May 6, 2024

మూడు పాయల జడ

రచన – జెజ్జాల కృష్ణ మోహనరావుjk

 

 

 

 

 

ఒకే జడకు మూడు పాయలవలె, ఒకే భావానికి మూడు ప్రతిరూపములను మీకు ఇక్కడ అందిస్తున్నాను –

(1) ఆంగ్లములో వ్రాసిన ఒక prose poem,

(2) తెలుగులో ఆ భావములకు ఒక పద్య రూపము,

(3) అదే భావములకు ప్రతిబింబముగా ఒక వచన పద్యము.

ఇవి ఒక దానికి ఒకటి మక్కీకిమక్కి అనువాదము కాదు.  భావము లొకటే అయినా చెప్పడములో భేదాలు ఉన్నాయి. ఇందులో ఏది బాగుందో అన్నది పూర్తిగా వ్యక్తిగతమైన అభిప్రాయము అవుతుంది. తల్లికందరూ ముద్దు బిడ్డలే కదా? నాకేమో అన్నీ బాగున్నాయి. మీరు కూడ చదివి ఆనందించండి.

 

================================

 

Deepaavali- Festival of Lights!
On the darkest night of the year
Clusters of light compete with stars
Ear-splitting noise permeates the sulphurous air
Krishna– the Dark Lord of Love
Naraka– the Lord of the Dark
Satya– the Dark Lord’s True Love
The three sides of the Eternal triangle!
Between the Good and the Evil
Between the Light and the Dark
Between the Life and the Death
The War of the worlds wages on!
Krishna swoons and Satya takes over
The weapons of Truth
Dissolve the forces of the Dark
The hell-demon Naraka loses
To the Lord of Love and the Queen of Truth
That is the tale we often hear!
But
Everyday is Deepaavali
Every night is a festival of lights
The heart and the mind are big battlefields
Forces of temptation lurk there
The hell-demon creates a veritable hell
Waves of love try to wash the scum of hatred
The Dark Lord kindles the lamp of peace
Truth slays falsehood and ignorance
The Queen of Truth offers the greatest weapon
Krishna is there
Naraka is there
Satya is there
In all hearts and minds
The battle wages on every living moment
At times darkness may engulf
Ultimately, Love and Truth triumph
Everyday is Deepaavali
Every night is a festival of lights!

 

=====================

 

ప్రతిరోజు దీపాల పబ్బమ్ము

 

ఆ.వె. అనృతమునకు మఱియు – నజ్ఞానమున కొక్క

రూప మా నరకుఁడు – పాపకుండు

సత్య ధర్మములకు – సత్యభామయు సాక్షి

రెండు శక్తుల కయె – భండనమ్ము

(పాపకుఁడు=పాపి; భండనము=యుద్ధము)

 

సుగంధి. మాయలోన దిట్ట వాఁడు – మాయజేయు దిట్టయే

హా యనంగ మూర్ఛబోయె – నంబుజాక్షుడంతలో

సాయ మేమి లేక దేవి – సత్యభామ యెక్కిడెన్

వేయి యమ్ములన్ ధరిత్రి – వేల్పుగొంగ కూలెగా

(వేల్పుగొంగ=రాక్షసుఁడు)

 

కం. మొరసెన్ భూమియు గగనము

విరిసెన్ హృదయమ్ము లవని – విచ్చలవిడిగాఁ

గురిసెన్ సుమములు రాశిగ

మురిసెన్ జగమెల్ల, వెలుఁగు – పూర్తిగ నిండెన్

(మొరయు=ప్రతిధ్వనించు)

 

తే.గీ. నేఁడు దీపాల పండుగ – నిండె ధరణి

కారుచీకట్లలో వెల్గెఁ – గాంతి కళలు

తారలన్ దాకఁ జువ్వలు – ధ్వనులు సేయు

సంతసమ్మున దలతురు – సత్య నవని

 

ద్వి. మనసొక్క రణభూమి – మనుజున కిందు

కననౌను నరకునిఁ – గన్నయ్య నందు

ఆ సత్యభామయు – నందుండు నెందు

హా! సంగరమ్ములే – యనుదిన మ్మిందు

ప్రేమకుఁ బగకునుఁ – వీడుగా నుండె

భూమిపై యీ యాట – ముందుండి యుండె

వెలుఁగు జయించంగ – విందు రమించ

కలుఁగును వ్యధయు చీ-కటి యాక్రమించ

నవ్వుల పండుగ – న్యాయమ్ము గెలువ

దివ్వెల పండుగ – తెలుపు నీ విలువ

ప్రతిరోజు దీపాల – పబ్బమ్ము గలుఁగు

మృతినొంద దుశ్చర్య – మితిలేని వెలుఁగు

(పబ్బము=ఉత్సవము)

 

=====================

 

చీకటి – సత్య – వెలుగు

 

అనృతానికి అజ్ఞానానికి నరకాసురుడు ప్రతిరూపం

సత్యానికి ధర్మానికి సత్యభామ నిజరూపం

ఈ రెండు శక్తుల మధ్య పోరాటం, ఎల్ల జగత్తుకు ఆరాటం!

వాడిది రాక్షసమాయ! వీడిది వైష్ణవమాయ!

ఒక క్షణం చీకటి శక్తి గెలిచింది, కన్నయ్య స్పృహ తప్పాడు

నారి నారి లాగి శరవర్షాన్ని కురిపించి నరకుడిని నరికింది

మన్ను మిన్ను మారుమోగింది, హృదయం ఉప్పొంగింది

పూలు కురియగా, జగము మురియగా, వెలుగు విరిసింది

కారుచీకటి నిండిన కాళరాత్రిలో

తారలతో పోటీపడే తారాజువ్వలు

ధగధగా మెరిసిపోయే కాకరపూవొత్తులు

ఈ రోజు దీపావళి

 

మన మనసు కూడ ఒక రణరంగమే

ఇక్కడ కూడ నరకాసురుడు, శ్రీకృష్ణుడు, సత్యభామ –

ముగ్గురు ఉన్నారు, ఇది కూడ ఒక ప్రేమద్వేషాల త్రికోణమే!

ప్రతిరోజు ఇక్కడ కూడ యుద్ధమే

ఒక రోజు నరకాసురుని తాత్కాలిక విజయం

మరోరోజు సత్యభామ శాశ్వత విజయం

చివరకు చీకటి ఓడిపోతుంది, వెలుగు విజయం సాధిస్తుంది

నల్లనయ్య నవ్వుతాడు, సత్యభామ నవ్వుతుంది

సత్యాన్ని సత్య ప్రసాదిస్తుంది, వెలుగును కన్నయ్య కురిపిస్తాడు

అజరామరస్థితిని మనసు పొంది కొత్త స్వర్గాన్ని చూస్తుంది

ఒక రోజు నిజంగా చూస్తుంది!

 

=============================

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *