May 4, 2024

చిగురాకు రెపరెపలు:- 3

రచన: మన్నెం శారద

 

ఎదురుగా పెదనాన్న!

చేతిలో ఒకదాని మీద ఒకటిగా పెట్టిన మాడుగుల హల్వా డబ్బాలు! వాటినిండా స్వచ్చమైన నేతితో చేసిన హల్వాల కన్నా ఆ డబ్బాల మీద వుండే అందమైన చిత్రాలు నా కిష్టం! నేను వాటికేసి ఆత్రం గా చూస్తుంటే…

“లే!  లే! నీ కోసమే ఇవన్నీ! లే!” అన్నారు పెదనాన్న నవ్వుతూ. పెదనాన్న అందమైన మనిషి! హిందీ హీరోలా వుండేవారు. తెల్లటి బట్టలు టక్ చేసుకుని ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తుంటే… నేను చాల సంతోషంగా చూసేదాన్ని!

పోలీస్ యూనిఫాంలో వుంటే మాత్రం కొంచెం వింతగా వుండేది.

“నిన్నేనే మొద్దూ! మొహం కడుక్కుని రా’ అన్నారు నెత్తిమీద ముద్దుగా ఒకటి కొడుతూ.

“మీకేవన్నా పిచ్చా! పొద్దుటే అదెక్కడవన్నీ తింటుంది, వాంతులు చేసుకుంటుంది!  వెళ్ళవే, మొహం కడుక్కుని టిఫిన్ తిను” అంది మా దొడ్డమ్మ మా పెదనాన్నని కసురుకుంటూ.

“పెదనాన్నా, ఆ డబ్బాలు మాత్రం నావి” అని పరిగెత్తేను మొహం కడుక్కోవడానికి.

“సర్లే!” అన్నారు పెదనాన్న.

ఇక మా అక్కలంతా ఆయన చుట్టూ చేరేరు.

వాళ్ళందరికీ స్వీట్సు ఇష్టముండదు.

కారం జీడిపప్పులు, మిక్చర్స్ ఇలాంటివన్నీ వాళ్ళకిచ్చేరు.

ఆయనకి అందరిలో మణక్కంటే చాల యిష్టం. మణక్క కోసం ప్రత్యేకమైన కానుకలు తెచ్చేవారు. నెయిల్ పాలిష్ లు, ఆల్తాలు, మంచి షిఫాన్….అన్నీ ప్రత్యేకంగా వుండేయి. మణక్కకి నాకు మంచి స్నేహం వుండేది. అవన్నీ తన సరదా తీరేక నాకిచ్చేయాలి; అని చెప్పేదాన్ని. మణక్క నవ్వి నీకేనాటికి పనికొస్తాయే’ అనేది.

నేను మొహం కడుక్కుని టిఫిన్ తిని అర్జెంటుగా పెదనాన్న దగ్గరకి పరిగెత్తుకెళ్ళేను. అప్పటికే మా మూడో మావయ్య పెదనాన్నతో కబుర్లు చెబుతున్నాడు.

ఆయనంటే మాకు హడల్.

అందుకే చప్పున ఆగిపోయాను.

“దీని అల్లరి బాగా ఎక్కువయ్యింది. వాళ్ళమ్మ మాట అసలు వినడం లేదు” అన్నాడు మావయ్య.

బదులుగా మా పెదనాన్న బాగా నవ్వి “ఇలా రావే, ఏం చేసావు?” అనడిగేడు నవ్వుతూ.

నేను ఏదో చెప్పబోయేంతలో బయట గట్టిగా అప్పారావు మావయ్య అరుపులు వినిపిస్తున్నాయి.

నాకు వెంటనే అర్ధమయిపోయి దిక్కులు చూశాను.  పక్కగది కిటికీలోంచి చూస్తున్నాడు మా అన్నయ్య.

‘ఉష్’ అన్నట్లు నోటిమీద వేలు పెట్టి సైగ చేస్తున్నాడు నాకు.

“వాళ్ళ కడుపులు కాల! నిక్షేపం లాంటి సైకిల్ నాశనం చేస్తారా? నా చేతికి దొరకాలి చంపేస్తాను వెధవల్ని! ఈ వీధిలో దరిద్రుల్లా తయారయ్యారూ” అని అనేక రకాలుగా శపిస్తున్నారు అప్పారావు.

ఆ తిట్లకి వళ్ళు చివుక్కుమంటుంది.

కాళ్ళు వణుకుతున్నాయి.

అప్పారావు గొంతు సైరన్ లాగ మోగిపోతోంది.

పెదనాన్న అసహనంగా చూశారు.

మావయ్య లేచి బయటికివెళ్ళి “ఏంట్రా అప్పారావూ!” అన్నాడు.

“చూడన్నయ్యా! నా సైకిల్ ఎలా ముదనష్టం పట్టించేరో.  సీటు ముక్కలుగా కోసేసారు. గాలి తీసేసారు! నేనిప్పుడెలా అఫీసుకెళ్ళాలి! ఈ వీధిలో పిల్లలకి అదుపు ఆజ్ఞ లేకుండా పోయింది. వాళ్ళ మొహాలు తగలెట్ట!” అప్పారావు నా వైపు కొరకొరా చూస్తూ చెబుతున్నారు.

“అప్పారావ్!” పెదనాన్న గట్టిగా అరిచేరు. “నువ్వెవరన్నా కోయడం చూశావా?”

“లేదు బావగారూ! చూస్తే వాళ్ళ తాట తియ్యమా?”

“ముందు నోర్మూసుకో. పిల్లల్ని తిట్టావంటే బాగుండదు. వెధవడొక్కు సైకిలూ నువ్వూనూ! నేను డబ్బులు పడేస్తా. కొత్తది తెచ్చుకో!” అన్నారు సీరియస్ గా.

అప్పారావు మొహం చేటంత  వికసించింది.

“ఎందుకులెండి బావగారూ” అన్నాడు నవ్వు దాచుకుని నసుగుతూ.

“కాసేపయ్యాక వచ్చి ఏడు. ఊరికే రంకెలెయ్యకు. వీధిలోంచి ఖాళీ చేయించేస్తా!” అన్నారు పెదనాన్న.

నా గుండె ఢాం అంది.

వాడికి మళ్ళీ కొత్త సైకిలా! ఇంత కష్టపడింది ఎందుకు?

నేను గబుక్కున పరిగెత్తుకెళ్ళి ఈ సంగతి అన్నయ్యకి చెప్పాను.

వాడి ముక్కుపుటాలెగరేశాడు కోపంతో.

“వాడికి కొత్త సైకిలా?” అన్నాడు ఉక్రోషంగా.

“నువ్వంటే పెదనాన్నకి యిష్టం కదా! నువ్వే ఏదన్నా చేయరా?” అన్నాను.

తిన్నగా పెదనాన్న దగ్గిర కెళ్ళి “నాకు సైకిల్ కొను” అన్నాడు.

వెంటనే అన్నయ్య ఆవేశంగా మచమ్మీద నుండి దూకేడు.

“ఎందుకురా అప్పుడే సైకిలంత ఎత్తులేవు” అన్నాడు నవ్వుతూ.

“ఏం కాదు. నా ఫ్రెండ్సందరికీ వుంది. నాక్కావాలి. ఆ అప్పిగాడికి కొంటే నేనింట్లోంచి పారిపోతా!” అన్నాడు ఆవేశంగా.

మా పెదనాన్న అన్నయ్య వైపదోలా చూసి “సర్లే కొంటాను. ఆ అప్పారావు సంగతి నీకెందుకు?” అన్నారు.

“వాడిక్కొంటే నాకక్కర్లేదు. కావాలంటే సీటు కొనుక్కోమని డబ్బులు పడెయ్యి. సైకిలెందుకు” అన్నాడు.

“అవును పెదనాన్నా, ఫైరాఫీసిక్కడే కదా, నడిచి వెళ్ళొచ్చుకదా!” అన్నాను నేను.

“అబ్బో నువ్వు కూడ సలహాలిస్తావన్నమాట!” అన్నారు పెదనాన్న.

చివరికి మా పంతమే గెలిచింది. పెదనాన్న అప్పారావుకి సీటు కొనుక్కోమని డబ్బులిచ్చేరు.

పెదనాన్న వున్నన్ని రోజులూ పిల్లలకి పండుగే.

ఆయన మా చేత ఆటలు ఆడించి ప్రైజులిచ్చేవారు. బోల్డన్ని తినుబండారాలూ, కబుర్ల్లూ, సీషోర్ షికార్లు!

పెదనాన్నని చూస్తే అందరి నోర్లూ మూత పడేయి.

ఆయనెప్పుడూ హిందీ పాటలు వింటూ, ఆ కధలు మాకు చెబుతుండేవారు.

ఆటల్లో నేనెప్పుడూ ఓడిపోయేదాన్ని. నాకు కంగారెక్కువ. మా పెదనాన్నగారి మూడో కూతురు సౌదామిని గెలిచేది. పెదనాన్న అన్నిటికీ డబ్బులిచ్చేవారు.

ఓడిన నాక్కూడ సమానంగా ఇచ్చేవారు. అది మనసారా ఇష్టపడేది కాదు.

‘ఇంతమాత్రం దానికి పోటీ ఎందుకూ అని రాద్దాంతం చేసేది!’

అప్పుడు మా పెదనాన్న దాని గోల భరించలేక రహస్యంగా ఇవ్వడం మొదలెట్టేరు.

ఆ రోజు పిల్లలందర్ని కమలా సర్కస్ కి తీసుకెళ్ళేరు. సర్కస్ భలే థ్రిల్లింగ్ గా వుంది.

ఏనుగులు గుర్రాలు, ఒంటెలు- ఇంకా అమ్మాయిలు చేసే విన్యాసాలు, తెగ సంతోషపడిపోయేం.

నేని యింటికి వస్తూనే ఫ్రాకు తీసి ఇన్నర్ వేర్స్ తో వంట గదిలో కెళ్ళి రెండు అప్పడాల కర్రలు, ఒక పీట తెచ్చేను.

“ఎందుకే అవి?” అంది మణక్క

“అందులో ఒకమ్మాయి బాల్ ఎక్కి దాన్ని దొర్లిస్తూ నడిచింది కదా, ఆ ఫీట్ చేస్తా” అన్నాను.

“వీటితోనే చూడు? అన్నా.

పిల్లల గాంగ్ తెగ సంతోషపడి చుట్టూ చేరేరు.

నేను రెండు అప్పడాల కర్రల మీద పేట వేసేను.

పీట ఎక్కి చిన్నగా పాదాలతో కదిలిస్తుంటే పీట జరగడం మొదలెట్టింది. నేను సర్కస్ లో అమ్మాయిలా సెల్యూట్ చేస్తూ చిరునవ్వులు నవ్వుతూ ముందుకి జరుగుతున్నాను.

అందరూ ఒకటే కేరింతలు! నవ్వులూ!

ఈ గోలకి షరా మామూలుగా మా అమ్మ రానే వచ్చింది. వీపు మండేలా ఒక్కటిచ్చింది. కళ్ళ వెంట నీళ్ళు కారేయి బాధకి.

ఇంతలో పెదనాన్న కూడా వచ్చారు.

“ఎందుకు కొట్టేవు దాన్ని? ఏం తప్పుచేసింది. ఆడుతోంది. అప్పడాల కర్రలతో అలా చెయ్యొచ్చని దానికి స్ట్రయికయినందుకు సంతోషించక!” అనారు కోపంగా..

మా అమ్మకి కూడా  పెదనాన్నంటే భయం భక్తీని!

“కాదండీ బావ గారూ! ఎప్పుడు చూసినా అల్లరే. ఆ ట్యూషన్ మాస్టారిని రోజూ ఏదో వంక పెట్టి పంపించేసోంది” అని చెప్పింది చాలా వినయంగా.

పెదనాన్న నా వంక చూశారు అవునా అన్నట్లు.

“కాదు పెదనాన్నా, ఎప్పుడూ సరిగ్గా ఆడుకునే టైం లో వస్తున్నాడు. అందుకని పెద్దక్క….”

“ఎవరూ క్రిష్ణా…?” అన్నారు పెదనాన్న.

“అవును పెదనాన్నా”

“ఏం చెప్పింది?”

“నేను సంశయంగా చూశాను.

“చెప్పు”

“సిగ్గు శరం వుంటే పిల్లలు ఆడుకునే టైం లో రారు అనమంది.”

“అన్నావా?”

“నేను అనలేదు. పెద్దక్క అన్నదని చెప్పేను. అందుకని ట్యూషన్ మానేసేడు చెప్పడం” అన్నాను భయంగా.

“క్రిష్ణా!” అని పిలిచేరు పెదనాన్న.

క్రిష్ణక్క గోళ్ళు కొరుక్కుంటూ చాలా వినయంగా నిలబడింది వచ్చి.

“నీ వయసెంత?”

క్రిష్ణక్క కళ్ళు టపటపలాడించింది. అతి వినయంగా తనకి పదహారేళ్ళుంటాయి. అల్లరికి రింగ్ లీడర్ ఆవిడే!

“నీకెలాగూ ఏదీ అబ్బలేదు. అమెరికన్ కాన్వెంటులో వేసాను. చదవలేదు. సంగీతం మాస్టారిని సాగనంపేవు. రేపో మాపో పెళ్ళి చెద్దామని చూస్తుంటే… ఇంకా ఇలాంటి పనులా క్రిష్ణా!” అన్నారు కొంచెం మందలింపు ధోరణిలో.

క్రిష్ణక్క అమాయకంగా నేల చూపులు చూసింది.

“సరే వెళ్ళు దాన్ని వాళ్ళమ్మ చేత కొట్టించకు” అన్నారు క్రిష్ణక్క రివ్వున వెళ్ళి దూరం నుండి ‘నీ పని చెప్తా’ అని సైగ చేసింది నాకు.

ఆ మర్నాడు పెదనాన్న వెళ్ళిపోయారు.

ఆ సాయంత్రం మూడీ మామయ్య పీచు వ్యాపారం చేసే కాంపౌండ్ ఫెన్సింగులో ఒక చిలుక చిక్కుపడి వెళ్ళడం లేదని ఫ్రెండ్స్ చెప్పేరు.

నేను పరిగెత్తుకెళ్ళి చూశాను.

ఫెన్సింగ్ లో బొమ్మజెముడు చెట్లకి ఏదో తీగె అల్లుకుంది. అందులో చిక్కుకుంది రామచిలక.

నేను పరిగెత్తుకొచ్చి మా మణక్కకి అందరికీ చెప్పేను “దాన్ని పట్టుకోవే, పదిరూపాయిలిస్తాను” అంది క్రిష్ణక్క.

“ఎందుకూ?” అన్నాను.

“పెంచుకుందాం. మాటలు నేర్పిస్తే చక్కగా కబుర్లు చెబుతుంది” అంది.

నాకు వెంటనే అంతకుముందు ఏనాం వెళ్ళడం గుర్తొచ్చింది. నెలరోజుల క్రితం మా అరుంధతత్త ఇంటికి వెళ్ళాం. సంధర్భం ఏమిటంటో నాకు తెలియదు కాని ఏనాం ప్రయాణం బాగుంటుంది. రోడ్డుకు ఒక పక్క కాంత, తెరచాపలతో పడవలు, కొంగలు బారులు బారులుగా చేపల కోసం నీటి మీద ఎగరడం, కొబ్బరి తోపులు! చిన్నతనం నుండి ప్రకృతి అందాలని నేను మైమరిచి చూసేదాన్ని. నేను వెంటనే మా దొడ్డమ్మని నే వస్తానని బ్రతిమాలేను. కాదు సరిపోతుందనో లేదనో అని ఆలో చిస్తూ  “సరే, రా!” అంది.

నా ఉత్సాహానికి అంతు లేదు.

మా అమ్మ దగ్గరకెళ్తే తంతుందని నాకు నేనే అష్టవంకరలతో పాపిడి తీసుకుని, అట్టలా పౌడర్ రాసుకుని, ఏదో దొరికిన ఫ్రాకు వేసుకుని రెడీ అయిపోయాను.

కారెక్కేటప్పుడు చూసింది మా అమ్మ.

“నువ్వెక్కడికి?: అంది కోపంగా.

“రానివ్వు. నేనే రమ్మన్నాను. ఆ ముందు కూర్చుంటుంది లే!” అంది దొడ్డమ్మ.

అత్త, అమ్మ, దొడ్డమ్మ ఇంకెవరో ఇద్దరితో కారు సాగిపోయింది. గోదావరి పాయలు, ఆ వాతావరణం అప్పుడే నా మనసులో హత్తుకుపోయింది.

తిరిగి వచ్చేటప్పుడు కోరంగి లో చుట్టాలున్నారని వెళ్ళేం. అది పెద్ద మండువా యిల్లు.

బయట హాల్లోకి అడుగు పెట్టగానే

“శేషారత్నం! చుట్టాలొచ్చేరు, చాపెయ్యి” అని సన్నటి గొంతు వినిపించింది.

చుట్టూ చూస్తే ఎవరూ లేరు.

“మాయదారి సంత! గోరొంక చూడు ఎలా వాగుతుందో!” అంది మాతో వచ్చిన దూరపు చుట్టం అమ్మాణమ్మ.

నేనప్పుడు చూశాను గోరువంకట.

పంజరంలో వున్న రాడ్ మీదనుండి క్రిందకి దూకుతూ పైకి ఎగురుతూ నానా హడవుడి పడిపోతూ “చుట్టాలొచ్చేరు శేషారత్నం! చాపెయ్యి” అంటూ పిలుస్తూనే వుంది.

ఇక వాళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో తెలీదు.

నేను తిరిగి వెళ్లేవరకు దానికొచ్చిన మాటలు వింటూ అక్కడే తన్మయంగా కూర్చున్నాను.

ఈ రోజు కృష్ణక్క ‘రామ చిలుక మాట్లాడుతుంది. పెంచుకుందాం!” అన్నాక నాకు చెప్పలేని ఉత్సాహం పొంగు కొచ్చింది.

ఎలాగైనా పట్టుకోవాలని పెరిగెత్తేను.

ఆ టైంలో మావయ్య లేడు. అదృష్టం!

పాకలో పనివాళ్ళు పీచు కట్టలు కడుతున్నారు. అదంతా షిప్పులో విదేశాలు వెళ్ళేదట! ఆ గొడవలేం నాకు అప్పట్లో తెలియదు.

చిలుక వైపు చూశాను. అది నిస్సహాయంగా బిక్కు బిక్కుమంటూ చూస్తోంది.

అప్పటికే నలుగురైదుగురు వీధిపిల్లలు గుమిగూడి రాళ్ళతో కొడుతున్నారు.

నేను వాళ్ళని పొమ్మని కసిరేను.

వాళ్ళు వెళ్లాక నా ప్రయత్నాలు మొదలెట్టేను. రెండుచేతులు చాపి పట్టుకోడానికి ప్రయత్నించేను.

దానికి ఎగరడానికి దారిలేదు. అంచేత ఎదురుదాడి మొదలెట్టింది

ఠక్కున ముక్కుతో చేతిమీద గీరింది. మంట! రక్తం కొద్దిగా చిమ్మింది. నాకు మొదట్నుంచి దెబ్బలంటే లెక్కలేదు.

నేను మరింత గట్టి ప్రయత్నం మొదలెట్టేను.

నేను పట్టుకోబోవడం అది ముక్కుతో చీరడం- నా చేతులంతా రక్తమే!

కాని ఎలాగైనా దాన్ని పట్టాలన్న ప్రయత్నంలో నేను మంటని, రక్తాన్ని పట్టించుకోవడం లేదు.

చివరికి దాని రెక్క ఒకటే దొరికింది.

కాని చిలుక ప్రాణ భయంతో మరింత గట్టిగా చేతుల్ని చీరేయడం మొదలెట్టింది.

సరిగ్గా అప్పుడు చూసేడు పెంటయ్య- పాకలో పనిచేసి బయటకొస్తూ.

“అయ్యో! అయ్యో! పాపగారూ!” అంటూ పరిగెత్తు కొచ్చేడు లబలబ లాడుతూ.

బలవంతంగా నా చేతిలో చిలుకని వదిలించి నా రక్తపు చేతుల్ని తొట్టె దగ్గరకి తీసుకెళ్ళి కడుగుతూ “ఏం పన్లియ్యండీ పాపగోరూ! మీ మావయ్యగోరు సూస్తే డొక్కసించేత్తారు!” అన్నాడు. రక్తం ఆగడం లేదు.

అయినా దొరికిన చిలుక ఎగిరిపోయిందన్న బాధే నాకెక్కువగా వుంది.

“నువ్వు చిలుకనొదిలేసావు!” అన్నాను బాధగా.

“సాల్లెండి ఎదవ సిలక! ఆ సేతుల్సూసుకోండి ముందు. లోన కెల్లండి మీ అమ్మగోరు సేస్తారు పెళ్ళి!” అన్నాడు.

నేను రక్తం తుడుచుకుంటూ చిలుక ఎగిరిపోయిందన్న బాధతో కళ్ళ నిండా నీళ్లతో లోపలికొచ్చేను.

మా మణక్క చూసి నిర్ఘాంతపోయింది.

“ఏవయిందే” అంటూ ఎవరూ లేని గదిలోకి తీసుకెళ్ళి టింక్చయోడిన్ రాసింది.

“దొరికినట్లే దొరికి ఎగిరిపోయింది. ఆ పెంటయ్యగాడు చేసేడిదంతా!” అని చెప్పేను.

దీనికి కారకురాలయిన కృష్ణక్కని పిలిచి తిట్టింది.

“నీ మూలానే! అది చిన్నపిల్ల! అసలే చిన్నమ్మకి కోపం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ తంతుంది!” అంది నిష్ఠూరంగా.

“నేనేదో సరదాగా అన్నాను. వెళ్ళి నిజంగా పట్టుకోవాలా!” అని విసురుగా వెళ్ళిపోయింది.

కృష్ణక్క సంగతి అందరికీ తెలుసు.

అల్లరి అందరి చేత చేయించి తీరా టైమొస్తే తను తప్పుకుంటుంది.

” ఇవన్నీ చిన్నమ్మకి కనిపించకుండా ఎలా  తిరుగుతావే! తెలిస్తే చంపేస్తుంది కదా!” అంది మణక్క.

కాని మా అమ్మ కన్నా ముందు మా మావయ్యకే తెలిసింది.

పెంటయ్య చెప్పేసేడు

“ఏది, అదెక్కడ?” అంటూ కేక పెట్టేడు.

అంతే!

ఒక్క పరుగున దెబ్బల్ని కూడ లెక్క పెట్టకుండా దొడ్లో జామ చెట్టు ఎక్కేసేను. ఆ జామ చెట్టు ఏటవాలుగా వెళ్ళి నాలుగయిదు కొమ్మలు కలిసి కూర్చోడానికి వీలుగా వుండేది.

ఇంట్లో సమస్యలొచ్చినప్పుడు మా అన్నయ్యకి, నాకు దాక్కుని పెద్దవాళ్ళనుండి కాపాడుకునే స్థావరం అక్కడే!

నేను అక్కడ కూర్చుని ఆకుల గుబురుల్లోంచి భయంగా చూస్తున్నాను.

మావయ్య అరుస్తున్నాడు.

“చిలక కావాల్సొచ్చిందా? చంపేయాల్సింది! పీడా వదిలేది.” అంటూ వెనుక మా అమ్మ వచ్చింది.

“ఏదే మణిమాలా?”

“తెలీదు చిన్నమ్మా, ఇప్పుడిక్కడే వుంది”

“ఆ మంచాల కిందో ఎక్కడో దూరివుంటుంది. చూడండి” మామయ్య పలకరింపు.

చాల సేపు వెదుకుతూనే వున్నారు!

“ఎక్కడున్నావో రా! డాక్టరు దగ్గిరకి తీసుకెళ్తాను” అంటూన్నాడు మావయ్య,

దిగితే ముందు జరిగేది నాకు తెలుసు.

అందుకని అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నాను.

నేనెక్కడుంటానో మా అన్నయ్యకి తెలుసు.

వాడేదో పనివున్నట్లు చెట్టు దగ్గర తచ్చాడి నా వంక చూసి… ” దిగకు. చస్తావ్’ అని మెల్లిగా చెప్పి వెళ్ళిపోయాడు.

కాస్సేపటికి తిట్ల పురాణం జోరు తగ్గింది.

నేను అప్పుడు చూసుకున్నాను దెబ్బలు!

చేతులంతా గీతలే! రక్తం రావడం తగ్గింది కాని నొప్పులు! జ్వరం వచ్చిందేమో! కళ్ళు తిరుగుతున్నాయి.

ఆ కొమ్మల మీద అలానే కళ్ళు మూసుకున్నాను.

“అమ్మా! అని మూలుగు వస్తోంది!

పడతానేమోనని కొమ్మలు గట్టిగా పట్టుకున్నాను కాని… స్పృహ పోతున్నట్లనిపిస్తోంది.

 

[ఎపిసోడ్-3 సంపూర్ణం]

 

3 thoughts on “చిగురాకు రెపరెపలు:- 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *