May 4, 2024

గుర్తుందా.. నీకు గుర్తుందా? (ఓ తల్లి రాసిన ఉత్తరం)

mother daughter

రచన: భునవచంద్ర

ఆనాడు

నెల తప్పానని తెలిసిన రోజున

ఆనందంతో తబ్బిబ్బై

పొట్టమీద చెయ్యి వేసుకుని

అణువంత వున్న నీ తలని

అనురాగంతో సృశించిన నా స్పర్శ

నీకు గుర్తుందా?

నా ఆశలాగా నీవూ నెల నెలా పెరిగి

కడుపులో అటూ ఇటూ దొర్లేటప్పుడు

ఆ నెప్పిని తీయగా అనుభవిస్తూ

పొట్ట మీంచే నీ ఒళ్ళుని నిమిరిన యీ అమ్మ

చేతి స్పర్శ నీకు గుర్తుందా?

వెయ్యి శూలాలతో పొడిచినట్టూ

కోటి చురకత్తులు ఒకేసారి గుచ్చినట్టూ

నువ్వు నా కడుపు చీల్చుకుని .. ఇవతల పడే

ప్రయత్నం చేస్తుంటే అంత బాధలోనూ

నీకేం కాకూడదని.. కోటీ దేవుళ్లకి మొక్కాను..

ఆ మౌన బాధ గుర్తుందా?

పళ్ళు బిగబట్టి బాధని భరిస్తూ

కెవ్వున కేకలు పెడుతూ, ఏడుస్తూ కూడా

నన్ను చీల్చుని నువ్వు బయటబడ్డ క్షణాన

మగతలో కళ్లుమూసుకుపోతున్నా

నిన్ను స్పృశించాలని నేను చేసిన ప్రయత్నం

నీకు గుర్తుందా?

కళ్లు తెరిచాక నిన్ను చూసీ,,

పాలిస్తూ నీ ఒళ్ళంతా నిమిరి

తమకంతో నీ బుల్లి బుగ్గ మీద

మెత్తగా పెట్టిన మొదటి ముద్దు

నీకు గుర్తుందా?

అప్పట్నించీ…

లాలపోస్తూ నిన్ను తడిమాను

జోలపాడుతూ తడిమాను

బట్టలు తొడుగుతూ తడిమాను

‘అసహ్యాన్ని’ కడుగుతూ ఆనందంగా నిన్ను తడిమాను!

ఆకలంటే నువ్వు..

ఆనందంగా అన్నం పెట్టా..

అనారోగ్యంతో ఉంటే నువ్వు

ఏడుస్తూ సేవ చేశా…

అవన్నీ గుర్తున్నాయా…

పోనీ…

“అమ్మా అక్కడ రక్తం” అంటూ

నా వంక నువ్వు బేలగా చూస్తే

ఓ పక్క నువ్వు

పెద్దమనిషి వయ్యావనేఆనందం…!

మరో పక్క

పాడులోకం నిన్ను

ఏం చేస్తుందో అన్న భయంతో

సగం నవ్వి, సగం ఏడ్చి

తాటాకుల మీద కూర్చోబెట్టి

ఏడ్చా తనివారా..

గుర్తుందా..??

చదువుల సరస్వతివై

పెళ్లికి బదులు ఉద్యోగం అంటే

బయటికి పంపలేక

నాలా నిన్నూ

వంటలక్కని చెయ్యలేక

అత్తా,మామా, భర్తా అందరితో పోట్లాడి

నీ మాటే నెగ్గించాను .! పోనీ

అదైనా గుర్తుందా?

నీకోసం ఎన్ని సంబంధాలు చూసినా

‘ఎవర్నో ప్రేమించానని’ నువ్వంటే

నీ సంతోషమే  నా సంతోషం అనుకుని

మంగళస్నానం చేయిస్తూ నీ ఒళ్ళు రుద్దానే చిన్నీ

అదైనా అగుర్తుందా?

అత్తవారింటికెళ్తున్నావనే ఆనందం ఓ పక్క

నిన్ను రోజూ చూసుకోలేననే బాధ మరోపక్క

రెంటినీ గుండెలో దాచుకుని

మానులా నిలబడిపోయానే..

పోనీ ఆ క్షణం నీకు గుర్తుందా?

చూలాలిగా వచ్చావు

చేతుల్లో వాలిపోయావు

నువ్వు నెప్పులు పడుతుంటే

నా గుండెల్లో నిప్పులు కురిశాయి.

‘నీ బిడ్డని’ నీ చేతుల్లో పెట్టి

‘నా బిడ్డని’ కళ్లారా చూసుకుంటూ

‘అమ్మమ్మ’నైనానని ఆనందపడటం

నీకు నిజంగా గుర్తుందా చిన్నీ….

ఇప్పుడింకేం గుర్తు చెయ్యనూ?

నాకంటే పెద్దవాళ్ళందరూ

మరలి రాలేని చోటుకి

తరలిపోయారని గుర్తుచెయ్యనా?

నువ్వు తప్ప నాకెవ్వరూ

యీలోకంలో లేరని గుర్తు చెయ్యనా?

“కొడుకైనా కూతురైనా నేనేనమ్మా నీకు!” అన్నావుగా

కూతవేటు దూరంలో ఉన్నా

నీకసలు గుర్తుకే రానా?

“ఆయన బిజీ ఆఫీసులో

నేను బిజీ ఫంక్షన్సులో

పిల్లలు బిజీ హైస్కూళ్ళలో

అందరం బిజీ యాత్రల్లో!”

” ఆయిల్లు అమ్మి వ్యాపారం పెడదాం” అని మీ ఆయన

“అవునమ్మా మంచి ఆలోచన అని నువ్వు

“అమ్మమ్మ ఓల్డ్, ఆవిడ గోల్డే న్యూ” అని నీ పిల్లలు

అన్నారనైనా

నీకు గుర్తుందా?

“మా యింటికొస్తే చూసుకుంటాగా”అంటావు నువ్వు

“మీ అమ్మదంతా చాదస్తం!”అంటారు నీ అత్తామామలు

కానీ వాళ్లకేం తెలుసూ?

నీకు మాత్రం ఏం తెలుసూ?

నువ్వు ‘బోర్ల’పడ్డ వరండా ఇక్కడే ఉంది.

నువ్వు ‘పాకి’న పెద్ద ‘అరుగూ’ ఇక్కడే ఉంది.

నువ్వు మొట్టమొదట కుర్చీ పట్టుకు నిలబడ్డావే

అదీ ‘ఇక్కడే’ ఉంది..

నువ్వు ఆశపడితే అప్పు చేసి నీ కోసం కొన్న

పట్టుపావడాకూడా ఇక్కడే ఉంది.

నువ్వు పెద్దమనిషయ్యాక మొదటగా వేసిన

నీలం ఓణీ, సిల్కు లంగా.. తెల్ల జాకెట్టూ

అన్నీ ఇక్కడే ఉన్నై! నా పక్కనే ఉన్నై!

నీ స్పర్శ..

ఇంకా ఇక్కడ నా గుండెల్లో..

పదిలంగానే ఉంది.

నీ ఒకటో తరగతి పుస్తకం నించి

డిగ్రీ పుస్తకాల దాకా

అంతెందుకూ  ఎప్పుడో చిన్నప్పుడు

నువ్వు విరగ్గొట్టిన పలకా

అప్పుడెప్పుడో నువ్వొదిలి వెళ్లిన

లిప్‌స్టిక్కు, చెంప పిన్నులూ కూడా

నా దగ్గరే భద్రంగా ఉన్నై బంగారూ!

కళ్లు మసకబారుతున్నా

కన్నీళ్లు ఊరుతూనే ఉన్నై

కలాన్ని కదపలేక

చెయ్యి మొరాయిస్తోంది

‘కాలం’ నా ముందుకొచ్చి

కౌగిలిస్తానంటోంది

నీ జ్ఞాపకాలలో

బరువెక్కిన నా గుండె

ఇక ‘ఆడనని’ అలుగుతోందమ్మా

అయినా పరవాలేదులే

చిన్నప్పుడు నువ్వు

కావలించుకునే దిండు

నేను కావలించుకున్నా

అప్పటి నీ స్పర్శని ఇప్పుడు

కొంచెమైనా అనుభవిద్దామని

అప్పుడు నువ్వు దువ్వుకున్న

దువ్వెనని వెతుక్కుంటున్నా కనీసం

నీ జుత్తు వాసనైనా దొరుకుతుందని

రాలిపోయే పండుటాకుని గదా

రాలక తప్పదు

అయినా బంగారూ..

అప్పుడు కూడా

నా మనస్సుతో

నిన్ను సృశిస్తా..

కనీసం ఆ స్పర్శ నైనా

గుర్తుపడతావు గదూ!!

ఇట్లు

 

మీ అమ్మ..

12 thoughts on “గుర్తుందా.. నీకు గుర్తుందా? (ఓ తల్లి రాసిన ఉత్తరం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *