May 10, 2024

నువ్వు నేర్పిందే నాన్నా..! (తండ్రి – కూతురు)

రచన: కన్నెగంటి అనసూయkanneganti anasuya

ఆ రోజు శని వారం.
తెల్లవారుఝామునే లేచి వంటా టిఫిన్ రెండూ చేసేసాకా వేన్నీళ్ళు బకెట్లోకి కుమ్మరించి వాటిలో సరిపడా చన్నీళ్ళు కలిపి టవలూ డెట్టాలు సీసా అందుబాట్లో ఉంచుకుని తండ్రి దగ్గరకి వచ్చింది లేపటానికి
నిద్రపోతున్న తండ్రిని అలా చూస్తుంటే అస్సలు లేపాలనిపించలేదు శకుంతలకి.  కానీ తప్పదు .. టైము చూసుకుంది ..అప్పటికే తను వెళ్ళాల్సిన  సమయం దాటిపోయింది…”.. త్వరగా బయలుదేరాలి ..తప్పదు “  అనుకుంటూ  గత్యంతరం లేక నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపింది శకుంతల.
ఆయన లేచీ లేవటంతోనే “ముఖం కడుక్కుందువుగాన్నాన్నా…” అంటూ అతని వీపు వెనగ్గా చేతులుంచి మెల్లగా లేపి పైకెత్తి అతని వీపుకి తలగడ దాపెట్టి గోడకి జారబడేలా కూర్చోబెట్టింది.
తండ్రి పక్కకి ఒరిగిపోకుండా కూర్చోగలడని నమ్మకం కుదిరాకా ఆతని పక్క బట్టల్ని తీసేసి బయట వేసొచ్చి  అక్కడంతా శుభ్రం చేసి …అప్పటికే గోరు వెచ్చగా కాచి ఉంచిన నీళ్ళతో.. తండ్రిని ముందుగా శుభ్రపరచింది .  ఆ తర్వాత  ఆతని ముఖం కడిగాక బక్కెట్టెడు  నీళ్ళల్లో సీసామూతతో మూతడు  డెట్టాల్ వేసి..తడి బట్టతో తండ్రి ఒళ్లంతా తుడిచి, పౌడరద్ది అందుబాట్లో ఉంచుకున్న బట్టల్ని అతి కష్టం మీద మళ్ళీ అతనికి కట్టబెట్టి  పడుకోబెట్టింది
“నిత్యం స్వామి సేవలోనే తరిస్తూ ఉంటావయ్యా పావని శాస్త్రి .. నీకు పిల్లల్నిస్తే ఆయన్నెక్కడ మర్చిపోతావోనని నీకు పిల్లలు పుట్టకుండా చేసేసాడు  చూసావా.. అంటూ నవ్వేవాడమ్మా వేణుగోపాలస్వామి గుళ్ళో పన్జేసే విశ్వనాధ శాస్త్రి  నువ్వు పుట్టేదాకా .. ఆలస్యంగానే అయినా నువ్వు పుట్టాకా అనటం మానేసాడనుకో ..”
“ఆ భగవంతుడి లీల చూసావా?….నువ్వు ముందుగా పుట్టేసుంటే  ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి. దేవుడేం తెలివి తక్కువవాడు కాదమ్మా.. నిన్నిలా  ఆలస్యంగా భూమ్మీదకి పంపించింది   ఇలా  నాకు చాకిరీ  చేయటానికే …..”   అలా అంటూనే  ఉడుకుమోయాడు పావని శాస్త్రి …
ఈ సమయంలో రోజూ ఉండేదే ఆ బాధ..
ముద్ద ముద్దగానే అన్నా  స్పష్టంగా ఉన్న తండ్రి మాటలకి విసుక్కుంది శకుంతల ..
“ఊరుకో నాన్నా…నీకెన్నిసార్లు  చెప్పాను పొద్దున్నే కళ్ళంట నీళ్ళు పెట్టుకోవద్దని ..పొద్దున్నే కళ్ళవెంట నీళ్ళు పెట్టుకోవటం , నోటి దగ్గరకొచ్చిన ఆహారాన్ని కాలదన్నుకోవటం , నెత్తి  మీద చేతులుంచుకోవటం ఇంటికి అరిష్టమని నువ్వేగా చెప్తూ ఉండేవాడివి అందరికీ … ఎవరికెలా ఎక్కడ , ఎప్పుడు ఎలా రాసి పెట్టి ఉందో అలా జరక్క మానదు నాన్నా…నప్పేదీ , నడిపించేదీ అంతా ఆ పైవాడేనన్నమాటలు నీ నోటి వెంట లక్షలసార్లు  విన్నాన్నాన్నా నేను. ….కాబట్టి అవన్నీ మర్చిపోయి .. చక్కగా స్నానం చేయించుకున్నావేమో ఫ్రెష్ గా కనిపిస్తున్నావ్ గాని  జపం చేసుకో….” అంటూ  పక్క బట్టలు ఉతకటానికి సబ్బు తీసుకుని  పెరట్లోకి వెళ్ళింది..
తండ్రి పడుకునే చేసే ఆ పదిహేన్నిమిషాల ప్రాణాయామం పూర్తయ్యే లోపు .. పక్క బట్టలు ఉతికేసి డెట్టాల్ నీళ్ళల్లో ఒకటికి రెండుసార్లు కిందికీ పైకీ ఝాడించి పిండి దండెం మీద ఆరేసి వచ్చాకా  తండ్రి మంచం  కిందంతా కడిగేసి వాసన రాకుండా పినాయిల్ చల్లి తను స్నానానికి వెళ్ళింది.
స్నానం చేసొచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టి తను బొట్టుపెట్టుకున్నాకా, విభూతి భరిణె పట్టుకుని తండ్రి దగ్గరకొచ్చి “నాన్నా..!” అని పిలిచింది…
అప్పటికే  ప్రాణాయామం చేసుకోవటం పూర్తయ్యిందేమో చేసేదేం  లేక  కళ్ళు మూసుకుని పడుకున్న పావనిశాస్త్రి  కూతురి పిలుపు విని  “ఏమ్మా..” అంటూ కళ్ళు తెరిచి చూసాడు .. ఎదురుగా  విభూతి భరిణెతో కూతురు శకుంతల..
“నుదిటిన విభూతి రాస్తావా ?”
“అవున్నాన్నా..”
“ఒక్క నిమిషం తల్లీ ..” అంటూ ఎడం పక్కనున్న టవల్ తీసి నుదురు తుడుచుకుని
“ శ్రీకరం చం పవిత్రం  చ  శోక  రోగ నివారణం ..  లోక వశ్యకరం  పుంసాం  భస్మ త్రైలోక్యపావనం….”
అంటూ  అతి కష్టం మీద శ్లోకం చదివాడు . తండ్రి శ్లోకం చదువుతున్న ఆ సమయంలో ..శకుంతల చేతికి తడి చేసుకుని భరిణెలోంచి  కొంచెం విభూతి తీసుకుని తండ్రి నుదురు మీద అడ్డంగా మూడు చారలు వచ్చేట్టుగా విభూతి వ్రాసి మధ్యలో కుంకుం బొట్టు పెట్టింది ..
కుడి చేతికి ఎడమ కాలుకి పక్షవాతంరాగా ఏడాదిగా మంచం మీదే ఉంటున్నాడు .. అయినా శాస్త్రం తప్పకూడదంటాడు పావని శాస్త్రి .. అన్నీ యధావిధిగా జరగాల్సిందే..
భార్య జబ్బుచేసి ఎప్పుడో కాలం చేసింది.. దానికి తోడు  కొడుకులు లేకపోవటంతో.. కూతురు శకుంతలే అన్నీ చూస్తోంది.. అన్నదమ్ములున్నా ..ఎక్కడెక్కడో దూరంగా ఉండటం తో ఏదో అప్పుడప్పుడూ వచ్చి చూసెళ్ళటం తప్ప ఎవరేం చేయగలరు…ఎవర్నీ అనటానిక్కూడా లేదు…ఎవరి బాధలు వాళ్ళకున్నాయ్ .
బొట్టు పెట్టి పడుకోబెట్టాక  హడావిడి పడుతున్న కూతుర్ని చూస్తూ …
“ఏమ్మా..ఈ రోజు త్వరగా వెళ్ళాలా..?”  అన్నాడు…
“అవున్నాన్నా..శనివారం, ఆదివారం సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులందరికీ  శెలవు కదా.. ఇళ్ళల్లో ఖాళీగా  ఉంటారు . అందుకని  మా షాపుకి  ఆ రెండు రోజుల్లో  కష్టమర్ల  తాకిడి ఎక్కువ… మామూలు రోజుల్లో అంతమంది రారు. … నిజానికి నెలలో నాలుగు డబ్బులు వచ్చేది కూడా శని ఆదివారాల్లోనే ”   అంది తను అబద్దం చెబుతున్నట్టుగా తండ్రి ఎక్కడ గమనించేస్తాడోనని ముఖం పక్కకి తిప్పుకుంటూ..
“ అట్టాగూ…” అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు .
ఇంతలో లోనికెళ్ళి ప్లేటుతో ఇడ్లీ తీసుకొచ్చి తండ్రిని కూర్చోబెట్టి ఇడ్లీ తినిపించి.. మూతి కడిగి  మంచి నీళ్ళు పట్టిస్తూ….”  అరగంటలో రాజేశ్వరి వస్తానంది నాన్నా… నేనొచ్చేదాకా నీ దగ్గర ఉండటానికి .. రాత్రికి నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో…ఆ పిల్లని ఏమీ సతాయించకుండా చెప్పినట్టు విను ..సరేనా…” అంది వారం రోజుల్నాడు మధ్యాహ్నం పూట అన్నం తిననని రాజేశ్వరిని సతాయించటం గుర్తొచ్చి..
“మామూలు వాళ్ళకే ఏ  మార్పు లేని జీవితం రొటీన్ అనిపించి విసుగొస్తుంది .. …ఇక నాన్నలాంటి వాళ్ళకైతే చెప్పనే అక్కర్లేదు మరీను…ఎప్పుడూ చుట్టూ  పదిమంది ఉండటమే కాక ..ముహూర్తాలు పెట్టమనో , వారం వర్జ్యం చూడమనో ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు….!
అదొక్కటేనా ..  ఎంతమంది భక్తులు…? అంతమందిలో మసిలిన వ్యక్తీ ..పాపం.. రోజుల తరబడి ఇలా మంచం మీద పది ఉండటం విసుక్కాదా?” ఆలోచిస్తూనే నాలుగడుగులు వేసిందల్లా మళ్ళీ వెనక్కొచ్చి..
“వాళ్ళూ వీళ్ళూ వచ్చి  ఆ దేవుడి ప్రసాదమనీ , ఈ దేవుడి ప్రసాదమనీ , నీ  పేరూ గోత్రం చెప్పి ఫలానా గుళ్ళో పూజ చేయించామని , ఇది తింటే తగ్గిపోతుందని అంటూ గుళ్ళల్లో ప్రసాదాలవీ తెచ్చిస్తారు నాన్నా.. తీసుకుని పాపం నా కోసం కష్టపడి పూజ చేయించి మరీ తెచ్చారు కదా అని తినేయ్యకు .. తేడా చేస్తే ఇబ్బంది పడిపోతావ్ .. . ఖర్మకాలి ఏదన్నా తేడా చేసిందంటే  నువ్వు పడే బాధ  నేను చూడలేను…అమ్మాయొచ్చాకా తింటాన్లే అని పక్కనుంచు ..సరేనా..నాన్నా..”
శకుంతల మాటలకి  పావని శాస్త్రి ఏమీ మాట్లాడలేదు.. కదిలీ కదలనట్టు తలూపాడంతే ..
తండ్రినలా  చూస్తే  జాలేసింది  శకుంతలకి “పాపం నాన్న ..ఎలా ఉండేవారు ఎలా అయిపోయారో….” అనుకుంది ..అవున్నిజమే….
పౌరోహిత్యంలో పెద్దపులల్లె ఒక వెలుగు వెలిగిన మనిషి. ఎప్పుడు చూసినా చుట్టూ పదిమంది పురోహితులు .. పావని శాస్త్రి ఒక్క అడుగు వేస్తె వెంటనే వెనక పదడుగులు పడేవి.. ఎప్పుడూ ఏవేవో, పూజలూ హోమాలూ, పెళ్ళిళ్ళూ , గ్రహప్రవేశాలూ , అన్నప్రాసనలూ, అక్షరాభ్యాసాలూ , నోములూ , వ్రతాలు ఒకటేమిటి? ఏ కార్యక్రమానికైనా  పూజ చేయించటానికి పావని శాస్త్రిగారే కావాలి …ఒకరనేముంది …సినిమా యాక్టర్లూ, నిర్మాతలూ, దర్శకులూ, రాజకీయ నాయకులూ , పారిశ్రామిక వేత్తలు …వ్యాపారస్తులూ అందరికి ..అందరికీ ఆయనే …
పావనిశాస్త్రి  ముహూర్తం పెట్టినా, అలా తను పెట్టిన ముహూర్తానికి ఆయనే స్వయంగా వచ్చి కార్యక్రమం నడిపించినా  ..అది విజయవంతమవుతుందని అందరి నమ్మకం .. భక్తుల్లో ఆయన పట్ల ఉన్న ఆ నమ్మకమే ఆయన్ని శిఖరాగ్రాన  కూర్చోబెట్టింది. ఆయన మంత్రోచ్చారణ బలం అలాంటిది …
అన్నింటికీ ఆయనే కావాలంటే ..అది అయ్యే పని కాకపోయినా సాధ్యమైనంతవరకూ ఎవర్నీ నిరాశ పరిచేవారు కాదు. కానీ…ఆయన  వస్తానన్నారంటే  తప్పకుండా ..అది ఏ పెద్ద బ్యానర్ లో ..ప్రారంభించబోయే సినిమా పూజో,  లేదంటే ఏదో పెద్ద ఫ్యాక్టరీ కట్టటానికి  చెందిన భూమి పూజో , లేకపోతే ..ఏ ముఖ్యమంత్రో, మంత్రులో ..బాధ్యతలు స్వీకరించేటప్పుడు చేసే పూజో అయి ఉంటుంది .. అనుకోవటం పొరపాటే ..చిన్న పెద్దా, పేద ధనిక భేదభావాల్లేకుండా వీలుకుదిరినప్పుడల్లా  ఎవర్నీ నిరాశ పరచకుండా వెళుతూనే ఉండేవాడు..
ఏవైనా కారణాల వల్ల  “రాను.. కుదరదు..” అన్నారంటే ముహుర్తాలే మార్చేసుకునేవారు తప్ప  ఆయన రాకపోతే ఏ  కార్యక్రమామూ చేసుకునేవారు కాదు..ఆయన మంత్రోత్సారణల మీద అంత నమ్మకం ..
అయినా ఒక్కడు ఎన్ని చోట్లకని వెళ్ళగలడు? రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగే వయసు, దాంతోపాటుగా రెట్టింపుగా  పెరుగుతున్న అవకాశాలు. తను వెళ్ళే తీరికలేక తన దగ్గర వేదం , మంత్రాలు నేర్చుకోవటానికి వచ్చేవాళ్ళని పంపేవారు…
అదిగో అలా ఆయన కూడా కూడా ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న పూజైనా దొరక్కపోతుందా అన్న ఆశతో  ఆయన దగ్గర చేరిన ఎంతో మంది నిరుపేద బ్రాహ్మలు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులుగా ఉన్నారు..  మరికొంతమందయితే ఏకంగా కలసి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని విమానాలెక్కేసి విదేశీ గుళ్ళల్లో పూజారులుగా నిలదోక్కుకోకపోలేదు.
ఈనాటి పావనిశాస్త్రి పరిస్దితి వివరిస్తే ఎవరో ఒకరు సహాయం చేయకపోరు … కానీ అదేగా ఆయనకి నచ్చనిది .. పావనిశాస్త్రి ఆరోగ్యం సంగతి తెలిసి అప్పుడప్పుడూ ఎవరైనా కొంచెం సేపు వచ్చి చూసేళ్లినా ఎవరిక్కావాలి? ఎప్పటిదప్పుడే…ఎవరి పరుగులు వాళ్ళవి.. ఇదివరకట్లా ఇంకొకరి బాధల్లో పాలుపంచుకోవటం మాట అటుంచి కనీసం వినటానిక్కూడా తీరిక లేనంతగా ఒకటే పరుగులు.     ఇప్పుడు వాళ్ళ కళ్ళకి పక్షవాతంతో బాధపడుతున్న పావనిశాస్త్రి ఏమి ఆనతాడు ..వాళ్ళ దృష్టిలో అతనొక ‘ ముసలి బాపనోడు ‘ .
పావనిశాస్త్రి ప్రభ బాగా వెలుగుతున్న రోజుల్లో ఎవర్ని ఏ కార్యక్రమానికి ఏ మూలకి పంపించినా దక్షిణ తాంబూలాలతో పాటుగా రోజూ ఎంత లేదన్నా రెండు మూడు బస్తాల బియ్యం , రెండు మూడు కుంచాల కందిపప్పూ స్వయంపాకం రూపంగా వస్తూనే ఉండేవి …  వాళ్ళవన్నీ తెచ్చి  పావని శాస్త్రిగారికి  ఇచ్చేయ్యాల్సిందే ..అలా అని అన్నీ ఆయనే ఉంచేసుకుంటాడా అంటే అదేమీ లేదు ..అలా వచ్చిన బియ్యం , పప్పులూ  కూరగాయలూ అన్నీ ఒకచోట పోగెట్టి , లేనివాళ్ళకి ఎక్కువా, ఫర్వాలేదు అనుకున్న వాళ్లకి కాసిన్ని తక్కువా అన్నట్టుగా మొత్తం  పెదవాళ్లకే పంచేసే వాడు.
అలా  ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టుగా పంచిపెట్టేయ్యటమే కానీ ఏనాడు రేపేవిటి అన్న ఆలోచనే లేకపోయింది అతనికి.. ఏనాడూ ఇది నాకని కానీ, నా కుటుంబానికని గాని ఆలోచనే చెయ్యలేదు..   శాస్త్రిగారి  చేతికి ఎముక లేదనేవాళ్ళు ఆయన గురించి తెల్సిన వాళ్ళు..
“అంతా దానాలకేనా ..పిల్ల ఎదుగుతూందని” ఎవరైనా అంటే  ..“ పురోహితులకి రిటైర్మెంటేవిటి..నేనెంత ముసలివాడినైతే…నాకన్ని ..పూజలూ పౌరోహిత్యాలూను…పిల్ల పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉందిలే ..ఆ పైనాయన చూసుకోడూ ..” అని తేలిగ్గా తీసిపారేసేవాడు ..
అయితే పిల్ల ఓ దారికి రాకుండానే భార్య కాలం చేస్తే ..మాత్రం  అంత తేలిగ్గా తీసుకోలేక పోయాడతను ..   ఏనాడు ముడిపడిన  బంధమో…..ఒకరకంగా తట్టుకోలేక పోయాడు…
చివరికి ఆ బెంగతోనే అనారోగ్యం పాలై .. క్రమక్రమంగా ఇదిగో ఇలా ..
ఆయన పౌరోహిత్యం చేసినన్నాళ్ళూ వచ్చేవాళ్ళూ , వెళ్ళే వాళ్ళతో ఎప్పుడూ కళకళ లాడుతూ ఉండే ఇల్లు ,   ఆవిడ మరణంతో అంతా చిన్నాభిన్నమై పోయింది ..మీద పడ్డ వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం ..దానికి తోడు వెనక్కి తిరిగి చూసుకుంటే పెళ్లి కాని పిల్ల తప్ప ..తినటానికి తిండి కూడా వెతుక్కోవాల్సిన పరిస్దితులు దాపరించాయి . ఆయన తన చూపులు తమ వైపు సారిస్తేనే చాలు భగవంతుని అనుగ్రహం దొరికినట్టే అన్నట్టుగా ఉండే వాతావరణం కాస్తా ఆయన్ని చూడ్డానికేల్తే ఎం పట్టుకెల్లాలో లే .అయినా ఇంకెందుకు? అన్నట్టుగా మారిపోయాయి పరిస్దితులు.
“ఎలా ఉండేవారు ఎలా అయిపోయారో…’’ ఆలోచిస్తూనే ..“సరే నాన్నా.” అంటూ తలుపు దగ్గరకేసి…బస్టాపుకేసి అడుగులేసింది…
రెండు బస్సులు మారితేనే కాని గమ్యం రాలేదు ..
బస్ దిగీ దిగటంతోనే అప్పటికే ఆలస్యం అవటంతో ..అక్కడికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న శివాలయం కేసి  వడివడిగా నడిచింది శకుంతల .
గుడి ప్రాంగణం అంతా  భక్తులతో కిటకిటలాడుతూంది … ఖంగూ ఖంగుమంటూ మోగుతున్న గుడిగంటల శబ్డం , పూజారుల మంత్రోచ్చారణల  శబ్దంతో  కలిసిపోయి అక్కడంతా అదోలాంటి పవిత్ర వాతావరణం నెలకొంది..
గుడి బయట అక్కడక్కడా పెట్టిన చిన్న చిన్న దుకాణాలూ,  గుడికి ఒక పక్కగా చిన్న చిన్న పందిర్లలా  వేసుకుని పళ్ళూ పూలూ, టెంకాయలూ అమ్ముతున్న వ్యాపారస్తులూ, గుడి మెట్లపక్కగా వరసగా కూర్చుని చెయ్యి చాపుతూ  యాచిస్తున్న బిచ్చగాళ్ళతో ఇక్కడేదైనా తిరనాళ్ళ జరుగుతుందా అన్నట్టుంది.
మామూలప్పుడైతే  ప్రతి రోజూ మరీ ఇంత కాకపోయినా  ఆ గుడి పరిసరాల్లో ఇలాంటి వాతావరణమే  కనిపించినా , ప్రత్యేకంగా  శని త్రయోదశి రోజు మరింత కోలాహలంగా ఉండి పండుగనే తలపిస్తూంది .
ఆ పరమశివుని దర్శనం కోసం, అభిషేకాలు , అర్చనలూ చేయించుకునేవారు సరేసరి ..
కానీ ఎక్కువగా ఆ గుడికి శనీశ్వరుని పూజకోసం,  దానాలిచ్చి తమకొచ్చిన కష్టాల నుంచి విముక్తులను చెయ్యమని ఆ దేవదేవున్ని వేడుకోవటం కోసం అవసరమైన దినుసులతో తెల్లవారు ఝామున నాలుగ్గంటల నుంచే బారులు తీరి నిలబడతారు భక్తులు.. బాగా పురాతన శివాలయం కావటంతోనూ, చుట్టూ మారేడు, రావి , వేప చెట్లతో విశాలమైన ప్రాంగణం కావటమే కాక  అక్కడికి ఎటు చూసినా పది కిలో మీటర్ల దూరంలో ఎక్కడా నవగ్రహాలు లేకపోవటంతో ఆ పరిధిలో ఉండే వాళ్ళంతా ఈ గుడికే వస్తూంటారు ..
ఇక కార్తీక మాసం నెల రోజులూ చెప్పనే అక్కర్లేదు…భక్తులతో కోలాహలంగా ఉంటుంది అక్కడంతా..
ఆ  రోజు శనిత్రయోదశి కావటంతో రకరకాల కారణాలతో శనీశ్వరునికి పూజలు చేయటానికి , దోషపరిహారార్ధం  దానాలు చేయటానికి భక్తులు శివాలయానికి పోతెట్టుతారని శకుంతలకి ముందే తెలుసు . కాని ఎంత ముందు తెలిసినా ఇంట్లో అనారోగ్యంగా ఉన్న తండ్రితో ఇంతకంటే ముందు  రాగలగటం ఆమెకి అసాధ్యమే..  ఆ విషయం ఆలయ ప్రధాన పూజారి , ఒకప్పటి పావని శాస్త్రి స్నేహితుడు అయిన శివరామశాస్త్రికి ముందే చెప్పింది..అతనికీ పరిస్దితంతా తెలుసు కాబట్టి కాస్తంత కష్టమైనా సరేనన్నాడు ..
ఆలోచిస్తూనే దైవదర్శనార్డం క్రిక్కిరిసిన భక్తుల్ని అతి కష్టం మీద ఛేదించుకుని  గుడిలోకి వెళుతూనే , అక్కడున్న ధ్వజస్దంభాన్ని కుడి చేత్తో తాకి నమస్కారం చేసుకుని , ప్రధాన ఆలయం లోపలి వెళ్లి నందీశ్వరుని కొమ్ములపై రెండు వేళ్ళూ ఉంచి వాటి  మధ్యగా శివుని దర్శనం చేసుకున్నాకా బొట్టు పెట్టుకుని వడివడి అడుగులతో ఆలయ ప్రాంగణంలోనే గుడి వెనక  ప్రసాదాలు చేసే వంటింట్లోకి వెళ్లి పర్సుని ఎవరికీ కనపడకుండా అక్కడున్న బియ్యం బస్తాల  మూలగా  దూర్చి బయట తాడు మీద ముందు రోజు వెళుతూ వెళుతూ తడిపి ఆరేసిన వస్త్రం నడుం చుట్టూ కట్టుకుని గబా గబా నవగ్రహాల దగ్గరకి వచ్చింది..
అక్కడ నవగ్రహాల దగ్గర శని దేవుని  వలన కలుగు సమస్త దోషాలను నివారించుకోవటానికి ఆయురారోగ్య, ఐశ్వర్యాభివ్రద్ది కోసం , స్వామివారి సన్నిధికి స్వయంగా వచ్చి స్వామి వారికి తైలాభిషేకాలూ, నల్ల నువ్వులూ , ఉప్పూ దానాలూ చేసే భక్తుల నుంచి మంత్రాలు చదువుతూనే దానాలు స్వీకరిస్తూ శకుంతల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడేమో…ఆలయ ప్రధాన అర్చకుడు శివరామశాస్త్రి, శకుంతలను చూస్తూనే త్వరగా రమ్మన్నట్టుగా సైగచేసి, శకుంతల రాగానే.   కూర్చున్నచోటు నుంచి లేస్తూ..
“ అంతా వరుసల్లో రండమ్మా…దీపాలున్నాయ్ చూసుకోండి…” అంటూ భక్తుల్ని హెచ్చరించి తదుపరి తంతుని శకుంతలను నడపమన్నట్టుగా అక్కడ్నించి గబగబా వెళ్లి పోయాడు ప్రధాన ఆలయానికి.
శకుంతల తండ్రి పావనిశాస్త్రి తనకి చేసిన ఉపకారానికి గాను , ఆయన  అనారోగ్యం కారణంగా వారి కుటుంబం ఇబ్బందుల్ని అర్ధం చేసుకుని ఆమెని అక్కడా పనిలో పెట్టటానికి సర్వశక్తులూ వడ్డాల్సి  వచ్చింది అతను.   అతని సిఫార్స్ కి అక్కడున్న మరికొంతమంది పూజారులు అడ్డు చెప్పనే చెప్పారు..
శాస్త్రానికి వ్యతిరేకమన్నారు  .. అధోలోకాల ప్రాప్తి తప్పదన్నారు ..అయినా పట్టించుకోలేదతను ..కమిటీవాళ్ళ దగ్గర తనకున్న పరపతిని , మంచితనాన్ని ఫణంగా పెట్టి ఆమె తండ్రీ, తాతల పుట్టు పూర్వోత్తరాలని , ఒకప్పుడు వేదాలన్నీ తెలిసిన గొప్ప పండితుడిగా పావనిశాస్త్రి  సమాజంలో వెలుగు  వెలిగిన తీరు, పేదవాళ్ళ ఆకలి తీర్చటానికి తన సర్వశక్తుల్నీ ఎలా దారబోసిందీ ..వాళ్లందరికీ వివరించి తల్లిదండ్రులు చనిపోతే వారి ఆత్మశాంతి కోసం, ఉత్తమగతుల ప్రాప్తి కోసం…వంశోద్దారకుడు చెయ్యాల్సిన అంత్యక్రియలనే కాదు  శ్రాద్దకర్మలను కూడా ఆడాళ్ళే నిర్వహిస్తున్న ఈ రోజుల్లో….పెళ్ళిళ్ళల్లో , పూజల్లో కూడా స్త్రీలు చాల ఉత్సాహవంతంగా తమ ప్రతిభాపాటవాలు కనపరుస్తున్న ఈ రోజుల్లో ఆలయంలో పూజారిణిగా నియమిస్తే తప్పేమీ లేదని ఉదాహరణలతో సహా కమిటీ వాళ్ళతో  వాదించి గెలవగాలిగాడు…
ఆ గెలుపే పావనిశాస్త్రికో ముద్ద పెట్టగలుగుతూంది ఇప్పుడు..
అక్కడికి వస్తూనే ముందుగా ..
“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ,
చాయామార్తాండ సంభూతం  తమ్  నమామి శనైశ్వరం..”
అంటూ శనీశ్వర శ్లోకం రాగయుక్తంగా పఠిస్తూనే మధ్య మధ్యలో  …ఆలస్యం అయిపోతూందని  అప్పటికే గోల గోలగా అరుస్తూ నాకు ముందంటే నాకు ముందని అంతకంతకీ మీది మీదికి వచ్చేస్తున్న  భక్తుల్ని లైన్లో రమ్మని ఒక పక్క సూచనలిస్తూనే ..మరోపక్క  మంత్రాలు చదువుతూ   భక్తులు తీసుకుని వచ్చిన నల్ల నువ్వుల్ని ,  తైలాన్ని, ఉప్పునీ దానంగా తీసుకుని  , దీపం వెలిగించమని చెప్పి దానికి సంభందించిన విధి విధానాలను పాటిస్తూ పూజ చేసి అంతా అయిపోయాకా భక్తులను తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ తిరిగి శివాలయం లోకి వెళ్లి శివున్ని దర్శించుకుని ఇళ్ళకి వెళ్లి మళ్ళీ తలంటు స్నానం చేసి విడిచిన బట్టల్ని తడిపెయ్యమని అలవాటుగా ,, అలవోకగా చెప్పేస్తూంది…
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ..నిర్విరామంగా అలా సాగుతూనే ఉంది..ఆ తంతు.. ఎవరైనా కాళ్ళకి దండం పెట్టి దక్షిణ ఇస్తే తీసుకుంటుంది ..లేకపోతే లేదు..కాని ..ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు .. భక్తుల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకం వాళ్ళతో ఏమైనా చేయిస్తుందన్నట్టుగా  కొంతమంది
“ ఆడకూతురు…పైగా పెళ్ళికాని ఆడపిల్లంటే బాల త్రిపుర సుందరే ..” అంటూ శకుంతల కాళ్ళకి దండం పెట్టి పసుపూ కుంకుమగా  చీరా జాకిట్టూ పెడుతూనే .. “ చల్లగా ఉండమ్మా…మా శని వదలగొట్టే పనిలో నువ్వెంత శనిని  మూటగట్టుకుంటున్నావో ..అసలే ఆడకూతురివి …ఈ వృత్తిలోకి దిగావంటేనే నువ్వెంత సమస్యల్లో ఉన్నావో తెలుస్తుంది తల్లీ ..పర్లేదులే ..ఉంచు “ అంటూ అరటి పళ్ళూ , తమలపాకుల్లో పెట్టి ఎంతో కొంత దక్షిణ ఇచ్చేవాళ్ళే కాదు,
“ఇదేంటి ..శనీశ్వరుడి గుళ్ళో ఆడాళ్ళా…? హవ్వ..ఇదేం  చోద్యం ..ఎక్కడన్నా చూసామా…” ముఖం మీదే అంటూ బుగ్గలు నొక్కుకున్న వాళ్ళనీ చూసింది..
చిత్తం చెప్పుల వైపు ,  దణ్ణం దేవుని వైపు  అన్నట్టు అంత  హడావిడిలో కూడా శకుంతల మనసునిండా ఆలోచనలు ఈగల్లా ముసురుతున్నాయ్….
అంతలోనే తండ్రి గుర్తొచ్చాడు . ఆ వెనుకే ఎన్ని సందేహాలో…రాజేశ్వరి వచ్చిందో లేదో? నాన్న ఒక్కరే ఉన్నారేమో..? ఒక్కరే ఉంటే ..అమ్మో ..ఏమైనా జరిగితే ? ఆ ఊహే భరించలేక  ..గబుక్కున కూర్చున్న చోటు నుంచి లేచి ..భక్తులనే చూస్తూ ..
“ ఇప్పుడే వస్తాను ..ఉండడమ్మా…ఈ లోపు ప్రమిదలలో నూనె పోసి , దాన్లో వత్తు వేసి వెలిగించండి “ అంటూ అక్కడున్న భక్తులకి పని పురమాయించి వాళ్ళా పని చేసేలోగా తిరిగి వచ్చేయ్యవచ్చని గబ గబా  శివరామశాస్త్రి దగ్గరకెళ్ళి అతని సెల్ ఫోన్ తీసుకుని రాజేశ్వరికి ఫోన్ చేసి ఆమె వచ్చానని చెప్పాకా కాని మనసు మనసులో లేదు శకుంతల కి.
భక్తుల తలపై అక్షింతలు చల్లి శతగోపం పెడుతూ ఆమె ఆత్రుతనంతా గమనిస్తున్న శివరామశాస్త్రి ..“ఎందుకమ్మా కంగారుపడతావ్ ..అంతా బాగానే ఉంటుందిలే …అతనికి కాలూ చెయ్యీ ఆడటం లేదు కాని మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉందని మొన్న చూసిన డాక్టరు గారు చెప్పారు కదా..” అన్నాడు అనునయంగా ..అప్పుడే మరో విడత భక్తులు తెచ్చిన పూలూ పళ్ళూ పళ్ళెంలో వేయించుతూ..
తిరిగి ఫోన్ శివరామశాస్త్రికి ఇచ్చేస్తూ.. “ఏమో బాబాయ్ ..ఏం  చెప్పగలం ? ఇలా వస్తుందనుకున్నామా ? ఏమో ..! నా భయం నాది ..అందుకేగా ఉద్యోగం చేస్తే ఎ టైములో బడితే ఆ టైములో వెళ్ళనివ్వరని ..ఇందులో కుదురుకున్నది ..”  అంది వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ…
“పర్వాలేదు లేమ్మా ..స్వామికార్యం ..స్వకార్యం…రెండూ అవుతున్నాయి గదా..” అన్నాడు భక్తులిచ్చిన పాలపేకట్లు చించి పాలు గిన్నెలోకి వంచుతూ ..
జీవం లేని నవ్వొకటి నవ్వి అక్కడ్నించి వెళ్ళిపోయింది శకుంతల ..
ఆ మాత్రం ఆలస్యం కూడా భరించలేనట్టుగా భక్తుల ముఖాల్లో విసుగు .
“  పాపం .. విసుగు రాదా మరి. ఎప్పుడనగా లేచారో ..ఏమో..పరగడుపున వస్తే మంచిదని ఏమీ తినకుండా వస్తారు కదా..నిలబడీ నిలబడీ నీరసం వచ్చి..విసుగు రాక..మరేం చేస్తుంది….” మనసులో  అనుకుంటూనే  మంత్రాలు మొదలెడుతూంటే..
వరుసలో ముందున్న మధ్యవయసావిడ…..
“సల్లంగుండు తల్లీ…యాడనించో ఉరకలేత్తుకుంట  అచ్చిన…ఈడనో బిడ్డున్నది ..షని దేవున్కి పూజ మంచిగ జేస్తదని ..మావోల్లు జెప్తే ..అచ్చిన .. జర మంచిగ జయ్ పూజ..దెబ్బకి  నా బిడ్డకు రోగం బోవాలన్నట్టు ..నా తల్లి సల్లంగుండు..దార్లా..సమ్మక్కకు..సారలమ్మకూ మొక్కుకున్న…ఈయమ్మ రావాల్నా…వస్తే మంచిగుంటదన్నట్టు ..అన్కంటా అచ్చిన ..నువ్వొచ్చినవ్ ..నా కట్టాల్ గట్టెక్కినయ్ పో…”
అంటూ భారమంతా నీదేనన్నట్టున్న సంచిలోంచి సరుకుల్ని తీసి బైట పెట్టి ఆశగా తననే చూస్తున్న ఆమెనలానే  చూస్తూ శకుంతల తనలో తాననుకుంది…
“ చూసావా నాన్నా.. ఆవిడ ముఖంలో ఎంత ఆనందమో.. ఇవ్వటమే గాని తీసుకోవటం నేర్పలేదు నాన్నా .. నువ్వు. అందులోనే సర్వ సంతోషాలూ అన్నావు..ఇప్పుడు కూడా నేనేమీ తీసుకోవటం లేదు నాన్నా …ఇస్తున్నాను … వీళ్ళందరికి సంతోషాన్నే ఇస్తున్నాను . శని నివారణార్ధం వీటన్నింటినీ  దానంగా ఇచ్చేస్తే చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని   ఎంతో నమ్మకంతో వాళ్ళు చేసే ఈ దానాలని స్వీకరిస్తూ భక్తుల మనోభావాలని కాపాడ్డమే కాదు నాన్నా  వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ వాళ్లకి సంతోషాన్నే ఇస్తున్నాను నాన్నా..
ఇలా వాళ్ళ శనిని నేను స్వీకరిస్తూ ..అలా నాకు అంటిన  దోష నివారణార్ధం  నేను నిత్యం సంధ్యావందనం , గాయత్రీ మంత్ర జపం చెయ్యకపోయినా ..ఇలా వచ్చే డబ్బుల్తో నీ ఆకలి తీరుస్తూ ..నిన్ను బ్రతికించుకుంటూ నేను పొందే ఆనందం చాలు నాన్నా..ఇదీ ఇవ్వటమే కదా నాన్నా..
ఒకసారి నాతో నువ్వేమన్నావో ..గుర్తుందా నాన్నా…అవతలివాళ్ళకి ఆనందం కలుగుతుంది అనుకుంటే అవసరార్దం అబద్దం చెప్పినా ఫర్వాలేదమ్మా..అన్నావు నాన్నా…అందుకే ..ఒకప్పుడు మహారాజ వైభోగం అనుభవించిన నువ్వు , నీ కూతురు ఎవరైనా చనిపోయినప్పుడు చేసే 16 షోడశాదానాల్లో ఒకటైన నువ్వులూ , ఉప్పే కాదు, శనీశ్వరాలయంలో దానాలు కూడా స్వీకరిస్తుందని తెలిస్తే నువ్వెక్కడ బాధపడుతూ నాకు దక్కకుండా పోతావోనని, ఉద్యోగం  చేస్తున్నానని నీకు అబద్దం చెప్పాను.
ఎందుకు అబద్దం చెప్పానో తెల్సా నాన్నా…
వేదవేదాంగాలు ఔపోసన పట్టిన దక్షత గల పరమ పావన శాస్త్రి నాన్నా మీరు. మీరు ఇలాగే అయినా నా కోసం నిలబడాలి నాన్నా..మిమ్మల్ని దక్కించుకోవటం కోసం నేను అబద్దం చెప్పక తప్పలేదు నాన్నా    తప్పే అయినా ..
ఈ జన్మకిది చాలు నాన్నా ..

విశ్లేషణ- మంథా భానుమతి

పరమ నిష్ఠా గరిష్ఠుడు, క్రమం తప్పకుండా మూడు కాలాలూ సంధ్యావందనం చేస్తూ, గాయత్రీ మాతకి ప్రీతి పాత్రుడు అయిన పావన శాస్త్రి కుమార్తె శకుంతల. పావన శాస్త్రి లేనిదే ఊర్లో ఏ కార్యమూ జరగదు. ఆయన శిష్యకోటి దైవంలా కొలిచే గురువు. శాస్త్రిగారు పలికిందే వేదం, చెప్పిందే శాస్త్రం.
అటువంటి మహనీయుడి కడుపున పుట్టిన శకుంతల కూడా సకల శాస్త్రాలూ చదివి, ఇటు ఆధునిక విజ్ఞానాన్ని కూడా సముపార్జించింది.
మరి.. శకుంతల తండ్రికి తెలియకుండా, ఆయనకి అబద్ధం చెప్పి, శ్రాద్ధ కర్మలప్పుడూ, శని పూజలప్పుడూ నల్ల నువ్వులతో సహా దానాలు స్వీకరించి అదే వృత్తిగా జీవనం గడుపుతోంది. పోతనా మాత్యుడు చెప్పిన శుక్రనీతి ననుసరించి, “.. ప్రాణ విత్త మాన భంగమందు.. బొంకవచ్చు” అన్నట్లుగా మనస్సుకి సర్ది చెప్పుకుంటుంది.
ఏ ఇతర వృత్తినాశ్రయించినా తండ్రికి సేవ చేసుకోడానికి కుదరదని, తక్కువ సమయం గడపగలిగే, దానాలు స్వీకరించే పౌరోహిత్య వృత్తినాశ్రయిస్తుంది.. అందులోనూ శనిదోషం పోగొట్టడానికి ఇచ్చే నల్లనువ్వులు, ఉప్పు వంటి దానాలు.. అది కన్న తండ్రికి నచ్చదని తెలిసి కూడా.
ఇతరులకి ఆనందం కలిగించడానికి అబద్ధం చెప్పినా ఫరవాలేదని చెప్పిన తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుని, నువ్వు చెప్పిందే కద నాన్నా అనిమౌనంగా వేడుకుంటుంది.
ఆర్ద్రత ప్రధానమైన కథలు రాయడంలో శ్రీమతి కన్నెగంటి అనసూయ సిద్ధహస్తులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కధలు రాసి బహుమతులు అందుకున్నారు. ఎక్కువగా సమాజంలోని బడుగు వర్గాల సమస్యలు వీరి కథా వస్తువులు.  పల్లెల్లోని పలు రకాల కష్టాలను చూపిస్తూ, వాటికి పరిష్కారాలని కూడా సూచిస్తూ ఉంటారు.
రచనా వ్యాసంగం మాత్రమే కాక, సామాజిక సేవ కూడా వీరికి ఎంటో ఇష్టమయిన ప్రవృత్తి. రక్త దాన శిబిరాలను నిర్వహించడం, ఆడవారికి కుట్టు మిషన్ల పంపిణీ, రోజుకు గుప్పెడు బియ్యం పధకం.. వీరు చేసే సేవలలో కొన్ని.
అనసూయ మరిన్ని కథలు, నవలలు రాసి ప్రశంసలందుకోవాలని ఆశిద్దాం.

2 thoughts on “నువ్వు నేర్పిందే నాన్నా..! (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *