May 7, 2024

“బులుసు సుబ్రహ్మణ్యం కథలు..” సమీక్ష..

                                                                                                                  రచన: జి.ఎస్.లక్ష్మి..gslakshmi

 

నవ్వను నేనని భీష్మించిన నిను

నవ్వక తప్పదని చెప్పి యొప్పించంగా

నవ్వుల విందగు ఈ కథలను

నవ్వక మూతి బిగించి నువ్వు చదువగ గలవే…

ఇలాగని స్టాంప్ పేపర్ మీద వ్రాసి సంతకం పెట్టమంటే నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మొహమాటంగా పెట్టేస్తాను. నేనేకాదు.. శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు వ్రాసిన ఈ పుస్తకం చదివాక మీరు కూడా పెట్టేస్తారు.

కొంత కాలం క్రితం తెలుగు బ్లాగులలో “నవ్వితే నవ్వండి.’’ అన్న బ్లాగు మొత్తం బ్లాగ్లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. యెప్పుడో మరిచిపోయిన  కొన్ని కొన్ని తెలుగు మాటలు ఈ బ్లాగు పోస్టులలో అందంగా దర్శనమిచ్చాయి.

ఆ బ్లాగు నిర్వహించే శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారి టపాల్లో ఒక దగ్గరితనముంది. రోజూ మన ఇంట్లో, మన చుట్టూ జరిగే మామూలు  సంఘటనల్లోంచి హాస్యాన్ని పండించే ఆయన శైలి మనకి తెలీకుండానే మనలని నవ్వుల ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఆయన బ్లాగు టపాలపై వచ్చిన స్పందన అపూర్వం.

BulusuSubrahmanyamKathalu600

 

ఆ బ్లాగ్ మితృలందరి కోరిక మీదా శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు ఆ టపాల్లోని ఆణిముత్యాల్లంటి  కథలను ప్రత్యేకంగా యేరి ఈ “నవ్వితే నవ్వండి..” అన్న పుస్తకం ప్రచురించారు.

ఈ పుస్తకంలో మీకు తెలీని విషయాలు బోలెడున్నాయి.

మీకు “ఘృతాచి” అంటే యెవరో తెలుసా.. అరె..తెలీదా..

శొంఠిపిక్కలు, తొడపాశాలు అనే మాటలు గుర్తున్నాయా..అవీ లేవా..

అరెరె కనీసం వత్తులు, దీర్ఘాలు, గుండెల్లో గునపం దించడం లాంటి మాటలైనా తెలుసా..

పోనీ.. ఉక్తలేఖనం అని దేనినంటారో అదైనా తెలుసా.. అదీ తెలీదా.. అయ్యో.. అయితే మీరు అచ్చమైన తెలుగును మర్చిపోయుండాలి. మీరు మళ్ళీ అంత స్వచ్ఛమైన తెలుగుని చదవాలంటే ఈ “నవ్వితే నవ్వండి” పుస్తకం చదివి తీరాల్సిందే.

అయ్యయ్యో.. పొరపాటు పడకండి.. పై మాటలని బట్టి ఇదేదో వ్యాకరణ పుస్తకం అనుకునేరు.. హేవీ కాదు.. అచ్చమైన తెలుగులో వ్రాసిన, చదివితే నవ్వకుండా వుండలేని హాస్య పుస్తకం. అవునూ..హాస్యపుస్తకం అనొచ్చా.. అది సరియైన పదమేనా..

తెలుగుభాష మృతభాష అయిపోతోంది అనుకునేవాళ్ళు ఈ పుస్తకంలో కథలని ఒక్కసారి చదివితే చాలు.. చిన్నప్పుడు నేర్చుకున్న గుణింతాలతో సహా అన్నీ మళ్ళీ గుర్తు చేసేసుకోవచ్చు.

యాభైసంవత్సరాల క్రితం ఇప్పుడున్నలాంటి యిన్ని కాన్వెంట్లు వుండేవికావు. దాదాపుగా అందరూ ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మాధ్యమంలోనే చదివేవారు.  మరి అప్పుడు మాస్టర్లు పాఠాలు యెలా చెప్పేవారు, సరిగ్గా చదవని విద్యార్ధుల పట్ల వారి దండనా పధ్ధతులు యెలా వుండేవీ అంటే మనం ఈ పుస్తకంలో “తెలుగదేల అనే అంటాం..” అనే కథ చదివి తీరాల్సిందే. తెలుగుభాషలోని గుణింతాలు, ద్విత్వాలు, సంధులు, సమాసాలు ఆఖరుగా ఛందస్సు వీటన్నింటినీ చదవడానికి, వ్రాయడానికీ విద్యార్ధులు పడే ఆయాసానికి  మనకి నవ్వలేక ఆయాసం వచ్చేస్తుంది. “ధ” అని చెప్పడానికి “ద” కి గుండెలో గునపం దించాలని మీకు తెలుసా? అలా దించకపోతే మాస్టారు టిఫిను పెట్టేస్తారని తెలుసా? ఆ టిఫిను కూడా పకోడీల్లాంటి మామూలువి కాకుండా మినపరోస్టు, కజ్జికాయలు లాంటి భారీ టిఫిన్లు పెడతారని తెలుసా..? ఆహా.. తప్పు వ్రాసినా కూడా టిఫిన్లు పెట్టే మాస్టార్లు యెంత మంచివారో అనుకుంటున్నారా…అవునవును.. చాలా మంచివారే.. యెందుకంటే ఆ టిఫిన్లన్నీ విద్యార్ధుల వంటి మీద పడే దెబ్బలమన్న మాట. పిల్లలు వాటిని టిఫిన్లుగా పేర్లు పెట్టుకుని సంతోషంగా భరించేవాళ్లన్న మాట.  వీపు మీద తేలికగా దెబ్బ పడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్టు. తొడ మీద గిల్లితే పకోడీ.. అరెరె.. అప్పుడే నవ్వొచ్చేస్తోందా.. ఇలాంటివి యింకా చాలా టిఫిన్లున్నాయండీ.. ఈ కథ చదివి చూడండి. మనం మర్చిపోయిన తెలుగుమాటలు తొడపాశాలు, శొంఠిపిక్కలూ కూడా వున్నాయీ కథల్లో.

అందులోనూ ఆ స్లూల్లోనే పనిచేసే తెలుగుమాస్టారి పిల్లలుగా అదే స్కూల్లో చదవడంలోని గమ్మత్తైన అనుభవాలు మనలని మళ్ళీ ఆ రోజుల్లోకి తీసికెళ్ళిపోతాయి.

పుట్టకుండానే పేరు పెట్టించేసుకోడానికి మనమేవీ అమెరికాలో పుట్టలేదు కదా… పుడుతూనే ఫలానావారి మనవడు, వాళ్ల కొడుకు, వీళ్ళ తమ్ముడుతో మొదలైన పేర్లు మన ఇష్టం లేకుండానే ముద్దుపేర్లతో పిలిపించుకునే స్థాయికి వచ్చేసి ఆఖరికి నల్లాడు, ఎఱ్ఱాడులాంటి పేర్లతోకూడా పిలిపించుకోవాల్సొస్తుంది. కానీ శుభ్రంగా సుబ్రహ్మణ్యం అని పెద్దలచేత పేరు పెట్టించుకున్న పెద్దమనిషికి తన పేరుని యెవరైనా సరిగ్గా పలకాలన్న కోరిక వుండడంలో తప్పేం లేదు కదా.. కానీ అంత చిన్నకోరిక కూడా తీరని కథే “వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమీ.” అన్నది. చదువుతున్నంతసేపూ పాపం ఆ సుబ్రహ్మణ్యం పడుతున్న అవస్థకి నవ్వకూడదనుకుంటూనే నవ్వేస్తాం.

ప్రభావతీ ప్రద్యుమ్నుల కథ యెంతమందికి తెలుసు..? అబ్బే ఆ పురాణాల్లో కథ కాదండీ.. ఆధునిక ప్రభావతీప్రద్యుమ్ను లన్నమాట.. తెలీదుకదా.. అయితే యిందులో వున్న వారి పెండ్లిచూపుల ప్రహసనం నుంచి సంసారరథం నడిపించే క్రమంలో సాగే  చమత్కారాలు చదివి తీరవలసినవే.

అసలు మగవారికి పెళ్ళిరోజే గుర్తుండదనుకుంటామా.. అలాంటిది ఒక కథలో ప్రద్యుమ్నునికి భార్య మొట్టమొదటగా తనతో మాట్లాడిన ఓన్లీ వాక్యం అంత బాగా గుర్తుండడానికి కారణం తెలియాలంటే “మా ఆవిడ ముచ్చట్లు..” కథ చదవాలి.

మునిమాణిక్యంగారి కాంతం  అమాయకంగా కనిపించే జాణ అనుకుంటే ఇక్కడ ప్రభావతి జాణననుకుంటున్న అమాయకురాలు పాపం. అలాంటి ప్రభావతిని ప్రద్యుమ్నుడు యెన్నెన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాడో, లేక ఆవిడ అమాయకత్వం వల్ల ఆ ప్రద్యుమ్నుడే యెన్నిరకాల ఇబ్బందుల్లో పడ్డాడో ఈ పుస్తకంలోని ప్రభావతీ, ప్రద్యుమ్నులను చదివితేకానీ తెలీదు.

మనందరం రైలుప్రయాణాలు చేసేవుంటాము.. చేస్తూనే వుంటాము కూడా. అలాంటప్పుడు యెదురుగా కూర్చున్నవాళ్ళతో పరిచయాలు చేసేసుకుంటాం.  వాళ్ళు కొత్తవాళ్ళు కదా.. మళ్ళీ మనకి జీవితంలో తారసపడరు అనుకుని అత్త పెట్టే బాధలు, మొగుడి ధాష్టీకం, బంధువుల ప్రవర్తన అన్నీ చెప్పేస్తుంటారు కొంతమంది. కానీ, అలాకాకుండా అలాంటి కొత్తవాళ్లకి కొత్త కొత్త కథలల్లి చెప్పేసేవాళ్ళుంటారని మీకు తెలుసా..

హౌస్ వైఫ్ అంటుంటాం కదా.. అలాగే హౌస్ హజ్బెండ్ ని ఇంటిమొగుడు అంటూ.. అలా ఇంటిమొగుడు కథ అప్పటికప్పుడు అల్లేసి ఎదురుగా కూర్చున్నవాళ్ల నోటమాట రాకుండా చెయ్యడం, అలా కథలల్లి చెప్పడంలో కూడా గొప్ప టెంపో నిలబెట్టడమంటే యెలాగో ఇందులో వున్న రైలు ప్రయాణాల కథలు చదివి తెలుసుకోవల్సిందే.

సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే యేమిటని అడిగితే.. ఇదిగో ఇదీ..

మీరు యెప్పుడైనా యెవరి మీదైనా దయ చూపించేరా..అసలు దయ చూపించమనగానే మనం యేం చేస్తాం.. అడిగినవారికి కావలసిన సాయం చేస్తాం.. అంతే కదా.. కానీ, “అపార్ధాలు..” కథలో కథానాయకుడు దయ చూపించడానికి (అవునండీ, అక్షరాలా చూపించడానికే..)పడ్ద కష్టాలను  చదువుతుంటే ..యెందుకులెండి.. మీరే చదివి చూడండి.

మనిషన్నాక రోగం రాకుండా వుంటుందా..కానీ ఈ కథలో కథానాయకుడికి వచ్చిన రోగానికి ఆయన సందర్శించిన ప్రత్యేక వైద్యులు, వారి పరీక్షా విధానాలూ చదువుతుంటే ప్రత్యేకపరీక్షలు ఇలా కూడా చెయ్యొచ్చా అని నవ్వాపుకోలేక పొట్ట పట్టుకుంటాం. ఆఖరున ఆ రోగమేవిటో తెలీగానే…హ హ.. నేను చెప్పడం యెందుకులెండి.. మీరే చదవండి.

చెప్పే కథలో వాస్తవికతతో కూడిన వ్యంగ్యం, పట్టుగా పడ్ద పదాలు, ఆ శైలి, ఆ సంభాషణలు.. అన్నీ మనని ఆ హాస్యప్రపంచంలోకి లాక్కు పోతాయి.

ఈ పుస్తకానికి డాక్టర్. ఆలమూరు సౌమ్య ఆత్మీయంగా  వ్రాసిన తొలిపలుకులు ఇందులోని అందాన్నంతటినీ తేటతెల్లంగా చెపుతాయి.

“నవ్వితే నవ్వండి..” అంటే విన్నవాళ్ళు యేమనుకుంటారండీ.. “నవ్వుకున్నా మానుకున్నామీ ఇష్టం” అనా.. లేక “నవ్వకుండా వుండగలిగితే వుండండి..” అనా.. లేక “నవ్వకుండా వుండగలరా..” అనా.. యెవరేమనుకున్నా సరే ఈ పుస్తకం చదివినవాళ్ళు మాత్రం యెంత నవ్వకుండా వుందామన్నా వుండలేరని ఢంకా బజాయించి చెప్పగలను.

ఇరవై తొమ్మిది ముత్యాల్లాంటి కథలతో కూర్చిన రెండువందల ఆరుపేజీల ఈ పుస్తకం వెల కేవలం నూటయాభై మాత్రమే.

ఈ పుస్తకం దొరికే చిరునామా..

బులుసు సుబ్రహ్మణ్యం,

ప్లాట్ నెం 139, రోడ్ నెం 7,

సౌత్ ఎండ్ పార్కు, మన్సూరాబాద్,

ఎల్.బి.నగర్, హైదరాబాద్ – 500 068.

ఫోన్ : 040 – 24124494, 9963127723

Email : srisubrahlaxmi@gmail.com

 

 

4 thoughts on ““బులుసు సుబ్రహ్మణ్యం కథలు..” సమీక్ష..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *