May 3, 2024

అక్షర సాక్ష్యం 3

రచన: రంగనాథ్

భావతరంగాలు:

స్నేహం…
అహాన్ని బలి కోరుతుంది-
అహం….
స్నేహాన్ని ఛిద్రం చేస్తుంది-
స్నేహితుల మద్య స్నేహమైనా
ప్రేమికుల మద్య ప్రేమైనా
దంపతుల మద్య అనురాగమైనా
కోరే త్యాగం ఒక్కటే….
అహం!

********

భౌతికవాదులకు
ఏనాటికైనా ప్రపంచంలో
ప్రశస్తమైనవి- రెండు…
బంగారం-శృంగారం !
భౌతికంగా ఒకటి
అనుభూతిపరంగా ఒకటి!

నీతి నియమాలున్న
నాయకులది – రామరాజ్యం
ఆప్యాయత ఆదరణలున్న
దంపతులది – ప్రేమరాజ్యం!

ప్రేమంటే…
కౌగిలింత కాదు
కలవరింత!

********

తప్పయినా ఒప్పయినా
తను చేసిందేదైనా
ఒప్పుకొనే లక్షణమే
సౌశీల్యమౌతుంది!

రంకైనా బొంకైనా
చౌర్యమైనా క్రౌర్యమైనా
కాలానుగుణంగా
వెలుగు చూస్తుంది-
కారణాన్ని బట్టి
తప్పో ఒప్పో ఒతుంది!

******

భూమిని నమ్ముకొని
కాయకష్టంతో దున్నుకొని
పంటల్ని పండించడం
రైతుసోదరుల వ్యవసాయం!
భూముల్ని కొనుకొని
గజాల లెఖ్ఖన అమ్ముకొని
కాసులు పండించడం
రియల్ ఎస్టేట్ వ్యవహారం !

*****

వెలుగుచూడని
నిక్షిప్త సంపద
భూమి పొరల్లో-
వెలుగులోనికి రాని
అజ్ఞాత కళాకారులు
ఎందరెందరో
తెరుచుకోని అవకాశాల
సొరుగుల్లో?!

*****

బంగారు తాంబూలం పెట్టె
అందులో తమలపాకులు
పరిస్థితిలో మార్పు-
వెండి తాంబూలం పెట్టె
అందులో తమలపాకులే
పరిస్థితి దిగజారింది-
ఇత్తడి తాంబూలం పెట్టె
అందులోనూ తమలపాకులే
స్థితిగతులు మారుతుంటాయి…
వ్యక్తిత్వం మాత్రం స్థిరం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *