May 6, 2024

మాటా మంతీ – శివరాజు సుబ్బలక్ష్మి

రచన, ఇంటర్వ్యూ : విశాలి

subbalakshmi

శివరాజు సుబ్బలక్ష్మిగారు ప్రముఖ రేడియోలో ఆఫీసర్, కవి, చిత్రకారుడైన శివరాజు వెంకట సుబ్బారావు(బుచ్చిబాబు) గారి భార్య. ఒక కవికి, ప్రముఖ రచయితకు భార్యే కాదు స్వతహాగా ఈవిడ కూడా ఒక రచయిత్రి , చిత్రకారిణి.

పదకొండేళ్ల వయసులో వీరికి వివాహమయ్యింది. అంతకు పూర్వమే ఆవిడ సంస్కృత , తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించుకొన్నారు. వారి నాన్నగారు ఆవిడ కోసం  ఆయా భాషల ఉపాధ్యాయులను ఇంటికే పిలిపించి శిక్షణ ఇప్పించేవారుట. వివాహం అయ్యాక కూడా బుచ్చిబాబుగారి ప్రోత్సాహం తో వారు పలు కథలు, కథానికలు వ్రాశారు.

పెళ్ళయ్యాక  బుచ్చిబాబు గారు ఆవిడకు కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకొచ్చి, వాటిని చదివి నోట్స్ వ్రాసి ఇమ్మనేవారుట. ఈ విధంగా ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా ఆవిడకు ప్రవేశముంది. భార్య భర్తలు ఇరువురూ ఒకే రంగానికి చెందిన కళాకారులైనప్పటికీ వారిరువురి మధ్యన ఏ రోజూ పొరపొచ్చాలు రాలేదంటే వారిరువురిది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో కదా!

బుచ్చిబాబుగారు ఆల్ ఇండియా రేడియోలో పని చేయడం మూలంగా ఎప్పుడూ  వచ్చే అతిథులలో  వారిల్లు కళకళలాడేది. ఆవిడ ఒక చేతిలో పుస్తకంతో, ఇంకో చేతిలో వాయిలిన్ తో,  ఇంకో చేతిలో కుంచెతో, అపర సరస్వతిగానే కాకుండా వచ్చి వెళ్ళేవారికి ఎప్పుడూ వడ్డిస్తుండే  అన్నపూర్ణగా కనిపించేవారు.

కథలు – శైలి :

ఆవిడ పుట్టింది తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం. వారి తల్లితండ్రులు శ్రీ ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, శ్రీమతి సత్యవతి. ఆవిడకు ముగ్గురన్నదమ్ములూ, ముగ్గురప్పచెల్లెళ్ళు. ఆవిడ తండ్రి శ్రీ ద్రోణంరాజు సూర్యప్రకాశరావు గారు గాంధేయవాది కావడంతో ఆవిడ రచనలలో ఎక్కువ శాతం గాంధేయ సిద్ధాంతలు కనబడుతుంటాయి. ఆవిడ పెరిగిన ఊరి వాసనలు – పెంకుటిల్లు, నీళ్ళపొయ్యి డేశా, కొబ్బరాకుల గలగలలు.. మొదలైనవి  ఆమె కథలలో మెండుగా కనిపిస్తాయి.  ఆమె చుట్టుపక్కల వ్యక్తులే ఆవిడ కథల్లో పాత్రలు. వారి జీవితాలే కథా వస్తువులు. ఎక్కువగా వారి వయసులో అమ్మాయిల నిజ జీవిత కథలే కథా వస్తువులు. ఆవిడ కథలలోని పాత్రలలో ఎక్కువ మందికి చదువు ఉండదు. ఉన్నా అది అంతంత మాత్రం. భర్త పోయిన స్త్రీలు ఇటు అత్తింటిలోనూ, పుట్టింటిలోనూ పడే యాతనలు, వాళ్ళని  చాకిరీకి తప్ప ఇంక దేనికి పనికి రాని వస్తువుగా చూడటం.. ఇలాంటివి కళ్ళకు కట్టినట్టు చూపించారు.

బాల్యంలోనే వివాహాలు జరగడం, కాస్త వయసు రాగానే అత్తారింటికి పంపడం , అంతటితోటే తల్లితండ్రుల పాత్ర ముగుసిపోతుంది. ఆ తరవాత భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊరిలో ఉంటే, ఆ ఇంట్లో అత్తగారు, ఆడపడుచుల సూటిపోటి మాటలు పడుతూ, చాకిరీ చేస్తూ భర్త ఎప్పుడు తన దగ్గరకు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ కాలం గడిపే స్త్రీలు ఆవిడ కథానాయికలు.

పెళ్ళి అవ్వగానే పుట్టింట్లో స్వతంత్రం  పోతుంది, భర్త దగ్గర చనువు రాదు. ఆమెకు ఏది కావాలో అడగలేని పరిస్థితి. భర్త ఆదరణకు నోచుకోని పరిస్థితులలో ఇంట్లో వాళ్ళు అనే మాటలతో ఆత్మహత్యలే శరణంగా మారుతాయి. లేక పోతే పిచ్చిదానిగా  మారిపోవడమే!

subba 1

ఆమె వ్రాసిన కథలలో కొన్ని కథలు –

పోస్ట్ చెయ్యని ఉత్తరం :

ఇందిర ఒక సామాన్యమైన మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆడపిల్ల. పెళ్ళయ్యి అత్తారింటికి వస్తుంది. ఇంట్లో అత్తగారు, మరుదులు, ఆడపడుచులు.. వారి సేవలతో పదేళ్ళు ఇట్టే గడచిపోతాయి. భర్త వేరే ఊరిలో ఉంటూ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. వచ్చిన ప్రతీసారి తనని తీసుకెళ్తాడనే ఆశతో ఉంటుంది ఇందిర. తన కళ్ళ ముందే ఆడపడుచు  ఆమె భర్త అన్యోన్యత చూసి కాస్త బాధపడుతుంది. ఇలా పదేళ్లు గడిచాక ఒక రోజు ఒక పెద్ద ఉత్తరం వస్తుంది భర్త నుండి. అతను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడని, ఆమెను పెళ్ళి చేసుకునేందుకు  ఇందిర ఒప్పుకోవాలని, అలా ఒప్పుకుంటేనే ఆమెను తనతో తీసుకెళ్తానని సారాంశం. అది చూసి అత్తగారు కూడా ఇందిరనే మాటలంటుంది. ఒక రోజు అతనికి సమ్మతి చెప్తూ ఉత్తరం వ్రాసి, నీళ్ళపొయ్యి మంటతో చీరకు నిప్పంటించుకొని చనిపోతుంది.

ఇది ఒక నిజ సంఘటన ఆధారంగా చేసుకొని వ్రాసిన కథ. ఆ పాత్ర ఈ రోజుకీ  సుబ్బలక్ష్మిగారి  కళ్ళ ముందు కదులుతూ  ఉంటుందని ఆవిడే చెప్పారు.

మట్టిగోడల మధ్య గడ్డిపోచ:

అక్క పెళ్ళయ్యేనాటికి పార్వతికి ఎనిమిదేళ్ళు, కొంత కాలానికి అక్క చనిపోతుంది. ఒక శుభదినాన అక్క భర్తతో ఆమెకు వివాహం. అక్కది మంచి జాతకం కాదని, ఆమె అత్తింటికి వెళ్ళగానే మరిదిని, మావగారిని కాటికి పంపేసిందని అత్తగారు సూటిపోటి మాటలంటుంటే, అక్క నూతిలో దూకి చనిపోయిందని కాపురానికి వచ్చిన కొత్తలోనే పార్వతి గ్రహిస్తుంది. భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందన్న  విషయమూ త్వరలోనే తెలుసుకుంటుంది. ఆమెను అత్తగారు జాలితో బాగానే చూసుకుంటుంది. కొన్ని రోజులయ్యాక భర్త పార్వతికి దగ్గరవుతాడు. ఇది చూసిన అత్తగారిలో మార్పు వస్తుంది. పార్వతితో మంచిగా మసలడం మానేస్తుంది.ఇది ఒక విచిత్రమైన మనః స్థితి. భర్త ప్రేమతో ఇటువంటివి భరించగలననే ధైర్యంతో  బతికేస్తుంది పార్వతి. మాలతి చందూర్ గారు ఈ కథని మట్టిలో మాణిక్యంగా అభివర్ణించారు.

ఒడ్దుకు చేరిన వొంటరి కెరటం:

బాల్యవివాహం, ఊహ తెలిసేటప్పటికే భర్త పోవడం. గతి లేక పుట్టింటికి చేరడం. అక్కడ అన్నగారి పిల్లలకు సేవలు చేస్తూ కాలం గడపటం. చివరి దశలో వారు ఆమెను ఈసడించుకోవడం. ఈ కథలో వస్తువు. ఇది కూడ నిజ జీవిత కథే. కానీ కాస్త కల్పితం చేసి చివరకు సుఖాంతం చేశారు.

ముంజేతి కంకణం, మనసు తెచ్చిన మార్పు, తెల్లవారింది మొదలైన కథలలో కూడ ఇలాగే స్త్రీ పడే కష్టాలే కళ్ళకు కట్టినట్టుగా వ్రాశారు. ఇటు వంటి కథలు చదివినప్పుడు మాత్రం మనసులు కరగక మానవు.ఈ కథలతోబాటు  “నీలంగేటు అయ్యగారు”, “అదృష్ట రేఖ”  అనే నవలలు కూడా వ్రాశారు.

ప్రస్తుతం “తొమ్మిదవపది” లో పడి, మేనల్లుడి దగ్గర బెంగళూరు లో ఉంటున్నారు. చేయి కాస్త సహకరించక పెయింటింగ్స్ వేయ లేకపోతున్నారు. కానీ, మంచి పుస్తకాలు ఇంకా చదువుతూ కాలక్షేపం చేసుకొంటున్నారు. ఎవరేనా మాలాంటి వారు వెళ్తే చాలా ఆప్యాయంగా మాట్లాడి, వారి జీవిత విశేషాలు చాలా ఆసక్తిగా తెలియచెప్తున్నారు.  దేవుడు ఆవిడకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

సుబ్బలక్ష్మిగారితో జరిపిన ఆత్మీయ  ముచ్చట్లు.. అపురూపమైన చిత్రాలు..

 

 

7 thoughts on “మాటా మంతీ – శివరాజు సుబ్బలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *