటోల్ల ముసలాయన.

‘‘మరేందవ్వా… ముడికాల కిరాయికి ఆశపడ్తండ్రు. ఏ… ఇల్లు కాల్జేపియ్యిరి… ఏందుల్లా… ఊకె రసరసా మరి’’ పక్కింటి ఆవిడ అంది.

‘‘అవ్వలారా… మీకు దండం బెడ్త, ఊకె అనకుండ్రి, పొద్దూకేటలకు నీ ఇల్లు కాల్జేత్తం’’ అన్నడు సోమయ్య

‘‘మమ్మీ… మన పిల్లికి ఏమైయ్యందే…’’ అడిగాడు సంపతిగాడు.

‘‘ఇంకెక్కడి పిల్లి! నీ పిల్లి తిరుపతికి పొయ్యింది’’ అంది ఎదురింటి రామవ్వ

‘‘ఆ…’’ అంటూ వాకిట్లో పడుకొని కాల్లూచేతులు కొట్టుకుంటూ నానా యాగీ చేస్తున్నాడు.

‘‘ఏహే… రొండు అంటియ్యిండ్రి పిర్రల మీదికెల్లి. గావ్రం షేత్తండు, గిప్పుడే గిట్లైతే రేపు షేతికత్తడా…’’ అన్నాడు ఇంటోల్ల ముసలాయన.

సోమయ్య సంపతిగాన్ని లేపి నిలబెట్టి ఎటు వీలైతే అటు కొట్టడం మొదలెట్టాడు.

‘‘వీల్ల ఇండ్లు కాలిపోనో.. నా పోరగాన్ని సంపిచ్చేటట్టే ఉన్నారో… నా పోరన్ని కంట్లె పెట్టుకొని పంట్లె తీత్తండ్రో.. ఈల్ల నోల్లల్ల మన్నుపొయ్యనో…’’ అరుస్తూ సంపతిగాన్ని లాగి చంకలో వేసుకున్నది సరోజన.

‘‘ఎవతివే నువ్వూ… నా ఇల్లు కాలి పోనంటావూ…’’ ఇంటోల్ల పెద్దవ్వ గొడవకు దిగింది.

సొంత ఇళ్ళ వాళ్ళంతా సరోజననే తిట్టడం మొదలెట్టారు.

‘‘ఓ… లంబ్డి! నోరు మూతతవా లేదే…’’ అంటూ సరోజనను వంచి వీపులో నాలుగు గుద్దులు బలంగా గుద్దాడు సోమయ్య.

సరోజనకు ఊపిరాడ్డం లేదు. ముందుకూ వెనక్కు పంగుతూ లేస్తూ తల్లడిల్లుతోంది.

సంపతిగాడు భయం భయంగా చూస్తూ పెడబొబ్బలు పెడుతున్నాడు.

‘‘అవ్వలాలా… జర మన్నించుండ్రి… మీ అందరి కండ్లు సల్లవడ్డయా…  పిల్లిని సాదుకునుడు పాపమా… జర లొల్లి బంజెయ్యిర్రి… ఇప్పుడు ఇంటి ఇండ్రాదురం ఉరిపెట్టుకొని సావుమన్నా సత్తం’’ అంటూ సోమయ్య బయటకు వెళ్ళిపోయాడు.

బడి ప్రార్థన గంట వినబడిరది.

సరోజన సంపతిగాడ్ని పక్కలో వేసుకోని పడుకున్నది. వాడు నిద్రపోతూనే మూలుగుతున్నాడు.

‘‘డాడి… కొట్టకు… మమ్మిని కొట్టకు… మమ్మి చచ్చిపోతే నేనెట్ల..’’ కలవరిస్తూ ఉన్నాడు. వాడ్ని గట్టిగా హత్తుకోని బోరుమని ఏడ్చింది సరోజన. ఆమె కదలలేక పోతోంది. దెబ్బలకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది.

సంపతిగాడి ముఖమంతా ఎరుపెక్కింది. ముక్కులొంచి చామిడి, కళ్ళలోంచి నీళ్ళూ కారుతూ ఉన్నాయి. నుదురుపై చెయి ఆనించి చూచింది. ఒళ్లు పెనంలా కాలిపోతోంది.

చొక్కా లేపి వీపు చూసింది. చర్మం నల్లగా కమిలి పోయింది. ‘‘వీని షేతులు పాడుగానో గింత గనం కొట్టిండో…’’

పిల్లి కూనలు అరుస్తూ ఉంటె సంపతిగాడు కళ్లు తెరిచి పైకి చూసాడు.

‘‘పిల్లి పిల్లలు షేషింది బిడ్డా…’’

నవ్వుతూ… ‘‘నాకు సూపియ్యవా మమ్మి’’ అన్నాడు.

పిల్లి కూనలను కింద వేసింది. అవి గది అంతా పాకుతున్నాయి.

సంపతిగాడు చప్పట్లు కొడుతూ మురిసి పోతున్నాడు.

‘‘మమ్మీ… టూ కిటెన్స్‌ వాళ్ల మమ్మి లెక్కనే ఉన్నయి కదానే… వాళ్ళ మమ్మి తిరుపతికి పొయ్యింది. వాటికి మిల్కెట్ల, వాళ్ళ మమ్మి ఎట్ల మరీ…’’ అడిగాడు, సరోజనకు ఆందోళన మొదలైయ్యంది.

‘‘కూనలెట్ల బత్కాలే… పొల్లగాడు పిల్లినెట్ల మర్వాలే… ముసలి ముండ పాపం ముల్లెకట్టుకునెనా…’’ అనుకుంది.

‘‘మమ్మీ.. వాటికి మిల్క్‌ పొయ్యే…’’ వాడి గొంతు బొంగురు పొయ్యింది.

‘‘అవి ఇంకా కండ్లే తెరువలేదు బిడ్డా… వాటికి తాగరాదు బిడ్డా…’’

‘‘జరం టానీకు తాగు బిడ్డా…’’

‘‘నాకు పిల్లి కావాలే… ఇప్పుడు నేను తాగ’’

‘‘పిల్లిని తేనీకి పోదాం మనమిప్పుడు. తాగుతనే పోతం’’

బుజ్జగిస్తూ సిరప్‌ తాగించింది.

పిల్ల కూనలను చూస్తూ కూర్చున్నాడు.

సరోజనకు ఏం చెయ్యాలో తోచడం లేదు.

‘‘మమ్మీ… పిల్లిని తీసుకొత్తాం పావే…’’

‘‘నువ్వు గిన్నన్ని పాలు తాగు బిడ్డా ఆకలైతది’’

సంపతిగాడు పాలు తాగాడు

కూనలను గంపలో వేసి తువ్వాలు కప్పింది. పిల్లవాడ్ని చంకలో వేసుకొని, గంపనెత్తిలో పెట్టుకొని బయలుదేరింది.

రోడ్డుపై నడుస్తోంది, కూనలు అరుస్తూ ఉన్నాయి.

‘‘బిడ్డలకు ఎంత ఆకలైతందో ఏమో… కండ్లు తెరిసి కన్న తల్లిని సూస్కోన్‌ నోస్కోన్‌ పాయె… ఒర్రి ఒర్రి కుత్కెలెండి పోవట్టెనా, గరీబోల్ల పిల్లి కూనలు సుతం అడ్డమైన రాతలు రాసుకొచ్చుకునెనా…’’ అనునకుంది సరోజన.

ఎండకాలం ఎండ మండిపోతొంది

సంపతిగాడు చంకలోనే నిద్రపోతూ ఉన్నాడు. సరోజనకు చెయ్య పీకుతోంది. పొద్దటి నుండి ఏమీ తినక పోయేసరికి నీరసం వచ్చేస్తోంది.

బస్టాండుకు చేరుకొని కంట్రోలర్‌కు జరిగిన విషయం చెప్పింది.

‘‘బాంచను… నా కొడుకు మొకం కూనల మొకంజూడు, తిరుపతి బస్సు డైవరుకు పోన్‌ జేసి ఇటోచ్చే బస్సులో పిల్లి సంచిని ఎయ్యమను. కాల్లు మొక్కుత, దండం బెద్త’’ బతిమాలింది. కంట్రోలర్‌ తిరుపతి బస్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేశాడు.

‘‘అవ్వా… బస్సులో ప్యాసెంజర్స్‌ బాగా ఉన్నారట. పిల్లి సంచి వెతకడం వీలుకాదట’’

అన్నాడు.

‘‘దండం బెడ్త బాంచను… జర ఎట్లన్న జెయ్య’’ చేతులు జోడిరచింది.

‘‘అవ్వా… జరసేపు అటుపొయ్యి కూర్చొ… నా పని నాకున్నది’’

గంటలు గడిచిపోతున్నాయి. చాలా సార్లు కంట్రోలర్న్‌ అడుగుతోంది. అతను విసుక్కుంటున్నాడు.

మధ్యాహ్నం మూడు కావస్తోంది. ఎండ తీవ్రత పెరిగింది. నిద్రలోనే పిల్లి కోసం కలవరిస్తున్నాడు. తడి గుడ్డతో వాడి ఒళ్ళు తుడుస్తోంది.

సరోజనకు గుండెలో దడ మొదలైయ్యంది.

బస్టాండులోని జనం సానుభూతి కురిపిస్తున్నారు.

‘‘కూనలు పిడాత సచ్చిపోయ్యేటట్టే ఉన్నయి. ఎంత కఠీనం మనిషవ్వా… నీ ఇల్లు గల్లది, పిల్లి గోస మంచిది కాదు’’ అంది ఒక ముసలావిడ.

‘‘అవ్వా… కూనల ముచ్చటేమో కనీ… నీ పొల్లగాన్ని జాగర్తగ సూస్కోబిడ్డా’’ అంది బస్టాండులోని స్వీపరు.

‘‘జరం మందుపోసిన, తూడుత్తన్న ఇగ ఎల్లవ్వతల్లే దిక్కు మాకు’’ అనుకుంటూ

‘‘పిల్లిదొరికితె నా కొడుకు జరం దెంకపోతది’’ చేతులెత్తి మొక్కింది సరోజన.

బస్టాండులోని టీవీలో వడదెబ్బతో జనం మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

సంపతిగాడి పొట్టపై చెయ్యి పెట్టి సరోజన. ‘‘జరమైతె దిగింది’’ అనుకుంది.

‘‘మమ్మీ… మన పుస్సీక్యాట్‌ ఇంగరాదా.. కిటెన్స్‌ చచ్చిపోతాయా ఇంగ’’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సంపతిగాడు.

‘‘ఒత్తది బిడ్డా… ఏడ్వకూ’’

‘‘అంకుల్‌ ఒత్తదని చెప్పిండా…’’

ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నాడు. అన్నింటికి అవునంటూ జవాబు చెబుతూ ఉంది.

‘‘పిల్లి రాకుంటె ఎట్ల, కొడుకు ఎట్ల షేతికి రావాలే… గుండె వలుగుతె ఎట్ల, ఉన్నొక్క కొడుక్కు ఏమన్నైతె ఎట్లా..’’ ఆలోచనలు సాగుతూనె ఉన్నాయి.

భయంతో వణికిపోతోంది. కడుపులో గాబరవుతోంది. కళ్ళు తిరిగినట్టవుతోంది సరోజనకు.

పిల్లి కూనలు అరిచీ అరిచీ అలసిపోయాయి. కదిలే శక్తిని కూడా కోల్పోయాయి.

సూర్యుడు చెట్ల చాటుకు పోతున్నాడు.

‘‘చెల్లే… గీ పాలబొట్లు కూనలు తాగుతయేమో సూడు… గిన్నన్ని పొల్లగాన్కి సుతం తాగియ్యి… పొద్దటికాంచి కూడు లేదాయే… కుమ్ములేదాయే…’’ అన్నాడు బస్సు స్టాండులోని హోటలు యజమాని.

సంపతిగానికి కొన్ని తాగించింది. కూనల నోటి ముందు పెట్టింది, కాని అవి తాగలేక పోయాయి.

ప్రాంతమంతా చీకట్లు ఆవరిస్తూ ఉన్నాయి. బస్సు స్టాండులో లైట్లు వెలిగాయి. జనం పలుచపడుతున్నారు.

సరోజనలో పిల్లి దొరుకుతుందనే ఆశ క్షణ క్షణం క్షీణిస్తోంది.

‘‘అవ్వా… బస్సులో పిల్లి సంచిలేదట, పోతాంటెనే పిల్లి సంచిని ఎవరో తీస్కపొంగ చూసిన ప్యాసింజర్‌ చెప్పిండట’’ అన్నాడు కంట్రోలర్‌.

సరోజన నిస్సహాయంగా చూస్తూ ఉండి పోయింది. ఒళ్ళంత చెమటలతో తడిచిపోతోంది.

బోరున ఏడ్చింది.

‘‘ఏందవ్వా… పిల్లి పాడుగానూ… ఆయింత గాబరై పొల్లగాని నోట్లె మన్నువొత్తవా ఏంది.

గుండె దైర్నం చేస్కోవాలే… పొల్లగాన్ని దావుకాండ్లకు తోల్కపో… రొండ్రొజులైతే వాడె మరుత్తాడు. ఉంకొ పిల్లిని తెచ్చి సాదుకపో…’’ అన్నాడు కంట్రోలర్‌.

సరోజన కూనల గంప తలపై పెట్టుకొని సంపతిగాడ్ని చంకలో వేసుకొని ఇంటి దారి పట్టింది. రోడ్డుపై నడుస్తోంటే ఒళ్ళు తూలుతోంది. కాళ్ళల్లో శక్తి లేకుండా అవుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. చాతిలో నొప్పి మొదలైయ్యింది. ఆయాసం వస్తోంది. శ్వాస వేగం పెరిగింది. నాలుక తడి ఆరిపోతోంది.

సంపతిగాడు ప్రశ్నలు కురిపిస్తున్నాడు. అన్నింటికి ‘‘ఊ’’ అంటూ జవాబిస్తోంది. మెల్లె మెల్లగా ఇల్లు చేరుకున్నది. నడీ ఇంట్లో గంప దింపింది. బోర్లా పడిపోయింది సరోజన.

‘‘మియ్యాం… మియ్యాం…’’ అరుస్తూ పిల్లి వచ్చింది.

‘‘పుస్సీక్యాట్‌… పుస్సీక్యాట్‌… అంటూ చప్పట్లు కొడుతున్నాడు, నవ్వుతున్నాడు, గది అంతా గంతులేస్తున్నాడు సంపతిగాడు.

పిల్లి ముందు కాళ్ళతో గంపని వంచి నోటితో కూనలన్నింటిని బయటకు తీసింది. నాలుగు కాళ్ళు బార్లా చాచి పడుకుంది. కూనలు ఆబగా పాలు తాగుతున్నాయి. పిల్లి వాటిని నాకుతోంది.

‘‘మమ్మీ… మమ్మీ… మన పిల్ల ఒచ్చిందే..’’ అంటూ సరోజన చెంపలపై తడుతున్నాడు.

ఆమె కళ్ళు తెరవడం లేదు. వాడు ‘‘మమ్మీ… మమ్మీ…’’ గొంతెత్తి పిలుస్తున్నాడు…

ఏడ్వడం మొదలెట్టాడు.

ఇంటోళ్ళ ముసలాయన పాలగ్లాసుతో ఇంట్లోకి వచ్చాడు.

‘‘ఓయ్‌… ఉన్నావే… సరోజన ఎట్లనో షేత్తాంది…’’ అరిచాడు.

ఇంటోళ్ళ పెద్దవ్వ వచ్చి సరోజన అరికాళ్ళు అరచేతులపై గట్టిగా రుద్దింది. ముఖంపై నీళ్ళు చల్లింది.

సరోజన నెమ్మదిగా కళ్ళు తెరచి పిల్లిపైపు చూస్తోంది.

‘‘బిడ్డా… నెత్తురుడిగినోల్లం బిడ్డా… మాకు ఓపిక ఉండది బిడ్డా… మన్సుల వెట్టుకోకు మేము నోరుజారినా ఓర్సుకో బిడ్డా… నీ బుద్ది ఉన్నన్ని దినాలుండు. నువ్వు ఇల్లు కట్టుకునేదాన్క ఉండు బిడ్డా…’’ అన్నాడు ఇంటోల్ల ముసలాయన.

ఇంటోళ్ళ పెద్దవ్వ కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి. సరోజన ఆమె ఒడిలో తలపెట్టి బావురుమంది. చాలా సేపు ఏడ్చింది.

‘‘బిడ్డా… గిన్నన్ని పాలబొట్టుతాగు… గాబరైనవు బిడ్డా… ఎండకాలం ఎండాయే…’’

అంటూ గ్లాసు సరోజన నోటి దగ్గర పెట్టాడు ఇంటోళ్ళ ముసలాయన.

సరోజన పాలుతాగుతోంది…

ఇంటోళ్ళ పెద్దవ్వ మరిన్ని పాలు తెచ్చి పిల్లి గిన్నెలో పోసింది.

 

1 thought on “పేగుముడి (నోముల కథలు 2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *