May 3, 2024

అంతిమం 2

antimam2

 

సదాశివం ఆ రాయిని చేతిలోకి తీసుకుని ఎంతో అపురూపంగా కాస్సేపు ప్రేమగా దాని  దిక్కు చూచి ఎందుకో చటుక్కున ముద్దుపెట్టుకున్నాడు. కన్నీళ్ళు ముంచుకొచ్చి దుఃఖం పొంగింది అతని గుండెల్లోనుండి. అతను రాయిని ముద్దు  పెట్టుకుంటున్నపుడు రైల్లో ఎవరూ లేరు కాబట్టి గమనించలేదెవరూ. చూస్తే అతన్ని తప్పకుండా ఒక పిచ్చోడనే అనుకుందురు.

సదాశివంకు చిన్నప్పటినుండి కూడా మట్టినీ, శిలనూ తాకినపుడు ఒక రకమైన పులకింత కలిగేది. ఈ సృష్టిలో సకల పదార్థాల ఆవిర్భవానికి మూలమైన పంచభూతాల్లో మనిషి  తనివిదీరా స్పర్శిస్తూ తన అనుస్పందనను పరమంగా ఆనందించగలిగేది కేవలం భూమినీ, నీటినీ, గాలినీ, శిలనూ చేతులతో తాకగలిగినప్పుడే. సరియైన రీతిలో సమ్మేళనం చెందిన పంచభూతాల సమాకలన రూపమే దేహమైనపుడు..అది భగవత్ కృతమైన ప్రాణాన్ని పొంది జీవిగా పరివర్తిస్తూ సచైతన్యమై.. నిరంతరం తనలో నిబిడీకృతంగా ఉన్న ఐదు పంచ మూలకాలను విప్పుకుని, వియోగించుకుని ఎప్పుడెప్పుడు విడిపోదామా అన్న అంతర్ఘర్షణతో ప్రచలిస్తూంటాయి. ఈ ప్రచలిత ప్రతిఫలనే ప్రతి జీవిలోనూ గుప్తమై దాగి ఉండే మృత్యుకాంక్ష. ఇది ప్రతి మనిషిలోనూ ప్రస్ఫుటంగా అనుభవంలోకొస్తూ ఎప్పుడో ఒకప్పుడు మనసును కలవరపరుస్తూనే ఉంటుంది.

అనాది కాలంలో ఎప్పుడో నాలుగున్నర బిలియన్ సంవత్సరాల క్రితం సూర్య శకలంగా విడివడి అగ్నిగోళమై ఒక బిలియన్ సంవత్సరాల కాలం గడిచిన తర్వాత గాని ఉపరితలం చల్లబడి భూమి ఏర్పడలేదు. ఆ తర్వాత అనేకానేక విస్ఫోటనాలకు లోనై.. భౌతిక అభౌతిక రూపాంతరాల అనంతరం.. దాదాపు రెండువేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల తర్వాత గాని శిలలు ఏర్పడ్డం ప్రారంభం కాలేదు. మట్టి ఏర్పడ్డం ఒక మహాద్భుతమైన సృష్టి క్రియైతే.. రాయి లేదా శిల ఏర్పడ్డం ఇంకా మహత్తరమైన ప్రకృతి సమతుల్య క్రియ. భూమి, నీరు, అరణ్యాలతో కూడిన పాషాణ, క్రిమి, కీటక, పశుపక్ష్యాదుల పర్యావరణ సంతులిత వ్యవస్థే సకల జీవకోటి మనుగడకు అధారభూతమై సృష్టి వర్ధిల్లుతోంది.

ఖనిజం పేరుతో లక్షలకు లక్షల టన్నుల మట్టిని, మాఫియాలు మాఫియాలుగా నదులకు నదులనే ఇసుకగా,. నిరంతర తవ్వకాలతో భూమిని తొలచి తొలచి కోటానుకోట్ల టన్నుల బొగ్గును వెలికితీసి సొమ్ము చేసుకుంటూ.. గ్రానైట్ పేరుతో కోట్ల టన్నుల రాయిని చైనా వంటి దేశాలకు తరలిస్తూ..అంతా వ్యాపారం..డబ్బు..సంపాదన..దోపిడీ. ప్రకృతిని నిలువెల్లా తూట్లు తూట్లుగా ఛిద్రం చేస్తూ.,

అసలు ఏం జరుగుతోందిక్కడ.

ఈ సహజ సంపద దొంగలను గుర్తించి శిక్షించవలసిన ప్రభుత్వాలే  వాళ్ళకు రక్షకులుగా మారి.,

మనిషి ఈ ప్రకృతి సంపదలో ఏ ఒక్కదాన్నైనా పునఃసృష్టించగలడా. మట్టిని తయారు చేయగలడా. ఒక శిలను, పిడికెడు ఇసుకను, కనీసం ఒక చిగురుటాకును రూపొందించగలడా?. పునఃసృష్టి చేయలేనివానికి దాన్ని ధ్వంసం చేసే అధికారం ఎవడిచ్చాడు.

దేశం నిండా ఎక్కడ చూచినా అన్నీ స్కాంలే.

పొత్కపల్లి స్టేషన్లోనే తమ ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న ట్రాక్ ప్రక్కనే అటుదిక్కు దాదాపు కిలోమీటర్ పొడుగున్న ఒక గూడ్స్ బండి ఆగి ఉంది. దానికి అన్నీ ప్రత్యేకంగా రూపొందించిన క్యారియర్స్ ఉన్నాయి.. పెద్ద పెద్ద రెండు క్యూబిక్ మీటర్స్ గ్రానైట్ రాళ్ళను ఒక్కో క్యారియర్ పైన ఉంచి ఇనుప గొలుసులతో కట్టి రవాణా. ట్రైన్ పొడుగునా దాదాపు యాభై క్యారియర్స్. ఒక్కోదానిపై రెండు బండల చొప్పున మొత్తం వంద బండలు. అంటే షుమారు ఒక చిన్న గుట్ట తరలిపోతోందన్నమాట.

వారంక్రితం ‘కరీంనగర్ జిల్లానుండి తరలిపోయిన ఐదువందలకు పైగా గుట్టలు’ అనే శీర్షికతో ఒక రీసెర్చ్ స్కాలర్ ప్రముఖ తెలుగు దినపత్రికలో రాసిన వేదన నిండిన వ్యాసం జ్ఞాపకమొచ్చింది సదాశివంకు. చాలా సమగ్రమైన సమాచారంతో వచ్చిందా వ్యాసం. కరీంనగర్ జిల్లాలో ఎప్పటినుండి ఈ రాతిగుట్టల ధ్వంసం ప్రారంభమైంది.. ఈ వ్యాపారంలో స్థానిక వ్యాపారుల పాత్ర ఎంత. వాళ్ళతో కుమ్మక్కై తెరవెనుక ఉండి హైదరాబాద్, ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పుతూ రాజకీయంగా అన్నీ చూసుకుంటున్నందుకు ఏ ఏ నాయకునికి ఆ వ్యాపారంలో షేర్ ఎంత.. వాళ్ళ పేర్లు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఈ ఘోరమైన ప్రకృతి దోపిడీలో అందరూ వాటాదారులు కావడం మాత్రం అందర్నీ చకితుల్ని చేసే విషయం. జియాలజీ, మైనింగ్, ఇండస్ట్రీస్.. అన్ని డిపార్ట్ మెంట్లనుండి సకల అనుమతులను రాజకీయులు తెస్తారు. బ్యూరోక్రాట్స్.. ప్రభుత్వ అధికారులు.. టాప్ టు బాటమ్..అందరికీ ఒక పద్దతి ప్రకారం పర్సంటేజ్. ఇక చైనాలో వ్యాపారం..రేట్లు..ఎగుమతి..పేమెంట్ మోడ్..షిప్పింగ్..వీటికి ప్రత్యేకంగా ఆ రంగంలో అనుభవమున్న తమిళ నిపుణులు. రాళ్ళను బర్మాలు పట్టి, లోపల జిలిటిన్ స్టిక్స్ పెట్టి ఎక్స్ ప్లోజివ్స్ తో పేల్చి వాటిని ఓ పద్దతిప్రకారం డ్రెస్సింగ్ చేసే స్టాఫంతా తమిళులే. స్థానిక బీద కూలీలు ఒట్టి కాపలాదారులు, డ్రైవర్లు,క్రేన్ ఆపరేటర్లు, మన మనుషులను మనవాళ్ళే తన్నవలసిన గూండాలు. ప్రతి క్వారీ ఒక కంపనీ ఇలాకా. చుట్టూ బలమైన సరిహద్దు రక్షణ. అక్కడక్కడ సెక్యూరిటీ సిబ్బంది. వేయి కళ్ళతో నిఘా…

ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ప్రతిఘటించే ప్రజాసంఘాల నాయకులనూ, కార్యకర్తలనూ ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి కేసులుపెట్టి, భయపెట్టి, వీలుంటే లంచాలిచ్చి, ఎదురుతిరిగితే భౌతిక బినామీ దాడులను జరిపి, ‘ఎవ్రిథింగ్ ఈజ్ వెల్ ‘ అనే శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు.. అంతా ఒక దృశ్యాదృశ్య విషవలయం. అంతా అభేధ్యం.

‘లోపలికి ఇతరులకు ప్రవేశం అస్సలే లేదు. లేదుగాక లేదు ‘అనేది ప్రిన్స్ పుల్.

ఆ పరిశోదక విద్యార్థి తన వ్యాసంలో కొన్ని విలువైన ప్రశ్నలను సంధించాడు.

అవి..ఒకటి..ఈ ప్రకృతి విధ్వంసం భావితరాలకు అత్యంత హానికరమని ప్రభుత్వాలకూ, ప్రభుత్వాధికారులకూ తెలియదా.? తెలిసే వీటికి పర్మిషన్లిచ్చి వెనుక ఉండి ప్రభుత్వమే ఈ ధ్వంసాన్ని జరిపిస్తోంది కొద్దిమంది ప్రయోజనాల కోసం. రెండవది.. భారతదేశ ఖనిజాన్నీ, గ్రానైట్నూ, ఇతర అటవీ ఉత్పత్తులను విశృంఖలంగా కొంటున్న చైనా వాటిని వాళ్ళ మనుషులకు ఉపాధి కలిగిస్తూ ప్రాసెస్ చేసి అంతిమంగా ఫైనల్ ప్రాడక్ట్ లను తిరిగి మన దేశానికే అమ్ముతూ మనను అపహాస్యం చేస్తున్నా మన పాలకులకు సిగ్గుగానీ, మన అధికారులకు రవ్వంతైనా రోశంగానీ లేవు. కిక్కుమనకుండా ఆ ఉత్పత్తులనే మహాప్రసాదమని స్వీకరించి దేశీ మార్కెట్లో పోటీపడి అమ్ముకుని మన ఘనత వహించిన వ్యాపారస్తులు సంతోషపడ్తున్నారు. రేపటి తరానికి భూమి, బొగ్గు, ఇసుక, రాళ్ళు, అడవులు లేని దేశాన్ని ఇస్తే వాళ్ళు మనం వారసత్వంగా మిగిల్చిన ఈ దరిద్రానికి తిట్టి శపించి మన నోళ్ళలో ఉమ్మేయరా,?. మూడు..పోనీ ఈ ముడిపదార్థాలతో మన నిరుద్యోగ యువతనైనా ఉపయోగించుకుని చైనా వాడు చేసే ఘనకార్యాన్నే ఇక్కడా చేసి కనీసం వీళ్ళకు ఉపాధైనా కలిగించొచ్చుగదా. ప్రభుత్వాలిక్కడివి గుడ్డివి.

ఒక్క కుదుపేదో కుదిపినట్టై ఏకకాలంలో అటు దిక్కున ఉన్న బండల గూడ్స్ బండీ, ఇటు సదాశివం కూర్చున్న ప్యాసింజర్ బండీ రెండూ కదిలాయి.

మెల్లగా నడక.. పట్టాలపై ఇనుప లోహధ్వని. ఆకృతిని పొందుతున్న లయ. టకటకా.

సరిగ్గా అప్పుడే ఒక కుక్క చటుక్కున సదాశివం కూర్చున్న డబ్బా లోపలికెక్కింది. ఎక్కి హుందాగా తోకాడిస్తూ అటుప్రక్క కిటికీ దగ్గర చిద్విలాసంగా కూర్చుని పొగాకు చుట్ట తాగుతూన్న ఓ సాధువు ప్రక్కకు వెళ్ళి కూర్చుంది నేలపై. సదాశివం అటు తొంగి చూస్తే..సాధువు తన ఏక్ తారను సవరించుకుంటున్నాడు.

పాడుతాడా.

రైలు వేగాన్నందుకుంటోంది.

చల్లగా గాలి..ఒంటిని తల్లివలె స్పర్శిస్తూ.

ఈ దేశ దుర్మార్గులు డబ్బుకోసం రేపు గాలినికూడా అమ్ముకుంటారా.?

చిన్న ఊరు. దూరంగా కొండలు. నయమే ఇంకా ఈ కొండకూడా బండలుగా మారి రైలుబండెక్కి పోలేదు.. అనుకున్నాడు సదాశివం.

సాధువు ఏక్ తార ధ్వని సన్నగా పురివిప్పుకుంది.. గాలిలో తెరలు తెరలుగా.శ్రావ్యంగా ఉంది. గొంతు సవరించుకుని ఆయన పాటనందుకున్నాడు.

‘   ఈ నల్లని రాళ్ళలో

ఏ కన్నులు దాగెనో

ఈ బండల మాటునా

ఏ గుండెలు మ్రోగెనో ‘.. పల్లవి.

ఎంత మధురంగా ఉందో అతని స్వరం. అమృతం జాలువారుతున్నట్టు. కళ ఎవడిస్వంతం. నైపుణ్యం ఎవరి సొత్తు.

పాట జలజల ప్రవహిస్తూనే ఉంది.

యాదృచ్చికమే..ఆ అద్భుతమైన పాటను రాసింది సి.నారాయణరెడ్డి. కరీంనగర్.. హనుమాజీపేట వాస్తవ్యుడు. రాళ్ళగురించిన ఆ పాట ఎంతో హృద్యంగా అపురూపమైన భావంతో సాగి సాగి శ్రోతను పారవశ్యంలో ఓలలాడిస్తుంది. ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలోనిదా పాట. విక్రం ప్రొడక్షన్స్.

‘పైన కఠిన మనిపించును

లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషికన్న

శిలలే నయమనిపించును ‘

రాళ్ళలో రత్నాలనూ, వెన్ననూ, రసాకృతులనూ చూడగలిగిన నారాయణరెడ్డి తరం క్రమంగా నశించిపోతూ,

‘అమ్ముకో..డబ్బుకోసం దేన్నైనా అమ్ముకో. మట్టినీ, రాయినీ, అమ్మనూ, ఈ దేశాన్నీ..దేన్నయినా అమ్మేసుకో అన్న సంస్కృతిలో ఈ తరం సమాధై పోతూంటే’.. ఇక ఈ మనుషులు.. ఈ వ్యాపారాత్మక తుచ్ఛ మానవ సంబంధాలు..ధన వ్యామోహమోహనాలు..ఛీఛీ.

పతనం..పతనం.

కళ్ళు మూసుకున్నడు సదాశివం.

రైలు ధ్వని..లయ.

‘కళ్ళు మూస్తే నాలోనే ఒక ప్రపంచం.

కళ్ళు తెరిస్తే ప్రపంచంలో ఒక నేను ‘

తనలోనే ధ్వనిస్తూ, జ్వలిస్తూ, లయిస్తూ పొరలు పొరలుగా పొర్లుతూ ప్రవహిస్తూ.. మనిషిలో ఒక నది.. అభౌతిక నైరూప్య నదిలో మనిషి.. నది ఒక్కోసారి ముందుకు దూకుతూ వడివడిగా సాగిసాగి ఒక్కోసారి ఆగి ఆగి చిత్రంగా అప్పుడప్పుడు వెనక్కికూడా వ్యతికరించి.. దిశా వ్యతిరిక్తత. అప్పుడప్పుడు అటు.. ఒక్కోసారి ఇటు. డోలనం. రెండు అంత్య బిందువుల మధ్య.. ప్రస్తారావధుల మధ్య నిరంతర అవిశ్రాంత డోలనం. ఊగిసలాట.

మనిషి జీవితం నిజానికి ఒక చంచల డోలనమేకదా.

ఎందుకో సదాశివానికి నరేంద్ర లూథర్ జ్ఞప్తికొచ్చాడు.

నరేంద్ర లూథర్ అంటే ప్రపంచంలోని అపురూపమైన  ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లోని విలక్షణ ప్రకృతి ప్రసాదించిన సహజ శిలాకృతులను పరిరక్షించే మహదాశయంతో 1992 లో హైదరాబాద్ లో స్థాపించిన ‘సొసైటీ టు సేవ్ రాక్స్ ‘సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు. అంటే ఇరవై రెండేడ్ల నుండి ఈ దేశ శిలాసంపదను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తూ.. ఒక పోరాటం. అలుపెరుగని పోరాటం.

దేనికోసం పోరాటం.. అంటే రాళ్ళకోసం. తాము జన్మించేందుకు రెండున్నర మిలియన్ల కాలం ప్రకృతి గర్భంలో ఉండీ ఉండీ రూపుదిద్దుకుని.. ప్రపంచ పలు ప్రదేశాల్లో తామంతట తామే సహజ చిత్తరువులుగా ప్రత్యక్షమై.,

‘రాక్ స్కేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని రాశాడో పుస్తకం నరేంద్ర లూథర్.

అద్భుతమైన గ్రంథమది. మన చుట్టూ ఇంత సుందరమైన శిలాకృతులున్నాయా అని అప్రతిభులను చేసే విశేషాలెన్నో ఆ పుస్తకంనిండా.

నరేంద్ర లూథర్ తోబాటు ఇంకా అపరాజిత సిన్ హా, మిస్ ఫ్రాక్ ఖాదర్ వంటి అనేక మంది మేధావులతో ఒక ప్రజాస్వామిక వేదికనేర్పాటు చేసి ‘శిలా రక్షణ ‘కార్యక్రమాన్ని ప్రకటించి ధర్నాలు, ప్రతిఘటనలు, ఉద్యమాలు.,

వాటిలో.. హైదరాబాద్ లోని దుర్గం చెరువు చుట్టూ ఉన్నరమణీయమైన ‘ టార్టాయిస్(తాబేలు)కొండలు ‘, హైటెక్ సిటీలోని ‘బేర్స్(ఎలుగుబంటు)నోస్ ‘, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్న ‘ముష్రూం(పుట్టగొడుగు)రాక్..ఇలా ఎన్నో.

స్వయంగా జూబ్లీ హిల్స్ లోని ఆయన స్వంత ఇంట్లో సహజంగా ఉన్న రాతి ఆకృతులను అలాగే ఉంచి వాటిని ఒక అలంకారంగా ఎలా వాడుకోవచ్చో చేసి చూపారాయన. లూథర్ 1955 బ్యాచ్ ఐ ఎ ఎస్ ఆఫీసర్. 1991 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేసి ఇక శేష జీవితాన్నంతా సాహిత్యం.. హైదరాబాద్ నగర, నిజాం సంస్కృతికి సంబంధించిన అనేక సాధికారిక గ్రంథాలు, మేధోపరమైన ‘శిలా పరిరక్షణ ‘ఉద్యమ నిర్వహణ..ఇలా.

మనిషి జీవించడం ఒక కళ. ప్రకృతినుండి ఉద్భవించిన మనిషి ప్రకృతి సమతుల్యానికి ఎటువటి హానీ తలపెట్టకుండా తానూ ప్రకృతిలో ఒక భాగమై బతుకుతూ సహజ వనరుల అందాలను ఆస్వాదిస్తూ తరించిపోవడంలోని మహానందం గురించి అనేక సభల్లో,పుస్తకాల్లో, వ్యక్తిగత చర్చల్లో ప్రస్తావిస్తూ.. ఒక కొత్త ఆలోచనాత్మక స్పృహను కలిగిస్తూ,

అసలు ఈ తరం పర్యావరణానికి సంబంధించిన స్పృహను పూర్తిగా కోల్పోయి ఎందుకిలా ధ్వంసించే సంస్కృతిని అలవాటు చేసుకుంది.

పాట ఆగిపోయింది. కాని అనునాదంగా అంతర్వాహినిగా అప్పటినుండీ ప్రవహిస్తూ వచ్చిన సాధువు చేతిలోని ఏక్ తార శృతి ధ్వని అలా ఓ నిరంతర ప్రకంపనగా సాగుతూనే ఉంది. ఆత్మ పురివిప్పుకుంటున్న వివర్తనం.

సదాశివం తను కూర్చున్న చెక్క కుర్చీపైనుండి లేచి ఆ సాధువు ఉన్న వరుసలోని కిటికీ కుర్చీలోకి మారి.. సాధువు దిక్కు ఆసక్తిగా చూశాడు. యాభై ఏళ్ళుంటాయేమో. నలుపు తెలుపు వెంట్రుకలు కలగలిసిన గడ్డం.పొడవైన కేశాలు. నుదిటిపై పొడవుగా కుంకుమ బొట్టు. ఒంటిపై ఎర్రని అంచున్న తెలుపు కండువా. చూడగానే ఎవరికైనా ఏదో తెలియని గౌరవభావం కలిగించే వర్చస్సు ముఖంలో.

అతని ప్రక్కనే కుక్క.. వినయంగా కింది రెండుకాళ్ళపై కూర్చుని.. మౌనంగా.

కుక్క అతని తాలూకు సహవాసా.?ఏమో.

అతను ఏదో ఒక గాఢమైన యోగనిద్రలో ఉన్నట్టు.. భౌతికాతీత స్థితిలో.

అసలు అత్యంత శాస్త్రీయమైన, తాత్వికమైన, ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని రూపొందించి విలువలూ, ధర్మాచరణా మూలాధారాలుగా మానవ జాతికి ప్రసాదించిన భారతీయ ఐతిహాసిక వారసత్వం యుగయుగాలుగా ఈనాటివరకూ కొనసాగీ కొనసాగీ.. ఇప్పుడు, ఈ మధ్య కాలంలో ఇంత త్వరితగతిని ఎందుకు పతనమై ధ్వంసమై పోతున్నట్టు. ఎందుకు మూల విలువలన్నింటినీ విస్మరిస్తూ నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఈ తరం వ్యష్టి ఆలోచనలతో కేవలం డబ్బు సంపాదనకోసమే వెంపర్లాడుతున్నట్టు.’డూ ఎనీ థింగ్..బట్ మేక్ మనీ..ఓవర్ నైట్ మనీ..దట్సాల్.’అనే ఈ ధోరణి ఏమిటి?

మళ్ళీ నరేంద్ర లూథర్ జ్ఞాపకమొచ్చాడు సదాశివంకు.

వ్యవస్థ ఏదైనా రెండు స్థితులుంటాయి. ఒకటి ‘విత్ ‘..రెండవది ‘వితిన్ ‘.

వ్యవస్థతో తను.వ్యవస్థలో తను.

ప్రకృతిలోనుండి ఉద్భవించే మనిషి ప్రకృతితో కలిసి, మమేకమై.. ప్రకృతితోపాటు కొనసాగి జీవించీ జీవించీ ‘మృత్యువు ‘ అనే ఒక హేతువువల్ల విముక్తుడై ప్రధాన స్రవంతినుండి తెగిపోతాడు. అది కేవలం ఒక వైయక్తిక ఆగమన నిష్క్రమణే. కాని సృష్టి ఒక నిరంతర జీవ ధారై, ప్రవాహమై కొనసాగుతూనే ఉంటుంది. సృష్టి మూల భావన సామూహికత. సహజీవనం. సమిష్టి తత్వం. ఐక్యత. విలీనత. అంతిమంగా ఉన్మీలన.ఈ అధార ధర్మాన్ని ఆచరింప జేయడానికి ప్రకృతి ఎప్పటికప్పుడు తనను తాను పునర్నిర్మించుకుంటూ, పునర్నిర్వచించుకుంటూ అప్రతిహతమై దానంతట అదే స్వయం సిద్ధయై ప్రవర్థిల్లుతూంటుంది. ఏ రకంగానైనా ప్రకృతి సహజవర్తనకు భంగం వాటిల్లినట్లయితే ప్రకృతి మహోగ్రరూపంతో విజృంభించి కారకులపై భయంకరమైన దాడి చేస్తుంది.2012 లో జపాన్ లో ప్రళయించిన ‘సునామీ ‘ గానీ, 2013 లో ఉత్తరాఖండ్ లో భాగీరథీ, కాదంబరీ నదులపై కేదార్ నాథ్ వద్ద సంభవించిన జలబీభత్సంగానీ,  మానవాధములు ప్రశాంత ప్రకృతి సమతుల్యతను భగ్నం చేయడంవల్లనే సంభవించాయి. భాగీరథీ, కాదంబరీ వాటి ఉప నదులపై దుర్మార్గులైన మానవులు వాటి సహజ జలప్రవాహాన్ని అడ్డుకుంటూ దాదాపు రెండు వందలకు పైగా హైడల్ పవర్ ప్రాజెక్ట్ లు నిర్మించారు. ఎక్కడి నీరు అక్కడ స్తంభించి చల లక్షణం అచల బీభత్సంగా మారి.. చివరికి ప్రకృతి మహోగ్ర ప్రకోపం. అంతా సర్వ నాశనం. ఫలితంగా కేదార్ నాథ్ పరిసర ప్రాంతాలన్నీ మృత్య వాటికలై, జలశ్మశానాలై.. వేలమంది దుర్మరణం. లక్షల కోట్ల ఆస్తి నష్టం. అంతిమంగా అపార దుఃఖం.

ఇప్పుడీ భారతదేశంలో జరుగుతున్న ఖనిజాల, పర్వతాలతోసహా శిలల, నదుల గర్భాలను తోడుతూ పెకిలిస్తున్న ఇసుక, సమూలంగా ధ్వంసమైపోతున్న లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అడవులు..ఈ బీభత్సమంతా మున్ముందు రాబోయే భయంకర ప్రకృతి విలయానికి ఈ దుర్మార్గ మానవులు వేస్తున్న స్వాగత మార్గాలా.

ఆత్మహత్యా సదృశ..ఆత్మ హనన కార్యం నిరంతరమై కొనసాగుతోంది ఈ మానవ రూపంలో ఉన్న ఆధునిక దోపిడీదారులతో..వర్తమాన  దుర్భల భారతదేశంలో.

ఒకప్పుడు హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడా అంతే. రాళ్ళతో, చెట్లతో, తుప్పలతో.. చెరువులతో, వనాలతో, తోపులతో, కుంటలతో సమృద్ధిగా సౌష్టవంగా ఉండేది. ఆ మహానగరంలోని ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. 1930లో ‘ఫాథర్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ‘అని వ్యవహరించబడే నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ ఈ రెండు ప్రాంతాలను  అంటే బంజారా హిల్స్ మరియు జూబ్లీ హిల్స్ ఏరియాలను సంపాదించాడు నిజాం పాలకుల నుండి. అప్పుడు ఆ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చడానికి నవాజ్ జంగ్ స్నేహితులెవరైనా హిల్స్ లో ఇల్లు కట్టుకుని ఉంటానంటే ఐదారు ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చి ఉచితంగానే కరెంట్ మరియు మంచినీళ్ళుకూడా ఏర్పాటు చేసేవాడు. మనుషుల ఔదార్యం అంత ఉన్నతంగా ఉండేది అప్పుడు. ఆ కాలంలో ఈ రెండు హిల్స్ ప్రాంతం ఎంత సుందరంగా ఉండేదంటే.,

1933 లో,

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ మెహదీ నవాజ్ జంగ్ కు అతిథిగా హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్ లోని ఆయన భవనంలో ఉన్నాడు కొన్ని రోజులు. అప్పుడే ఠాకూర్ అతని ప్రసిద్ద కవిత ‘కొహసర్ ‘ను రాశాడు బంజారా హిల్స్ సౌందర్యంపై. పైగా అన్నాడు జుంగ్ గారితో..”నాకు గనుక కలకత్తాలో విశ్వభారతి బాధ్యతలు లేకుంటే శాశ్వతంగా ఇక్కడే ఈ బంజారా హిల్స్ లో నివాసముండేవాడిని మీ దగ్గర కొంత భూమిని తీసుకుని ‘అని.

ఇప్పుడా ప్రాంతమంతా ఓ పేద్ద కాక్రీట్ జంగలై.. ఎక్కడ చూచినా భూ ఆక్రమణలు, రియల్టర్ గొడవలు, మాఫియాలు.. హత్యలూ, బ్లాక్ మెయిళ్ళతో అట్టుడికిపోతోంది. ఎక్కడ చూచినా తవ్వకాలు, రాతి గుండ్ల పేల్చివేతలు, చెరువుల పూడ్చివేతలు,  ప్రహరీగోడలను కనుచూపుమేరదాకా కట్టీ కట్టీ కబ్జాలు. గుట్టలు, చెరువులు మాయమైపోయి ఎటుచూచినా రాక్ స్కేప్స్ మాయమైపోయి అంతా కాంక్రీట్ స్కేప్ లే.

ఈ వేగవంతమైన ఆత్మ వినాశనకరమైన నాగరికత అవసరమా మనిషికి.

వెనుకట ఇల్లు కట్టుకుంటున్నపుడు ఏదైనా పాత వృక్షం అడ్డొస్తే దాన్ని నరికేయకుండా ఇంటి డిజైన్ నే మార్చుకుని చెట్టును కాపాడే వాళ్ళు. ఎందుకంటే శతాబ్దాల పర్యంతం పెరిగిన చెట్టును మళ్ళీ పెంచడం సాధ్యం కాదుగదా. వృక్షాల జీవితం మనిషి జీవితంకంటే దీర్ఘమైంది. ప్రయోజనకరమైందికూడా.

ఈ చూపుతోనే నరేంద్ర లూథర్ కూడా 1955 ఐ ఎ ఎస్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ లో చేరినా..జూబ్లీ హిల్స్ లో 1975వ సంవత్సరం ప్లాట్ ను సేకరించి 1977లో తన జాగాలోని ఏ రాయినీ డిస్టర్బ్ చేయకుండా తన రూముల్లోకి కూడా విస్తరించిన రాయి ఒక అలంకారంగా భాసించేట్టు డిజైన్ చేసుకుని కట్టుకున్నాడు.

జీవితంపట్ల, పర్యావరణ పట్ల అప్పటి మనుషులకున్న బాధ్యత,అవగాహన ఈ తరానికెందుకు లేదు .

ఆలోచనలో సమాధియైపోయినపుడు మనిషి భౌతికంగా కళ్ళు తెరిచి చూస్తున్నా ఎదుట జరుగుతున్నవేవీ కనబడవు. శబ్దాలూ వినబడవు.. ఏదో అంతరాయం ఏర్పడితే తప్ప. అప్పటినుండి సాధువు నుండి వినబడ్డ ఏక్ తార ధ్వని ఆగిపోయింది. అతను ఇంకో పాట పల్లవినెత్తుకుని గంభీరంగా ఆలపిస్తున్నాడు.

‘పయనించే ఓ చిలుకా

ఎగిరిపో పాడైపోయెను గూడూ..’

ఎవరికోసం పాడుతున్నాడితడు. వింటానికి చుట్టూ ఎవరూ లేరు. ఒక గాఢ ఏకాంతంలో తనలో తాను లీనమైపోతూ కరిగిపోతూ ద్రవిస్తూన్న అలౌకిక పార్వశ్యమేదో ప్రతిఫలిస్తోందతని ముఖంలో. అతను తనకోసమే, తన ఆత్మ తృప్తికోసమే పాడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

పాట ఒకానొక స్థితిలో మనిషికి ఒక తోడవుతుందా?. వ్యాపకమౌతుందా?. ఆత్మక్షాళనకు సాధనమౌతుందా?..అంతిమంగా ప్రాణమౌతుందా.?

పాడుతున్నాడు.. అద్భుతమైన సముద్రాల రాఘవాచార్య సాహిత్యం.. లోతైన తాత్విక గాఢతతో నిండి,

‘గోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసిన వారూ

తోడుగ నీతో ఆడీపాడీ కూరుములాడినవారూ

ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే

ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా..ఎవడే తెలిసినవాడూ..’

సదాశివం చలించిపోయాడొక్కసారిగా.

పాటకెంత శక్తి ఉంది. .ఇసుకలోకి నీరువలె చప్పున ఆత్మలోకి ఇంకి..మాయమై.,

ఎందుకో సదాశివం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కారణం తెలియదు.

ఎవరైనా ఒకసారి ఒక మనిషినుండి విడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ ఎలా కలుస్తారు.. ఆ కలయిక గురించి ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది. కోల్పోయిన మనిషికోసం అలా నిరంతరమై కళ్ళలో శూన్యంతో నిరీక్షించడం తప్పితే ఎవరైనా చేయగలిగిందేముంది.

కవి..ఏరులయే కన్నీరులతో..అన్న ప్రయోగంతో..దుఃఖ తీవ్రతను ఎంత హృద్యంగా చెప్పాడోకదా.

రైలు వెళ్తూనేఉంది..నెమ్మదిగా.ప్యాసింజర్ రైల్లో ప్రయాణించాలని సదాశివం ప్రత్యేకంగా కోరుకుని రావడం వెనుక ఉన్న ఉద్దేశ్యం..అట్టడుగు జనంతో కలిసి వాళ్ళ జీవన వాతావరణాన్ని అనుభవించడమే.కుక్క ఎందుకో చటుక్కున లేచి నిలబడి కదిలి అటు డోర్ వైపు ఉరికింది. బయటికి తొంగిచూచి..మళ్ళీ తిరిగిచ్చి..సాధువు దగ్గరకు వెళ్ళి ఏదో సంభాషిస్తున్నట్టుగా..మూతితో అతన్ని తాకి రుద్ది కాళ్ళతో గీకుతూ,

ఏదో కమ్యూనికేట్ చేస్తోందది.

అతను పాడడమైపోయింది. కళ్ళు తెరిచి ప్రక్కనున్న ఒక బట్ట సంచీని తీసుకుని లేచి నిలబడ్డాడు. మెల్లగా నడుస్తూ సదాశివం దిక్కు ప్రసన్నంగా చూచి..డోర్ దగ్గరికి వెళ్ళి అటుఎటో దిగంతాల్లోకి చూస్తూ.,

కుక్కకూడా అతని ప్రక్కనే నిలబడి సిద్దంగా ఉంది.

దిగిపోతారా.

రైలు వేగం తగ్గుతోంది. దూరంగా ఇటుక బట్టీలు. పొగ. ఎర్రగా నేల. భూమిని తవ్వి మట్టిని తీసి ఇటుకలుగా మార్చి..అందువల్ల ఏర్పడ్డ గోతులు.

బట్టీలనంటించినట్టున్నారు. కిందినుండి సన్నని ఊక పొగ గుప్పుగుప్పుమని ఎగ్జాస్ట్ నుండి గాల్లోకి లేస్తోంది.

ఇటుక బట్టీలను చూస్తున్నప్పుడల్లా సదాశివంకు మనిషి హృదయమే జ్ఞాపకమొస్తుంది. పైన పూతపూసిన పచ్చిమట్టి ఎండిపోయినా పచ్చిపచ్చిగా అనిపిస్తూ..కాని లోపల మట్టినికూడా ఎర్రగా కాల్చగల అధిక ఉష్ణోగ్రత ఉన్నట్టు బయటికి అస్సలే అనిపించని గుప్తత. లోపలంతా నిప్పే. కాలుతూంటుంది. బయటికి కనబడదు. కాల్చుతూంటుంది. బయటికి కనబడదు.

పైకి అంతా సవ్యంగా అనిపించినా లోలోపల దహించుకుపోయేవేవీ ఎప్పుడూ బయటికి కనిపించవు.

గుప్తత.లేటెంట్.

రైలు ముందుకు సాగుతున్నకొద్దీ అన్నీ ఇటుక బట్టీలే రైలు పట్టాలకు ఇరువైపులా.అటు ప్రక్క దూరంగా చిన్న చెరువు.అంతటా పరుచుకుని తాటి చెట్లు..దట్టంగా.తాటి వనం.

వేగం ఇంకాఇంకా తగ్గీ తగ్గీ కీచుమన్న శబ్దంతో రైలు ఆగింది. సదాశివం లేచినిలబడి అటువేపున్న డోర్ దగ్గరకొచ్చి బయటకు తొంగి చూశాడు.ఎక్కడా స్టేషన్ ఉన్న జాడ లేదు.మనుషుల అలికిడికూడా లేదు.

రైలిక్కడ ఎందుకాగినట్టు. దూరంలో సిగ్నల్ కూడా లేదు.

అక్కడ రైలు ఆగుతుందని ముందే తెలిసిన వాళ్ళలా కుక్కా,సాధువూ రైలు దిగి అటువేపున్న పట్టాలను దాటి చూస్తూండగానే వంపులోనుండి ఇటుకబట్టీ దిక్కు మాయమైపోయారు.

టైం చూసుకున్నాడు సదాశివం.పదీ ఇరవై ఐదు.

రైల్లో దాదాపు ఎవరూ లేరు. అటుప్రక్క ఎవరో ఓ రోగపు ఆడమనిషి ల్యాట్రిన్స్ దగ్గర..ముడుచుక్కూర్చుని.

అకస్మాత్తుగా సెల్ ఫోన్ మోగింది.

అదొకటి జేబులో ఉన్నట్టు స్పృహే లేదతనికి. బయటికి తీసి ‘హలో ‘ అన్నాడు.

“ఇంకో పది నిముషాల్లో మీరు స్టేషన్ కు వస్తున్నారు. రాగానే వెళ్ళిపోదాం క్వారీ దగ్గరకు. మేమందరం రెడీగా ఉన్నాం.”అని అవతలినుండి.

“ఒకే”

“ఎంతమందున్నారు మనోళ్ళు మొత్తం ఖాదర్”

“ఒక యాభై మంది”

“సరే..దిగ్గానే వెళ్దాం”అన్నాడు సదాశివం.

లైన్ తెగిపోయింది.

తమ ‘సేవ్ రాక్స్ ‘ఉద్యమకారులు తలపెట్టిన కార్యక్రమం మదిలో మెదిలింది. ‘ప్రతి ప్రతిఘటనకూ వెంటనే ఫలితాలు రావు. కాని ఒక దుర్మార్గ కార్యాన్ని ఉద్యమకారులు నిరసిస్తూనే ఉండాలి నిరంతరం..’అని చెప్పాడు మార్క్స్.చినుకు చినుకే ఒకనాడు వరదౌతుంది.

రైలు కదిలింది కీచుమన్న శబ్దంతో.

చక్రాల చప్పుడు.టకటకా..టకటకా.

ప్రపంచ దేశాలేవైనా అన్ని దేవాలయాల్లో,భారీ కట్టడాల్లో,అంకోరా వంటి అతిపురాతన శిథిల గుళ్ళ నిర్మాణాల్లో..అంతటా ఉపయోగించబడింది శిల.రాయి.రాయే.ఇంకేదీ కాదు.ఎందుకు

రాయికి కాలాన్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి ఎక్కువ.అది ఏర్పడ్డానికి రెండున్నర మిలియన్ల సంవత్సరాల కాలం పట్టిందంటే అది శిథిలమవడానిక్కూడా కొన్ని మిలియన్ల సంవత్సరాల కాలం పట్టాలి. దాంట్లో సెడిమెంటరీ, ఇగ్నీషియస్, మెటామార్ఫిక్ రకాలనుబట్టి శిలల ప్రవర్తనను వివిధ దేశాల పూర్వీకులు ‘శిలా శాస్త్రాలలో ‘తయారు చేశారు.ప్రధానంగా భారత దేశంలో లభిస్తున్న బహువిధాలైన శిలలు పాశ్చాత్య రకాలకంటే ఎంతో ప్రాశస్త్య మైనవి.అందుకే కాకతీయ, హంపీ, ఖజురహో,  ఎలిఫెంటా..శిల్పాలకు ఉపయోగించిన శిలలు శతాబ్దాలుగా ఎన్నో సంక్లిష్టాకృతులను ధరించి అలా మనలను రంజింపజేస్తూనే ఉన్నాయి.

వేయిస్తంభాల,రామప్ప దేవాలయాల్లో ఉపయోగించిన కురివింద శిలలు శిల్పి ఇచ్చే ఆకృతులను స్వీకరిస్తూనే ఉన్నతస్థాయి నునుపుదనంతో,మెరుపుతో శాశ్వతమై నిలిచిపోయాయి. ప్రకృతి విలయాలైన తుఫాన్లు, వరదలు, ఎండాకాలపు మహోగ్ర తాపాలు, శీతల విక్షేపాలు,ఆమ్ల వర్షాలను సైతం తట్టుకుని శతాబ్దాల పర్యంతం నిలిచిఉండే దివ్య పదార్థం ఒక్క శిలే.

ఈ తరానికి శిలల విలువ తెలియట్లేదు.

తెలియ చెప్పాలి.తెలియచెప్పినపుడు తెలుసుకోకుంటే శిలలే తెలియజేస్తాయి సరియైన సమయంలో ఒక పాఠవలె.

చిన్నప్పటి ఓ ఘటన స్ఫురణలోకొచ్చింది సదాశివానికి.

తన మేనత్త ఒకామె ఉండేది. పేరు ముత్తమ్మ. పిల్లలకు రాత్రి భోజనాలైన తర్వాత అందర్నీ ఒకచోట చుట్టూ కూర్చుండపెట్టుకుని బ్రహ్మాండంగా కథలు చెప్పేది. కథలు చెప్పడం..స్టోరీ టెల్లింగ్ ఒక పెద్ద కళ. ముత్తమ్మ ఆ విద్యలో ఆరితేరిన దిట్ట. ఒక రోజు తను అడిగాడు..”అత్తమ్మా..రాళ్ళు అంత గట్టిగా ఉంటాయిగదా.. వాటిని ఒట్టి చెక్కను చెక్కినట్టు ఎలా చెక్కుతారు.అంత నున్నగా ఎట్ల పాలిష్ చేస్తారు”అని.

అందుకు ఆమె ఒక అద్భుతమైన సమాధానం చెప్పింది.”ఒరే పిల్లలూ..మనందరం రాత్రి పడుకుంటాం కదా.అట్లనే అన్ని పక్షులూ, జంతువులూ, జీవులన్నీ గాఢంగా నిద్రపోయిన తర్వాత..రాత్రి ఒంటిగంట దాటిన సమయంలో ఒక దివ్యమైన ముహూర్తాన్ని దేవుడు సృష్టిస్తాడు. దాన్ని కల్కిగాంధారి వేళ అంటారు. అప్పుడు ఈ లోకమంతా గాఢ నిద్రలో మునిగి సోయి లేకుంటుంటది. అప్పుడు అన్ని రాళ్ళుకూడా నిద్రఫోయి పండుకుంటై. ఆ సమయంల గనుక వాటిని ముట్టుకుంటె మెత్తగుంటై .పిండిముద్దనుకో. ఎట్ల పిసుకుతె అదే ఆకారం. ఎట్ల వంచుతె అట్లనే వంగుతది. ఇగ ఏమన్న చేసుకో..ఆ షేపే వస్తది. అప్పుడు ఈ శిల్పులు దొంగతనంగ పోయి దబ్బ దబ్బ బాడ్శెలు,ఉలులు సుత్తెలు పట్కోని రాళ్ళను ఇంగో ఇప్పుడు మనం చూస్తానం చూడు అట్ల అందంగా చెక్కుతరు.ఒక్క గంటసేపే ఉంటది కల్కి గాంధారి వేళ.అప్పుడే పూర్తి చేస్కోవాలె అన్ని పనులు.ఇన్నరా..”అని.

ఆమె కథ చెప్పే పద్ధతేమిటోగాని ఆ కల్కిగాంధారి వేళ..శిలలు వెన్న ముద్దలవలె మెత్తగా మారుట..ఆ ఆలాపనతోనే ఆ రాత్రి అందరం నిద్ర ముంచుకొచ్చి పడుకున్నాం. తెల్లారి పొద్దున్నే లేచి చూస్తే ముత్తక్క లేదు. తెల్లారగట్ల బస్సులో వాళ్ళూరెళ్ళిపోయింది.

ఆ క్షణంనుండి..ఏ దేవాలయంకు వెళ్ళినా జ్ఞాపకమొచ్చేది ముత్తక్క చెప్పిన కల్కిగాంధారి వేళ.. శిలలు వెన్నముద్దలు కావడం.

జనం గబగబా దిగుతున్న చప్పుడైతే ఉలిక్కిపడి తేరుకుని సదాశివం దిగాడు అప్పటికే ఆగిన రైలునుండి.

కిందికి దిగ్గానే తన సహ ఉద్యమకారులు ఓ పదిమంది.అందరూ సామాజిక కార్యకర్తలే.ఆప్యాయంగా పలకరించి..తోడ్కొని..బయటికొచ్చి ఒక టీ తాగి మొత్తం ముప్పై ఐదు మందిదాకా ఓ ఐచర్ మినీ బస్సులో.

“ఎంత దూరం ఖాదర్ ఇక్కడినుండి”

“ఎంత పదినిముషాలు”

“కలెక్టర్ కు ఎమ్మర్వోకు మెమొరాండం ఇచ్చిండ్లుగదా”

“ఇస్తే ఏముంది సార్.అంతా పొలిటికల్లీ మోటివేటెడ్.ఎంపీలు,మంత్రులు,స్థానిక ఎమ్మెల్యేలు..అందరు కలిసి చేసుకునే ఉమ్మడి బ్యారం ఈ గ్రానైట్ ఫీల్డ్.ఈ దందాను ఆపడం మన వశంకాదుగని..చెయ్యాలె.లొల్లి చెయ్యాలె.లేకుంటే గుడినీ గుడిలింగాన్నీ మింగినట్టు కరీంనగర్ల ఒక్క గుట్టలేకుంట చేస్తర్.దొంగలు పడ్తున్నపుడు కుక్క మొరుగాలెగద.గంతే”ఖాదర్ జవాబు సూటిగా.

బస్సు బయలుదేరింది.లోపల సంఘ సభ్యుల్లో కొందరు ప్లకార్డులనూ,మరికొందరు ఫ్లెక్సీలనూ సరిచేస్తున్నారు.

ఒకసారి అందరి ముఖాల్లోకీ పరిశీలనగా చూశాడు సదాశివం.దాదాపు అందరూ తనవంటివారే.వాళ్ళ ముఖాల్లో సహజంగానే అవినీతిని సహించలేనితనపు ఏవగింపు, సాదాసీదా జీవన విధానానికి సంబంధించిన ఆహార్యం, నిజాయితీగా  జీవిస్తున్న ప్రతిమనిషిలోనూ కొట్టొచ్చినట్టు కనబడే కాంతిమయ వర్చస్సు కనిపిస్తున్నాయి ప్రస్ఫుటంగా. వీళ్ళలో ఏ ఒక్కరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు లేరు.అందరూ గుమాస్తా,అకౌంటెంట్,స్టెనోగ్రాఫర్..లాంటి నౌకర్లు చేసుకుని బతుకును వెళ్ళదీస్తున్నవాళ్ళే. ఐతే వీళ్ళకే ఈ అవినీతిని ప్రతిఘటించాలనే సంకల్పం ఎందుకుంటుంది.అంటే.,

మళ్ళీ డగ్లాస్ హెర్బర్ట్ సన్ సిద్ధాంతం..థియరీ ఎక్స్ అండ్ వై..మాత్రమే సమాధానం చెబుతుంది. కొందరు జన్మతఃహ సౌమ్యులు, ఉత్తములు,నిజాయితీపరులు..చెప్పినపనిని వినమ్రంగా చేసే తత్వాన్ని కలిగి ఉంటారు.వీళ్ళ తరగతి ఎక్స్.మరికొందరు.. పుట్టుకతోనే పనిదొంగలు, నేర ప్రవృత్తి గలవాళ్ళూ,అవినీతిపరులు..కఠిన తత్వంగలవాళ్ళూ ఉంటారు..వీళ్ళ వర్గీకరణ వై.. అని.

ఐతే సృష్టిలో ఎక్స్ తరగతి వాళ్ళు కేవలం ఇరవై శాతం మనుషులు.. వై తరగతి వ్యక్తులు మాత్రం ఎనభై శాతం మంది ఉండడం జీవకోటి నిర్మాణ వైచిత్రే.

బస్సు బయల్దేరి వేములవాడ రోడ్ లో దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణించింది.

ఎదురుగా పేద్ద బోర్డ్ ‘నాగేంద్రా గ్రానైట్స్ ‘.మొన్నమొన్ననే ఒక చైనా బృందం వచ్చి కోటిన్నర రూపాయల ఆర్డర్ ఇచ్చి వెళ్ళినట్టు సమాచారముంది తమ దగ్గర.వీళ్ళకు ప్రభుత్వ అనుమతి ఉన్నది కేవలం ఎరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ జరుపుకునేందుకే.కాని ఈ కంపనీ ప్రస్తుతం బినామీగా చుట్టూ ఆక్రమిస్తూ మరో నలభైరెండు ఎకరాల్లో గ్రానైట్ ను వెలికితీసి ఎగుమతి చేస్తున్నారు చట్టవిరుద్దంగా.

కంపనీ ముందర బకాసురుని ముంగిట్లో బొక్కల గుట్ట ఉన్నట్టు గ్రానైట్ ను సైజ్ లుగా కోస్తున్నప్పటి స్క్రాప్ రాతిముక్కలు గుట్టలు గుట్టలుగా పడిఉన్నాయి.వాటిని మళ్ళీ క్రష్ చేసి రాతిపొడిగా మార్చి..ఇసుకకు ప్రత్యామ్నాయంగా వాడడం.

రాయిని ఇంత విశృంఖలంగా ధ్వంసం చేస్తున్న నీచాతినీచ మానవుడా ఎన్ని యుగాల నిరీక్షణ తర్వాత మళ్ళీ రాయిని సృష్టించగలమో తెలుసుకో.

గుట్టలను పెకిలించి భూతలం నుండి లోపలికి..ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి చివరికి గుట్ట ఉన్నచోట ఒక లోయను మిగులుస్తున్న మానవ దుష్క్రియ ఎంత వినాశనకరమో ఈ దుర్మార్గులకు ఎవరు చెప్పాలె.

వ్చ్..ఎవరూ చెప్పరు.

ఎవరికీ అర్థం కాదు.

యథా..యథాహి ధర్మస్య..

కాలం..గతి..ప్రారబ్ధం..ప్రాప్తం.

కాల ధర్మం.

నిమిత్తత..అనిమిత్తత.

ఐచర్ బస్సు నాగేంద్రా గ్రానైట్స్ ముందాగింది.

బిలబిలమని..ముప్పైయైదుమంది.

ఉద్యమకారులు..తమకు ఏమీ అక్కరలేనివారు.తాము ఎవరికీ అక్కరలేనివారు.

“సేవ్ రాక్స్”

“జిందాబాద్”

“ప్రకృతి పరిరక్షణ”

“వర్ధిల్లాలి”

“గ్రానైట్ పరిశ్రమలనూ”

“నిషేదించాలి”

“దేశీయ పరిశ్రమలూ”

“వర్ధిల్లాలి”

నినాదాలు మిన్ను ముడుతున్నాయి.

ఉన్నది ముప్పయ్యైదు మందే..కాని గొడవా,హంగామా మరీ ఎక్కువైంది.

ఇండస్ట్రీ మెయిన్ గేట్ ముందర మెరుపు ధర్నా కావడం కొంత చికాకు కలిగిస్తోంది.లోపల జనరల్ మేనేజర్ “ఏయ్..ఎంపీ గారికి ఫోన్ చేసి ఎస్పీ గారితో చెప్పి వీళ్ళను లోపల బొక్కలోకి తోయించండ్రా”

లోపల టెలీఫోన్లు వాయువేగంతో పనిచేస్తున్నాయి.సమాచారం..ప్రతిఫలనలు..మిగతా గ్రానైట్ కంపనీల ప్రతిస్పందనలు..అంతా గొడవ గొడవగా ఉంది.ప్రెస్..ఎలక్ట్రానిక్ మీడియా.

పది నిముషాల్లో టివి..ప్రెస్ విలేఖరులు సదాశివంతో మాట్లాడుతున్నారు.

సదాశివం చెబుతున్నాడు..” ఒక స్త్రీ తొమ్మిది నెలలు మోసి శిశువును కన్నట్టు ప్రకృతి ఒక రాయి తయారు కావడానికి రెండున్నర మిలియన్ల సంవత్సరాలు కష్టపడి ఒక శిలకు జన్మనిస్తోంది. గ్రహించండి. శిలలే మన పురా స్మృతులు. మన ప్రాకృతిక సంపదలు.మీకు దండం పెడతాం దయచేసి మన తల్లివంటి ప్రకృతిని ధ్వంసం చేయకండి..”

సదాశివం చెప్పేది ఎంతో మానవీయంగా..ప్రశంసార్హంగా ఉంది.

పత్రికలు అతనితో ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి.

ఈ లోగా కీ కీ మని అరుస్తూ నాల్గు పోలీస్ వాహనాలొచ్చి గేట్ ముందాగాయి.

‘మీడియా దృష్టికి పోకుండా మేనేజ్ చేయండి ‘అని ఎంపీ గారి సూచన.

ఈ లోగా ఒక సీ ఐ వచ్చి..’మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం’ అని వార్నింగ్ ఇచ్చాడు.

సదాశివం కు ఇవన్నీ అలవాటే.

“వెల్కం” అన్నాడు.

పోలీసులు సదాశివంను అరెస్ట్ చేశారు.

చేతులకు బేడీలు.

చుట్టూ విలేఖర్ల కెమెరాలు చక్ చక్ మని ఫ్లాష్ లు.

వెనుక నుండి సదాశివం సహ ఉద్యమకారులు ముప్పై మంది ఏకీకృత నినాదాలు.పెద్దగా.ఆకాశం దద్దరిల్లేట్టుగా.

“సేవ్ రాక్స్”

“సేవ్ నేచర్”

“సేవ్ ఎర్త్”

“సేవ్ మథర్”

ఉద్వేగాలు మిన్ను ముడుతున్నాయి.

ఎంపీ వచ్చాడు.ఎమ్మెల్యే వచ్చాడు.

చర్చలంటున్నారు.

ఉహు..సదాశివం వినలేదు.

రాళ్ళ విధ్వంసాన్ని ఆపడమొక్కటే పరిష్కారమన్నాడు.

కొంత స్తబ్దత.కొంత ఊగిసలాట.కొంత అంతర్ఘర్షణ.

సదాశివం ను పోలీసులు తమ వ్యాన్ లోకి ఎక్కించుకుని ఇక బయల్దేరుతూందగా,

సదాశివం విలేఖరులతో అన్నాడు..”మీకు నేనిప్పుడు ఒక రాయి యొక్క శక్తిని చూపించబోతున్నాను”అని.

పాత్రికేయులకెవ్వరికీ అతనేమంటున్నాడో అర్థం కాలేదు.

సదాశివం ఇక పోలీస్ వ్యాన్లోకి ఎక్కుతూ,

తన చేతిలోని రాయిని ఫడేల్మని జనరల్ మేనేజర్ ఆఫీస్ వైపు విసిరాడు బలంగా.

మరుక్షణం జి ఎం ఆఫీస్ గాజు తలుపులు భళ్ళున బ్రద్దలై,

“దటీ జ్ ఎ స్టోన్”

చప్పట్లు..నినాదాలు.

సదాశివం ను ఎక్కించుకున్న పోలీస్ వ్యాన్ వెళ్తోంది.

ప్రతిఘటన ఎప్పుడూ మనిషిని ఆలోచింపజేస్తుంది.

ఆలోచన అగ్ని.

అగ్ని ఎప్పుడూ దహిస్తుంది.

ఉదయం ఐదు గంటల ఐదు నిముషాలు.

రమణ బాత్ రూం నుండి బయటికి వచ్చి ఎదురుగా జలతారు తెరలుగా వ్రేలాడుతున్న విశాలమైన కిటికీ పరదాలను రిమోట్ తో ప్రక్కకు జరిపి.,

నలభై ఫీట్ల వెడల్పుతో గాజు తెర.బయట లేత నీలి రంగుతో పసిపాప ప్రాకుతూ వస్తున్నట్టు సముద్రం.నిశ్శబ్దంగా..ఒక పెయింట్ లా.

అది..’ఫోర్ సీజన్స్ హోటెల్..సింగపూర్ ‘

ఆర్కిడ్ బులావర్డ్ లో ప్రసిద్ది చెందిన ఐదు నక్షత్రాల హోటెల్.

సింగపూర్ లో రేయింబవళ్ళు తేడాలేకుండా నిరంతరం జనంతో కిటకిటలాడే ‘సెంట్రల్ షాపింగ్ డిస్ట్రిక్ట్’ ప్రక్కనే ఉన్న అతి ఖరీదైన హోటలది.రోజుకు దాదాపు ఐదువందల అమెరికన్ డాలర్లు.

రమణ ఆరోజు రాత్రే ఎనిమిదీ పదినిముషాల సింగపూర్ ఏర్ లైన్స్ విమానంలో సుమతోపాటు సింగపూర్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ లో దిగి నేరుగా ఈ హోటెల్ కు వచ్చాడు.

సుమ..సుమ..సుమ.

అరచేతిలో పాదరసంవలె తళతళలాడుతూ జరజర జారే సెక్సీ అప్సరస సుమ.

రమణ కిటికీవారగా ఉన్న తెల్లని వెండిమేఘపు ముద్దవలె ఉన్న సోఫాలో కూర్చుని..సున్నితంగా నిట్టూర్చి..ఎందుకో అలా అలవోకగా కళ్ళు మూసుకున్నాడు.

గత పదిహేనురోజులుగా అతనిలో ఒక అడవి అంటుకుని మండుతూనే ఉంది ఆరకుండా..నిశ్శబ్దంగా.

‘చాలా డ్యామేజ్ జరిగిపోయింది ‘ అనుకున్నాడతను అప్పటికి కోటీ ఇరవై లక్షలవసార్లు.

క్రైసిస్ మేనేజ్మెంట్ సిద్ధాంతం కింద వెనువెంటనే తగు చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చేయి దాటిపోయి అంతా చిన్నాభిన్నమౌతుంది.

కొన్ని జ్ఞాపకాలు ప్రతిరోజూ ప్రత్యక్షమయ్యే సూర్యునిలా నిత్యం కాకి పుండును పొడుస్తున్నట్టు రోజూ గాయపరుస్తూనే ఉంటాయి.

సుమ తనను బహిరంగంగా అందరిముందు ఆఫీస్ లో చెప్పుతో కొట్టడం ఒక మరుపురాని పాడు జ్ఞాపకం. నిద్రలోకూడా ఒళ్ళు జలదరింపజేసే దుశ్చర్య. అత్యంత అవమానకరమైన అనుభవం. ప్రజల దృష్టిలో తన బ్యూరోక్రాటిక్ సొసైటీలో, సమాజంలో..అంతటా పరువు సముద్రంలో కలిసి కొట్టుకుపోయింది.

ఆ రోజు అన్ని టివి చానెళ్ళలో బ్రేకింగ్ న్యూస్ ప్రసారాలు. వెన్వెంటనే చీఫ్ సెక్రెటరీ నుండి పిలుపు., హాజరుకావడం. మందలింపులూ. తలవంచుకుని నిలబడడాలు.

తప్పు జరిగింది కాబట్టి తప్పని అంగీకార మౌనం.

ప్రాధేయపడడాలు బయటపడే మార్గంకోసం.

తన స్థాయి ఐ ఎ ఎస్ ఆఫీసర్ ఉద్యోగంలో లేకపోవడమంటే నీళ్ళలోనుండి చేప ఒడ్డున పడి గిలగిలా తన్నుకుంటున్నట్టే.

అంతా తారుమారైన పరిస్థితుల్లో..’అనువుగాని చోట అధికుల మనరాదు ‘సూత్రం.

అందుకని అతి సాత్వికత..అతి నమ్రత..అతి విధేయత.

ఏ ఉద్యోగికైనా తన కార్యక్షేత్రంలో కొద్దిమంది మిత్రులతోపాటు చాలామంది శతృవులుంటారు. శతృవు ఎప్పుడూ అజ్ఞాతంగా ఉంటూ వీలు చిక్కినపుడు చాపకింది నిప్పులా నిశ్శబ్దంగా అపార నష్టం కలిగిస్తాడు.తన విషయంగాకూడా అదే జరిగింది.శతృత్వానికి కారణం ప్రత్యేకంగా ఏదో కారణం అవసరం లేదు.ఒక్క అసూయ చాలు.

సునిల్ గోస్వామి తన బ్యాచ్ మేట్. ప్రొఫెషనల్ రైవల్రీ. వృత్తిపరంగా తను పై అధికారులతో,మంత్రులతో సన్నిహితంగా ఉండదం ఇష్టంలేని గోస్వామి.. సుమతో ఒక నాటకమాడించి., దెబ్బదీయాలి..ప్రత్యర్థులను దెబ్బదీయాలి..తనకు ఏదీ దొరుకకున్నా ఫరవాలేదు..కాని ప్రత్యర్థికి మాత్రం దొరకొద్దు.అందుకు ఏ దిక్కుమాలిన వ్యూహాంతోనైనా ముందుకుసాగడమే.

కాని గత ఏడాదికంటే ఎక్కువ కాలం దాదాపు ఉంపుడుగత్తె వలె అతిచేరువై తనవెంట ఉంటూ తన మనిషిగా ముద్రవేసుకుని ఆమె భర్త అంగీకారంతోనే బాహాటంగా కొనసాగుతున్న సుమ.,

ఎందుకిలా.?

ఆమెను ప్రలోభపెట్టిందేమిటి.ఎవరు చేశారాపని.ఎందుకు.

‘మిస్టర్ రమణా ..యు గో ఆన్ లీవ్ ఇమ్మీడియేట్ లీ ‘అని చీఫ్ సెక్రెటరీ సలహా.

జానకి తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం.

అదొక తలపైపడ్డ బాంబు.

వెళ్ళిపోవడమొక్కటే కాకుండా ఆరోజు తర్వాత అన్ని టివి చానళ్ళలో తన అవినీతి సంపాదన రహస్యాలన్నింటినీ జానకి మీడియాలో ఏకరువు పెట్టుట. దానిపై తక్షణ చర్యగా ప్రభుత్వ సి బి ఐ దర్యాప్తు .

దాన్ని ముందే తను ఊహించాడు కాబట్టి..అన్నీ రాత్రంతా సర్దుబాటు చేసుకుని..ఎక్కడి దొంగలు అక్కన్నే గప్ చిప్. ఎవరికీ ఏదీ దొరుకలేదు.

ఒకటే ప్రిన్స్ పుల్ ఈ దేశంలో.

డబ్బుతో..అధికారంతో..బ్లాక్ మెయిల్ తో ఈ సమాజంలో ఏదైనా చేయవచ్చు.

ఇక ఆ పద్ధతే పాటించడం మొదలుపెట్టి.,

అవినీతి ఆరోపణలపై అరెస్ట్ వారంట్ వస్తే..పే అండ్ యూజ్ పద్ధతిపై జడ్జ్ కు డబ్బుల కట్ట.. మర్నాడు బెయిల్.ఇక ఎంక్వయిరీలన్నీ బోగస్.

ఇక రిపేర్ చేసుకోవాలి. పరిస్థితులను.. కుటుంబాన్ని..భవిష్యత్తును.అంతా పునర్నిర్మించుకోవాలి.

జానకి వెళ్ళిపోయింది. తిరిగి రాదు.మేక..పులి..కలిసి కాపురం చేయలేవు. కుదరదు.శాశ్వతంగా దూరంకావడం తప్పదు.భిన్న భావజాలాలు కలువవు. అదంతే.ఒక వారం మస్తుగా తాగీతాగీ మానసికంగా సిద్దపడ్డాడు జానకిని కోల్పోవడానికి.కాని పాప రవళి.

ఏదో తెలియని దుఃఖం.

ఇక సుమ.సుమతో గొడవ జరిగిన తర్వాత స్పష్టంగా అర్థమైన విషయమేమిటంటే..ఆమె లేకుండా,ఆమె సుఖం లేకుండా తను బ్రతుకలేడని.

సుమ గురించి పూర్తిగా తనకు తెలుసు. ఆమె డబ్బు మనిషి.సుఖాల మనిషి.ఇస్తే ఏదైనా తీసుకునే మనిషి. నువ్వస్తే ఏం తెస్తవ్..నేనొస్తే ఏమిస్తవ్..టైప్.

ఐతే సుమది అసాధారణ అందం. శరీరం, కలర్, వంపుసొంపులు, ముఖ్యంగా కళ్ళు,చూపు..సెక్స్ జరిపేటప్పుడు ఆమె అందించే సౌఖ్యం..ప్రతిస్పందన..తననెవ్వరన్న నీ సమస్త సంపదంతా ఒకవైపు..ఈ ‘సుమ ‘ అనే స్త్రీ ఒకవైపు.. నీకేది కావాలి అని అడుగుతే..అస్సలే తటపటాయించకుండా సుమే కావాలంటాడు.

తనకు సుమ అంటే పిచ్చి.సుమ అంటే వ్యామోహం.ఉన్మాదం.వెర్రి.ఆమె కావాలి.అంతే.

అందుకే సిగ్గు విడిచి మళ్ళీ సుమ గురించి కబురు చేశాడు.

తనకు అర్థమైనంతవరకు సుమకు కూడా తనంటే కొంత పిచ్చి ఉంది.అందుకే తననుండి పిలుపు రాగానే మొగుణ్ణికూడా వెంటపెట్టుకుని మరీ వచ్చింది.వచ్చి తప్పయిందంది. చెంపలేసుకుంది.ఎవరో చెబితే బుద్ది గడ్డితిని మందిమాటలువిని మార్వానం పోయినట్టు తప్పుపని చేశానంది. ఇక ముందెప్పుడూ అలా చేయనంది.కాబట్టి తిరిగి తననేలుకొమ్మంది. కావాలంటే మళ్ళీ మీడియానంతా పిలిచి తనతో ఎవరెవరు ఎలా బ్లాక్ మెయిల్ చేసి ఆనాడు నాటకమాడీంచారో అంతా చెబుతానంది.

చెబుతుంది..కాని జనం నమ్ముతారా.ఒకసారి పోయిన పరువు మళ్ళీ పునఃప్రతిష్టితమౌతుందా.

జరుగవలసిన డ్యామేజ్ జరిగేపోయింది.ఇప్పుడు చేయవలసింది సహనంతో వేచిచూస్తూ అంతా మరిచిపోవడమే. క్రమక్రమంగా జనం మరిచిపోవాలి. తనూ మరిచిపోవాలి.మరుపు అనేది ఒక మహా ఔషదమై ఈ గాయాన్ని మాన్ పేంతవరకు.,

మరుపు..మరుపు..మరుపు.

మరుపు మనిషికి మహావరం.

కాలం సకల గాయాలకూ ఉపశమనం కలిగిస్తూ మానుస్తూ మరకలను మిగిల్చే లేపనం.

ఈరోజు..వర్తమానం..రాత్రికి గతమై తలుపు తెరుచుకుని రేపు అనే భవిష్యత్తును వర్తమానంలోకి లాక్కొస్తూ..ఒక అనిశ్చిత భవిష్యత్తును స్వప్నిస్తూ..వెలుగు నీడై..నీడ వెలుగై..ఒక ఎడతెగని నిరంతర అదృశ్య ప్రవాహం..కాలం..కాలం.

హౌ ఓల్డ్ యు ఆర్.?

థర్టీ యైట్ ఇయర్స్.

ఎక్కడినుండి థర్టీ యైట్ ఇయర్స్..?

పుట్టుక..జననం.జననం ఒక మూల బిందువు.రిఫరెన్స్ పాయింట్.అక్కడినుండి లెక్క.

వయస్సు ముప్పై ఎనిమిది.

అతను నిన్న వచ్చెను..నిన్న..అనే ఒక కాల శకల ప్రస్తావన.

రేపు వస్తా మీ ఇంటికి..రేపు..అనే ఒక ఊహాత్మక భావి సంభావ్యత.

అనుభవంలో..నిన్న..ఉంది.

అనుభవంలోకి..రేపు..వస్తుందా.?

గతమెప్పుడూ ఒక వాస్తవ అనుభవమై..క్రమంగా చరిత్రగా రూపాంతరం చెందుతూ.,

భవిష్యత్తు ఊహాత్మక మిథ్యగా ప్రచలించే ఒక రాబోయే కల.

రాబోయే కలకు రూపం..నికరత..నిర్ధిష్టత ఉంటుందా.కల వస్తుందనో..రాదనో గ్యారంటీ ఉందా.?

కాలం వ్యక్తి వ్యక్తికీ ఒక్కొక్క పుటగా మారి ఎవరికిచెందిన జీవితం వారిదే ఐ..వైయక్తికమై..సామూహికమై..ప్రాంతమై..దేశమై..వ్యాప్తియై..ఖండాంతర పర్యంతమై..చరిత్ర..చరిత్ర.దేశ దేశాల చరిత్ర..అనాది మానవుని చరిత్ర..యుగయుగాల మానవ పరిణామ చరిత్ర..నాగరికతల,సంస్కృతుల చరిత్ర..కాలం పొరలు పొరలుగా..అన్నింటినీ సాపేక్షం చేస్తూ.,

పొరలు ఎప్పుడూ ఒకదానిపై ఒకటి ఒక పుటపై మరో పుట వచ్చి చేరి తాజాను పాత..పాతను మరీ పాత..ఆ మరీ పాతను పూర్వం చేస్తూ,

గర్జిస్తూ కాలం..తల నిమురుతూ కాలం..శిక్షిస్తూ కాలం..అనునయిస్తూ కాలం.గ్రీష్మమై వసంతమై బాల్యమై యవ్వనమై వృద్దాప్యమై.,

ఆ అందాలేవి..ఆ అధికారాలేవి..ఆ అహంకారాలేవి..ఆ వైభవ పటాటోపాలేవి..ఆ రాజ్యాధికార ధగధగల మహోజ్జ్వల మహానుభూతులేవి.?

అన్నీ పొటమరించి..నింగికి పొంగి..మళ్ళీ వంగి..ఉత్థాన పతనాలై.ఉదయాస్తమయాలై,

ఈ అనంతకాలగమనంలో మానవుని ఆవిర్భావం నుండి, రాజ్యాలు పుట్టి పెరిగి విస్తరించి మనిషి వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా,  నియంతగా,శాసకునిగా..ఎదిగి ఎదిగి..అంతరించి..శిధిలమై..చెంగిజ్ ఖాన్ లు,నెపోలియన్ లు,అలెగ్జాండర్ లు,హిట్లర్ లు,రావణులు,రాముళ్ళు..మానవ చరిత్రంతా రక్తసిక్తమై,అశ్రుసముద్రమై,

మనిషిని శాసించిన మూల అంశాలు రెండే.

ఒకటి..హింసతో హస్తగతం చేసుకుని మదోన్మత్తతతో జీవితాంతం తపించిన అధికారోన్మాదం.

రెండు..రాజ్యాలనూ,సకల సంపదలనూ పరిత్యజించి ప్రేమ పేరుతో,కామం పేరుతో,ఆరాధన పేరుతో,పవిత్రత పేరుతో ఒక ఎండమావి వెంటపడి పరుగెడిన పురుషున్ని పరితపింపజేసిన..స్త్రీ.

స్త్రీ మగవాన్ని తన బానిసను చేసుకుంది..తన ముగ్ధమోహన సౌందర్య లాలసతో.

పురుషుడు..నిరంతరం స్త్రీ అనే ఆలంబనకోసం యుద్ధాలు చేస్తూ..రాజ్యాలను జయిస్తూ తననుతాను కోల్పోతూ,

సృష్టి ఆది నుండి కొనసాగుతూ వస్తున్న ఈ అనంత కాంక్షా భ్రమణంలో..విరామం విశ్రమణ వివర్తన..ఉంటాయా.

స్థూలం నుండి సూక్ష్మం వైపు..మళ్ళీ సూక్ష్మం నుండి స్థూలాతీతం వరకు సాగుతున్న ఈ నిరంతర మానవాన్వేషణకు అంతముందా.?

ఈ పరుగు,ఈ అజ్ఞాతోన్మాదం,ఈ వేట,ఈ కాంక్ష ల నుండి మనిషికి విముక్తి ఉందా.?

వ్చ్.,

అంతిమంగా స్త్రీ ఐనా, పురుషుడైనా ఒట్టి నిమిత్తమాత్రులేనా.?

రమణకు ఎందుకో ఒళ్ళు జలదరించినట్టయింది.కొద్దిసేపు తననుతాను కోల్పోయి పెనుగాలిలో కొట్టుకుపోతున్న ఎండుటాకులా వణికిపోతూ ప్రకంపించాడు.ముఖంనిండా ముచ్చెమటలు పట్టాయి.హోటల్ గది ఆంతా ఎ సి తో చల్లగా ఉన్నా లోపల ఎక్కడొ ఒక అంతర్ఘర్షణ.అంతర్జ్వలనం.లోలోపల దహించుకుపొతూ ఏదో.

ఆ ఏదో ఏమిటి.?

అప్పటినుండీ కళ్ళు మూసుకుని నిశ్చలసముద్రం అట్టడుగున విస్ఫోటిస్తున్న అగ్నిపర్వతాలతో ప్రళయిస్తున్నట్టు ప్రకంపించి.,

చటుక్కున కళ్ళు తెరిచాడు.

మరో ప్రపంచంలోకి వచ్చి పడ్డట్టు,ఒక దీర్ఘ స్వప్నంనుండి విముక్తమై తెప్పరిల్లినట్టు,

గాజు పరదా అవతల ప్రశాంతంగా సముద్రం..ఎప్పటిలాగే.నీలాకాశం ఎప్పటిలాగే..దిగంతాల అవతల నిర్మల అనంతాకాశం ఎప్పటిలాగే.

ఇటు.. గదిలోపలివైపు చూశాడు.

పది అడుగుల దూరంలో మెత్తని వెన్నెలపరుపుపై అదమరిచి నిద్రిస్తూ..సుమ.

రాత్రంతా జుగల్ బందీవలె జరిగిన రసోద్విగ్న రతిక్రీడలో అలసిసొలసి..తృప్తయై..వర్షంలో తడిచి తడిచి చిత్తడినేలవలె మిగిలి అనురక్తయై..సుమ.

సుమ నిద్రిస్తున్న మెరుపు తీగ. నిశ్చలించిన విద్యుల్లత.

రమణ తనకు తెలియకుండానే లేచి మెల్లగా కొద్ది అడుగులేసి..బెడ్ దగ్గరకు వెళ్ళి సుమ దిక్కు అలా అప్రతిభుడై చూస్తూ నిలబడ్డాడు వెలుగుతున్న దీపం దిక్కు పసివాడు విభ్రమంతో చూస్తున్నట్టు.

ఆమె గాఢ నిద్రలో ఉంది.ముఖం నిండా ఈ సమస్త ప్రపంచాన్ని మరిచి ఎక్కడో గంధర్వలోకంలో స్థిరపడిపోయినట్టు అతిప్రశాంతత. ఉద్గారిస్తున్న చిరునవ్వు.మనిషిలో ఇక ఏ కాంక్షలూ లేని సంతృప్త స్థితిలోనుండి మాత్రమే ప్రస్ఫుటం కాగలిగే పూర్ణత.వెరసి ఆ క్షణం ఆమే ఒక పూర్ణ.పూర్ణ స్త్రీ.పరిపూర్ణ స్త్రీ.

స్త్రీలలో..పురుషుల్లోకూడా పూర్ణ అసంపూర్ణ స్త్రీ పురుషులుంటారా.వాళ్ళ వాళ్ళ జన్యు సంధానత, అమరిక,కూర్పును బట్టి పూర్ణ,పాక్షిక,మధ్యస్థ స్త్రీ పురుష లక్షణాలూ,సమర్థతలూ,శృంగారాసక్తులూ,రత్యాభిరుచులూ,స్పందన ప్రతిస్పందనలూ,ఆసక్తి తీవ్రతలూ ఉంటాయా.

వందకు ఒక్క ఇరవైమందికూడా స్త్రీలలోగానీ,పురుషుల్లోగానీ పూర్ణ స్త్రీ,పూర్ణ పురుష లక్షణాలను కలిగి ఉండరు సహజంగా..వాళ్ళ భౌతిక దేహ నిర్మాణాన్ని బట్టీ,నడకా,ప్రవర్తన ప్రతిచర్యలను బట్టీ మనుషులను అతి సుళువుగా అంచనా వేయవచ్చునని లైంగిక శాస్త్రవేత్తలు ఎక్కడో ప్రస్తావించినట్టు గుర్తొచ్చింది రమణకు.

సుమ నిస్సందేహంగా ఒక పరిపూర్ణ స్త్రీ.

అతనలా తదేకంగా ఆమెవంక చూస్తున్నపుడే చూపులు వచ్చి గుచ్చుకున్నట్టు ఆమె సున్నితంగా కనురెప్పలను విప్పి., చిరునవ్వు దీపజ్వాలలోనుండి కాంతి వెలువడుతున్నట్టు ఆమె పెదవుల్లోనుండి జాల్వారుతూండగా..ఊర్కే అలా చూచింది రమణ ముఖంలోకి.

ఏవో అదృశ్య శక్తి తరంగాలు వచ్చి పైకి కెరటంలా దూకినట్టు కంపించిపోయి రమణ తడబడుతూండగా ఆమె “గుడ్మార్నింగ్”అంది మార్ధవంగా.

బలమైన అయస్కాంతక్షేత్రంలోకి ఓ చిన్న గుండుసూది చటుక్కున పరుగెత్తి అతుక్కుపోయినట్టు..రమణ మెల్లగా ఆమెపైకి వంగి బాహువులను చుట్టూ విస్తరిస్తూ ముఖంపై ముఖాన్ని ఆనిస్తూ..మనిషిని తాబేలువలె ఆక్రమించాడు.సుమ అతని వీపు చూట్టూ చేతులను గట్టిగా చుట్టేసి గుండెలకు బలంగా హత్తుకుంటూ..జుట్టులోకి వ్రేళ్ళను జొనిపి సన్నగా మూల్గింది.

క్షణాలు ఒక్కోసారి స్తబ్ధించి స్త్రీ పురుషుల మధ్య తల్లడిల్లిపోతాయి తప్పించుకోలేక.కాలం ఓ లిప్తకాలం దయతో మనుషుల్ని అశీర్వదిస్తూ రతిరక్తిని సృష్టికార్యంగా ఆమోదిస్తూ ప్రణమిల్లుతుంది.ప్రపంచమంతా పరవశించిపోతుంది.

“రమణా”అంది సుమ అతని చెవుల్లో సన్నగా.పిలిచిందా.పలికిందా.పలవరించిందా.

“ఊ..”

“నాలో ద్రవిస్తూ కరిగి ప్రవహిస్తావా”

“ఊ..”

మనుషుల ఒట్టి నిమిత్తమాత్రులై, దేహాలే సంగమిస్తున్న ద్వైతాద్వైతాలై..నిప్పు కణిక ప్రక్క మరో నిప్పుకణిక ప్రక్కన..రెండూ ఏకాగ్నిగోళమై.,

ఒక అరగంట తర్వాత,

ఇద్దరూ స్నానించి,

ఆమె ఓవెన్ లోనుండి పాలూ, డికాక్షన్ తెచ్చి..కొద్దిగా షుగర్ కూబ్స్ వేసి..రెండు టీ కప్పులు తయారించి..ఎదురుచూచింది.

రమణ బట్టలేసుకుని రాగానే ఒక టీ కప్పును అతని ముందుకు జరిపి.,

“ఎప్పుడైనా సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకున్నావా రమణా” అంది.

“అంటే”అన్నాడు రమణ.

రమణకు తెలుసు సుమ విపరీతంగా పుస్తకాలు చదువుతుందని.తను ఎప్పుడైనా ఉత్సాహంగా ఉన్నపుడు కొంత డబ్బిస్తే ఆమె అందరు ఆడవాళ్ళలా చీరలూ నగలూ ఎప్పుడూ కొనలేదు.పుస్తకాలు కొంటుంది.చదువుతుంది.ఎప్పుడు చూచినా చేతుల్లో ఒక పుస్తకముంటుంది.

నిన్న హైదరాబాద్ నుండి బయల్దేరుతున్నపుడు ఏర్ పోర్ట్ లో ఒక బుక్ కొంది.దాని పేరు..’ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ ‘.డేనిఎల్ గోలెమన్.ఆ పుస్తకాన్ని కొంటూ అంది..గోలెమన్ బెస్ట్ రైటర్.ఇదివరకు ఈయనవే..ది క్రిఏటివ్ స్పిరిట్,డిస్ట్రక్టివ్ ఎమోషన్స్,ది మెడిటేటివ్ మైండ్ బుక్స్ చదివాను.ఒక పద్ధతిప్రకారం మనిషి తత్వాన్ని విశ్లేషిస్తూ పోతాడు.నచ్చుతుంది నాకు బాగా.

నమ్మబుద్దికాదు ఆమెను చూస్తూంటే..ఈమె ఇంత విస్తృతంగా చదువుతుందా అని.సంభాషిస్తున్నపుడుకూడా అనేక ఆసక్తికర విషయాలను ప్రస్తావిస్తుంది.రాత్రి అంది ఫ్లైట్ లో వస్తున్నపుడు..హొరేస్ వాల్ పోల్ చెప్పినట్టు..’కేవలం ఆలోచించేవాళ్ళకు జీవితం ఒక హాస్యం.కాని అనుభూతించేవాళ్ళకు మాత్రం జీవితం ఒక విషాదమే’అని.అది ఒక లోతైన జీవిత సత్యం.మనుషుల్లో చాలా మంది జీవితాన్ని ఊర్కే ఆలోచిస్తూ అలా అలఓకగా జీవిస్తున్నారే తప్ప సీరియస్ గా అనుభూతిస్తూ జీవించట్లేదనే దెప్పిపొడుపుంది అందులో.

“ప్రతి మనిషికీ తెలిసీ తెలియకా కొన్ని అంతర్గత ,మరికొన్ని బాహ్య శక్తులుంటాయి.జన్మతః సంప్రాప్తించే గాయక,చిత్రకళ,గ్రాహక ఇత్యాది కళలన్నీ అంతర్గత శక్తులే.వాడు ఒక ఐ ఎ ఎస్ ఆఫీసర్ కొడుకై పుట్టడం,ఒక మంత్రిగారి కూతురై జన్మించడం,నాగేశ్వర్రావు కొడుకై పుట్టడం..వంటివన్నీ ఎక్స్ టర్నల్ స్ట్రెంగ్త్స్.ఐతే మనిషి తెలుసుకోవాలి తనను తాను,తన లోపలా బయటా ఏఏ శక్తులు తనకు అందుబాటులో ఉన్నాయీ అని.హనుమంతుడికి తెలియలేదు జాంబవంతుడు చెప్పేదాకా తనలో సముద్రాన్ని లంఘించగల అంత గుప్తశక్తి దాగి ఉందని. తెలుసుకోవాలి తన్నుతాను. ఇది ఒకటైతే..మరొకటి..తన ఈ అంతర్ బహిర్ శక్తులను ఏ రకంగా వాడుకుంటున్నాడూ అని విజ్ఞుడైన ప్రతి వ్యక్తీ ఎప్పటికప్పుడు లెక్క చూచుకోవాలి.కోటి రూపాయలున్నాయి..వాటిని ఏఏ పనులకు ఏరకంగా, ఎంత ప్రయోజనకరంగా ఉపయోగిస్తున్నామో..పనుల ప్రాధాన్యతలేమిటో..విమర్శ చేసుకోవాలి.అదే సెల్ఫ్ ఆడిటింగ్”

రమణలో ఇన్నిరోజులుగా దాగిఉన్న లోపలి లావా అకస్మాత్తుగా బయటికి చిమ్ముకొచ్చింది.

“సుమా..ఆ రోజు ఆఫీస్ లో ఆ రకంగా చెప్పుతో కొట్టి హంగామా చేయడానికి సూటిగా కారణం చెప్పు”

ఆమె షాక్ తింది. ఊహించలేదసలు ఆ ప్రశ్నను. రమణ మరిచిపోయాడనుకుంది. మరిచిపోదగ్గ చిన్న విషయం కాదది.  తెలుసు. కాని.,

మళ్ళీ తన స్నేహాన్ని కోరుతూ రమణ సంప్రదించిననాడు అనుకుంది తను అంతామరిచి పునః…అని.అప్పటికే ఆమెకు కూడా అర్థమైంది రమణ విషయంగా తను చేసింది తప్పని. అలా చేయవలసింది కాదనీ. అంతకుమించి రమణను తానుకూడా చాలా చాలా కోరుకుంటోందని.

“రమణా..ప్రతిమనిషిలోనూ పరస్పర బలహీనతలతో నిండిన అనేక తత్వాలుంటాయి.ఎమోషన్స్ ఉంటాయి.  జయించలేని అంతర్గత లోపాలుంటాయి. అనేక సందర్భాల్లో తను చేస్తున్న పని తప్పని ప్రతివాడి ఆత్మకూ తెలుసు. అలా చేయకూడదని కూడా తెలుసు.ఐతే తప్పులు చేసే చాలామంది మనుషులు తెలిసే,కావాలనే తప్పులు చేస్తున్నారు. అత్యంత వ్యక్తిగత బలహీనతలను అధిగమించలేని వాళ్ళందరూ చేసేవన్నీ తెలిసి చేసే తప్పులే. సిగరెట్టు తాగడం తప్పనీ ఆరోగ్యానికి హానికరమనీ తెలుసు. తెలిసే తాగుతాడు. మందు తాగడంకూడా అంతే. లంచం తీసుకోవడం తప్పని తెలియదా తీసుకుంటున్నవాడికి. తెలిసే తీసుకుంటాడు.ఇంట్లో ఉత్తమురాలైన భార్య ఉండగా మరో ఆడదానితో పడుకోవడం తప్పని తెలియదా. తెలుసు. తెలిసే అక్రమ సంబధాన్ని మొదలుపెడతాడు. పైగా విషాదమేమిటంటే ఈ తెలిసి చేసే తప్పులను ఎక్కువగా బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులే పదే పదే చేస్తారు.”.

విజ్ఞులైన మనుషులు వాళ్ళ బలాలకంటే వాళ్ళలోని బలహీనతలేమిటో తెలుసుకోవాలె.బద్ధకం,పనులను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం, సుళువుగా డబ్బును నీతిహీనంగానైనా సరే సంపాదించడం, ఉచితంగా వస్తే తాగడంతో మొదలై క్రమక్రమంగా తన స్వంత దబ్బుతోనైనా సరే తాగుడుకు బానిస కావడం, ఏమాత్రం అవకాశమున్నా స్త్రీ పురుషునితో, పురుషుడు స్త్రీతో అక్రమమో, సక్రమమో శారీరక సంబంధానికి ఉవ్విళ్ళూరడం.. వీలున్నప్పుడల్లా కొనసాగించడం.. రాజకీయాలు, కార్పొరేట్ సంస్కృతి..వ్యాపారం..వీటిలో ఐతే ఇంకా నిస్సిగ్గుగా దోపిడీ చేస్తూ విజృంభించడం.. ఇవన్నీ చాలా మందిలో ఉండే బహిరంగ బలహీనతలు.వీటిని ఎవరికివారు ముందు తెలుసుకోవాలె .

తెలుసుకున్న తర్వాత వాటిని జయిస్తామా లేదా అన్నది వేరే విషయం.

ఐతే ఈ సకల బలహీనతల్లోకి అతి బలమైన బలహీనతలు..సెక్స్..డబ్బు..అధికారం.

వీటికి లొంగిపోవడం చాలా సుళువు.వీటిని జయించడం చాలా కష్టం.

నన్ను నేను చాలాసార్లు నా బలహీనతలను తెలుసుకునేందుకు ప్రయత్నించాను.

తాగుడు నా బలహీనత.

నా మొగుడు నా మాటవిని నేను నీ దగ్గర పడుకుంటున్నా ఏమీ అంటలేడంటే దానిక్కారణం వాడి తాగుడు బలహీనత. నేనేమైనా, ఎక్కడ ఎవడితో ఏంచేసినా వాడికనవసరం. వాడికి ప్రతిరోజు రాత్రి ఏడయిందంటే ఒక హాఫ్ బాటిల్ కావాలె. ఖర్చుకు ఒక రెండు వందల రూపాయలు కావాలె. అంతే

నాక్కుడా అంతే. దాదాపు రోజూ తాగడం నా బలహీనత. ఓపెన్ గా చెప్పాలంటే ఏ కొంచెం అవకాశమున్నా ప్రతిరోజూ సెక్స్ కావాలి నాకు. అదీ బలహీనతే. కాగా ఒక్క ఆ మనిషితోనే శారీరక సుఖం కావాలని వెంపర్లాడ్డం పెద్ద బలహీనత. నేనేమి చేసినా నా శరీరమే కావాలని పిచ్చిగా కోరుకోవడం నా మొగుడి బలమైన బలహీనత. ఆ వీక్నెస్ ను ఆసరా చేసుకుని వాన్ని నేను ఎన్నిసార్లో బ్లాక్ మెయిల్ చేశాను.

ఇంకా లోతుకు పోయి నిజాయితీగా హృదయాన్ని విప్పితే..చాలా మందికి పాతోక రోత కొత్తొక వింత.అది రంభయినా నాల్గుసార్లు అనుభవించిన తర్వాత పాతబడిపోతుంది. మళ్ళీ మరో కొత్త మనిషికోసం అన్వేషణ. వెంపర్లాట.

సునిల్ గోస్వామి విషయంగా జరిగిందదే. అప్పుడు నాకు చాలా డబ్బు అవసరమేర్పడింది. ఐదు లక్షలు. నిన్నడిగాను. నువ్వివ్వలేదు. చాలా అర్జంట్. గోస్వామిపై ముచ్చట కూడా తోడైంది.

నాకు తెలుసు.నాది స్టన్నింగ్ అందమని.నా అందం,ఆకర్షణ మగాన్ని పిచ్చోన్ని చేస్తుంది. స్త్రీకి ఎదుటి మగాన్ని పిచ్చెక్కించే సమర్థత ఉండడం ఓ రకమైన అదృశ్య అహం.ఆ అజ్ఞాత శృంగార తృష్ణతోకూడిన ఊపు స్త్రీతో చాలా చాలా జిమ్మిక్కుల్ని చేయిస్తుంది.విచక్షణనూ,ఇంగితాన్నీ నశింపజేసి పాక్షిక విచ్చవిడితనాన్ని ప్రేరేపిస్తుంది.సరిగ్గా ఆ సంక్లిష్ట బలహీన మానసిక స్థితిలో నేను చేసిన దుశ్చర్యే నీపై ఆ దాడి.డబ్బు.. వివేకం కోల్పోయిన అనార్కిక్ తత్వం ఆరోజు చాలా మ్యాడ్నెస్ నన్నావరించి.,

సుమ ఆగిపోయింది అకస్మాత్తుగా. ఆమె ముఖం నిండా ఉద్వేగం ఆవరించి వివర్ణమైపోయింది .

కొద్దిసేపు ఇద్దరి మధ్యా ఒట్టి నిశ్శబ్దం విస్తరించి.,

సుమ కలిపి పెట్టిన రెండు టీ లు అలాగే ఉండిపోయాయి. ఎవరూ తాగలేదు. చల్లారిపోయేయి.

“నిన్ను నేను సహజంగా చాలా అసహ్యించుకుని తరిమేయాలికదా..కాని,”అగాడు రమణ.

“ఔను.నేను నీకు చేసిన ద్రోహానికి అసహ్యించుకోవడమనేది ఏ మామూలు మనిషైనా చేసేదే. అదీకాక నాపై వ్యక్తిగతమైన కక్ష్యా పగతో ఏదో ఒక హాని తలపెట్టడంకూడా ఎవరైనా చేసేదే. కాని మన విషయంగా అలా జరుగలేదు. అది చిత్రం. దానికి రెండు కారణాలున్నై. ఒకటి అప్రత్యక్షంగా నాపై నీకింకా వ్యామోహం తీరకపోవడం. రెండు నాక్కూడా నీపై నాకే తెలియని పిచ్చి ఏదో నాలో అజ్ఞాతమై ఇంకా దాగి ఉండడం.”

రమణ మాట్లాడలేదు.

అన్నీ తప్పులే. తను చేసినవీ.. సుమ చేసినవీ. ఒకరికొకరికి తెలిసీ.ఒకరికొకరికి తెలియకా.

ఒక రకంగా మనుషులు చాలా మంది తప్పులను చేస్తూ,వాటిని సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తూ, సరిదిద్దుకోలేక.. సతమతమైపోతూ,

అటు సముద్రం దిక్కు చూస్తున్నాడు అభావంగా.

అప్పటివలె దృశ్యం ప్రశాంతంగా లేదు.ఎర్రగా ఆకాశం..కల్లోలంగా సముద్రం.. సూర్యుడు రౌద్రంగా నింగిలోకి ఎగబ్రాకుతూ,

సుమను ఇక తప్పిద్దామనుకుంటున్నాడు తను. ఎందుకో అమె అంటే ఒక రకమైన జుగుప్స ఏర్పడింది. కాని అది చాలా క్షణికమై.,

వెనుదిరిగి ఆమె ముఖంలోకి చూస్తే చాలు..కరిగి మళ్ళీ ఆమె వశమైపోతాడేమో.

శారీరక వ్యామోహాలంతే మనిషిపట్ల ఉండే వాంఛాగ్ని విచక్షణను ధ్వంసించి రిక్తులను చేస్తుంది.

“నిన్ను విడిచి..” అని అతనంటూండగానే..సరిగ్గా అదే క్షణం ఎవరో ఆదేశించినట్టు”నిన్ను విడిచి..”అంది సుమ.

“మెలాంకలీ అని ఒక గమ్మత్తైన పదముంది రమణా..”

ఇంకా ఆమె ఏదో చేబుతోంది..రమణ ఆమెవైపు తిరిగి చూస్తూ,

కళ్ళు..నిండా మెరుపుతో..చూపులు..విరజిమ్ముతున్న బాణాలవలె..ప్రసన్నత..అప్పుడే విచ్చుకున్న తెల్లకలువవలె.

ఉహు..వశం కాదు..తట్టుకోవడం ఆ చూపులను.

“మెలాంకలీ కి తెలుగులో సమానార్థం దాదాపు వ్యసనం..అని”

“అలవాటు..వ్యసనం..ఈ రెండూ ఒకటి కాదు.ఒక యాంత్రిక దినచర్యగా ప్రతిరోజూ నిర్వహిస్తూపోయేది అలవాటైతే.. తను ఒక పనిని చేయకుండా ఉండలేని నిస్సహాయ స్థితి వ్యసనం. జూదం ఆడడం తప్పని తెలుసు. కాని ఆడకుండా ఉండలేని స్థితి..వ్యసనం. వ్యవసాయం లాభాన్నిస్తుందన్న నమ్మకంతో నష్టమొచ్చినా ఫరవాలేదని సాహసించి మొక్కలతో, భూమితో, అనుబంధమై సాగే వృత్తిని వదులుకోలేక వ్యవసాయమే చేయడం వ్యసనం.ఒక మానసిక విశేష తత్వంగల కొందరు తరచూ డెప్రెషన్ కు లోనౌతూ..దుఃఖ ఛాయలతో ఉద్విగ్నుడౌతూ ఏదో అవ్యక్త వ్యాకులతతో బాధపడే మానసిక స్థితినే మెలాంకలీ అని వ్యవహరిస్తారు రమణా.సాధారణంగా రచయితలూ, కళాకారులూ, సృజనకారులూ, సంగీతకారులూ.. ఈ మెలాంకలీ క్షేత్రంలో పరితపిస్తారు ఎప్పుడో ఒకప్పుడు.ఇది ఒక మానసిక రుగ్మతగాకూడా భావించడం జరుగుతుందప్పుడప్పుడు.”

ఈమెలో ఈ భిన్న వైరుధ్య ద్వంద్వాలెలా ఇమిడిఉన్నాయో..అని అనుకున్నాడు రమణ.

ఒకవైపు అతి మామూలు స్త్రీకి ఉన్న సకల బలహీనతలన్నీ ఉంటూనే..నిరంతర పుస్తకసాహచర్యంతో సంక్రమించిన ఈ జ్ఞానం..ఒక అదనపు ఆకర్షణై..సుమ.,

మనిషిలో గుప్తంగా దాగిఉండే అరాచక అపశృతులూ, వైరుధ్యాలూ ఏకోన్ముఖమై వేదించినపుడు ఏర్పడే శూన్యతకు సంబంధించిన విషాద స్థితిని అతి జాగ్రత్తగా విశ్లేషించి పరిష్కరించాలని డేనియల్ గోలెమన్ తన ‘మేనేజింగ్ మెలాంకలి ‘అనే చర్చలో చెప్పాడు.మేధోజీవులకు సంబంధించిన సూక్ష్మమైన విషయమది.

“మనం బయటికి వెళ్దాం పద సుమా”అన్నాడు రమణ ఉన్నట్టుండి.

ఆమె మౌనంగానే అతనివంక చూచి..సరే అన్నట్టు తలూపి,

డోర్ దిక్కు నడుస్తున్న రమణను అనుసరించింది.

 

*******

సెంటోస బీచ్.

లోపలికి వచ్చి రెండుగంటలైంది.

ఇద్దరూ మాట్లాడుకున్నది దాదాపు లేనేలేదు.

ఎవరిలోకంలో వాళ్ళు.

భేదించి శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయిన భార్య జానకి. ఆదర్శవాది.. ఋషితుల్యురాలు.. నిరపేక్ష, నిరాడంబర జీవితం ఇవే జీవిత మూలాలని విశ్వసించే ఉన్నతి.

కోల్పోయిన కూతురు..రవళి.

దెబ్బతిన్న పరువు. గౌరవం. దర్యాప్తులో ఉన్న అవినీతి ఆరోపణలు.

వీటన్నిటినీ అతి చాకచక్యంతో ఎదుర్కొని మళ్ళీ వెలుగులోకి రాగల సత్తా.. హైలెవెల్ సంబంధాల నెట్ వర్క్.

ఈ దేశంలో జనం అన్నింటినీ మరచిపోయి మళ్ళీ ఆదరిస్తారు. దౌర్భాగ్యమదే. లక్షలకోట్ల రూపాయలను అవినీతికర మార్గాల్లో సంపాదించి పదుల కుంభకోణాల్లో చిక్కుకుని..ఋజువైకూడా ఇంకా ప్రజలచేత ఆదరించబడుతున్న దొంగ నాయకులను చూస్తూంటే..ఏమి ప్రజలు..ఏవి సిద్ధాంతాలు.. ఏమిటీ వ్యవస్థ..దిగజారిపోయిన రాజకీయాల్లో దిగజారిపోయిన ప్రజలకోసమా త్యాగాలు అన్న మీమాంస.

ప్రతి కలయికలోనూ స్వర్గాన్ని చూపించే ఓపెన్ లేడీ సుమ.ముగ్ధ మనోహర.చాలా దుర్గుణాలున్నా మనిషిని పోగొట్టుకోలేని బలహీనత.

ఒంటరిగా మిగిలి..రహస్యంగా వందల కోట్ల ఆస్తిని ఇప్పటికే వెనుకేసుకుని ఒక బలమైన దన్నును ఏర్పరుచుకున్న ఆర్థిక నేపథ్యం.

‘ధనం మూలం ఇదం జగత్ ‘అన్న పరమ సత్యం.

కాని తన కుటుంబం..కొత్తగా ఏర్పరుచుకోవాలా.?

మళ్ళీ ఒక భార్య..కాపురం..పిల్లలు..అన్నీ సమకూర్చుకోవాలా.?

ఏదైనా జఠిలమైన సమస్య వచ్చినపుడు ఇలా సింగపూర్ కు వచ్చి ఏకాంతంగా గడిపి స్థిరంగా నిర్ణయాలు తీసుకోవడం రమణకు అలవాటు.

రాత్రినుండి రమణ చేస్తున్నదదే. కంప్యూటర్లోకి ఒక ప్రోగ్రాం ను ఇండక్ట్ చేసినతర్వాత ప్రాసెసింగ్ ఔతూంటుంది. ఇప్పుడు తను తన భవిష్యత్తును పునర్నిర్మించుకోడానికి పథకం.,

సుమ ఒక జస్ట్ కంపనీ.. తోడు. అందమైన అనుభవం. .టైం పాస్. యూజ్ అండ్ త్రో. కాకుంటే ఓ రెండుమూడు లక్షల ఖర్చు.నో మ్యాటర్.

ఎదురుతిరిగినదాన్నే మళ్ళీ పాదాక్రాంతం చేసుకుని కసిగా అనుభవిస్తూ పొందే లోపలి ఇగో సాటిస్ఫాక్షన్..తృప్తి.

కంప్యూటర్ ప్రోగ్రాంను ప్రాసెస్ చేస్తున్నపుడు..సైలెంట్ గా..నిశ్శబ్దంగా.చడీచప్పుడు లేకుండా,

రమణా అంతే.

చాలా చాలా గంభీరంగా, తీవ్రంగా, లోతుగా, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

అతని వెంట అలా అన్యమనస్కంగా నడుస్తూనే వస్తోంది సుమ.

ఆమెకు తెలుసు తాము ప్రక్కప్రక్కనే ఉన్నా తమ మధ్య కొన్ని యోజనాలదూరం ఉన్నదని.

కొందరు అదృష్టవంతులు ఎక్కడెక్కడో ఖండాంతరాల్లో ఉంటారు.కాని వాళ్ళ మధ్య అసలు దూరమే ఉండదు. మధ్యనున్న దూరాలతో మనుషులనూ వాళ్ళ జీవితాలనూ అంచనా వేయగల లోతులు తనకు తెలుసు.

ఒక నిరాధార నేపథ్యంగల కుటుంబం నుంచి రాతినేలలోనుండి మొలకలా ఎదుగుతున్న తనకు ఒక నిరుద్యోగ దుర్మార్గ తాగుబోతు భర్త. వాడు ‘తెచ్చి పెడితే తింట..చచ్చిపోతే పారేస్తా ‘బాపతు. మెడలో ఒట్టి లైసెన్స్ బిళ్ళ.

జెనిటికల్ కాంబినేషన్సే మనిషి ప్రవర్తననూ, అనుభూతులనూ, సకల చర్యలనూ, అభిరుచులనూ శాసిస్తాయని తను బలంగా నమ్ముతుంది. మనిషి యొక్క డి ఎన్ ఎ అమరికలనూ, కూర్పులనూ రీ-ఇంజనీరింగ్ పద్దతులతో మార్చగలిగితే మనం అనుకున్న లక్షణాలే గల మనుషులనూ,అనుభూతించగల ,ప్రతిస్పందించగల మానవులనూ తయారు చేయొచ్చని సుమ నమ్మకం.ఆ సిద్దాంతం ప్రకారం తన శరీర నిర్మాణంకూడా విలక్షణమైందే.

సున్నితత్వం ఎక్కువ.అవేశం ఎక్కువ. అనుభూతించడం ఎక్కువ.గ్రహణ శక్తి ఎక్కువ.ధైర్యం ఎక్కువ.. అంతర్ముఖురాలై లోలోపల పొంగిపోవడం,కుంగిపోవడం,దుఃఖించడం,ఎవరైనా మనసును తాకితే కరిగి ప్రవహించడమూ ఎక్కువే.

రాజమండ్రి నుండి ఏ పదిహేను సంవత్సరాల క్రితమో సెక్రెటేరియట్లోకి ఒక మామూలు గుమాస్తాగా వచ్చి..ఒక్కో మెట్టు..ఒక్కో అడుగు.

తాగుబోతు భర్తతో ఒక కొడుకు. పన్నెందేండ్లు. మానవ కాలుష్యం అంటకుండా రెసిడెన్షియల్ స్కూల్లో చదువు.

తనలో ఉన్నవి మూడు అవతారాలు. మొన్నమొన్ననే నాన్న చనిపోయేదాకా ఒక కూతురు. పిల్లాడు పుట్టిన తర్వాత ఒక తల్లి. ఇక మిగిలిందంతా ఒక అందమైన స్త్రీ.భావుకురాలూ,స్వాప్నికురాలూ,గంధర్వలోక విహారి ఐన రసహృదయురాలు.

మహాత్మా గాంధీ తన ఆత్మ కథ ‘సత్య శోధన ‘లో చెప్పిన “భవిష్యత్తు గురించి నిరంతరం తీక్షణంగా ఆలోచించడం కంటే వర్తమానంలోని ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే నాకిష్టం” అన్న వాక్యాన్ని చాలా ప్రేమించి ఆచరించే వాస్తవికురాలు.

సుమ మనుషులను ఎన్నడూ నమ్మలేదు.

‘మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలే’ అని కారల్ మార్క్స్ చెప్పిన మూలసూత్రాన్ని పూర్తిగా నమ్మి ప్రతివ్యక్తినీ పరిశీలిస్తూనే వస్తోంది ఎక్కడైనా ఈ సూత్రం ఫెయిలౌతుందేమోనని. కాని ఒక్కసారి కూడా మార్క్స్ సూత్రానికి భిన్నమైన మనిషి ఎక్కడా తారసపడలేదు.

మేనేజ్మెంట్ పితామహుడు టేలర్ చెప్పినట్టు..’మనిషి దొంగ ‘అని అనుకోవాలి ముందు.అసంప్షన్.ఆ కోణంలోనుండే మొదట్లో ఆ వ్యక్తితో లావాదేవీలు మొదలుపెట్టాలి.పోను పోను తెలుస్తుంది ఎవరు దొంగో ఎవరు కాదో.ఐతే సరియైన సమయం రాగానే అంతిమంగా మనిషి దొంగ అనే ఋజువౌతుంది.

రమణ కూడా ఈ వ్యాపారాత్మక వ్యక్తులకు భిన్నమైనవాడు కాదు.కాగా ఇంకా ఒక ఆకు ఎక్కువ చదువుకున్నవాడే.

రమణ పాలసీ ఒకటే..’వాడుకో..వదిలెయ్.అంతే’.

వికారమైన సమాజం.అబద్దాలకోరు సమాజం.మనం వంగుతే పైకెక్కి,మనం ఎక్కుతే కిందకు వంగి..జీ హుజూరనే దిక్కుమాలిన సమాజం.

ఈ సంక్లిష్ట సమాజంలో..రాజీ పడుతూ..సర్దుకుపోతూ..పడిపోకుండా నడుస్తూ..వాకింగ్ ఆన్ ద రోప్ వలె..కొంచెం మన కోరికలు కూడా..కొంచెం మన అభిరుచులు కూడా తీర్చుకుంటూ.,

తనిప్పుడు రమణతో సింగపూర్ ఎందుకొచ్చినట్టు..అని దిగగానే ప్రశ్నించుకుంది సుమ.

జవాబు..రమణకు తన శరీరం కావాలి.వాడికి తనతో సంభోగమంటే పిచ్చి.తెలుసు తనకు.

నిజం చెప్పాలంటే రమణంటే తనకుకూడా పిచ్చే. వ్యామోహం. సరియైన జోడీ తమది.మేడ్ ఫర్ ఈచదర్.

పైగా డబ్బు.ఇంతో అంతో గిట్టుబాటవుతుందికూడా.

రమణ తనను ఒక కర్ర బెంచీమీద కూర్చొమ్మని చెప్పి గబగబా వెళ్ళి కె ఎఫ్ సి నుండి ఒక బకెట్ చికెన్ డ్రం స్టిక్స్ తెచ్చాడు.ఆరు పీసెస్.సముద్రం ఒడ్డున కొబ్బరి చెట్టుకింద ఇసుకలో కూర్చున్నాక ఒకటి తనకిస్తూ,తానూ ఒకటి తీసుకుని.,”చెప్పు సుమా నీ సలహా” అన్నాడు నిమ్మళపడుతూ.

దూరంగా డాల్ఫిన్ షో నడుస్తోంది.జనం కేరింతలు..కోలాహలం.

వాటర్ బాటిల్ మూత తీస్తూ”ఏ విషయం గురించి”అంది సుమ.

“జీవితం గురించి”

“ఎవరి జీవితం గురించి” సుమ తలెత్తి రమణ కళ్ళలోకి చూచింది.

“నాదే..”

“నా జీవితం గురించనుకున్నా”

రమణ ఖంగుతిని..సహజ గిల్టీనెస్ తో తటపటాయిస్తూండగా,

సుమ అంది”చెప్పు”అని.

“నీ విషయమే..ఎంక్వైరీ ఉంది కదా ఎల్లుండి”

“ఔను..చెప్పిన కదా. నాదే పొరపాటని ఒప్పుకుంటా..కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేనే..”చెబుతోంది స్థిరంగానే.

సుమ దగ్గర కొంత నిజాయితీ ఉన్న విషయం తెలుసు రమణకు.

“నేను నీకు రేపు ఐదు లక్షలు ఇస్తా..ఓకె”

“సరే..తర్వాత”

“తర్వాత కూడా నువ్వు నాకు కావాలె” అన్నాడు చాలా ప్రాధేయపూర్వకంగా.

“ఎందుకు”అంది.

“తెలియదు..కాని నువ్వు కావాలె”చిన్న పిల్లాడిలా ఉంది రమణ ముఖం అమాయకంగా.

“ఎందుకు రమణా..నాతో నీకీమి పని.”

“నీ సాహచర్యం కావాలి”

“తప్పు..వాక్యాన్ని సవరించుకో.నీ శరీరం, నీ పొందు కావాలె అని అను..కరక్టేనా”

“రమణా..స్త్రీ పురుష జీవితాల్లో సెక్స్ అనేది ఎంత కీలకమైన..ప్రధానమైన..వికృతమైన భూమిక పోషిస్తుందో భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందున్న 546 సంస్థాలగురించి వివిధ సంస్థానాల్లో దివాన్ గా పనిచేసిన దివాన్ జర్మనీదాస్ ‘మహారాజా’అని ఒక గ్రంథం..’మహారాణీ’ అని మరో పుస్తకం రాశాడు చాలా సాధికారికంగా. వాటిని   చదువుతే అర్థమౌతుంది.. ఒక్కో సంస్థానాధీశుడు స్త్రీని,సెక్స్ ను ఎంత విశృంఖలంగా అనుభవించాడో. ప్రజా ధనాన్ని ఉపయోగించు కుంటూ ఒక్కో రాజు చేసిన అకృత్యాలు చదువుతూంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.”

“ఐతే అంతిమంగా సృష్టిలోపల అనాదిగా జరుగుతూ వస్తున్న ఈ స్త్రీ పురుష సంయోగ వియోగాలన్నీ ఏనాడూ ఎవరికీ అంతుబట్టని రహస్యమే నని స్పష్ట పడుతుంది.”

“ఏ సందర్భంలో ఏ స్త్రీ ఏ పురుషుడిని ఎందుకు ఇష్టపడి జతకడుతుందో, ఏ పురుషుడు ఎందుకు ఏ స్త్రీని ఇష్టపడి రాజ్యాలనుకుడా త్యజించేందుకు సిద్దపడ్డాడో అర్థంకాదు.”

ఇద్దరి ఎదుట నిశ్శబ్ద నీలి సముద్రం గర్జిస్తూనే ఉంది నిరంతరాయంగా..మానవ చరిత్రవలె.

సముద్రమూ అర్థంకాలేదు..స్త్రీ హృదయమూ అర్థం కాలేదు ఇప్పటివరకు ఎవరికీ.

“రెండు ఉదాహరణలు చెబుతా రమణా..ఫ్రాన్స్ చక్రవర్తిగా పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన నెపోలియన్ బోనపార్టి ఇష్టపడి అప్పటికే సైన్యాధిపతి జనరల్ బెహార్నిస్ కు చెందిన విధవ జోస్ఫిన్ ను పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు.జోస్ఫిన్ అహంకారియైన ప్రపంచస్థాయి అందగత్తె.అప్పటికే ఆమెకు ఎందరో విటులూ,ప్రేమికులూ ఉన్నట్టు ఫ్రాన్స్ లో అందరికీ తెలుసు. ఐనా నెపోలియన్ ఆమే కావాలని పట్టుబట్టాడు.వాళ్ళ వివాహానంతరంకూడా ఆమె తను గాఢంగా ఇష్టపడే తన ప్రేమికుడు తిరుగుబోతు హెపార్టే చార్లెస్ ను తనవెంటనే ఉంచుకుంటానంది.ఆమె అందాన్నీ,సౌందర్యాన్నీ పిచ్చిగా ఆరాధించే నెపోలియన్ ఆమెకున్న ఈ పరపురుష వ్యామోహాన్ని అంగీకరిస్తూ చార్లెస్తో ఆమె గడపడానికి అవకాశం కల్పిస్తూకూడా,అవమానాలను సహిస్తూకూడా జోస్ఫిన్ ను కోరుకున్నాడు.ఆమె సకల వికారాకాంక్షల్ని తీరుస్తూ భర్తగా కొనసాగాడు.కారణం ఒక్కటే.పిచ్చి.ఆమెపట్ల,ఆమె అందంపట్ల ఏర్పడ్డ సెక్స్ పిచ్చి. ‘కామాతురాణాం న బిడియం న లజ్జ ‘కదా.

ఎవరి పిచ్చి వాళ్ళకు హాయి అన్న నెపోలియన్ చరిత్ర ఇలా ఉంటే..స్త్రీ పట్ల ఒకసారి మొహం మొత్తిందంటే ఎంత నీచంగా ఉంటుందో ఒక ఉదంతం చెబుతా.

నవీన విశ్వరూప శిల్పి..అంగవైకల్యమున్నా మనిషికి విజయంవైపు దూసుకుపోవడంలో ఏదీ అడ్డుకాదని ఋజువుచేసి చూపిన శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ది ఒక చిత్రమైన వింత ప్రవర్తన. విశ్వ విఖ్యాత సౌరశాస్త్రవేత్త గెలీలియో వర్ధంతినాడే 1942 జనవరి 8 న జన్మించి ఇరవై ఏళ్ళనాటికే ఆక్స్ ఫర్డ్ లో పి హెచ్ డి చేసే స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశీలి హాకింగ్.ఐతే అనూహ్యంగా అమ్యోట్రాఫిక్ లేటరల్ స్లెరాసిస్(ఎ ఎల్ ఎస్)అనే వింత కండరాల వ్యాధి సోకి ఇక జీవితం ముగుస్తుందన్న సంక్లిష్ట సమయంలో ఆయన జీవితంలోకి ప్రవేశించిన దేవతామూర్తి జేన్ వైల్డ్.అతన్ని వీల్ చైర్లో కూర్చుండ పెట్టుకుని ప్రేమనూ,స్నేహాన్నీ,ధైర్యాన్నీ అణువణువునా నింపి ‘బిగ్ బ్యాంగ్ ఏకబిందుత్వ భావన ‘,సూపర్ స్ట్రింగ్స్ ,బ్లాక్ హోల్స్(కాలబిలం లేదా కృష్ణబిలం)లను నిర్వచించి ‘ఐక్య క్షేత్రీయ సిద్దాంతం’ను ప్రతిపాదించి ప్రపంచ ప్రశంసలను పొందేందుకు సహకరించి తీవ్ర అంగవైకల్యంతో బాధపడ్తూ కదలలేని,నోటినుండి మాటరాని పరిస్థితుల్లో స్పీచ్ సింతసైజర్ తో అతన్ని విజయునిగా చేసి అతనితో ముగ్గురు పిల్లలను కన్న తర్వాత హాకింగ్ ఆమెకు ప్రతిగా చేసిందేమిటంటే తన యాభయవ ఏట జేన్ కు విడాకులిచ్చి తన నర్స్ ఎల్లెన్ మేసన్ ను పెళ్ళి చేసుకోవడం.

స్త్రీ పట్ల కొందరికి ఎంత పిచ్చి ఆరాధన కలుగుతుందో..మరికొందరికి అమానవీయ స్థాయిలో ఎందుకు మొహమొత్తి విముఖత ఏర్పడుతుందో చరిత్ర ఇలాంటి అనేక ఉదాహరణలతో పాఠాలను చెబుతూనే ఉంది రమణా.

జోస్ఫిన్,జేన్ వైల్డ్ అనే ఈ ఇద్దరు స్త్రీలు చిత్రమైన పురుష సంబంధ వ్యతిరిక్తతలకు సాక్ష్యంగా నిలిచిపోయారు.ఒకరు మూడు వందల సంవత్సరాలనాటి స్త్రీకి ప్రతినిధి ఐతే మరొకరు ఈనాటికీ మనముందు జీవిస్తూ కళ్ళముందు సజీవ బాధితురాలిగా,విస్మరించబడ్డ స్త్రీగా దర్శనమిస్తున్నారు.ఎలా అర్థం చేసుకోవాలి రమణా ఈ పరిస్థితిని.

అక్కడ  స్త్రీ  చేసింది పురుషున్ని ‘వాడుకో వదిలెయ్యి ‘.ఇక్కడ  పురుషుడు చేసింది స్త్రీని ‘వాడుకో వదిలెయ్యి ‘. అంతేనా.

రమణ అంతా వింటూనే ఆలోచిస్తున్నాడు వాహకంలో ప్రవహిస్తున్న విద్యుత్తులా.యథావిధిగా సుమ పరిజ్ఞానానికి విస్తుబోతూ ప్రశంసాపూర్వకంగా ఆమెవంక చూచి..క్షణకాలం అతనిలో ఒక విచిత్రమైన ‘ఇంత జ్ఞానం..ఇంత అందం..ఇంత అవగాహన..ఇంత ప్రతిభ గల ఈమె తన స్వంతమై తనలో లీనమైపోయిందికదా’అన్న భావన కలిగింది.పొంగిపోయాడు.పులకించిపోయాడు.

“ఏమంటావు సుమా” అతని గొంతు చాలా ప్రాధేయపూర్వకంగా ఉంది.

“చెప్పు..నన్నేం చేయమంటావో” అంది ప్రశాంతంగానే.

“చెప్పానుగదా..నువ్వు నాకు శాశ్వతంగా కావాలి”

“అంటే నన్ను పెళ్ళి చెసుకుంటావా.. మా ఆయనకు విడాకులిప్పించి,నా కొడుకును దత్తత తీసుకుని”అంది నవ్వుతూ గలగలా.

“ఊ..” తటపటాయింపు.అసంగతత.

“ఇది జీవితం రమణా.సినిమా కాదు.నవలా కాదు.అతి తాత్కాలిక ఉద్వేగాలకు లోనై తప్పులు చేసే వాళ్ళందరూ ఇలా శాశ్వత బంధాలను ఏర్పర్చుకుంటూపోతే ఒక్కొక్కరు ఏడెనిమిది పెళ్ళిళ్ళు చేసుకుని ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించవలసి వచ్చేది.చాలావరకు మనుషులు ఏదైనా రుచికరమైన పదార్థం కావలసొస్తే ఆ హోటల్ కు వెళ్ళి తినివచ్చే పద్ధతినే పాటిస్తారుగాని..ఆ పదార్థాన్ని తయారుచేసే హోటల్ ను పెట్టుకోరు..అర్థమైందా”

“అంటే”

“సూటిగా రంగంలోకొస్తున్నా.నీక్కావలసింది నా దేహం.నా అందం.నేను రసాత్మకంగా ఇవ్వగల సెక్స్ సుఖం..ఇంకాస్త నాగరికంగా చెప్పాలంటే కొద్దోగొప్పో నాలెడ్జ్ గలిగిన లెర్న్ డ్ లేడీ పొందు.అంతేనా.”

“ఔను సుమా..”

“దెన్..లెటజ్ కం టు యాన్ అండర్ స్టాండింగ్.ఇక్కడ నేనుకూడ నీకొక రహస్యం చెప్పాలి రమణా నిజాయితీగా.కొంతమంది మగాళ్ళతో నాకు సంబంధాలు ఉండొచ్చుగాక.కాని నీతో ఏదో నాకే తెలియని ఒక అదృశ్యాసక్తీ,పిచ్చీ ఉన్నాయి.నేనుకూడా నిన్ను నీవలెనే బలంగా కోరుకుంటున్నాను.అందువల్ల..”ఆగిపోయిందామె సందిగ్ధత ఏదో ఆవరిస్తూండగా.

“…” రమణ ఒట్టి శూన్యంతో నిండి.,

“మేధావులనుకునే వ్యక్తులు కొందరు మనుషులను ఎంత ధారుణంగా దర్శిస్తారో చూడు రమణా..చెబుతా రెండు ఉదాహరణలు నార్మన్ మెయిలర్  అనే ప్రపంచ ప్రసిద్ధ రచయిత అంటాడు ‘వెజినా ఈజ్ ద వూండ్ దట్  నెవ్వర్ హీల్స్ ‘అని..ఇంత వికారంగా,బీభత్సంగా స్త్రీ మర్మాంగం గురించి చెప్పవలసిన అవసరం ఆ మహాశయునికుందా.ఒక అత్యాధునిక తెలుగు స్త్రీవాద కవయిత్రి పసుపులేటి గీత అంటుంది ‘ప్రక్కనున్న ప్రతి మగాడూ తన తొడల మధ్య బల్లేన్ని మోసుకు తిరుగుతున్నట్టే ఉంది ‘అని. ఇదీ ఒక విపరీత భావనే. మనుషులు చాలా చాలా తప్పులు చేస్తున్నారు రమణా. విచ్చలవిడిగా తాగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఎదుటివాళ్ళను ధగా చేస్తున్నారు.హత్యలు చేస్తున్నారు. దోపిడీలు చేస్తున్నారు. ఐనా ఏ సిగ్గూ బిడియమూ లేకుండా హుందాగానే బాజాప్తాగా తిరుగుతున్నారు. వీళ్ళవల్ల సమాజానికి చాలా నష్టం ఉంది. కాని ఇద్దరికీ అంగీకారమై,ఇరుపక్షాలలో ఎవరికీ ఇబ్బంది కలుగని పరిస్థితుల్లో స్త్రీ పురుష సంబంధాలను మాత్రం ఒక క్షమించలేని నేరంకింద పరిగణిస్తూ చర్చకుపెట్టి విషాదానందాన్ని పొందుతున్నారు పెద్దలనబడే దుర్మార్గులు. ఐతే దీన్నికూడా బాగా డబ్బున్న ఉన్నతవర్గాల్లో మాత్రం ఒక అదనపు సామర్థ్యంగా,అదనపు అలంకారంగా భావిస్తున్నారు.సారాంశ మేమిటంటే..రైడ్ ద హార్స్..అంతే.గో..

మనం మన సంతోషం కోసం వేరే ఏ ఇతరులకూ ఇబ్బంది కలుగనంతకాలం..గో ఎహెడ్.మనం కలుస్తూనే ఉందాం. సాధ్యమైనంత కాలం మన కలయికను ఒక జీవిత భాగంగా చేసుకుని,బాధ్యతగా,సగౌరవంగా కలుద్దాం.ఓకె నా”

“థాంక్యూ సుమా.చాలా పాజిటివ్ గా ఆలోచించి ఇద్దరికీ అమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటించావు.”రమణ ఉక్కిరిబిక్కిరయ్యాడు.

కాసేపు ఇద్దరూ మాట్లాడలేదు.

ఎదురుగా ఉన్న సముద్ర ఘోషే లయబద్ధంగా వినబడ్తూ,

“ఎనీ కండిషన్స్..టు బి మోర్ ఓపెన్”

“నొ.బేషరతు ప్రేమ.”

“నెలకు ఒక్కసారన్నా మనం బుద్దిదీరా కలుసుకోవాలి. కీలకమైన కష్టసుఖాల్లో ఒకరికొకరం పాలుపంచుకోవాలి. నీకోసం నేనున్నానన్న భావం,ప్రవర్తనా సగౌరవంగా కొనసాగాలి.ఏమంటావ్.”

“సరే..దీంట్లో ఒక గుప్త జ్వలన ఉంది రమణా..అందంగా చెప్పాలంటే ఒకటి వ్యామోహమోహనం..మరొకటి విషాదమోహనం..మెలాంకలి.ఇవే మనను మనకు తెలియకుండా అలా నడిపిస్తాయి జీవితాంతం భౌతిక ప్రతిబంధకాలు ఏర్పడనంతకాలం.మరి నీ పెళ్ళి సంగతి”

సుమ మాటలో ఒక రకమైన కన్సర్న్ వినబడింది.

“ఎంతైనా జానకి చాలా చాలా గొప్ప మనిషి రమణా.అటువంటివాళ్ళు చాలా అరుదు.ఐడిల్ అంటామే..అలా ఒక గొప్ప ఆదర్శ మహిళ ఆమె. మళ్ళీ ఆమెతో కొనసాగే అవకాశంగానీ,ఆలోచనగానీ లేవా.?”

“చాలా ఆలోచించాను సుమా.ఉహు.సాధ్యంకాదు. భావజాల పరంగా మేమిద్దరం పరస్పర భిన్నధృవాలం. ఒక్క అభిరుచి కూడా కలువదు. ఆమెది  అల్మోస్ట్  గాంధియన్ పాలసీ. పూర్తిగా నిస్వార్థ, నిరలంకార, నిర్వికార అతిసాధారణ జీవితాన్ని జీవించాలంటుంది. ఆస్తిపాస్తులు అస్సలే అవసరం లేదంటుంది.ఎలా కుదురుతుంది సుమా.అతి వేగవంతంగా మారుతున్న వర్తమాన ప్రపంచ సమాజంలో డబ్బు లేనివాడు ఒట్టి వెధవ.మనదగ్గర అస్సలే సంపద లేదని బయటివాళ్ళకు తెలిసిననాడు ఏ ఒక్కడూ మన ముఖాన్నికూడా చూడడు..ఔనా చెప్పు”

“ఇది అనంతకాలంగా మనుషుల మధ్య నలుగుతున్న సామాజిక సమస్య రమణా.ఎప్పుడైతే పాలకులు అధికారం,ఆధిపత్యం అనే మత్తులో సంపదను పోగుచేసుకుని చివరికి అన్నిఉన్నా ఏమీలేని ఒకానొక నిర్వేద స్థితికి చేరుకున్నారో ఒక అంతరాణ్వేషణ,మూలాల గుర్తింపు,ఈ సుఖాల వెనుక ఉన్న ఆనందానుభూతుల విశ్లేషణ..కోరిక..దుఃఖం..విముక్తి..అంతిమం..ఏమిటి అన్న స్వవిమర్శ మొదలైంది.వీటి సారాంశంగా ఉద్భవించిన అంతిమపరిష్కారం..పరిత్యాగం.గ్రీక్ లో సోక్రటిస్ చెప్పినా,భారత దేశంలో బుద్ధుడు చెప్పినా..మన ఆధునిక కాలంలో మహాత్మా గాంధీ చెప్పినా చరమం మాత్రం..పరిత్యాగమే.విడిచిపెట్టు.ఈ వ్యామోహాలనూ,కోరికలనూ,సౌఖ్య వాంఛలనూ,మోహవ్యామోహాలనూ,సుఖసంపదలపై ఇచ్ఛనూ..అన్నింటినీ వదులుకుని..అంతిమంగా..నగ్నత.మనిషి పుట్టినప్పుడు ఎలా  వచ్చాడో  అలా మళ్ళీ ఆ నగ్న స్థితికే చేరి..మహాభినిష్క్రమణం. “

“అది సరే సుమా.కాని ముందునుండి నా ఆలోచనా విధానం వేరు.జీవితమంటే ఒక చాలెంజ్.లేనిదానిని వెదికి దాన్ని పొందడంకోసం నిరంతరం శ్రమించడమే నా తత్వం.నేను కడు బీదరికంలో పుట్టాను.నా పూర్వీకులు కటిక దరిద్రాన్ని అనుభవించారు.ఒక పూట కూడును సంపాదించుకోడానికే వాళ్ళు అహర్నిశలూ కష్టపడ్డారు.తెలిసో తెలియకో వాళ్ళు గడిపింది కూడా అతిసాధారణ నిరాడంబర జీవితమేగదా.అది బుద్ధుని జీవితమౌతుందా.ఋషి జీవితంగా దాన్ని గౌరవిస్తామా.వాళ్ళను ధుఃఖానికి మూలం కోరిక అని గుర్తించి త్యాగించి బతికిన విజ్ఞులుగా ఆదరిస్తామా.దాన్ని బీదరికమంటాం.బ్రతుకుతో పోరాటం చేసిన పేద ప్రజలుగానే వాళ్ళను గుర్తిస్తాం.కదా.నేను ఈ బీద ప్రపంచంలోనుండి ఇప్పుడిప్పుడే మొలకెత్తి వికసిస్తున్నవాన్ని.నేను మన భారత తాత్విక వారసత్వంలో ఋషులూ, మహర్షులూ, సాధువులూ, అవధూతలూ..వంటి వాళ్ళు చెప్పిన విలువైన విషయాలనేమీ నిరాదరించడంలేదు.కాని నేను ఒక అధికారిక పాలకున్ని.తాటకిని చంపడం తనవల్ల కానపుడు విశ్వామిత్రుడు ఆశ్రయించడానికి ఒక దశరధుడుండాలి గదా. అందరూ విశ్వామిత్రులే ఐతే రాముణ్ణి ప్రసాదించగల దశరధులెలా అందుబాటులోకొస్తారు. ఇది ఒక వ్యవస్థ.దీంట్లో ఎవరి పాత్రను వాళ్ళు పోషించి అంతిమంగా సమాజ సమగ్రతను సంపన్నం చేయాలి.

ఇక నీతి,అవినీతి,దోపిడి..ఇవన్నీ సాపేక్ష పదాలు.వాటి నిర్వచనాలు ఆయా దేశ కాల స్థితులనుబట్టి మారుతూంటాయి.పునర్నిర్వచించబడుతూంటాయి.రెండు రూపాయలు సంపాదించే వాన్నుండి అర్థ రూపాయి తీసుకోవడం తప్పు కావచ్చు.కాని అప్పణంగా వేయి రూపాయలు సంపాదించే వాన్నుండి వంద రూపాయలు లాక్కోవడం పెద్ద తప్పేమీ కాదు.

నాది ఇప్పుడు నిలదొక్కుకునే స్థితి.

ఎదగాలి నేనిప్పుడు.

ముందు మొక్క ఏనుకుని చెట్టుగా పరివర్తించాలి.ఏ కొద్దిగా ఏమరుపాటు వహించినా మొక్కను పశువులు కొరికి తినేస్తాయి.

నన్ను నేను రక్షించుకుంటూ..శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మార్చుకున్నట్టు సివిల్ సర్వీస్ లో అంతర్గత పోరు సలుపుతూ నేను ఎదుగుతున్నానిప్పుడిప్పుడే.

నాకు చాలా కసి ఉంది.జీవితం మీద.ఎదగడం గురించి.ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి.

గురజాడ అప్పారవు గారన్నట్టు.. తిండి కలిగితె కండగలదోయ్..కండగలవాడేను మనిషోయ్..వలె,

ఈ రోజు..డబ్బు..డబ్బు కలిగితె బతుకు గలదోయ్.బతుకగల వాడేను మనిషోయ్.

అదీ సుమా..చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి.”

 

ఇంకా ఉంది……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *