May 7, 2024

అక్షర సాక్ష్యం – 1

రచన: రంగనాధ్  Ranganath1342855533

 

 

 

 

1.

 

నేను :

 

అధికంగా వేషాలొస్తే సంతోషపడతాడు – నాలోని నటుడు…

బ్యాంక్ పాస్ బుక్ నిండుతుందని!

దీర్ఘ విరామం వస్తే ఆనందపడతాడు – నాలోని కవి…

కవితలతో ఒక నోట్ బుక్ నిండుతుందని!

ఆ ఇద్దరి వల్ల

ఇబ్బంది పడుతుంటాడు –

నాలోని క్రీడాకారుడు….

ఆడుకొనే అవకాశం దొరకదేమోనని!

నటిస్తున్నా, రచిస్తున్నా, ఆడుకుంటున్నా

సత్యాన్వేషణలో వుంటాడు –

నాలోని వేదాంతి !

 

‘ఇంతకూ నేనెవర్ని? ‘ అని ఆలోచిస్తే…

ఈ నలుగురూ నివసిస్తున్న

నాలుగు గదుల గుండెకు

స్వంతదారుడ్నని అర్ధమైంది.

 

నా గుండెలో మరో గది లేక, గతిలేక

నా గొంతులోనే ఇరుక్కుపోయాడు

ఒక గాయకుడు –

నా హృదయాల లయతో గొంతు కలిపి

కూనిరాగాల నాలపిస్తూ…

 

 

 

2.

 

నా గొప్పదనం

 

 

విశ్వవిఖ్యాత నటశేఖరుల మధ్య

నేనొక జూనియర్ ఆర్టిస్ట్ ని-

 

ఉద్ధండ సాహితీశిరోమణుల సరసన

నేనొక ఎల్.కే.జీ. విద్యార్ధిని !

అంటే…

సుగంధ సుమనోహర పుష్పవనంలో

గడ్డిపువ్వుని-

నవరత్నఖచిత కిరీటంలో

యిసుక రేణువుని !

 

అయినా…

నా గొప్పదనం నాకుంది

వివిధ రంగాలలో ప్రతిభా సంపత్తితో

విరాజిల్లుతున్న చరిత్ర పురుషులు

ఎందరికో నేను సమకాలికుడను!

 

 

 

 

3.

 

ప్రార్ధన

 

జయ జయ జయభారతి జయహో

వైదిక జ్ఞానప్రదాతా!

సంగీత శిల్ప సాహిత్య భాసితా

సర్వకళా సంశోభితా!

హిమనగ కిరీటధారిణి మాతా

అక్షయగంగా సంయుతా!

బోధిత సంస్కృతి నియమం

మత సంయమనమే సతతం

ధ్యేయ సాంఘిక న్యాయం !

జయ జయ శాంతస్వరూపిణి జయహో…

శాశ్వత భాగ్యపరీతా !

జయహో… జయహో… జయహో…

జయ జయ జయ జయహో !!

 

 

 

4.

 

 

మన భాష

 

పాలు పెట్టి పెంచిన అమ్మను మరచినట్లు

అమ్మ నేర్పిన భాషను ఆవలకు నెట్టి

పరభాషలో నీవు పండితుడవైన నేమి?

మాతృభాష మధురిమ నాస్వాదించకున్న !

 

ప్రబంధ కావ్య పురాణేతిహాసముల నెరిగి

నవరసాత్మక రసవాక్యముల నాసువుగ నల్లు

చమత్కారయుత సమస్యాపూర్ణ పాండిత్య ప్రతిభ

అవధాన ప్రక్రియ తెలుగుతల్లి కమరిన తగటు కాదె!

 

సకల శబ్ద తరంగ శోభిత తెలుగు తటాకమున

వికసిత పరిమళ పద్మము కాదె తెలుగు పద్యము!

తెలుగు తల్లికి దివ్యకిరీటమై యది శోభింప

వెలుగునాధునికి ధీటుగ సదా వెలుగొందుగాక!

 

స్పందనలు

 

గుండెకు ‘స్పందన ‘ వుంది…

దాంతో..

రక్తప్రసరణ జరుగుతుంది-

హృదయానికీ ‘స్పందన ‘ వుంది…

దాంతో…

కారుణ్యం కట్టలు తెంచుకోంటుంది –

గుండె, హృదయం వేరు వేరా?

అవును…

గుండె భౌతిక పదార్ధం –

హృదయం ఆర్ద్రతాత్మకం !

గుండె ప్రతివాడికీ వుంటుంది…

హృదయం మాత్రం …

కొందరికే!!

1 thought on “అక్షర సాక్ష్యం – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *