May 6, 2024

ఆత్మీయం — ఎగిరే పావురమా

రచన: సి.ఉమాదేవి

egire pavurama

కూచిపూడి నాట్యారాధనలో నిత్యార్చన చేస్తున్న కోసూరి ఉమా భారతి గారు రచనారంగంలో సైతం సామాజికాంశాలపై చక్కటి అవగాహనతో నవలలు వెలువరించడం  ప్రశంసనీయం.

నవల,కథ,కవిత ప్రక్రియ ఏదైనా కష్టం,సులభం అనే ముద్రలకందవు. సాహితీ సేవలో ప్రతి పదం,వాక్యం  రచయిత మేధో శ్రమతో నిర్మించబడినవే! అయితే నవలారచన సమయాన్ని ఆశిస్తుంది.అలాగే అవగాహనను కూడా కోరుకుంటుంది. నవలీకరించడానికి తగిన ముడిసరుకు కావాలి.విషయసేకరణ తరువాత పాత్రల ప్రవేశం,వాటి అమరికపైనే కథాగమనం ఆధారపడుతుంది.

ఇక ఉమా భారతి గారి నవలలో వారి మాటలలోనే చెప్పినట్లు ఆడబిడ్డ పుట్టుకను కాలరాచే సంస్కృతిని ప్రశ్నించే దిశగా ఆమె నవల ‘ఎగిరే పావురమా’ రూపుదిద్దుకోవడం ముదావహం.రచన సాగినంతసేపు అంతర్లీనంగా ఆడపిల్లగా పుట్టి విసిరి పారేయబడిన గాయత్రి వేదన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

ఈ నవలలో ముఖ్యపాత్రధారి గాయత్రి.అమూల్యమైన బాల్యానుభూతులనే కాదు పలుకు,నడకలకు దూరమైన గాయత్రికి పెంచిన తాతే శ్రీరామరక్ష!

బాల్యం శిథిలమైంది.ఇక హరివిల్లయి పలకరించాల్చిన ప్రాయం బ్రతుకు భయానికే కేంద్రమవుతుంది.ఈ నవలలో నిడివి పెంచుకునే దిశగా పెంచి పోషింపబడ్డ అనవసర పాత్రలు లేవు.అక్షరాలే పాత్రలై జీవనవేదం పలికించిన వేదనాంశం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.నవల చదివినంతసేపు‘ ఆడపిల్లనమ్మా’ అన్న పాట మన మనో నేపథ్యంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఉమా భారతిగారు తన వృత్తికి అంకితమవుతూనే ఈ నవలపై మనసు లగ్నం చేసి బహుముఖీనమైన నేటి సమాజ వ్యవస్థలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన ఆడబిడ్డ బ్రతుకు చిత్రం ఎలా చిధ్రమయిందో కదళీపాకమనదగ్గ తనదైన శైలిలో రచించి మనకందించడం అభినందనీయం.వీరు సంప్రదాయ కూచిపూడి నృత్యంలో అభినయాన్ని అందంగా ప్రదర్శించడమే కాదు అక్షరకేళిలో కలాన్ని నర్తింపచేయగలిగిన కళాకారిణి,రచయిత్రి. ఆడపిల్లపట్ల ఇప్పటికీ  సమాజంలో ప్రవర్తించేతీరుపై స్పందించి నవలారూపంలో ఆలోచనా వల్మీకాన్నితట్టిలేపిన మానవతావాది.

ఈ నవల ప్రారంభంలోనే మనం ఒక్క వాక్యం చదువుతాం.

“ దట్టంగా విస్తరించిన ఈ రావిచెట్టు అన్ని వైపులనుండి నీ అరుగుని చేతులతో కాపాడుతున్నట్టుగా ఉందిరా గాయత్రీ” అంటాడు ఆమెను పెంచిన తాత.

“ నాకేమో అరుగు సాంతం, ఆ రావిచెట్టు పొట్టలో ఉన్నట్టుగా అగుపించి నవ్వొస్తది. దాని పెద్దపెద్ద కొమ్మలేమో అరుగుకి చుట్టూకాపలాగా ఉన్నట్టనిపిస్తుంది. ”  ఇలా గాయత్రికి అనిపించడం ముందు ముందు జరగనున్న సంఘటనలకు పునాది వేసినట్లు కనిపిస్తుంది.

ఆప్యాయత పంచిన తాతే అంగవైకల్యం కలుగచేసి డబ్బుసంపాదించడానికి తననొక పావుగా వాడుకున్నాడన్నఅపనిందలు వేసిన కమలమ్మ మాటలు నమ్మితాతను వీడిపోవడం, అపార్థాన్ని కడిగివేసుకుని తిరిగి తాతను చేరే సమయానికి ఆ తాతే ఆమెను వీడిపోవడం మంచికెపుడు గుర్తింపు మనిషి పోయాకేనా? అపార్థాలు మంచికి ముసుగు వేయకుండా కాపాడలేమా అనిపిస్తుంది.

ఇక గాయత్రిని తల్లిలా కాపాడిన రాములు,చంద్రం పిన్ని, చదువు నేర్పిన ఉమమ్మ ఒకవైపు, ఆమె నిరాశానిస్పృహలను తమ సువర్ణావకాశాలుగా మలచుకోవాలనుకునే కమలమ్మ,ప్రహ్లాద్ జేమ్స్ మరొకవైపు,కన్నవారి నిర్లక్ష్యానికి గురైన గాయత్రి జీవితానికి పరచుకున్న వెలుగు నీడలే!చివరకు తాత ఏర్పరచిన రావిచెట్టునీడే గాయత్రికి స్వర్గతుల్యమవుతుంది.నవలా ప్రారంభంలోనే అంతర్లీనంగా అంకురార్పణ జరిగిన ముగింపు ఇదే!

ఆడబిడ్డ పుట్టుకను అపహాస్యంచేసి కన్నతల్లిని భయపెట్టి ఆ బిడ్డను పురిటిలోనే పుటుక్కుమనిపించే వ్యక్తులు,స్కానింగ్ నిషేధించినా డబ్బుకమ్ముడైపోయిన వైద్యుల ద్వారా గర్భస్థ చిన్నారుల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుని ఆడపిల్లయితే మరిక ఆలోచించకుండా పసిప్రాణాలను చిదిమేస్తున్నారు.తెలిసిన భ్రూణహత్యలుకాదు తెలియనివెన్నోతల్లి గర్భంనుండి రాకముందే కాలగర్భంలో కలిసిపోతున్నాయి.ఇలాగే అమ్మాయైతే వద్దనుకుంటూపోతే అమ్మా అని పిలిచేందుకైనా అమ్మమిగలదు.

అందుకే తల్లులకు అవగాహన పెంచి ఇలాంటి దురాగతాలు జరుగనీకుండా ప్రభుత్వాలు,సామాజిక సంస్థలు తమ పాత్రను బాధ్యతాయుతంగా పోషించేవిధంగా అవగాహనా కార్యక్రమంతో నవల ముగించడం, పరిష్కారదిశగా నవలనునడిపినతీరు ఉమాభారతిగారికి ఈ విషయంపట్లగల ఆర్తిని తెలియచేస్తోంది. ఇటువంటి సామాజికరుగ్మతలకు పరిష్కారం చూపించే విధంగా వీరు  మనకు మరిన్ని రచనలను అందిస్తారని ఆశిస్తూ ఆత్మీయతాభినందనలు.

 

2 thoughts on “ఆత్మీయం — ఎగిరే పావురమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *