May 7, 2024

ఆరాధ్య – 2

రచన: అంగులూరి అంజనీదేవి  anjanidevi

http://www.angulurianjanidevi.com 

anguluri.anjanidevi.novelist@gmail.com

 

”నా ఆఫీసు ఇక్కడికి దగ్గరే! నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు ఇటువైపు తిన్నగా వెళ్తే ఓ ఐదు నిముషాల్లో మాదాపూర్‌ పెట్రోల్‌పంప్‌ బస్‌స్టాప్‌ వస్తుంది. అక్కడ హెచ్‌-10 బస్సెక్కి హైటెక్‌సిటీకెళ్లు. అక్కడ వరసగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే వుంటాయి. వాటిలోకెళ్లి నీ రెజ్యూమ్‌ చూపించు. నా ఫ్రెండ్‌ కూతురు వాత్సల్య కూడా ఈ మధ్యన ఈ ప్రయత్నంలోనే వుంది. సర్టిఫికేట్లన్నీ ఫైల్లో వున్నాయికదా! ఫైల్‌ జాగ్రత్త!” అంది.

”ఆంటీ! నాకు వాత్సల్య నెంబరిస్తారా?” అడిగింది ఆరాధ్య.

”ఇప్పుడు నా దగ్గర లేదు. డైరీలో వుంది. రాత్రికి ఇస్తాను” అంటూ ఆమె వెళ్లిపోయింది.

ఆమె చెప్పినట్లే హెచ్‌టెన్‌ బస్సెక్కి హైటెక్‌సిటీకెళ్లిన ఆరాధ్య ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి మళ్లీ అదే హెచ్‌టెన్‌ బస్‌లో ఇంటిముఖం పట్టింది.

మాదాపూర్‌ పెట్రోల్‌పంప్‌ బస్‌స్టాండ్‌ రాగానే బస్‌ ఆగింది.

బస్‌ దిగి ఇల్లు చేరుకుంది.

ఆరాధ్య ఇంటికొచ్చేటప్పటికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఆరాధ్యను చూడగానే ఫోన్లో మాట్లాడటం ఆపేసింది శార్వాణి.

”ఇంటర్వ్యూ ఎలా జరిగింది?” అడిగింది శార్వాణి.

”నాకు ఉద్యోగం రావటం డౌటే ఆంటీ!” చెప్పింది ఆరాధ్య. దిగాలుగా కూర్చుంది.

”వంద ఇంటర్వ్యూలకు అటెండయినట్లు ఎందుకంత డిప్రెషన్‌? వస్తుందిలే! ముందు కాఫీ తాగు రిలాక్సవుతావు” అంటూ ఆరాధ్యకి కాఫీ ఇచ్చి ఆమెకూడా తాగుతూ కూర్చుంది. ఆరాధ్య వచ్చేముందే ఆమె ఆఫీసు నుండి ఇంటికొచ్చింది.

లంచ్‌బాక్స్‌ను చూసి ఆశ్చర్యపోతూ ”నువ్వు దీన్ని ఓపెన్‌ కూడా చేసినట్లు లేదు”

”లేదాంటి! నాకు దాని ధ్యాసే లేదు. ఇప్పుడు ఆకలిగా వుంది. ఇదిగో కాఫీ తాగుతున్నాను కదా! సరిపోతుంది” అంది.

”దీన్నిబట్టి నీది బాగా అడ్జస్ట్‌ అయ్యే మెంటాలిటీలాగుంది”

”అఫ్‌కోర్స్‌”

”ఇది మంచిపద్ధతే! ఈ తత్వమే మనుషుల్ని ఎలాంటి పరిస్థితుల నుండి అయినా బయటపడేస్తుంది. ఒక చిన్న పురుగు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఎన్నోరకాలుగా సర్దుకుపోయి బ్రతుకుతుంటుంది”

”నేను పురుగునా ఆంటీ!” గబుక్కున అడిగేసింది ఆరాధ్య.

”ఛ… ఛ… అలా ఎందుకనుకుంటావ్‌! సర్దుకుపోయి దాక్కునే పురుగులా మనం కూడా జీవితంలో ఎత్తుగడల్ని నేర్చుకోవాలి. జీవితాన్ని క్రమంగా మార్చుకుంటూ వెళ్లాలి అని నీకు ఆ ఉదాహరణ చెప్పాను. అంతే!” అంది.

”ఓ… అలాగా!”

”నీకింకో రహస్యం చెప్పనా?”

”చెప్పండి ఆంటీ!”

”మన జీవితాల్లో ఎన్నో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. నా జీవితంలో కూడా కొన్ని జరిగాయి. నాకు తెలిసినవాళ్ల జీవితాల్లో కూడా జరిగాయి. అవేంటంటే జాబ్‌ రాదనుకున్నవాళ్లకి జాబ్‌ రావడం… పెళ్లి కాదనుకున్నవాళ్లకి పెళ్లికావడం…. ఇల్లు లేదనుకున్నవాళ్లకి ఇల్లు రావటం… ఐపియస్‌ కాలేమేమో అనుకున్న వాళ్లు ఐపియస్‌లు కావటం…. ఇవన్నీ జరగాలీ అంటే మన ఆలోచనలకి కూడా కొంత శక్తి కావాలి. అప్పుడే మనం కావాలనుకున్న వాటిని పొందగలుగుతాం” అంది.

”ప్రస్తుతం నాకు అంత శక్తి వుందో లేదో నాకు తెలియదు కాని జాబ్‌ అయితే కావాలి ఆంటీ! జాబ్‌ వుంటేనే నాకిప్పుడు తిండి, షెల్టర్‌” అంటూ వున్న వాస్తవాన్ని చెప్పింది.

”ఒక్కరోజుకే ఇలా నిరాశపడితే ఎలా? ఓపిక, ఓర్పు వుండాలి. అవి వుండాలీ అంటే కొంత శక్తి అవసరం అవుతుంది. ఆ శక్తి ఎక్కడో వుండదు. ఎక్కడినుంచో రాదు. అది నీలోనే వుంటుంది. నువ్వే ఒక శక్తివి. దాన్నెవరూ సృష్టించలేరు. నాశనం చెయ్యలేరు. నువ్వు నీ శక్తితో నీక్కావాలనుకున్నవాటిని నీవైపుకి ఆకర్షించుకోవాలి. నేనోచోట చదివాను- మన ఉద్దేశాలను మన లక్ష్యాలను ఒక బ్లాక్‌బోర్డు మీద రాసి దేవుడు ఆకాశంలో వుంచడట. అసలు అటువంటి బ్లాక్‌బోర్డ్‌ లేనేలేదట… దేన్నైనా మనకు మనమే ఇచ్చుకోవాలి. మనకు మనమే సృష్టించుకోవాలి. అదే మన జీవితం” అంది.

”ఆంటీ! నాకు వాత్సల్య నెంబర్‌ ఇస్తారా? ముందు మీరు తనకు ఫోన్‌చేసి నన్ను పరిచయం చెయ్యండి! నేను మాట్లాడతాను” అంది ఆరాధ్య.

”బెస్ట్‌ ఐడియా!” అంటూ వాత్సల్యకి కాల్‌చేసి ఆరాధ్యను పరిచయం చేసింది శార్వాణి.

ఆరాధ్య ఖాళీ అయిన కాఫీ కప్పుని టీపాయ్‌మీద పెట్టి సెల్‌ఫోన్ని చెవిదగ్గర పెట్టుకొని వాత్సల్యతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్లి నిలబడింది. వాత్సల్య చాలా తెలివిగా, స్పష్టంగా, హుషారుగా మాట్లాడుతోంది. ఆమె మాటల్లో ఎదుటివారు చాలా త్వరగా ఇంప్రెస్‌ అయ్యే క్వాలిటీ వుంది. ఆసక్తిగా వింటోంది ఆరాధ్య.

”నీకో అబ్బాయి నెంబర్‌ ఇస్తాను ఆరాధ్యా! నీకేమైనా డౌట్స్‌ వస్తే ఫోన్లో అతన్ని కాంటాక్ట్‌ అవ్వు” అంది వాత్సల్య.

”అబ్బాయిదా?”

”అవును. అబ్బాయిదైతేనే యూజ్‌ఫుల్‌గా వుంటుంది. నువ్వు నా ఫ్రెండ్‌వని అతనికి నిన్ను ఇంటర్‌డ్యూస్‌ చేస్తాను. అతను నిన్నుకూడా తన ఫ్రెండ్‌లాగే ట్రీట్‌ చేస్తాడు”

ఆరాధ్యకు వెంటనే రాకేష్‌ గుర్తొచ్చి ”వద్దు వాత్సల్యా! నాకు అమ్మాయి నెంబర్‌ వుంటే ఇవ్వు” అంది.

వాత్సల్య నవ్వి ”అమ్మాయిల మీద నువ్వు మరీ అంత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోకు. వాళ్లు మనకోసం ఏమీ చెయ్యరు. ఒకవేళ ఏం చెయ్యాలనుకున్నా వాళ్లు కూడా అబ్బాయిలకి ఫోన్లు చేసి ఇన్ఫర్‌మేషన్‌ గేదర్‌ చెయ్యాల్సిందే. అబ్బాయిలకి వుండే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అమ్మాయిలకి వుండవు. ఎక్కడికైనా అబ్బాయిలు వెళ్లినంత ధైర్యంగా, ఒంటరిగా అమ్మాయిలు వెళ్లలేరు. అంతేకాదు ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఈ మహానగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా అంత సేఫ్‌కాదు. పైగా అమ్మాయిలు ఇంకో అమ్మాయికోసం అంత టైంను కూడా వృధా చేసుకోరు” అంది.

ఆరాధ్యకి అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయంగా వుంది. రాకేష్‌ విషయం వాత్సల్యతో చెప్పాలా వద్దా అని సందేహిస్తోంది.

”నీకిప్పుడు జాబ్‌ కావాలి. ఇక్కడ నీకు సపోర్టు చెయ్యాలన్నా, నీతోపాటు తిరగాలన్నా నీ పేరెంట్స్‌ వల్ల అయ్యే పనికాదు. నీ పేరెంట్సే కాదు ఎవరో తప్ప అందరి పేరెంట్స్‌ అలాగే వుంటారు. బ్రదర్సయినా, సిస్టర్సయినా అంతే! మనం మాట్లాడినప్పుడు ఏదో మాట్లాడతారు. అదికూడా వాళ్లకి తెలిసింది మాత్రమే. తెలియంది తెలుసుకొని మాట్లాడేంత టైం కూడా వాళ్లకి వుండదు. అదే ఫ్రెండ్‌ అనుకో! లీవ్‌ పెట్టుకొని మరీ మన వెంట వస్తాడు. మన గురించి ఆలోచిస్తాడు…. సిటీకి కొత్త కాబట్టి మనం మిస్సవుతామని మనల్ని ఒంటరిగా వెళ్లనివ్వడు. మనకోసం ఏమైనా చేస్తాడు” అంటూ బాయ్‌ఫ్రెండ్స్‌ వల్ల ఎంత ఉపయోగమో చెప్పింది వాత్సల్య.

పెదవి విరిచింది ఆరాధ్య. ఈ వాత్యల్యకి అబ్బాయిల గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. రాకేష్‌ గురించి చెప్పాలి. అబ్బాయిలు ఎలాంటివాళ్లో తెలుసుకుంటుంది. లేకుంటే ఫ్యూచర్లో ఆమెకూడా తనలాగే మోసపోవచ్చు. అని మనసులో అనుకుంటూ రాకేష్‌ తనకెలా హ్యాండిచ్చాడో చెప్పబోయింది.

వెంటనే వాత్సల్య ”అంతేకాదు ఆరాధ్యా! ఒక్కోసారి మనం జాబ్‌కోసం తిరిగి తిరిగి విసిగిపోయి ఇక నాకు జాబ్‌ వస్తుందో రాదోనని డిప్రెషన్‌లో వున్నప్పుడు మనకు ధైర్యం చెప్పేది కాని, మనం దేన్నీ మిస్‌ కాకుండా చూసేది కాని, మనకు జాబ్‌ వచ్చేంతవరకు టచ్‌లో వుండేది కాని మనల్ని ఫ్రెండ్‌లా భావించిన వ్యక్తే! నేనింత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే సిటీలకెళ్లి పి.జీలు చేసిన అమ్మాయిలు కూడా కొందరు ఇంటికెళ్లగానే నైన్త్‌క్లాస్‌ అమ్మాయిల్లా మారిపోతుంటారు. అది వాళ్ల తప్పు కాదు. వాళ్ల ఇంటి వాతావరణం అలాంటిది. అప్పటివరకు వాళ్ల దగ్గరవున్న మొబైల్‌ కూడా వాళ్ల దగ్గర వుండదు. వాళ్ల అన్నయ్యల దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్లిపోతుంది. వాళ్లేమో వంటపని, ఇంటిపని చేసుకుంటూ ఎవరితోనూ కమ్యూనికేషన్‌ లేకుండా వుంటారు. అలాంటి వాళ్లకు ఏదైనా జాబ్‌ ఇన్ఫర్‌మేషన్‌ ఇచ్చేది మరే ఇతర ప్రాంతాలలోనే వుండే వాళ్ల బాయ్‌ఫ్రెండ్సే… బాయ్‌ఫ్రెండ్స్‌ వల్ల నాకు తెలిసి ఎలాంటి ప్రమాదం వుండదు. అయినా ఏ ప్రమాదమైనా మనల్ని బట్టే వుంటుంది ఆరాధ్యా! సరే! నేనిప్పుడు నీకు కొన్ని మెయిల్‌ ఐ.డి.లు చెబుతాను. వాటికి వెంటనే నీ రెజ్యూమ్‌ను ఫార్వర్డ్‌ చెయ్యి” అంటూ కొన్ని మెయిల్‌ ఐడిలు చెప్పింది.

ఆరాధ్య వాటిని నోట్‌ చేసుకుంది.

”ఒక్క నిముషం వాత్సల్యా!” అంటూ ఆరాధ్య శార్వాణి దగ్గరకి వెళ్లి ”ఆంటీ! నేనిప్పుడు ఇంటర్‌నెట్‌ సెంటర్‌కి వెళ్లి వస్తాను. వాత్సల్య నాకు కొన్ని మెయిల్‌ ఐడిలు చెప్పింది. వాటికి నా రెజ్యూమ్‌ను ఫార్వడ్‌ చేసి వస్తాను” అంటూ వాత్సల్యతో ఫోన్లో మాట్లాడుతూనే బయటకెళ్లింది ఆరాధ్య.

మొబైల్‌ని చెవి దగ్గర అలాగే పట్టుకొని మాట్లాడుతూ వాత్సల్య రోడ్డును ఎక్కడ క్రాస్‌ చెయ్యమన్నదో అక్కడ చేసింది. ఆ తర్వాత ఇంటర్‌నెట్‌ సెంటర్‌ అక్కడికి ఎంతదూరంలో వుందో తెలుసుకొని ”బై వాత్సల్యా!” అంటూ కాల్‌ కట్‌ చేసింది.

ఇంటర్‌నెట్‌ సెంటర్లో ఓ గంట గడిపి ఇంటికెళ్లింది ఆరాధ్య.

* * * * *

తెల్లవారింది. టైం తొమ్మిది కావొస్తుంది. ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు వుంటున్న గది అది. ఆ గదిలో కాశిరెడ్డి, హేమంత్‌ వుంటుంటారు. ఈ మధ్యనే కొత్తగా ఇంకో ఫ్రెండ్‌ వచ్చి వాళ్లతో చేరాడు.

”ఇది మాత్రం నిజం కాశిరెడ్డి! వీడీరోజు ఆఫీసుకెళ్లడు. రాత్రంతా కలవరిస్తూనే వున్నాడు. ఎందుకో ఏమో మొన్నటి నుండి మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పెట్టుకున్నాడు. ఆఫీసులో ఏం జరిగిందో ఏమో నీకేమైనా చెప్పాడా?” ముసుగుతన్ని పడుకొని వున్న ఫ్రెండ్‌వైపు చూస్తూ కాశిరెడ్డిని అడిగాడు హేమంత్‌.

నాకేం చెప్పలేదన్నట్లు భుజాలను కదిలించి తన పనిలో తనున్నాడు కాశిరెడ్డి.

”కాశిరెడ్డీ! ఎంతయినా వాడు మన ఫ్రెండ్‌రా! వాడికేదైనా ప్రాబ్లమ్‌ వస్తే మనకొచ్చినట్లు కాదా?”

”వాడికి ప్రాబ్లమా!! రాత్రి పీకలదాకా మెక్కాడు. మనిద్దరం నిద్రలేచి, వంటచేసి ఆఫీసుకి రెడీ అవుతున్నా ప్రాణాయామం చేస్తున్నవాడిలా సైలెంట్‌గా దుప్పట్లోంచే శ్వాస పీల్చి వదులుతున్నాడు. అంత ప్రశాంతంగా వాడుంటే వాడికి ప్రాబ్లమా?”

”నాకెందుకో అలాగే అన్పిస్తోందిరా! నేను మాత్రం ఆఫీసుకెళ్తున్నా! బై” అంటూ సడన్‌గా బ్యాక్‌ప్యాక్‌ని తగిలించుకున్నాడు హేమంత్‌. అందులో లంచ్‌బాక్స్‌ మాత్రమే వుంది.

”నేను మాత్రం ఆఫీసుకెళ్లనా! వీడికి కాపలా వుంటానా! నాకు బై చెబుతున్నావ్‌? అసలు వీడెందుకింత లేజీగా వున్నాడో నాకర్థం కావడంలేదు. ఆఫీసు నుండి వచ్చాక వుతికెయ్యాలి. పద వెళ్దాం!” అంటూ కాశిరెడ్డి కూడా బ్యాక్‌ప్యాక్‌ని తగిలించుకొని హేమంత్‌తో కదిలాడు.

వాళ్లిద్దరు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నారు. మంచి స్నేహితులు.

వాళ్లు బి.టెక్‌ చదివింది కూడా ఒకే కాలేజిలో. బ్రాంచికూడా ఒకటే. కాలేజిని ఎంపిక చేసుకునేటప్పుడు కాని, బ్రాంచ్‌ సెలెక్షన్‌లోకాని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనుభవజ్ఞుల్ని కలిశారు. వాళ్లు కాశిరెడ్డిని, హేమంత్‌ని చూడగానే ”ఇంజనీరింగ్‌లో మీరు ఏ బ్రాంచ్‌ ఎంచుకున్నా సరే హార్డ్‌వర్క్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టీం స్పిరిట్‌ అవసరం. సబ్జెక్ట్‌ స్కిల్స్‌తో పాటు చొరవ వున్నవారికే కార్పొరేట్‌ కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే మీరు చేరబోయే కాలేజీలో కూడా అధునాతనమైన క్లాస్‌రూమ్‌లు, పరిశోధనలకోసం ఉన్నత ప్రమాణాలున్న ల్యాబ్స్‌, అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవటానికి ఉపయోగపడే లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, ఇంటర్నెట్‌, సెమినార్‌ రూమ్స్‌, ప్లేగ్రౌండ్స్‌ వంటి సౌకర్యాలు వున్నాయో లేవో చూసుకోండి! ముఖ్యంగా ఆ కాలేజి కొత్తగా ఏర్పాటు చేసింది కాకుండా కనీసం రెండు పాస్‌ అవుట్‌ బ్యాచ్‌లు వుంటేనే టాప్‌  ఎం.ఎస్సీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ నిర్వహణ వుంటుంది. మీరు తీసుకునే బ్రాంచ్‌ని కూడా ఫ్యాకల్టీ, జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌, ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్‌ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకొని తీసుకోండి” అన్నారు.

ఆసక్తిగా విన్నారు కాశిరెడ్డి, హేమంత్‌.

”అంతేకాదు. ఇంజనీరింగ్‌ అంటేనే ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇంటర్నెట్‌లో నిపుణులైన ప్రొఫెసర్ల పాఠాలను ఫాలో అవ్వండి! మీరు తీసుకున్న  బ్రాంచ్‌లో మీకు లోతైన అవగాహన వుంటేనే సబ్జెక్ట్‌పై మీకు సరైన పట్టు వస్తుంది. ప్రస్తుత జాబ్‌ ఇండస్ట్రీ కోరుకుంటున్న జాబ్‌ ఓరియెంటెడ్‌ అప్లికేషన్స్‌, స్కిల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి తోడుగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి. స్కిల్స్‌లో మెరిస్తేనే ఇంజనీరింగ్‌కు సార్థకత. మార్కెట్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకి ఉద్యోగాలు చాలానే వున్నాయి. కానీ సబ్జెక్ట్‌ స్కిల్స్‌తో పాటు చొరవ వున్న వారికే కార్పొరేట్‌ కంపెనీలు స్వాగతం పలుకుతాయి. అది గుర్తుంచుకొని చదవండి!” అన్నారు.

ఆ అనుభవజ్ఞులు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విన్నారు. బి.టెక్‌ చదివిన ఆ నాలుగు సంవత్సరాలు వాళ్ల సలహాలను సూచనలను చక్కగా పాటించారు. ఇంకో ఆలోచన లేకుండా తపనతో చదివారు. సాధించాలనే పట్టుదల, సొంతంగా ఏదో ఒకటి చెయ్యాలనే బలమైన సానుకూల దృక్పధంతో సాగారు. అదంతా గుర్తొచ్చి ఆలోచిస్తూ నడుస్తున్నాడు కాశిరెడ్డి. అతను చూడటానికి బ్లాక్‌రంగులో ఆరడుగుల ఎత్తు, బలమైన భుజాలతో, మడత నలగని డ్రెస్‌తో ఏదో ఒక సంస్థను నడుపుతున్న వ్యక్తిలా కన్పిస్తాడు. హేమంత్‌ తేనెలో తెలుపు కలిపితే వచ్చే గమ్మత్తయిన రంగులో చూడగానే సెల్యూట్‌ చెయ్యాలనిపించేలా వుంటాడు. ఎత్తులో, బలంలో, హుందా తనంలో కాశిరెడ్డికి ఏమాత్రం తీసిపోడు. ఇద్దర్నీ ఓచోట కలిపి చూస్తే ‘హేమంత్‌ బావున్నాడు కదా!’ అన్పిస్తుంది ఎవరికైనా…

”ఇంకా ఎంతసేపురా! ఎంత నడిచినా బస్టాప్‌ రాదేం? నీ బైక్‌ రిపేరై ఎప్పుడొస్తుంది?” అడిగాడు హేమంత్‌. వాళ్లుండే అపార్ట్‌మెంట్‌కి పది నిమిషాలు నడిస్తే వచ్చేంత దూరంలోనే వుంటుంది మాదాపూర్‌ పెట్రోల్‌పంప్‌ బస్‌స్టాప్‌. ప్రతిరోజు వాళ్లు ఆఫీసుకి బస్‌లో వెళ్లరు. బైక్‌ మీదనే వెళతారు.

కాశిరెడ్డి బ్యాక్‌ప్యాక్‌ని సవరించుకుంటూ ”ఇంతకుముందేగా బైక్‌ని రిపేర్‌షాపులో ఇచ్చి వచ్చాం! ఇప్పుడు మనం ఇంటినుండి స్టార్ట్‌ అయి ఐదు నిమిషాలే అయింది. ఇంకా ఐదు నిముషాలు నడవాలి. అప్పుడే బోర్‌ అంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచిస్తూ నడవరా! టైం తెలియకుండా గడిచిపోతుంది” ఐడియా ఇచ్చాడు కాశిరెడ్డి. రిపేర్‌కి ఇచ్చిన బైక్‌ కాశిరెడ్డిది.

”ఆలోచించడమా? నాకసలు ఆలోచనలే రావు. దేని గురించి ఆలోచించాలి?”

”నీకు దేనిమీద ఆసక్తి వుంటే దాని గురించి”

”నాకలాంటి ఆసక్తులేం లేవు. కనీసం ఆఫీసు నుండి మనం రిటనయ్యే టైం వరకైనా బైక్‌ వస్తుందా? ఫోన్‌ నెంబరుంటే ఫోన్‌ చెయ్యి. బస్‌జర్నీ బోర్‌!” అన్నాడు హేమంత్‌.

”ఆఫీసుకెళ్లాక చేస్తాను. అదిగో మనం ఎక్కబోయే హెచ్‌టెన్‌ బస్‌ వచ్చింది” అంటూ అతను బస్‌వేపు చూస్తుండగానే వేగంగా వెళ్లి బస్సెక్కాడు హేమంత్‌.

హేమంత్‌ ఎక్కిన వెంటనే ఇద్దరమ్మాయిలు ఎక్కారు. ఆ తర్వాత కాశిరెడ్డి ఎక్కాడు. ఎవరికీ సీట్లు లేవు. అందరూ నిలబడే వున్నారు. ఆఫీసులకెళ్లే టైం కావటం వల్ల బస్‌లో ఫుల్‌ క్రౌడీగా వుంది. ఒకరినొకరు నెట్టుకోకపోయినా బస్‌ కదులుతుంటే నెట్టుకుంటున్నట్లే వుంది. హేమంత్‌ వెనకాల ఎవరో అమ్మాయి నిలబడి వున్నట్లు అతనికి అర్థమవుతోంది. కాశిరెడ్డి ఎక్కడున్నాడో. తిరిగి చూద్దామనుకునే లోపలే హేమంత్‌ వెనకాల వున్న ఆ అమ్మాయి కంగారుపడిపోతూ అతన్ని తగలకుండా నిలబడాలని ప్రయత్నిస్తూ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వెయ్యటంతో టప్పున కిందపడింది.

వెంటనే తిరిగి చూశాడు హేమంత్‌. కింద పడిన ఆ అమ్మాయికి వెనకాల నిలబడి మరో అమ్మాయి వుంది. ఆ అమ్మాయి బిత్తరపోయి చూస్తుందే కాని కింద పడిపోయిన అమ్మాయిని లేపటం లేదు. బస్‌ కదులుతుండటంతో కిందపడిన అమ్మాయి వెంటనే లేవలేకపోతోంది. లేచి నిలబడాలని గ్రిప్‌ కోసం చూస్తోంది. అప్పటికే బస్‌లో ”అయ్యో! పాపం! లేపండి! లేపండి!” అంటున్నారెవరో.

హేమంత్‌ కొద్దిగా వంగి ఆ అమ్మాయి భుజాలు పట్టుకొని లేపి నిలబెట్టాడు. ఈసారి మళ్లీ పడతానేమోనని గట్టిగా రాడ్‌ పట్టుకొని నిలబడింది ఆ అమ్మాయి. అతను వెంటనే ‘ఈ అమ్మాయికి కాళ్లు సరిగా వున్నాయా లేవా!’ అన్నట్లు కాళ్లవైపు చూశాడు. లైట్‌ బ్లూకలర్‌ చుడీదార్‌లో వున్న ఆ అమ్మాయి కాళ్లు బాగానే వున్నాయి.

”ఓ.కె.” అనుకొని ఎప్పటిలాగే అటు తిరిగి నిలబడ్డాడు.

అయినా హేమంత్‌ ఆ అమ్మాయికి తగులుతున్నాడు. మామూలుగా కాదు. స్పీడ్‌బ్రేకర్లు వచ్చినప్పుడు బస్‌ బలంగా కదిలినప్పుడు ఆ అమ్మాయి ముందుభాగం అతని వీపుకి గుచ్చుకుంటోంది. అది నచ్చక ఊపిరి ఆగిపోయేలా చూస్తోంది. ఒకే ఒక్క ఐడియా దేన్నో మార్చినట్లు ఆ అమ్మాయికి వెంటనే తామిద్దరి మధ్యన ఫైల్‌ అడ్డుగా పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాగే పెట్టుకుంది. అంతవరకు వీపుకు మెత్తగా తగిలి ఇప్పుడు గట్టిగా తగలడంతో అతను పూర్తిగా ఆమెవైపు తిరిగాడు. ఏమిటన్నట్లు చూశాడు. ఇద్దరి మధ్యలో ఫైల్‌ వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఉన్నట్టుండి ఎవరో నెట్టటంతో అతనింకా ఆ అమ్మాయికి దగ్గరయ్యాడు.

ఇప్పుడు అతని శ్వాస ఆ అమ్మాయి ముఖం మీద పడుతోంది. ఒక్కక్షణం ఊపిరాడనట్లు చూసి ఫైల్‌ని నోటితో పట్టుకొని చేతులు పైకెత్తింది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఆరాధ్య. ఆరాధ్య ఎందుకలా చేతులు పైకెత్తిందో ఆ భంగిమ అర్థం కాక ”ఆ ఫైల్‌ ఇటివ్వండి! నేను పట్టుకుంటాను. దిగేటప్పుడు తీసుకుందుగాని…” అన్నాడు.

ఆమె నోరు తెరిచి మాట్లాడితే ఫైల్‌ కింద పడిపోతుందని ఒక చెయ్యి కిందకి దింపి ఫైల్‌ పట్టుకొని కదలకుండా అలాగే నిలబడి ”ఊ… ఊ…” అంటూ సైగ చేసింది. ఆమె చేస్తున్న సైగ అతనికి అర్థమవుతోంది. అదేంటంటే ఎప్పటిలాగే అటు తిరిగి నిలబడమని… అతనికి అప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి మూగదని… తేరిపార చూశాడు. ముఖంలోకే చూశాడు. మళ్లీ మళ్లీ చూశాడు. గుచ్చిగుచ్చి చూశాడు. అతనెందుకలా చూస్తున్నాడో అర్థంకాక కోపంతో ఉరిమి చూసింది ఆరాధ్య.

అతను మరింత అబ్బురపడ్డాడు. మూగదానికి కూడా కోపం వస్తుందా అని… మూగదైనా చాలా బావుంది కదా అనుకున్నాడు. ఎంత బావుందీ అంటే చూసిన క్షణమే స్తంభించిపోయి ప్రపంచాన్ని మరచిపోయేంత బావుంది. అయినా ఈ మూగదానితో తనకేం పని? వెంటనే అటు తిరిగి నిలబడ్డాడు.

బస్‌ ఇమేజ్‌ హాస్పిటల్‌ బస్‌స్టాప్‌ దగ్గర ఆగి మళ్లీ కదిలింది.

హేమంత్‌ కెందుకో తిరిగి ఆరాధ్యవైపు చూడాలనిపిస్తోంది. కానీ అలా చూస్తే బావుండదేమో! తననే చూస్తున్నాడనుకుంటుందేమో! తనకోసమే వెనక్కి తిరిగాడనుకుంటుందేమో! ఎంత మూగదైనా అలా అనుకోవడం అతనికి ఇష్టం లేదు… అందుకే ఆరాధ్య ముఖాన్ని మళ్లీ చూడాలన్న కోరికను మనసులోనే తొక్కేశాడు. అయినా అతని మనసెందుకో మొండికేస్తోంది. ఒక మూగదాని ముఖం కోసం ముఖం వాచినట్లు వెనక్కి తిరిగి చూడాలనుకుంటోంది. ఛ.. ఛ అనుకున్నాడు.

అతనికి తెలియకుండానే ”కాశిరెడ్డీ!” అని పిలుస్తూ వెనుదిరిగి ఆరాధ్యవైపు చూశాడు. ఆరాధ్య కూడా అతని వైపు చూసింది. ఆమెలో ఎలాంటి ఎమోషన్స్‌ లేవు. పాపం మూగది అన్పించేంత అమాయకంగా చూస్తోంది. అమాయకంలో కూడా ఇంత అందం వుంటుందా? ఎందుకుండదు. పువ్వులు కూడా అంతేగా! అమాయకంగా చూస్తుంటాయి ఎవరి వైపైన. మాట్లాడవు. ఈ మూగపిల్లలాగే! ప్రపంచంలో అన్ని దేశాల్లో పూసే అద్భుతమైన పువ్వుల్లో అత్యద్భుతమైన పువ్వులాగా వుంది ఈ మూగపిల్ల!

అంతలో హైటెక్‌ సిటీ రాగానే బస్‌ ఆగింది.

ఒక్కొక్కరే బస్‌ దిగుతుంటే ”రారా హేం!” అంటూ కాశిరెడ్డి హుషారుగా జంప్‌ చేస్తున్నట్లే బస్‌ దిగాడు. కాశిరెడ్డే కాదు. అక్కడ అందరు అలాగే స్పీడ్‌ స్పీడ్‌గా బస్‌ దిగుతున్నారు. ఆరాధ్యనే చూస్తూ బస్‌ దిగాడు హేమంత్‌.

”ఏంటిరా స్లో! కమాన్‌! కమాన్‌!” అంటూ హేమంత్‌ భుజం తట్టి నడుస్తున్నాడు కాశిరెడ్డి.

ఆరాధ్య ఎటు వెళ్తుందోనని ఆమె వెళ్తున్న వైపే కాశిరెడ్డికి తెలియకుండా చూస్తున్నాడు హేమంత్‌. ఆమె వేరే రూట్‌న వెళ్లడంతో నిరాశగా నేలమీద ఏదో వుంటే తన్నుకుంటూ నడుస్తున్నాడు.

”ఏంటిరా! మూడీగా వున్నావ్‌! బైక్‌ లేదనా?” అడిగాడు కాశిరెడ్డి సరదాగా.

హేమంత్‌ మాట్లాడకుండా అలాగే తన్నుకుంటూ నడుస్తున్నాడు.

”తన్నింది చాల్లే! ఆఫీసు వచ్చింది చూడు” అన్నాడు కాశిరెడ్డి.

కొద్దిగా తలవంచుకొని ఆలోచనగా నడుస్తున్న హేమంత్‌ నవ్వుతూ కాశిరెడ్డిని ఫాలో అయ్యాడు. హేమంత్‌ ఎందుకు నవ్వాడో తెలియదు కాశిరెడ్డికి… ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత వున్నట్లు అన్పించినా పట్టించుకోలేదు. కారణం కాశిరెడ్డి పూర్తిగా ఆఫీసు మూడ్‌లో వున్నాడు.

వాళ్లు వర్క్‌ చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎనిమిది అంతస్తులు వుంటుంది. చాలా అధునాతనమైన భవనం. అన్ని సౌకర్యాలతో వుంటుంది. చేస్తే ఇలాంటి కంపెనీలోనే జాబ్‌ చెయ్యాలి అన్పించేలా వుంటుంది.

అందులో వర్క్‌ చేస్తున్నవాళ్లకి కారుగాని, బైక్‌గాని వుంటే అప్పర్‌ బేస్‌మెంట్‌లో పార్కింగ్‌ చేస్తారు. అక్కడ చెకింగ్‌ వుంటుంది. ప్రస్తుతం వాళ్ల దగ్గర కారుగాని, బైక్‌గాని లేవు కాబట్టి నేరుగా లిఫ్ట్‌ ఏరియాకి వెళ్లి లిఫ్ట్‌ ఎక్కి ఫోర్త్‌ ఫ్లోర్‌లోకి వెళ్లారు. అక్కడ వాళ్ల ఐడెంటిటి కార్డ్స్‌తోటి డోర్‌ యాక్సెస్‌ ట్రై చేశారు. వాళ్ల దగ్గర వున్న ఐడెంటిటి కార్డ్స్‌ వ్యాలిడ్‌ కావడంతో వెంటనే డోర్‌ ఓపెన్‌ అయింది. లోపలికి వెళ్లి బ్యాక్‌ప్యాక్‌ని స్వైస్‌ చేసే రిసెప్షన్‌ ఏరియాలో ఆగారు. అక్కడ ఒక మిషన్‌లో బ్యాక్‌ప్యాక్‌ని వుంచి చెక్‌ చెయ్యడం వుంటుంది. అందులో పెన్‌డ్రైవ్‌ కాని, పర్సనల్‌ టాబ్‌లెట్‌ కాని, పి.సి. కాని వుంటే వాటిని అక్కడే డిపాజిట్‌ చేసి వెళ్లాల్సి వుంటుంది. అలాంటివేం వాళ్ల దగ్గర లేవు. చెకింగ్‌ పూర్తయ్యింది.

అక్కడ నుండి హుషారుగా కదిలి నేరుగా వాళ్లు కూర్చునే క్యూబికల్‌ దగ్గరకి వెళ్తూ రోజులాగే ముఖాన్ని ప్లజంట్‌గా మార్చుకొని ‘గుడ్‌మార్నింగ్‌’ చెప్పేవాళ్లకి గుడ్‌మార్నింగ్‌, ‘హాయ్‌’ చెప్పేవాళ్లకి హాయ్‌ చెప్పారు. పరామర్శించాల్సిన వాళ్లు ఎవరైనా వుంటే వాళ్ల దగ్గర ఓ క్షణం ఆగి పరామర్శించారు.

తర్వాత బ్యాక్‌ప్యాక్‌ని క్యూబికల్‌ దగ్గర వదిలి, కంప్యూటర్‌ ఆన్‌ చేసి కాఫీ ఏరియాకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటూ బిస్కెట్స్‌ తిని, కాఫీ మిషన్‌ దగ్గర కాఫీ తీసుకొని మళ్లీ ఎప్పటిలాగే క్యూబికల్‌ దగ్గరకెళ్లి కూర్చున్నారు.

వాళ్లు వెళ్లేటప్పటికే కాశిరెడ్డి కంప్యూటర్‌ ఆన్‌ అయివుంది. అతను వెంటనే సిస్టమ్‌ లోపలకి లాగిన్‌ అయ్యాడు. ఆరోజు అతను చేయవలసిన పనిని చెక్‌ చేస్తూ కూర్చున్నాడు. హేమంత్‌ కంప్యూటర్‌ ఆన్‌ కాలేదు. అతను ట్రై చేశాడు. అయినా ఆనవ్వలేదు. ఎందుకు ఆనవ్వలేదో అర్థంకాక ఒక్కక్షణం అలాగే చూస్తూ కూర్చున్నాడు. అతని సిస్టం ఆన్‌ కాకపోవడంతోపాటు ప్రతిరోజు అక్కడ కూర్చోగానే కన్పించే దేవుని ఫోటో, ఫ్యామిలీ ఫోటో పక్కనెక్కడో పడివున్నాయి. వాటిని చూడగానే మనసు కళుక్కుమంది. ఆ ఫోటోలు చూడటానికి చిన్నవిగా ఒకటిరెండు అంగుళాల పరిమాణంలో వున్నా అవంటే అతనికి ప్రాణం. వాటిని అందుకొని యధాస్థానంలో వుంచాడు.

కేబుల్సన్నీ సరిగా వున్నాయో లేదో ఒకసారి చెక్‌ చేసి కనక్షన్సన్నీ ఇచ్చి చూశాడు. అప్పుడు ఆన్‌ అయింది. ఆన్‌ అయినా కూడా ఆఫీసుకి రాగానే ఇదో పెద్ద డిస్ట్రబెన్స్‌గా అన్పించింది.

అటు ఇటు చూశాడు. పక్క క్యూబికల్‌ దగ్గర ఏదో ప్రాబ్లమ్‌ వున్నట్లుంది. క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు వచ్చి నిలబడి వున్నారు. వాళ్లు ప్రతిరోజు రాత్రి 11-30కి టేబుల్స్‌, మానిటర్స్‌ క్లీన్‌ చేసి వెళ్తుంటారు. అలా చేస్తున్నప్పుడు కేబుల్స్‌ని అటు ఇటు గుంజటం, కదిలించటం జరుగుతుంది. ఇది వాళ్ల పనే అయి వుంటుందనుకున్నాడు.

సడన్‌గా సీట్లోంచి లేచి క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్ల దగ్గరకి వెళ్లాడు హేమంత్‌. వాళ్లమీద చిరాకు పడుతూ ”క్లీన్‌ చేస్తున్నప్పుడు కేబుల్స్‌ వూడకుండా జాగ్రత్తగా క్లీన్‌ చెయ్యండి! అక్కడ వుండే ఫ్లవర్‌వాజ్‌లు, ఫోటోఫ్రేమ్స్‌ కదిలించకండి! ఎక్కడ వున్నవి అక్కడే వుంచండి! ఇవాళ నా సిస్టం ఆనవ్వలేదు. ఇంకెప్పుడూ ఇలా జరగకూడదు” అన్నాడు. అంత గట్టిగా హేమంత్‌ ఎప్పుడూ మాట్లాడలేదు.

అదంతా వింటున్న కాశిరెడ్డి ఆశ్చర్యపోతూ ”రే! హేం! ఏమైందిరా నీకు?” అడిగాడు.

అప్పటికే హేమంత్‌ తన క్యూబికల్‌ దగ్గరకి వచ్చి కూర్చున్నాడు. ఏం జరిగిందో కాశిరెడ్డితో చెప్పాడు.

అది విని మరింత ఆశ్చర్యపోయాడు కాశిరెడ్డి. హేమంత్‌ అతి చిన్న విషయానికే ఎక్కువగా చలించిపోవటం ఇదే మొదటిసారి. ఏమైంది వీడికి? బైక్‌ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా! అనుకుంటూ  ”మన బైక్‌ రిపేర్‌ ఎంతవరకు వచ్చిందో! త్వరగా చెయ్యమని కాల్‌ చేస్తాను” అని పైకే అంటూ మొబైల్లో నెంబర్‌ నొక్కాడు.

”వద్దు. వద్దు… నెమ్మదిగానే చెయ్యనీ! మనం తొందరపెడితే ఏ పార్టులో ఏ ప్రాబ్లమ్‌ వుందో సరిగా చూడకుండా తెచ్చి మనకు హ్యాండోవర్‌ చేసి వెళ్తాడు. నాకు బస్‌ జర్నీ చాలా బావుంది. రేపు కూడా బస్‌లోనే వద్దాం!” అన్నాడు.

ఒక్కక్షణం హేమంత్‌ వైపు సైలెంట్‌గా చూసి తర్వాత తనకి కావలసిన సైట్‌ను ఓపెన్‌ చేస్తూ కూర్చున్నాడు కాశిరెడ్డి.

* * * * *

ఫైల్‌ పట్టుకొని హెచ్‌ టెన్‌ బస్‌ దిగిన ఆరాధ్య ఎప్పటిలాగే సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌ వైపు వెళ్లింది.

హైటెక్‌ సిటీలో ఎటు చూసినా సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌ వున్నాయి. ఆమెకు ఏ కంపెనీలోకి వెళ్లాలో తెలియటం లేదు. అంతా కొత్తగా వుంది. అయోమయంగా వుంది. వాత్సల్య చెప్పిన అడ్రస్‌ ప్రకారం ముందుగా రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌లోకి వెళ్లింది. వాటిపేర్లు చూడగానే తనకి తప్పకుండా జాబ్‌ వచ్చినట్లే ఆనందపడింది. కానీ లోపలికి వెళ్లనీయలేదు అక్కడున్న సెక్యూరిటి. ఇప్పుడామెకు ఎటు వెళ్లాలో, ఎటు వెళ్లకూడదో చెప్పేవాళ్లు లేరు. ఉన్న ఫ్రెండ్స్‌ కూడా టచ్‌లో లేరు.

అయినా ధైర్యంగా ఫైల్‌ పట్టుకొని మరో కంపెనీలోకి వెళ్లింది. ఆ ఏరియాలో వుండే అతిచిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో అదొకటి.

గేటు దగ్గర వాచ్‌మెన్‌ నిలబడి వున్నాడు. అతనితో మాట్లాడి లోపలికి వెళ్లింది. ఎదురుగా వున్న రిసెప్షనిస్ట్‌ని కలిసింది. తను బి.టెక్‌ కంప్లీట్‌ చేసినట్లు చెప్పుకొని, ఫైల్‌ చూపించబోయింది.

ఆ రిసెప్షనిస్ట్‌ ”ప్లీజ్‌! ఒన్‌మినిట్‌ వెయిట్‌” అంటూ ఆరాధ్యను ఆపి, వాళ్ల హెచ్‌.ఆర్‌కి ఫోన్‌ చేసింది.

ఆ హెచ్‌.ఆర్‌ చాలా క్లియర్‌గా ”మన ఆఫీసులో ప్రస్తుతం ఓపెనింగ్సేమీ లేవు. ఇంకెవరైనా ఇలాగే వస్తే పంపించేసెయ్‌! దీనికోసం ఫోన్‌ చేసి నన్ను డిస్టర్బ్‌ చెయ్యొద్దు” అన్నాడు.

రిసెప్షనిస్ట్‌ ”ఓ.కె. సర్‌!” అంటూ ఆరాధ్యవైపు చూసి చాలా స్మూత్‌గా ”చూడండి! మేడమ్‌! అవసరమైతే మేమే ఇంటర్వ్యూస్‌ వున్నాయని పేపర్లో ప్రకటన ఇస్తాం! అప్పుడు రండి! ఇప్పుడు నో వేకెన్సీస్‌” అంది.

అప్పటికే ఆ రిసెప్షనిస్ట్‌ ఏం చెబుతుందా అని ఎదురుచూస్తూ ”ఇక్కడ తనకి జాబ్‌ గ్యారంటీ” అని మనసులో భావిస్తున్న ఆరాధ్యకి రిసెప్షనిస్ట్‌ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. జాబ్‌ రావడం అంత ఈజీ కాదనిపించింది.

వెనుదిరిగింది. నడిచి నడిచి బస్టాప్‌ చేరుకుంది. బస్‌ రాగానే ఉదయం కన్నా ఇప్పుడు కాస్త హుషారుగా కదిలి బస్సెక్కింది. ఉదయానికి ఇప్పటికి ఏదో మార్పు… ఉదయం నిలబడి ప్రయాణం చేస్తే ఇప్పుడు కూర్చుని చేస్తోంది.

ఎంతయినా హైదరాబాదులో ఒంటరి ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ హైదరాబాదు వచ్చేముందు ఇలా ఒంటరిగా ప్రయాణం చెయ్యాల్సిన అవసరం వస్తుందని కొంచెం కూడా ఊహించలేదు.

ఇంటికెళ్లాక తన బాధలన్నీ వాత్సల్యకి ఫోన్‌ చేసి చాలాసేపు చెప్పుకుంది ఆరాధ్య. వాత్సల్య ఆరాధ్యకి ధైర్యం చెప్పి ఇంకా కొన్ని కంపెనీల ఐడిలను ఇచ్చి ఫార్వర్డ్‌ చెయ్యమంది. తను కూడా చేశానని చెప్పింది.

ఆరాధ్య రెజ్యూమ్‌ని పరిశీలించిన ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీవాళ్లు ఆమెను ఇంటర్వ్యూకి రమ్మని ఆమె మొబైల్‌కి మెసేజ్‌ పంపారు. అది చూసి ఆరాధ్య ‘వావ్‌’ అనుకుంటూ తల్లికి ఇంటర్వ్యూ విషయం చెబుదామని కాల్‌ చేసింది. ఆమె లిఫ్ట్‌ చెయ్యలేదు. అంతకు ముందు కాల్‌ చేసినప్పుడు ‘ఆరాధ్యా! నన్ను తొందరపెట్టకు. నీకు డబ్బులు పంపుతాను. అంతవరకు శార్వాణి గారింట్లోనే వుండు. ఆమెను బ్రతిమాలుకో! ఆవిడ వింటారు. మంచావిడ అంటున్నావుగా!’ అంది. ఈ కాల్‌ కూడా డబ్బుల కోసమే అనుకుందో ఏమో రమాదేవి లిఫ్ట్‌ చెయ్యలేదు. ఒక్కక్షణం డిజప్పాయింట్‌ అయి, ఇంటర్వ్యూ విషయం శార్వాణికి చెప్పింది. ఆ తర్వాత వాత్సల్యకు కాల్‌చేసి చెప్పింది. శార్వాణి ‘బెస్టాఫ్‌లక్‌’ చెబితే వాత్సల్య ‘కంగ్రాట్స్‌’ చెప్పింది. వాళ్లకి ‘థాంక్స్‌’ చెప్పి ఇంటర్వ్యూకు వెళ్లాలని ఆరాధ్య మాదాపూర్‌ పెట్రోల్‌పంప్‌ దగ్గరకి వెళ్లి హెచ్‌ టెన్‌ బస్సెక్కింది.

ఆరాధ్యకన్నా ముందే బస్సెక్కి కూర్చుని వున్నాడు హేమంత్‌. అతన్ని చూడగానే ఆమె గుర్తుపట్టింది. మొన్న బస్‌లో తన ముందు నిలబడింది ఇతనే అనుకుంది. అతను కూడా ఈ మూగపిల్ల ఈ రోజు కూడా బస్‌లో వస్తోందా? అనుకున్నాడు. చూసీ చూడనట్లు ఆమెవైపు చూశాడు. చూసింది క్షణమే అయినా ఎందుకో ఏమో అతని గుండె కొట్టుకోవటంలో మార్పు వచ్చింది. ఎప్పుడూ కలగని చిత్రాతి చిత్రమైన స్పందన కలిగింది. ఆ స్పందన మృదువుగా మారి అతని హృదయాన్ని రహస్యంగా మీటింది. ఇదే స్పందన మొన్న ఆమెను బస్‌లో చూసినప్పుడు కూడా కలిగింది. దీన్ని ఏమంటారో కాని ఈ అనుభూతి చాలా బావుంది. ఎలావుందీ అంటే తెలుగులో కాని ఇంగ్లీషులో కాని ఇతర భాషల్లో కాని వ్యక్తపరచలేనంత గొప్పగా వుంది. జీవితంలో ఒక్కసారైనా, క్షణంలో వెయ్యోవంతయినా ఇలాంటి స్థితి కావాలనిపిస్తుంది. రోజుకు ఒక్కసారైనా ఈ అమ్మాయి ఈ బస్‌లో కన్పిస్తుందంటే ఇదే టైంకు ప్రతిరోజు ఇదే బస్‌లో వెళ్లాలనిపిస్తోంది. ఈ అమ్మాయిని చూస్తుంటే తనకే ఇలా వుందా? లేక ఈ బస్‌లో వుండే వాళ్లందరికీ వుందా. అని మనసులో అనుకుంటూ వెంటనే హెడ్‌సెట్‌ పెట్టుకొని కళ్లు మూసుకున్నాడు హేమంత్‌.

బస్‌లో ఎక్కేవాళ్ల రద్దీ ఎక్కువగా వుంది.

హేమంత్‌ ఫ్రెండ్స్‌ కిందనే వున్నారు. బస్సెక్కటానికి ప్రయత్నిస్తున్నారు.

ఆరాధ్య బస్‌లోంచి ఎందుకో కిందకి చూడగానే రాకేష్‌ బస్సెక్కుతూ కన్పించాడు. ఒక్కసారి ఆమె కళ్లు ఏదో దొరికిన ఆనందంతో పెద్దవయ్యాయి. రాకేష్‌ తల ఎత్తే వుండటంతో బస్‌లో వున్న ఆరాధ్యను స్పష్టంగా చూశాడు.

అతనిక బస్సెక్కలేదు. అతనికి ఆరాధ్య ఆరోజు ట్రైన్లోంచి వెనక్కి తిరిగి ఊరెళ్లిపోకుండా హైదరాబాదు రావటమే ఆశ్చర్యంగా వుంది.

అతను బస్సెక్కకుండా మెల్లగా వెనక్కి తగ్గాడు. అతనెందుకు అలా వెనక్కి తగ్గాడో అర్థంకాక కాశిరెడ్డి కూడా అతనితోపాటు ఆగాడు.

రాకేష్‌ బస్సెక్కకపోవటం గమనించి ఆరాధ్య బస్‌ కదిలే లోపలే రాకేష్‌ కోసం బస్‌లోంచి జంప్‌ చేసినట్లే కిందకి దిగింది.

అది చూసి రాకేష్‌ పరిగెత్తటం ప్రారంభించాడు. అతను ఎక్కువ దూరం పరిగెత్తకుండా ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఓ బైక్‌ రావడం చూసి దాని పక్కన పడిపోయాడు. అతని వెనకాలే వస్తున్న ఆరాధ్యకు రాకేష్‌ పడిపోగానే కళ్లు తిరిగాయి. ఆమె వెనకాలే ”రాకేష్‌! ఆగరా! ఎందుకురా పరిగెత్తుతున్నావ్‌!” అంటూ కేకలేసుకుంటూ వస్తున్న కాశిరెడ్డికి సడన్‌గా రాకేష్‌ బైక్‌ తగిలి పడిపోవడంతో ఊపిరి ఆగిపోయేలా అయింది. అంతా అయోమయంగా వుంది. ఎవరీ అమ్మాయి? రాకేష్‌ని ఎందుకు వెంబడిస్తోంది? ఈ దెబ్బతో రాకేష్‌ పైకెళ్లిపోయి వుంటాడా? పడ్డవాడు పడ్డట్టే వున్నాడేంటి? లేవలేకపోతున్నాడా? లేక ఇంకేమైనానా? వెంటనే రాకేష్‌ని చేరుకుని, రోడ్డుమీద పడి వున్న రాకేష్‌ని పక్కకి జరిపాడు కాశిరెడ్డి.

”రాకేష్‌ ఎలా వుంది నీకు?” అంటూ ఆత్రుతగా అడిగాడు కాశిరెడ్డి.

రాకేష్‌ కొంచెం కళ్లు తెరిచి వుండటంతో తనవైపే చూస్తున్న ఆరాధ్య కన్పిస్తోంది. ‘ఇప్పుడు తను పూర్తిగా కళ్లు తెరిచి, నాకేం కాలేదురా కాశీ!’ అంటూ లేచి కూర్చుంటే ఈ రాక్షసి వదలదు. ఉద్యోగం ఇప్పించమంటుంది. డబ్బులు ఇమ్మంటుంది. ఈ బాధలు ఎవరు పడతారు? అసలు అది ఏమంటూ ట్రైనెక్కిందో అప్పటి నుండి మొబైల్‌ని స్విచ్ఛాఫ్‌లో పెట్టుకొని వున్నాడు. నిద్ర కూడా సరిగా పోవడం లేదు. పోతే లేవటం లేదు. ఏది ఏమైనా దీనికిప్పుడు దొరక్కూడదు’ అనుకొని కళ్లను గట్టిగా మూసుకున్నాడు.

రాకేష్‌ కళ్లు గట్టిగా మూసుకోవడంతో కాశిరెడ్డి భయపడ్డాడు.

వెంటనే ఆరాధ్య వైపు కోపంగా చూసి ”వీడికేమైనా అయిందో నిన్ను తీసికెళ్లి పోలీస్‌స్టేషన్లో అప్పచెబుతా!” అన్నాడు. ఇంకా ఏదో అంటున్నాడు.

బిత్తరపోయింది ఆరాధ్య. రాకేష్‌ను ఆ స్థితిలో చూస్తుంటే ‘అయ్యో? ఇలా జరిగిందేమిటి? ఎంతయినా రాకేష్‌ తనకి ఫ్రెండ్‌ కదా! ఇంతకీ వున్నాడో! పోయాడో! అతన్ని దగ్గరుండి హాస్పిటల్‌కి తీసికెళ్తే బాగుండు’ అన్న ఆలోచన వచ్చినా కాశిరెడ్డిని చూస్తుంటే ఇప్పుడే తనని తీసికెళ్లి పోలీస్‌స్టేషన్లో అప్పజెబుతాడేమోనన్న భయంగా వుంది. చటుక్కున వెనుదిరిగింది. అప్పుడే వస్తున్న హెచ్‌ టెన్‌ బస్‌ వెంట పరిగెత్తింది. అది ఆగగానే సుడిగాలిలా బస్‌లోకి దూరింది.

కాశిరెడ్డి రాకేష్‌ వైపు టెన్షన్‌గా చూస్తూ అతన్ని హాస్పిటల్‌కి తీసికెళ్లాలని చూస్తున్నాడు. ఆరాధ్య వెళ్లగానే కళ్లు తెరిచాడు రాకేష్‌! ‘ఇప్పుడు   ఓ.కే రా! కాశీ! ఆఫీసుకెళ్దాం!’ అన్నాడు రాకేష్‌. కాశిరెడ్డి వినకుండా ఇంటికి తీసికెళ్లి ‘రెస్ట్‌ తీసుకో’ అంటూ రాకేష్‌ని బెడ్‌ మీదకి నెట్టాడు. హేమంత్‌కి ఫోన్‌ చేశాడు. అతని మొబైల్‌ సైలెంట్‌ మోడ్‌లో వుండి లిఫ్ట్‌ చెయ్యలేదు.

ఆరాధ్య కరెక్ట్‌ టైంకు ఆఫీసుకెళ్లింది. ఇంటర్వ్యూకి అటెండయ్యింది.

ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లని ఓ చోట కూర్చోబెట్టి నెంబర్‌ వైజ్‌గా పిలుస్తున్నారు. కొద్దిసేపటికి ఆరాధ్య నెంబర్‌ వచ్చింది. ఆరాధ్యను పిలవగానే చాలా ధైర్యంగా లేచి ఈ ఉద్యోగం తనకెంత అవసరమో గుర్తు చేసుకుంటూ మేనేజర్‌ వుండే ఛాంబర్‌లోకి వెళ్లింది.

ఇంటర్వ్యూ మొదలైంది. మొదట్లో సమాధానాలు చెప్పినా తర్వాత చెప్పలేకపోయింది. మార్నింగ్‌ రాకేష్‌కి జరిగిన యాక్సిడెంట్‌ గుర్తు రావడం వల్లనో ఏమో తడబడింది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఇదెలాగూ తనకి రాదు అని హోప్స్‌ వదిలేసుకుంది.

ఇంటర్వ్యూ చేసేవాళ్లు ‘మీకేమైనా ప్రశ్నలు, సందేహాలు వున్నాయా? ఇన్ఫర్‌మేషన్‌ ఏమైనా కావాలా?’ అని క్యాజువల్‌గా అడిగారు.

తను ఎలాగూ ఇంటర్వ్యూ సరిగా చెయ్యలేదు కాబట్టి తనింకేం అడగదలచుకోలేదు. అయినా వాళ్లు అడిగారు కాబట్టి ఆఫీస్‌ టైమింగ్స్‌ అడిగింది. జాబ్‌ అయిపోయాక ఇంటి దగ్గర డ్రాప్‌ చెయ్యటానికి కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్‌ వుంటుందా? అని అడిగింది.

వాళ్ల సమాధానాలు విని ఆరాధ్య ఆ ఛాంబర్లోంచి బయటకు వస్తుంటే హేమంత్‌ కావాలనే ఆమెకు ఎదురయ్యాడు. ఆరాధ్య ఇంటర్వ్యూ కోసం మేనేజర్‌ ఛాంబర్‌లోకి వెళ్లినప్పటి నుండే అతను ఆమెను గమనిస్తున్నాడు. మేనేజర్‌ గది అద్దాల్లోంచి ఆమె అతని సీటు దగ్గరకి కనిపిస్తోంది.

ఆమెకు ఎదురయ్యాడే కాని ఈ మూగపిల్లతో ఎలా మాట్లాడాలి? అన్నదే అతనికో పజిల్‌లా అయింది.

ఆమె చకచక వెళ్లిపోతుంటే ఇప్పుడు మిస్సయితే మళ్లీ కన్పించదని ఆమెకు ఎదురుగా వెళ్లి నిలబడి వీలైనంతగా చేతులు తిప్పుతూ ప్రశ్నలు వేశాడు. నోటితో కాదు చేతులతో… ఆమె నోరు విప్పి ”మీ బాధేంటో నాకు అర్థం కావటం లేదు. మీకేమైనా కావాలా? చూస్తుంటే బాగానే వున్నారు. నోటికేమైంది?” అంది.

అతను ఆశ్చర్యపోయి ”నువ్వు మూగపిల్లవు కావా? అందుకేనా రెండు రోజుల నుండి నేను గూగుల్లోకి వెళ్లి ‘మూగపిల్ల’ అని టైప్‌ చేసి ఎంత సర్చ్‌ చేసినా నువ్వు కన్పించలేదు. పోన్లే మాటలు రావటం మంచిదే! ఇంటర్వ్యూ ఏమైంది?” అని అడిగాడు.

”గూగులేంటి? మూగపిల్లేంటి? అసలేంటండీ మీరు మాట్లాడేది? మీ మెంటల్‌ కండిషన్‌ బాగుండే మాట్లాడుతున్నారా?” అడిగింది ఆరాధ్య.

”అయాం పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్‌! ఇంటర్వ్యూ ఏమైందో చెప్పండి!” అన్నాడు.

”మీకెందుకు చెప్పాలి నా ఇంటర్వ్యూ గురించి?”

”చెబితే ఏదైనా అవసరమైతే హెల్ప్‌ చేస్తాను. నాకీ మేనేజర్‌ బాగా తెలుసు”

”నాతో మీకు ఏం పరిచయం వుందని నాకు హెల్ప్‌ చేస్తారు?”

”హెల్ప్‌ చెయ్యటానికి పరిచయాలు పొడవుగా వుండాలని తెలియక అడిగాను. ఇలాంటివి మీకు తెలిసినంతగా నాకు తెలిసినట్లు లేదు. ఏదో మూగదానివి హెల్ప్‌ చేద్దామనుకున్నాను. అయినా నీకు నా హెల్ప్‌ అవసరం వచ్చేలా లేదులే! హెల్ప్‌ చెయ్యాలంటే పరిచయాలు చాలా పొడవుగా వుండాలాండీ?” అంటూ అతను తన పాటికి తను వెళ్లిపోబోతుంటే ఆరాధ్య పిలిచింది.

”మీరు నిజంగానే నాకు హెల్ప్‌ చెయ్యగలరా? ఇక్కడ మీ కేడర్‌ ఏంటి?” అని అడిగింది అతని గురించి తెలుసుకోవాలని…

”నేనిక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని… అంతే నా కేడర్‌!” అన్నాడు సింపుల్‌గా హేమంత్‌.

అతనికి వాత్సల్య దగ్గర నుండి కాల్‌ రావడంతో అక్కడే కొంచెం పక్కకి నిలబడి వెంటనే లిఫ్ట్‌ చేసి ”చెప్పు వాత్సల్యా!” అన్నాడు.

”నాకు తెలిసిన ఒక అమ్మాయి మీ కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చింది హేమంత్‌! తనకి నువ్వు ఎలాగైనా హెల్ప్‌ చెయ్యాలి! ఎందుకంటే ఈ జాబ్‌ తనకి చాలా అవసరం” అంది.

”జాబ్స్‌ అవసరం లేకుండా ఎవరికైనా వుంటుందా? అయినా మా కంపెనీలో జాబ్స్‌కి చాలా టైట్‌గా వుంది. నిన్ననే మా మేనేజర్‌ చెప్పారు. వున్న పోస్ట్‌లకి మెరిట్‌ని బాగా చూస్తానన్నాడు. సారీ వాత్సల్యా! ఇక్కడ అలాంటి చాన్సెస్‌ ఏమీ లేవు. నేను అలాంటి హెల్ప్‌లేమీ చెయ్యలేను” అన్నాడు.

ఇప్పుడేగా నాకు హెల్ప్‌ చేస్తానన్నాడు. వాత్సల్య అడిగితే చెయ్యనంటున్నాడేం? ఇతనికి వాత్సల్య తెలుసా? కానీ ఇతని సంగతి వాత్సల్యకి బాగా తెలిసినట్లు లేదు. నాకు ముందే తెలుసు ఈ అబ్బాయిలు ఎలాంటి వాళ్లో? వాత్సల్యకేం తెలుసు? రాకేష్‌ అంతే! ఇతనూ అంతే! అనుకుంది ఆరాధ్య.

వాత్సల్య హేమంత్‌తో ఫోన్లో మాట్లాడుతూనే వుంది. ఆ ఫోన్‌ వాత్సల్యది కాబట్టి అక్కడే నిలబడింది కానీ లేకుంటే ఎప్పుడో వెళ్లిపోయేది ఆరాధ్య.

వాత్సల్య ఫోన్లో ”అలా అనకు హేమంత్‌! నాకు కనీసం షల్టరయినా వుంది. ఆరాధ్యకు అదికూడా లేదు. నాకు తెలిసిన ఆంటీవాళ్ల ఇంట్లో వుంది. ఆ ఆంటీయే నాకు ఆరాధ్యను పరిచయం చేసింది. దానికి ప్రస్తుతం పాకెట్‌మనీ కూడా ఆంటీయే ఇస్తోంది. అందుకే ఆరాధ్యకీ జాబ్‌ ఇప్పించు…” అంది.

”అర్థం చేసుకో వాత్సల్యా! నేను ఇక్కడో అమ్మాయికి జాబ్‌ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. నువ్వు చెప్పిన ఆరాధ్యకు ఇప్పించలేను” అంటూ కాల్‌ కట్‌ చేశాడు.

”ఆరాధ్యను నేనే! వాత్సల్య మీకు బాగా తెలుసా? తెలిస్తే ఎందుకు దానికి ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు?” అని అడిగింది ఆరాధ్య.

కిందనుండి పైకి చూసి ”నువ్వు ఆరాధ్యవా? వాత్సల్య చెప్పింది నీ గురించేనా? నీకు హెల్ప్‌ చెయ్యాలంటే నీతో పరిచయం ఇంత పేద్ద పరిచయమై వుండాలేమో! ఇప్పుడు ఓ.కేనా! ఏదీ నీ ఫైల్‌ ఇలా ఇవ్వు” అంటూ చొరవగా ఆమె ఫైల్‌ తీసుకొని నువ్విక్కడే ఆ చెయిర్లో కూర్చో! నేనిప్పుడే వస్తాను” అని ఆమెతో చెప్పి మేనేజర్‌ ఛాంబర్‌లోకి వెళ్లాడు హేమంత్‌.

అతను తనకు ఎంత పొడవు పరిచయమో తెలియదు కాని ఈ కొద్ది పరిచయంలోనే ‘నువ్వూ’ అని పిలవటం ఆమె గమనించినా లైట్‌ తీసుకుంది. వాత్సల్యతో తనకి జాబ్‌ ఇప్పించలేనని చెప్పి, తన ఫైల్‌ ఎందుకు తీసికెళ్లాడో అర్థమవుతున్నా అతను అర్థం కావడంలేదు. అయినా అతనితో తనకేం పని! జాబ్‌ వస్తే చాలనుకుంది.

మేనేజర్‌ ఛాంబర్‌లోకి వెళ్లిన హేమంత్‌ ఓ అర్ధగంట తర్వాత ఆరాధ్య దగ్గరకి వచ్చి… ”ఆరాధ్యా! నీకు జాబ్‌ వచ్చింది. ఆర్డర్స్‌ పంపుతారు. అయితే నీకు ఈ బిల్డింగ్‌లో జాబ్‌ రాలేదు. ఇక్కడికి ఓ కిలోమీటర్‌ దూరంలో వుండే బిల్డింగ్‌లో వచ్చింది. అదికూడా మా బ్రాంచే” అన్నాడు.

”నాకు ఏ బిల్డింగ్‌లో వచ్చినా పర్వాలేదు. చేస్తాను. థాంక్యూ! మీపేరు తెలుసుకోవచ్చా?”

”నా పేరు హేమంత్‌!” అన్నాడు.

”జాబ్‌ రావడం ఇంత ఈజీనా హేమంత్‌గారూ?” అని అడిగింది ఆరాధ్య.

”నువ్వు అనుకున్నంత ఈజీయేం కాదు. నీకు జాబ్‌ ఇచ్చేముందు నా రిఫరెన్స్‌ తీసుకున్నారు” అన్నాడు.

ఆశ్చర్యపోయింది ఆరాధ్య. ఎంతో క్లోజ్‌గా వుండి, బాగా కావలసిన వ్యక్తులకి రిఫరెన్స్‌ ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు. అలా ఆలోచించే రాకేష్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. రాకేష్‌ అలా హ్యాండ్‌ ఇవ్వడం వల్లనే తను ప్రతిచోటా రాకేష్‌లాంటి వాళ్లే వుంటారనుకుంది. అది తప్పు. హేమంత్‌ లాంటి వాళ్లు కూడా వుంటారు. అలా వుండబట్టే కదా! ప్రతి ఊరిలో, ప్రతి సిటీలో, ప్రతి సెంటర్లో దేశనాయకుల విగ్రహాలు కన్పిస్తుంటాయి. చివరికి గ్రామదేవత గుడి ముందు కూడా పోతరాజు నిలబడి వుంటాడు. మగవాళ్లెప్పుడూ ప్రొటక్టివ్‌, ప్రొడక్టివ్‌ పర్సన్సే! అందుకే వాళ్లకి వుండాల్సిన చోట వుండాల్సినంత ఇంపార్టెన్స్‌ వుంటుంది. ఒక్క రాకేష్‌ లాంటి వాళ్లకి మాత్రం ఎక్కడా ఏదీ వుండదు. వాడు బ్రతికి మళ్లీ తనకి కన్పిస్తే ఈసారి వాడి ముఖం కూడా చూడకూడదు. వాడ్ని ఈ క్షణం నుండే తన ఫ్రెండ్‌గా మరచిపోవాలి అనుకుంది ఆరాధ్య.

”ఏంటి! ఆరాధ్యా! ఆలోచిస్తున్నావ్‌?” ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్న హేమంత్‌ నెమ్మదిగా అడిగాడు.

”ఏం లేదు హేమంత్‌ గారు! మీరు నాకు చాలా హెల్ప్‌ చేశారు. మీలాగే ఒక ఆంటీ కూడా నాకు షెల్టర్‌ ఇచ్చి హెల్ప్‌ చేశారు. మీలాంటి వాళ్లు వుంటారా అని ఆలోచిస్తున్నాను”

నవ్వి ”వున్నాం కదా! దానికింత ఆలోచన దేనికి?” అన్నాడు హేమంత్‌.

”మీకు నేను తెలిసింది తక్కువ. మీరు నాకు చేసింది ఎక్కువ” అంది కృతజ్ఞతగా.

”అంటే ఒక మనిషి ఇంకో మనిషికి తెలియాలీ అంటే ఒక జీవితకాలం అవసరం అనుకుంటున్నావా? అంత అవసరం లేదు ఆరాధ్యా! జస్ట్‌ ఇంట్రెస్ట్‌ వుంటే చాలు. ఈ అమ్మాయికి ఈ హెల్ప్‌ చేస్తే సేఫ్‌జోన్‌లోకి వెళ్తుందన్న ఆలోచన వుంటే చాలు. నాలాగే మీ ఆంటీలో కూడా ఇలాంటి ఆలోచనే కలిగి వుండొచ్చు. అందుకే మేమిద్దరం నీకు చేసిన హెల్ప్‌ కోఇన్‌సైడ్‌ అయింది” అన్నాడు.

అతన్ని చూస్తుంటే ఏదో సేఫ్‌ ఫీలింగ్‌ కలుగుతోంది ఆరాధ్యకి… కొద్దిసేపయినా అతని పక్కన నిలబడాలనిపిస్తోంది. అలా అన్పిస్తున్నందుకు ఆశ్చర్యంగా వుంది.

”నువ్విక ఇంటికెళ్లు ఆరాధ్యా! వాత్సల్యకి కాల్‌ చేసి చెప్పు! నేను నీకు రిఫరెన్స్‌ ఇచ్చానని… సంతోషపడుతుంది” అన్నాడు. అతనికి తెలుసు వాత్సల్య అడిగినందుకు ఆరాధ్యకి జాబ్‌ ఇప్పించలేదు… తనకే ఆరాధ్య పట్ల ఏదో స్పెషల్‌ అట్రాక్షన్‌+ప్రేమ+ఇంకా ఏదో వుండటం వల్లనే ఇప్పించాడని… ఇవి కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషికి ఒక్కక్షణంలోనే కలుగుతాయి. ఒక జీవితకాలం అవసరం లేదు.

”ఏంటీ! ఆలోచిస్తున్నారు. నేనిక వెళ్తాను. ఓ.కె. బై…” అంటూ ఆరాధ్య హేమంత్‌ చూస్తుండగానే ఆ ఆఫీసులోంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది.

అప్పుడొచ్చాడు కాశిరెడ్డి ”రే! హేం! ఇవాళ బస్సెక్కేటప్పుడు ఏం జరిగిందో తెలుసా?” అన్నాడు.

”ఏం జరిగింది?” అన్నాడు హేమంత్‌. ఆఫీసుకొచ్చాక ఆరాధ్య పనిలో పడి కాశిరెడ్డి, రాకేష్‌ ఆఫీసుకి రాలేదన్నది తెలుస్తున్నా దాని గురించి ఆలోచించలేదు హేమంత్‌. మార్నింగ్‌ బస్‌లో కూడా వాళ్లు వున్నారో లేదో చూసుకోలేదు. సాంగ్స్‌ వింటూ కళ్లు మూసుకున్నాడు.

”నీకు ఫోన్‌ చేసి చెబుదామంటే నువ్వు బిజీగా వున్నట్లున్నావు. కాల్‌ లిఫ్ట్‌ చెయ్యలేదు. నువ్వు బస్సెక్కాక మేము కిందనే ఆగిపోయాం. ఎందుకో  తెలుసా? బస్‌లోంచి సడన్‌గా ఒకమ్మాయి దిగి రాకేష్‌కి కన్పించగానే వాడు దొంగలా పరిగెత్తి ఓ బైక్‌కింద పడిపోయాడు. అది చూసి ఆ అమ్మాయి భయపడి పరారయింది. నేను వాడ్ని ఇంటికి తీసికెళ్లి పడుకోబెట్టాను. అదృష్టం బాగుండి దెబ్బలేం తగల్లేదు” అన్నాడు.

”దెబ్బలు తగలకపోతే పడుకోబెట్టటం ఎందుకు? నెక్ట్స్‌ బస్‌లో ఆఫీసుకి వచ్చెయ్యాల్సింది” అన్నాడు హేమంత్‌.

”పైకి కన్పించని దెబ్బలేవో తగిలినట్లే వున్నాయి హేం! పది రోజుల వరకు హైదరాబాదు రానని ఇంటికెళ్లాడు. అసలు ఆ అమ్మాయి వాడి వెంట ఎందుకు పడిందో చెప్పమంటే ఎంత అడిగినా చెప్పలేదు. రాకేష్‌ వెనక ఏదో పెద్ద క్రైం స్టోరీనే వున్నట్లు వుంది. వాడ్ని మన రూంలో వుంచుకోవద్దు. వెళ్లనని గొడవ పడినా సరే! పంపించి వేద్దాం!” అన్నాడు కాశిరెడ్డి.

”ఫ్రెండ్‌ కదా! ఆలోచించి పంపించివేద్దాంలే! తొందరపడకు” అన్నాడు హేమంత్‌.

”ఓ.కె.” అన్నాడు కాశిరెడ్డి. అతనెప్పుడూ హేమంత్‌ మాట కాదనడు. కానీ రాకేష్‌ మూమెంట్స్‌ చూస్తుంటే ”ఆ అమ్మాయి ఎవరు?” అని ఇంకో రెండుసార్లు అడిగితే అతనే రూం ఖాళీ చేసి వెళ్లేలా వున్నాడు. అదే ఆలోచిస్తూ హేమంత్‌తో కలిసి లోపలకెళ్లి తన క్యూబికల్‌ వైపు నడిచాడు కాశిరెడ్డి.

హేమంత్‌ చాలా హుషారుగా తన పని తను చేసుకుంటూ కూర్చున్నాడు.

* * * * *

తనకి జాబ్‌ దొరికిందన్న ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియనంతగా ఆనందపడుతోంది ఆరాధ్య. వాత్సల్యకి కాల్‌ చేసి చెప్పింది. అది విని వాత్సల్య చాలా సంతోషపడింది.

తల్లికి కాల్‌ చేస్తే ఆమె లిఫ్ట్‌ చెయ్యలేదు. తండ్రికి చేస్తే లిఫ్ట్‌ చేసి ”మీ మమ్మీ నీ కాల్‌ వచ్చినప్పుడల్లా దానికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు భయపడుతోంది ఆరాధ్యా! నువ్వేమో శార్వాణి గారి అకౌంట్‌ నెంబర్‌ ఇచ్చి డబ్బులు వెయ్యమన్నావట… ఆ డబ్బు కోసమే వేరేవాళ్లను అడిగింది. వాళ్లు ఎప్పుడిస్తే అప్పుడు నీకు పంపుతుంది. స్వీట్‌ హౌజ్‌ బాగా నడవటం లేదు. నువ్వు మీ మమ్మీని తొందరపెట్టకు” అన్నాడు శాంతారాం.

”నేనిప్పుడు కాల్‌ చేసింది డబ్బుకోసం కాదు డాడీ! నాకు జాబ్‌ వచ్చిందని చెప్పటానికి…” అంది.

”అప్పుడే మీ మమ్మీకి ఈ సంగతి చెప్పకు ఆరాధ్యా! చెప్పావంటే నీకు డబ్బులు పంపదు. నువ్వీ మధ్యన శార్వాణి గారి దగ్గర తీసుకున్న డబ్బుల్ని నీకు శాలరీ వచ్చాక కట్టుకోమంటుంది” అన్నాడు.

”పర్వాలేదులే డాడీ! అలాగే కడతాను. మమ్మీనెందుకు బాధపెట్టటం… నాకోసం ఇంకెవరినీ డబ్బులు అడగొద్దని చెప్పు! నాకు జాబ్‌ వచ్చిందని కూడా చెప్పు! సంతోషపడుతుంది” అంటూ కాల్‌ కట్‌ చేసింది.

శార్వాణి మొబైల్‌ సిచ్ఛాఫ్‌లో వుండటంతో ఆరాధ్యకు జాబ్‌ వచ్చిన విషయం ఆమెదాకా వెళ్లలేదు.

గేటు తీసుకొని లోపలికి వెళ్తుంటే- అక్కడ కూర్చుని వున్న పక్కింటి వీరాస్వామి ఆరాధ్యను చూడగానే ”ఇలా రామ్మా ఆరాధ్యా!” అంటూ పిలిచాడు. ఆమె ‘ఏంటంకుల్‌?’ అని ఆయన దగ్గరకివెళ్లగానే ఆయన శార్వాణి భర్త ఉపేంద్రకి ఆరాధ్యను పరిచయం చేశాడు.

ఉపేంద్ర అనంతపూర్‌ నుండి అప్పుడే వచ్చినట్లుంది. ఆఫీసుకి వెళ్లకుండా వీరాస్వామి దగ్గర కూర్చుని వున్నాడు. వాళ్లిద్దరు ఇంట్లో వున్నంతసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటుంటారని ఒకసారి మాటల మధ్యలో శార్వాణి చెప్పటం గుర్తొచ్చి

”నమస్తే! అంకుల్‌!” అంది.

ఉపేంద్ర తలవూపి మౌనంగా వున్నాడు. ఆమెనేం పెద్దగా పట్టించుకోలేదాయన… ఏదో నాలుగు రోజులు వుండిపోతుందిలే! ఈ అమ్మాయితో తనకేంటి అన్నట్లున్నాడు. ఆరాధ్య అలా లేకుండా ఆయనవేపు పరిశీలనగా చూసింది. ఆయనకి వయసు వున్నా- శరీరం ఆరోగ్యంగా వున్నందువల్లనో ఏమో వీరాస్వామికన్నా పుష్టిగా వున్నాడు.

”నువ్వు లోపలకి వెళ్లమ్మా! ఆరాధ్యా!” అన్నాడు వీరాస్వామి.

”అలాగే! అంకుల్‌!” అంటూ ఆమె లోపలకి వెళ్లబోతూ ఆగి ”అంకుల్‌! నాకు జాబ్‌ వచ్చింది. ఆంటీ ఆఫీసుకెళ్లారా?”

”వెళ్లిందమ్మా! వచ్చాక చెబుదాం! నేను హాస్పిటల్‌కెళ్లాలని ఒన్‌డే లీవ్‌ పెట్టి ఇంట్లో వున్నాను. ఉపేంద్ర వస్తే మాట్లాడుతున్నాను. కంగ్రాట్స్‌ ఆరాధ్యా!” అన్నాడు వీరస్వామి.

ఉపేంద్ర కూడా కంగ్రాట్స్‌ చెప్పాడు.

వాళ్ళిద్దరికి థ్యాంక్స్‌ చెప్పి ఆరాధ్య ఇంట్లోకెళ్లి శార్వాణి మార్నింగ్‌ పెట్టిన లంచ్‌బాక్స్‌ని బ్యాగ్‌లోంచి బయటకి తీసి ఓపెన్‌ చేసి తిన్నది. గదిలోకి వెళ్లి పడుకొంది.

శార్వాణి సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చింది.

కాఫీ కలిపి భర్తకిచ్చి ”ఆరాధ్యా! లేచి కాఫీ తాగు” అంటూ ఆరాధ్యను నిద్రలేపింది.

ఆరాధ్య నిద్రలేచి కాఫీకప్పు అందుకుంటూ శార్వాణివైపు చూసి ”ఆంటీ! నాకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ వచ్చింది” అంది.

”కంగ్రాట్స్‌ ఆరాధ్యా! మీవాళ్లకు చెప్పావా?” అని అడుగుతూ హాల్లోకి వెళ్లింది శార్వాణి.

శార్వాణి వెంటే హాల్లోకి వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ ”చెప్పాను ఆంటీ! హ్యాపీ అయ్యారు” అంది కాఫీ సిప్‌ చేస్తూ ఆరాధ్య.

ఉపేంద్ర అక్కడే వున్నాడు. శార్వాణి ఇంకేం మాట్లాడలేదు.

ఆంటీకి తను ఇక్కడ వుండటం ఇష్టం వున్నా అంకుల్‌కి వుండకపోవచ్చు! ఇన్నిరోజులు ఆయన లేకపోవటం వల్ల ఏమీ అన్పించలేదు కాని ఇప్పుడు తనిక్కడ వుంటే వాళ్లకు ఇబ్బంది కలగొచ్చు… పొమ్మని చెప్పలేక అలా మౌనంగా వున్నారేమో అని ”ఆంటీ! ఇప్పటికే నాకు చాలా హెల్ప్‌ చేశారు. ఇంకొక్క హెల్ప్‌ చెయ్యండి!” అని  రిక్వెస్ట్‌గా అడిగింది ఆరాధ్య.

”ఏంటమ్మా! ఏంటో అడుగు” అంది.

”నాకు జాబ్‌ వచ్చిందనే కాని ఇంకో నెల రోజుల వరకు నా చేతికి డబ్బులు రావు. అంకుల్‌ వచ్చారు కాబట్టి నేను హాస్టల్‌కెళ్తాను. అక్కడ అడ్వాన్స్‌ కట్టందే నన్ను హాస్టల్లో వుంచుకోరు. ఆ అడ్వాన్స్‌ మీరివ్వండి! శాలరీ రాగానే మీకు ఇస్తాను” అంది.

”సరే!” అంటూ లోపలకెళ్లి హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి కొంత డబ్బు తెచ్చి ఆరాధ్యకు ఇవ్వబోయింది శార్వాణి.

”శార్వాణీ! నువ్వాగు. ఆ అమ్మాయికి డబ్బులివ్వకు” అన్నాడు ఉపేంద్ర.

ఆయన అలా అనగానే శార్వాని ఇవ్వబోతున్న డబ్బుల్ని వెనక్కి తీసుకుంది. ఆరాధ్య స్టన్నయి చూసింది.

ఆరాధ్యకు ఉద్యోగం వచ్చిందన్న వార్త తెలిసినప్పటి నుండి ఆయన ఆలోచనలు వేరే విధంగా సాగుతున్నాయి. ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఎప్పుడెప్పుడు భార్యకు చెబుదామా అని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.

ఆయనకు డబ్బులు వచ్చే దారి ఎంత చిన్నది కన్పించినా ఆ దారి వెంట ఎంత కష్టమైనా నడవాలనుకుంటాడు. ఆయన తత్త్వమే అంత. ఆయనకు తాగుడు, జూదం, దొంగతనం లాంటి ఇంకా ఏ ఇతర చెడు అలవాట్లు లేవు. డబ్బును ప్రేమిస్తాడు. డబ్బును ఆరాధిస్తాడు. డబ్బులోనే జీవిస్తాడు. ఆయన డబ్బు కోసం చేసే ప్రయత్నాలు అయిష్టంగా అన్పించినా పైకి ప్రకటించకుండా తల వంచుకొని వెళ్తుంటుంది శార్వాణి. ‘నేను తల ఎందుకు వంచుకోవాలి? నాకు ఉద్యోగం వుంది. నేను మీ దగ్గర వుండను. వెళ్లిపోతాను. నాకు రెక్కలు వున్నాయి. ఎగిరిపోతాను’ అని ఆమె ఎప్పుడూ అనలేదు.

డబ్బుల్ని చేతిలో పట్టుకొని అలాగే మౌనంగా కూర్చుంది శార్వాణి.

”శార్వాణీ! ఇది నేను బాగా ఆలోచించే చెబుతున్నాను. దీనికి నువ్వేమీ అనకు… ఈ మధ్యన నువ్వూ, ఆరాధ్య తల్లీ, బిడ్డల్లా కలిసిపోయారు. అదృష్టవశాత్తూ ఆమెకు జాబ్‌ కూడా వచ్చింది. ఎలాగూ ఆ గదిని మనం వాడుకోవటం లేదు. ఆరాధ్యను అందులోనే వుండనీయ్‌! మనతో పాటే వుంటుంది. తనకి పెళ్లయి, వెళ్లిపోయేంత వరకు మన దగ్గరే వుంచుకుందాం! హాస్టల్లో వుంటే అక్కడ ఆరాధ్య ఎంత కడుతుందో ఆ డబ్బుల్ని నువ్వు తీసుకో!” అన్నాడు.

ఆరాధ్య తన ఇంట్లో వుండటం శార్వాణికి ఇష్టమే! కానీ దాన్ని భర్తే ప్రపోజ్‌ చేస్తాడని ఆమె అనుకోలేదు.

”ఆరాధ్య వయసున్న పిల్లలు హాస్టల్లో వుండటానికే ఇష్టపడతారు. తనిక్కడ వుంటే ఇన్‌కన్‌వీనియన్స్‌గా పీలవ్వొచ్చు. పైగా వాళ్ల వాళ్లు కూడా ఒప్పుకోవాలిగా!” అంది శార్వాణి.

ఆరాధ్య వెంటనే ”మావాళ్లు ఏమీ అనరు ఆంటీ! అంకుల్‌ చెప్పినట్లు నేను ఇక్కడే వుంటాను. నాకు హాస్టల్లో వుండటం అలవాటు లేదు. పైగా ఇక్కడ బస్సెక్కితే నేరుగా మా ఆఫీసు ముందు దిగుతాను. నాకు ఇక్కడే బావుంటుంది. నేను ఇప్పుడే మా వాళ్లతో మాట్లాడతాను” అంది.

”సరే! నీఇష్టం” అంది శార్వాణి.

ఉపేంద్ర లేచి వీరాస్వామి దగ్గరకి వెళ్లాడు.

ఆరాధ్య తల్లితో ఫోన్లో మాట్లాడుతూ తన గదిలోకి వెళ్లింది.

న్యూస్‌ పేపర్‌ చదువుతూ హాల్లోనే కూర్చుంది శార్వాణి.

ఆరాధ్య జాబ్‌కెళ్తోంది.

శాలరీ తీసుకున్న వెంటనే తన ఇంట్లో వున్నందుకు ఎంత ఇమ్మని ఉపేంద్ర చెప్పాడో అంత డబ్బు తీసికెళ్లి బ్యాంక్‌లో ఉపేంద్ర అకౌంట్లోనే కడుతుంది. ఉపేంద్ర, శార్వాణి, ఆరాధ్య ప్రతిరోజూ ఆఫీసులకెళ్లి వస్తున్నారు. ఆ ఇంటి ‘కీ’ ముగ్గురి దగ్గర వుంటుంది. ఎవరి టైం ప్రకారం వాళ్లు ఇంటికి వస్తుంటారు. ఆఫీసులకి కూడా అలాగే వెళ్తుంటారు.

ప్రతిరోజూ మాదాపూర్‌ పెట్రోల్‌పంపు దగ్గర బస్సెక్కి ఆఫీసుకి వెళ్లే ఆరాధ్య హేమంత్‌ బైక్‌ కొన్నాక హేమంత్‌ బైక్‌ మీద వెళ్తోంది. అతను ఆరాధ్య కోసమే బైక్‌ కొన్నాడు. ఎప్పుడో తప్ప రోజూ ఆమెను అతను మాదాపూర్‌ పెట్రోల్‌పంపు దగ్గర బైక్‌మీద ఎక్కించుకొని ఆఫీసుకి తీసికెళ్లి, ఆఫీసు అయ్యాక మళ్లీ అక్కడికే తీసుకొచ్చి వదులుతుంటాడు. శార్వాణి వాళ్ల ఇంటి దగ్గరికి మాత్రం అతను వెళ్లటం లేదు.  అలా అని వాళ్లు ముందే మాట్లాడుకున్నారు.

అప్పుడప్పుడు వాళ్లిద్దరు ఏదైనా రెస్టారెంట్‌కెళ్లటం, నచ్చిన ప్లేసులకి వెళ్లి కూర్చోవటం చేస్తుంటారు.

వాళ్లు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరిగినా ఎక్కువగా ఆఫీసుకి సంబంధించిన విషయాలే మాట్లాడు కుంటుంటారు.

ఇంకా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *