May 3, 2024

బహుముఖం ( నోముల కథలు 2014)

రచన: కోట్ల వనజాత వనజాత

‘‘సార్‌! జీపీఎఫ్‌ బిల్లు పాస్‌ కావాలంటే వాళ్లు మూడొందలు అడుగుతున్నరు. ఇచ్చి సాంక్షన్‌ చేయించమంటారా!’’ అడిగాడు కాలేజీ అకౌంటెంట్‌ శంకరయ్య ఇంగ్లీషు లెక్చరర్‌ రవీందర్‌ను.

‘‘ఇచ్చి చేయించండి శంకరయ్య గారూ! డబ్బులు చేతికొచ్చినంక మీ మూడొందలు మీకిస్తాను’’ అన్నాడు రవిందర్‌.

‘‘ఎన్నో విషయాల్లో ప్రగతిశీలంగా ఆలోచించే మీరు ఈ విషయంలో మటుకు రాజీ పడుతుంటరు. మతలబేంటో సమజయితలేదు’’ అన్నాడు కెమిస్ట్రీ లెక్చరర్‌ సూర్యం.

‘‘ఆ! ఆయనా ఒకప్పుడు ఆ తాన్లో ముక్కే గదా! అందుకే రవీందర్‌ గారు ఆ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తుంటాడు’’ ఎకసెక్కంగా అన్నడు ఎకనామిక్స్‌ లెక్చరర్‌ సుబ్బరామన్‌.

ఎదుటివాళ్ల నొప్పితో సంబంధం లేకుండా పుండును ముక్కుతో పొడిచే కాకిలాంటి మనిషి సుబ్బరామన్‌. నీతో మాటలనవసరం అన్నట్లు ఒక్క చూపు చూశాడు రవిందర్‌.

‘‘సాయంత్రం ఫ్రీగానే ఉంటవా!’’ అడిగాడు సూర్యాన్ని రవిందర్‌.

‘‘ఫ్రీగానే ఉంట. నాతో ఏమన్నా పనుందా’’ అడిగాడు సూర్యం.

‘‘పనేమీ లేదు కాస్త పిచ్చాపాటిగా మాట్లాడుకుందాం’’ అని ముందుకు కదిలాడు.

రవిందర్‌తో ముచ్చటంటే కమ్మటి విందు భోజనం సూర్యానికి ఏదైనా ఆసక్తికరంగా చెప్పడం రవిందర్‌లో సూర్యానికి నచ్చేకళ.

ఐదు గంటలకు రవిందర్‌ ఇంటికి బయల్దేరాడు సూర్యం.

చిన్న డాబా ఇల్లు. దానిపైన ఒకే ఒకగది. అది రవిందర్‌ పర్సనల్‌ రూం కం లైబ్రరీ. అదే ఆయన ఏకాంత నిలయం. సూర్యం సరాసరి పైకి వెళ్లాడు. అప్పటికే ఎదురుచూస్తున్నట్లుగా గది బయట రెండు కుర్చీలు వేసి ఉంటాడు రవిందర్‌.

సూర్యం రాకను గమనించిన రవిందర్‌ భార్య కమల రెండు కప్పులతో పైకి వచ్చింది.

‘‘ఇప్పుడే టీ తాగి వచ్చానమ్మా’’ మొహమాటంగా అన్నాడు సూర్యం.

‘‘ఇది టీ కాదు హార్లిక్స్‌! ఇది తీసుకొని తీరికగా మాట్లాడుకోండి!’’ అన్నది కమల.

కాసేపాగి ఖాళీ కప్పులతో కిందికి వెళ్లిపోయింది కమల.

మెల్లగా మాటల ప్రవాహం ముచ్చట్ల ఉధృతి పెరిగింది.

పొద్దుటి విషయాన్ని మెల్లగా కదిలించాడు సూర్యం.

‘‘ఒక ఉద్యోగి ఒక చేత్తో తీసుకునే డబ్బు ఎన్నో చేతులకి పంచబడుతుంది. మరెన్నో నోళ్లతో తినబడుతుంది. ఇంకెన్నో పొట్టలతో ఆరగించుకోబడుతుంది. అందుకే అది కనిపించని బహుముఖం.’’ అన్నాడు రవిందర్‌.

అర్థం కానట్టు మొహం పెట్టిండు సూర్యం.

‘‘అర్థం కాలేదు కదా ఎవరి కథో ఎందుకు! నా కథే చెప్త విను’’ మొదలు పెట్టిండు రవిందర్‌.

 

*   *   *   *   *

 

‘‘సార్‌! ఏటు సత్తెన్న అంటె మీరెనా సార్‌’’ అడిగాడు ఎదురుగా ఉన్న భూతద్దాల మనిషిని.

‘‘నా పేరు ఏటు సత్తెన్న కాదు. ఏ సెక్షన్‌లో రెండో నెంబర్‌ సీటు చేస్తున్న సత్తెన్నను. నీకేం కావాలె’’ అడిగాడు మందపుటద్దాల మనిషి.

‘‘సార్‌ జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వడానికి వచ్చాను సార్‌! నాపేరు రవిందర్‌. ఇంతకు ముందు ఇక్కడే అటెండర్‌గా పనిచేసిన బుచ్చయ్య కొడుకుని సార్‌! జూనియర్‌ అసిస్టెంట్‌గా అపాయింట్‌ చేశారు’’ చెప్పాడు.

‘‘ఓహో మా బుచ్చయ్య కొడుకువా! మీ నాయన నేను దాదాపుగా ఒకేసారి సర్వీసులోనికొచ్చినం. అటెండర్‌ అయినా మీ నాయన బలే సమజ్‌దార్‌ మనిషి. చెడ్డ అలవాట్లుంటె రోగాలొచ్చి ఛస్తమని మీ నాయన ఒక్క దురలవాటు కూడా చేసుకోలె అయినా కాన్సర్‌ మహమ్మారి మీ నాయనను నడుమింతలనే మింగింది’’ బాధగానే అన్నడు సత్తెన్న.

‘‘ఏం చదువుకున్నావు బాబు’’ మళ్లీ అడిగాడు.

‘‘డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా సార్‌’’ అన్నాడు రవిందర్‌.

‘‘ఎక్కడా’’ అడిగాడు సత్తెన్న.

లోకల్‌ కాలేజీ పేరు చెప్పాడు రవిందర్‌.

‘‘సార్‌ ఇంక మూడు నాలుగు నెలలయితే డిగ్రీ పరీక్షలైపోతయి తర్వాత చేరుతనంటె అమ్మ వినట్లేదు. వచ్చిన నౌకరి పోతదని భయపడ్తుంది’’ చెప్పాడు రవిందర్‌.

‘‘సరే జాయినింగ్‌ రిపోర్టయితే రాసిచ్చిపో! పోస్టింగ్‌ సంగతి తర్వాత జూస్తగానీ!’’ అన్నడు సత్తెన్న.

గబగబా జాయినింగ్‌ రిపోర్టు రాసిచ్చాడు రవిందర్‌.

ఇంత తొందరగా ఏం బరికాడా అన్నట్టు కళ్లను దగ్గరగా పెట్టుకొని భూతద్దాల్లోంచి పరికించి చూశాడు సత్తెన్న.

ముత్యాల్లాంటి అక్షరాలు, మచ్చుకొక్క తప్పైనా దొరకని వాక్యనిర్మాణం ఇంగ్లీషు భాష మీద రవిందర్‌కున్న పట్టును పసికట్టాడు సత్తెన్న.

మనసులో ఏమనుకున్నాడో గానీ పైకి మాత్రం సాయంత్రం నాలుగ్గంటలకొచ్చి కనపడు అన్నాడు భూతద్దాల్లోంచి చూస్తూ.

సాయంత్రం వెళ్లాడు రవి.

పోస్టింగ్‌ ఆర్డర్‌ చేతికిస్తూ ‘‘నీకు ఏత్రీ సీటుకు పోస్టింగ్‌ ఇప్పించిన నా పక్కసీటే. నీకు కలెక్టరేట్‌లోనే పోస్టింగు ఎందుకివ్వాలని అడిగారు జాయింట్‌ కలెక్టర్‌ గారు. ‘మన బుచ్చన్న కొడుకే సార్‌ అని చెప్పిన. నా ప్రపోజల్‌ ఓకే చేశాడు సార్‌’’ అన్నడు సత్తెన్న.

ఉన్న ఊళ్లో అందునా కలెక్టరేట్‌లో పోస్టింగు అమ్మకు ఇబ్బంది లేదు. ఇక నా చదువు కొనసాగితే చాలు అనుకున్నాడు రవి.

రోజులు గడుస్తున్నాయి. రవి, సత్తెన్నల జోడీ బాగా క్లిక్‌ అయింది. దారి తెలిసిన గుడ్డి గుర్రానికి పంచకల్యాణిని జోడించినట్లుండేది వారి పని. సత్తెన్నకు కళ్లు బాగా కనపడవు. అది ఈ మధ్యకాలం నాలుగేళ్లనుండే. అంతకు ముందు సత్తెన్న రాసే రూల్‌కు తిరుగు లేదు. ఏ జీవో అయినా ఏ యాక్ట్‌ అయినా రెవెన్యూ మాటరే గానీ, సర్వీస్‌ మాటరే గానీ చావు మంత్రం, పెళ్లి మంత్రం తెలిసి ప్రయోగించేవాడు. ఆరుగంటల ప్రభుత్వం ఉద్యోగం, పన్నెండు గంటలకు తగ్గకుండ చేసిన పనిరాక్షసుడు. దానికి తోడు అమోఘమైన జ్ఞాపకశక్తి సత్తెన్నకు.

అతని సెక్షన్ల ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు, బదిలీలు, పోస్టింగుల వంటి విషయాలుండేవి. రవి సెక్షన్‌లో ఉద్యోగుల సెలవులు తదితరాలుంటేవి. రెండు సీట్లలో పనికి డైరెక్షన్‌ సత్తెన్నది. యాక్షన్‌ రవిది. సత్తెన్న చెప్తుంటే రవి రాసేవాడు.

ఒక్కొక్క ఫైలు గురించి బాధిత ఉద్యోగులు సత్తెన్నను కలుస్తుండేవారు. వారితో  కాస్త పక్కకు పోయి మాట్లాడి వస్తుండేవాడు.

సారూప్యత కలిగిన ఫైళ్లు (సిమిలర్‌ ఫైల్స్‌) రికార్డు రూం నుండి తెప్పించడం వాటిని రవి చేత చదివించడం అదే విధంగా రాయమని చెప్పడం. ఏ రూల్‌ ఏ పుస్తకంలో ఉందో అలా కాకుంటే దాని వ్యతిరేక రూల్‌ ఎక్కడుందో పేరాగ్రాఫ్‌లతో సహా చెప్పేవాడు సత్తెన్న. అబ్బురమనిపించేది రవికి.

రవి చేసే సహాయానికి ప్రతిగా సత్తెన్న కూడా అతనికి కొన్ని వెసులుబాట్లు కల్పించేవాడు. డిగ్రీ ఎగ్జామ్స్‌ కన్నా ముందే సర్వీస్‌లో చేరిన రవి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ మాత్రం సజావుగానే రాశాడు. దూరవిద్య ద్వారా ఎం.ఎ. ఇంగ్లీషు చేస్తానంటే సంతోషంగా అభినందించాడు. చదువు కోసం లీవులు పెట్టాల్సిన అవసరం రవికి రానివ్వలేదు సత్తెన్న. పదిన్నరకు ఆఫీస్‌కొచ్చి ప్రయారిటీ ప్రకారం ఫైళ్లు అటెండయ్యి లంచ్‌ టైంకు ఇంటికి వెళ్లేవాడు. మళ్లీ ఏదైనా అత్యవసరముంటేనే ఆఫీసుకు వచ్చేవాడు. లేకుంటే దీక్షగా చదువుకునేవాడు. అప్పుడు సత్తెన్న మేనేజ్‌ చేసేవాడు. ఎవరైనా రవి గురించి అడిగితే ఇప్పుడే కిందకు వెళ్లాడనో, రికార్డు రూంకు వెళ్లాడనో చెప్పేవాడు. ఆ సహకారంతోనే రవిందర్‌ ఎంఏ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. తెగ సంబరపడి స్వీట్‌ తినిపించాడు సత్తెన్న. పనిలో పనిగా డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు కూడా రాశాడు రవి. సర్వీస్‌ మొదట్లో వాటి గురించి పట్టించుకోకనే తాను సీనియర్‌ అసిస్టెంటుగానే మిగిలిపోయానని చెప్పేవాడు సత్తెన్న. ఇంతలో సర్వే ట్రెయినింగుకు పిలుపొచ్చింది రవికి. వారంలో ఆరు రోజులు ట్రయినింగులో ఉండి ఆదివారం మాత్రం సత్తెన్నకు ఫైళ్లు రాసిపెట్టేవాడు రవి. ఆ కష్టపడే మనస్తత్వమే బాగా నచ్చేది సత్తెన్నకు. ఇద్దరు కలిసి ఆలోచించి రాసేవారు కాబట్టి ఏ ఫైలు పైనైనా సంతకాలే తప్ప మరే ఇతర రతాలూ ఉండేవికావు. అట్లా నాలుగేళ్ల సహచర్యంలో సత్తెన్నతో పాటే రవికి బెస్ట్‌ వర్కర్‌గా పేరొచ్చింది.

ఆరోజు పదిన్నరకు ఆఫీస్‌కు వెళ్లాడు రవి. రిజిస్టర్‌లో సంతకం చెయ్యడానికి  కారిడార్‌ పక్కన ఉండే గదిలోకి వెళ్లాడు. ముగ్గురు నలుగురు సహోద్యోగులు అక్కడే మాట్లాడుకుంటూ కనిపించారు. అంతలో అటెండర్‌ షఫి  రవి దగ్గరకొచ్చి ‘‘రాత్రి సత్తెన్న సార్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయిండట సారూ. మీకు తెల్వదా’’ అన్నడు.

రవి నిశ్చేష్టుడయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత ఆఫీస్‌ బయటకు వచ్చి దొరికిన ఆటో ఎక్కి సత్తెన్న ఇంటికి చేరుకున్నాడు.

అప్పటికే అతని అంతిమయాత్రకు ఏర్పాటు చేస్తున్నారు బంధువులు. భార్య, బిడ్డ మీద పడి ఏడుస్తున్నారు. దుఃఖం ముంచుకొచ్చింది. కొడుకు పట్ల తండ్రి చూపే వాత్సల్యాన్ని సత్తెన్న తన పట్ల చూపించాడు. ఇంక తాను అతనికేం సహాయం చేయగలనని మనసులో బాధపడ్డాడు. సత్తెన్న కొడుకు కాబోలు ఒక పక్క నిలబడి జరిగేదాన్ని నిర్వేదంగా చూస్తున్నాడు. కోడలు రాలేదని పక్కనే గుసగుసల పోతున్నారు అయినవాళ్లు. ఇంతలో ఒక చెయ్యి రవి భుజం మీద పడింది. తిరిగి చూశాడు. కలక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రామారావు అట్లా పక్కకు తీసుకెళ్లాడు రవిని.

‘‘సత్తెన్న కష్టాల వైతరణి దాటించడానికే నిన్ను అతనితో జత కలిపాడేమో ఆ భగవంతుడు. కొడుకు చెయ్యని  సాయం నువ్వు చేశావు’’ అన్నాడు రామారావు.

‘‘నేను చెయ్యడమేంటి’’ అందామనుకున్నా శూన్యం నిండిన రవి మనసు సంభాషణకు సహకరించలేదు.

కాసేపుండి వెళ్లారు చాలామంది సహోద్యోగులు. కొద్దిమంది మాత్రమే అంతిమయాత్రలో ఉన్నారు.  ఆ కార్యక్రమం అయ్యాక నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు రవి.

మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లాడు. రెండు  సీట్లలోనూ అర్జంటు ఫైళ్లున్నయి. ఎవరితోనూ మాట్లాడ మనస్కరించక పనిలో పడ్డాడు. పైళ్లు పంపిన అరగంటకి ‘‘ఏవో సాబ్‌ పిలుస్తున్నారంటూ’’ వచ్చాడు అటెండర్‌. ఏవో (అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌) రూంలోకి వెళ్లాడు రవి. ఇంకొక్క వర్కింగ్‌ హాండ్‌ దొరికే వరకు రెండు సీట్లలో పని ఒక్కడివే చెయ్యగలవా?’’ అడిగాడు ఏవో.

తలాడించాడు రవి చెయ్యగలనన్నట్లు. పనిలో ఉండగా వచ్చాడు పరమేశ్వర్‌. అతడు డిప్యూటీ తహశీల్దార్‌. అతనిపై డిసిప్లినరీ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య ఆ ఫైలు రాసి కలెక్టర్‌కు పంపాడు రవి. వార్నింగ్‌ ఇస్తూ క్లోజ్‌ చెయ్య వచ్చన్న రవి సూచన యధాతథంగా ఆమోదించారు. ప్రొసీడింగ్స్‌ తయారు చేసి అప్రూవ్‌ అయ్యాక పరమేశ్వర్‌కు పంపాడు.

డిసిప్లినరీ కేసువల్ల తనకు ఎమ్మార్వో ప్రమోషన్‌ రాదేమోనని భయపడుతున్న పరమేశ్వర్‌ కలెక్టర్‌ తనను హెచ్చరికతో వదిలినందుకు సంతోషించాడు. అందుకు కారణమైన రవిని కలవడానికి వచ్చాడు. కాంటీన్‌కు వెళ్దాం రమ్మని రవిని కిందకు తీసుకెళ్లాడు. అతని చేతిలో బరువైన కవరొకటి ఉంచాడు.

‘‘ఇదేమిటి సార్‌’’ అడిగారు రవి.

‘‘ఏదో నా తృప్తి కోసం ఉంచు’’ అన్నాడు పరమేశ్వర్‌

‘‘నాకేమీ వద్దుసార్‌. ఇలా చేస్తే మీరు నన్ను అవమాన పరిచిచట్లే’’  మొహమాటం లేకుండా చెప్పాడు రవి.

కవరు తిరిగి జేబులో పెట్టుకున్నాడు పరమేశ్వర్‌.

ఇంతలో రామారావు టీ తాగడానికి వచ్చాడు.

రామారావు పరమేశ్వర్‌ మాటల్లో పడ్డారు. నేను సెక్షన్‌కు వెళ్తాను అని చెప్పడానికి దగ్గరకు వెళ్లాడు రవి.

‘‘వెళ్తాను సార్‌’’ అన్నాడు వాళ్లతో.

వాళ్ల సంభాషణ రవిందర్‌ మీదకు మళ్లింది.

‘‘చిన్న వయసులోనే మంచి పెన్‌మన్‌గా పేరు తెచ్చుకున్నావు సంతోషం. ఇంత వరకు ఏ మకిలీ నీకంటలేదు. ఇది ఇంకా సంతోషించాల్సిన విషయం. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. సర్వీసులో కొచ్చిన పాతికేళ్ల వరకు సత్తెన్న చాలా నిజాయితీపరుడు. నిక్కచ్చి మనిషి. దాదాపు అతని సర్వీసంతా ఈ ఆఫీసులోనే గడిచింది. ఒక కొడుకు, ఒక కూతురుతో ఉన్నంతలోనే నిజాయితీగా కాలం నెట్టుకొచ్చాడు. కొడుకును ఇంజనీరింగ్‌ చదివించాడు. మంచి ఉద్యోగం రావడంతో వెంటనే ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఇల్లు కట్టాడు. సందట్లో సడేమియా లాగ మంచి సంబంధం వచ్చిందని కూతురు పెండ్లి కూడా చేశాడు. కొడుకు కూడా సంపాదిస్తున్నాడనే  ధైర్యం తోటి అయినకాడికి అప్పులు చేసి అన్నీ జరిపించాడు. కానీ కూతురు పెళ్లైన నెలలోపే కొడుకు తనకు నచ్చినట్లు పెళ్లి చేసుకుని ఇంటికి దూరమయ్యాడు. అప్పులు చేసిన ఆందోళనతోనే కంటిచూపు కూడా మందగించింది. అయినా అధికారుల దగ్గర ఉన్న ‘మంచి పనోడు’ అనే గుర్తింపుతోనే కలక్టరేట్‌లో కొనసాగాడు. అప్పుల్లో, ఆందోళనల్లో ఉన్న అతనికి నువ్వు ఒయాసిస్‌లా తగిలావు. నీకు పని నేర్పించి  సత్తెన్న తన తెలివి తేటలను అమ్ముకున్నాడు.

ఒక్కొక్క డిసిప్లినరీ కేస్‌ డీల్‌ చేస్తూ అందినంతా తీసుకున్నాడు. పెండింగ్‌లో ఉన్న వందలాది ఫైళ్లు నీతో రాయించి, అప్పుల ఊబిలో నుండి బయటపడే లోపే మృత్యుదేవత ఆహ్వానించింది. ఇవన్నీ నీకు తెలుసో లేదో కానీ, నీ పనితనం వల్ల సత్తెన్నను ప్రత్యక్షంగా ఆదుకున్నావు. మరెందరినో పరోక్షంగా ఆదుకున్నావు. నీకు భగవంతుడు ఎప్పటికీ మంచే చేస్తాడు.’’ చెప్పాడు రామారావు.

రవి మనసంతా అదోలా అయ్యింది. తనకు తెలియకుండానే సత్తెన్నకు సహాయ పడ్డాడా! తన వల్ల సత్తెన్నకు మంచి జరిగిందా. రాత్రంతా కలత నిద్రే అయింది.

 

*   *   *   *

 

ఆ తర్వాత కొద్ది రోజులకే రవికి ప్రమోషన్‌ వచ్చింది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలానికి రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌గా వెళ్లాడు. పొదుపు చేసిన డబ్బులతో మోటార్‌ సైకిల్‌ కొనుక్కున్నాడు. అది చాలా సంతృప్తినిచ్చింది రవికి.

ఆ రోజు తన టూర్‌ ప్రోగ్రాం ప్రకారం గ్రామాలు తిరిగి మధ్యాహ్నానికి మండల కార్యాలయం చేరుకున్నాడు. ఎమ్మార్వోగారు పిలుస్తున్నారని అటెండర్‌ చెప్పడంతో ఆయన గదికి వెళ్లాడు రవి.

‘‘ఇదేంటయ్యా రవీ! ఈ బిల్లులన్నీ నా టేబుల్‌ మీద పెట్టావు’’ అడిగాడు ఎమ్మార్వో.

‘‘మొన్న మినిస్టర్‌ గారి టూర్‌ ప్రోగ్రాం సందర్భంగా ప్రొటోకాల్‌ కోసం ఖర్చు పెట్టిన వాటి రసీదులు సార్‌’’ చెప్పాడు రవి.

‘‘అయితే నన్నేం చెయ్యమంటావ్‌’’ అన్నాడు ఎమ్మార్వో.

‘‘రసీదులు ఒకసారి వెరిఫై చేస్తే ఎకౌంటెంట్‌కు చెప్పి బిల్స్‌ చేయించవచ్చు గదా….’’ ఏదో చెప్పబోయాడు రవి.

‘‘బిల్లు చేయిస్తావా? ఏ పద్దు కింద నీకు బిల్లు సాంక్షన్‌ అవుతుందనుకుంటున్నవ్‌’’ అసహనంగా అడిగాడు ఎమ్మార్వో.

‘‘అదేంటి సార్‌! ప్రొటోకాల్‌ బిల్సు గవర్నమెంటు ఇవ్వదా?’’ అమాయకంగా అడిగాడు రవి.

పడీ పడీ నవ్వాడు ఎమ్మార్వో.

‘‘ఎక్కడ్నుంచి వస్తారయ్యా! ఓ ఎగేసుకుని మా ప్రాణాలు తినడానికి తెలియకపోతే ఇంతకు ముందు పనిచేసిన వాళ్లనడిగి తెలుసుకో! అంతేగానీ అతి తెలివిగా మాట్లాడకు’’ గట్టిగా కసిరేసరికి రవి చిన్నబుచ్చుకున్నాడు.

ఆరోజు సాయంత్రమే మండలంలో ఇదివరకు పనిచేసిన ఆర్‌ఐని కలిశాడు. ఆయన ఆఫీస్‌ సంబంధిత అన్ని వ్యవహారాలు, రాబడులు, భాగస్వామ్యాలు చెప్పాడు. అతడు చెప్పినదాని ప్రకారమైతే ప్రొటోకాల్‌ పెద్ద విషయమేమీ కాదు కానీ ఎట్లా నేర్చుకోవాలో ఆలోచిస్తే కంపరంగానూ, కంపనంగానూ ఉంది అతని మనసు.

ఆ రాత్రంతా వేగంగా మెట్లు దిగుతున్నట్లు పాకుడురాళ్ల నుండి జారిపడుతున్నట్లు ఒకటే కలలు. తెల్లారి లీలా మాత్రంగా కల గుర్తుకొచ్చింది. తాను దిగినవి విలువల మెట్లు కాదుగదా! ఒక్క క్షణం అనిపించింది.

ఆఫీస్‌కు వెళ్లే సరికి కొండయ్య ఎదురుచూస్తున్నడు.

రవిని చూడగానే దగ్గరకు వచ్చి ‘‘అయ్యా! కొడుకులు నలుగురు భూమి పంచమని పట్టుపడుతున్రు. సరే అని మొన్ననే సర్వేయర్‌తో కొలత చేపిచ్చిన. పక్కన గెట్లు చెదిరి నా పొలం పక్కనే ఉన్న రామన్న పొలంల కలిసిందని తేలింది. అదేమంటే తండ్రికొడుకులు నామీదనే కలెవడ్డరు. ఈ పంచాయతి తెంచితే మర్కటికి భూమి పిల్లల పేర్న చేస్త సారూ!’’ తలవంచి అడుగుతున్నడు కొండయ్య.

‘‘ఏ ఊరు మీది’’ అడిగాడు రవి.

కొండయ్య చెప్పాడు.

‘‘సరె! బండెక్కు’’ అన్నడు రవి.

పదిమైళ్ల ప్రయాణం. మాట్లాడటం మొదలు పెడితే దూరం తరిగిపోతది. మనిషి లోతు బయటకొస్తది. ఆ లోపలి మనిషిని తరచి చూసినప్పుడు మంచి పుస్తకం చదివినంత ఆనందం రవిలాంటి భావుకుడైన ఉద్యోగికి.

‘‘ఎంత భూమి ఉంది నీకు?’’ అడిగాడు కొండయ్యను.

‘‘యాభై ఎకరాల పైమాటనే సారూ!’’

‘‘అంతా నీ పూర్వీకులు ఇచ్చిందేనా’’

‘‘అయ్యా అంతా నాకష్టార్జితం’’

‘‘ఎట్లా సంపాదించావ్‌’’ అడిగాడు రవి.

‘‘నేను పుట్టినప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. నాకు కొద్దిగా ఎరుకయినంక మా నాయన గత్తరొచ్చి పోయిండు. మా మేనమామ ఇంట్లనే పెరిగిన. మా నాయిన జీవాల మందనే నేను పెంపు చేసిన. ఇంగ పొతం చెయ్యలేనంత పెద్ద మందయ్యింది. వాటన్నింటిని ఒక్కసారే బక్రీద్‌ పండగకు అమ్మినం. మేం లెక్కపెట్టలేనన్ని రూపాయలొచ్చియి. గప్పుడు మా ఊళ్ల ఒక బడిపంతులుండె. రూపాయలన్ని గాసారుతోనే దాసుకున్నం. మా ఊర్ల ఒక ఆసామి ఊరొదిలి పోతుంటే పంతులే బేరమాడి ఇరవై ఎకరాల భూమి నా పేర్న కొనిపెట్టిండు. అయ్య కడుపు సల్లగుండ ఆ ఇరవై ఇయ్యాల యాభై అయింది’’

‘‘మరి నీ కొడుకులకు ఏ లెక్కన పంచుతవు?’’ అడిగాడు రవి.

‘‘ఉన్నకాడికి నాలుగు భాగాలు చేస్త దొరా! ఇంగెట్ల పంచుత’’ అన్నాడు కొండయ్య.

‘‘నేనో మాట చెప్త ఇంటవా!’’

‘‘చెప్పు దొరా’’

‘‘ఆస్తి ఐదు భాగాలు చేసుకో. కాలు రెక్కలు ఆడని నాడు ఎవడు ఎవనికైతడో తెల్వదు కదా!’’ అర్థమయ్యె భాషల సున్నితంగ చెప్పిండు కొండయ్యకు.

పొలం గెట్ల పంచాయితీ ప్రత్యక్షంగా చూసి పెద్దమనుషుల సమక్షం పరిష్కారం చేసి, పంచనామాలు, స్టేట్‌మెంట్‌లు అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. బయల్దేర బొయ్యెటంతల బండి దగ్గరకొచ్చిన కొండయ్య రవి చేతిల చిన్న కట్టంత రూపాయలుంచిండు.

‘‘ఏమిటిది’’ ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘దొరా! ఏదో చాతనైనంత’’ గునిశాడు.

‘‘రెండు వేలిస్తున్న దొరా! మిగిలింది పనైనంక ఇస్త దొరా!’’ వినయంగా చెప్పాడు.  కొండయ్య.

ఆఫీసుకొచ్చి రిపోర్టిచ్చి అందరి లాగూ తాను భాగపంపకాలు చేశాడు. అంతా ఖుషి. లోపల లోపల తొలిచేస్తున్న బాధ. ఎండమావుల వెంట పయనం కాదుగదా! ఎన్నడో ఈ మాయజగత్తు తనను మింగెయ్యదు కదా! వేడి సున్నంలో పడి రంగరింపబడుతున్నట్లు మనసుకు ఒకటే సలపరం, కంపరం.

 

*   *   *   *

 

రోజులు గడుస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ రైతులతోనూ, వృద్ధులతోనూ మాట్లాడుతూ మాటల్లో మనుషుల అంతరంగాల్ని తరచిచూస్తూ వాళ్ల గురించి తెలుసుకుంటూ, వాళ్లతోనే మమేకమైతూ కొంతసేపు అధికారాలు, హోదాలు పక్కన నెట్టి మానసిక ఆనందాన్ని అనుభవించేవాడు రవి.

తల్లి చూసిన సంబంధం, బుద్ధిగా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు. ఇంతలో పిరియడ్‌ అయిపోయిందని మళ్లీ కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.

మళ్లీ పాతసెక్షనే. మూడేళ్ల కింద తను చేసినంత వరకే ఫైళ్ల క్లియరెన్సు. అక్కడ్నుంచి ఏవో ముఖ్యమైనవి మినహా అన్నీ పెండింగే. మళ్లీ రాత్రింబగళ్లు కష్టపడి మూడు నెలల్లో టేబుల్‌ క్లీన్‌ చేసుకున్నాడు.

ఆపైన నల్లేరు మీద నడక పనిలో ఆనందం. పనిచేయించుకున్న వాళ్లు తనను పట్టించుకున్నా పట్టించుకోక పోయినా ఆనందమే. ఆట్లా మరో రెండేళ్లు సంతోషంగా గడిచినయి.

ఒక రోజు పనిలో ఉండగా కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీసు నుండి ఫోనొచ్చింది. ఆర్జంటుగా సీసీ (క్యాంపు క్లర్కు) గారు రమ్మంటున్నారని సారాంశం. రవి అర్జంటు ఫైళ్లేమన్నా ఉన్నాయేమోనని ఆదరాబాదరాగా వెళ్లాడు.

ఒక కాగితం చేతికిచ్చి చదవమన్నాడు. రవి ప్రతి ఫైలుకు డబ్బులిస్తే పనిచేస్తున్నాడని అర్థం వచ్చేలా ఏవో పిచ్చిరాతలున్నయి దాన్నిండా. చదివే సరికి రవికి నవనాడులు కుంగిపోయినయి. రంగులు మారుతున్న రవి ముఖం చూసి సీసీ ‘‘అందుకే అప్పుడప్పుడు మాలాంటి వాళ్లను పట్టించుకోవాలయ్యా! కాస్త మంచీ చెడ్డా అడుగుతుంటే ఇట్లాంటివి మేము బుట్ట దాఖలు చేస్తుంటం. మమ్మల్ని పట్టించుకోకుండా ఒక్కడివే మెక్కితే…’’

‘‘డోన్టాక్‌ రబ్బిష్‌’’ గట్టిగా అరిచాడు రవి.

తెల్లబోవడం సీసీ వంతయ్యింది.

నెమ్మదిగా బయటికొచ్చి ఆఫీస్‌కు చేరుకున్నాడు. మనసంతా చేదు తిన్నట్టుంది.

ఏవో రూంలోనికి తొంగిచూశాడు. ఒక్కడే ఉన్నట్లున్నడు. ఏదో పుస్తకం చదువుతున్నడు. ఆయనపేరు రాఘవన్‌. తమిళియన్‌ కానీ హైదరాబాద్‌ సెలిటర్‌. తెలుగు బాగానే మాట్లాడతాడు. సెక్రటెరియేట్‌ నుండి డిస్ట్రిక్ట్‌ సర్వీస్‌ కంపల్సరీ గనుక ఆర్నెల్లనుండీ కలెక్టరేట్‌లో పనిచేస్తున్నాడు.

ఏవో రూంలోనికి వెళ్లాడు రవి.

రవి పనితనం వల్ల అధికారులందరికీ అతనంటే మెచ్చుకోలె. జరిగిన విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు రవి. ఏమనుకున్నాడో సీట్లోంచి లేచి ‘పద’ అన్నాడు.

ఐదు నిమిషాల్లో కలెక్టర్‌ క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారిద్దరూ.

రవి మీదొచ్చిన కంప్లయింట్‌ పిటీషన్‌ చూపించమన్నాడు.

రాసిన వాడి పేరు లేదు, ఊరు లేదు. ఆకాశరామన్న ఉత్తరంలాగ.

ఏవో ఒకసారి చదివి పరపరా చింపేసిండు.

‘‘అయ్యోసార్‌’’ ఏదో అనబోయాడు సీసీ.

‘‘ఇంకోసారి దొంగనాటకాలు,  దొంగ పిటిషన్తూ రాసి చూపిస్తే కలెక్టర్‌ గారి దృష్టికి తీసుకుపోతా జాగ్రత్త! నువ్వు కూడా అందరిలాంటి ఉద్యోగివే అని మరిచిపోకు’’ కోపంతో తిట్టినంత పనిచేసి హెచ్చరికలు చేసి వచ్చాడు ఏవో.

అప్పట్నుంచి రవికి ఏవో రాఘవన్‌కి మధ్య ఆత్మీయత పెరిగి చిక్కటి బంధమేదో కలిపి ఉంచింది.

మరో సంవత్సరానికి రాఘవన్‌ తిరిగి సెక్రటేరియట్‌కి వెళ్లాడు. అలా రాఘవన్‌ వెళ్లిన వారం రోజులకే రవికి ట్రాన్స్‌ఫరైంది. అదికూడా కంప్లయింట్‌ పిటీషన్‌ మీద అధికారుల ఎండార్స్‌మెంట్‌ వల్ల అయింది. రాఘవన్‌ని గెలవలేక అతడు వెళ్లగానే బుద్ది బయటపెట్టుకున్న వారు రవిని పంపించి సంతోషించారు. బాధపడలేదు రవి.

ఎక్కడైనా నౌకరే కదా! అనుకునేవాడు. కాకపోతే పూర్తిగా పనిలేని పోస్టింగు. పిల్లలు స్కూలు చదువులకొచ్చారు. ఖర్చులు పెరిగినయి. తోటి ఉద్యోగులను చూపించి ఇంట్లో దెప్పిపొడుపులు పెరిగినయి. ‘ఉన్నంతలోనే’ రవి తత్వమైతే. ‘అందినంతలోనే’ అని ఇంట్లో వాళ్ల ఆలోచన. బయటకు ఘర్షణ పడకపోయినా లోపల దెప్పిపొడుపులు తప్పలేదు. ఇల్లు ఇరకటమైంది`ఆలి మర్కటమైంది. ఏదో ఒకదాని తీరు మార్చకపోతే ఘర్షణ పెరిగేలాగుందని రవి ఇంటి నిర్మాణానికే పూనుకున్నాడు.

పాత ఇంటిని పడగొట్టి చిన్న డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, పైన తన ప్రైవసీ కొరకు లైబ్రరీ కట్టించుకున్నాడు. బ్యాంక్‌లోన్‌ బాగానే వచ్చింది. నెలనెలా ఇన్‌స్టాల్‌మెంట్‌ ఆటోమేటిక్‌గా జీతం నుండి కట్‌ అయ్యేది. ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలైనయి. సాయంత్రం ఇంగ్లీషు ట్యూషన్‌ చెప్తే బాగుంటుందని ఆలోచనొచ్చింది. ‘ఇంట్లో కుదరదు’ అంది కమల. ట్యుటోరియల్‌ కాలేజీలో క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆర్థికంగ ‘మిగులు’ లేక పోయినా ‘తగులు’ లేదు. అప్పుల నుండి బయటపడే మార్గం దొరికింది. అయినా ఇంట్లో ‘నస’ కనీక అవసరాలు తీరితే సౌకర్యాల గురించి, సౌకర్యాలు తీరితే లగ్జరీల గురించి, లగ్జరీలు తీరితే ఆల్ట్రా పోష్‌ గురించి సగటు మనిషి అన్వేషిస్తూనే ఉంటాడు.

ప్రభుత్వం భూసేకరణ చేపట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకోసం కొత్తగా అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో పోస్టింగు కోసం రవి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తొందరగా వెళ్లిపోతే కాస్తంత పనిలోకంలో పడ్డట్లయితదని ఆలోచన. ప్రస్తుతం పనిచేసే చోట ఈ ఆఫీసులో ఉన్నది ఒక ఆఫీసరూ, తనతో పాటు టైపిస్టూ అటెండర్‌ మొత్తం నలుగురే. అందులో అటెండర్‌కు ఆరోగ్యం బాగా లేదని ఆఫీసుకు రావడమే లేదు. ఆఫీసర్‌ వారానికి ఒకసారో రెండుసార్లో హైదరాబాద్‌ నుండి ఇట్లా వచ్చి అట్లా పోవడం.

ఒకరోజు ఆఫీసులో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఆఫీసర్‌ గారిని కలవాలని అడిగాడు. ఆయన రాలేదని చెప్పాడు రవి.

అతన్ని ఆరోజే కలవాలని ఎక్కడుంటాడని బలవంత పెట్టాడు.

‘‘ఎందుకోసం’’ అడిగాడు.

‘‘ఆయనకీ కవరు ఇయ్యాలయ్యా’’ అన్నాడా వ్యక్తి.

‘‘ఏమున్నాయి కవర్లో’’ అని ఓపెన్‌ చేసి చూశాడు.

కొంత డబ్బు చేతిలోకొచ్చింది.

మళ్లీ కవర్‌ ఇచ్చేస్తూ ‘‘సార్‌ రాలేదు మళ్లీ రండి’’ అని చెప్పబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. నలుగురు వ్యక్తులు గుమిగూడటం చేతులు గట్టిగా పట్టుకోవడం జరిగిపోయింది.

జరిగిందేమిటో రవి గ్రహించే లోపల్నె జరగరానిది జరిగిపోయింది.

వచ్చిన వ్యక్తి అటెండర్‌ కొడుకట. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తండ్రి ఆఫీసుకు రాలేక పోతున్నాడని సెలవు పెట్టడానికి అంత లీవ్‌ టైటిల్‌ కూడా లేదని, ఎలాగైన జీతం ఇప్పించమని ఈ మధ్య తరచూ ఆఫీసర్‌ గారిని కలిసి అడుగుతున్నాడట. జీతం ఇప్పిస్తాను గాని సగం నీకు, సగం నాకు అని బేరాలు పెట్టాడట.

ఇదంతా ఆఫీసు బయట నడిచిన వ్యవహారం. అదితెలియని రవి అమాయకంగా కవర్‌ ఓపెన్‌ చేసి డబ్బు ముట్టుకొని తిరిగి ఇచ్చాడు. కవర్‌ తెరవడమే పెద్ద నేరమైంది. అధికారి చేసిన పాపపు బేరానికి తనకు పాపం అంటుకుంది.

నిలువెల్లా కుంగిపోయాడు రవి. ఏమి మాటలు లేవు తన దగ్గర. జరగవలసినవి అధికారికంగానో యాంత్రికంగానో జరిగి పోయినవి. సస్పెన్షన్‌ వేటు పడిరది.

 

*    *    *   *

 

నెలరోజులు భారంగా గడిచినయి. రవి అమావాస్య చంద్రుడై ఇల్లు కదల్లేదు. ఆరోజు రవి స్నేహితుడు జగదీష్‌ ఇంటికొచ్చాడు. రవికి జగదీష్‌ని చూస్తే ప్రాణం లేచొచ్చింది. జగదీష్‌ టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నాడు. ట్యుటోరియల్‌ కాలేజీ ఉంది. ఇంగ్లీషు, మ్యాథ్స్‌ ట్యూషన్‌ బ్యాచ్‌ల వారీగా చెప్పేవాడు. అతని దగ్గరే రవి సాయంత్రాలు ఇంగ్లీషు ట్యూషన్స్‌ చెప్పేవాడు.

‘‘రవీ! నిన్ను కేసులో ఇరికించిన వాడిని నేను కలిసొచ్చాను. ‘రవీందర్‌ సార్‌ నిన్ను డబ్బులడిగాడా ఎప్పుడైనా?’ అని సూటిగా ప్రశ్న వేశాన్రా. లేదన్నాడు. ఆఫీసర్‌ గారే అడిగారని చెప్పాడు. కాకపోతే నువ్వు కవర్‌ తెరిచినందుకు ఆ పాపం నిన్నంటుకుంది. నువ్వడగలేదు. కవరు తెచ్చిన వ్యక్తిని నువ్వు ఇదివరకు చూడలేదు. మాట్లాడలేదు. ఇదే పాయింటు మీద నువ్వు కేసు గెలవొచ్చు. సస్పెన్షన్‌లో  ఉన్నందుకు బాధ పడొద్దు. ఈ ఎకడమిక్‌ ఇయర్‌లో కొత్తగా కాలేజీ పెట్టాలనుకుంటున్నాను. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఇంగ్లీషు, తెలుగు మీడియంలు అన్నింటికీ నువ్వే ఇంగ్లీష్‌ లెక్చరర్‌వి. టీచింగ్‌లో సంతృప్తిగ ఉంటవని నాకు తెలుసు. అందుకే ఈ బాధ్యత నీ మీద పెడుతున్న. సంతోషమా మిత్రమా!’’ ఏకబిగిన మాట్లాడాడు జగదీష్‌.

రవికి సమస్యలన్నీ మిత్రుని ముఖంలోనే పరిష్కారమై పోతున్నట్టు సంతోషం అనిపించింది.

‘‘జగదీష్‌! నీలాంటి మిత్రుడు జన్మకొక్కడు చాలురా’’ చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

అప్పట్నుండి ఇంటర్మీడియట్‌ ఇంగ్లీషు క్లాసులు తీసుకోవడంలో ఆనందాన్ని, బతుకుదెరువును వెతుక్కున్నాడు.

కేసు ఏడాది వరకూ కోర్టు ట్రయల్‌కే రాలేదు.

జాప్యమే అన్నింటికన్నా పెద్దశిక్ష ` ఇది మామూలుగా కేసుల విషయంలో జరిగేది.

జగదీష్‌ మాత్రం కేసును సీరియస్‌గా తీసుకుని అడ్వకేట్‌ని పెట్టాడు. ఆఖరికి ఒకరోజు నోటీసులొచ్చినయి.

రవిని జగదీష్‌ హైదరాబాద్‌ తీసుకుపోతానన్నాడు. జగదీష్‌ కారులోనే తన సస్పెన్షన్‌కు కారణమైన వ్యక్తి కూడా వచ్చాడు. రవికి అసౌకర్యంగా అనిపించింది.

‘‘నేను ఆఫీసర్‌ గారిని కలిసిన ప్రతిసారీ మీ పేరు చెప్పి కింది వాళ్లు వినరయ్యా! అనేవాడు సార్‌. అందుకే మీకీ అవస్థ పట్టింది. నన్ను క్షమించండి సార్‌. కోర్టులో అంతా నిజమే చెప్తాను. మిమ్మల్ని బయటపడేసే పూచీ నాది. జగదీష్‌ సార్‌ నేను చేసిన తప్పును నాకు తెలిసివచ్చేటట్లు చెప్పాడు. నేనే మిమ్ముల్ని రక్షించుకుంట సార్‌. నన్ను నమ్మండి’’ చెప్పాడా వ్యక్తి. అతని పేరు కమలాకర్‌. తను రవి సస్పెండైన ఆఫీస్‌ అటెండర్‌ కొడుకు.

కమలాకర్‌ ఆరోజు కోర్టులో అంతా నిజమే చెప్పాడు. సావధానంగా విన్న జడ్జి గారు జడ్జిమెంట్‌ను రిజర్వు చేశాడు. మరో  మూడు నెలలకు రవిపై సస్పెన్షన్‌ ఎత్తేయమని ప్రభుత్వానికి రికమండేషన్‌ వెళ్లింది కోర్టు నుండి.

ఆరోజు సెక్రటేరియట్‌కు వెళ్లాడు రవి. సెక్షన్‌కు వెళ్లి తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఫైల్‌ పెట్టారా! అని వాకబు చేశాడు.

‘‘నిన్న మొన్ననేగా కోర్టు క్లియరెన్సు ఇచ్చింది. మీకంటే సీనియర్‌లు చాలామందున్నారు. ఓ నెలయ్యాక రండి’’ కసిరిందా సెక్షన్‌ అసిస్టెంట్‌.

ఎందుకో ‘ఇంకా ఏడాదికన్నా పని అయితదా!’ అనిపించింది.

ఠక్కున రాఘవన్‌ గుర్తొచ్చాడతనికి.

సెక్షన్స్‌లో తెలుసుకుంటూ మొత్తానికి రాఘవన్‌ని పట్టుకోగలిగాడు. విషయం తెలుసుకుని రాఘవన్‌ చాలా బాధపడ్డాడు.

కోర్టు జడ్జిమెంటు ఒక కాపీని తీసుకొని ‘‘రవి ఒక మాట చెప్తాను. ఏమీ అనుకోవద్దు. నువ్వు రోజూ ఇక్కడి కొచ్చినా, వారానికోసారి వచ్చినా, నెలకోసారి వచ్చినా పని తొందరగా చేస్తారని గ్యారంటీలేదు. పైగా అడిగేవాడికి ఇచ్చేవాడు లోకువ. దివాలా తీసిపోగలవు జాగ్రత్త! నామాట మీద నమ్మకముంటే నువ్వు ఇక్కడికి రాకు. నీ పని తొందరగా అయ్యేగా నేను చూస్తాను. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడు ఫోన్‌ చెయ్యి!’’ అని ఫోన్‌ నంబరిచ్చి రవికి అభయమిచ్చాడు రాఘవన్‌.

రాఘవన్‌ మాట మహత్యమో, కృషి ఫలితమో గానీ మూడు నెలలలో రవిని తిరిగి సర్వీస్‌లోనికి తీసుకుంటూ జీవో జారీ అయింది.

నిర్వేదంగా మళ్లీ డ్యూటీలో రిపోర్టు చేశాడు రవి. మూడు నెలలైనా పోస్టింగు ఇవ్వలేదు. సస్పెన్షన్‌ పిరియడ్‌లో పూర్తి జీతం రాలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా జగదీష్‌ పుణ్యమాని రోజులు లోటు లేకుండా గడుస్తున్నాయి. జగదీష్‌ లాంటి స్నేహితుడు, రాఘవన్‌ లాంటి హితులు అందరికీ దొరకరుగా! తను అదృష్టవంతుడినని రవి తనలోతానే సంతోషించేవాడు. కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్‌లంతా గవర్నమెంట్‌ లెక్చరర్‌ నోటిఫికేషన్‌ పడిందని సంతోషిస్తున్న తరుణంలో జగదీష్‌ తనను కూడా అప్లయ్‌ చేయమని ఎంకరేజ్‌ చేశాడు. అదృష్ణవశాత్తు ఏజ్‌లిమిట్‌ కూడా బార్డర్‌లో ఉంది. అనాయాసంగానే లెక్చరర్‌ పోస్టుకు ఎంపికయ్యాడు రవి.

తనకు ప్రయివేట్‌ కాలేజీలో అవకాశం ఇచ్చినందుకే సబ్జెక్టు మీద పట్టుతో ఎంపిక కాగలిగానని జగదీష్‌కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవి. ఇంతలో మళ్లీ కలెక్టరెట్‌లోనే పోస్టింగ్‌ ఇచ్చినా రిలీవ్‌ అయి లెక్చరర్‌గా చేరాడు.

 

*   *   *   *

 

ఇదీ నాకథ!

అప్రమత్తంగా లేకపోతే ఒకరి అత్యాశకు ఇంకొకరు బలవుతారు. జగదీష్‌, రాఘవన్‌లాంటి ఆత్మీయులు నన్ను ఆదుకోక పోతే ఇంకా నా జీవితంలో ఎన్ని విషాదమైన ఎపిసోడ్‌లు ఉండేవో తల్చుకుంటేనే భయంగా ఉంది.

మౌనంగా ఆలోచనలో పడ్డాడు సూర్యం.

ఇంతలో జగదీష్‌ వచ్చాడక్కడికి.

సూర్యాన్ని పరిచయం చేశాడు రవి.

‘‘దయానంద్‌ చనిపోయాడురా’’ అన్నాడు జగదీష్‌.

‘‘ఏమైంది?’’ అదుర్దాగా అడిగాడు రవి.

‘‘ఆరోగ్యం బాగా లేదని చెప్తున్నారు ఇంట్లోవాళ్లు. నాకు తెలిసినంత వరకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనిపిస్తుంది’’

‘‘అంత కష్టం ఏమొచ్చింది జగదీష్‌!’’ ఆశ్చర్యపోయాడు రవి.

‘‘ఆ! అవును, అంత కష్టమే! దయానంద్‌ ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ తెలుసుగదా!’’

‘‘ఆ తెలుసు. అయితే!’’

‘‘రెండు మూడు ఏండ్ల కింద ఎండా కాలంలో కాలువలకు రివిట్‌మెంట్‌ పనులు చేయించడానికి టెండర్‌లు పిలిచింన్రట. ఇగ చేస్త, అగ చేస్తమని ఎండాకాలం పోయి వానాకాల మొచ్చిందట. వానకాలం రాంగనే బిల్లులు డ్రా చేసుకున్నడట కాంట్రాక్టర్‌. పనిచేసిన అనిచెప్పి కిందినించి పైదాక అందరి సంతకాలు తీసుకున్నడట. ఇదంత పేపరోల్లకు తెలిసి పెద్ద వార్తలొచ్చినయి. నలుగురైదుగురి పైన పనిమీద సూపర్‌ విజన్‌ చెయ్యలేదని వేటు వేసిన్రు. అందరు మెల్లగ నౌకరిలకు ఎక్కగలిగిన్రు గానీ దయానంద్‌ని మాత్రం అందరు గలిసి బక్రాను చేసిన్రు. సిమెంటు, ఇసుక, కంకర అన్ని వచ్చినయి కాల్వ పనులు సూపర్‌వైజ్‌ చేసిన వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ సర్టిఫై చేసిండు గానీ సిమెంటు ఇతరత్రా మెటీరియల్‌ తోటి ఏ పెద్దమనిషి పెద్ద కొంప కట్టిచ్చుకున్నడో తెలుసుకోలేక పోయిండు. నౌకరి మల్ల వస్తదన్న ఆశతోని అందరికి పైసలు తినవెట్టిండు. ఆఖరికి నెగ్గలేనని తెలిసి చనిపోయిండు. ఏకబిగిన చెప్పుకొచ్చిండు జగదీష్‌.

ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదన్నంత మౌనం ఆవహించింది ముగ్గురిని.

కాసేపటికి నేను వెళ్లొస్తాను సార్‌ అని లేచాడు సూర్యం. ఇంటి నుండి బయటికొస్తే చిక్కటి చీకటి.

చీకటి వల్ల భయం వేయలేదు గానీ, వెనుక నుండి ఒక మనిషి కాలిపోతుంటే అనేక చేతులతోటి పీక్కు తింటున్నట్టు జుగుప్సతో కూడిన భావనకు ఒళ్లు జలదరించింది సూర్యానికి.

 

*************

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *